Revised Common Lectionary (Complementary)
దావీదు దైవధ్యాన కీర్తన.
32 పాపాలు క్షమించబడినవాడు ధన్యుడు.
తన పాపాలు తుడిచి వేయబడినవాడు ధన్యుడు.
2 అపరాధి అని యెహోవా చేత ప్రకటించబడనివాడు ధన్యుడు.
తన పాపాలను దాచిపెట్టేందుకు ప్రయత్నించనివాడు ధన్యుడు.
3 దేవా, నేను నీతో మరల మరల మాట్లాడాను.
కాని నా రహస్య పాపాలను గూర్చి నేను చెప్పలేదు.
నేను ప్రార్థించిన ప్రతిసారీ నేను బలహీనుడను మాత్రమే అయ్యాను.
4 దేవా, నీవు రాత్రింబవళ్లు నా జీవితాన్ని నాకు మరింత కష్టతరమైనదిగా చేశావు.
తీవ్రమైన వేసవిలో బాగా ఎండిపోయిన భూమిలా నేను తయారయ్యాను.
5 అయితే అప్పుడు నేను నా పాపాలన్నిటినీ యెహోవా దగ్గర ఒప్పుకోవాలని నిర్ణయించుకొన్నాను.
కనుక యెహోవా, నా పాపాలను గూర్చి నేను నీతో చెప్పుకొన్నాను.
నా దోషాన్ని ఏదీ నేను దాచిపెట్టలేదు.
మరియు నీవు నా పాపాలను క్షమించావు.
6 దేవా, ఈ కారణంచేత నీ అనుచరులు అందరూ నీకు ప్రార్థించాలి.
కష్టాలు మహా ప్రవాహంలా వచ్చినాసరే, నీ అనుచరులు నిన్ను ప్రార్థించాలి.
7 దేవా, నేను దాగుకొనేందుకు నీవే ఆశ్రయం.
నా కష్టాల నుండి నీవే నన్ను విడిపించుము.
నీవు నన్ను ఆవరించి, కాపాడుము.
నీవు నన్నురక్షించిన విధమును గూర్చి నేను పాటలు పాడతాను.
8 యెహోవా చెబతున్నాడు, “నీవు పోవాల్సిన మార్గం గూర్చి
నేను నీకు నేర్చించి, నడిపిస్తాను.
నేను నిన్ను కాపాడుతాను, నీకు మార్గదర్శిగా ఉంటాను.
9 కనుక గుర్రంలా, గాడిదలా తెలివి తక్కువగా ఉండకుము.
ఆ జంతువులు కళ్లెంతోను, వారుతోను నడిపించబడతాయి.
నీవు కళ్లెంను, వారును ఉపయోగిస్తే గాని ఆ జంతువులు నీ దగ్గరకు రావు.”
10 చెడ్డవాళ్లకు ఎన్నో బాధలు కలుగుతాయి.
కాని యెహోవాను నమ్ముకొనేవారిని ప్రేమ ఆవరిస్తుంది.
11 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి, బాగుగా సంతోషించండి.
పవిత్ర హృదయాలుగల మనుష్యులారా మీరంతా ఆనందించండి.
ప్రజలకు జ్ఞాపకాన్నిచ్చే రాళ్లు
4 ప్రజలంతా యొర్దాను నది దాటడం అయిపోయిన తర్వాత యెహోషువతో యెహోవా చెప్పాడు: 2 “ప్రజల్లోనుండి 12 మందిని ఏర్పాటుచేయి. ఒక్కొక్క వంశంనుండి ఒక్కొక్క మనిషిని ఏర్పాటు చేయి. 3 నదిలో యాజకులు నిలిచిన చోటు చూడమని వారితో చెప్పు. అక్కడ పన్నెండు రాళ్లను వెదికి వాటిని మీతోబాటు తీసుకొని వెళ్లాలి. ఈ రాత్రి మీరు నివాసంచేసే స్థలంలో ఆ రాళ్లను ఉంచండి.”
4 కనుక యెహోషువ ఒక్కొక్క వంశంనుండి ఒక్కొక్క మనిషిని ఏర్పాటు చేసాడు. తర్వాత ఆ పన్నెండుమందినీ అతడు సమావేశపర్చాడు. 5 యెహోషువ వాళ్లతో ఇలా చెప్పాడు: “మీ యెహోవా దేవుని పవిత్ర పెట్టె నీళ్లలో ఉన్న చోటుకు వెళ్లండి. ఇశ్రాయేలీయుల పన్నెండు వంశాల్లో ఒక్కోదానికి ఒక్కొక్కరాయి అక్కడ ఉంటాయి. ఆ రాతిని మీ భుజంమీద మోయండి. 6 ఈ రాళ్లు మీ మధ్య గుర్తుగా ఉంటాయి. భవిష్యత్తులో మీ పిల్లలు ‘ఈ రాళ్ల భావం ఏమిటి?’ అని మిమ్మల్ని అడుగుతారు. 7 యొర్దాను నదిలో నీరు ప్రవహించకుండా యెహోవా చేసాడు అని మీ పిల్లలతో చెప్పండి. యెహోవా ఒడంబడిక పెట్టె నీళ్లలో దిగగానే నీరు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఆ రాళ్లు ఇశ్రాయేలు ప్రజలకు తోడ్పడుతాయి.”
8 కనుక ఇశ్రాయేలు ప్రజలు యెహోషువకు విధేయులయ్యారు. యొర్దాను నది మధ్యలోనుండి పన్నెండు రాళ్లు వాళ్లు మోసుకొని వెళ్లారు. ఇశ్రాయేలీయుల పన్నెండు వంశాల్లో ఒక్కోదానికి ఒక్కోరాయిఉంది. యెహోషువకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారమే వారు ఇలా చేసారు. ఆ మనుష్యులు ఆ రాళ్లు మోసుకొనిపోయి వారు నివాసము చేసిన చోట వాటిని ఉంచారు. 9 (యెహోవా యొక్క పవిత్ర పెట్టెను మోస్తున్నప్పుడు యొర్దాను నది మధ్యలో యాజకులు నిలిచిన చోటకూడ యెహోషువ పన్నెండు రాళ్లు ఉంచాడు. నేటికీ ఆ రాళ్లు అక్కడ ఉన్నాయి.)
10 ప్రజలు చేయాల్సింది ఏమిటో చెప్పమని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించాడు. యెహోషువ చేయాలని మోషే చెప్పిన సంగతులే అవి. కనుక ఆ విషయాలన్నీ జరిగించేంతవరకు పవిత్ర పెట్టెను మోస్తున్న యాజకులు నది మధ్యలోనే నిలబడి ఉన్నారు. ప్రజలు త్వరపడి నది దాటారు. 11 ప్రజలు నదిని దాటిపోవడం అయిపోగానే యాజకులు యెహోవా పెట్టెను ప్రజల ఎదుటికి మోసుకొని వెళ్లారు.
12 రూబేను, గాదు వంశాలు, మనష్షే వంశంలోని సగంమంది మగవాళ్లు మోషే వారికి చెప్పిన వాటికి విధేయులయ్యారు. మిగతా మనుష్యుల ముందు వీరు నదిని దాటారు. వీళ్లు యుద్ధానికి సిద్ధపడ్డారు. దేవుడు వారికి వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు, మిగిలిన ప్రజలకు సహాయం చేయటానికి వీరు వెళ్తున్నారు. 13 యుద్ధానికి సిద్ధపడిన వారు సుమారు నలభై వేలమంది సైనికులు యెహోవా ఎదుట సాగిపోయారు. యెరికో మైదానాల దిశగా వారు సాగిపోయారు.
విశ్వాసంద్వారా జీవించటం
16 కనుక మేము అధైర్యపడము. భౌతికంగా మేము క్షీణించిపోతున్నా, మా ఆంతర్యం ప్రతి రోజూ శక్తి పొందుతూ ఉంది. 17 క్షణికమైన మా మామూలు కష్టాలు మా కోసం శాశ్వతమైన మహిమను కలిగిస్తున్నవి. మనము పొందుతున్న మహిమతో, అనుభవింపనున్న కష్టాలను పోలిస్తే ఈ కష్టాలు లెక్కింపతగినవి కావు. 18 అందువల్ల కనిపించే వాటిపై మా దృష్టి ఉంచక కనిపించని వాటిపై మా దృష్టి కేంద్రీకరిస్తున్నాము. కనిపించేది క్షణికము. కనిపించనిది అనంతము.
5 భూలోక నివాసులమైన మనము నివసిస్తున్న ఈ గుడారం, అంటే మన శరీరం నశిస్తే, పరలోకంలో మనము నివసించటానికి ఒక భవనం ఉంది. దాన్ని మానవుడు నిర్మించలేదు. శాశ్వతమైన ఆ భవనాన్ని దేవుడే నిర్మించాడు. 2 పరలోకపు గుడారాన్ని ధరించాలని ఆశిస్తూ మనము ఇంకా మూల్గుతూ ఉన్నాము. 3 మనము ఆ శరీరాన్ని ధరించాక మనకు నగ్నత ఉండదు. 4 ఈ గుడారంలో నివసిస్తున్నంతకాలం మనం పెద్దభారంతో మూల్గుతూ ఉంటాము. ఈ భౌతిక శరీరాన్ని ధరించిన మనము ఈ జీవితం యొక్క అంతంలో పరలోకపు శరీరాన్ని ధరించుకొంటాము. 5 ఆ శరీరాన్ని ధరించటానికి దేవుడు మనల్ని సిద్ధం చేసాడు. దానికి హామీగా తన ఆత్మను మనకు ఇచ్చాడు.
© 1997 Bible League International