Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
హోషేయ 12-14

యెహోవా ఇశ్రాయేలుకు విరోధి

12 “ఎఫ్రాయిమువాళ్లు తమ కాలాన్ని వృథా చేస్తున్నారు, ఇశ్రాయేలీయులు రోజంతా ‘గాలిని తరుముతున్నారు.’ వాళ్లు అంతకంతకు ఎక్కువగా అబద్ధాలాడుతున్నారు, వారు అంతకంతకు ఎక్కువగా దొంగతనాలు చేస్తున్నారు. వాళ్లు అష్షూరుతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాళ్లు తమ ఒలీవ నూనెను ఈజిప్టుకి తరలిస్తున్నారు.”

యెహోవా ఇలా అంటున్నాడు: “నేను ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా వాదించాను. అతను చేసిన పనులకుగాను యాకోబును శిక్షించి తీరాలి. అతను చేసిన వాటినిబట్టి అతన్ని శిక్షించాలి. యాకోబు ఇంకా తన తల్లి కడుపులో ఉండగానే తన సోదరుణ్ణి మోసగించ నారంభించాడు. యాకోబు బలిష్ఠుడైన యువకుడు. అప్పట్లో అతను దేవునితో పోరాడాడు. యాకోబు దేవుని దూతతో పోరాడి గెలిచాడు. అతను విలపించి దేవుణ్ణి ఒక సహాయం చేయమని అడిగాడు. ఇది బేతేలులో జరిగిన సంఘటన. అక్కడే ఆయన మనతో మాట్లాడాడు. ఔను, యెహోవాయే సర్వసేనాధిపతియైన దేవుడు. ఆయన పేరు యెహోవా (ప్రభువు). అందుకని, మీరు మీ దేవుని వద్దకు తిరిగి రండి. ఆయనకు విధేయులుగా ఉండండి. దయగలవారిగా నీతిమంతులుగా ఉండండి. సదా మీ దేవుని నమ్మండి.

“యాకోబు ఒక వ్యాపారస్థుడు. అతను తన మిత్రుణ్ణి కూడా మోసగిస్తాడు. అతని తక్కెడలు[a] కూడా సరైనవి కావు. ఎఫ్రాయిము ఇలా అనుకున్నాడు: ‘నేను ఐశ్వర్యవంతుణ్ణి! నాకు ధనరాశులు దొరికాయి. నా నేరాల సంగతి ఎవడూ తెలుసుకోడు. నా పాపాల గురించి ఎవడూ తెలుసుకోడు.’

“మీరు ఈజిప్టు దేశంలో ఉన్ననాటినుంచి యెహోవానైన నేనే మీకు దేవుణ్ణి. గుడార సమావేశ[b] కాలంలో మాదిరిగా నేను మిమ్మల్ని గుడారాల్లో నివసింపజేస్తాను. 10 నేను ప్రవక్తలతో మాట్లాడాను. నేను వాళ్లకి అనేక దర్శనాలు ఇచ్చాను. నేను పద్ధతులను సూచించాను. 11 కాని, గిల్గాదు ప్రజలు పాపులు. అక్కడ అనేక క్షుద్ర దేవతా విగ్రహాలు ఉన్నాయి. అక్కడి ప్రజలు గిల్గాలువద్ద ఎడ్లను బలులుగా ఇస్తారు. వాళ్లకి బలిపీఠాలు అనేకం ఉన్నాయి. దున్నిన పొలంలో బురద చాళ్లు ఉన్నట్లే వాళ్లకి బారులు బారులుగా బలిపీఠాలు ఉన్నాయి.

12 “యాకోబు అరాము దేశంలోకి పారిపోయాడు. అక్కడ, ఇశ్రాయేలు ఒక భార్యకోసం శ్రమపడ్డాడు. మరో భార్యకోసం గొఱ్ఱెల్ని మేపాడు. 13 కాని, యెహోవా ఒక ప్రవక్త ద్వారా ఇశ్రాయేలును ఈజిప్టునుంచి వెనక్కి రప్పించాడు. యెహోవా ఒక ప్రవక్తద్వారా ఇశ్రాయేలును భద్రంగా కాపాడాడు. 14 కాని, ఎఫ్రాయిము యెహోవాకి మిక్కిలి కోపం కలిగించాడు. ఎఫ్రాయిము చాలామందిని హతమార్చాడు. అందుకని, అతను తన నేరాలకుగాను శిక్షింపబడతాడు. అతని ప్రభువు అతన్ని తన సిగ్గును సహించేటట్లుగా చేశాడు.”

ఇశ్రాయేలు తనని తాను నాశనం చేసుకొనుట

13 ఇశ్రాయేలులో ఎఫ్రాయిము చాలా ప్రాముఖ్యం సంపాదించుకున్నాడు. ఎఫ్రాయిము మాట్లడితే చాలు, ప్రజలు భయంతో కంపించి పోయేవారు. కాని ఎఫ్రాయిము పాపకార్యాలు చేశాడు. అతను బయలు దేవతని ఆరాధించాడు. ఇప్పుడిక ఇశ్రాయేలీయులు నానాటికీ ఎక్కువగా పాపంచేస్తారు. వాళ్లు తమకోసం తాము విగ్రహాలను చేసుకుంటారు. పనివాళ్లు వెండితో ఆ విగ్రహాలను చేస్తారు. అప్పుడిక ఇశ్రాయేలీయులు తమ ఆ విగ్రహాలతో మాట్లాడతారు. వాళ్లు ఆ విగ్రహాలకు బలులు సమర్పిస్తారు. వాళ్లు ఆ బంగారు దూడలను ముద్దు పెట్టుకొంటారు. అందుకే వాళ్లు త్వరలోనే ప్రాతః కాలపు పొగమంచులా అదృశ్యమవుతారు. ఆ పొగమంచు నేలపై పడుతుంది. కాని అది త్వరలోనే ఆవిరై పోతుంది. ఇశ్రాయేలీయులు కళ్లంలో ధాన్యం తూర్పార పోసేటప్పుడు గాలికి ఎగిరిపోయే పొట్టులాంటి వాళ్లు. ఇశ్రాయేలీయులు పొగగొట్టంలోనుంచి వెలువడి, గాలిలో కలిసిపోయే పొగలాంటివాళ్లు.

“మీరు ఈజిప్టులో ఉన్ననాటినుంచీ యెహోవానైన నేనే మీ దేవుణ్ణి. నన్ను తప్ప మరో దేవుడెవరినీ మీరు ఎరుగరు. మిమ్మల్ని రక్షించింది నేనే. మీరు ఎడారిలో ఉన్నప్పుడూ, మెట్ట ప్రాంతంలో ఉన్నప్పుడూ కూడా మీరు నాకు తెలుసు. ఇశ్రాయేలీయులకు నేను ఆహారమిచ్చాను. వాళ్లా ఆహారం తిన్నారు. వాళ్లు కడుపులు నింపుకుని తృప్తిచెందారు. వాళ్లు గర్విష్ఠులై నన్ను మరచారు!

“అందుకే నేను వాళ్ల పాలిటికి సింహంలాగ ఉంటాను. దారిప్రక్కన పొంచివున్న చిరుతపులిలాగా ఉంటాను. తన కూనల్ని కోల్పోయిన ఎలుగుబంటిలాగ నేను వాళ్లపైన దాడిచేస్తాను. నేను వాళ్ల రొమ్ములు చీలుస్తాను. తన కెదురైన జంతువును చీల్చి తినేసే ఒక క్రూర మృగంలాగ ఉంటాను”

దేవుని కోపంనుంచి ఇశ్రాయేలు కాపాడబడలేకపోవుట

“ఇశ్రాయేలూ, నేను నీకు సహాయం చేశాను. కానీ, నాకు నీవు ఎదురు తిరిగావు. అందుకు, నిన్ను నేనిప్పుడు నాశనం చేస్తాను. 10 నీ రాజు ఎక్కడున్నాడు? నీ నగరాలన్నింటిలోనూ అతను నిన్ను రక్షించలేడు! నీ న్యాయాధిపతులు ఎక్కడ? నీవొకప్పుడు ‘నాకొక రాజునీ, కొందరు నాయకుల్నీ ఇవ్వండి’ అని అడిగావు. 11 నాకు కోపం వచ్చి, నేను నీకొక రాజును ఇచ్చాను. నా కోపం మితిమీరినప్పుడు నేనా రాజుని వెనక్కి తీసేసుకున్నాను.

12 “ఎఫ్రాయిము తన దోషాన్ని కప్పుకొన ప్రయత్నించాడు.
    తన పాపాలు గుప్తంగా ఉన్నాయనుకున్నాడు.
    (కాని, అతను శిక్షంపబడతాడు.)
13 అతని శిక్ష ఎలా ఉంటుందంటే, స్త్రీ ప్రసవ బాధలా ఉంటుంది.
    అతను వివేకి అయిన పుత్రుడుగా ఉండడు.
అతని పుట్టుకకు సమయం ఆసన్నమవుతుంది,
    కాని అతను బతికి బయటపడడు.

14 “నేను వాళ్లనా సమాధినుంచి కాపాడుతాను!
    నేను వాళ్లని మృత్యుముఖంనుంచి కాపాడుతాను!
మరణమా, నీ వ్యాధులు ఎక్కడున్నాయి?
    సమాధీ, నీ శక్తి ఎక్కడ?
    నేను పగ సాధించాలని చూడటం లేదు!
15 ఇశ్రాయేలు తన సోదరుల మధ్య పెరుగుతాడు.
    కాని, శక్తివంతమైన తూర్పుగాలి వీస్తుంది. యెహోవా గాలి ఎడారినుంచి వస్తుంది.
అప్పుడు (ఇశ్రాయేలు) బావి ఎండిపోతుంది.
    అతని నీటి బుగ్గ ఇంకిపోతుంది.
    (ఇశ్రాయేలు) సంపదలో విలువైన వాటన్నింటినీ గాలి ఎగరేసుకుపోతుంది.
16 షోమ్రోను శిక్షింపబడాలి.
    ఎందుకంటే, అది తన దేవునికి వ్యతిరేకి అయింది.
ఇశ్రాయేలీయులు కత్తులతో చంపబడతారు.
    వాళ్ల పిల్లలు తునాతునకలు చేయబడతారు.
    వాళ్ల గర్భిణీస్త్రీల కడుపులు చీల్చబడతాయి.”

యెహోవా వద్దకు తిరిగివచ్చుట

14 ఇశ్రాయేలూ, నీవు పడిపోయి దేవునికి విరోధముగా పాపము చేశావు. కాబట్టి నీ దేవుడైన యెహోవా వద్దకు తిరిగిరా. నీవు చెప్పబోయే విషయాల గురించి ఆలోచించుము. యెహోవా వద్దకు తిరిగిరా. ఆయనతో ఇలా చెప్పు,

“మా పాపాన్ని తీసివేయి.
    మా మంచి పనులను అంగీకరించు.
    మా పెదవులనుండి స్తుతిని సమర్పిస్తాము.
అష్షూరు మమ్మల్ని కాపాడదు.
    మేమిక యుద్ధగుర్రాలపైన స్వారీ చేయము.
మేము మా స్వహస్తాలతో చేసిన విగ్రహాలను
    ఇంకెప్పుడూ మరల ‘ఇది మా దేవుడు’ అని అనము.
ఎందుకంటే, అనాధుల పట్ల
    జాలి చూపేది నువ్వొక్కడివే.”

యెహోవా ఇశ్రాయేలును క్షమించుట

అందుకు యెహోవా ఇలా అంటాడు:
“నా కోపం చల్లారింది, కనుక,
    నన్ను వీడి పోయినందుకు నేను వాళ్లని క్షమిస్తాను.
    నేను వాళ్లని ధారాళంగా ప్రేమిస్తాను.
నేను ఇశ్రాయేలీయులకు మంచువలె వుంటాను.
    ఇశ్రాయేలు తామర పుష్పంలాగ వికసిస్తాడు.
    అతడు లెబానోను దేవదారు వృక్షంలాగా వేరుతన్ని దృఢంగా నిలుస్తాడు.
అతని శాఖలు విస్తరిస్తాయి,
    అతను అందమైన దేవదారు వృక్షంలాగ ఉంటాడు.
అతను లెబానోనులోని దేవదారు చెట్లు
    వెలువరించే సువాసనలాగ ఉంటాడు.
ఇశ్రాయేలీయులు మరల నా పరిరక్షణలో జీవిస్తారు.
    గోధుమ కంకుల్లాగ పెరుగుతారు.
ద్రాక్షా తీగల్లాగ పుష్పించి ఫలిస్తారు.
    వారు లెబానోను ద్రాక్షారసంవలె ఉంటారు.”

విగ్రహాల విషయంలో ఇశ్రాయేలుకు యెహోవా హెచ్చరిక

“ఎఫ్రాయిమూ, విగ్రహాలతో ఇక నీకెంత మాత్రమూ పనిలేదు.
    నీ ప్రార్థనలు ఆలకించేది నేనే. నిన్ను కాపాడేది నేనే.
నిరంతరం పచ్చగానుండే
    మీ ఫలము నానుండి వస్తుంది.”

చివరి సలహా

వివేకవంతుడు ఈ విషయాలు గ్రహిస్తాడు.
    చురుకైనవాడు ఈ విషయాలు నేర్చుకోవాలి.
యెహోవా మార్గాలు సరైనవి.
    మంచివాళ్లు వాటిద్వారా జీవిస్తారు.
    పాపులు వాళ్లకు వాళ్లే చనిపోతారు.

ప్రకటన 4

యోహాను పరలోకాన్ని చూడటం

ఇది జరిగిన తర్వాత నేను కళ్ళెత్తి చూశాను. పరలోకంలో ఒక ద్వారం కనిపించింది. ఆ ద్వారము తెరుచుకొని ఉంది. బూర ఊదినట్లు యింతకు ముందు మాట్లాడిన స్వరం నాకు మళ్ళీ వినిపించింది. అది నాతో, “ఇలా మీదికి రా; దీని తర్వాత ఏమి జరుగుతుందో నీకు చూపిస్తాను” అని అంది. నేను వెంటనే పరిశుద్ధాత్మ ఆధీనమయ్యాను. పరలోకంలో ఉన్న సింహాసనం నాముందు కనిపించింది. దాని మీద ఎవరో కూర్చొని ఉన్నారు. దాని మీద కూర్చున్నవాడు సూర్యకాంతమణివలె, పద్మరాగమువలె వున్నాడు. ఆ సింహాసనం చుట్టూ మరకతమును పోలిన ఆకాశ ధనుస్సు ప్రకాశిస్తూ ఉంది.

దాని చుట్టూ యిరవై నాలుగు యితర సింహాసనాలు ఉన్నాయి. వాటి మీద యిరవై నాలుగు మంది పెద్దలు కూర్చొని ఉన్నారు. వాళ్ళు తెల్లని దుస్తులు ధరించి ఉన్నారు. వాళ్ళ తలలపై బంగారు కిరీటాలు ఉన్నాయి. సింహాసనం నుండి మెరుపులువచ్చాయి. పెద్ద గర్జనలు ఉరుములు దాన్నుండి వినిపించాయి. ఆ సింహాసనం ముందు ఏడు దీపాలు దివ్యంగా వెలుగుతూ ఉన్నాయి. ఇవి దేవుని ఏడు ఆత్మలు. గాజుతో కప్పిన సముద్రంలా కనిపించే ఒక గాజు సముద్రం ఆ సింహాసనం ముందు కనిపించింది. అది స్ఫటికంలా నిర్మలంగా ఉంది.

సింహాసనం మధ్య, చుట్టూ, అంటే ముందు, వెనుక నాలుగు ప్రాణులు ఉన్నాయి. వాటి దేహాలు ముందు, వెనుక కళ్ళతో కప్పబడి ఉన్నాయి. మొదటి ప్రాణి ఒక సింహంలా, రెండవది ఒక ఎద్దులా, మూడవది ఒక మనిషి ముఖంలా, నాలుగవది ఎగిరే పెద్ద పక్షిలా ఉన్నాయి.[a] ప్రతి ప్రాణికి ఆరు రెక్కలు ఉన్నాయి. వాటి శరీరాలపైన, క్రింద కళ్ళతో పూర్తిగా కప్పబడి ఉన్నాయి. రెక్కల క్రింద కళ్ళతో కప్పబడి ఉన్నాయి. రాత్రింబవళ్ళు అవి విడువక:

“భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నవాడు, సర్వశక్తి సంపన్నుడును
    ప్రభువునైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు”

అని పాడుతూ ఉన్నాయి.

సింహాసనంపై కూర్చొన్నవానికి, చిరకాలం జీవించేవానికి, మహిమ, గౌరవము కలగాలని అంటూ ఈ ప్రాణులు తమ కృతజ్ఞతలు తెలుపుతూ పాడాయి. 10 అవి ఆ విధంగా పాడినప్పుడు ఆ యిరవై నాలుగు మంది పెద్దలు ఆ సింహాసనంపై కూర్చొన్నవానిముందు సాష్టాంగపడి చిరకాలం జీవించే ఆయన్ని స్తుతించారు. తమ కిరీటాల్ని సింహాసనం ముందువేసి,

11 “మా ప్రభూ! దైవమా!
నీవు తేజమును, గౌరవమును, శక్తిని పొందతగిన యోగ్యుడవు,
    నీవు అన్నిటినీ సృష్టించావు.
అవి నీ యిష్టానుసారం సృష్టింపబడి జీవాన్ని పొందాయి”

అని అన్నారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International