Revised Common Lectionary (Complementary)
8 తర్వాత నోవహుతో, అతని కుమారులతో దేవుడు ఇలా అన్నాడు: 9 “నీతోను నీ తర్వాత నీ ప్రజలతోను ఇప్పుడు నేను నా వాగ్దానం చేస్తున్నాను. 10 నీతోబాటు ఓడలో నుండి బయటకు వచ్చిన పక్షులన్నింటితోను, పశువులన్నింటితోను, జంతువులన్నింటితోను నేను వాగ్దానం చేస్తున్నాను. భూమి మీదనున్న ప్రతి ప్రాణితో నేను వాగ్దానం చేస్తున్నాను. 11 ఇదే నీకు నా వాగ్దానం. వరదనీటిచేత, భూమిమీద సకల ప్రాణులు నాశనం చేయబడ్డాయి. అయితే ఇక ఎన్నటికీ మరల అలా జరుగదు. భూమిమీద సకల ప్రాణులను ఒక వరద మాత్రం ఇక ఎన్నటికీ తిరిగి నాశనం చేయదు.”
12 తర్వాత నోవహు, అతని కుమారులతో యెహోవా యిలా అన్నాడు: “ఈ వాగ్దానం నేను మీకు యిచ్చినట్లు రుజువుగా నేను మీకు ఒకటి ఇస్తాను. మీతోను, భూమిమీద జీవించే ప్రతి ప్రాణితోను ఈ వాగ్దానం నేను చేశానని చెప్పేందుకు ఇది రుజువు. ఈ వాగ్దానం రాబోయే కాలములన్నిటిలో కొనసాగుతుంది. ఇదే ఆ రుజువు. 13 మేఘాల్లో నా రంగుల ధనస్సునుంచుచున్నాను. నాకు, భూమికి జరిగిన ఒడంబడికకు రుజువు ఆ రంగుల ధనస్సు. 14 భూమికి పైగా మేఘాలను నేను రప్పించినపుడు, మేఘాలలో రంగుల ధనస్సును మీరు చూస్తారు. 15 రంగుల ధనస్సును నేను చూపినప్పుడు నీతోను, భూమిమీదనున్న సకల ప్రాణులతోను జరిగిన ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. ఈ భూమిమీద సకల ప్రాణులను ఒక జలప్రళయం మాత్రం ఇంకెన్నడూ నాశనం చేయదు అని ఆ ఒప్పందం చెబుతోంది. 16 మేఘాల్లో ఆ రంగుల ధనస్సును నేను చూచినప్పుడు శాశ్వతంగా కొనసాగే ఆ ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. నాకును, భూమిమీద సకల ప్రాణులకును మధ్య జరిగిన ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను.”
17 కనుక, “భూమిమీద సకల ప్రాణులతోను నేను చేసిన ఒడంబడికకు ఆ మేఘ ధనస్సు రుజువు” అని యెహోవా నోవహుతో చెప్పాడు.
దావీదు కీర్తన.
25 యెహోవా, నేను నీకు నన్ను అర్పించుకొంటాను.
2 నా దేవా, నేను నిన్ను నమ్ముకొంటున్నాను.
నేను నిరాశచెందను.
నాశత్రువులు నన్ను చూచి నవ్వరు.
3 నిన్ను నమ్ముకొనే ఏ మనిషి నిరాశచెందడు.
కాని నమ్మక ద్రోహులు నిరాశపడతారు.
వారికి ఏమీ దొరకదు.
4 యెహోవా, నీ మార్గాలు నేర్చుకొనుటకు నాకు సహాయం చేయుము.
నీ మార్గాలను ఉపదేశించుము.
5 నన్ను నడిపించి, నీ సత్యాలు నాకు ఉపదేశించుము.
నీవు నా దేవుడవు, నా రక్షకుడవు.
రోజంతా నేను నిన్ను నమ్ముతాను.
6 యెహోవా, నా యెడల దయ చూపుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.
నీవు ఎల్లప్పుడూ చూపిస్తూ వచ్చిన ఆ ప్రేమను నా యెడల చూపించుము.
7 నేను యౌవ్వనంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు చెడు కార్యాలు జ్ఞాపకం చేసుకోవద్దు.
యెహోవా, నీ నామ ఘనతకోసం ప్రేమతో నన్ను జ్ఞాపకం చేసుకొనుము.
8 యెహోవా నిజంగా మంచివాడు.
జీవించాల్సిన సరైన మార్గాన్ని పాపులకు ఆయన ఉపదేశిస్తాడు.
9 దీనులకు ఆయన తన మార్గాలను ఉపదేశిస్తాడు.
న్యాయంగా ఆయన వారిని నడిపిస్తాడు.
10 యెహోవా ఒడంబడికను, వాగ్దానాలను అనుసరించే మనుష్యులందరికి
ఆయన మార్గాలు దయగలవిగా, వాస్తవమైనవిగా ఉంటాయి.
18 క్రీస్తు మీ పాపాల నిమిత్తం
తన ప్రాణాన్ని ఒకేసారి యిచ్చాడు.
దేవుని సన్నిధికి మిమ్మల్ని
తీసుకు రావాలని నీతిమంతుడైన
క్రీస్తు మీ పాపాల నిమిత్తం మరణించాడు.
వాళ్ళాయనకు భౌతిక మరణం కలిగించినా,
ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పునర్జీవం పొందాడు.
19 పరిశుద్ధాత్మ ద్వారా, చెరలోబడిన ఆత్మల దగ్గరకు వెళ్ళి బోధించాడు. 20 గతంలో ఈ ఆత్మలు దేవుని పట్ల అవిధేయతతో ప్రవర్తించాయి. నోవహు కాలంలో, నోవహు ఓడ నిర్మాణాన్ని సాగించినంతకాలం దేవుడు శాంతంగా కాచుకొని ఉన్నాడు. ఆ తర్వాత కొందరిని మాత్రమే, అంటే ఓడలో ఉన్న ఎనిమిది మందిని మాత్రమే నీళ్ళనుండి రక్షించాడు. 21 అదేవిధంగా మీరు బాప్తిస్మము పొందటంవల్ల దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. బాప్తిస్మము పొదంటం అంటే శరీరం మీదినుండి మలినాన్ని కడిగివేయటం కాదు. దేవుణ్ణి స్వచ్ఛమైన మనస్సునిమ్మని వేడుకోవడం. ఇది యేసు క్రీస్తు చావు నుండి బ్రతికి రావటం వల్ల సంభవిస్తోంది. 22 ఆయన పరలోకానికి వెళ్ళి దేవుని కుడి చేతి వైపు కూర్చొని, దేవదూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద రాజ్యం చేస్తున్నాడు.
యోహాను చేత యేసు బాప్తిస్మం పొందటం
(మత్తయి 3:13-17; లూకా 3:21-22)
9 ఆ రోజుల్లో, గలిలయలోని నజరేతు పట్టణానికి చెందిన యేసు వచ్చాడు. యోహాను ఆయనకు యొర్దాను నదిలో బాప్తిస్మము యిచ్చాడు. 10 యేసు నీటి నుండి బయటికి వస్తుండగా ఆకాశం తెరుచుకొని అందులో నుండి పవిత్రాత్మ ఒక పావురంలా తన మీదికి దిగిరావడం ఆయన గమనించాడు. 11 పరలోకం నుండి ఒక స్వరము, “నీవు నా ప్రియ కుమారుడవు. నీవంటే నాకెంతో ఆనందం!” అని అన్నది.
యేసు శోధించపడటం
(మత్తయి 4:1-11; లూకా 4:1-13)
12 వెంటనే దేవుని ఆత్మ యేసును ఎడారి ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు. 13 ఆయన అక్కడ నలభై రోజులున్నాడు. సైతాను ఆయన్ని పరీక్షించాడు. ఆయన మృగాల మధ్య జీవించాడు. దేవదూతలు ఆయనకు పరిచర్యలు చేసారు.
గలిలయలో యేసుని సేవా ప్రారంభం
(మత్తయి 4:12-17; లూకా 4:14-15)
14 యోహాను చెరసాలలో వేయబడ్డాడు. యేసు గలిలయకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాడు. 15 ఆయన, “దేవుని రాజ్యం వస్తుంది. ఆ సమయం దగ్గరకు వచ్చింది. మారుమనస్సు పొంది సువార్తను విశ్వసించండి” అని ప్రకటించాడు.
© 1997 Bible League International