Revised Common Lectionary (Complementary)
దావీదుకు అభిమాన కావ్యము.
16 దేవా నేను నీమీద ఆధారపడ్డాను గనుక నన్ను కాపాడుము.
2 “యెహోవా, నీవు నా యజమానివి
నాకు గల ప్రతి మంచిది నీ నుండి నాకు లభిస్తుంది”
అని నేను యెహోవాతో చెప్పాను.
3 మీరు ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధుల గురించి కూడా చెప్పారు,
“వారు నాకు గోప్పవారు, వారే నన్ను సంతోషపెట్టువారు.”
4 కాని ఇతర దేవుళ్లను పూజించుటకు పరుగులెత్తే మనుష్యులకు అధిక బాధ కలుగుతుంది.
ఆ దేవతలకు వారు ఇచ్చే రక్తపు అర్పణల్లో నేను భాగం పంచుకోను.
ఆ దేవతల పేర్లు కూడ నేను పలుకను.
5 నా భాగం, నా పాత్ర యెహోవా దగ్గర్నుండి మాత్రమే వస్తుంది.
యెహోవా, నీవే నన్ను బలపరచావు.
యెహోవా, నీవే నా వంతు నాకు ఇమ్ము.
6 నా వంతు చాలా అద్భుతమయింది.
నా స్వాస్థ్యము చాలా అందమయింది.
7 యెహోవా నాకు చక్కగా నేర్పించాడు. కనుక నేను ఆయనను స్తుతిస్తాను.
రాత్రియందు, నా అంతరంగపు లోతుల్లోనుండి ఉపదేశములు వచ్చాయి.
8 నేను ఎల్లప్పుడూ యెహోవాను నా యెదుట ఉంచుకొంటాను.
ఎందుకనగా ఆయన నా కుడి ప్రక్కన వున్నాడు.
నేను ఎన్నడూ కదల్చబడను. ఆయన కుడిప్రక్కను నేను ఎన్నడూ విడువను.
9 కనుక నా ఆత్మ, నా హృదయము ఎంతో సంతోషంగా ఉన్నాయి.
నా శరీరం కూడ క్షేమంగా బ్రతుకుతుంది.
10 ఎందుకంటే, యెహోవా, నీవు నా అత్మను చావు స్థలంలో విడిచిపెట్టవు గనుక.
నీ పరిశుద్ధుడిని సమాధిలో కుళ్లిపోనీయవు.
11 సరైన జీవిత విధానాన్ని నీవు నాకు నేర్పిస్తావు.
యెహోవా, నీతో ఉండటమే నాకు సంపూర్ణ సంతోషం కలిగిస్తుంది.
నీ కుడిప్రక్కన ఉండటం నాకు శాశ్వత సంతోషం కలిగిస్తుంది.
28 నెబుకద్నెజరు రాజుకు ఆ ఘటనలన్నీ జరిగాయి. 29-30 కల వచ్చిన పన్నెండు నెలల తర్వాత, బబులోనులోని తన అంతఃపురం పైభాగాన నెబుకద్నెజరు నడుల్తూ ఉండగా రాజు బబులోనువైపు చూసి, “ఈ గొప్ప నగరాన్ని, ఈ గొప్ప అంతఃపురాన్ని నా శక్తివల్ల నిర్మించాను. నేనెంత గొప్పవాడనో తెలపటానికి ఈ అంతః పురాన్ని నిర్మించాను” అని తన మనస్సులో చెప్పుకొన్నాడు.
31 అతని మాటలు ఇంకా అతని నోటిలోనే ఉండగా, ఆకాశమునుంచి ఒక స్వరం ఇలా వినిపించింది: “నెబుకద్నెజరు రాజా, ఈ మాటలు నీకోసమే. నీ వద్దనుంచి నీ అధికారం తీసివేయబడింది. 32 ప్రజలనుండి నీవు తరిమి వేయబడతావు. భూజంతువులతో నీవు నివసించాల్సి వస్తుంది. ఎద్దువలె నీవు పచ్చిక మేస్తావు. నీవు గుణపాఠం నేర్చుకునేలోగా ఏడు కాలాలు (సంవత్సరాలు) గడిచి పోతాయి. అప్పుడు మనుష్యుల రాజ్యాలను సర్వోన్నతుడైన దేవుడు పరిపాలిస్తాడనీ, తనకు నచ్చిన వానికి రాజ్యాలు ఇస్తాడనీ నీవు తెలుసుకుంటావు.”
33 ఆ విషయాలు వెంటనే జరిగాయి. నెబుకద్నెరును ప్రజలు తమ మధ్యనుండి తరిమివేశారు. అతడు ఎద్దువలె పచ్చిక మేయ సాగాడు. ఆకాశ మంచుచేత అతని దేహం తడిసింది. గ్రద్ద ఈకలవలె అతని వెండ్రుకలు పొడుగ్గా పెరిగాయి. పక్షుల గోళ్లవలె అతని గోళ్లు పొడుగ్గా పెరిగాయి.
34 ఆ యేడేళ్ల కాలం పూర్తి కాగానే, నెబుకద్నెజరు అను నేను ఆకాశంవైపు కన్నెత్తి చూశాను. మళ్లీ నాకు మానవబుద్ధి లభించింది. అప్పుడు మహోన్నతుడైన దేవున్ని నేను కీర్తించాను. ఎల్లాకాలము నివసించే ఆయనను గౌరవించి, ఇలా ప్రశంసించాను:
ఆయన పరిపాలన శాశ్వతమైనది,
తరతరాలకు ఆయన రాజ్యం కొనసాగుతుంది.
35 భూమిమీద మనుష్యులు
ఆయన ఎదుట లెక్క లేనివారికి సమానము.
దేవుడు పరలోకలమందలి సైన్యాలకు,
భూమిమీది మనుష్యులకు తనకు ఇష్టము వచ్చినట్లు చేస్తాడు.
ఎవ్వరూ ఆయన శక్తివంతమైన హస్తాన్ని ఆపలేరు.
ఎవ్వరూ ఆయన చేసే పనుల్ని ప్రశ్నించలేరు.
36 అప్పుడు, ఆ సమయాన, దేవుడు నాకు సరి అయిన బుద్ధిని ప్రసాదించాడు. రాజుగా అధిక గౌరవం, శక్తిని నాకు తిరిగి ఇచ్చాడు. మరల నా సలహాదారులు రాజపురుషులు నా సలహా అడగ సాగారు. నేను మళ్లీ రాజుని అయ్యాను. పూర్వం కంటె ఎక్కువ శక్తి ఎక్కువ గొప్పతనం నాకు వచ్చాయి. 37 ఇప్పుడు, నెబుకద్నెజరు అను నేను పరలోక మందున్న రాజును కీర్తిస్తున్నాను, గౌరవిస్తున్నాను. ఆయన చేసే ప్రతిది సరి అయినదే. ఆయన ఎప్పుడూ న్యాయంగానే ఉంటాడు. గర్విష్ఠులను ఆయన అణగ ద్రొక్కుతాడు.
రైతుల ఉపమానం
(మత్తయి 21:33-46; లూకా 20:9-19)
12 ఆ తర్వాత ఆయన వాళ్ళతో దృష్టాంతాలు చెబుతూ ఇలా మాట్లాడటం మొదలు పెట్టాడు: “ఒకడు ద్రాక్షాతోట వేసి, చుట్టూ ఒక గోడ కట్టాడు. ద్రాక్షపళ్ళు త్రొక్కటానికి ఒక తొట్టి కట్టించాడు. అక్కడే ఒక గోపురం కట్టించాడు. ఆ తర్వాత ఆ ద్రాక్షతోటను కొంతమంది రైతులకు కౌలుకిచ్చి ప్రయాణమై వెళ్ళిపోయాడు.
2 “పంటకాలం రాగానే పంటలో తనకు రావలసిన భాగం తీసుకు రమ్మని ఒక సేవకుణ్ణి వాళ్ళ దగ్గరకు పంపాడు. 3 కాని ఆ రైతులతణ్ణి పట్టుకొని కొట్టి వట్టిచేతులతో పంపివేసారు. 4 ఆ తర్వాత అతడు యింకొక సేవకుణ్ణి పంపాడు. వాళ్ళతణ్ణి తలపై బాది అవమానపరిచారు. 5 అతడు యింకొక సేవకుణ్ణి కూడా పంపాడు. వాళ్ళతణ్ణి చంపివేసారు. అతడింకా చాలామందిని పంపాడు. కాని ఆ రైతులు వారిలో కొందరిని చంపారు. మరి కొందరిని కొట్టారు.
6 “తన ప్రియమైన కుమారుడు తప్ప పంపటానికి యింకెవ్వరూ మిగల్లేదు. వాళ్ళు తన కుమారుణ్ణి గౌరవిస్తారనుకొని చివరకు తన కుమారుణ్ణి పంపాడు.
7 “కాని ఆ రైతులు, ‘ఇతడు వారసుడు! యితణ్ణి చంపుదాం; అప్పుడు ఆ వారసత్వం మనకు దక్కుతుంది’ అని పరస్పరం మాట్లాడుకొన్నారు. 8 ఆ కారణంగా వాళ్ళతణ్ణి పట్టుకొని చంపి ఆ ద్రాక్షతోటకు అవతల పడవేసారు.
9 “అప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని ఏం చేస్తాడు? వచ్చి ఆ రైతుల్ని చంపేసి ఆ ద్రాక్షతోటను యితరులకు కౌలుకిస్తాడు. 10 లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు: ఇది మీరు చదువలేదా?
‘ఇల్లు కట్టువాళ్ళు పనికిరాదని పారవేసిన రాయి తలరాయిగా మారింది.
11 ఇది ప్రభువు చేసాడు. ఆ అద్భుతాన్ని మనం కండ్లారా చూసాము.’”(A)
12 ఈ దృష్టాంతం తమనుగూర్చి చెప్పాడని యూదులు గ్రహించారు. కనుక ఆయన్ని బంధించటానికి మార్గం ఆలోచించారు. కాని ప్రజల గుంపును చూసి భయపడిపొయ్యారు. అందువల్ల ఆయన్ని వదిలి వెళ్ళిపొయ్యారు.
© 1997 Bible League International