Print Page Options
Previous Prev Day Next DayNext

New Testament in a Year

Read the New Testament from start to finish, from Matthew to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
అపొస్తలుల కార్యములు 27:27-44

27 పదునాల్గవ రోజు రాత్రి కూడా మేమింకా అద్రియ సముద్రంలో గాలికి కొట్టుకొని పోతున్నాము. సుమారు అర్ధరాత్రి వేళ నావికులు భూమి దగ్గరకొచ్చిందని గ్రహించారు. 28 బుడుదు[a] నీళ్ళలోకి వేసి ఇరవై బారల లోతుందని తెలుసుకున్నారు. కొంతసేపైన తర్వాత మళ్ళీ బుడుదు నీళ్ళలోకి వేసి పదునైదు బారల లోతుందని తెలుసుకున్నారు. 29 ఓడ రాళ్ళకు కొట్టుకుంటుందని భయపడి ఓడ వెనుక భాగంనుండి నాలుగు లంగర్లు వేసారు. ఆ తదుపరి సూర్యుని వెలుగు కోసం ప్రార్థించారు. 30 నావికులు ఓడ ముందుభాగంనుండి లంగర్లు నీళ్ళలోకి దింపుతున్నట్లు నటిస్తూ ఓడకు కట్టబడిన చిన్న పడవను సముద్రంలోకి దింపారు. తప్పించుకు వెళ్ళాలని వాళ్ళ ఉద్దేశ్యం. 31 అప్పుడు పౌలు శతాధిపతితో, సైనికులతో, “ఈ నావికులు ఓడలో ఉంటే తప్ప మీరు రక్షింపబడరు” అని అన్నాడు. 32 ఇది విని సైనికులు పడవకు కట్టిన త్రాళ్ళను కోసి ఆ పడవను నీళ్ళలోకి పోనిచ్చారు.

33 సూర్యోదయానికి ముందు పౌలు వాళ్ళనందర్ని తినమని చెబుతూ, “గడిచిన పదునాలుగు రోజులనుండి మీరు ఆహారం ముట్టకుండా జీవించారు. ఏం జరుగనున్నదో మీకు తెలియదు. అయినా కాచుకున్నారు. 34 ఇక మిమ్మల్ని కొంచెం తినమని వేడుకొంటున్నాను. మిమ్మల్ని రక్షించుకోవాలంటే తినటం అవసరం. మీ తలలపై ఉన్న ఒక్క వెంట్రుక కూడా రాలిపోదు” అని అన్నాడు. 35 ఇలా చెప్పాక అతడు రొట్టెను తీసుకొని దేవునికి అందరి ముందు కృతజ్ఞతలు చెప్పి దాన్నుండి ఒక ముక్కను విరిచి తినటం మొదలు పెట్టాడు. 36 అప్పుడందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకున్నారు. 37 మా సంఖ్య మొత్తం రెండువందల డెబ్బది ఆరు. 38 వాళ్ళంతా తృప్తిగా తిన్నారు. ఆ తర్వాత ఓడలో ఉన్న మిగతా ధాన్యాన్ని సముద్రంలోకి పారవేసి ఓడను తేలిక చేసారు.

ఓడ పగిలి పోవటం

39 సూర్యోదయమయింది. వాళ్ళకు భూమి కనిపించింది. కాని వాళ్ళు అది గుర్తించలేదు. ఇసుక ఉన్న తీరం యొక్క పాయ కనపడగానే ఓడను వీలైతే అక్కడ ఆపాలనుకున్నారు. 40 త్రాళ్ళు కోసేసి లంగర్లను సముద్రంలోకి పడనిచ్చారు. చుక్కానుల త్రాళ్ళు విప్పారు. ఓడ యొక్క ముందుభాగంలో ఉన్న తెరచాపను లేపి ఓడను తీరం వైపు పోనిచ్చారు. 41 కాని ఆ ఓడ నీళ్ళలో ఉన్న యిసుకకు తగిలి భూమిలో చిక్కుకొని పోయింది. ఓడ యొక్క ముందుభాగం యిసుకలో చిక్కుకుపోవటం వల్ల ఓడ కదల్లేదు. అలలు తీవ్రంగా కొట్టటం వల్ల ఓడ యొక్క వెనుక భాగం ముక్కలై పోయింది.

42 నేరస్థులు ఈది పారిపోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో సైనికులు వాళ్ళను చంపాలని నిశ్చయించుకున్నారు, 43 కాని పౌలు ప్రాణాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంతో ఆ శతాధిపతి సైనికులు చేయదలచిన దానిని చేయనివ్వలేదు. ఈద గలిగినవాళ్ళను, నీళ్ళలోకి దూకి ఒడ్డును చేరుకోమని ఆజ్ఞాపించాడు. 44 మిగతావాళ్ళను చెక్కల సహాయంతో, ఓడ యొక్క విరిగిన ముక్కల సహాయంతో ఒడ్డును చేరుకోమన్నాడు. ఈ విధంగా అందరూ క్షేమంగా తీరాన్ని చేరుకున్నారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International