Old/New Testament
యాజకుల నియమాలు
21 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 2 “యాజకులైన అహరోను కుమారులతో ఈ విషయాలు చెప్పు: అహరోను కుమారులు, యాజకులు. చనిపోయినవారి శవాల్ని తాకి యాజకుడు అపవిత్రుడు కాకూడదు. 3 అయితే చనిపోయిన వ్యక్తి గనుక తన రక్త సంబంధీకుడైతే. అప్పుడు అతడు ఆ శవాన్ని తాకవచ్చు. చనిపోయిన వ్యక్తి యాజకుని తల్లి లేక తండ్రి, కుమారుడు లేక కుమార్తె, సోదరుడు లేక అవివాహిత సోదరి అయితే యాజకుడు అపవిత్రం కావచ్చు. (ఈ సోదరికి భర్త లేడు గనుక ఆమె అతనికి చాలా దగ్గర అవుతుంది. కనుక ఆమె మరణిస్తే, ఆమెకోసం యాజకుడు మైల పడవచ్చు). 4 కానీ చనిపోయిన వ్యక్తి యాజకుని బానిసల్లో ఒక వ్యక్తి అయితే మాత్రం యాజకుడు మైలపడకూడదు.
5 “యాజకులు వారి తలలు గుండు గీసికోగూడదు. యాజకులు వారి గడ్డాల కొనలు కత్తిరించగూడదు. యాజకులు వారి దేహాల్లో ఎక్కడా కోసుకోగూడదు. 6 యాజకులు వారి దేవుని కోసం పవిత్రంగా ఉండాలి. దేవుని పేరంటే వారు భక్తి చూపించాలి. ఎందుచేతనంటే వారు నైవేద్యం, హోమం దేవునికి అర్పించువారు. కనుక వారు పవిత్రంగా ఉండాలి.
7 “యాజకుడు దేవుణ్ణి ప్రత్యేకంగా సేవించేవాడు. అందుచేత మరో మగవాడితో లైంగిక సంబంధం ఉన్న స్త్రీని యాజకుడు వివాహం చేసుకోగూడదు. వేశ్యనుగాని, విడువబడిన స్త్రీనిగాని యాజకుడు వివాహం చేసుకోగూడదు. 8 యాజకుడు ప్రత్యేక విధానంలో దేవుణ్ణి సేవించేవాడు. కనుక మీరు అతణ్ణి ప్రత్యేక విధానంలో చూసుకోవాలి. ఎందుచేతనంటే అతడు పవిత్ర వస్తువుల్ని మోసేవాడు, పవిత్ర రొట్టెల్ని అతడు దేవునికి తీసుకొనివస్తాడు గనుక. నేను పరిశుద్ధుడను. నేను యెహోవాను, మరియు నేను మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాను.
9 “ఒక యాజకుని కుమార్తె వేశ్య అయితే ఆమె తన పేరును నాశనం చేసికొంటుంది, తన తండ్రికి అవమానం కలిగిస్తుంది. కనుక ఆమెను కాల్చివేయాలి.
10 “ప్రధాన యాజకుడు తన సోదరుల్లోనుంచి ఎంపిక చేయబడినవాడు. అతని తలమీద అభిషేకతైలం పోయబడింది. ఈ విధంగా అతడు ప్రధాన యాజకునిగా ప్రత్యేక పనికి నియమించబడ్డాడు. ప్రత్యేక వస్త్రాలు ధరించేందుకు అతడు ఏర్పాటు చేయబడ్డాడు. కనుక అతడు తన విచారాన్ని బాహాటంగా చూపించే పనులు చేయకూడదు. అతడు తన తల వెంట్రుకలను చింపిరిజుట్టుగా పెరగ నివ్వకూడదు. అతడు తన బట్టలు చింపుకోగూడదు. 11 మృత దేహాన్ని తాకి అతడు అపవిత్రుడు కాకూడదు. అతని స్వంత తండ్రి, తల్లి చనిపోయినా సరే అతడు ఆ శవాన్ని తాకగూడదు. 12 ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలంనుండి బయటకు వెళ్లగూడదు. అతడు అలా గనుకచేస్తే, అతడు అపవిత్రుడై, తర్వాత దేవుని పరిశుద్ధ స్థలాన్ని అతడు అపవిత్రం చేయవచ్చు. ప్రధాన యాజకుని తలమీద ప్రత్యేక తైలం పోయబడింది. ఇదే అతణ్ణి మిగిలిన ప్రజలకంటే ప్రత్యేకం చేసింది. నేను పరిశుద్ధుడైన యెహోవాను.
13 “ప్రధాన యాజకుడు కన్యగా ఉన్న స్త్రీని వివాహం చేసుకోవాలి. 14 ఇదివరకే మరొకనితో లైంగిక సంబంధాలు కలిగి ఉన్న స్త్రీని ప్రధాన యాజకుడు వివాహం చేసుకోగూడదు. ఒక వేశ్యనుగాని, విడువబడిన స్త్రీనిగాని, లేక విధవరాలిని గాని ప్రధాన యాజకుడు వివాహం చేసుకోగూడదు. ప్రధాన యాజకుడు తన స్వంత ప్రజల్లోనే ఒక కన్యను వివాహం చేసుకోవాలి. 15 ఈ విధంగా ప్రజలు అతని పిల్లలకు మర్యాదనిస్తారు. ప్రధాన యాజకుణ్ణి అతని ప్రత్యేక పని నిమిత్తం యెహోవానగు నేనే ప్రత్యేకించాను.”
16 మోషేతో యెహోవా చెప్పాడు: 17 “అహరోనుతో చెప్పు: నీ సంతానంలోని పిల్లలు ఎవరైనాసరే ఏదైనా శారీరక లోపం గలవారైతే వారు దేవునికి ప్రత్యేక రొట్టెలు తీసుకొని వెళ్లకూడదు. 18 అంగవిహీనం ఉన్న ఏ మనిషికూడ యాజకునిగా నాకు సేవ చేయకూడదు, నాకు బలులు అర్పించకూడదు. ఎలాంటివారు యాజకులుగా నన్ను సేవించగూడదు అంటే: గుడ్డి వాళ్లు, కుంటివాళ్లు, పాడైపోయిన ముఖం ఉన్నవాళ్లు, చేతులుగాని కాళ్లుగాని విపరీతంగా పొడవు ఉన్నవాళ్లు, 19 కాలైనా, చేయైనా విరిగినవాళ్లు, 20 గూనివాళ్లు, మరుగుజ్జువాళ్లు, కంటిలో లోపాలు ఉన్నవాళ్లు, దురద లేక చర్మ వ్యాధి ఉన్నవాళ్లు, అణగగొట్టబడిన వృషణాలు ఉన్నవాళ్లు.
21 “అహరోను సంతానంలో ఎవరిలోనైనా ఏదోషమైనా ఉంటే అలాంటి వ్యక్తి యెహోవాకు హోమ అర్పణలు అర్పంచకూడదు. ఆ వ్యక్తి ప్రత్యేక రొట్టెల్ని కూడా దేవునికి తీసుకొని వెళ్ల కూడదు. 22 ఆ వ్యక్తి యాజక కుటుంబంలోని వాడు గనుక అతడు పవిత్ర రొట్టెల్ని తినవచ్చును. అతి పవిత్రమైన రొట్టెల్ని కూడా అతడు తినవచ్చును. 23 కానీ అతడు మాత్రం తెరలోపలి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్లకూడదు, బలిపీఠం దగ్గరకు గూడ అతడు వెళ్లగూడదు. ఎందుచేతనంటే అతనిలో ఏదో తప్పు ఉంది. అతడు నా పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రం చేయకూడదు. నేను యెహోవాను ఆ స్థలాల్ని పరిశుద్ధం చేస్తాను!”
24 కనుక అహరోనుతో, అతని కుమారులతో, ఇశ్రాయేలు ప్రజలందరితో మోషే ఈ సంగతులు చెప్పాడు.
22 యెహోవా దేవుడు మోషేతో ఇలా చెప్పాడు: 2 “అహరోనుతో, అతని కుమారులతో చెప్పు: ఇశ్రాయేలు ప్రజలు నాకు వస్తువులను అర్పిస్తారు. ఆ వస్తువులు పవిత్రం అవుతాయి. అవి నావి. అందుచేత యాజకులైన మీరు వాటిని తీసుకోగూడదు. పవిత్రమైన ఆ వస్తువుల్ని మీరు ఉపయోగిస్తే, నా పవిత్రనామం అంటే మీకు గౌరవం లేదని మీరు వ్యక్తం చేస్తారు. నేను యెహోవాను. 3 మీ సంతానమంతటిలో ఎవరైనా వాటిని తాకితే ఆ వ్యక్తి అపవిత్రం అవుతాడు. ఆ వ్యక్తి నానుండి వేరు చేయబడతాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ వస్తువుల్ని నాకు ఇచ్చారు. నేను యెహోవాను.
4 “అహరోను సంతానంలో ఎవరికైనా దారుణమైన చర్మవ్యాధి ఉంటే, లేక స్రావరోగం ఉంటే అతడు పవిత్రం అయ్యేంతవరకు పవిత్రభోజనం చేసేందుకు వీల్లేదు. అపవిత్రుడైన ఏ యాజకునికైనా ఆ నియమం వర్తిస్తుంది. అలాంటి యాజకుడు ఒక శవం మూలంగా కానీ, లేక తన ఇంద్రియం మూలంగా కానీ అపవిత్రుడు కావచ్చు. 5 అపవిత్రమైన, పాకే జంతువుల్లో దేన్ని తాకినా అతడు అపవిత్రుడు అవుతాడు. మరియు అపవిత్రమైన మరో మనిషిని తాకుట వల్ల అతడు అపవిత్రుడు అవుతాడు. దేని మూలంగా అతడు అపవిత్రమైనా సరే 6 ఒక వ్యక్తి వాటిలో దేనిని తాకినా అతడు సాయంత్రంవరకు అపవిత్రుడవుతాడు. ఆ వ్యక్తి పవిత్ర భోజనాన్ని తినకూడదు. అతడు నీళ్లతో స్నానము చేసినా సరే అతడు పవిత్ర భోజనం తినకూడదు. 7 సూర్యాస్తమయం తర్వాతనే అతడు పవిత్రుడవుతాడు. అప్పడు అతడు పవిత్ర భోజనం తినవచ్చును. ఎందుచేతనంటే ఆ భోజనం అతనికి చెందుతుంది గనుక.
8 “ఒక జంతువు దానంతట అదేచచ్చినా, లేక మరో జంతువుచే చంపబడినా, చచ్చిన ఆ జంతువును యాజకుడు తినకూడదు. ఆ వ్యక్తి ఆ జంతువును తింటే అతడు అపవిత్రుడవుతాడు. నేను యెహోవాను.
9 “యాజకులు నన్ను సేవించేందుకు నిర్ణీత సమయాలు ఉన్నాయి. ఆ సమయాల్లో వాళ్లు జాగ్రాత్తగా ఉండాలి. పవిత్రమైన వాటిని అపవిత్రం చేయకుండా వారు జాగ్రత్తగా ఉండాలి. వాళ్లు గనుక జాగ్రత్తగా ఉంటే వాళ్లు చావరు. నేనే యెహోవాను. వాళ్లను ఈ ప్రత్యేక పనికోసం ప్రత్యేకించాను. 10 యాజక కుటుంబంలోని వాళ్లు మాత్రమే పవిత్ర భోజనం తినవచ్చు. యాజకునితో ఉంటున్న అతిధి లేక యాజకుని కూలివాడు పవిత్ర భోజనం తినకూడదు. 11 అయితే యాజకుడు తన స్వంత డబ్బుతో ఒక వ్యక్తిని బానిసగా కొనివుంటే ఆ వ్యక్తి పవిత్రమైన వాటిలో కొంత తినవచ్చును. యాజకుని ఇంట పుట్టిన బానిసలు కూడ యాజకుని భోజనంలో కొంత తినవచ్చును. 12 యాజకుని కుమార్తె, యాజకుడు కాని వాణ్ణి వివాహం చేసుకోవచ్చు. ఆమె గనుక అలా చేస్తే, అప్పుడు ఆమె పవిత్ర అర్పణల్లోనివి ఏవీ తినకూడదు. 13 ఒక యాజకుని కుమార్తె విధవరాలు కావచ్చును, లేదా విడాకులు పొందవచ్చును. ఆమెను పోషించే పిల్లలు ఆమెకు లేని కారణంగా ఆమె బాల్యంలో నివసించిన తన తండ్రి ఇంటికి తిరిగి వేళ్తే, అప్పుడు ఆమె తన తండ్రి భోజనంలో కొంత తినవచ్చును. అయితే యాజక కుటుంబంలోని వారు మాత్రమే ఈ భోజనాన్ని తినవచ్చును.
14 “ఒక వ్యక్తి పవిత్ర భోజనంలో కొంత పోరబాటున తిన్నట్లయితే ఆ వ్యక్తి అంత పవిత్ర భోజనాన్ని యాజకునికి ఇచ్చివేయాలి. అయిదింట ఒకటి వంతున ఆ భోజనం ఖరీదు గూడ అతడు చెల్లించాలి.
15 “ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు కానుకలుయిస్తారు. ఆ కానుకలు పవిత్రం అవుతాయి. కనుక ఆ పవిత్ర వస్తువుల్ని యాజకుడు అపవిత్రం చేయకూడదు. 16 ఒక వేళ యాజకులు గనుక ఆ వస్తువులు పవిత్రం కావు అన్నట్టు వాటిని చూస్తే, పవిత్ర భోజనం తిన్నప్పుడు వారు వారి పాపాన్ని అధికం చేసుకొన్న వాళ్లవుతారు. యెహోవాను నేనే వాటిని పవిత్రం చేస్తాను!”
17 యెహోవా దేవుడు మోషేతో ఇలా చెప్పాడు: 18 “అహరోను, అతని కుమారులు, ఇశ్రాయేలు ప్రజలు అందరితో ఇలా చెప్పు: ఒకవేళ ఒక ఇశ్రాయేలు పౌరుడు, లేక ఒక విదేశీయుడు ఒక అర్పణ తీసుకొని రావాలను కొంటాడు. ఒకవేళ అది ఆ వ్యక్తి చేసుకొన్న ఏదో ఒక ప్రత్యేక వాగ్దానంగా కావచ్చు లేక ఒకవేళ ఆ వ్యక్తి ఇవ్వాలనుకొన్న ఒక ప్రత్యేక బలి కావచ్చు. 19-20 ఆ ప్రజలు నిజంగా దేవునికి కానుకలు ఇవ్వాలని కోరుకొన్నందుచేత వారు తెచ్చే కానుకలు అవి. దోష భూయిష్టమైన ఏ అర్పణా నీవు అంగీకరించగూడదు. అలాంటి అర్పణవల్ల నాకు సంతోషం కలుగదు. కనుక ఒక కోడెదూడ, గొర్రె, మేక అయితే అది మగదైఉండాలి. ఆపైన దానిలో ఏ దోషమూ ఉండకూడదు.
21 “ఒక వ్యక్తి సమాధాన బలి యెహోవాకు తీసుకొని రావచ్చును. ఆ సమాధాన బలి ఆ వ్యక్తి చేసుకొన్న ఏదో ప్రత్యేక వాగ్దానానికి చెల్లింపు కావచ్చును. లేక అది ఆ వ్యక్తి యెహోవాకు అర్పించాలనుకొన్న ఒక ప్రత్యేక కానుక కావచ్చును. అది ఇక కోడెదూడ కావచ్చును లేక గొర్రె కావచ్చును. కానీ అది ఆరోగ్యంగా ఉండాలి. ఆ జంతువులో ఏ దోషమూ ఉండకూడదు. 22 గుడ్డిది, ఎముకలు విరిగింది, కుంటిది లేక స్రావరోగం ఉన్నది, లేక దారుణమైన చర్మవ్యాధి ఉన్నది, ఏ జంతువును మీరు యెహోవాకు అర్పించకూడదు. యెహోవా బలిపీఠపు అగ్నిమీద రోగగ్రస్థమైన జంతువులను మీరు అర్పించకూడదు.
23 “కొన్నిసార్లు ఒక కాలు మరీ పొడవుగానో లేక సరిగ్గా పెరగని ఒక పాదమో ఉన్న ఒక కోడెదూడగాని గొర్రెగాని ఉండవచ్చు. ఒకవేళ ఒక వ్యక్తి అలాంటి జంతువును యెహోవాకు ప్రత్యేక కానుకగా అర్పించాలనుకొంటే, అది అంగీకారం అవుతుంది. అయితే ఆ వ్యక్తి చేసిన ప్రత్యేక వాగ్దానానికి చెల్లింపుగా మాత్రం అది అంగీకరించబడదు.
24 “ఒక జంతువుకు గాయపడ్డ, లేక అణగగొట్టబడిన లేక చినిగిన వృషణాలు ఉంటే అలాంటి జంతువును మీరు యెహోవాకు అర్పించకూడదు.
25 “విదేశీయుల దగ్గర్నుండి జంతువుల్ని యెహోవాకు బలిగా మీరు తీసుకోగూడదు. ఎందుచేతనంటే ఆ జంతువులు ఏ విధంగానైనా దెబ్బతిన్నాయేమో, లేదా వాటిలో ఏదైనా లోపం ఉండొచ్చు అందుచేత అవి అంగీకరించబడవు!”
26 మోషేతో యెహోవా చెప్పాడు: 27 “ఒక కోడెదూడ, లేక ఒక గొర్రె, లేక ఒక మేక పుట్టినప్పుడు ఏడు రోజులు అది తన తల్లితో ఉండాలి, అప్పుడు ఎనిమిదో రోజునగాని ఆ తర్వాతగాని యెహోవాకు హోమంగా అర్పించే బలిగా అది అంగీకరించ బడుతుంది. 28 కానీ ఆ జంతువును, దాని తల్లిని ఒకే రోజున మీరు చంపకూడదు. పశువులకు, గొర్రెలకు యిదే నియమం వర్తిస్తుంది.
29 “ఏదైనా ప్రత్యేక కృతజ్ఞత అర్పణ మీరు యెహోవాకు అర్పించాలని కోరితే, మీరు స్వేచ్ఛగా ఆ కానుకను అర్పించవచ్చును. అయితే అది దేవుణ్ణి సంతోషపెట్టే విధానంలో మీరు చేయాలి. 30 మొత్తం జంతువును ఆ రోజే మీరు తినాలి. దాని మాంసంలో ఏమీ మర్నాటి ఉదయానికి మీరు మిగల్చకూడదు. నేను యెహోవాను.
31 “నా ఆజ్ఞలను జ్ఞాపకం ఉంచుకోండి. వాటికి విధేయులవ్వండి. నేను యెహోవాను. 32 నా పవిత్ర నామానికి గౌరవం చూపించండి. ఇశ్రాయేలు ప్రజలకు నేను ఎంతో ప్రత్యేకంగా ఉండాలి. నేను, యెహోవాను, మిమ్మల్ని నా ప్రత్యేక ప్రజలుగా చేసుకొన్నాను. 33 నేనే మిమ్మల్ని ఈజిప్టునుండి తీసుకొని వచ్చాను. నేను మీకు దేవుణ్ణి అయ్యాను. నేను యెహోవాను!”
యేసు బ్రతికి రావటం
(మార్కు 16:1-8; లూకా 24:1-12; యోహాను 20:1-10)
28 విశ్రాంతి రోజు గడిచింది. ఆదివారం సూర్యోదయమవుతుండగా మగ్దలేనే మరియ, యింకొక మరియ సమాధిని చూడటానికి వెళ్ళారు.
2 అప్పుడు ఒక భూకంపం వచ్చింది. పరలోకం నుండి ప్రభువు దూత వచ్చి ఆ సమాధి దగ్గరకు వెళ్ళాడు. ఆ రాతిని దొర్లించి దాని మీద కూర్చొన్నాడు. 3 ఆ రూపం మెరుపులా ఉంది. అతని దుస్తులు మంచువలె తెల్లగా ఉన్నాయి. 4 సమాధిని కాపలా కాస్తున్న భటులు అతన్ని చూసి భయపడి వణికిపోయి, చనిపోయిన వాళ్ళలా అయ్యారు.
5 ఆ దేవదూత, స్త్రీలతో ఈ విధంగా అన్నాడు: “భయపడకండి, సిలువకు వేయబడిన యేసు కోసం మీరు చూస్తున్నారని నాకు తెలుసు. 6 ఆయనిక్కడ లేడు. ఆయన తాను చెప్పినట్లు బ్రతికి వచ్చాడు. ఆయన్ని పడుకోబెట్టిన స్థలాన్ని చూడండి. 7 ఆ తదుపరి వెంటేనే వెళ్ళి ఆయన శిష్యులతో, ‘ఆయన బ్రతికి వచ్చాడు. మీకన్నా ముందే గలిలయకు వెళ్ళబోతున్నాడు. మీరు ఆయన్ని అక్కడ కలుసుకొంటారు’ అని చెప్పండి. నేను చెప్పవలసింది చెప్పాను.”
8 ఆ స్త్రీలు ఆయన శిష్యులకు చెప్పాలని సమాధి దగ్గరనుండి భయంతో, ఆనందంతో పరుగెత్తికొంటూ వెళ్ళారు. 9 యేసు వాళ్ళను కలుసుకొని, “శుభం!” అని అన్నాడు. వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళపైబడి ఆయనకు మ్రొక్కారు. 10 అప్పుడు యేసు వాళ్ళతో, “భయపడకండి. వెళ్ళి నా సోదరులతో గలిలయకు వెళ్ళమని చెప్పండి. వాళ్ళు అక్కడ నన్ను కలుసుకొంటారు” అని అన్నాడు.
ప్రధాన యాజకులు భటుల్నిఅబద్దమాడమని కోరటం
11 ఆ స్త్రీలు వెళ్ళిపొయ్యారు. అదే సమయంలో కొంతమంది భటులు పట్టణంలోకి వెళ్ళి జరిగినదంతా ప్రధాన యాజకులతో చెప్పారు. 12 ప్రధాన యాజకులు పెద్దల్ని కలుసుకొని ఒక కుట్ర పన్నారు. వాళ్ళు భటులకు పెద్ద మొత్తాలిస్తూ వాళ్ళతో, 13 “అతని శిష్యులు, ‘మేము రాత్రి వేళ నిద్రిస్తుండగా వచ్చి అతని దేహాన్ని దొంగిలించుకు పొయ్యారు’ అని చెప్పండి. 14 ఈ వార్త రాష్ట్రపాలుకునిదాకా వెళ్తే అతణ్ణి శాంత పరచి మీకు కష్టం కలుగకుండా మేము చూస్తాము” అని అన్నారు. 15 భటులు డబ్బు తీసుకొని వాళ్ళు చెప్పినట్లు చేసారు. ఈ కథ బాగా వ్యాపించి ఈ నాటికి వాడుకలో ఉంది.
యేసు తన శిష్యులతో మాట్లాడటం
(మార్కు 16:14-18; లూకా 24:36-49; యోహాను 20:19-23; అపొ. కా. 1:6-8)
16 ఆ తర్వాత ఆ పదకొండుగురు శిష్యులు గలిలయకు వెళ్ళి, యేసు చెప్పిన కొండ మీదికి వెళ్ళారు. 17 అక్కడ యేసును చూసి ఆయన ముందు సాష్టాంగ పడ్డారు. కాని వాళ్ళలో కొందరు సందేహించారు 18 అప్పుడు యేసు వాళ్ళ దగ్గరకు వచ్చి, “పరలోకంలో, భూమ్మీదా ఉన్న అధికారమంతా దేవుడు నాకిచ్చాడు. 19 అందువల్ల అన్ని దేశాలకు వెళ్ళి, వాళ్ళను శిష్యులుగా చెయ్యండి. తండ్రి పేరిట, కుమారుని పేరిట, పవిత్రాత్మ పేరిట వాళ్ళకు బాప్తిస్మము యివ్వండి. 20 నేను మీకాజ్ఞాపించిన వన్నీ వాళ్ళను ఆచరించమని బోధించండి. నేను అన్ని వేళలా ఈ యుగాంతం దాకా మీ వెంట ఉంటాను” అని అన్నాడు.
© 1997 Bible League International