Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
హోషేయ 9-11

పరదేశపు చెరసాలలో దుఃఖం

ఇశ్రాయేలూ, రాజ్యాలు సంబరం చేసుకున్నట్టు నీవు చేసుకోవద్దు. సంతోషంగా ఉండకు! నీవు ఒక వేశ్యలాగ ప్రవర్తించి, నీ దేవుణ్ణి విడిచిపెట్టేశావు. ప్రతి కళ్లం మీద నీవు నీ లైంగిక పాపం చేశావు. కానీ ఆ కళ్లములనుండి వచ్చే ధాన్యం, ఇశ్రాయేలీయులకు సరిపడినంత ఆహారం ఇవ్వదు. ఇశ్రాయేలుకు సరిపడినంత ద్రాక్షారసం ఉండదు.

ఇశ్రాయేలీయులు యెహోవా దేశంలో నివసించరు. ఎఫ్రాయిము తిరిగి ఈజిప్టుకు వెళ్తుంది. వారు తినకూడని ఆహారం వారు అష్షూరులో తింటారు. ఇశ్రాయేలీయులు ద్రాక్షారసపు అర్పణలు యెహోవాకు అర్పించరు. వారు ఆయనకు జంతువుల బలులు అర్పించరు. వారి బలులు శవసంస్కారమువద్ద తినే భోజనము లాంటిది. ఎవరైతే దాన్ని తింటారో వారు అపరిశుద్ధులవుతారు. వారి రొట్టెలు యెహోవా ఆలయంలోనికి వెళ్లవు-అవి సరిగ్గా వారు బతికి ఉండేందుకు మాత్రమే సరిపోతాయి. వారు (ఇశ్రాయేలీయులు) యెహోవాకు పండుగలు, పవిత్ర దినాలు ఆచరించలేరు.

ఇశ్రాయేలీయులకు కలిగినదంతా శత్రువు తీసుకొన్నందువల్ల ఇశ్రాయేలు వదిలిపెట్టబడింది. కాని ఈజిప్టు ఆ ప్రజలను తీసుకొంటుంది. వారిని మెంఫెసు పట్టణం పాతిపెడ్తుంది. వారి వెండి ఐశ్వర్యాల మీద పిచ్చిమొక్కలు మొలుస్తాయి. ఇశ్రాయేలీయులు నివసించినచోట ముళ్లకంపలు పెరుగుతాయి.

నిజమైన ప్రవక్తలను ఇశ్రాయేలు తిరస్కరించుట

“ఇశ్రాయేలూ, ఈ విషయాలు తెలుసుకో. శిక్షా సమయం వచ్చింది. నీవు చేసిన చెడుకార్యాలకు నీవు ప్రతిఫలం చెల్లించాల్సిన సమయం వచ్చింది” అని ప్రవక్త చెపుతున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు, “ప్రవక్త బుద్ధిలేనివాడు. దేవుని ఆత్మగల ఈ మనిషి వెర్రివాడు” అని అంటున్నారు. “మీ చెడు పాపాల విషయంలో మీరు శిక్షించబడతారు. మీద్వేషం మూలంగా మీరు శిక్షించబడుతారు” అని ప్రవక్త చెపుతున్నాడు. దేవుడు మరియు ప్రవక్త ఎఫ్రాయిముకు కాపలా కాస్తున్న కావలివంటివారు. కాని మార్గం పొడవునా ఎన్నో ఉచ్చులు ఉన్నాయి. మరియు ప్రజలు ప్రవక్తను అతని దేవుని మందిరంలో కూడ అసహ్యించుకొంటున్నారు.

గిబియా కాలంలో వలె, ఇశ్రాయేలీయులు నాశనం లోనికి లోతుగా దిగిపోయారు. ఇశ్రాయేలీయుల పాపాలను యెహోవా జ్ఞాపకం ఉంచుకొంటాడు. వారి పాపాలను ఆయన శిక్షిస్తాడు.

ఇశ్రాయేలు విగ్రహాలను పూజించి పాడవుట

10 “నా మట్టుకైతే ఇశ్రాయేలును చూస్తుంటే, ఎడారిలో ద్రాక్షాపళ్లు చూచినట్టు ఉంది. కాలం మొదట్లో అంజూరపు చెట్లమీద మొదటి పండ్లవంటివారు మీ పూర్వీకులు. అయితే వారు బయల్పెయోరుకు వచ్చారు. వారు మారిపోయారు-వారు ఏదో కుళ్ళిపోయినదానిలా ఉండిరి. వారు తాము ప్రేమించిన దారుణ విషయాల్లాగే (అబద్ధపు దేవుళ్లు) వారూ తయారయ్యారు.

ఇశ్రాయేలీయులకు పిల్లలు లేకుండుట

11 “ఒక పిట్టలాగ ఎఫ్రాయిము మహిమ ఎగిరి పోతుంది. ఇక గర్భములు దాల్చుట ఉండదు. పుట్టుకలు ఇక ఉండవు. పిల్లలు ఇక ఉండరు. 12 కానీ ఒకవేళ ఇశ్రాయేలీయులు పిల్లలను పెంచినా, అది సహాయ పడదు. పిల్లలను వారి దగ్గర్నుండి నేను తీసివేస్తాను. నేను వారిని విడిచిపెట్టేస్తాను. వారికి కష్టాలు తప్ప మరేవీ ఉండవు.” 13 ఎఫ్రాయిము తన పిల్లలను బోను లోనికి నడిపిస్తూ ఉండటం నేను చూడగలను. ఎఫ్రాయిము తన పిల్లలను హంతకుని దగ్గరకు తీసికొని వస్తాడు. 14 యెహోవా, నీ ఇష్టం వచ్చినదాన్ని వారికి చేయి. గర్భస్రావాలు అయ్యే గర్భం వారికి ఇవ్వు, పాలు ఇవ్వలేని స్తనాలు వారికి ఇవ్వు.

15 వారి దుర్మార్గం అంతా గిల్గాలులో ఉంది.
    అక్కడే నేను వారిని అసహ్యించుకోవటం మొదలు బెట్టాను.
వారు చేసే దుర్మార్గపు పనుల మూలంగా వారిని నా ఇంటినుండి నేను వెళ్ల గొట్టేస్తాను.
    ఇంకెంతమాత్రం నేను వారిని ప్రేమించను.
వారి నాయకులు తిరుగుబాటుదారులు.
    వారు నాకు విరోధంగా తిరిగారు.
16 ఎఫ్రాయిము శిక్షించబడుతుంది.
    వారి వేరు చస్తుంది.
    వారికి ఇక పిల్లలు ఉండరు.
వారు పిల్లల్ని కనవచ్చు.
    కానీ వారి శరీరాలనుండి పుట్టే ఆ ప్రశస్త శిశువులను నేను చంపేస్తాను.
17 ఆ ప్రజలు నా దేవుని మాట వినలేదు.
    కనుక ఆయన వారిని నిరాకరించాడు.
వారు ఇల్లులేని వారుగా, రాజ్యాలలో సంచారం చేస్తారు.

ఐశ్వర్యాలే ఇశ్రాయేలునువారిని విగ్రహారాధనకు నడిపించుట

10 విస్తారమైన పండ్లు ఫలించే ద్రాక్షావల్లిలాంటిది ఇశ్రాయేలు.
    ఇశ్రాయేలుకు దేవుని దగ్గరనుండి ఎన్నెన్నో లభించాయి.
కానీ అతడు ఇంకా ఇంకా ఎక్కువ
    బలిపీఠాలను బూటకపు దేవుళ్లకు కట్టాడు.
అతని భూమి క్రమంగా ఎక్కువగా ఫలించింది.
    కనుక అతడు బూటకపు దేవుళ్లను గౌరవించుటకు స్తంభాలను నిలిపాడు.
ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి మోసం చేయాలని
    చూశారు కానీ ఇప్పుడు వారు తమ దోషాన్ని అంగీకరించాలి.
వారి బలిపీఠాలను యెహోవా విరుగగొడ్తాడు.
    వారి స్మారక శిలలను ఆయన నాశనం చేస్తాడు.

ఇశ్రాయేలీయుల చెడు తీర్మానాలు

ఇప్పుడు, “మాకు రాజు లేడు. మేము యెహోవాను గౌరవించము. అయినా రాజు మాకు ఏమీ చేయలేడు.” అని ఇశ్రాయేలీయులు చెపుతారు.

వారు వాగ్దానాలు చేస్తారు కానీ వారు వట్టి అబద్ధాలు మాత్రమే చెపుతున్నారు. వారి వాగ్దానాలను వారు నిలబెట్టుకోరు. ఇతర దేశాలతో వారు ఒప్పందాలు చేస్తారు. ఆ ఒప్పందాలు దేవునికి ఇష్టం లేదు. ఆ న్యాయమూర్తులు, దున్నబడిన పొలంలో విషపు కలుపు మొక్కల్లాంటివారు.

సమరయ ప్రజలు బేతావెను దగ్గర దూడలను పూజిస్తారు. ఆ ప్రజలు, యాజకులు నిజంగా ఏడుస్తారు. ఎందుకంటే అందమైన వారి విగ్రహం ఎత్తుకుపోబడింది. అష్షూరు రాజుకు కానుకగా అది ఎత్తుకొనిపోబడింది. ఎఫ్రాయిము యొక్క అవమానకరమైన విగ్రహాన్ని అతడు ఉంచుకొంటాడు. ఇశ్రాయేలు తన విగ్రహం విషయమై సిగ్గుపడుతుంది. సమరయ బూటకపు దేవుడు నాశనం చేయబడతాడు. అది నీటిమీద తేలిపోతున్న చెక్క ముక్కలాగ ఉంటుంది.

ఇశ్రాయేలు పాపంచేసి, ఎత్తయిన స్థలాలు అనేకం నిర్మించింది. ఆవెనులోనున్న ఎత్తయిన స్థలాలు అన్నీ నాశనం చేయబడతాయి. వాటి బలిపీఠాలమీద ముళ్ల కంపలు, పిచ్చిమొక్కలు మొలుస్తాయి. అప్పుడు వారు “మమ్మల్ని కప్పండి!” అని పర్వతాలతోను, “మా మీద పడండి!” అని కొండలతోను చెపుతారు.

ఇశ్రాయేలు తన పాపానికి పరిహారం చెల్లించుట

“ఇశ్రాయేలూ, గిబియా కాలంనుండి నీవు పాపం చేశావు. (మరియు ఆ ప్రజలు అక్కడ పాపం చేస్తూనే ఉన్నారు). ఆ దుర్మార్గులను గిబియాలో యుద్ధం నిజంగా పట్టుకొంటుంది. 10 వారిని శిక్షించటానికి నేను వస్తాను. వారికి విరోధంగా సైన్యాలు కలిసి ఉమ్మడిగా వస్తాయి. ఇశ్రాయేలీయులను వారి రెండు పాపాల నిమిత్తం ఆ సైన్యాలు శిక్షిస్తాయి.

11 “ఎఫ్రాయిము నూర్పిడి కళ్లంలో ధాన్యం మీద నడవడానికి ఇష్టపడే శిక్షణగల పెయ్యలాగ ఉన్నాడు. దాని మెడమీద నేను ఒక కాడిని పెడతాను. తాళ్లను నేను ఎఫ్రాయిము మీద ఉంచుతాను. అప్పుడు యూదా దున్నటం మొదలు పెడతాడు. యాకోబు తానే భూమిని చదును చేస్తాడు.”

12 నీవు మంచితనాన్ని నాటితే సత్య ప్రేమను కోస్తావు. నీవు నేలను దున్ని యెహోవాతో కలిసి పంటకోస్తావు. ఆయన వచ్చి, మంచితనాన్ని వర్షంలాగ నీమీద కురిపిస్తాడు!

13 కానీ మీరు దుర్మార్గం నాటారు. కష్టాన్ని పంటగా కోశారు. మీ అబద్ధాల ఫలం మీరు తిన్నారు. ఎందుచేతనంటే మీరు మీ శక్తిని, మీ సైనికులను నమ్ముకొన్నారు. 14 కనుక మీ సైన్యాలు యుద్ధ ధ్వనులు వింటాయి. మరియు మీ కోటలన్నీ నాశనం చేయబడతాయి. అది షల్మాను బేతర్బేలును నాశనం చేసిన సమయంలాగా ఉంటుంది. ఆ యుద్ధ సమయంలో తల్లులు వారి పిల్లలతో పాటు చంపబడ్డారు. 15 మీకు కూడ బేతేలువద్ద అలాగే జరుగుతుంది. ఎందుచేతనంటే, మీరు చాలా దుర్మార్గపు పనులు చేశారు గనుక. ఆ రోజు ప్రారంభమైనప్పుడు ఇశ్రాయేలు రాజు సర్వనాశనం చేయబడతాడు.

ఇశ్రాయేలు యెహోవాను మరచి పోవుట

11 “ఇశ్రాయేలు చిన్నబిడ్డగా ఉన్నప్పుడు నేను (యెహోవా) వానిని ప్రేమించాను.
    మరియు ఈజిప్టు నుండి నా కుమారుని బయటకు పిలిచాను.
కాని, ఇశ్రాయేలీయులను ఎంత ఎక్కువగా నేను పిలిస్తే
    అంత ఎక్కువగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపెట్టారు.
బయలు దేవతలకు ఇశ్రాయేలీయులు బలులు అర్పించారు.
    విగ్రహాలకు వారు ధూపం వేశారు.

“అయితే ఎఫ్రాయిముకు నడవటం నేర్పింది నేనే!
    ఇశ్రాయేలీయులను నేను నా చేతులతో ఎత్తుకొన్నాను!
నేను వారిని స్వస్థపరిచాను.
    కాని అది వారికి తెలియదు.
తాళ్లతో నేను వారిని నడిపించాను.
    కాని అవి ప్రేమ బంధాలు.
నేను వారిని విడుదల చేసిన వ్యక్తిలాగవున్నాను.
    నేను వంగి వారికి భోజనం పెట్టాను.

“ఇశ్రాయేలీయులు దేవుని దగ్గరకు మళ్లుకొనుటకు నిరాకరించారు. కనుక వారు ఈజిప్టు వెళ్తారు! అష్షూరు రాజు వారికి రాజు అవుతాడు. వారి పట్టణాలకు విరోధంగా ఖడ్గం విసరబడుతుంది. బలమైన వారి మనుష్యులను అది చంపుతుంది. వారి నాయకులను అది నాశనం చేస్తుంది.

“నేను తిరిగిరావాలని నా ప్రజలు కోరుకుంటున్నారు. పైనున్న దేవున్ని వాళ్లు వేడుకుంటారు. కాని, దేవుడు వాళ్లకు సహాయం చేయడు.”

యెహోవా ఇశ్రాయేలుని నాశనం చేయడు

“ఎఫ్రాయిమూ, నిన్ను వదులుకోవాలన్న కోర్కె నాకు లేదు.
    ఇశ్రాయేలూ, నిన్ను కాపాడాలన్నదే నా కోర్కె.
నిన్ను అద్మావలె చెయ్యాలన్న కోర్కె నాకు లేదు!
    నిన్ను సెబొయీములాగ చెయ్యాలనీ లేదు!
నేను నా మనసు మార్చుకుంటున్నాను,
    నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను.
నేను నా కోపాగ్నిని అణచుకొంటాను.
    నేను మరోమారు ఎఫ్రాయిమును నాశనం చేయను.
నేను మనిషిని కాను, నేను పవిత్రమైన దేవుణ్ణి.
    నేను నీతోవున్నాను కాబట్టి నేను నీపై నా కోపం చూపను.
10 నేను సింహంలాగ గర్జిస్తాను. నేను గర్జించగానే,
    నా బిడ్డలు వచ్చి నన్ను అనుసరిస్తారు.
భయంతో కంపిస్తూ నా బిడ్డలు
    పశ్చిమ దిశనుంచి వస్తారు.
11 వాళ్లు ఈజిప్టు నుంచి
    పక్షుల్లా వణుకుతూ వస్తారు.
వాళ్లు అష్షూరు దేశంనుంచి పావురాలవలె కదులుతూ వస్తారు.
    నేను వాళ్లని తిరిగి ఇంట చేరుస్తాను” అని యెహోవా చెప్పాడు.
12 “బూటకపు దేవుళ్లతో ఎఫ్రాయిము నన్ను చుట్టుముట్టాడు.
    ఇశ్రాయేలీయులు నాకు విరోధంగా తిరిగారు. మరియు వాళ్లు నశింపజేయబడ్డారు!
కాని, యూదా యింకా ఎల్‌-తోనే[a] నడుస్తున్నాడు.
    యూదా అపవిత్రులకు నమ్మకస్తుడుగా ఉన్నాడు.”

ప్రకటన 3

సార్దీసులోని సంఘానికి

“సార్దీసులోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:

“దేవుని ఏడు ఆత్మలను, ఏడు నక్షత్రాలను తన ఆధీనంలో ఉంచుకొన్నవాడు ఈ విధంగా చెబుతున్నాడు:

“నీవు చేస్తున్న పనులు నాకు తెలుసు. ప్రజలు నీవు బ్రతికి ఉన్నావని అనుకొంటున్నారు. కాని నీవు నిజానికి చనిపోయిన వానితో సమానము. నా దేవుని దృష్టిలో నీవు చేస్తున్న పనులు యింకా పూర్తి కాలేదు. ఇది నేను గమనించాను. కనుక జాగ్రత్త. నీలో ఉన్న శక్తి పూర్తిగా నశించకముందే నీ శక్తిని కాపాడుకో. నీకు లభించినదాన్ని, నీవు విన్నదాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ఆచరించు. మారుమనస్సు పొందు. కాని నీవు జాగ్రత్తగా ఉండకపోతే నేను ఒక దొంగలా వస్తాను. నేను ఎప్పుడు వస్తానో నీవు తెలుసుకోలేవు.

“మలినంకాని కొందరు వ్యక్తులు అక్కడ సార్దీసులో నీ దగ్గరున్నారు. వాళ్ళు యోగ్యులు కనుక, తెల్లని దుస్తులు ధరించి నాతో సహా నడుస్తారు. విజయం సాధించిన వాళ్ళలా తెల్లని దుస్తులు ధరించండి. అలా చేసినవాని పేరును నేను జీవగ్రంథంనుండి తుడిచివేయను. అతణ్ణి నా తండ్రి ముందు, దేవదూతల ముందు అంగీకరిస్తాను. సంఘాలకు ఆత్మ చెబుతున్నదాన్ని ప్రతివాడు వినాలి.

ఫిలదెల్ఫియలోని సంఘానికి

“ఫిలదెల్ఫియలోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:

“పవిత్రమైనవాడు, సత్యవంతుడు, దావీదు తాళంచెవి ఉన్నవాడు ఈ విధంగా చెబుతున్నాడు. ఆయన తెరిచినదాన్ని ఎవ్వరూ మూయలేరు.(A) ఆయన మూసినదాన్ని ఎవ్వరూ తెరువలేరు.

“నీ పనులు నాకు తెలుసు. అదిగో చూడు! ఎవ్వరూ మూయలేని ద్వారాన్ని నీ ముందు ఉంచాను. నీ దగ్గర ఎక్కువ బలంలేదని నాకు తెలుసు. అయినా నా పేరును తృణీకరించకుండా అంగీకరించావు. సాతాను మందిరానికి చెందినవాళ్ళను, యూదులు కాకున్నా యూదులమని చెప్పుకొనేవాళ్ళను, అబద్ధాలాడేవాళ్ళను, నీ కాళ్ళ ముందు పడేటట్లు చేస్తాను. నాకు నీ పట్ల ప్రేమ ఉందని వాళ్ళు తెలుసుకొనేటట్లు చేస్తాను. 10 సహనంతో కష్టాలు అనుభవించమని నేను ఆజ్ఞాపించాను. నీవా ఆజ్ఞను పాటించావు. కనుక విచారించే సమయం వచ్చినప్పుడు నిన్ను రక్షిస్తాను. ఈ ప్రపంచంలో నివసిస్తున్నవాళ్ళందరిపై విచారణ జరిగే సమయం రాబోతోంది.

11 “నేను త్వరలోనే రాబోతున్నాను. నీ దగ్గరున్నదాన్ని అంటిపెట్టుకొని ఉండు. అలా చేస్తే నీ కిరీటాన్ని ఎవ్వరూ తీసుకోలేరు. 12 అలా విజయం సాధించిన వాణ్ణి, నేను నా దేవుని మందిరంలో ఒక స్తంభంలా ఉంచుతాను. అతనా స్థానాన్ని ఎన్నటికీ వదిలి వెళ్ళడు. నేను అతనిపై నా దేవుని పేరు వ్రాస్తాను. నా దేవుని నగరమైన క్రొత్త యెరూషలేము పేరు వ్రాస్తాను. ఈ క్రొత్త యెరూషలేము పరలోకంలో ఉన్న నా దేవుని దగ్గరినుండి వస్తోంది. అతని మీద నా క్రొత్త పేరు కూడా వ్రాస్తాను. 13 సంఘాలకు ఆత్మ చెబుతున్న విషయాలను ప్రతివాడు వినాలి.

లవొదికయలోని సంఘానికి

14 “లవొదికయలోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:

“ఈ విషయాలకు ఆమేన్[a] అనువాడును, దేవుడు సృష్టించిన వాటన్నిటికీ మొదటివాడును, నిజమైన సాక్షి అయినవాడును చెప్పుచున్నాడు.

15 “నీవు చేసిన పనుల్ని గురించి నాకు తెలుసు. నీలో చల్లదనం గాని వేడిమి గాని లేదు. రెండింటిలో ఏదైనా ఒకటి నీలో ఉండాలని నా కోరిక. 16 నీవు వేడిగానూ లేవు, చల్లగానూ లేవు. గోరు వెచ్చగా ఉన్నావు. కనుక నిన్ను నా నోటి నుండి బయటకు ఉమ్మి వేయబోతున్నాను. 17 ‘నేను ధనవంతుణ్ణి, నా దగ్గర ఐశ్వర్యం ఉంది. నాకు ఏ కొరతా లేదు’ అని నీవంటున్నావు. కాని నీవు దౌర్భాగ్యుడవు. దీనావస్థలో ఉన్నావు. నీవు దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు. 18 నీవు ధనవంతుడవు కావాలనుకొంటే, నిప్పులో పుటం వేయబడిన బంగారాన్ని నా దగ్గర నుండి కొనుమని సలహా ఇస్తున్నాను. సిగ్గు కలిగించే నీ దిగంబరత్వాన్ని దాచుకోవటానికి నా నుండి తెల్లని దుస్తులు కొనుమని సలహా ఇస్తున్నాను. నా నుండి కాటుకను కూడా కొనుక్కొని నీ కళ్ళకు పెట్టుకో. అప్పుడు చూడగల్గుతావు.

19 “నేను ప్రేమించిన వాళ్ళను గద్దిస్తాను. వాళ్ళను శిక్షిస్తాను. అందువల్ల నిజాయితితో ఉండి పశ్చాత్తాపం చెందు. 20 ఇదిగో! నేనిక్కడ తలుపు దగ్గర నిలబడి తట్టుతున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తెరిస్తే నేను లోపలికి వచ్చి అతనితో కలిసి తింటాను. అతడు నాతో కలిసి తింటాడు.

21 “నేను విజయం సాధించి నా తండ్రితో కలిసి ఆయన సింహాసనంపై కూర్చున్నాను. అదే విధంగా విజయం సాధించినవాడు నాతో సింహాసనంపై కూర్చుంటాడు. 22 సంఘాలకు ఆత్మ చెబుతున్న వాటిని ప్రతివాడు వినాలి.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International