Revised Common Lectionary (Complementary)
కోరహు కుమారుల స్తుతి కీర్తన.
87 యెరూషలేము కొండల మీద దేవుడు తన ఆలయం నిర్మించాడు.
2 ఇశ్రాయేలులో ఏ ఇతర స్థలాల కంటె సీయోను ద్వారాలు యెహోవాకు ఎక్కువ ఇష్టం.
3 దేవుని పట్టణమా, ప్రజలు నిన్ను గూర్చి ఆశ్చర్యకరమైన సంగతులు చెబుతారు.
4 దేవుడు తన ప్రజలందరిని గూర్చి ఒక జాబితా ఉంచుతున్నాడు. దేవుని ప్రజలు కొందరు ఈజిప్టులోను బబులోనులోను జీవిస్తున్నారు.
ఆయన ప్రజలు కొందరు ఫిలిష్తీయలో, తూరులో, చివరికి ఇతియోపియాలో జన్మించినట్లు ఆ జాబితా తెలియజేస్తుంది.
5 సీయోనుగడ్డ మీద జన్మించిన
ప్రతి ఒక్క వ్యక్తినీ దేవుడు ఎరుగును.
సర్వోన్నతుడైన దేవుడు ఆ పట్టణాన్ని నిర్మించాడు.
6 దేవుడు తన ప్రజలు అందరిని గూర్చి ఒక జాబితా ఉంచుతాడు.
ఒక్కో వ్యక్తి ఎక్కడ జన్మించింది దేవునికి తెలుసు.
7 దేవుని ప్రజలు ప్రత్యేక పండుగలు ఆచరించుటకు యెరూషలేము వెళ్తారు.
దేవుని ప్రజలు పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు.
“మంచివన్నీ యెరూషలేము నుండి వస్తాయి.” అని వారు అంటారు.
18 “ఆ మనుష్యులకు దుష్టతలంపులు ఉన్నాయి, దుష్టకార్యాలు చేస్తారు. అందుచేత వారిని శిక్షించేందుకు నేను వస్తున్నాను. రాజ్యాలన్నింటిని, ప్రజలందరినీ నేను సమావేశం చేస్తాను. ప్రజలంతా కలిసి వచ్చి నా శక్తిని చూస్తారు. 19 కొంతమంది మనుష్యులకు నేను ఒక గుర్తువేస్తాను-వారిని నేను రక్షిస్తాను. రక్షించబడిన ఆ ప్రజల్లో కొందరిని తర్షీషు, లిబియా, లూదు, (విలుకాండ్ర దేశం), తూబాలు, గ్రీసు, దూరదేశాలు అన్నింటికీ నేను పంపిస్తాను. ఆ ప్రజలు నా ఉపదేశాలు ఎన్నడూ వినలేదు. ఆ ప్రజలు నా మహిమను ఎన్నడూ చూడలేదు. అందుచేత రక్షించబడిన ప్రజలు నా మహిమను గూర్చి దేశాలకు చెబుతారు. 20 మరియు వారు అన్ని దేశాలనుండి మీ సోదరులను, సోదరీలను తీసుకొని వస్తారు. నా పవిత్ర పర్వతం యెరూషలేముకు మీ సోదరీలను వారు తీసుకొని వస్తారు. గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, రథాలు బండ్లమీద మీ సోదరులు, సోదరీలు వస్తారు. ఇశ్రాయేలీయులు పవిత్ర పళ్లెములలో యెహోవా మందిరానికి తీసుకొనివచ్చే కానుకలవలె మీ సోదరులు, సోదరీలు ఉంటారు. 21 ఈ మనుష్యుల్లో నుండి కూడ కొందరిని యాజకులుగా, లేవీలుగా ఉండేందుకు నేను ఏర్పరచుకొంటాను.” (యెహోవా ఈ సంగతులు చెప్పాడు.)
క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి
22 “నేను ఒక నూతన ప్రపంచాన్ని చేస్తాను. మరియు నూతన ఆకాశం, నూతన భూమి శాశ్వతంగా నిలుస్తాయి. అదే విధంగా మీ పేర్లు, మీ పిల్లలు శాశ్వతంగా నాతో కూడ ఉంటారు. 23 ప్రతి ఆరాధన రోజు, ప్రజలంతా నన్ను ఆరాధించేందుకు వస్తారు. ప్రతి సబ్బాతు నాడూ, ప్రతి నెల మొదటిరోజున వారు వస్తారు.
యేసు రోగిని నయం చేయటం
(మార్కు 1:40-45; లూకా 5:12-16)
8 యేసు కొండదిగి రాగా, ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు. 2 కుష్టురోగంతో ఉన్న వాడొకడు వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “మీరు తలచుకొంటే నన్ను బాగుచెయ్యగలరు” అని అన్నాడు.
3 యేసు తన చేయి చాపి అతణ్ణి తాకుతూ, “నీకు బాగు కావాలని కోరుతున్నాను, స్వస్థుడవుకమ్ము!” అని అన్నాడు. వెంటనే అతనికి నయమైపోయింది. 4 అప్పుడు యేసు అతనితో, “ఈ సంఘటనను గురించి ఎవ్వరికీ చెప్పకు. కాని యాజకుని దగ్గరకు వెళ్ళి నీ దేహాన్ని చూపి, మోషే ఆజ్ఞాపించిన కానుకను అర్పించు. తద్వారా నీకు నయమైనట్లు వాళ్ళకు రుజువౌతుంది” అని అన్నాడు.
యేసు శతాధిపతి సేవకుని నయం చేయటం
(లూకా 7:1-10; యోహాను 4:43-54)
5 యేసు కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాక శతాధిపతి ఒకడు ఆయన దగ్గరకు వచ్చి, ఆయన సహాయం కావాలని కోరుతూ, 6 “ప్రభూ! నా సేవకుడు పక్షవాతం వచ్చి యింట్లో పడుకొని ఉన్నాడు. వానికి చాలా బాధ కలుగుతోంది” అని అన్నాడు.
7 యేసు, “నేను వచ్చి నయం చేస్తాను” అని అన్నాడు.
8 కాని శతాధిపతి సమాధానంగా, “ప్రభూ! మీరు మా యింటి గడపలో కాలు పెట్టటానికి కూడా నేను అర్హుడను కాను. కాని మీరు మాటంటే చాలు, నా సేవకునికి నయమైపోతుంది. 9 ఎందుకంటే, నేను కూడా అధికారుల క్రింద ఉన్నవాణ్ణి. నా క్రింద కూడా సైనికులున్నారు. నేను ఈ సైనికునితో ‘వెళ్ళు’ అంటే వెళ్తాడు; ఆ సైనికునితో ‘రా’ అంటే వస్తాడు. నా సేవకునితో ‘ఇది చేయి’ అంటే చేస్తాడు” అని అన్నాడు.
10 యేసు ఇది విని ఆశ్చర్యపొయ్యాడు. ఆయన తన వెంట వస్తున్న వాళ్ళతో, “ఇది సత్యం. ఇంత గొప్ప విశ్వాసమున్న వ్యక్తి నాకు ఇశ్రాయేలీయులలో ఎవ్వరూ కనిపించలేదు. 11 నేను చెప్పెదేమిటంటే, తూర్పునుండి, పడమరనుండి, చాలామంది ప్రజలు వస్తారు. వచ్చి, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో కలిసి దేవుని రాజ్యంలో జరిగే విందులో పాల్గొంటారు. 12 కాని దేవుడు తన రాజ్యానికి తమ పుట్టుకవల్ల వారసులైన వాళ్ళను అవతల దూరంగా చీకట్లో పారవేస్తాడు. అక్కడ వాళ్ళు ఏడుస్తూ బాధననుభవిస్తారు.”
13 ఇలా అని, యేసు శతాధిపతితో, “వెళ్ళు! నీవు విశ్వసించినట్లే జరుగుతుంది” అని అన్నాడు. అదే క్షణంలో అతని సేవకునికి నయమైపోయింది.
© 1997 Bible League International