Revised Common Lectionary (Complementary)
యాత్ర కీర్తన.
121 కొండల తట్టు నేను చూసాను.
కాని నిజానికి నా సహాయం ఎక్కడనుండి వస్తుంది?
2 భూమిని, ఆకాశాన్ని సృష్టించిన యెహోవా దగ్గరనుండి
నాకు సహాయం వస్తుంది.
3 దేవుడు నిన్ను పడిపోనివ్వడు.
నిన్ను కాపాడేవాడు నిద్రపోడు.
4 ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు.
దేవుడు ఎన్నడూ నిద్రపోడు.
5 యెహోవాయే నిన్ను కాపాడేవాడు.
యెహోవా తన మహా శక్తితో నిన్ను కాపాడుతాడు.
6 పగటి సూర్యుడు నీకు బాధ కలిగించడు.
రాత్రివేళ చంద్రుడు నీకు బాధ కలిగించడు.
7 ప్రతి అపాయం నుండి యెహోవా నిన్ను కాపాడుతాడు.
యెహోవా నీ ప్రాణాన్ని కాపాడుతాడు.
8 నీవు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు యెహోవా నీకు సహాయంగా ఉంటాడు.
ఇప్పుడు, ఎల్లప్పుడూ యెహోవా నీకు సహాయంగా ఉంటాడు.
పరిచయం
1 1-3 నేనొక యాజకుణ్ణి. నా పేరు యెహెజ్కేలు. బూజీ కుమారుణ్ణి. దేశభ్రష్టుడనై చెరలో ఉన్నాను.[a] బబులోనులో నేను కెబారు కాలువ ప్రక్కన ఉండగా ఆకాశం తెరువబడింది. అప్పుడు నాకు దైవసంబంధమైన దర్శనాలు కలిగాయి. అది ముఫ్పైయవ సంవత్సరంలో[b] నాల్గవ నెల (జూన్) ఐదవ రోజున జరిగింది. రాజైన యెహోయాకీను ప్రవాసంలో చెరపట్టబడ్డాక ఐదవ సంవత్సరం, ఆ నెలలో ఐదవ రోజున యెహోవా వాక్కు యెహెజ్కేలుకు వినవచ్చింది. ఆ స్థలంలో యెహోవా ప్రభావం అతని మీదికి వచ్చింది.
దేవుని వాహనం—యెహోవా సింహాసనం
4 ఉత్తరాన్నుండి గాలి దుమారం లేచి వస్తున్నట్లు నేను (యెహెజ్కేలు) చూశాను. అది ఒక పెను మేఘం. దాని నుండి అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంది. దానిచుట్టూ వెలుగు దేదీప్యమానంగా ఉంది. అగ్నిలో కణకణలాడే లోహంలా అది మెరుస్తూ ఉంది. 5 దాని లోపల నాలుగు జంతువులు[c] ఉన్నాయి. వాటి రూపం మానవ రూపంలా ఉంది. 6 కాని ప్రతీ జంతువుకు నాలుగు ముఖాలు, నాలుగు రెక్కలు ఉన్నాయి. 7 వాటి కాళ్లు నిట్ట నిలువుగా ఉన్నాయి. వాటి పాదాలు ఆవు పాదాల్లా ఉన్నాయి. అవి మెరుగుదిద్దిన ఇత్తడిలా మెరుస్తూ ఉన్నాయి. 8 వాటి రెక్కల క్రింద మనుష్యుల చేతులు వంటివి ఉన్నాయి. అక్కడ మొత్తం నాలుగు జంతువులున్నాయి. వాటిలో ప్రతి ఒక్క జంతువుకూ నాలుగు ముఖాలు, నాలుగు రెక్కలు ఉన్నాయి. 9 ఇప్పుడు వాటి ముఖాల గురించి వివరిస్తాను. వాటి రెక్కలు ఒకదానితో ఒకటి తాకుతున్నాయి. అవి కదిలినప్పుడు ఆ జంతువులు ప్రక్కకి తిరుగలేదు. అవి చూస్తూవున్న దిశలోనే అవి కదిలి వెళ్ళాయి.
10 ప్రతి జంతువుకు నాలుగు ముఖాలున్నాయి. ప్రతి ఒక్కటి ముందువైపు మనుష్య ముఖం కలిగిఉంది. కుడివైపు సింహపు ముఖం ఉంది. ఎడమ ప్రక్క ఎద్దు ముఖం ఉంది. వెనుకవైపు గ్రద్ద ముఖం ఉంది. 11 తమ రెక్కలతో ఆ జంతువులు తమ శరీరాలను కప్పుకున్నాయి. రెండు రెక్కలు విప్పుకొని ప్రక్కదాని రెక్కలను తాకుతున్నాయి. మరి, రెండు రెక్కలు శరీరాన్ని కప్పుకొవటానికి వినియోగించు కుంటున్నాయి. 12 ప్రతి జంతువు చూస్తూవున్న దిశలోనే అవి కదిలి వెళ్లాయి. గాలి[d] ఎటువీస్తే అవి అటు కదిలివెళ్లాయి. కానీ, అవి కదలినప్పుడు వాటి ముఖాలు ప్రక్కకి తిరగలేదు.
13 ఆ జంతువులు ఆ విధంగా కనిపించాయి. జంతువుల మధ్యలోవున్న లోపలి ప్రాంతంలో కాలుతున్న బొగ్గు నిప్పుల్లా కనబడిన ఏదో ఒకటి ఉంది. ఈ అగ్ని ఆ జంతువుల చుట్టూ కదలుతున్న చిన్న కాగడాల్లా ఉంది. ఆ అగ్ని ప్రకాశవంతగా వెలిగి దానినుండి మెరుపు మెరిసింది. 14 మెరుపు వంటి వేగంతో ఆ జీవులు వెనుకకు, ముందుకు కదులుతున్నాయి!
15-16 నేనా జంతువుల వైపు చూడగా నాలుగు చక్రాలు కన్పించాయి. ఆ చక్రాలన్నీ ఒకే విధంగా కనిపించాయి. ఒక్కొక్క ముఖానికి ఒక చక్రం చొప్పున ఉన్నాయి. ఆ చక్రాలు భూమిని తాకాయి. చక్రాలు స్వచ్ఛమైన పసుపువన్నె గోమేధికంతో చేయబడినట్లు కానవచ్చాయి. ఒక చక్రంలో మరో చక్రం ఉన్నట్లు కన్పించింది. 17 ఆ చక్రాలు ఏ దిశలోనైనా కదలగలవు. కాని అవి కదలినప్పుడు జంతువులు మాత్రం తిరుగలేదు.
18 ఆ చక్రాల అంచులు ఎత్తుగా, భయంకరంగా ఉన్నాయి. ఆ నాలుగు చక్రాల అన్ని అంచుల చుట్టూ కళ్లు ఉన్నాయి.
19 ఆ జంతువులతోపాటు చక్రాలు ఎప్పుడూ కదులుతూనే ఉండేవి. జంతువులు ఆకాశంలోకి లేచినప్పుడు వాటితోపాటు చక్రాలు కూడా లేచేవి. 20 గాలి (ఆత్మ) వాటిని ఎటు పోవాలని కోరితే అవి అటు వెళ్లాయి. అప్పుడు చక్రాలు కూడా వాటితో వెళ్లాయి. ఎందువల్లనంటే ఆ జంతువుల యొక్క గాలి శక్తి చక్రాలలోనే ఉంది. 21 అందువల్ల జీవులు కదిలితే చక్రాలు కూడా కదిలేవి. జీవులు ఆగితే చక్రాలు కూడా ఆగేవి. చక్రాలు గాలిలోకి వెళితే, జీవులు కూడా వాటితో పాటు వెళ్లాయి. ఎందువల్లనంటే గాలి (ఆత్మ శక్తి) చక్రాలలోనే ఉంది.
22 ఆ జీవులపై ఒక ఆశ్చర్యకరమైన వస్తువు కన్పించింది. అది ఒక పెద్ద పాత్ర బోర్లించినట్లుగా ఉంది. అది మంచులా స్వచ్చంగా ఉంది. అది జీవుల తలలచుట్టూ గాలిలో తేలియాడుతూ ఉంది. 23 ఈ పాత్రక్రింద ప్రతి జంతువుయొక్క రెక్కలు ప్రక్కనున్న జంతువును తాకేటట్లు ఉన్నాయి. రెండు రెక్కలు ఒక వైపున మరో రెండు రెక్కలు మరో వైపున శరీరాన్ని కప్పుతూ వ్యాపించాయి.
24 పిమ్మట నేను ఆ రెక్కల చప్పుడు విన్నాను. జంతువులు కదలినప్పుడల్లా, ఆ రెక్కలు గొప్ప శబ్దం చేసేవి. మహా నీటి ప్రవాహం ఘోషించినట్లు వాటి రెక్కల చప్పుడు వినిపించింది. సర్వశక్తిమంతుడైన దేవుని గంభీర శబ్దంలాగ ఆ శబ్దం వినిపించింది. ఒక సైన్యంగాని, ఒక ప్రజా సమూహంగాని చేసే రణగొణధ్వనుల్లా అవి వినవచ్చాయి. ఆ జంతువులు కదలటం మానినప్పుడు అవి వాటి రెక్కలను తమ ప్రక్కలకు దించివేసేవి.
25 జంతువులు కదలటం మానివేసి, రెక్కలను దించివేశాయి. పిమ్మట మరొక పెద్ద శబ్దం వచ్చింది. అది వాటి తలలపైవున్న ఆకాశమండలం లాంటి పాత్ర మీదుగా వచ్చింది.
19 ఆ తర్వాత కొంత ఆహారాన్ని పుచ్చుకొన్నాక అతనికి బలం వచ్చింది.
సౌలు డెమాస్కసులో బోధించుట
సౌలు డెమాస్కసులో ఉన్న విశ్వాసులతో కొద్ది రోజులు గడిపాడు. 20 ఆ తర్వాత, యూదుల సమాజ మందిరాల్లో, “యేసు దేవుని కుమారుడు” అని బోధించటం మొదలు పెట్టాడు.
21 అతని మాటలు విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడి, “యెరూషలేములో యేసును నమ్మిన వాళ్ళను చంపినవాడు ఇతడే కదా! ఇక్కడికి వచ్చింది యేసు శిష్యులను బంధించటానికే కదా! అలా బంధించి వాళ్ళను ప్రధాన యాజకుల దగ్గరకు తీసుకొని వెళ్ళాలనే కదా అతని ఉద్దేశ్యం!” అని అనుకొన్నారు.
22 కాని సౌలు ఇంకా ఎక్కువ ఆత్మబలంతో డెమాస్కసులో నివసించే యూదులకు, “యేసు ప్రభువే క్రీస్తు” అని రుజువు చేసి వాళ్ళను ఆశ్చర్యపరిచాడు.
సౌలు యూదులనుండి తప్పించుకొనుట
23 చాలా రోజులు గడిచిపోయాయి. యూదులు అతణ్ణి చంపాలని కుట్రపన్నారు. 24 కాని సౌలుకు వాళ్ళ కుట్ర తెలిసిపోయింది. యూదులు అతణ్ణి చంపాలని రాత్రింబగళ్ళు పట్టణ ద్వారాలను జాగ్రత్తగా కాపలా కాచారు. 25 కాని అతని శిష్యులు రాత్రివేళ అతణ్ణి ఒక బుట్టలో దాచి కోట గోడనుండి క్రిందికి దింపారు.
యెరూషలేములో సౌలు
26 సౌలు యెరూషలేముకు వచ్చాక శిష్యులతో కలిసిపోవటానికి ప్రయత్నించాడు. కాని వాళ్ళు అతడంటేనే భయపడిపోయారు. 27 కాని బర్నబా అతణ్ణి పిలుచుకొని అపొస్తలుల దగ్గరకు వచ్చి, వాళ్ళతో సౌలు ప్రయాణంలో ప్రభువును చూసిన విషయము, ప్రభువు అతనితో మాట్లాడిన విషయము, అతడు డెమాస్కసులో యేసు పేరును ధైర్యంగా ప్రకటించిన విషయము చెప్పాడు.
28 స్వేచ్ఛగా తిరుగుతూ ప్రభువు పేరును ధైర్యంగా ప్రకటిస్తూ సౌలు వాళ్ళతో కలిసి యెరూషలేములో ఉండిపోయాడు. 29 గ్రీకు మాట్లాడే యూదులతో మాట్లాడి వాదించాడు. వాళ్ళు అతణ్ణి చంపాలని నిశ్చయించారు. 30 సోదరులకు యిది తెలియగానే అతణ్ణి కైసరియకు తీసుకెళ్ళి అక్కడినుండి తార్సుకు పంపారు.
31 ఆ తర్వాత యూదయ, గలిలయ, సమరయలోని సంఘాలు కొద్ది రోజులు ప్రశాంతంగా గడిపాయి. ఆయా ప్రాంతాలలోని సంఘాలకు చెందిన సభ్యులు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ ప్రభువంటే భయభక్తులు కలిగి, పవిత్రాత్మ ద్వారా ప్రోత్సాహం పొందుతూ జీవించారు. సభ్యుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
© 1997 Bible League International