Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
37 దుర్మార్గుల పట్ల కోపగించకుము
చెడు పనులు చేసేవారి పట్ల అసూయచెందకు.
2 గడ్డి, పచ్చటి మొక్కలు త్వరలోనే వాడిపోయి చస్తాయి.
దుర్మార్గులు సరిగ్గా అలానే ఉంటారు.
3 నీవు యెహోవాయందు నమ్మకం ఉంచి, మంచి పనులు చేస్తే
నీవు బ్రతికి, దేశం ఇచ్చే అనేక వస్తువులను అనుభవిస్తావు.
4 యెహోవాను సేవించటంలో ఆనందించుము.
ఆయన నీకు కావల్సినవాటిని యిస్తాడు.
5 యెహోవా మీద ఆధారపడుము. ఆయనను నమ్ముకొనుము.
జరగాల్సినదాన్ని ఆయన జరిగిస్తాడు.
6 నీ మంచితనం, న్యాయం
మధ్యాహ్నపు సూర్యునిలా ప్రకాశింపనిమ్ము.
7 యెహోవాను నమ్ముకొనుము. ఆయన సహాయం కోసం కనిపెట్టుము.
చెడ్డవాళ్లు జయించినప్పుడు కలవరపడకుము.
చెడ్డవాళ్లు చెడు తలంపులు తలంచి, వారి తలంపులు జయించినప్పుడు కలవరపడకుము.
8 కోపగించవద్దు, ఆవేశపడవద్దు, నీవు కూడ కీడు చెయ్యాలి అనిపించేటంతగా తొందరపడిపోకుము.
9 ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడతారు.
కాని సహాయం కోసం యెహోవాను వేడుకొనే వారికి దేశం సొంతమవుతుంది.
సిరియాతో చిక్కు
7 ఆహాజు యోతాము కుమారుడు. యోతాము ఉజ్జియా కుమారుడు. సిరియా రాజు రెజీను రెమల్యా కుమారుడు, పెకహు ఇశ్రాయేలు రాజు. ఆహాజు యూదాకు రాజుగా ఉన్న కాలంలో, రెజీను, పెకహు యెరూషలేము మీద యుద్ధానికి వెళ్లారు. కాని వారు ఆ పట్టణాన్ని ఓడించలేక పోయారు.
2 దావీదు కుటుంబానికి ఒక సందేశం ఇవ్వబడింది. “అరాము (సిరియా) సైన్యం, ఎఫ్రాయిము (ఇశ్రాయేలు) సైన్యం ఒకటిగా కలిశాయి. రెండు సైన్యాలు కలిసి బసచేస్తున్నాయి” అనేది ఆ సందేశం. అహాజు రాజు ఈ సందేశం విన్నప్పుడు అతడు, ప్రజలు చాలా భయపడిపోయారు. అరణ్యంలో గాలికి కొట్టుకొనే చెట్లలా వారు భయంతో వణకి పోయారు.
3 అప్పుడు యెషయాతో యెహోవా చెప్పాడు, “నీవూ, నీ కుమారుడూ షెయార్యాషూబు వెళ్లి ఆహాజుతో మాట్లాడండి. పైకోనేటిలోకి నీళ్లు ప్రవహించే చోటికి వెళ్లండి. ఇది చాకలివాని పొలానికి పోయే దారిలో ఉంది.
4 “ఆహాజుతో చెప్పండి, జాగ్రత్తగా ఉండండి, గాని నెమ్మదిగా ఉండండి. భయపడవద్దు. వాళ్లిద్దరు మనుష్యులు, అంటే రెజీను, రెమల్యా కుమారుడు మిమ్మల్ని భయపెట్టనివ్వకండి. వాళ్లు కాలిపోయిన రెండు కట్టెల్లాంటి వాళ్లు. గతంలో వాళ్లు వేడిగా మండుతూండేవాళ్లు. కాని ఇప్పుడు వాళ్లు వట్టి పొగ మాత్రమే. రెజీను, సిరియా, రెమల్యా కుమారుడు కోపంగా ఉన్నారు. 5 వారు మీకు విరోధంగా పథకాలు వేశారు. 6 మనం వెళ్లి యూదా మీద యుద్ధం చేయాలి. యూదాను మనలో మనం పంచుకొందాం. టాబెయేలు కుమారుణ్ణి యూదాకు క్రొత్త రాజుగా చేద్దాము” అని వారన్నారు.
7 నా దేవుడైన యెహోవా చెబుతున్నాడు, “వారి పథకం పనిచేయదు. అది సంభవించదు. 8 రెజీను దమస్కుకు పాలకునిగా ఉన్నంతవరకు అది జరుగదు. ఎఫ్రాయిము (ఇశ్రాయేలు) ఇప్పుడు ఒక రాజ్యం. కానీ అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఎఫ్రాయిము (ఇశ్రాయేలు) రాజ్యంగా ఉండదు. 9 ఎఫ్రాయిముకు షోమ్రోను రాజధానిగా ఉన్నంత వరకు, రెమల్యా కుమారుడు దాని పాలకునిగా ఉన్నంతవరకు వారి పథకం నెరవేరదు. ఈ సందేశాన్ని నీవు నమ్మకపోతే ప్రజలు నిన్ను నమ్మగూడదు.”
ఇద్దరు గ్రుడ్డి వాళ్ళకు చూపురావటం
(మార్కు 10:46-52; లూకా 18:35-43)
29 యేసు, ఆయన శిష్యులు యెరికో పట్టణం నుండి బయలు దేరి వెళ్తూండగా చాలా మంది ప్రజలు ఆయన్ని అనుసరించారు. 30 దారి ప్రక్కన కూర్చొన్న ఇద్దరు గ్రుడ్డివాళ్ళు యేసు ఆ దారిన వస్తున్నాడని విని, “మమ్మల్ని కరుణించు దావీదు కుమారుడా!” అని బిగ్గరగా అన్నారు.
31 ప్రజలు వాళ్ళను నిశ్శబ్దంగా వుండమని గద్దించారు. కాని ఆ గ్రుడ్డివాళ్ళు యింకా బిగ్గరగా, “ప్రభూ! దావీదు కుమారుడా! మాపై దయ చూపు!” అని అన్నారు.
32 యేసు ఆగి ఆ గ్రుడ్డివాళ్ళను పిలిచి, “ఏం చెయ్యమంటారు?” అని అడిగాడు.
33 “ప్రభూ! మాకు చూపుకావాలి!” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
34 యేసుకు వాళ్ళపై దయ కలిగి వాళ్ళ కళ్ళను తాకాడు. వెంటనే వాళ్ళకు చూపు వచ్చింది. వాళ్ళు ఆయన్ని అనుసరించారు.
© 1997 Bible League International