Revised Common Lectionary (Complementary)
9 యెహోవా, నాకు చాలా కష్టాలున్నాయి. కనుక నా మీద దయ ఉంచుము.
నేను ఎంతో తల్లడిల్లి పోయాను కనుక నా కళ్లు బాధగా ఉన్నాయి.
నా గొంతు, కడుపు నొప్పెడుతున్నాయి.
10 నా జీవితం దుఃఖంతో ముగిసిపోతూవుంది.
నిట్టూర్పులతో నా సంవత్సరాలు గతించిపోతున్నాయి.
నా కష్టాలు నా బలాన్ని తొలగించి వేస్తున్నాయి.
నా బలం తొలగిపోతూ ఉంది.[a]
11 నా శత్రువులు నన్ను ద్వేషిస్తారు.
నా పొరుగు వాళ్లంతా కూడా నన్ను ద్వేషిస్తారు.
నా బంధువులంతా వీధిలో నన్ను చూచి భయపడతారు.
వారు నానుండి దూరంగా ఉంటారు.
12 నేను పాడైపోయిన పనిముట్టులా ఉన్నాను.
నేను చనిపోయానేమో అన్నట్టు ప్రజలు నన్ను పూర్తిగా మరచిపోయారు.
13 ప్రజలు నన్ను గూర్చి చెప్పే దారుణ విషయాలు నేను వింటున్నాను.
ప్రజలు నాకు విరోధంగా తిరిగారు. వాళ్లు నన్ను చంపాలని తలుస్తున్నారు.
14 యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను.
నీవే నా దేవుడవు.
15 నా ప్రాణం నీ చేతుల్లో ఉంది.
నా శత్రువుల నుండి నన్ను రక్షించుము. నన్ను తరుముతున్న మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
16 దేవా, నీ సేవకునికి దయతో స్వాగతం పలుకుము.
నన్ను రక్షించుము.
ప్రత్యేక పండుగలు
23 మోషేతో యెహోవా చెప్పాడు: 2 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: యెహోవా ఏర్పాటు చేసిన పండుగలను పవిత్ర సమావేశాలుగా మీరు ప్రకటించాలి. నా ప్రత్యేక దినాలు ఏవంటే:
సబ్బాతు
3 “ఆరు రోజులు పని చేయండి. అయితే ఏడో రోజు సబ్బాతు, అది పవిత్ర సమావేశం జరిగే రోజు. మీరేమీ పని చేయకూడదు. మీ అందరి గృహాల్లోను ఆది యెహోవా నియమించిన సబ్బాతు.
పస్కా
4 “ఇవి యెహోవా ఏర్పాటు చేసిన పండుగ రోజులు. నిర్ణీత సమాయాల్లో పవిత్ర సమావేశాల్ని గూర్చి మీరు ప్రకటించాలి. 5 మొదటి నెల 14వ రోజు సాయంకాలం యెహోవా పస్కాపండుగ.
పులియని రొట్టెల పండుగ
6 “అదే నెల 15వ రోజు పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెలను ఏడు రోజులు మీరు తినాలి. 7 ఈ సెలవుల్లో మొదటి రోజున మీకు ఒక పవిత్ర సమావేశం ఉంటుంది. ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. 8 ఏడు రోజులవరకు మీరు యెహోవాకు బలి అర్పించాలి. ఏడవ రోజున ఒక పవిత్ర సమావేశం జరుగుతుంది. ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు.”
యూదా నాయకులు యేసును చంపుటకు కుట్ర పన్నటం
(మత్తయి 26:1-5, 14-16; మార్కు 14:1-2, 10-11; యోహాను 11:45-53)
22 పులవకుండా రొట్టెలు చేసే పండుగ దగ్గరకు వచ్చింది. దాన్ని “పస్కా” అనే వాళ్ళు. 2 ప్రజల్లో ఉన్న విశ్వాసం చూసి ప్రధాన యాజకులు, శాస్త్రులు భయపడి పోయారు. వాళ్ళు ఏదో ఒక విధంగా యేసును చంపాలని ప్రయత్నం చేయసాగారు.
యేసుకు ద్రోహం చెయ్యటానికి యూదా అంగీకరించటం
(మత్తయి 26:14-16; మార్కు 14:10-11)
3 పన్నెండు మందిలో ఒకడైన ఇస్కరియోతు అనబడే యూదాలో సాతాను ప్రవేశించాడు. 4 యూదా ప్రధాన యాజకులను, ముఖ్య ద్వార పాలకుల్ని కలుసుకొని తాను ఏవిధంగా యేసును వాళ్ళకప్పగించగలడో చర్చించాడు. 5 యూదా చెప్పింది విని ప్రధాన యాజకులు ఆనందించారు. యేసును అప్పగిస్తే అతనికి కొంత డబ్బు యిస్తామని వాళ్ళు చెప్పారు. 6 అతడు దానికి అంగీకరించి ప్రజలు లేనప్పుడు యేసును వాళ్ళకప్పగించాలనుకొని మంచి సమయం కోసం ఎదురు చూడసాగాడు.
పస్కా భోజనం
(మత్తయి 26:17-25; మార్కు 14:12-21; యోహాను 13:21-30)
7 పులవకుండా రొట్టెలు చేసే పండుగ వచ్చింది. ఆ రోజు పస్కా గొఱ్ఱె పిల్లను బలి ఇచ్చేవాళ్ళు. 8 యేసు పేతురు, యోహానులతో, “వెళ్ళి పస్కా పండుగ భోజనం సిద్ధం చెయ్యండి” అని చెప్పాడు.
9 వాళ్ళు, “ఎక్కడ సిద్ధం చెయ్యమంటారు?” అని అడిగారు.
10 ఆయన, “మీరు పట్టణంలోకి ప్రవేశిస్తుంటే నీళ్ళ కడవ ఎత్తుకొని వెళ్తున్న వాడొకడు కనిపిస్తాడు. అతణ్ణి అనుసరించి అతడు ఏ యింట్లోకి వెళ్తాడో ఆ యింట్లోకి వెళ్ళండి. 11 ఆ యింటి యజమానితో, ‘మా బోధకుడు తన శిష్యులతో కలిసి పస్కా భోజనం చెయ్యాలి. కనుక అతిథులుండే గది ఎక్కడుందో మాకు చూపండి’ అని అతనితో అనండి. 12 అతడు మీకు మేడ మీద ఉన్న ఒక విశాలమైన గది చూపిస్తాడు. ఆ గదిలో అన్ని సౌకర్యాలు ఉంటాయి. పస్కా భోజనం అక్కడ తయారు చెయ్యండి” అని అన్నాడు.
13 వాళ్ళు వెళ్ళి, అన్నీ యేసు చెప్పిన విధంగా ఉండటం గమనించారు. అక్కడ వాళ్ళు పస్కా పండుగ భోజనం తయారు చేసారు.
© 1997 Bible League International