Revised Common Lectionary (Complementary)
ప్రథమ పంట
26 “మీరు నివసించేందుకు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు త్వరలో ప్రవేశిస్తారు. మీరు అక్కడ మీ నివాసం ఏర్పరచుకొన్నప్పుడు 2 మీరు ప్రథమ ఫలాలు కొన్ని తీసుకొని ఒక బుట్టలో పెట్టాలి. యెహోవా మీకు ఇస్తున్న దేశంలో అది మీకు లభించిన ప్రథమ పంట అవుతుంది. ఈ ప్రథమ పంట కొంత ఉన్న ఆ బుట్టను తీసుకొని, మీ దేవుడైన యెహోవా నిర్ణయించే స్థలానికి వెళ్లండి. అది యెహోవా తనకోసం ప్రత్యేక ఆలయంగా ఉండేందుకు ఏర్పాటు చేసుకొనే స్థలం. 3 అప్పటికి అక్కడ పరిచర్య చేస్తుండే యాజకుని దగ్గరకు మీరు వెళ్లాలి. ‘యెహోవా మనకు ఇస్తానని మన పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలోనికి నేను వచ్చేసానని నా దేవుడైన యెహోవాకు నేడు నేను ప్రకటిస్తాను’ అని నీవు ఆతనితో చెప్పాలి.
4 “అప్పుడు నీ చేతిలోని బుట్టను యాజకుడు తీసుకొంటాడు. నీ దేవుడైన యెహోవా బలిపీఠం ఎదుట అతడు దానిని క్రింద ఉంచుతాడు. 5 అప్పుడు అక్కడ నీ దేవుడైన యెహోవా ఎదుట నీవు ఇలా చెప్పాలి: ‘నా పూర్వీకుడు ఒక సంచార అరామీయుడు. అతడు ఈజిప్టులోనికి వెళ్లి, అక్కడ నివసించాడు. అతడు అక్కడికి వెళ్లినప్పుడు అతని కుటుంబంలో కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అయితే అక్కడ ఈజిప్టులో అతడు అనేకమంది ప్రజలుగా, శక్తివంతమైన ఒక గొప్ప జనంగా తయారయ్యాడు. 6 ఈజిప్టువాళ్లు మమ్మల్ని నీచంగా చూశారు. వాళ్లు మమ్మల్ని కష్టపెట్టి, బానిస పని బలవంతంగా మాతో చేయించారు. 7 అప్పుడు మేము మా పూర్వీకుల దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టి, వారిని గూర్చి ఆరోపణ చేసాము. యెహోవా మా మొర్ర విన్నాడు. మా కష్టం, మా కఠినమైన పని, మా శ్రమ ఆయన చూశాడు. 8 అప్పుడు యెహోవా తన మహా శక్తి, ప్రభావాలతో ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాడు. గొప్ప అద్భుతాలు, మహాత్యాలు ఆయన చేశాడు. భయంకరమైన సంగతులు జరిగేటట్టు ఆయన చేసాడు. 9 కనుక ఆయనే మమ్మల్ని ఈ దేశానికి తీసుకొనివచ్చాడు. పాలు, తేనెలు ప్రవహించుచున్న ఈ మంచి దేశాన్ని ఆయన మాకు యిచ్చాడు. 10 ఇప్పుడు యెహోవా, నీవు మాకు యిచ్చిన దేశంలోని ప్రథమ పంటను నీకు తెచ్చాను.’
“తర్వాత నీ పంటను నీ దేవుడైన యెహోవా ఎదుట క్రింద పెట్టాలి. మరియు మీరు ఆయనను ఆరాధించాలి. 11 అప్పుడు మీ దేవుడైన యెహోవా మీకూ, మీ కుటుంబానికీ ఇచ్చిన మంచి పదార్థాలన్నింటినీ మీరు తిని ఆనందించవచ్చును. మీ మధ్య నివసించే లేవీయులు, విదేశీయులతో మీరు వాటిని పంచుకోవాలి.
91 మహోన్నతుడైన దేవుని ఆశ్రయంలో నివసించే వాడు
సర్వశక్తిమంతుడైన దేవుని నీడలో విశ్రాంతి తీసుకొంటాడు.
2 “నీవే నా క్షేమ స్థానం, నా కోట. నా దేవా, నేను నిన్నే నమ్ముకొన్నాను.”
అని నేను యెహోవాకు చెబుతాను.
9 ఎందుకంటే నీవు యెహోవాను నమ్ముకొన్నావు గనుక.
సర్వోన్నతుడైన దేవుణ్ణి నీ క్షేమ స్థానంగా చేసుకొన్నావు గనుక.
10 కీడు ఏమీ నీకు జరగదు.
నీ ఇంట ఎలాంటి వ్యాధి ఉండదు.
11 ఎందుకంటే నిన్ను కనిపెట్టుకొని ఉండుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీవు ఎక్కడికి వెళ్లినా వారు నిన్ను కాపాడుతారు.
12 నీ పాదం రాయికి తగులకుండా
దేవదూతలు వారి చేతులతో నిన్ను పైకి ఎత్తుతారు.
13 సింహాల మీద, విషసర్పాల మీద
నడిచే శక్తి నీకు ఉంటుంది.
14 యెహోవా చెబుతున్నాడు: “ఒక వ్యక్తి నన్ను నమ్ముకొంటే, నేను అతన్ని రక్షిస్తాను.
నా పేరు అతనికి తెలుసు కనుక నేను కాపాడుతాను.
15 నా అనుచరులు సహాయంకోసం నాకు మొరపెడ్తారు.
నేను వారికి జవాబు ఇస్తాను.
వారికి కష్టం కలిగినప్పుడు నేను వారితో ఉంటాను. నేను వారిని తప్పించి, ఘనపరుస్తాను.
16 నా అనుచరులకు నేను దీర్ఘాయుష్షు యిస్తాను.
నేను వాళ్లను రక్షిస్తాను.”
8 మరి వాక్యమేమంటున్నది! “దైవసందేశం మీకు దగ్గరగా ఉంది. అది మీ నోటిలో ఉంది, మీ హృదయాల్లో ఉంది.”(A) ఇది విశ్వాసానికి సంబంధించిన సందేశము. దీన్ని మేము ప్రకటిస్తున్నాము. 9 యేసు, ప్రభువని మీ నోటితో బహిరంగంగా ఒప్పుకొని చనిపోయినవారిలో నుండి దేవుడాయన్ని బ్రతికించాడని మీ హృదయాల్లో విశ్వసిస్తే మీరు రక్షింపబడుతారు. 10 ఎందుకంటే మనము, మన హృదయాలతో విశ్వసిస్తాము కనుక నీతిమంతులుగా పరిగణింపబడుతాము. నోటితో ఒప్పుకొంటాము కనుక రక్షణను పొందుతాము.
11 లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు: “ఆయన్ని నమ్మినవానికి ఆశాభంగం కలుగదు.”(B) 12 యూదులకు, యూదులు కానివాళ్ళకు వ్యత్యాసం లేదు. ప్రభువు ఒక్కడే. ఆయనే అందరికి ప్రభువు. ఆయన, తనను ప్రార్థించిన వాళ్ళందరికీ అడిగినంత ఇస్తాడు. 13 దీన్ని గురించి, “ప్రభువును ప్రార్థించిన ప్రతి ఒక్కడూ రక్షింపబడతాడు”(C) అని వ్రాయబడి ఉంది.
సైతాను యేసును శోధించటం
(మత్తయి 4:1-11; మార్కు 1:12-13)
4 యేసు యొర్దాను నది ప్రాంతం నుండి తిరిగి వచ్చాడు. ఆయన పవిత్రాత్మపూర్ణుడై యుండి ఎడారి ప్రాంతానికి ఆత్మ చేత నడిపించబడ్డాడు. 2 అక్కడ సైతాను ఆయన్ని నలభై దినాలు శోధించాడు. ఆ నలభై రోజులు యేసు ఉపవాసం చేశాడు. ఆ తర్వాత ఆయనకు ఆకలి వేసింది.
3 సైతాను ఆయనతో, “నీవు దేవుని కుమారుడవైతే ఈ రాయిని రొట్టెగా మారుమని ఆజ్ఞాపించు!” అని అన్నాడు.
4 యేసు,
“‘మనిషి జీవించటానికి ఆహారం మాత్రమే చాలదు’ అని వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు.(A)
5 ఆ సైతాను ఆయన్ని ఎత్తైన స్థలానికి తీసుకు వెళ్ళాడు. ఒక్క క్షణంలో ప్రపంచంలోని రాజ్యాలన్ని ఆయనకు చూపించాడు. 6 ఆయనతో, “వీటిపై అధికారము, వాటివల్ల లభించే గౌరవము నీకిస్తాను. అవి నావి. నా కిష్టం వచ్చిన వానికివ్వగలను. 7 నా కాళ్ళ మీద పడితే వీటిని నీకిస్తాను.” అని అన్నాడు.
8 యేసు,
“‘నీ ప్రభువైన దేవుని ముందు మాత్రమే మోకరిల్లి,
ఆయన సేవ మాత్రమే చెయ్యి’(B)
అని వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు.
9 సైతాను ఆయన్ని యెరూషలేములో ఉన్న ఆలయానికి తీసుకెళ్ళి ఎత్తైన స్థలంలో నిలుచోబెట్టి “నీవు దేవుని కుమారుడవైతే యిక్కడి నుండి క్రిందికి దూకు.
10 ‘దేవుడు తన దూతలతో నిన్ను కాపాడుమని ఆజ్ఞాపిస్తాడు.’(C)
11 అంతేకాక:
‘ఆ దూతులు నీ కాళ్ళు రాతికి తగలకుండా
నిన్నుతమ చేతుల్తో ఎత్తి పట్టుకుంటారు’(D)
అని వ్రాయబడింది” అని అన్నాడు.
12 యేసు,
“‘నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించరాదు.’(E)
అని కూడా వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు. 13 ఆ సైతాను యేసును పరీక్షించటం మానేసి అప్పటికి ఆయన్ని వదిలి పొయ్యాడు.
© 1997 Bible League International