Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 23

దావీదు కీర్తన.

23 యెహోవా నా కాపరి
    నాకు కొరత ఉండదు
పచ్చటి పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకో పెడతాడు.
    ప్రశాంతమైన నీళ్లవద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు.
ఆయన తన నామ ఘనత కోసం నా ఆత్మకు నూతన బలం ప్రసాదిస్తాడు.
    ఆయన నిజంగా మంచివాడని చూపించేందుకు ఆయన నన్ను మంచితనపు మార్గాల్లో నడిపిస్తాడు.
చివరికి మరణాంధకారపు లోయలో నడిచినప్పుడు కూడా
    నేను భయపడను. ఎందుకంటే, యెహోవా, నీవు నాతో ఉన్నావు.
    నీ చేతికర్ర, నీ దండం నన్ను ఆదరిస్తాయి కనుక.
యెహోవా, నా శత్రువుల ఎదుటనే నీవు నాకు భోజనం సిద్ధం చేశావు.
    నూనెతో నా తలను నీవు అభిషేకిస్తావు.
    నా పాత్ర నిండి, పొర్లిపోతుంది.
నా మిగిలిన జీవితం అంతా మేలు, కరుణ నాతో ఉంటాయి.
    మరియు నేను ఎల్లకాలం యెహోవా ఆలయంలో నివసిస్తాను.

యిర్మీయా 12:1-13

యిర్మీయా దేవునికి ఫిర్యాదు చేయుట

12 యెహోవా, నేను నీతో వాదించినట్లయితే,
    నీవే ఎల్లప్పుడూ సరైనవాడవుగా ఉంటావు!
కానీ న్యాయంగా కనబడని కొన్ని విషయాల గురించి నేను నిన్ను అడగాలనుకొంటున్నాను.
    దుర్మార్గులు ఎందుకు విజయవంతులవుతున్నారు?
    నమ్మదగని ప్రజలు ఎలా సులభమైన జీవితం గడుపుతున్నారు?
ఈ దుర్మార్గులను నీవిక్కడ ఉంచినావు. మొక్కలు బాగా వేరూనినట్లు వారు బాగా స్థిరపడి,
    అభివృద్ధిచెంది కాయలు కాసారు.
నీవు వారికి చాలా ప్రియమైన వాడివని వారు నోటితో చెబుతారు.
    కాని వారి హృదయాలలో నీవు లేవు. వారు నీకు చాలా దూరంగా ఉన్నారు.
ఓ ప్రభువా, నా హృదయం నీకు తెలుసు.
    నన్ను నీవు చూస్తూనే ఉన్నావు. నా మనస్సును పరీక్షిస్తూనే ఉన్నావు.
గొర్రెలను నరకటానికి లాగినట్టు, ఆ దుర్మార్గపు మనుష్యులను లాగివేయి.
    సంహారపు రోజునకు వారిని ఎంపిక చేయి.
ఎన్నాళ్లు ఈ భూమి వర్షపాతం లేక ఎండిపోయి ఉండాలి?
    ఎన్నాళ్లీ నేలపై గడ్డి ఎండి, చచ్చిపోయి ఉండాలి?
దేశంలో పశువులు, పక్షులు అన్నీ చనిపోయాయి.
    ఈ దుష్ట జనుల చెడుపనులే ఈ పరిస్థితికి కారణం.
పైగా, “మాకు ఏమి జరుగుతుందో చూడటానికి యిర్మీయా ఎక్కువ కాలం బ్రతకడు”
    అని ఆ దుర్మార్గులే అంటున్నారు.

యిర్మీయాకు దేవుని సమాధానం

“యిర్మీయా, మానవులతో పరుగు పందెమునకే నీవు అలసిపోతే,
    మరి గుర్రాలతో నీవు ఎలా పరుగు పెట్టగలవు?
సురక్షిత దేశంలోనే నీవు అలసిపోతే,
    యొర్దాను నదీ తీరాన పెరిగే ముండ్ల పొదలలోకి వస్తే నీవు ఏమి చేస్తావు?
ఈ మనుష్యులు నీ స్వంత సోదరులు.
    నీ కుటుంబ సభ్యులే నీకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతున్నారు.
    నీ ఇంటివారే నిన్ను జూచి అరుస్తున్నారు.
వారు నీతో స్నేహితులవలె మాట్లాడినా
    నీవు వారిని నమ్మవద్దు.

యెహోవా యూదాను తిరస్కరించుట

“నేను (యెహోవాను) నా ఇంటిని (యూదాను) వదిలివేశాను.
    నా స్వంత ఆస్తిని[a] నేను వదిలివేశాను.
నేను ప్రేమించే దానిని (యూదా) ఆమె శత్రువులకే అప్పగించాను.
నా ఆస్తే నాకు ఒక భయంకర సింహంలా తయారయ్యింది.
అది నన్ను చూచి గర్జిస్తూవుంది.
    అందుచే దాన్ని నేను అసహ్యించు కుంటున్నాను.
నా ఆస్తి రాబందులచే ఆవరింపబడిన
    చనిపోయే జంతువులా వుంది.
ఆ పక్షులు దాని చుట్టూ ఎగురుతాయి.
    వన్య (అడవి) మృగములారా, రండి.
    రండి, తినటానికి ఆహారం తీసుకోండి.
10 చాలామంది గొర్రెల కాపరులు (నాయకులు) నా ద్రాక్షా తోటను నాశనం చేసారు.
    ఆ కాపరులు నా తోటలోని మొక్కలపై నడిచారు.
    వారు నా అందాల తోటను వట్టి ఎడారిగా మార్చి వేశారు.
11 వారు నా భూమిని ఎడారిలా చేశారు.
    అది ఎండి చచ్చిపోయింది. అక్కడ ఎవ్వరూ నివసించరు.
దేశం యావత్తూ వట్టి ఎడారి అయ్యింది.
    అక్కడ ఆ భూమిని గూర్చి శ్రద్ధ వహించే వారు ఎవ్వరూ లేరు.
12 సైనికులు ఎడారిలోని నీళ్లగుంటలను దోచుకొనుటకు వచ్చారు.
    యెహోవా ఆ సైన్యాలను ఆ రాజ్యాన్ని శిక్షించటానికి వినియోగించుకున్నాడు.
రాజ్యంలో ఒక మూలనుండి మరోమూల వరకు గల ప్రజలంతా శిక్షింపబడ్డారు.
    ఏ ఒక్కరికీ రక్షణ లేదు.
13 ప్రజలు గోధుమ పైరు నాటుతారు.
    కాని వారు కోసేది ముండ్లను మాత్రమే.
వారు బాగా అలసిపోయేటంతగా శ్రమిస్తారు.
    కాని వారి శ్రమకు ఫలం శూన్యం.
వారి పంట విషయంలో వారు సిగ్గు చెందుతారు.
    యెహోవా కోపకారణంగా ఇదంతా జరిగింది.”

లూకా 18:35-43

గ్రుడ్డివానికి దృష్టి కలిగించటం

(మత్తయి 20:29-34; మార్కు 10:46-52)

35 యేసు యెరికో పట్టణాన్ని సమీపిస్తున్నాడు. అదే సమయానికి ఒక గ్రుడ్డివాడు దారిప్రక్కన భిక్షమెత్తుకుంటూ కూర్చొని ఉన్నాడు. 36 అతడు ప్రజల గుంపు వెళ్తుండటం గమనించి ఏమి జరుగుతోందని అడిగాడు.

37 వాళ్ళు, “నజరేతు నివాసి యేసు ఈ దారిలో వెళ్తున్నాడు” అని చెప్పారు.

38 ఆ గ్రుడ్డివాడు బిగ్గరగా, “యేసూ! దావీదు కుమారుడా! నామీద దయ చూపు!” అని అన్నాడు.

39 ముందున్న వాళ్ళు అతణ్ణి గద్దిస్తూ నోరు మూసుకోమని చెప్పారు. కాని, అతడు యింకా బిగ్గరగా, “దావీదు కుమారుడా! నా మీద దయ చూపు” అని అన్నాడు.

40 యేసు ఆగి ఆ గ్రుడ్డివాణ్ణి తన దగ్గరకు పిలుచుకురమ్మని ఆజ్ఞాపించాడు. అతడు దగ్గరకు రాగానే యేసు అతణ్ణి 41 “ఏమి కావాలి?” అని అడిగాడు.

“ప్రభూ! నాకు దృష్టి కావాలి!” అని గ్రుడ్డివాడు సమాధానం చెప్పాడు.

42 యేసు, “నీకు దృష్టి కలగాలి! నీవు విశ్వసించావు కనుక నీకు దృష్టి కలిగింది” అని అన్నాడు.

43 వెంటనే అతడు చూడగలిగాడు. ఆ గ్రుడ్డివాడు దేవుణ్ణి స్తుతిస్తూ యేసును అనుసరించాడు. ప్రజలందరూ యిది చూసి వారుకూడా దేవుణ్ణి స్తుతించారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International