Old/New Testament
యూదా రాజుగా అమజ్యా
25 రాజు అయ్యేనాటికి అమజ్యా ఇరువదియైదు సంవత్సరాలవాడు. అతడు యెరూషలేము నుండి ఇరువై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెహోయద్దాను. యెహోయద్దాను యెరూషలేముకు చెందిన స్త్రీ. 2 యెహోవా అతని నుండి ఆశించిన పనులన్నీ అమజ్యా నిర్వర్తించాడు. కాని అతడు ఆ పనులను తన పూర్ణ హృదయంతో చేయలేదు. 3 అమజ్యా రాజుగా బలపడ్డాడు. తరువాత రాజైన తన తండ్రిని చంపిన అధికారులను అతడు చంపివేశాడు. 4 కాని అమజ్యా ఆ అధికారుల పిల్లలను మాత్రం చంపలేదు. ఎందువల్లనంటే, మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన నియమ నిబంధనలను అతడు పాటించాడు. యెహోవా యిలా ఆజ్ఞాపించాడు: “తమ పిల్లలు చేసిన నేరానికి వారి తండ్రులు చనిపోరాదు. తమ తండ్రులు చేసిన పాపాలకు వారి పిల్లలు చనిపోరాదు. ప్రతి వ్యక్తి తన పాపాలకు ఫలితంగా తానే చనిపోవాలి.”[a]
5 యూదా ప్రజలందరినీ అమజ్యా సమావేశ పర్చాడు. వారందరినీ వారి వారి కుటుంబాల వారీగా విడగొట్టి, సహస్రాధిపతులను, శతాధిపతులను వారిపై నియమించాడు. ఈ అధికారులు యూదా, బెన్యామీనుకు చెందిన సైనికులపై నియమింపబడ్డారు. సైనికులుగా ఎన్నుకోబడిన వారంతా ఇరువది ఏండ్ల యువకులు, అంతకు పైబడినవారు. ఈటెలు, డాళ్లు పట్టి యుద్ధానికి సిద్ధంగా వున్న మూడు లక్షల మంది నిపుణులైన సైనికులున్నారు. 6 ఇశ్రాయేలు నుండి అమజ్యా ఒక లక్ష మంది సైనికులను కిరాయికి నియమించాడు. కిరాయి క్రింద వారికి రెండు వందల మణుగుల వెండిని అతడు చెల్లించాడు. 7 కాని ఒక దైవజ్ఞుడు (ప్రవక్త) అమజ్యా వద్దకు వచ్చాడు. ఆ ప్రవక్త యిలా అన్నాడు: “రాజా ఇశ్రాయేలు సైన్యాన్ని నీతో తీసుకొని వెళ్లవద్దు. యెహోవా ఇశ్రాయేలు పక్షానలేడు. యెహోవా ఎఫ్రాయిము[b] ప్రజలతో లేడు. 8 బహుశా నీవు యుద్ధానికి మంచి కట్టుదిట్టం చేసుకొని సిద్ధంగా వుండవచ్చు. కాని దేవుడు నీవు గెలిచేలా చేయవచ్చు, లేదా ఓడిపోయేలా చేయవచ్చు.” 9 అమజ్యా దైవజ్ఞునితో, “అయితే నేను ఇశ్రాయేలు సైన్యానికి ఇప్పటి వరకు చెల్లించిన డబ్బు సంగతి ఏమిటి?” అని అన్నాడు. దానికి దైవజ్ఞుడు, “ప్రభువైన యెహోవా వద్ద చాలా వుంది. ఆయన నీకు దానికంటె చాలా ఎక్కువ యివ్వగలడు!” అని చెప్పాడు.
10 అందువల్ల అమజ్యా ఇశ్రాయేలు సైన్యాన్ని ఎఫ్రాయిముకు తిప్పి పంపివేశాడు. ఈ సైనికులకు రాజు మీద, యూదా ప్రజలమీద చాలా కోపం వచ్చింది. మిక్కిలి కోపంతో వారు ఇండ్లకు తిరిగి వెళ్లారు.
11 పిమ్మట అమాజ్యా మంచి ధైర్యం తెచ్చుకొని తన సైన్యాన్ని ఎదోము దేశంలో ఉన్న ఉప్పు లోయకు నడిపించాడు. ఆ ప్రదేశంలో శేయీరు (ఎదోము) కు చెందిన పదివేల మందిని అమజ్యా సైన్యం చంపివేసింది. 12 యూదా సైన్యం శేయీరుకు చెందిన పదివేల మందిని బందీలుగా పట్టుకున్నది. ఆ బందీలను శేయీరు నుండి ఒక కొండ శిఖరం మీదికి వారు తీసుకొని వెళ్లారు. అప్పటికి బందీలంతా బ్రతికే వున్నారు. వారందరినీ యూదా సైన్యం కొండ శిఖరం నుండి త్రోసివేయగా వారి శరీరాలు క్రింద రాళ్ల పైబడి ముక్కలు ముక్కలై పోయాయి.
13 కాని అదే సమయంలో ఇశ్రాయేలు సైన్యం యూదాలో కొన్ని పట్టణాలపై దాడి చేస్తూ వుంది. బేత్‌హోరోను నుండి సమరయ (షోమ్రోను) వరకు వున్న పట్టణాలపై వారు దాడి జరిపారు. వారు కూడ మూడ వేల మందిని చంపి, చాలా విలువైన వస్తువులను కొల్లగొట్టారు. అమజ్యా వారిని తన సైన్యంతో కలిసి యుద్ధానికి రానివ్వక పోవటంతో ఆ సైనికులు చాలా కోపగించి వున్నారు.
14 ఎదోమీయులను (శేయీరు వారిని) ఓడించిన పిమ్మట అమజ్యా ఇంటికి తిరిగి వచ్చాడు. శేయీరు ప్రజలు పూజించే విగ్రహాలన్నిటినీ అతడు తీసుకొని వచ్చాడు. అమజ్యా ఆ విగ్రహాలనే పూజించటం మొదలు పెట్టాడు. అతడా విగ్రహాలకు సాష్టాంగపడి, వాటికి దూపం వేయసాగాడు. 15 అమజ్యా పట్ల యెహోవాకు చాలా కోపం వచ్చింది. యెహోవా అమజ్యా వద్దకు ఒక ప్రవక్తను పంపాడు. ఆ ప్రవక్త యిలా అన్నాడు: “అమజ్యా, ఆ ప్రజలు పూజించిన దేవుళ్లను నీవెందుకు కొలుస్తున్నావు? ఆ దేవుళ్లు వారి ప్రజలనే నీనుండి కాపాడలేక పోయారు!”
16 ప్రవక్త చెప్పటం ముగించాక, అమజ్యా ప్రవక్తతో యిలా అన్నాడు: “మేము నిన్ను రాజుకు సలహాదారుగా ఎన్నడూ నియమించలేదే! నీవు మాట్లడవద్దు! నీవు నోరు మూయకపోతే నీవు చంపబడతావు!” ప్రవక్త మౌనం వహించాడు. తరువాత ప్రవక్త మళ్లీ యిలా అన్నాడు: “దేవుడు నిన్ను నాశనం చేయటానికే నిశ్చయించాడు. నీవు అటువంటి నీచకార్యాలు చేయటంతో పాటు, నా సలహా కూడ పెడచెవిని పెట్టావు.”
17 యూదా రాజైన అమజ్యా తన సలహాదారులతో సంప్రదించాడు. తరువాత యెహోయాషుకు ఒక వర్తమానం పంపాడు. యెహోయాషు, “మనం ఒకరితో ఒకరు ముఖాముఖి పోరాడదాము” అని అమజ్యా కబురు పంపాడు. యెహోయాషు తండ్రిపేరు యెహోయాహాజు. యెహోయాహాజు తండ్రి పేరు యెహూ. యెహూ ఇశ్రాయేలు రాజు.
18 పిమ్మట యెహోయాషు తన సమాధానాన్ని అమజ్యాకు పంపాడు. యెహోయాషు ఇశ్రాయేలు రాజు. అమజ్యా యూదా రాజు. యెహోయాషు ఈ కథ చెప్పి పంపాడు: “లెబానోనుకు చెందిన ఒక చిన్న ముండ్ల పొద లెబానోనులోని ఒక పెద్ద దేవదారు వృక్షానికి ఒక వర్తమానం పంపింది. ఆ చిన్న ముండ్ల పోద, ‘నా కుమారుణ్ణి నీ కుమార్తెను వివాహం చేసుకోనియ్యి,’ అని అన్నది. కాని ఈలోపల ఒక అడవి జంతువు వచ్చి ఆ చిన్న ముండ్ల పొదను తొక్కి నాశనం చేసేసింది. 19 ‘నేను ఎదోమును ఓడించాను’ అని నీవు గర్వపడుతున్నావు. గొప్పలు చెప్పుకొంటున్నావు. ఇక నీవు ఇంటి వద్దనే వుండు. కోరి కష్టాలు తెచ్చుకోకు. నీవు నాతో యుద్ధం చేస్తే నీవు, యూదా నాశనమవ్వటం ఖాయం.”
20 కాని ఆమజ్యా ఈ సలహా వినటానికి నిరాకరించాడు. ఇదంతా దేవుని సంకల్పంతోనే జరుగుతూవుంది. ఎదోమీయులు కొలిచిన దేవుళ్లను యూదా ప్రజలు ఆరాధించిన నేరానికి, ఇశ్రాయేలు చేతిలో యూదా ఓడిపోయేలా యెహోవా పథకం సిద్ధం చేశాడు. 21 కావున ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాను బేత్షెమెషు పట్టణం వద్ద ముఖాముఖి ఎదుర్కొన్నాడు. బేత్షెమెషు పట్టణం యూదాలో వుంది. 22 ఇశ్రాయేలు యూదాను ఓడించింది. యూదా సైన్యంలో ప్రతివాడూ తన ఇంటికి పారిపోయాడు. 23 అమజ్యాను బేత్షేమెషు పట్టణం వద్ద యెహోయాషు పట్టుకుని, యెరూషలేముకు తీసుకొని పోయాడు. అమజ్యా తండ్రి పేరు యోవాషు. యోవాషు తండ్రి పేరు యెహోయాహాజు. యెహోయాషు ఆరువందల అడుగుల (నాలుగువందల మూరలు) మేరకు యెరూషలేము గోడను ఎఫ్రాయిము ద్వారం నుండి మూల ద్వారం వరకు పడగొట్టాడు. 24 పిమ్మట యెహోయాషు వెండిని, బంగారాన్ని, ఇతర పరికరాలన్నిటినీ ఆలయం నుండి పట్టుకుపోయాడు. ఆలయంలో వస్తువుల సంరక్షణ బాధ్యత ఓబేదెదోముది. యెహోయాషు రాజగృహం నుండి విలువైన వస్తువులను కూడ తీసుకొని పోయాడు. కొంతమంది మనుష్యులను బందీలుగా పట్టుకున్నాడు. పిమ్మట అతడు సమరయకు వెళ్లిపోయాడు.
25 యెహోయాషు చనిపోయిన తరువాత అమజ్యా పదిహేను సంవత్సరాలు బతికాడు. అమజ్యా తండ్రిపేరు యూదా రాజైన యోవాషు. 26 మొదటి నుండి చివరి వరకు అమజ్యా చేసిన ఇతర కార్యాలన్నీ యూదా, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో వ్రాయబడ్డాయి. 27 అమజ్యా యెహోవాకు విధేయుడుగా వుండటం మానివేసినప్పటి నుండి, యెరూషలేము ప్రజలు అమజ్యాకు వ్యతిరేకంగా కుట్రచేశారు. అతడు లాకీషు పట్టణానికి పారిపోయాడు. కాని ప్రజలు కొందరు మనుష్యులను లాకీషు పట్టణానికి పంపగా వారు అమజ్యాను అక్కడ చంపివేశారు. 28 వారతని శావాన్ని గుర్రాలమీద వేసుకొని తెచ్చి యూదా నగరంలో అతని పితరుల దగ్గర సమాధి చేశారు.
యూదా రాజుగా ఉజ్జియా
26 తరువాత అమజ్యా స్థానంలో కొత్త రాజుగా ప్రజలు ఉజ్జియాను ఎంచుకున్నారు. ఉజ్జియా తండ్రి పేరు అమజ్యా. ఇది జరిగే నాటికి ఉజ్జియా పదహారు సంవత్సరాలవాడు. 2 ఎలతు పట్టణాన్ని ఉజ్జియా తిరిగి నిర్మించి యూదాకు యిచ్చాడు. అమజ్యా చనిపోయి, తన పూర్వీకులతో సమాధి చేయబడిన తరువాత ఉజ్జియా ఇది చేశాడు.
3 తాను రాజయ్యేనాటికి ఉజ్జియా పదహారు సంవత్సరాలవాడు. యెరూషలేములో అతడు ఏబై రెండు సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు యెకొల్యా. యెకొల్యా యెరూషలేముకు చెందిన స్త్రీ. 4 యెహోవా అతని నుండి ఆశించిన విధంగా ఉజ్జియా తన కార్యకలాపాలు కొనసాగించాడు. తన తండ్రి అమజ్యావలెనే ఉజ్జియా కూడా దేవుని పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నాడు. 5 జెకర్యా జీవించి ఉన్న కాలంలోనే ఉజ్జియా దేవుని సేవకుడయ్యాడు. ప్రభువైన యెహోవా పట్ల ఎలా భక్తి విశ్వాసాలు కలిగి వుండాలో జెకర్యా ఉజ్జియాకు నేర్పాడు. ఉజ్జియా యెహోవాకు విధేయుడై వున్నంతకాలం, ఆయన అతనికి విజయం చేకూర్చి పెట్టాడు.
6 ఫిలిష్తీయులతో ఉజ్జియా యుద్ధం చేశాడు. గాతు, యబ్నె, అష్డోదు పట్టణాల చుట్టూ వున్న ప్రాకారాలను అతడు పడగొట్టాడు. అష్టోదు పట్టణానికి దగ్గరగాను, మరియు ఫిలిష్తీయులు నివసించే ప్రాంతాలలోను ఉజ్జియా కొన్ని పట్టణాలను నిర్మించాడు. 7 ఫిలిష్తీయులతోను, గూర్బయలులో నివసిస్తున్న అరబీయులతోను, మెహోనీయులతోను ఉజ్జియా జరిపిన యుద్ధాలలో యెహోవా అతనికి విజయం చేకూర్చాడు. 8 అమ్మోనీయులు ఉజ్జియాకు కప్పం చెల్లించారు. ఈజిప్టు సరిహద్దులవరకు ఉజ్జియా పేరు ప్రతిష్ఠలు వ్యాపించాయి. మిక్కిలి బలపరాక్రమాలు కలవాడగుటచే ఉజ్జియా ప్రసిద్ధిగల వ్యక్తి అయ్యాడు.
9 యెరూషలేములో మూలద్వారాం వద్ద, లోయ ద్వారం వద్ద, మరియు గోడమలుపు వద్ద ఉజ్జియా బురుజులు కట్టించి బాగా బలపర్చాడు. 10 ఎడారిలో సహితం ఉజ్జియా బురుజులు కట్టించాడు. అతడు చాలా బావుల కూడా తవ్వించాడు. కొండల (మన్యం) ప్రాంతంలోను, మైదాన ప్రాంతాలలోను అతనికి పశుసంపద విస్తారంగా వుంది. పంట సాగుకు అనువైన కొండలయందు, మైదానములందు ఉజ్జియాకు వ్యవసాయదారులున్నారు. ద్రాక్షతోటల పెంపకంలో శ్రద్ధవహించే రైతులు కూడ అతనికి వున్నారు. అతడు వ్యవసాయ రంగాన్ని అభిమానించాడు.
11 ఉజ్జియాకు మంచి శిక్షణ పొందిన సైన్యం ఉంది. కార్యదర్శి యెహీయేలు, మరో అధికారి మయశేయా అనేవారు సైన్యాన్ని, వివిధ భాగాలుగా విభజించారు. వారి పైఅధికారి హనన్యా. యెహీయేలు, మయశేయా సైనికులందరినీ లెక్కించి వారిని పటాలాలుగా విభజించారు. హనన్యా రాజాధికారులలో ఒకడు. 12 సైనికులపై అధికారులే రెండువేల ఆరువందల మంది ఉన్నారు. 13 వంశాలవారీ ఎంపికైన సైన్యాధికారుల క్రింద మొత్తం మూడు లక్షల ఏడువేల ఐదువందల మంది యుద్ధంలో కాకలు తీరిన సైనికులున్నారు. ఆ సైనికులు శత్రువుల నుండి రక్షణ పొందటానికి రాజుకు సహాయపడతారు. 14 ఉజ్జియా సైన్యానికి డాళ్లు, ఈటెలు, శిరస్త్రాణాలు కవచాలు విల్లంబులు, ఒడిసెల రాళ్లు సరఫరా చేశాడు. 15 మేధావులు తమ కల్పనా శక్తితో రూపొందించిన యంత్రాలను ఉజ్జియా యెరూషలేములో తయారుచేయించాడు. ఆ యంత్రాలను బురుజుల మీద, గోడలు కలిసిన మూలల మీద ఉంచాడు. ఈ యంత్రాలు బాణాలు వదలటం, బండరాళ్లు విసిరి వేయటం మొదలైన పనులు చేసేవి. ఉజ్జియా చాలా ప్రఖ్యాతి గాంచాడు. దూర ప్రదేశాలలో కూడ ప్రజలు అతని పేరు విన్నారు. అతనికి ఎడతెగని సహాయం అందటంతో అతను చాలా శక్తివంతమైన రాజు అయ్యాడు.
16 ఉజ్జియా గొప్పవాడు కావటంతో పాటు, గర్విష్ఠి కూడా అయ్యాడు. అతని గర్వమే అతని వినాశనానికి కారణమయ్యింది. అతని దేవుడైన యెహోవాకు అతడు విశ్వాసపాత్రుడు కాలేదు. బలిపీఠం మీద ధూపం వేయటానికి అతడు ఆలయంలోకి వెళ్లాడు. 17 యాజకుడైన అజర్యా, మరియు ధైర్యంగల యెహోవా సేవకులు ఎనుబది మంది ఉజ్జియాను వెంబడించి ఆలయంలోకి వెళ్లారు. 18 ఉజ్జియా తప్పు చేస్తున్నట్లు వారతనిని మందలించారు. వారు యిలా అన్నారు: “ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయటం నీ పనికాదు. ఈ పని చేయటం నీకు మంచిది కాదు. యాజకులైన అహరోను సంతానంవారు మాత్రమే యెహోవాకు ధూపం వేయాలి. ధూపం వేసే పవిత్ర కార్యానికి ఈ యాజకులు శిక్షణ పొందారు. ఈ అతిపవిత్ర స్థలం నుండి నీవు బయటకు పొమ్ము. నీవు విశ్వాసంగా లేవు. ప్రభువైన యెహోవా నీ ఈ ప్రవర్తనకు నిన్ను గౌరవించడు!”
19 కాని ఉజ్జియాకు కోపం వచ్చింది. అతని చేతిలో ధూపకలశం ఉంది. యాజకులపట్ల ఉజ్జియా కోపగించుకుంటూ ఉండగనే అతని నుదటిపై కుష్ఠురోగం[c] పుట్టింది. ఆలయంలో ధూపపీఠం ప్రక్కనేవున్న యాజకుల ముందే ఇది జరిగింది. 20 ప్రధాన యాజకుడైన అజర్యా, మరియు ఇతర యాజకులు ఉజ్జియా వైపు చూశారు. అతని నుదటి మీద కుష్ఠు రోగాన్ని వారు చూడగలిగారు. యాజకులు వెంటనే ఉజ్జియాను ఆలయం నుండి బయటికి తరిమేశారు. యెహోవా అతనిని శిక్షకు గురిచేసిన కారణంగా ఉజ్జియా తనకుతానే బయటకు వచ్చాడు. 21 రాజైన ఉజ్జియా కుష్ఠురోగి అయ్యాడు. అతడు యెహోవా ఆలయంలో మళ్లీ ప్రవేశించలేక పోయాడు. ఉజ్జియా కుమారుడు యోతాము రాజగృహ కార్యక్రమాలు నిర్వహిస్తూ, రాజు తరపున ప్రజాపాలకుడయ్యాడు.
22 మొదటి నుండి చివరి వరకు ఉజ్జియా చేసిన ఇతర కార్యాలన్నీ ప్రవక్తయైన యెషయా వ్రాశాడు. యెషయా తండ్రిపేరు ఆమోజు. 23 ఉజ్జియా చనిపోయినప్పుడు అతనిని అతని పూర్వీకుల దగ్గరగా సమాధిచేశారు. ఉజ్జియా కుష్ఠురోగి కావటంవల్ల రాజుల శ్మశాన వాటికకు దగ్గరలోవున్న పొలంలో అతడు సమాధి చేయబడ్డాడు. పిమ్మట ఉజ్జియా స్థానంలో అతని కుమారుడు యోతాము కొత్త రాజు అయ్యాడు.
యూదా రాజుగా యోతాము
27 యోతాము రాజయ్యేనాటికి ఇరువదియైదు సంవత్సరాలవాడు. యెరూషలేములో అతడు పదహారు సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు యెరూషా. యెరూషా సాదోకు కుమార్తె. 2 యెహోవా కోరిన విధంగా యోతాము కార్యకలాపాలు నిర్వర్తించాడు. తన తండ్రి ఉజ్జియా మాదిరిగానే అతడు దేవునికి విధేయుడై వున్నాడు. కాని తన తండ్రి చేసిన విధంగా ధూపం వేయటానికి యోతాము ఆలయం ప్రవేశించలేదు. అయినా ప్రజలు మాత్రం తమ దుష్ట నడతను మానలేదు. 3 ఆలయపు పైద్వారాన్ని యోతాము తిరిగి నిర్మించాడు. ఓపెలు అనే స్థలంలో గోడమీద ఎక్కువ నిర్మాణాన్ని చేపట్టాడు. 4 యూదాలో కొండల ప్రాంతంలో యోతాము పట్టణాలను నిర్మించాడు. యోతాము అరణ్యాలలో కోటలను, బురుజులను కట్టించాడు. 5 యోతాము అమ్మోనీయుల రాజుతోను, అతని సైన్యంతోను పోరాడి వారిని ఓడించాడు. కావున మూడేళ్లపాటు ప్రతి సంవత్సరం అమ్మోనీయులు రెండు వందల మణుగుల[d] వెండి, పదివేల ఏదుముల[e] గోధుమలు, పదివేల ఏదుముల యవలు కప్పంగా చెల్లించారు.
6 తన దేవుడైన యెహోవా పట్ల సత్యవర్తనుడై విధేయుడైనందున యోతాము చాలా శక్తివంతమైన రాజు అయ్యాడు. 7 యోతాము చేసిన ఇతర కార్యాలు, అతడు నిర్వహించిన యుద్ధాలగురించి ఇశ్రాయేలు, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి. 8 యోతాము రాజయ్యేనాటికి ఇరువదియైదు సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో పదహారు సంవత్సరాలు పరిపాలించాడు. 9 తరువాత యోతాము చనిపోగా, అతనిని తన పూర్వీకులతో సమాధి చేశారు. ప్రజలతనిని దావీదు నగరంలో[f] సమాధి చేశారు. యోతాము స్థానంలో ఆహాజు రాజయ్యాడు. యోతాము కుమారుడే ఆహాజు.
16 “మీ విశ్వాసం చెదిరిపోకూడదని ఈ విషయాలన్నీ మీకు చెప్పాను. 2 వాళ్ళు మిమ్మల్ని సమాజ మందిరాల నుండి వెలి వేస్తారు. నిజం చెప్పాలంటే, మిమ్మల్ని చంపితే దేవుని సేవ చేసిన దానితో సమానంగా భావించే కాలం వస్తుంది. 3 వాళ్ళకు నా గురించి కాని, తండ్రిని గురించి కాని, తెలియదు కనుక అలా చేస్తారు. 4 ఆ సమయం వచ్చినప్పుడు నేను హెచ్చరించినట్లు మీకు జ్ఞాపకం ఉండాలని ఈ విషయం చెపుతున్నాను. ఇన్నాళ్ళు మీతో ఉన్నాను. కనుక మీకీ విషయం మొదట చెప్పలేదు.
పవిత్రాత్మ చేసిన క్రియలు
5 “కాని యిప్పుడు నేను నన్ను పంపిన వాని దగ్గరకు వెళ్తున్నాను. కాని మీలో ఒక్కరైనా నేను ఎక్కడికి వెళ్తున్నానని అడగలేదు. 6 నేను ఈ విషయం చెప్పటంవల్ల మీ హృదయాలు దుఃఖంతో నిండిపోయాయి. 7 కాని నేను వెళ్ళటం మీ మంచి కోసమే. ఇది నిజం. నేను వెళ్ళకపోతే మీకు సహాయం చెయ్యటానికి ఆదరణకర్త రాడు. నేను వెళ్తే ఆయన్ని పంపగలను.
8 “ఆయన వచ్చాక పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ప్రపంచాన్ని ఒప్పింప చేస్తాడు. 9 ప్రజలు నన్ను విశ్వసించలేదు కనుక వాళ్ళలో ‘పాపం’వుందని రుజువు చేస్తాడు. 10 మీరు చూడలేని చోటికి, అంటే తండ్రి దగ్గరకు, వెళ్తున్నాను. కనుక తండ్రితో నాకున్న సంబంధాన్ని ఆయన రుజువు చేస్తాడు. 11 కనుక నీతి విషయంలో ఈ లోకాధికారియైన సైతానుకు ఇదివరకే శిక్ష విధింపబడింది. కనుక ‘తీర్పు’ విషయంలో ఒప్పింప చేస్తాడు.
12 “నేను మీకు చెప్పవలసిన విషయాలు ఎన్నోఉన్నాయి. కాని వాటికి మీరు ప్రస్తుతం తట్టుకొనలేరు. 13 కాని సత్యాన్ని ప్రకటించే ఆత్మ వచ్చాక మిమ్మల్ని సంపూర్ణంగా సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన స్వతహాగ మాట్లాడడు. తాను విన్న వాటిని మాత్రమే మాట్లాడుతాడు. జరుగనున్న వాటిని గురించి మీకు చెబుతాడు. 14 నా సందేశం మీకు తెలియజేయుటవల్ల ఆయన నన్ను మహిమ పరుస్తాడు. 15 తండ్రికి చెందినవన్నీ నావి. అందువల్లే ఆత్మ నా సందేశం తీసుకొని మీకు తెలియచేస్తాడని చెప్పాను.
దుఃఖము సంతోషముగా మారటం
16 “కొంత కాలం గడిచాక మీరు నన్ను చూడరు. ఆ తదుపరి మరి కొంత కాలం గడిచాక మీరు నన్ను చూస్తారు.”
17 ఆయన శిష్యుల్లో కొందరు, “‘కొంత కాలం గడిచాక మీరు నన్ను చూడరు’ అని అనటంలోను మరియు, ‘మరి కొంత కాలం గడిచాక మీరు మళ్ళీ నన్ను చూస్తారు’ అని అనటంలో అర్థమేమిటి? పైగా ‘నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను’ అని అంటున్నాడే! అంటే ఏమిటి?” అని పరస్పరం మాట్లాడుకున్నారు. 18 “‘కొంత కాలం’ తర్వాత అని అనటంలో ఆయన ఉద్దేశ్యమేమిటి? ఆయనేమంటున్నాడో అర్థం కావటం లేదు!” అని వాళ్ళు మళ్ళీ మళ్ళీ అనుకొన్నారు.
19 ఈ విషయాన్ని గురించి వాళ్ళడగాలని అనుకుంటున్నారని యేసు గ్రహించాడు. అందువలన ఆయన వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, “‘కొంత కాలం గడిచాక నన్ను చూడరు, మరి కొంత కాలం గడిచాక నన్ను చూస్తారు’ అని నేనటంలో అర్థమేమిటని పరస్పరం మాట్లాడుకుంటున్నారా? 20 మీరు దుఃఖిస్తున్నప్పుడు ప్రపంచం ఆనందిస్తుంది. మీ మనస్సుకు చాలా బాధ కలుగుతుంది. కాని మీ దుఃఖం ఆనందంగా మారుతుంది. ఇది నిజం.
21 “ప్రసవించే సమయం వచ్చినప్పుడు గర్భంతో ఉన్న స్త్రీ నొప్పులు అనుభవిస్తుంది. శిశువు పుట్టాక ఒక జీవిని ఈ ప్రపంచంలోకి తెచ్చిన ఆనందంలో తన వేదన మరచి పోతుంది. 22 అదే విధంగా యిది మీరు దఃఖించే సమయం. కాని నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అప్పుడు మీ హృదయాలు ఆనందంతో నిండిపోతాయి. ఆ ఆనందాన్ని ఎవ్వరూ దోచుకోలేరు. 23 ఆ రోజు మీరు నన్ను ఏమీ అడగరు. ఇది నిజం. నా పేరిట మీరేది అడిగినా తండ్రి మీకిస్తాడు. 24 ఇంత కాలం మీరు నా పేరిట ఏమీ అడగలేదు. ‘అడగండి; మీకు లభిస్తుంది’ అప్పుడు మీకు సంపూర్ణమైన ఆనందం కలుగుతుంది.
లోకముపై జయము
25 “నేను యింతవరకూ ఉపమానాలతో మాట్లాడుతూ వచ్చాను. కాని యిలాంటి భాష ఉపయోగించకుండా నేను స్పష్టంగా మాట్లాడే సమయం వస్తోంది. అప్పుడు నేను మీకు తండ్రిని గురించి స్పష్టంగా చెబుతాను. 26 ఆ రోజు మీరు నా పేరిట తండ్రిని అడుగుతారు. మీ పక్షాన నేను తండ్రిని అడుగుతున్నానని అనటం లేదు. 27 నేను తండ్రి నుండి వచ్చానని మీరు నమ్మారు. మీకు నా పట్ల ప్రేమ ఉంది. కనుక తండ్రికి స్వయంగా మీ పట్ల ప్రేమ ఉంది. 28 నేను తండ్రి నుండి ఈ ప్రపంచంలోకి వచ్చాను. ఇప్పుడు నేనీ ప్రపంచాన్ని వదిలి తండ్రి దగ్గరకు వెళ్తున్నాను.”
29 శిష్యులు, “ఇప్పుడు మీరు ఉపమానాల ద్వారా కాకుండా స్పష్టంగా మాట్లాడుతున్నారు. 30 మీకు అన్నీ తెలుసునని మేము ఇప్పుడు గ్రహించాము. ఎవరునూ మీకు ప్రశ్న వేయవలసిన అవసరం లేదు. అందువల్ల మీరు దేవుని నుండి వచ్చారని విశ్వసిస్తున్నాము” అని అన్నారు.
31 యేసు, “చివరకు నమ్ముతున్నారన్న మాట! 32 మీరు నన్ను ఒంటరిగా ఒదిలి మీమీ యిండ్లకు వెళ్ళే సమయం రానున్నది. ఇప్పుడే వచ్చింది. నా తండ్రి నాతో ఉన్నాడు. కనుక నేను ఒంటరిగా ఉండను.
33 “నా ద్వారా మీకు శాంతి కలగాలని యివన్నీ మీకు చెప్పాను. ఈ ప్రపంచంలో మీకు కష్టాలు కలుగుతాయి. కాని ధైర్యంగా ఉండండి. నేను ప్రపంచాన్ని జయించాను” అని అన్నాడు.
© 1997 Bible League International