Old/New Testament
94 యెహోవా, నీవు మనుష్యులను శిక్షించే దేవుడవు.
నీవు వచ్చి మనుష్యులకు శిక్ష తెచ్చే దేవుడవు.
2 నీవు భూలోకమంతటికీ న్యాయమూర్తివి.
గర్విష్ఠులకు రావలసిన శిక్షతో వారిని శిక్షించుము.
3 యెహోవా, దుర్మార్గులు ఎన్నాళ్లవరకు తమ సరదా అనుభవిస్తారు?
యెహోవా, ఇంకెన్నాళ్లు?
4 ఆ నేరస్థులు వారు చేసిన చెడు విషయాలను గూర్చి
ఇంకెన్నాళ్లు అతిశయిస్తారు?
5 యెహోవా, ఆ మనుష్యులు నీ ప్రజలను బాధించారు.
నీ ప్రజలు శ్రమపడునట్లు వారు చేసారు.
6 మా దేశంలో నివసించే విధవరాండ్రను, పరదేశస్థులను ఆ దుర్మార్గులు చంపుతారు.
తల్లిదండ్రులు లేని పిల్లలను వారు చంపుతారు.
7 వారు ఆ చెడు కార్యాలు చేయటం యెహోవా చూడటం లేదని వారు చెబతారు.
జరుగుతున్న విషయాలను ఇశ్రాయేలీయుల దేవుడు గ్రహించడం లేదని వారు చెబుతారు.
8 దుర్మార్గులారా, మీరు బుద్ధిలేనివారు.
మీరు మీ పాఠం ఇంకెప్పుడు నేర్చుకొంటారు?
దుర్మార్గులారా, మీరు అవివేకులు
మీరు గ్రహించుటకు ప్రయత్నం చేయాలి.
9 దేవుడు మన చెవులను చేశాడు.
కనుక తప్పని సరిగా ఆయనకు చెవులు ఉంటాయి. జరిగే విషయాలను ఆయన వినగలడు.
దేవుడు మన కళ్లను చేశాడు. కనుక తప్పనిసరిగా ఆయనకు కళ్లు ఉంటాయి.
జరుగుతున్న సంగతులను ఆయన చూడగలడు.
10 ఆ ప్రజలను దేవుడే క్రమశిక్షణలో ఉంచుతాడు.
ప్రజలు చేయవలసిన వాటిని దేవుడే వారికి నేర్పిస్తాడు.
11 ప్రజలు తలచే విషయాలు దేవునికి తెలుసు.
ప్రజలు గాలి వీచినట్లుగా ఉంటారని దేవునికి తెలుసు.
12 యెహోవా శిక్షించినవాడు సంతోషంగా ఉంటాడు.
సరియైన జీవిత విధానాన్ని దేవుడు అతనికి నేర్పిస్తాడు.
13 దేవా, ఆ మనిషికి కష్టాలు వచ్చినప్పుడు అతడు మౌనంగా ఉండుటకు నీవు సహాయం చేస్తావు.
దుర్మార్గులు వారి సమాధిలో పాతిపెట్టబడేంత వరకు అతడు నెమ్మదిగా ఉండుటకు నీవు అతనికి సహాయం చేస్తావు.
14 యెహోవా తన ప్రజలను విడిచిపెట్టడు.
సహాయం చేయకుండా ఆయన తన ప్రజలను విడిచిపెట్టడు.
15 న్యాయాన్ని తోడుకొని ధర్మం తిరిగి వస్తుంది.
అప్పుడు మనుష్యులు మంచివాళ్లుగా, నిజాయితీగల వాళ్లుగా ఉంటారు.
16 దుర్మార్గులకు విరోధంగా పోరాడుటకు ఏ మనిషి నాకు సహాయం చేయలేదు.
చెడు కార్యాలు చేసే వారికి విరోధంగా పోరాడుటకు నాతో ఎవ్వరూ నిలువలేదు.
17 యెహోవా నాకు సహాయం చేసి ఉండకపోతే
నేను వెంటనే మరణ నిశ్శబ్దంలో నివసించే వాడిని.
18 నేను పడిపోవుటకు సిద్ధంగా ఉన్నట్టు నాకు తెలుసు.
కాని యెహోవా తన అనుచరుని బలపరిచాడు.
19 నేను చాలా చింతించి తల్లడిల్లిపోయాను.
కాని యెహోవా, నీవు నన్ను ఆదరించి సంతోషింప చేశావు.
20 దేవా, వక్ర న్యాయవాదులకు నీవు సహాయం చేయవు.
ఆ చెడ్డ న్యాయవాదులు ప్రజల జీవితాలను దుర్భరం చేయటానికే న్నాయచట్టాన్ని ఉపయోగిస్తారు.
21 ఆ న్యాయమూర్తులు మంచి మనుష్యులపై పడుతున్నారు.
అమాయక ప్రజలు దోషులని చెప్పి వారిని చంపుతారు.
22 అయితే పర్వతం మీద ఎత్తయిన నా క్షేమ స్థానం యెహోవాయే.
నా దుర్గమైన దేవుడు నా క్షేమస్థానం.
23 ఆ దుర్మార్గపు న్యాయవాదులు చేసిన చెడు పనులకోసం దేవుడు వారిని శిక్షిస్తాడు.
వారు పాపం చేశారు గనుక దేవుడు వారిని నాశనం చేస్తాడు.
మన యెహోవా దేవుడు ఆ దుర్మార్గపు న్యాయవాదులను నాశనం చేస్తాడు.
95 రండి, మనం యెహోవాను స్తుతించుదాము.
మన రక్షణ కొండైన ప్రభువుకు సంతోషగానం చేద్దాము.
2 యెహోవాకు మనం కృతజ్ఞతా కీర్తనలు పాడుదాము.
సంతోష గీతాలు మనం ఆయనకు పాడుదాము.
3 ఎందుకంటే ఆయన మహా గొప్ప దేవుడు గనుక.
ఆయన యితర “దేవుళ్లందరినీ” పాలించే మహా రాజు.
4 లోతైన గుహలు, ఎత్తయిన పర్వతాలు యెహోవాకు చెందుతాయి.
5 మహా సముద్రమూ ఆయనదే. ఆయనే దాన్ని సృష్టించాడు.
దేవుడు తన స్వహస్తాలతో పొడినేలను చేశాడు.
6 రండి, మనం సాగిలపడి ఆయనను ఆరాధించుదాము.
మనలను సృష్టించిన దేవున్ని మనం స్తుతిద్దాము.
7 ఆయన మన దేవుడు,
మనం ఆయన ప్రజలము.
మనం ఆయన స్వరం వింటే నేడు మనం ఆయన గొర్రెలము.
8 దేవుడు చెబుతున్నాడు, “మెరీబా[a] దగ్గర మీరు ఉన్నట్టుగా
అరణ్యంలో మస్సా దగ్గర మీరు ఉన్నట్టుగా మొండిగా ఉండకండి.
9 మీ పూర్వీకులు నన్ను శోధించారు. వారు నన్ను పరీక్షించారు.
కాని అప్పుడు నేను ఏమి చేయగలిగానో వారు చూశారు.
10 ఆ ప్రజలతో 40 సంవత్సరాలు నేను సహనంగా ఉన్నాను.
వారు నమ్మకస్థులు కారని నాకు తెలుసు.
ఆ ప్రజలు నా ఉపదేశాలు అనుసరించటానికి నిరాకరించారు.
11 అందుచేత నాకు కోపం వచ్చి,
‘వారు నా విశ్రాంతి దేశంలో ప్రవేశించరు అని ప్రమాణం చేశాను.’”
96 యెహోవా చేసిన క్రొత్త కార్యాలను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడండి!
సర్వలోకం యెహోవాకు కీర్తనలు పాడును గాక!
2 యెహోవాకు కీర్తన పాడండి. ఆయన నామాన్ని స్తుతించండి.
శుభవార్త ప్రకటించండి. ఆయన ప్రతి రోజూ మనలను రక్షించుటను గూర్చి ప్రకటించండి.
3 దేవుడు నిజంగా ఆశ్చర్యకరుడని ఇతర ప్రజలతో చెప్పండి.
దేవుడు చేసే అద్భుత కార్యాలను గూర్చి అన్నిచోట్లా ప్రజలకు చెప్పండి.
4 యెహోవా గొప్పవాడు, స్తుతికి పాత్రుడు.
ఇతర “దేవుళ్లు” అందరికంటె ఆయన భీకరుడు.
5 ఇతర జనాల “దేవుళ్లంతా” కేవలం విగ్రహాలే.
కాని యెహోవా ఆకాశాలను సృష్టించాడు.
6 ఆయన యెదుట అందమైన మహిమ ప్రకాశిస్తూ ఉంటుంది.
దేవుని పవిత్ర ఆలయంలో బలం, సౌందర్యం ఉన్నాయి.
7 వంశములారా, రాజ్యములారా, యెహోవా మహిమకు
స్తుతి కీర్తనలు పాడండి.
8 యెహోవా నామాన్ని స్తుతించండి.
మీ కానుకలు తీసుకొని ఆలయానికి వెళ్లండి.
9 యెహోవా అందమైన ఆలయంలో ఆయనను ఆరాధించండి!
భూమి మీద ప్రతి మనిషి ఆయన ముందు వణకాలి.
10 యెహోవా రాజు అని జనాలకు ప్రకటించండి!
కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
యెహోవా తన ప్రజలను న్యాయంగా పరిపాలిస్తాడు.
11 ఆకాశములారా, సంతోషించండి! భూమీ, ఆనందించుము!
సముద్రమా, అందులోని సమస్తమా, సంతోషంతో ఘోషించుము!
12 పొలాల్లారా, వాటిలో పండే సమస్తమా సంతోషించండి!
అరణ్యంలో వృక్షాల్లారా, పాడుతూ సంతోషించండి.
13 యెహోవా వస్తున్నాడు గనుక సంతోషంగా ఉండండి.
ప్రపంచాన్ని పాలించుటకు[b] యెహోవా వస్తున్నాడు.
న్యాయంగా, ధర్మంగా ఆయన ప్రపంచాన్ని పాలిస్తాడు.
ఉద్దేశ్యం
14 సోదరులారా, మీలో మంచితనముందని, సంపూర్ణమైన జ్ఞానం మీలో ఉందని, పరస్పరం బోధించుకోగల సామర్థ్యం మీలో ఉందని నాకు నమ్మకం ఉంది. 15 అయినా నేను కొన్ని విషయాల్ని గురించి మీకు జ్ఞాపకం చెయ్యాలని వాటిని గురించి మీకు ధైర్యంగా వ్రాసాను. దేవుడిచ్చిన వరం వల్ల ఇది చెయ్యగలిగాను. ఆ వరము ఏదనగా 16 నేను యాజకునిగా పని చేస్తూ దైవసందేశాన్ని యూదులు కానివాళ్ళకు బోధించాలని దేవుడు నన్ను యేసు క్రీస్తుకు సేవకునిగా చేసాడు. ఇందువలన యూదులు కానివాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రం చేయబడి దేవునికి అంగీకారమైన సంతానం కాగలరు.
17 అందువల్ల, నేను యేసు క్రీస్తు ద్వారా దేవుని సేవ చేస్తున్నందుకు గర్విస్తున్నాను. 18 క్రీస్తు నా ద్వారా చేసినవాటిని గురించి మాత్రమే నేను ధైర్యంగా చెప్పుకుంటాను. యూదులు కానివాళ్ళు నేను చేసిన బోధనల ద్వారా, నా కార్యాల ద్వారా దైవసందేశాన్ని అనుసరించేటట్లు క్రీస్తు చేసాడు. 19 గుర్తుల ద్వారా, అద్భుతాల ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ పని సాధించాడు. అందుకే యెరూషలేము నుండి ఇల్లూరికు దాకా అన్ని ప్రాంతాలలో క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించగలిగాను. 20 క్రీస్తును గురించి తెలియని ప్రాంతాలలో సువార్తను ప్రకటించాలనే ఆశయం నాలో ఉంది. మరొకడు వేసిన పునాదిపై ఇల్లు కట్టటం నాకిష్టం లేదు. 21 అందుకే ఈ విధంగా వ్రాయబడి ఉంది:
“ఆయన్ని గురించి చెప్పబడినవాళ్ళు చూస్తారు.
కాని వాళ్ళు తెలుసుకొంటారు. ఆయన్ని గురించి విననివాళ్ళు అర్థం చేసుకొంటారు.”(A)
రోము నగరాన్ని దర్శించాలని ప్రయత్నం
22 మీ దగ్గరకు రావటానికి ఈ పరిస్థితుల కారణంగా నాకు ఎన్నో ఆటంకాలు కలిగాయి.
23 ఈ ప్రాంతంలో నేను చేయవలసిన పని ముగిసింది. అంతేకాక ఎన్నో సంవత్సరాల నుండి మిమ్ముల్ని కలుసుకోవాలనుకొంటున్నాను. 24 నేను స్పెయిను దేశానికి వెళ్ళేటప్పుడు రోము నగరానికి వచ్చి కొన్ని రోజులు మీతో ఆనందంగా గడపాలని ఆశిస్తున్నాను. అక్కడి నుండి నేను ప్రయాణం సాగించినప్పుడు మీరు నాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను.
25 కాని ప్రస్తుతం నేను యెరూషలేములోని దేవుని ప్రజలకు సహాయం చెయ్యటానికి అక్కడికి వెళ్తున్నాను. 26 ఎందుకంటే యెరూషలేములోని దేవుని ప్రజల్లో ఉన్న పేదవాళ్ళ కోసం మాసిదోనియ, అకయ ప్రాంతాలలోని సోదరులు చందా ఇవ్వటానికి ఆనందంగా అంగీకరించారు. 27 వాళ్ళు ఈ చందా ఆనందంగా ఇచ్చారు. వాళ్ళకు వీళ్ళు సహాయం చెయ్యటం సమంజసమే. ఎందుకంటే, యూదులు కానివాళ్ళు, యెరూషలేములోని దేవుని ప్రజలు ఆత్మీయ ఆశీర్వాదంలో భాగం పంచుకొన్నారు. కనుక తమకున్న వాటిని వీళ్ళు వాళ్ళతో పంచుకోవటం సమంజసమే. 28 ఈ కార్యాన్ని ముగించి వాళ్ళందరికీ చందా తప్పక ముట్టేటట్లు చూసి స్పెయిను దేశానికి వెళ్ళే ముందు మిమ్మల్ని చూడటానికి వస్తాను. 29 నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు క్రీస్తునుండి సంపూర్ణంగా ఆశీస్సులు పొంది వస్తానని నాకు తెలుసు.
30 సోదరులారా! మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేమ ద్వారా మిమ్మల్ని వేడుకొనేదేమిటంటే, నా కోసం దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థించండి. 31 యూదయ ప్రాంతంలోని విశ్వాసహీనులనుండి నేను రక్షింపబడాలని, యెరూషలేములోని దేవుని ప్రజలు నా సహాయాన్ని ఆనందంగా అంగీకరించాలని ప్రార్థించండి. 32 తదుపరి, నేను దేవుని చిత్తమైతే మీ దగ్గరకు ఆనందంగా వచ్చి మీతో సమయం గడుపుతాను. 33 శాంతి ప్రదాత అయినటువంటి దేవుడు మీ అందరికీ తోడుగా ఉండు గాక! ఆమేన్.
© 1997 Bible League International