Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 147:1-11

147 యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి.
    మన దేవునికి స్తుతులు పాడండి.
    ఆయనను స్తుతించుట మంచిది, అది ఎంతో ఆనందం.
యెహోవా యెరూషలేమును నిర్మించాడు.
    బందీలుగా తీసికొనిపోబడిన ఇశ్రాయేలు ప్రజలను దేవుడు వెనుకకు తీసికొనివచ్చాడు.
పగిలిన వారి హృదయాలను దేవుడు స్వస్థపరచి,
    వారి గాయాలకు కట్లు కడతాడు.
దేవుడు నక్షత్రాలను లెక్కిస్తాడు.
    వాటి పేర్లనుబట్టి వాటన్నిటినీ ఆయన పిలుస్తాడు.
మన ప్రభువు చాలా గొప్పవాడు. ఆయన చాలా శక్తిగలవాడు.
    ఆయన పరిజ్ఞానానికి పరిమితి లేదు.
పేదలను యెహోవా బలపరుస్తాడు.
    కాని చెడ్డ ప్రజలను ఆయన ఇబ్బంది పెడతాడు.
యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి.
    స్వరమండలాలతో మన దేవుణ్ణి స్తుతించండి.
దేవుడు ఆకాశాన్ని మేఘాలతో నింపుతాడు.
    భూమి కోసం దేవుడు వర్షాన్ని సృష్టిస్తాడు.
పర్వతాల మీద దేవుడు గడ్డిని మొలిపిస్తాడు.
జంతువులకు దేవుడు ఆహారం యిస్తాడు.
    పక్షి పిల్లల్ని దేవుడు పోషిస్తాడు.
10 యుద్ధాశ్వాలు, బలంగల సైనికులు ఆయనకు ఇష్టం లేదు.
11 యెహోవాను ఆరాధించే ప్రజలు ఆయనకు సంతోషాన్ని కలిగిస్తారు.
    ఆయన నిజమైన ప్రేమను నమ్ముకొనే ప్రజలు యెహోవాకు సంతోషం కలిగిస్తారు.

కీర్తనలు. 147:20

20 దేవుడు యిలా మరి ఏ దేశానికీ చెయ్యలేదు.
    ఇతర మనుష్యులకు దేవుడు తన న్యాయ చట్టం ఉపదేశించలేదు.

యెహోవాను స్తుతించండి!

యెషయా 46

అసత్య దేవతలు నిష్ప్రయోజనం

46 బేలు, నెబో నా ఎదుట సాగిలపడతారు.

తప్పుడు దేవుళ్లు వట్టి విగ్రహాలే. మనుష్యులే ఆ విగ్రహాలను జంతువులమీద పెడతారు. మోయాల్సిన బరువులు మాత్రమే ఆ విగ్రహాలు. తప్పుడు దేవుళ్లు ప్రజలను విసిగించటం తప్ప ఇంకేం చేయవు. ఆ తప్పుడు దేవుళ్లన్నీ సాగిలబడతాయి, అవన్నీ పడిపోతాయి. ఆ తప్పుడు దేవుళ్లు తప్పించుకోలేవు. అవన్నీ బందీలవలె తీసుకొనిపోబడుతాయి.

“యాకోబు వంశమా, నా మాట విను. ఇంకా బ్రతికే ఉన్న ఇశ్రాయేలు ప్రజలారా, మీరంతా నా మాటవినండి. నేను మిమ్మల్ని మోశాను. మీరు మీ తల్లి ఒడిలో ఉన్నప్పటి నుండి నేను మిమ్మల్ని ఎత్తుకొన్నాను. మీరు పుట్టినప్పుడు నేను మిమ్మల్ని ఎత్తుకొన్నాను, మీరు ముసలి వాళ్లయినప్పుడు నేను మిమ్మల్ని మోస్తాను. నేను మిమ్మల్ని సృజించాను. కనుక మీ తల వెండ్రుకలు నెరసిపోయినప్పుడు కూడా నేను మిమ్మల్ని మోస్తాను. నేను మిమ్మల్ని మోస్తూనే ఉంటాను, నేను మిమ్మల్ని రక్షిస్తాను.

“మీరు నన్ను ఇంకెవరితోనైనా పోల్చగలరా? లేదు. ఎవ్వరూ నాకు సమానులు కారు. నన్ను గూర్చి మీరు పూర్తిగా గ్రహించలేరు. నావంటిది ఇంకేమీ లేదు. కొంత మంది వెండి, బంగారం ఉండి ఐశ్వర్యవంతులు. వారి చేతి సంచుల్లోంచి బంగారం రాలుతుంది, వారు వారి వెండిని త్రాసులో తూకం వేస్తారు. వారు ఒక కళాకారునికి డబ్బిచ్చి, చెక్కతో ఒక తప్పుడు దేవుణ్ణి చేయించుకొంటారు. అప్పుడు ఆ ప్రజలు ఆ తప్పుడు దేవుడికి సాగిలపడి, దానికి పూజ చేస్తారు. ఆ మనుష్యులు ఆ తప్పుడు దేవుణ్ణి తమ భుజాల మీద పెట్టుకొని మోస్తారు. ఆ తప్పుడు దేవుడు నిష్ప్రయోజనం, ప్రజలు వానిని మోయాల్సి ఉంటుంది. ప్రజలు ఆ విగ్రహాన్ని నేలమీద పెడ్తారు, ఆ తప్పుడు దేవుడు కదల్లేడు. ఆ తప్పుడు దేవుడు, వాని స్థానం నుండి ఎన్నడూ నడిచిపోడు. ప్రజలు వానిమీద కేకలు వేయవచ్చు, కాని అది జవాబు ఇవ్వదు. ఆ తప్పుడు దేవుడు వట్టి విగ్రహం మాత్రమే. అది ప్రజలను వారి కష్టాల్లోంచి రక్షించజాలదు.

“ప్రజలారా, మీరు పాపం చేశారు. ఈ సంగతులను గూర్చి మీరు మరల ఆలోచన చేయాలి. ఈ సంగతులను జ్ఞాపకం చేసుకొని బలవంతంగా ఉండండి. చాలాకాలం క్రిందట జరిగిన సంగతులను జ్ఞాపకం చేసుకోండి. నేనే దేవుడను అని జ్ఞాపకం ఉంచుకోండి. నేనే అని జ్ఞాపకం ఉంచుకోండి. మరో దేవుడంటూ లేడు. ఆ తప్పుడు దేవుళ్లు నావంటివారు కారు.

10 “అంతంలో జరిగే సంగతులను గూర్చి మొదట్లోనే నేను మీకు చెప్పాను. ఇంకా సంభవించని సంగతులను గూర్చి చాలాకాలం క్రిందట నేను మీకు చెప్పాను. నేను ఒకటి తలపెట్టాను. అది జరిగి తీరుతుంది. నేను చేయాలనుకొన్నవి చేస్తాను. 11 తూర్పునుండి నేను ఒక మనిషిని పిలుస్తున్నాను. ఆ మనిషి గద్దలా ఉంటాడు. అతడు చాలా దూర దేశం నుండి వస్తాడు, నేను చేయాలని నిర్ణయించిన వాటిని అతడు చేస్తాడు. నేను ఇలా చేస్తానని నేను మీతో చెబుతున్నాను, నేను తప్పక దీనిని చేస్తాను. నేనే అతన్ని చేశాను. నేనే అతడ్ని తీసుకొని వస్తాను.

12 “మీకు గొప్ప శక్తి ఉందని మీలో కొందరు తలుస్తారు. కానీ మీరు మంచి పనులు చేయరు. నా మాట వినండి! 13 నేను మంచి పనులు చేస్తాను. త్వరలో నేను నా ప్రజలను రక్షిస్తాను. సీయోనుకు, అద్భుతమైన నా ఇశ్రాయేలుకు నేను రక్షణ తీసుకొని వస్తాను.”

మత్తయి 12:9-14

విశ్రాంతి రోజు యేసు నయం చేయటం

(మార్కు 3:1-6; లూకా 6:6-11)

ఆయన అక్కడి నుండి బయలుదేరి సమాజ మందిరానికి వెళ్ళాడు. 10 అక్కడ ఎండి పోయిన చేయిగలవాడొకడున్నాడు. యేసుపై నేరారోపణ చెయ్యాలని ఎదురుచూస్తున్న పరిసయ్యులు, ఆయన్ని, “విశ్రాంతి రోజు నయం చెయ్యటం ధర్మమా?” అని అడిగారు.

11 ఆయన వాళ్ళతో, “మీలో ఎవరి దగ్గరైనా ఒక గొఱ్ఱె ఉందనుకొండి. విశ్రాంతి రోజు అది గోతిలో పడితే దాన్ని పట్టి మీరు బయటికి లాగరా? 12 మరి మానవుడు గొఱ్ఱెలకన్నా ఎన్నోరెట్లు విలువైన వాడు కదా! అందువల్ల విశ్రాంతిరోజు మంచి చెయ్యటం ధర్మమే!” అని అన్నాడు.

13 అలా అన్నాక ఆ ఎండిపోయిన చెయ్యిగల వానితో, “నీ చేయి చాపు!” అని అన్నాడు. అతడు చేయి చాపాడు. చేయి పూర్తిగా నయమై రెండవ చెయ్యిలా అయింది. 14 కాని పరిసయ్యులు బయటికి వెళ్ళి, యేసును చంపటానికి పన్నాగం పన్నారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International