Old/New Testament
బలిపీఠ పునర్నిర్మాణం
3 అలా ఏడవ నెల[a] నాటికి ఇశ్రాయేలీయులు తమ తమ సొంత పట్టణాలకు చేరుకున్నారు. అప్పుడు వాళ్లందరూ యెరూషలేములో గుమికూడి ఒక ప్రజగా సమైక్యమయ్యారు. 2 యెజాదా కొడుకైన యేషూవ, అతనితో వున్న యాజకులూ, షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు, అతని సహచరులు ఇశ్రాయేలు దేవునికి బలిపీఠం నిర్మించారు. ఇశ్రాయేలీయులు తాము బలులు సమర్పించ గలిగేందుకు వీలుగా ఆ బలిపీఠాన్ని నిర్మించారు. సరిగ్గా మోషే ధర్మశాస్త్రంలో పేర్కొనబడినట్లు వాళ్లు ఆ బలిపీఠాన్ని నిర్మించారు. మోషే యెహోవాకు ప్రత్యేక సేవకుడు.
3 తమకు సమీపంలో నివసిస్తున్న ఇతర ప్రజలంటే వాళ్లు భయపడ్డారు. అయినా, వాళ్లు ఆగకుండా, పాత పునాది మీదనే బలీపీఠాన్ని నిర్మించి, ఉదయంపూట, సాయంత్రంపూటాదహనబలులు సమర్పిస్తూ వచ్చారు. 4 సరిగ్గా మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లు వాళ్లు పర్ణశాలల పండుగ చేసుకున్నారు. ఆ పండుగ రోజులు పొడుగునా ప్రతిరోజూ సరైన సంఖ్యలో దహన బలులు సమర్పించారు. 5 అటు తర్వాత, ప్రతి రోజూ నిరంతర దహనబలులు, అమావాస్య రోజున జరిగే బలులు, మరి ఇతర పండుగల రోజులకూ, శెలవు రోజులకూ, స్వేచ్ఛార్ఫణలను యెహోవా ఆజ్ఞ ప్రకారం అర్పించారు. జనం కూడా యెహోవాకు తాము ఇవ్వాలనుకున్న కానుకలు ఇవ్వనారంభించారు. 6 ఈ విధంగా, ఏడవ నెల మొదటి రోజున, ఆ ఇశ్రాయేలీయులు యెహోవాకు తిరిగి దహనబలులు ఇవ్వనారంభించారు. దేవాలయం అప్పటికి ఇంకా తిరిగి నిర్మించబడకపోయినా కూడా ఈ బలి అర్పణ సాగింది.
దేవాలయ పునర్నిర్మాణం
7 చెరనుంచి విముక్తులై తిరిగి వచ్చిన వాళ్లు రాళ్లు చెక్కేవాళ్లకు, వడ్రంగులకు డబ్బులిచ్చారు. వాళ్లు తూరు, సీదోను ప్రజలకు ఆహారాన్ని, ద్రాక్షారసాన్ని ఒలీవనూనెను, లెబానోను నుండి దేవదారు చెట్ల కలపను తెచ్చేందుకు ఇచ్చారు. సోలొమోను మొదటిగా దేవాలయం నిర్మించినప్పుడు తెప్పించి నట్లే, వాళ్లు కూడా ఈ దేవదారు చెట్ల కలపను ఓడల్లో సముద్రతీర పట్టణమైన యొప్పేకు తెప్పించాలనుకున్నారు. పారశీక రాజు కోరెషు ఇందుకు వారికి అనుమతినిచ్చాడు.
8 యెరూషలేములోని దేవాలయం దగ్గరకు వాళ్లు చేరుకున్నమీదట రెండవ ఏడాది రెండవ నెలలో[b] షయల్తీయేలు కొడుకైన జెరుబ్బాబెలూ, యెజాదా కొడుకైన యేషూవ పని ప్రారంభించారు. వాళ్ల సోదరులు, యాజకులు, లేవీయులు, నిర్బంధంనుంచి యెరూషలేముకు తిరిగి వచ్చిన వాళ్లందరూ వాళ్లతో కలిసి పనిచేయ ప్రారంభించారు. లేవీయుల్లో 20 ఏళ్లు నిండినవాళ్లనీ, అంతకు పైబడినవాళ్లనీ యెహోవా దేవాలయ నిర్మాణంలో నాయకులుగా నియమించారు. 9 దేవాలయ నిర్మాణ కార్యకలాపాలను ఈ కింది వారు అజమాయిషీ చేశారు: యేషూవ మరియు అతని కొడుకులు, మరియు అతని సహోదరులు, కద్మీయేలు మరియు అతని కొడుకులు (యూదా వంశస్థులు); హేనాదాదు, మరియు అతని కొడుకులు, లేవీయులందరు. 10 పనివాళ్లు యెహోవా దేవాలయానికి పునాది నిర్మాణాన్ని పూర్తిచేశారు. పునాది పూర్తయ్యాక, యాజకులు యాజకదుస్తులు ధరించి, బూరలు చేతబూనారు. అసాపు కొడుకులు తాళాలు పట్టుకొని నిలబడ్డారు. వాళ్లందరూ యెహోవాను స్తుతించేందుకోసం తమ తమ స్థానాల్లో నిలిచారు. ఇదంతా ఇశ్రాయేలు రాజైన దావీదు గతంలో ఆదేశించిన విధంగా జరిగింది. 11 వాళ్లు కృతజ్ఞతాస్తుతులు[c] పాడారు.
“యెహోవా మంచివాడు.
ఆయన నిజమైన ప్రేమ ఇశ్రాయేలీయుల మీద ఎల్లప్పుడూ నిలిచివుంటుంది”
అంటూ వాళ్లు స్తుతి కీర్తనలు పాడారు. చివరిగా అక్కడ ఉన్న మనుష్యులందరూ ఏకమై బిగ్గరగా గొంతెత్తి యెహోవాను కీర్తించారు. యెహోవా దేవాలయానికి పునాది వేయబడిన సందర్భంగా వాళ్లు గొప్పశబ్దంతో యెహోవాకు సోత్రాలు చెల్లించారు.
12 అయితే, చాలామంది వృద్ధ యాజకులు, లేవీయులు, వంశ పెద్దలు విలపించారు. ఎందుకంటే, వాళ్లు వెనకటి దేవాలయాన్ని చూసినవాళ్లు. వాళ్లు ఆ పూర్వవైభవాన్ని జ్ఞాపకం చేసుకొని, ఈ కొత్త దేవాలయాన్ని చూసినప్పుడు బిగ్గరగా ఏడ్చారు. జనంలో మిగిలిన చాలామంది సరదాగా సంతోషంగా కేరింతలు కొడుతూండగా వాళ్లు విలపించారు. 13 ఆ ధ్వనులు చాలాదూరం వరకూ వినబడ్డాయి. వాటిలో ఏవి సంతోషధ్వనులో, ఏవి విలాపాలో ఎవరూ చెప్పుకోలేక పోయారు.
దేవాలయ పునర్నిర్మాణానికి విరోధులు
4 1-2 ఆ ప్రాంతంలో నివసించే చాలామంది యూదా, బెన్యామీను జాతీయులకు విరోధులు. చెర నుంచి విముక్తులై తిరిగి వచ్చిన వాళ్లు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు దేవాలయం నిర్మిస్తున్నారని విన్న ఆ శత్రువులు జెరుబ్బాబెలు దగ్గరకీ, వంశ పెద్దల దగ్గరికీ వచ్చి, “నిర్మాణంలో మీకు మమ్మల్ని తోడ్పడనివ్వండి. మేమూ మీలాంటివాళ్లమే. మీ దేవుణ్ణి సహాయం నిమిత్తం మేమూ అర్థిస్తాము. అష్షూరు రాజైన ఏసర్హద్దోను మమ్మల్ని ఇక్కడికి తెచ్చినప్పట్నుంచీ మేము మీ దేవునికే బలులు సమర్పించాము” అన్నారు.
3 కాని, జెరుబ్బాబెలు, యేషూవ, ఇశ్రాయేలుకు చెందిన ఇతర వంశాల పెద్దలూ వాళ్లకి ఇలా సమాధానం చెప్పారు: “కుదరదు, మా దేవుని ఆలయ నిర్మాణంలో మాకు తోడ్పడే అవకాశం మీకు లేదు. యెహోవాకు ఆలయ నిర్మాణం చేసే హక్కు మాది మాత్రమే. యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు. ఇది పారశీక రాజు కోరేషు మాకు ఇచ్చిన ఆజ్ఞ.”
4 ఈ మాటలతో వాళ్లకి కోపం వచ్చింది. దానితో వాళ్లు యూదులకు ఇబ్బందులు కలిగించ నారంభించారు. దేవాలయం నిర్మించకుండా యూదులను వాళ్లు నిరుత్సాహపరచి, నిరోధించసాగారు. 5 వాళ్లు ప్రభుత్వాధికారులకు లంచాలిచ్చి, వాళ్లు యూదా ప్రజలకు వ్యతిరేకంగా పని చేసేలా చూశారు. ఆ అధికారులు యూదుల దేవాలయ నిర్మాణ పథకాలను భగ్నం చేసేందుకు నిరంతరం కృషిచేశారు. కోరెషు పారశీక రాజుగా వున్నకాలంలో దర్యావేషు పారశీక రాజు అయ్యేంత వరకూ వాళ్ల యీ ప్రయత్నం కొనసాగింది.
6 యూదులను అడ్డుకొనేందుకుగాను ఆ శత్రువులు పారశీక రాజుకి లేఖలు సైతం వ్రాశారు. అహష్వేరోషు[d] రాజు అయిన ఏడాది వాళ్లొక లేఖ వ్రాశారు.
యెరూషలేము పునర్నిర్మాణానికి విరోధులు
7 ఆ తరువాత అర్తహషస్త[e] పారశీకానికి కొత్తగా రాజు అయిన కాలంలో, వాళ్లలో కొందరు యూదులమీద నిందారోపణలు చేస్తూ లేఖలు వ్రాశారు. అలా వ్రాసినవాళ్లు: బిష్లాము, మిత్రదాతు, టాబెయేలు, ఆ బృందానికి చెందిన ఇతరులు. వాళ్లు అర్తహషస్తకు ఆ లేఖలు అరమేయికు[f] భాషలో, అరమేయికు లిపిలో వ్రాశారు.
8 [g] అప్పుడు ప్రాంతీయాధికారి రెహూమూ, కార్యదర్శి షిమ్షయి కూడా యెరూషలేము ప్రజలకి వ్యతిరేకంగా ఒక లేఖ వ్రాసి, పారసీక రాజు అర్తహషస్తకి పంపారు. ఆ లేఖలో వాళ్లిలా వ్రాశారు.
9 ప్రాంతీయాధికారి రెహూము, కార్యదర్శి షిమ్షయీ, న్యాయమూర్తులు, టర్పెలాయేలు, పారశీకం, అర్కె, బబులోను, సూసాకి చెందిన ఏలాము మరియు ఇతర ప్రాంతాల ప్రజలమీది ముఖ్యాధికారులు, 10 గొప్పవాడైన బలవంతుడైన అషురుబానిపాలు సమరియా నగరానికీ, యూఫ్రటీసు నదికి పశ్చిమ ప్రాంతాలకూ తరలించిన ప్రజల మహజరు.
11 అర్తహషస్త ప్రభువుకి, యూఫ్రటీసు నదియొక్క పశ్చిమాన నివసించే తమ దాసులు చేసుకున్న విన్నపం:
12 అర్తహషస్త మహారాజుగారికి, తమరు తమవద్ద నుంచి పంపివేసిన యూదులు ఇక్కడికి చేరుకున్నారు. ఆ యూదులు ఇప్పుడా నగరాన్ని తిరిగి పునర్నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. యెరూషలేము ఒక చెడ్డ నగరం. ఆ నగర ప్రజలు ఎల్లప్పుడూ ఇతర రాజుల మీద తిరగబడుతూవచ్చారు. ఇప్పుడు యూదులు పునాదులు కట్టుదిట్టంచేసి, ప్రాకారాలు కడుతున్నారు.[h]
13 అంతేకాదు అర్తహషస్త మహాప్రభూ, యెరూషలేము నగరమూ, దాని ప్రాకారాలూ తిరిగి నిర్మింపబడినట్లయితే, యెరూషలేము ప్రజలు తమ వృత్తిపన్నులు చెల్లించడం నిలిపేస్తారు. తమ గౌరవార్థం డబ్బు పంపడం మానేస్తారు. వాళ్లు సుంకం పన్నులు చెల్లించడం కూడా మానేస్తారు. ఏలినవారికి ఆ సొమ్మంతా నష్టమవుతుంది.
14 ప్రభువుల పట్ల మాకు బాధ్యతవుంది. తమకీ నష్టాలు వాటిల్లడం మేము చూడలేము. అందుచేతనే తమకీ విషయాలు తెలియజేసుకుంటున్నాము.
15 అర్తహషస్త మహారాజా, తమకు పూర్వం రాజ్యమేలిన రాజులు వ్రాయించిన చరిత్ర పత్రాలు తమరు పరిశీలించండి. ఆ పత్రాలవల్ల యెరూషలేము ఎల్లప్పుడూ యితర రాజులకు వ్యతిరేకంగా తిరుగబడినట్లు తమకు తెలియవస్తుంది. ఇతర రాజులకూ, రాజ్యాలకూ వీళ్ల తిరుగుబాట్లు పెద్దకీడుగా పరిణమించాయి. ప్రాచీనకాలం నుంచి యీ నగరంలో అనేక తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి! యెరూషలేము నాశనం చేయబడినది సరిగ్గా అందుకే!
16 అర్తహషస్త మహారాజా, ఈ నగరమూ, దాని ప్రాకారాలూ తిరిగి నిర్మింపబడినట్లయితే, యూఫ్రటీసు నదికి పశ్చిమానగల ప్రాంతంమీద తమకు అదుపు తప్పిపోతుందని తమకు తెలియజేయాలని కోరుకుంటున్నాము.
17 అప్పుడు అర్తహషస్త రాజు వాళ్లకి ఇలా సమాధానం ఇచ్చాడు:
ప్రాంతీయాధికారి రెహూముకి, కార్యదర్శి షిమ్షయికి, సమరియాలోను, యూఫ్రటీసు నదికి పశ్చిమాన మీతో బాటు నివసించేవారికి,
శుభాకాంక్షలు.
18 మీరు మాకు పంపిన లేఖను అనువదించి మాకు వినిపించారు. 19 నా వెనుకటి రాజుల పత్రాలు గాలించవలసిందిగా నేను ఆదేశించాను. ఆ పత్రాలు చదివి వినిపించారు. రాజులకి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేసిన సుదీర్ఘ చరిత్ర యెరూషలేముకు ఉన్నట్లు మేము కనుగొన్నాము. యెరూషలేములో తరచూ పితూరీలు, తిరుగుబాట్లు సంభవించాయి. 20 యెరూషలేమునూ, యూఫ్రటీసు నదికి పశ్చిమానగల ప్రాంతమంతటినీ శక్తిసంపన్నులైన రాజులు పాలించారు. పన్నులు, రాజుల గౌరవార్థం కానుకలు, సుంకం పన్నులు ఆ రాజులకు చెల్లింపబడ్డాయి.
21 ఇప్పుడిక మీరు చేయవలసినది, వాళ్లని పని నిలిపివేయవలసినదిగా ఆజ్ఞ జారీ చేయడం. యెరూషలేము పునర్నిర్మాణం జరగకుండా మీరా ఆజ్ఞ ఇవ్వాలని నా ఆదేశం. 22 ఈ వ్యవహారంలో అశ్రద్ధ జరగకుండా మీరు జాగ్రత్తవహించాలి. మనం యెరూషలేము పునర్నిర్మాణాన్ని కొనసాగనివ్వరాదు. అదే జరిగితే మాకింక యెరూషలేమునుంచి ఎంత మాత్రమూ డబ్బు ముట్టదు.
23 అర్తహషస్త రాజు పంపిన ఈ లేఖ నకలు రెహూముకీ, కార్యదర్శి షిమ్షయికీ, వాళ్లతోవున్న ఇతర ప్రజలకు అందింది. దాన్ని చదివిన మీదట వాళ్లు వెంటనే యెరూషలేములోని యూదుల వద్దకు వెళ్లారు. ఆ యూదుల చేత నిర్మాణపు పనిని వాళ్లు బలవంతాన నిలిపివేయించారు.
దేవాలయ నిర్మాణపు పని నిలిచిపోవుట
24 దానితో, యెరూషలేములోని యెహోవా దేవాలయ నిర్మాణపు పని నిలిచిపోయింది.[i] పారసీక రాజు దర్యావేషు పాలన రెండవ సంవత్సరం[j] దాకా తిరిగి ఈ నిర్మాణ కృషి కొనసాగలేదు.
5 ఆ కాలంలో ప్రవక్తలైన హగ్గయి,[k] ఇద్దో కొడుకు జెకర్యా[l] దేవుని పేరట ప్రవచించారు. యూదా, యెరూషలేములోని యూదులను వాళ్లు ప్రోత్సహించారు. 2 దానితో, షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు, యోజాదాకు కొడుకు యేషూవలు యెరూషలేములోని దేవాలయ నిర్మాణ కృషిని తిరిగి ప్రారంభించారు. దేవుని ప్రవక్తలందరూ వారితో ఉండి, ఆ పనికి తోడ్పడుతూ వచ్చారు. 3 ఆ కాలంలో యూఫ్రటీసునది పశ్చిమ ప్రాంతానికి తత్తెనైయు అధిపతి. తత్తెనైయు, షెతర్బోజ్నయి, వారి సహోద్యోగులు నిర్మాణ కృషి సాగిస్తున్న జెరుబ్బాబెలు, యేషూవ, తదితరుల వద్దకు వెళ్లి, “ఈ దేవాలయాన్ని పునర్నిర్మించి, దీన్ని సరికొత్తదానిగా రూపొందించడానికి మీకు ఎవరు అనుమతినిచ్చారు?” అని నిలదీశారు. 4 అంతేకాదు, వాళ్లు జెరుబ్బాబెలును, “ఈ భవనం పని చేస్తున్న వాళ్ల పేర్లు యేమిటి?” అని కూడా ప్రశ్నించారు.
5 అయితే, యూదా నాయకుల మీద దేవుని దృష్టివుంది. దర్యావేషు రాజుకి భవన నిర్మాతలు లేఖలు పంపుకున్నారు. రాజు సమాధానం పంపేదాకా, వాళ్లు పనిని నిలుపు చేయవలసిన అవసరం లేకపోయింది. వాళ్లు తమ నిర్మాణ కృషిని కొనసాగించారు.
6 యూఫ్రటీసు నది పశ్చిమ ప్రాంతాధిపతి అయిన తతైనైయు, షతర్బోజ్నయి, వారి ముఖ్య సహోద్యోగులు దర్యావేషు రాజుకి ఒక లేఖ పంపారు. 7 ఆ లేఖ నకలు ఇది:
దర్యావేషు రాజుకి,
శుభం!
8 దర్యావేషు రాజుకి మేము ఇందు మూలంగా తెలియజేసేది ఏమంటే, తమ ఆదేశం మేరకు యూదా రాజ్యంలో గొప్ప దేవుని ఆలయానికి మేము వెళ్లాము. యూదాలోని ప్రజలు ఆ ఆలయాన్ని పెద్దపెద్ద రాళ్లతో కడుతున్నారు. గోడల్లో వాళ్లు పెద్ద దూలాలు పరుస్తున్నారు ఎంతో శ్రద్ధగా పనిచేస్తున్నారు. వాళ్లు చాలా వేగంగా నిర్మాణం సాగిస్తున్నారు. త్వరలోనే పనిపూర్త వుతుంది.
9 వాళ్లు చేస్తున్న పనిని గురించి మేము వాళ్ల నాయకుల్ని కొన్ని ప్రశ్నలు అడిగాము. “ఈ దేవాలయాన్ని తిరిగి నిర్మించేందుకూ, కొత్తదానిగా దాన్ని రూపొందించేందుకూ మీకు ఎవరు అనుమతి ఇచ్చారు?” అని మేము ప్రశ్నించాము. 10 మేము వాళ్ల పేర్లు కూడా అడిగాము. వాళ్లెవరో మీరు తెలుసు కోగలిగేందుకు వీలుగా మేము వాళ్ల పేర్లు వ్రాసి పెట్టాలని అనుకున్నాము.
11 వాళ్లు మాకు ఇచ్చిన సమాధానం యిది:
“మేము భూ, పరలోకాల అధిపతియైన యెహోవా దేవుని సేవకులం. చాలా సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు మహారాజొకడు నిర్మించి ముగించిన దేవాలయాన్ని మేమిప్పుడు తిరిగి నిర్మిస్తున్నాం. 12 కాని, మా పూర్వీకులు దేవునికి కోపం తెప్పించారు. ఆయన వారిని బబులోను రాజైన నెబుకద్నెజరుకు లోబరిచాడు. నెబుకద్నెజరు ఈ దేవాలయాన్ని నిర్మూలించాడు, ప్రజలను బలవంతాన బబులోనుకు బందీలుగా తీసుకుపోయాడు. 13 అయితే, కోరెషు రాజు దేవాలయం తిరిగి నిర్మింపబడాలని ఒక ప్రత్యేకాజ్ఞ జారీ చేశాడు. 14 కోరెషు గతంలో యెహోవా దేవాలయం నుంచి కొల్లగొట్టిన వెండి, బంగారు వస్తువులను బబులోనులోని అబద్ధపు దేవత ఆలయంనుంచి బయటికి తీయించాడు. నెబుకద్నెజరు గతంలో ఆ వస్తువులను యెరూషలేములోని ఆలయం నుంచి కొల్లగొట్టి, వాటిని బబులోను లోని తన అబద్ధపు దేవత దేవాలయంలో ఉంచాడు. ఇప్పుడు కోరెషు రాజు ఆ వెండి, బంగారు వస్తువులను షేష్బజ్జరుకు ఇచ్చాడు. కోరెషు షేష్బజ్జరును ప్రాంతీయాధికారిగా నియమించాడు.”
15 కోరెషు షేష్బజ్జరును ఇలా ఆదేశించాడు: “నువ్వీ వెండి, బంగారు వస్తువులను తీసుకుపోయి, వాటిని తిరిగి యెరూషలేములోని దేవాలయంలో పెట్టు. గతంలో ఉన్న చోటనే దేవాలయాన్ని తిరిగి నిర్మింప జేయి.”
16 షేష్బజ్జరు వచ్చి, యెరూషలేములోని దేవాలయానికి పునాదులు నిర్మించాడు. ఆనాటి నుంచి నేటిదాకా పని కొనసాగింది. అయితే, ఆ పని యింకా పూర్తి కాలేదు.
17 ఇప్పుడిక, తమకి సమ్మతమైతే, రాజుగారి ఆధికారిక, చారిత్రక పత్రాలను గాలించండి. యెరూషలేములో దేవాలయం నిర్మించుమని కోరెషు రాజు ఆజ్ఞ జారీ చేశాడన్న మాట నిజమేనేమో పరిశీలించుము. తర్వాత తమరీ విషయంలో తీసుకున్న నిర్ణయమేమిటో దయచేసి మాకొక లేఖద్వారా తెలియజేయండి.
యేసు బ్రతికి రావటం
(మత్తయి 28:1-10; మార్కు 16:1-8; లూకా 24:1-12)
20 ఆ రోజు ఆదివారం. “మగ్దలేనే” కు చెందిన మరియ చీకటి ఉండగా లేచి ఆ సమాధి దగ్గరకు వెళ్ళింది. దాని ద్వారానికి ఉన్న రాయి తీసి వేయబడి ఉండటం గమనించింది. 2 అందువల్ల ఆమె సీమోను పేతురు దగ్గరకు, యేసు ప్రేమించిన యింకొక శిష్యుని దగ్గరకు పరుగెత్తుకొంటూ వెళ్ళి, వాళ్ళతో, “ఎవరో ప్రభువును సమాధి నుండి తీసుకు వెళ్ళారు. ఎక్కడ ఉంచారో తెలియదు” అని అన్నది.
3 పేతురు, ఆ యింకొక శిష్యుడు సమాధి చూడటానికి బయలుదేరి వెళ్ళారు. 4 వాళ్ళు కలిసి పరుగెత్తుకుంటూ వెళ్లారు కాని, ఆ యింకొక శిష్యుడు పేతురు కన్నా ముందు పరుగెత్తి సమాధిని మొదట చేరుకున్నాడు. 5 అతడు తొంగి లోపల చూసాడు. అక్కడ పడివున్న నారబట్టలు అతనికి కనిపించాయి. కాని అతడు లోపలికి వెళ్ళలేదు.
6 అతని వెనుక వస్తున్న పేతురు వచ్చి సమాధిలోకి వెళ్ళాడు. అక్కడ పడి ఉన్న బట్టల్ని చూసాడు. 7 వాటినే కాక యేసు తల చుట్టూ చుట్టబడిన వస్త్రాన్ని కూడా చూసాడు. మడత పెట్టబడిన తల వస్త్రం నారబట్టలతో కాక వేరుగా ఉంచబడి ఉంది. 8 సమాధి దగ్గరకు ముందు వెళ్ళిన శిష్యుడు కూడా తర్వాత లోపలికి వెళ్ళాడు. ఆ దృశ్యం చూసి విశ్వసించాడు. 9 (యేసు బ్రతికి వస్తాడని లేఖనాల్లో వ్రాయబడిన విషయం వాళ్ళకు యింకా అర్థంకాలేదు.)
మగ్దలేనే మరియకు యేసు కనిపించటం
(మార్కు 16:9-11)
10 ఆ తర్వాత శిష్యులు తమ తమ యిండ్లకు వెళ్ళిపొయ్యారు. 11 కాని, మరియ సమాధి బయట దుఃఖిస్తూ నిలుచొని ఉంది. ఆమె దుఃఖం ఆగలేదు. సమాధిలోకి తొంగి చూసింది. 12 తెల్లటి దుస్తుల్లో ఉన్న యిద్దరు దేవదూతలు అక్కడ కూర్చొని ఉండటం ఆమె గమనించింది. యేసు దేహాన్ని ఉంచిన చోట ఒక దేవదూత తల వైపు, మరొక దేవదూత కాళ్ళ వైపు కూర్చొని ఉన్నారు.
13 వాళ్ళామెను, “ఎందుకు దఃఖిస్తున్నావమ్మా?” అని అడిగారు.
ఆమె, “వాళ్ళు నా ప్రభువును తీసుకు వెళ్ళారు. ఆయన్ని ఎక్కడ ఉంచారో నాకు తెలియదు” అని అన్నది. 14 అలా అన్నాక వెనక్కు తిరిగింది. అక్కడ యేసు నిలుచొని ఉండటం చూసింది. కాని ఆయనే “యేసు” అని ఆమె గుర్తించలేదు.
15 ఆయన, “ఎందుకు విలపిస్తున్నావమ్మా! ఎవరి కోసం చూస్తున్నావు?” అని అడిగాడు.
అతడొక తోటమాలి అనుకొని, “అయ్యా మీరాయన్ని ఎత్తుకుపోయి ఉంటే ఎక్కడ ఉంచారో చెప్పండి. నేను వెళ్ళి తెచ్చుకుంటాను” అని అన్నది.
16 యేసు ఆమెను “మరియా” అని పిలిచాడు.
ఆమె ఆయన వైపు చూసి హీబ్రూ భాషలో “రబ్బూనీ!” అని అన్నది. రబ్బూనీ అంటే బోధకుడు అని అర్థం.
17 యేసు, “నేనింకా తండ్రి దగ్గరకు వెళ్ళలేదు కనుక నన్ను తాకవద్దు. నా సోదరుల దగ్గరకు వెళ్ళి నాకు, మీకు తండ్రి, దేవుడు అయినటువంటివాని దగ్గరకు వెళ్తున్నానని చెప్పు” అని అన్నాడు.
18 మగ్దలేనే మరియ శిష్యుల దగ్గరకు వెళ్ళింది. తాను ప్రభువును చూసిన వార్త, ప్రభువు తనకు చెప్పిన సందేశము, వాళ్ళతో చెప్పింది.
యేసు తన శిష్యులకు కనిపించటం
(మత్తయి 28:16-20; మార్కు 16:14-18; లూకా 24:36-49)
19 ఆ ఆదివారం సాయంకాలం శిష్యులందరు ఒకే చోట సమావేశమయి ఉన్నారు. యేసు వచ్చి వాళ్ళ మధ్య నిలుచొని, “మీకు శాంతి కలుగుగాక!” అని అన్నాడు. 20 ఇలా అన్నాక ఆయన తన చేతుల్ని, ప్రక్క భాగాన్ని చూపించాడు. ప్రభువును చూసాక శిష్యులకు చాలా ఆనందం కలిగింది.
21 యేసు మళ్ళీ, “మీకు శాంతి కులుగు గాక! తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను” అని అన్నాడు. 22 ఇలా అన్నాక, “పవిత్రాత్మను పొందండి!” అని వాళ్ళపై ఊదాడు. 23 ఆ తర్వాత, “మీరు ఎవరి పాపాలు క్షమిస్తే వారి పాపాలు క్షమింపబడతాయి. మీరు ఎవరి పాపాలు క్షమించకపోతే వారి పాపాలు క్షమించబడవు” అని వాళ్ళతో అన్నాడు.
తోమా యేసును చూడటం
24 యేసు వచ్చినప్పుడు పండ్రెండుగురిలో ఒకడైన తోమా శిష్యుల్తోలేడు. ఇతణ్ణి “దిదుమ” అని పిలిచే వాళ్ళు. 25 మిగత శిష్యులు తోమాతో, “మేము ప్రభువును చుసాము” అని అన్నారు. కాని తోమా, “నేను స్వయంగా ఆయన చేతులకున్న మేకుల గాయాల్ని చూసి, వాటిని చేతుల్తో తాకి, ఆయన ప్రక్క డొక్కపై నా చేతుల్ని ఉంచాక ఆయన్ని నమ్ముతాను” అని అన్నాడు.
26 ఒక వారం రోజుల తర్వాత యేసు శిష్యులు ఒక యింట్లో ఉన్నారు. తోమా కూడా వాళ్ళతో ఉన్నాడు. తలుపులు మూసి వేసి ఉన్నా యేసు లోపలికి వచ్చి వాళ్ళ మధ్య నిలుచొని, “మీకు శాంతి కలుగుగాక!” అని అన్నాడు. 27 యేసు తోమాతో, “నా చేతులు చూడు. నీ వేళ్ళతో వాటిని తాకు. నా ప్రక్క భాగంపై నీ చేతుల్ని ఉంచు! ఇక అనుమానించకు” అని అన్నాడు.
28 తోమా ఆయనతో, “దేవా! నా ప్రభూ!” అని అన్నాడు.
29 అప్పుడు యేసు అతనితో, “నన్ను చూసావు కనుక నమ్మావు. నన్ను చూడకున్నా విశ్వసించే వాళ్ళు ధన్యులు” అని అన్నాడు.
ఈ గ్రంథం వ్రాయటంలో ఉద్దేశ్యం
30 నేను ఈ గ్రంథంలో వ్రాసినవే కాక, యేసు ఇంకా అనేకమైన మహాత్కార్యాలు చేసాడు. వాటన్నిటినీ శిష్యులు చూసారు. 31 యేసు “క్రీస్తు” అని, “దేవుని కుమారుడు” అని, ఆయన్ని విశ్వసించిన వాళ్ళకు ఆయన పేరిట అనంత జీవితం లభిస్తుందని మీరు నమ్మాలనే ఉద్దేశ్యంతో యివి వ్రాయబడ్డాయి.
© 1997 Bible League International