Revised Common Lectionary (Complementary)
ఎజ్రా ధర్మశాస్త్రాన్ని చదవటం
8 ఆ విధంగా, ఇశ్రాయేలీయులందరూ ఆ ఏడాది ఏడవ నెలలో సమావేశమయ్యారు. వాళ్లందరూ నీటి గుమ్మం ముందరి మైదానంలో ఏక మనస్కులై ఒకే మనిషి అన్నట్లు గుమికూడారు. వాళ్లు ఎజ్రా ఉపదేశకుణ్ణి మోషే ధర్మశాస్త్రాన్ని పైకి తీసి పఠించ వలసిందిగా కోరారు. ఇశ్రాయేలీయులకు యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రమది. 2 యాజకుడైన ఎజ్రా సమావేశమైన జనం ముందుకి ధర్మశాస్త్రాన్ని తెచ్చాడు. అది నెల మొదటి రోజు. అది ఏడాదిలో ఏడవ నెల. ఆ సమావేశంలో స్త్రీలు, పురుషులు విని, అర్థం చేసుకోగల వయస్కులు వున్నారు. 3 ఎజ్రా ఉదయాన్నుంచి మిట్ట మధ్యాహ్నంవరకు ధర్మశాస్త్రాన్ని చదివాడు. నీటి గుమ్మం ఎదుటవున్న మైదానానికి ఎదురుగా నిలబడి, ఎజ్రా స్త్రీలనీ, పురుషుల్నీ విని అర్థం చేసుకోగల వాళ్లందర్నీ ఉద్దేశించి చదివాడు. జనం అందరూ ధర్మశాస్త్ర గ్రంథం పట్ల భక్తి శ్రద్ధలతో విన్నారు.
5 అప్పుడు ఎజ్రా గ్రంథం విప్పాడు. ఎజ్రా ఎతైన వేదిక మీద నిలబడి ఉన్నందున జనులందరూ అతన్ని చూడగలుగుతున్నారు. ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెరవగానే, జనం అందరూ గౌరవంగా లేచి నిలబడ్డారు. 6 ఎజ్రా మహా దేవుడైన యెహోవాను స్తుతించాడు. జనులందరూ తమ చేతులు పైకెత్తి బిగ్గరగా, “ఆమేన్! ఆమేన్!” అన్నారు. తర్వాత జనులందరూ నేలమీదవంగి నమస్కరించి యెహోవాను ఆరాధించారు.
8 ఆ లేవీయులు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివారు. వాళ్లు జనానికి అర్థం వివరించి దాన్ని సులభం చేశారు. చదివినదాన్ని జనం తేలిగ్గా అర్థం చేసుకోగలిగేందుకు గాను వాళ్లు తాత్పర్యాలను వివరించి చెప్పారు.
9 తర్వాత పాలనాధికారి నెహెమ్యా, యాజకుడును, ఉపదేశకుడునైన ఎజ్రా, జనానికి బోధిస్తున్న లేవీయులు మాట్లాడారు. వాళ్లు, “ఈ రోజు మీ దేవుడైన యెహోవాకి ప్రత్యేక దినం[a] మీరు విచారంగా వుండకండి, ఏడ్వకండి!” అని చెప్పారు. ధర్మశాస్త్రంలోని సందేశాలను వింటూ జనం అందరూ రోదించనారంభించిన మూలంగా వాళ్లీ మాటలు చెప్పారు.
10 నెహెమ్యా ఇలా చెప్పాడు: “పోయి కొవ్విన మాంసంతో భోజనం చేయండి, మధుర ద్రాక్షారసం సేవించండి. ఏ ఆహారమూ తయారు చేసుకోని వాళ్లకికొంత ఆహారమూ పానీయాలూ ఇవ్వండి. ఈ రోజు యెహోవాకి ప్రత్యేకమైన రోజు. విచారాన్ని విడనాడండి! ఎందుకంటే, యెహోవా ఆనందం మీకు పుష్టిని చేకూరుస్తుంది.”
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
19 ఆకాశాలు దేవుని మహిమను తెలియజేస్తున్నాయి.
యెహోవా చేతులు చేసిన మంచివాటిని అంతరిక్షం తెలియజేస్తుంది.
2 ప్రతి క్రొత్త రోజూ ఆ గాథను మరింత చెబుతుంది.
ప్రతి రాత్రి దేవుని గురించి మరింత ఎక్కువగా తెలియజేస్తుంది.
3 నిజానికి నీవు ఏ ఉపన్యాసం గాని మాటలుగాని వినలేవు.
మనం వినగలిగిన శబ్దం ఏదీ అవి చేయవు.
4 అయినా వాటి “స్వరం” ప్రపంచం అంతా ప్రసరిస్తుంది.
వాటి “మాటలు” భూమి చివరి వరకూ వెళ్తాయి.
అంతరిక్షం సూర్యునికి ఒక ఇల్లు లాంటిది.
5 తన పడక గది నుండి వచ్చే సంతోష భరితుడైన పెండ్లి కుమారునిలా సూర్యుడు బయటకు వస్తాడు.
పందెంలో పరుగెత్తడానికి ఆత్రంగా ఉన్న ఆటగానిలా సూర్యుడు
ఆకాశంలో తన దారిని మొదలు పెడతాడు.
6 సూర్యుడు అంతరిక్షంలోని ఒక దిశలో మొదలు పెడ్తాడు,
మరియు ఆవలి దిశకు అది పరుగెడుతుంది.
దాని వేడి నుండి ఏదీ దాక్కొలేదు. యెహోవా ఉపదేశాలు అలా ఉన్నాయి.
7 యెహోవా ఉపదేశాలు పరిపూర్ణం.
అవి దేవుని ప్రజలకు బలాన్నిస్తాయి.
యెహోవా ఒడంబడిక విశ్వసించదగింది.
జ్ఞానం లేని మనుష్యులకు అది జ్ఞానాన్ని ఇస్తుంది.
8 యెహోవా చట్టాలు సరియైనవి.
అవి మనుష్యులను సంతోషపెడ్తాయి.
యెహోవా ఆదేశాలు పరిశుద్ధమైనవి.
ప్రజలు జీవించుటకు సరైన మార్గాన్ని చూపడానికి అవి కన్నులకు వెలుగునిస్తాయి.
9 యెహోవాను ఆరాధించుట మంచిది.
అది నిరంతరము నిలుస్తుంది.
యెహోవా తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి.
అవి సంపూర్ణంగా సరియైనవి.
10 శ్రేష్ఠమైన బంగారంకంటె యెహోవా ఉపదేశాలను మనము ఎక్కువగా కోరుకోవాలి.
సాధారణ తేనె పట్టు నుండి వచ్చే శ్రేష్ఠమైన తేనె కంటె అవి మధురంగా ఉంటాయి.
11 యెహోవా ఉపదేశాలు నీ సేవకుణ్ణి చాలా తెలివిగలవాణ్ణిగా చేస్తాయి.
నీ చట్టాలు పాటించేవారు గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు.
12 యెహోవా, ఏ వ్యక్తీ, తన స్వంత తప్పులన్నింటినీ చూడలేడు.
కనుక నేను రహస్య పాపాలు చేయకుండా చూడుము.
13 యెహోవా, నేను చేయాలనుకొనే పాపాలు చేయకుండా నన్ను ఆపుచేయుము.
ఆ పాపాలు నా మీద అధికారం చెలాయించ నీయకుము.
నీవు నాకు సహాయం చేస్తే, అప్పుడు నేను గొప్ప పాపము నుండి, పవిత్రంగా దూరంగా ఉండగలను.
14 నా మాటలు, తలంపులు నిన్ను సంతోషపెడ్తాయని నేను ఆశిస్తున్నాను.
యెహోవా, నీవే నా ఆశ్రయ దుర్గం. నీవే నన్ను రక్షించేవాడవు.
ఒకే శరీరం, అనేక అవయవాలు
12 శరీరంలో అనేక భాగాలు ఉన్నా అవి కలిసి ఒక దేహంగా పని చేస్తాయి. క్రీస్తు కూడా అంతే. 13 అంటే మనమంతా ఒక ఆత్మ ద్వారా బాప్తిస్మము పొంది, ఒక శరీరంలో ఐక్యం అయ్యాము. మనము యూదులమైనా, గ్రీకులమైనా, బానిసలమైనా, బానిసలము కాకపోయినా, మనకందరికీ ఒకే ఆత్మ యివ్వబడినాడు.
14 మన శరీరంలో ఎన్నో భాగాలున్నాయి. ఒకటి కాదు. 15 ఒకవేళ, కాలు, “నేను చేతిని కాను, కనుక నేను ఈ శరీరానికి చెందను” అని అన్నంత మాత్రాన అది శరీరంలో ఒక భాగం కాకపోదు. 16 అదే విధంగా ఒకవేళ చెవి, “నేను కన్నును కాను. కనుక ఈ శరీరానికి చెందను” అని అన్నంత మాత్రాన అది శరీరంలో ఒక భాగం కాకపోదు. 17 శరీరమంతా కన్నైపోతే దేనితో వింటాం? శరీరమంతా చెవియైతే దేనితో వాసన చూస్తాం? 18 కాని నిజానికి దేవుడు ఈ శరీరంలోని ప్రతి అవయవాన్ని తాను అనుకొన్న విధంగా అమర్చాడు. 19 అన్ని అవయవాలు ఒక అవయవంగా మారితే శరీరం ఉండదు. 20 నిజానికి శరీరంలో అనేక భాగాలు ఉన్నా శరీరం ఒక్కటే.
21 కన్ను చేతితో, “నీవు నాకు అవసరం లేదు” అని అనలేదు. అదే విధంగా శిరస్సు పాదాలతో, “మీరు నాకు అవసరం లేదు” అని అనలేదు. 22 సున్నితంగా కనిపించే అవయవాలే నిజానికి ముఖ్యమైనవి. 23 ముఖ్యం కాదనుకొనే భాగాలను మనము ప్రత్యేకంగా కాపాడుతాము. బహిరంగపరచలేని భాగాల పట్ల మనము ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతాము. 24 బహిరంగపరచగల భాగాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపనవసరం లేదు. కాని దేవుడు శరీరానికి సంబంధించిన భాగాల్ని ఒక చోట చేర్చి ప్రాముఖ్యత లేని భాగాలకు ప్రాముఖ్యత కలిగించాడు. 25 శరీరంలో చీలికలు ఉండరాదని, దాని భాగాలు పరస్పరం శ్రద్ధ చూపుతూ ఉండాలని, ఆయన ఉద్దేశ్యం. 26 ఒక భాగానికి కష్టం కలిగితే ప్రతీయొక భాగం దానితో సహా కష్టం అనుభవిస్తుంది. ఒక భాగానికి గౌరవం లభిస్తే మిగతా భాగాలన్నింటికీ దానితో సహా ఆనందం కలుగుతుంది.
27 మీరు క్రీస్తు శరీరం. మీలో ప్రతి ఒక్కరూ ఆ శరీరానికి చెందిన భాగాలు. 28 దేవుడు సంఘంలో ఉన్నవాళ్ళందర్నీ తమతమ స్థానాల్లో ఉంచాడు. మొదటి స్థానంలో అపొస్తలులను, రెండవ స్థానంలో ప్రవక్తల్ని, మూడవ స్థానంలో బోధించే వాళ్ళను, ఆ తర్వాత మహత్కార్యాలను చేసేవాళ్ళను, వాళ్ళ తర్వాత వ్యాధులు నయం చేసే శక్తి గలవాళ్ళను, ఇతరులకు సహాయం చేసేవాళ్ళను, పరిపాలించేవాళ్ళను, తమకు తెలియని భాషల్లో మాట్లాడగల శక్తి గలవాళ్ళను ఉంచాడు. 29 వీళ్ళలో అందరూ అపొస్తలులు కారు, అందరూ ప్రవక్తలు కారు, అందరూ బోధించేవాళ్ళు కారు, అందరూ అద్భుతాలు చేసేవాళ్ళు కారు. 30 వీళ్ళలో అందరికి వ్యాధులు నయం చేసే శక్తి లేదు. తెలియని భాషలో మాట్లాడే శక్తి లేదు. ఆ మాటలకు అర్థం విడమర్చి చెప్పే శక్తి లేదు. 31 కనుక మీ హృదయాలను ముఖ్యమైన వరాల వైపుకు మళ్ళించండి. ఏది ఏమైనా అన్నిటికన్నా ముఖ్యమైన మార్గం చూపిస్తాను.
గలిలయలో యేసుని సేవా ప్రారంభం
(మత్తయి 4:12-17; మార్కు 1:14-15)
14 యేసు పవిత్రాత్మ శక్తితో గలిలయకు తిరిగి వచ్చాడు. ఆయన్ని గురించి ఆ చుట్టూ ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు తెలిసింది. 15 ఆయన ఆ ప్రాంతాల్లో ఉన్న సమాజ మందిరాల్లో బోధించాడు. ప్రతి ఒక్కరూ ఆయన్ని స్తుతించారు.
యేసు తన స్వగ్రామానికి వెళ్ళటం
(మత్తయి 13:53-58; మార్కు 6:1-6)
16 ఆ తర్వాత తాను పెరిగిన నజరేతు గ్రామానికి వెళ్ళాడు. ఒక విశ్రాంతి రోజున అలవాటు ప్రకారం సమాజమందిరానికి వెళ్ళి, చదవటానికి నిలుచున్నాడు. 17 అక్కడున్న వాళ్ళు, ప్రవక్త యెషయా గ్రంథాన్ని ఆయన చేతికి ఇచ్చారు. ఆయన ఆ గ్రంథములో ఈ వాక్యాలున్న పుటను తెరిచి చదవటం మొదలు పెట్టాడు:
18 “ప్రభువు నన్నభిషేకించి పేదవాళ్ళకు
నన్ను సువార్త ప్రకటించుమన్నాడు.
అందుకే ప్రభువు ఆత్మ నాలో ఉన్నాడు.
బంధితులకు స్వేచ్ఛ ప్రకటించుమని,
గుడ్డివారికి చూపు కలిగించాలని,
హింసింపబడే వారికి విడుదల కలిగించాలని, నన్ను పంపాడు.
19 ప్రభువు ‘తాను దయ చూపే సంవత్సరం’ ప్రకటించుమని నన్ను పంపాడు.”(A)
20 ఆ తదుపరి యేసు గ్రంథం మూసేసి దాన్ని తెచ్చిన వానికి యిచ్చి కూర్చున్నాడు. సమాజ మందిరంలో ఉన్నవాళ్ళందరి కళ్ళు ఆయనపై ఉన్నాయి. 21 ఆయన వాళ్ళతో, “ఈ రోజు గ్రంథములో వ్రాయబడిన ఈ వాక్యాలు మీరు వింటుండగానే నెరవేరాయి” అని అన్నాడు.
© 1997 Bible League International