Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: కోరహు కుమారుల అలామోతు రాగ గీతం.
46 దేవుడు మా ఆశ్రయం, మా శక్తి.
ఆయన యందు, మాకు కష్ట కాలంలో ఎల్లప్పుడూ సహాయం దొరుకుతుంది.
2 అందుచేత భూమి కంపించినప్పుడు,
మరియు పర్వతాలు సముద్రంలో పడినప్పుడు మేము భయపడము.
3 సముద్రాలు పొంగినను, చీకటితో నిండినను,
భూమి, మరియు పర్వతాలు కంపించినను మేము భయపడము.
4 ఒక నది ఉంది. దాని కాలువలు దేవుని నివాసానికి,
మహోన్నత దేవుని పరిశుద్ధ పట్టణానికి సంతోషం తెచ్చి పెడ్తాయి.
5 ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. కనుక అది ఎన్నటికీ నాశనం చేయబడదు.
సూర్యోదయానికి ముందే దేవుడు సహాయం చేస్తాడు.
6 రాజ్యాలు భయంతో వణకుతాయి.
యెహోవా గద్దించగా ఆ రాజ్యాలు కూలిపోతాయి. భూమి పగిలిపోతుంది.
7 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
8 యెహోవా చేసే మహత్తర కార్యాలు చూడండి.
ఆ కార్యాలు భూమి మీద యెహోవాను ప్రసిద్ధి చేస్తాయి.
9 భూమి మీద ఎక్కడైనా సరే యుద్ధాలను యెహోవా ఆపివేయగలడు.
సైనికుల విల్లులను, వారి ఈటెలను ఆయన విరుగగొట్టగలడు. రథాలను ఆయన అగ్నితో కాల్చివేయగలడు.
10 దేవుడు చెబుతున్నాడు, “మౌనంగా ఉండి, నేను దేవుణ్ణి అని తెలుసుకొనండి.
రాజ్యాలతో నేను స్తుతించబడతాను.
భూమిమీద మహిమపర్చబడతాను.”
11 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
జ్ఞానము, ఒక మంచి స్త్రీ
8 జ్ఞానం మిమ్మల్ని పిలుస్తుంది, వినండి!
మీరు వినాలని తెలివి మిమ్మల్ని పిలుస్తోంది.
2 మార్గం ప్రక్కగా, దారులు కలిసే చొట
కొండ శిఖరము మీద అవి నిలబడ్డాయి.
3 పట్టణంలోకి ద్వారాలు తెరచుకొనే చోట అవి వున్నాయి.
తెరువబడిన ద్వారాల్లోనుంచి అవి పిలుస్తున్నాయి.
4 జ్ఞానము చెబుతోంది: “పురుషులారా, మిమ్మల్ని
నేను పిలుస్తున్నా మనుష్యులందరినీ నేను పిలుస్తున్నా.
5 మీరు బుద్ధిహీనులైతే, జ్ఞానం గలిగి ఉండటం నేర్చుకోండి.
అవివేకులారా, తెలివిగలిగి ఉండటం నేర్చుకోండి.
6 వినండి! నేను ఉపదేశించే విషయాలు చాలా ముఖ్యమైనవి.
సరైన విషయాలు నేను మీకు చెబుతాను.
7 నా మాటలు సత్యం.
చెడు అబద్ధాలు నాకు అసహ్యం.
8 నేను చెప్పే విషయాలు సరైనవి.
నా మాటల్లో తప్పుగాని, అబద్ధంగాని ఏమీలేదు.
9 తెలివిగల వాడికి ఈ విషయాలన్నీ తేటగా ఉంటాయి.
తెలివిగల మనిషి ఈ సంగతులు గ్రహిస్తాడు.
10 నా క్రమశిక్షణ అంగీకరించండి. అది వెండికంటె విలువైనది.
ఆ తెలివి మంచి బంగారం కంటె ఎక్కువ విలువగలది.
11 జ్ఞానము ముత్యాలకంటె విలువగలది.
ఒకడు కోరుకోదగిన దేని కంటే కూడ జ్ఞానము ఎక్కువ విలువగలది.
జ్ఞానము విలువ
12 “నేను జ్ఞానాన్ని,
నేను మంచి తీర్పుతో జీవిస్తాను.
తెలివితో, మంచి పథకాలతో నేను ఉండటం మీరు చూడగలరు.
13 ఒక మనిషి యెహోవాను గౌరవిస్తే ఆ వ్యక్తి కీడును ద్వేషిస్తాడు.
నేను (జ్ఞానము) గర్విష్ఠులను, ఇతరులకంటె మేమే గొప్ప అనుకొనేవాళ్లను అసహ్యించుకొంటాను.
చెడు మార్గాలు, అబద్ధపు నోరు నాకు అసహ్యం.
14 కాని మంచి నిర్ణయాలు చేయటానికి, మంచితీర్పు చెప్పటానికి మనుష్యులకు నేను (జ్ఞానము) సామర్థ్యం ఇస్తాను.
తెలివిని, శక్తిని నేను వారికి ఇస్తాను!
15 రాజులు పరిపాలించుటకు నన్ను (జ్ఞానము) ఉపయోగిస్తారు.
న్యాయ చట్టాలు చేయటానికి అధికారులు నన్ను ఉపయోగిస్తారు.
16 భూమిమీద ప్రతి మంచి పాలకుడూ తన క్రింద ఉన్న
ప్రజలను పాలించుటకు నన్ను (జ్ఞానము) ఉపయోగిస్తాడు.
17 నన్ను ప్రేమించే మనుష్యులను నేను (జ్ఞానము) ప్రేమిస్తాను.
నన్ను కనుగొనేందుకు కష్టపడి ప్రయత్నిస్తే, నన్ను కనుగొంటారు.
18 నేను (జ్ఞానము) ఇచ్చేందుకు నా దగ్గర ఐశ్వర్యాలు, ఘనత ఉన్నాయి.
నిజమైన ఐశ్వర్యం, విజయం నేను ఇస్తాను.
19 నేను ఇచ్చేవి మేలిమి బంగారంకంటె మంచివి.
నా కానుకలు స్వచ్ఛమైన వెండికంటే మంచివి.
20 నేను (జ్ఞానము) మనుష్యులను సరైన మార్గంలో నడిపిస్తాను.
సరైన తీర్పు మార్గంలో నేను వారిని నడిపిస్తాను.
21 నన్ను ప్రేమించే మనుష్యులకు నేను ఐశ్వర్యం ఇస్తాను.
అవును, వారి గృహాలను ఐశ్వర్యాలతో నేను నింపుతాను.
యేసు పన్నెండు మంది అపోస్తలుల్ని ఎన్నుకొనటం
(మత్తయి 10:1-4; లూకా 6:12-16)
13 యేసు కొండపైకి వెళ్ళి తనకు కావలసిన వాళ్ళను పిలిపించాడు. వాళ్ళు ఆయన దగ్గరకు వెళ్ళారు. 14 ఆయన పన్నెండుగురిని తన అపొస్తలులుగా నియమించాడు. వాళ్ళు తనతో ఉండాలని, ప్రకటించటానికి వాళ్ళను ప్రపంచంలోకి పంపాలని ఆయన ఉద్దేశ్యం. 15 దయ్యాలను వదిలించే అధికారం వాళ్ళకిచ్చాడు. 16 ఆయన నియమించిన పన్నెండుగురు అపొస్తలుల పేర్లు యివి:
సీమోను, ఇతనికి పేతురు అనే పేరునిచ్చాడు.
17 జెబెదయి కుమారులైన యాకోబు అతని సోదరుడు యోహాను, వీళ్ళకు బోయనేర్గెసు అనే పేరునిచ్చాడు. బోయనేర్గెసు అంటే “ఉరుముకు పుత్రులు” అని అర్థం.
18 అంద్రెయ,
ఫిలిప్పు,
బర్తొలొమయి,
మత్తయి,
తోమా,
అల్ఫయి కుమారుడు యాకోబు,
తద్దయి,
జెలటు అని పిలవబడే సీమోను,
19 యేసుకు ద్రోహం చేసిన యూదా ఇస్కరియోతు.
© 1997 Bible League International