Old/New Testament
యరొబాము కుమారుని మరణం
14 ఆ సమయంలో యరొబాము కుమారుడు అబీయా తీవ్రంగా జబ్బు పడ్డాడు. 2 యరొబాము తన భార్యతో ఇలా అన్నాడు: “నీవు షిలోహుకు వెళ్లు. అక్కడ ప్రవక్త అహీయాను దర్శించు. నేను ఇశ్రాయేలుకు రాజునవుతానని చెప్పిన వాడే ఈ అహీయా. నీవు నా భార్యవని ప్రజలకు తెలియకుండా మారువేషం వేసుకొని వెళ్లు. 3 ప్రవక్త కొరకు పదిరొట్టెలను, తీపి పదార్థాలను, ఒక జాడీ తేనెను కానుకగా పట్టుకు వెళ్లు. తరువాత మన కుమారునికి ఏమి జరుగుతుందో చెప్పమని ఆయనను అడుగు. ప్రవక్తయైన అహీయా అంతా చెపుతాడు.”
4 అందువల్ల రాజు భార్య షిలోహుకు వెళ్లింది. ప్రవక్త అహీయా ఇంటికి వెళ్లింది. అహీయా పండు ముసలి వాడయ్యాడు. చూపుపోయింది. 5 కాని ఈ లోపు యెహోవా అహీయాతో, “యరొబాము భార్య నీ వద్దకు వస్తూవుంది. ఆమె కుమారునికి జబ్బు చేయగా, అతనికి ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని వస్తూవుంది” అని తెలియజేశాడు. తరువాత అహీయా ఆమెకు ఏమి చెప్పాలో కూడ యెహోవా వివరించాడు. యరొబాము భార్య అహీయా ఇంటికి వచ్చింది.
ఆమె ఎవరో ప్రజలకు తెలియకుండా వుండాలని ఆమె ప్రయత్నిస్తూ వుంది. 6 ఆమె ద్వారం వద్దకు వచ్చినట్లు అహీయా శబ్దం విన్నాడు. వెంటనే అహీయా ఇలా అన్నాడు: “యరొబాము భార్యా, లోపలికి రా, ప్రజలు నిన్ను ఎవరో అనుకోవాలని నీవు ఎందుకు ప్రయత్నిస్తున్నావు? నీకు ఒక దుర్వార్త చెప్పదలిచాను. 7 నీవు ఇంటికి తిరిగి వెళ్లి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యరొబాముకు చెప్పమన్న వర్తమానం తెలియజేయి. యెహోవా ఇలా అంటున్నాడు: ‘యరొబామా, ఇశ్రాయేలీయులందరిలోను నేను నిన్ను ఎంపిక చేశాను. నా ప్రజలకు నిన్ను పాలకునిగా చేశాను. 8 దావీదు వంశం ఇశ్రాయేలును ఏలుతూ వుంది. కాని వారినుండి రాజ్యాన్ని తీసుకుని, దానిని నేను నీకిచ్చాను. నా సేవకుడగు దావీదువలె నీవు ప్రవర్తించలేదు. అతడు నా ఆజ్ఞలను ఎల్లప్పుడు పాటించాడు. పూర్ణ హృదయంతో అతడు నన్ను అనుసరించాడు. నేను అంగీకరించిన వాటినే అతడు చేసేవాడు. 9 కాని నీవు ఘోరమైన పాపాలను చాలా చేశావు. నీ ముందు పాలించిన వారు చేసిన పాపాలకంటె నీవు అతి భయంకరమైన పాపాలు చేశావు. నన్ను వదిలిపెట్టి పెడ మార్గాన పడ్డావు. నీవు విగ్రహాలను, చిల్లర దేవుళ్లను తయారు చేశావు. ఇది నాకు చాలా కోప కారణమయ్యింది. 10 కావున నేను యరొబాము కుటుంబానికి కష్టాలు కలుగజేస్తాను. నీ కుటుంబంలో పురుషులందరినీ చంపివేస్తాను. ఎండిన పేడను అగ్ని దహించి వేయునట్లు నేను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను. 11 నగరంలో చనిపోయిన నీ కుటుంబం వారిని కుక్కలు పీక్కుతింటాయి. పొలాల్లో చనిపోయే నీ కుటుంబంవారిని పక్షులు పొడుచుకు తింటాయి.’ ఇదే యెహోవా వాక్కు.”
12 యరొబాము భార్యతో ప్రవక్త అహీయా ఇంకా ఇలా అన్నాడు: “ఇప్పుడు ఇంటికి వెళ్లు. నీవు నగర ద్వారం ప్రవేశించగానే నీ కుమారుడు చనిపోతాడు. 13 ఇశ్రాయేలంతా వాని కొరకు విలపించి, అతనిని సమాధి చేస్తారు. యరొబాము కుటుంబంలో నీ కుమారుడు ఒక్కడే సమాధి చేయబడతాడు. ఎందువల్లననగా యరొబాము కుటుంబంలో అతడొక్కడే ప్రభువైన ఇశ్రాయేలు దేవుని సంతోషపరిచాడు. 14 యెహోవా ఇశ్రాయేలుపై మరో కొత్త రాజును నియమిస్తాడు. ఆ కొత్త రాజు యరొబాము కుటుంబాన్ని నాశనం చేస్తాడు. ఇది శీఘ్రంగా జరుగుతుంది. 15 అప్పుడు యెహోవా ఇశ్రాయేలును శిక్షిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు నీటిలోని ఎత్తైన గడ్డి అల్లాడినట్లు తల్లడిల్లి పోతారు. ఇశ్రాయేలు ప్రజల్ని ఈ మంచి దేశంనుండి యెహోవా లాగివేస్తాడు. ఈ రాజ్యాన్ని వారి పూర్వికులకు ఆయన ఇచ్చాడు. యూఫ్రటీసు నదికావల వీరు చెల్లాచెదరైపోయేలా చేస్తాడు. ఇది జరుగుతుంది. కారణమేమంటే యెహోవా ఆ ప్రజల పట్ల కోపంగా వున్నాడు. ప్రత్యేకమైన స్తంభాలు నిర్మించి అషేరాను ఆరాధించటం మొదలుపెట్టి ప్రజలాయనకు చాలా కోపం కలుగ జేశారు. 16 యరొబాము పాపం చేశాడు. అతడు పాపం చేసి ఇశ్రాయేలు ప్రజలు కూడ పాపం చేయటానికి కారకుడయ్యాడు. కావున ఇశ్రాయేలు ప్రజలు ఓడింపబడేలా యెహోవా చేస్తాడు.”
17 యరొబాము భార్య తిర్సాకు తిరిగి వెళ్లింది. ఆమె ఇంటికి వెళ్లగానే బాలుడు చనిపోయాడు. 18 ఇశ్రాయేలీయులంతా అతని కొరకై విలపించి, అతనిని సమాధిచేశారు. యెహోవా ఎలా జరుగుతుందని చెప్పాడో, అదే విధంగా ఇది జరిగింది. తన సేవకుడైన ప్రవక్త అహీయా ద్వారా ఈ విషయాలన్నీ చెప్పాడు.
19 రాజైన యరొబాము అనేకమైన ఇతర పనులు చేశాడు. అతడు యుద్ధాలు చేశాడు. ప్రజాపాలన కొనసాగించాడు. అతడు చేసిన పనులన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వివరించబడ్డాయి. 20 యరొబాము రాజుగా ఇరువది రెండు సంవత్సరాలు పరిపాలించాడు. తరువాత అతడు చనిపోగా, వానిని అతని పూర్వీకులతో సమాధి చేశారు. అతని కుమారుడు నాదాబు అతని స్థానంలో రాజైనాడు.
యూదా రాజుగా రెహబాము
21 యూదాకు రాజయ్యేనాటికి సొలొమోను కుమారుడు రెహబాము 41 సంవత్సరాలవాడు. యెరూషలేము నగరంలో రెహబాము పదిహేడు సంత్సరాలు పాలించాడు. ఈ నగరంలోనే యెహోవా తాను గౌరవింపబడాలని నిశ్చయించాడు. ఇశ్రాయేలు రాజ్యమంతటిలో ఈ నగరాన్నే ఆయన ఎన్నుకున్నాడు. రెహబాము తల్లి అమ్మోనీయురాలగు నయమా.
22 యూదా ప్రజలు యెహోవా దృష్టిలో పాపకార్యాలు చేయటం కొనసాగించారు. వారంటే కోపగించుకొనేలా ప్రజలు యెహోవా పట్ల అనేక పాప కార్యాలు చేశారు. వారికి ముందు నివసించిన వారి పితరులకంటె ఘోరమైన పాపాలను వారు చేశారు. 23 ఆ ప్రజలు ఉన్నత స్థలాలను,[a] స్మారకశిలను, పవిత్ర కొయ్యగుంజలను నిర్మించారు. వీటన్నిటినీవారు కొండల మీద, పచ్చని చెట్ల కింద ఏర్పాటు చేశారు. 24 దేవుని ఆరాధన పేరుతో నీచమైన లైంగిక కార్యాలకు[b] అమ్ముడు పోయే పురుషులు కూడా అక్కడ వున్నారు. యూదా వారు కూడా చాలా చెడుకార్యలకు పాల్పడ్డారు. వారికి ముందు ఈ రాజ్యంలో నివసించిన జనులు కూడా అదే రకపు చెడుకార్యాలు చేశారు. అందుచే యెహోవా రాజ్యాన్ని వారి నుండి తీసుకుని ఇశ్రాయేలు ప్రజలకు అప్పగించాడు.
25 రెహబాము రాజ్యానికి వచ్చిన ఐదవ సంవత్సరంలో, ఈజిప్టు రాజైన షీషకు యెరూషలేము పైకిదండెత్తి వచ్చాడు. 26 షీషకు దేవాలయ ఖజానాను, రాజభవనాన్ని కొల్లగొట్టాడు. అరాము రాజైన హదదెజరు సైనికుల నుండి దావీదు తీసుకున్న బంగారు డాళ్లను కూడా అతడు ఎత్తుకొనిపోయాడు. దావీదు ఈ డాళ్లను యెరూషలేముకు తీసుకుని వచ్చాడు. షీషకు బంగారు డాళ్లన్నీ పట్టుకు పోయాడు. 27 అందువల్ల రాజైన రెహబాము వీటికి మారుగా చాలా డాళ్లను చేయించాడు. అయితే ఈ డాళ్లన్నీ బంగారానికి బదులు కంచుతో చేయబడ్డాయి. రాజభవన ద్వార పాలకులకు అతనియొక్క డాళ్లను ఇచ్చాడు. 28 రాజు యెహోవా దేవాలయానికి వెళ్లినప్పుడల్లా తన అంగరక్షకులు వెంట వెళ్లేవారు. వారు డాళ్లను చేతబట్టుకొని వెళ్లేవారు. వారు పని ముగించిన పిమ్మట వాటిని రక్షక భటుల గదిలో గోడకు తగిలించేవారు.
29 రాజైన రెహబాము చేసిన కార్యాలన్నీ యూదా రాజుల చరిత్ర గ్రంధంలో పొందుపర్చబడ్డాయి. 30 రెహబాము, యరొబాము ఇద్దరూ ఎప్పుడూ ఒకరితో ఒకరు యుద్ధం చేస్తూ వుండేవారు.
31 రెహబాము చనిపోగా అతను తన పూర్వికులతో దావీదు నగరంలో సమాధి చేయబడినాడు. (అతని తల్లి అమ్మోనీయురాలగు నయమా) రెహబాము కుమారుడు అబీయాము అతని స్థానంలో రాజయ్యాడు.
యూదాకు అబీయాము రాజగుట
15 నెబాతు కుమారుడు యరొబాము ఇశ్రాయేలును పాలిస్తూ వుండెను. అతని పాలనలో పదునెనిమిదో సంవత్సరం గడుస్తూ వుండగా, అబీయాము యూదాకు రాజు అయ్యాడు. 2 అబీయాము మూడు సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు మయకా. ఆమె అబీషాలోము కుమార్తె.
3 పూర్వం తన తండ్రి చేసిన తప్పులన్నీ అతను కూడా చేశాడు. తన తాత దావీదు తన ప్రభువైన యెహోవాకు యథార్థుడై వున్నట్లు, అబీయాము యెహోవాకు విశ్వాసపాత్రుడై వుండలేదు. 4 యెహోవా దావీదును ప్రేమించాడు. అందువల్ల అబీయాముకు యెరూషలేములో ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. అతనికి ఒక కుమారుని కూడ కలుగజేశాడు. యెహోవా ఇంకా యెరూషలేమును సురక్షితంగా వుండేలా చేశాడు. ఇదంతా యెహోవా దావీదు కొరకు చేశాడు. 5 యెహోవా కోరిన ప్రకారం దావీదు అన్నీ సవ్యమైన పనులు చేశాడు. యెహోవా ఆజ్ఞలను సదా పాటించాడు. హిత్తీయుడైన ఊరియా పట్ల తను చేసిన పాపం ఒక్కటి తప్ప, దావీదు యెహోవాకు సదా విధేయుడైయున్నాడు.
6 రెహబాము, యరొబాము ఇద్దరూ ఒకరితో ఒకరు ఎల్లప్పుడు యుద్ధం చేస్తూనే వున్నారు.[c] 7 అబీయాము చేసిన ఇతరమైన పనులన్నీ యూదా రాజుల చరిత్రలో వ్రాయబడ్డాయి.
అబీయాము పరిపాలించే సమయంలో అబీయాముకు, యరొబాముకు యుద్ధం జరిగింది. 8 అబీయాము చనిపోయినప్పుడు అతడు దావీదు నగరంలో సమాధి చేయబడ్డాడు. అబీయాము కుమారుని పేరు ఆసా. అబీయాము స్థానంలో ఆసా రాజయ్యాడు.
యూదా రాజుగా ఆసా
9 యరొబాము పాలన మొదలై ఇరవైయవ సంవత్సరం జరుగుతూండగా, ఆసా రాజ్యానికి వచ్చాడు. 10 ఆసా యెరూషలేములో నలుబది యొక్క సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు మయకా. మయకా అబ్షాలోము కుమార్తె.
11 ఆసా తన పూర్వికుడైన దావీదువలె యెహావా దృష్టిలో యథార్థమైన వాటిని చేసాడు. 12 ఆ రోజులలో కూడా లైంగిక వాంఛలకై తమ శరీరాలను ఆరాధనా స్థలాలలో అమ్ముకుని చిల్లర దేవుళ్లను పూజించే పురుషులున్నారు. అటువంటి పురుషగాములను ఆసా దేశంనుండి వెళ్ళగొట్టాడు. మరియు ఆసా తన పూర్వికులు తయారు చేసిన విగ్రహాలన్నిటినీ తీసి వేశాడు. 13 తన తల్లి మయకాను రాణి పదవి నుంచి ఆసా తొలగించాడు. కారణ మేమంటే మయకా ఒక హేయమైన అషేరా దేవతా విగ్రహాన్ని తయారు చేయించింది. ఈ భయంకర విగ్రహాన్ని ముక్కలు చేసి ఆసా వాటిని కిద్రోనులోయలో తగులబెట్టాడు. 14 కాని ఆసా ఉన్నత స్థలాలను నాశనం చేయలేదు. తన జీవిత కాలమంతా ఆసా యెహోవాకు విశ్వాస పాత్రుడుగా ఉన్నాడు. 15 ఆసా తండ్రి కొన్ని వస్తువులను యెహోవాకు సమర్పించాడు. ఆసా కూడ కొన్ని కానుకలను యెహోవాకు సమర్పించాడు. వారు బంగారం, వెండి, తదితర వస్తు సామగ్రిని కానుకలుగా సమర్పించారు. అవన్నీ ఆసా దేవాలయంలో వుంచాడు.
16 యూదా రాజుగా ఆసా కొనసాగినంత కాలం, ఇశ్రాయేలు రాజైన బయెషాతో యుద్ధాలు కొనసాగించాడు. 17 బయెషా యూదా వారితో యుద్ధం చేశాడు. ఆసా రాజ్యమైన యూదాకు ప్రజల రాకపోకలను నిలిపివేయమని బయెషా సంకల్పించాడు. అందువల్ల రామానగరాన్ని అతడు చాలా పటిష్ఠపర్చినాడు. 18 దేవాలయం ఖజానా నుండి, రాజభవనం నుండి ఆసా వెండి, బంగారాలను తీశాడు. అతని సేవకులకు వాటినిచ్చి అరాము రాజైన బెన్హదదుకు పంపాడు. (బెన్హదదు తండ్రి పేరు టబ్రిమ్మోను, టబ్రిమ్మోను తండ్రిపేరు హెజ్యోను) అతడు దమస్కు నగరంలో వుంటున్నాడు. 19 అతనికి ఆసా ఇలా వర్తమానం పంపాడు, “నా తండ్రికి, నీ తండ్రికి మధ్య ఒక శాంతి ఒడంబడిక జరిగింది. ఇప్పుడు నీతో నేను కూడ శాంతి ఒడంబడిక నొకదానిని చేసుకోదలిచాను. నీకు వెండి బంగారాలు కానుకలుగా పంపుతున్నాను. ఇశ్రాయేలు రాజైన బయెషాతో నీకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవలసిందిగా కోరుతున్నాను. అప్పుడు బయెషా నా రాజ్యం వదిలిపోతాడు.”
20 రాజైన బెన్హదదు ఆసా రాజు కోరిన దానికి ఒప్పుకున్నాడు. కావున ఇశ్రాయేలు పట్టణాలమీదికి తన సైన్యాలను పంపాడు. ఈయోను, దాను, ఆబేల్బేత్మయకా, కిన్నెరెతు పట్టణాలను ఓడించాడు. కిన్నెరెతు, నఫ్తాలీలను అతడు పూర్తిగా ఓడించాడు. 21 ఈ దండయాత్రలను గురించి బయెషా విన్నాడు. దానితో అతడు రామా నగరాన్ని కట్టు దిట్టం చేయటం మానివేశాడు. అతడు రామా నగరాన్ని వదిలి తిర్సాకు తిరిగి వెళ్లాడు. 22 అప్పుడు రాజైన ఆసా యూదా ప్రజలందరి సహకారాన్ని కోరుతూ ఒక అభ్యర్థన చేశాడు. వారంతా బయెషా రామా నగరాన్ని పటిష్ఠం చేయటానికి వినియోగిస్తున్న రాళ్లను, కలపను తీసుకొనిపోయారు. వాటిని బెన్యామీనీయుల నగరమైన గెబకు, మరియు మిస్పాకు చేరవేశారు. రాజైన ఆసా ఆ రెండు నగరాలను పటిష్టంగా పునర్నిర్మించాడు. 23 ఆసా చేసిన ఇతరమైన అన్ని పనులు, అతని బలం, అతను నిర్మించిన నగరాల విషయం యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఆసా ముసలివాడైనప్పుడు, అతని పాదాలలో జబ్బు ఏర్పడింది. 24 ఆసా చనిపోయినప్పుడు, అతని పూర్వికుడైన దావీదు నగరంలో సమాధి చేయబడ్డాడు. తరువాత ఆసా కుమారుడు యెహోషాపాతు అతని స్థానంలో రాజు అయ్యాడు.
ఇశ్రాయేలు రాజుగా నాదాబు
25 యూదాకు రాజైన ఆసా పాలన రెండవ సంవత్సరం గడుస్తూ వుండగా యరొబాము కుమారుడు నాదాబు ఇశ్రాయేలుకు రాజయ్యాడు. నాదాబు ఇశ్రాయేలును రెండు సంవత్సరాలు పాలించాడు. 26 యెహోవా దృష్టిలో అతను చాలా తప్పులు చేశాడు. తన తండ్రి యరొబాము చేసిన తప్పులన్నీ ఇతడూ చేశాడు. యరొబాము ఇశ్రాయేలు ప్రజలు కూడ పాపం చేయటానికి కారకుడయ్యాడు.
27 బయెషా అహీయా కుమారుడు. వారు ఇశ్శాఖారు వంశస్థులు. రాజైన నాదాబును చంపి వేయటానికి బయెషా పధకం వేశాడు. అది నాదాబు, ఇశ్రాయేలు వారంతా కలిసి గిబ్బెతోను నగరంపై దాడి జరుపుతున్న సమయం. గిబ్బెతోను ఫిలిష్తీయుల నగరం. అక్కడ నాదాబును బయెషా హత్య చేశాడు. 28 యూదాపై ఆసా పాలన మూడవ సంవత్సరం జరుగుతుండగా ఇది జరిగింది. ఇశ్రాయేలుకు తరువాత బయెషా రాజు అయ్యాడు.
ఇశ్రాయేలు రాజుగా బయెషా
29 బయెషా రాజైన పిమ్మట అతడు యరొబాము కుటుంబాన్ని హతమార్చాడు. యరొబాము కుటుంబంలో ఒక్కడిని కూడా బయెషా ప్రాణంతో వదలలేదు. యెహోవా ఎలా జరుగుతుందని సెలవిచ్చాడో, అదే రీతిలో ఇదంతా జరిగింది. షిలోహులో తన సేవకుడైన అహీయా ద్వారా యెహోవా ఇది పలికాడు. 30 ఇదంతా ఎందుకు జరిగినదనగా రాజైన యరొబాము చాలా పాపకార్యాలు చేశాడు. అంతే కాకుండా, ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపకార్యాలు చేయటానికి యరొబాము కారకుడయ్యాడు. హేయమైన తన పనులతో యరొబాము ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మిక్కిలి కోపం కల్గించాడు.
31 నాదాబు చేసిన ఇతర కార్యాలన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి. 32 బయెషా ఇశ్రాయేలును యేలినంత కాలం యూదా రాజైన ఆసాతో యుద్ధాలు చేస్తూనేవున్నాడు.
33 ఆసా యూదా రాజ్యాన్ని మూడవ సంవత్సరం పాలిస్తూండగా, అహీయా కుమారుడైన బయెషా ఇశ్రాయేలుకు రాజయ్యాడు. బయెషా ఇరువది నాలుగు సంవత్సరాలు తిర్సాలో పరిపాలించాడు. 34 కాని బయెషా యెహోవాకు వ్యతిరేకంగా అనేక దుష్టకార్యాలు చేశాడు. యరొబాము చేసిన పాపాలే ఇతడు కూడ చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపం చేయటానికి యరొబాము కారకుడయ్యాడు.
పేతురు తనను నిరాకరిస్తాడని యేసు చెప్పటం
(మత్తయి 26:31-35; మార్కు 14:27-31; యోహాను 13:36-38)
31 “సీమోనూ! సీమోనూ! మిమ్మల్ని గోధుమలు చెరిగినట్లు చెరిగి పరీక్షించటానికి సైతాను అనుమతి పొందాడు. 32 కాని సీమోనూ! నీలో ఉన్న విశ్వాసం సన్నగిల్లరాదని నేను ప్రార్థించాను. నీ విశ్వాసం మళ్ళీ బలపడినప్పుడు నీ సోదరుల విశ్వాసాన్ని గట్టిపరుచు” అని అన్నాడు.
33 కాని సీమోను, “ప్రభూ! మీ వెంట కారాగారానికి రమ్మన్నా, చనిపొమ్మన్నా సిద్ధమే!” అని సమాధానం చెప్పాడు.
34 యేసు, “పేతురూ! నేను చెప్పేది విను. ఈ రోజు కోడి కూయక ముందే నేనెవరినో నీకు తెలియదని మూడు సార్లంటావు” అని అన్నాడు.
రానున్న కష్టాలు
35 ఆ తర్వాత యేసు, “నేను మిమ్మల్ని డబ్బు దాచుకొనే సంచీ, చేతి సంచీ, చెప్పుల జోళ్ళూ లేకుండా పంపినప్పుడు మీ అవసరాలు తీరలేదా?” అని అడిగాడు.
“తీరాయి” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
36 యేసు వాళ్ళతో, “ఇప్పుడు మీ దగ్గర డబ్బులు దాచుకొనే సంచి ఉంటే దాన్ని మీ వెంట తీసుకెళ్ళండి. మీ దగ్గర కత్తి లేకుంటే మీ వస్త్రాన్ని అమ్మి కత్తి కొనండి. 37 లేఖనాల్లో,
‘అతడు నేరస్థునిగా పరిగణింపబడ్డాడు’(A)
అని వ్రాయబడి ఉంది. అది నా విషయంలో నిజమౌతుంది. ఔను! అది యిప్పుడు నా విషయంలో నిజమౌతుంది!” అని అన్నాడు.
38 శిష్యులు ఆయనతో, “ఇదిగో ప్రభూ! యిక్కడ రెండు కత్తులున్నాయి” అని అన్నారు.
“ఆ విషయం ఇక చాలించండి” అని ఆయన అన్నాడు.
యేసు ఏకాంతంగా ప్రార్థించటం
(మత్తయి 26:36-46; మార్కు 14:32-42)
39 “అలవాటు ప్రకారం యేసు ఒలీవల కొండ మీదికి వెళ్ళటానికి బయలుదేరాడు. ఆయన శిష్యులు ఆయన్ని అనుసరించారు. 40 అక్కడికి చేరుకొన్నాక వాళ్ళతో, మీరు శోధనలో పడకుండ ఉండటానికి ప్రార్థించాలి” అని అన్నాడు.
41 ఆయన వాళ్ళనుండి రాయి విసిరినంత దూరం వెళ్ళి, మోకరిల్లి ఈ విధంగా ప్రార్థించాడు: 42 “తండ్రీ! నీకిష్టమైతే ఈ గిన్నె నా నుండి తీసివెయ్యి. కాని నెరవేరవలసింది నా యిచ్ఛ కాదు: నీది.” 43 అప్పుడు ఒక దేవదూత పరలోకంలో నుండి వచ్చి ఆయనకు శక్తినివ్వటానికి ప్రత్యక్షమైనాడు. 44 ఆయన ఆవేదనతో యింకా తీవ్రంగా దేవుణ్ణి ప్రార్థించాడు. నేలమీద పడ్తున్న ఆయన చెమట చుక్కలు రక్తపు చుక్కల్లా ఉన్నాయి. 45 ప్రార్థించటం ముగించాక ఆయన తన శిష్యుల దగ్గరకు వెళ్ళాడు. దుఃఖంవల్ల అలసిపోయి వాళ్ళు నిద్రిస్తూ ఉన్నారు. 46 వాళ్ళతో, “ఎందుకు పడుకున్నారు? లేచి మీరు శోధింపబడకూడదని ప్రార్థించండి” అని అన్నాడు.
© 1997 Bible League International