Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 18:1-19

సంగీత నాయకునికి: యెహోవా సేవకుడు దావీదు కీర్తన. సౌలు బారి నుండి, యితర శత్రువులందరినుండి యెహోవా దావీదును రక్షించినప్పుడు అతడు వ్రాసిన పాట.

18 “యెహోవా, నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను!”
    అతడీలాగన్నాడు.

యెహోవా నా బండ, నా కోట, నా రక్షకుడు.
    నా దేవుడే నా అండ. నేను ఆశ్రయంకోసం ఆయన యొద్దకు పరుగెత్తుతాను.
దేవుడు నా డాలు, ఆయనే తన శక్తితో నన్ను రక్షిస్తాడు.
    ఎత్తైన కొండలలో యెహోవా నా దాగుకొను స్థలము.

యెహోవాకు నేను మొరపెడ్తాను.
    యెహోవా స్తుతించబడుటకు అర్హుడు
    మరియు నా శత్రువుల బారినుండి నేను రక్షించబడుతాను.
4-5 నా శత్రువులు నా యెదుట ఎన్నో ఉచ్చులు పెట్టారు.
    మరణకరమైన ఉచ్చులు నా యెదుట ఉన్నాయి.
మరణపాశాలు నా చుట్టూరా చుట్టబడి ఉన్నాయి.
    నాశనకరమైన వరదనీళ్లు నన్ను భయపెడుతున్నాయి. మరణపాశాలు అన్నీ చుట్టూరా ఉన్నాయి.
చిక్కులో పడి, నేను సహాయం కోసం యెహోవాకు మొరపెట్టాను.
    నేను నా దేవుణ్ణి ప్రార్థించాను.
దేవుడు తన పవిత్ర స్థలం నుండి నా ప్రార్థన విన్నాడు.
    సహాయంకోసం నేను చేసిన ప్రార్థనలు ఆయన విన్నాడు.
యెహోవా నాకు సహాయం చేయటానికి వస్తున్నాడు.
    భూమి కంపించి వణికినది. పర్వతాలు కంపించాయి.
    ఎందుకంటే ప్రభువు కోపించాడు.
ఆయన ముక్కుల్లో నుండి పొగ లేచింది.
    యెహోవా నోటి నుండి మండుతున్న జ్వాలలు వచ్చాయి.
    నిప్పు కణాలు ఆయన నుండి రేగాయి.
యెహోవా గగనం చీల్చుకొని దిగి వచ్చాడు.
    ఆయన పాదాల క్రింద నల్లటి మేఘాలు ఉన్నాయి.
10 ఎగిరే కెరూబుల మీద ఆయన స్వారీ చేశాడు.
    ఆయన గాలుల మీద పైకెగిరాడు.
11 యెహోవాను ఆవరించిన మహా దట్టమైన మేఘంలో ఆయన మరుగైయున్నాడు.
    దట్టమైన ఉరుము మేఘంలో ఆయన మరుగై యున్నాడు.
12 అప్పుడు, దేవుని ప్రకాశమానమైన వెలుగు మేఘాలనుండి బయలు వెడలినది.
    అంతట వడగండ్లు, మెరుపులు వచ్చినవి.
13 యెహోవా యొక్క స్వరం ఆకాశంలో గట్టిగా ఉరిమింది.
    సర్వోన్నతుడైన దేవుడు తన స్వరాన్ని వినిపించాడు. వడగండ్లు, మెరుపులు కలిగాయి.
14 యెహోవా తన బాణాలు వేయగా శత్రువు చెదరి పోయాడు,
    అనేకమైన ఆయన మెరుపు పిడుగులు వారిని ఓడించాయి.

15 యెహోవా, నీవు బలంగా మాట్లాడావు,
    మరియు నీవు నీ నోటినుండి[a] బలమైన గాలిని ఊదావు.
నీళ్లు వెనక్కు నెట్టివేయబడ్డాయి, సముద్రపు అడుగును మేము చూడగలిగాము.
    భూమి పునాదులను మేము చూడగలిగాము.

16 పై నుండి యెహోవా క్రిందికి అందుకొని నన్ను రక్షించాడు.
    నా కష్టాల్లోనుండి[b] ఆయన నన్ను బయటకు లాగాడు.
17 నా శత్రువులు నాకంటె బలవంతులు.
    ఆ మనుష్యులు నన్ను ద్వేషించారు. పైగా వారు నాకంటె చాలా బలం కలవారు. అయినను దేవుడు నన్ను రక్షించాడు.
18 నా కష్టకాలంలో ఆ మనుష్యులు నా మీద దాడి చేశారు.
    కాని యెహోవా నన్ను బలపర్చాడు.
19 యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడు. కనుక ఆయన నన్ను కాపాడాడు.
    ఆయన నన్ను క్షేమ స్థలానికి తీసికొని వెళ్లాడు.

యోబు 36:24-33

24 దేవునిని తాను చేసిన పనిని బట్టి స్తుతించటం మరువకు.
    మనుష్యులు దేవునిని కీర్తనలతో స్తుతించారు.
25 ప్రతి మనిషీ దేవుని పనిని చూశాడు.
    మనుష్యులు దేవుని పనిని దూరం నుండి చూశారు.
26 దేవుడు గొప్పవాడు. అది నిజం. ఆయన గొప్పతనాన్ని మనం గ్రహించలేం.
    దేవునికి ఎన్ని సంవత్సరాలో ఏ మనిషీ లెక్కించలేడు.

27 “దేవుడు భూమినుండి నీళ్లు తీసుకొని
    దాన్ని వర్షంగా మారుస్తాడు.
28 ఆయన మేఘాన్ని చేసి వాటి నీళ్లను కుమ్మరిస్తాడు.
    మనుష్యుల మీద అధిక వర్షం కురుస్తుంది.
29 దేవుడు మేఘాలను ఎలా వ్యాపింపజేస్తాడో మనిషి గ్రహించలేడు.
    దేవుడు నివసించే ఆకాశంలోనుంచి ఉరుము ఎలా ఉరుముతుందో ఏ మనిషీ గ్రహించలేడు.
30 అగాధ సముద్రాన్ని ఆవరిస్తూ ఆకాశం అంతటా
    దేవుడు మెరుపును ఎలా విస్తరింపజేస్తాడో చూడు.
31 రాజ్యాలను అదుపులో ఉంచి సమృద్ధిగా ఆహారం ఇచ్చేందుకు
    దేవుడు ఈ మేఘాలను ప్రయోగిస్తాడు.
32 దేవుడు మెరుపులను తన చేతితో పట్టుకొంటాడు.
    దేవుడు కోరుకొన్న చోటనే పిడుగుపడేటట్టు దానికి ఆజ్ఞాపిస్తాడు.
33 తుఫాను వస్తోందని ఉరుము తెలియజేస్తుంది.
    తుఫాను వస్తోందని చివరికి పశువులకు కూడా తెలుసు.

యోబు 37:14-24

14 “యోబూ, ఒక నిమిషం ఆగి విను.
    ఆగి, దేవుడు చేసే అద్భుత విషయాలను గూర్చి ఆలోచించు.
15 యోబూ, దేవుడు మేఘాలను ఎలా అదుపు చేస్తాడో నీకు తెలుసా?
    దేవుడు తన మెరుపును ఎలా ప్రకాశింప చేస్తాడో నీకు తెలుసా?
16 ఆకాశంలో మేఘాలు ఎలా వ్రేలాడుతాయో నీకు తెలుసా?
    దేవుని జ్ఞానం పరిపూర్ణం. మేఘాలు, దేవుని ఆశ్చర్యకార్యాలు.
17 లేదు, యోబూ, ఈ సంగతులు నీకు తెలియవు.
    దక్షిణపు వేడి గాలిలో భూమి నిశ్చలంగా ఉన్నప్పుడు నీకు చెమటపోసి, నీ బట్టలు జిడ్డుగా ఉండటం మాత్రమే నీకు తెలుసు.
18 యోబూ, ఆకాశాన్ని విశాలపరచేందుకు
    మెరుగుదిద్దిన అద్దంలా దానిని గట్టిగా చేసేందుకు నీవు దేవునికి సహాయం చేయగలవా?

19 “యోబూ, దేవునితో మేము ఏమి చెప్పాలో చెప్పు.
    మేము చీకటిలో ఉన్నందువల్ల సరియైన మా వాగ్వివాదాన్ని దేవునికి మేము చెప్పలేకున్నాము.
    (దేవుని సన్నిధిలో) ఏమి చెప్పడానికీ మాకు తెలియడంలేదు.
20 నేను దేవునితో మాట్లాడాలని ఆయనతో చెప్పను.
    అలా చెప్పటం నాశనం చేయమని అడిగినట్టే ఉంటుంది.
21 ఇప్పుడు ప్రకాశిస్తున్న సూర్యుణ్ణి ఏ మనిషీ చూడలేడు.
    గాలి మేఘాలను తరిమి వేసిన తరువాత అది ఆకాశంలో చాలా తేజోవంతంగా ప్రకాశిస్తుంది.
22 (అదే విధంగా దేవుడు ఉన్నాడు) దేవుని బంగారు మహిమ ఉత్తరం నుండి ప్రకాశిస్తుంది.
    దేవుడు అద్భుత మహిమతో వస్తాడు.
23 సర్వశక్తిమంతుడైన దేవుడు నిజంగా గొప్పవాడు.
    మనం దేవుని దగ్గరగా వెళ్లలేం. దేవుడు మనుష్యుల్ని ఎల్లప్పుడూ సరిగ్గాను, న్యాయంగాను చూస్తాడు.
24 అందువల్లనే మనుష్యులు దేవుణ్ణి గౌరవిస్తారు.
    కానీ తెలివిగల వాళ్లం అనుకొనే గర్విష్ఠులను దేవుడు లక్ష్యపెట్టడు.”

మత్తయి 8:23-27

యేసుని శిష్యులు ఆయన శక్తిని చూడటం

(మార్కు 4:35-41; లూకా 8:22-25)

23 యేసు పడవనెక్కాడు. ఆయన శిష్యులు ఆయన్ని అనుసరించారు. 24 అకస్మాత్తుగా ఒక పెద్ద తుఫాను ఆ సరస్సు మీదికి రావటం వల్ల ఆ పడవ అలల్లో చిక్కుకు పోయింది. ఆసమయంలో యేసు నిద్రపోతూ ఉన్నాడు. 25 శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని నిద్రలేపుతూ, “ప్రభూ! రక్షించండి. మునిగిపోతున్నాము!” అని అన్నారు.

26 యేసు, “మీ విశ్వాసం ఏమైంది? ఎందుకు భయపడుతున్నారు?” అని అంటూ లేచి గాలిని, అలల్ని శాంతించమని ఆజ్ఞాపించాడు. అవి శాంతించాయి.

27 వాళ్ళు ఆశ్చర్యపడి, “ఈయనేలాంటి వాడు? గాలి, అలలు కూడా ఈయన మాట వింటున్నాయే!” అని అన్నారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International