New Testament in a Year
ప్రధానయాజకుడు యేసుని ప్రశ్నించటం
(మత్తయి 26:59-66; మార్కు 14:55-64; లూకా 22:66-71)
19 ప్రధానయాజకుడు యేసును ఆయన శిష్యుల్ని గురించి, ఆయన బోధిస్తున్న విషయాల్ని గురించి ప్రశ్నించాడు. 20 యేసు, “నేను సమాజమందిరాలలోను, యూదులు సమావేశమయ్యే దేవాలయంలోను బహిరంగంగా ఈ ప్రపంచానికి బోధించేవాణ్ణి. నేను రహస్యంగా ఏదీ బోధించలేదు. 21 అలాంటప్పుడు నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు. నేను చెప్పిన వాటిని గురించి, నా బోధనలను విన్న వాళ్ళను అడగండి. నేను చెప్పినవి వాళ్ళకు తెలుసు” అని అన్నాడు.
22 యేసు ఈ విధంగా మాట్లాడటం వలన ఆయన ప్రక్కన నిలుచున్న ఒక రక్షక భటుడు ఆయన చెంప మీద కొడుతూ, “ప్రధానయాజకునితో అలాగేనా మాట్లాడటం?” అని అన్నాడు.
23 యేసు, “నేను ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే చెప్పు. కాని నేను నిజం మాట్లాడాను. మరినన్నెందుకు కొట్టావు?” అని అడిగాడు.
24 ఆ తర్వాత అన్న ఆయనకు కట్టిన త్రాళ్ళు విప్పకుండా ప్రధాన యాజకుడు కయప దగ్గరకు పంపాడు.
పేతురు రెండవసారి, మూడవసారి తెలియదని అనటం
(మత్తయి 26:71-75; మార్కు 14:69-72; లూకా 22:58-62)
25 సీమోను పేతురు నిలుచొని యింకా చలికాగుతూ ఉన్నాడు. వాళ్ళు “నీవు అతని శిష్యుల్లో ఒకడివి కాదా?” అని అడిగారు.
“కాదు” అని పేతురు అన్నాడు.
26 ప్రధాన యాజకుని దగ్గర ఒకడు పని చేస్తూ ఉండేవాడు. వీని బంధువు చెవును పేతురు నరికివేసాడు. వాడు పేతురుతో, “నీవు అతనితో కలిసి తోటలో ఉండగా చూడలేదని అనుకొంటున్నావా?” అని అన్నాడు.
27 పేతురు మళ్ళీ, “లేదు” అన్నాడు. వెంటనే కోడి కూసింది.
పిలాతు సమక్షంలో యేసు
(మత్తయి 27:1-2, 11-31; మార్కు 15:1-20; లూకా 23:1-25)
28 ఆ తర్వాత యూదులు యేసును కయప నుండి రోము రాజ్యాధికారి భవానానికి తీసుకు వెళ్ళారు. తెల్లవారింది. పస్కా పండుగ భోజనం చెయ్యటానికి ముందు మైలపడ కూడదని వాళ్ళు రాజభవనంలోకి వెళ్ళలేదు. 29 పిలాతు వాళ్ళను కలవటానికి వెలుపలికి వచ్చి, “ఇతడేమి తప్పు చేసాడు?” అని అడిగాడు.
30 “అతడు నేరస్థుడు కానట్లైతే మీకు అప్పగించే వాళ్ళంకాదు!” అని అన్నారు.
31 పిలాతు, “అతణ్ణి మీరే తీసుకు వెళ్ళి మీ ధర్మ శాస్త్రాన్ననుసరించి విచారణ చేసుకోండి” అని అన్నాడు.
32 యూదులు, “మాకు మరణశిక్ష విధించే అధికారం లేదే!” అని సమాధానం చెప్పారు. యేసు, తాను ఎలాంటి మరణం పొందనున్నాడో యిది వరకే చెప్పాడు. అది నిజం కావాలని యిలా జరిగింది.
33 పిలాతు భవనంలోకి వెళ్ళి యేసును పిలిపించాడు. ఆయనతో, “నీవు యూదుల రాజువా?” అని అడిగాడు.
34 యేసు, “అది నీవు స్వయంగా వేసిన ప్రశ్నాలేక యితర్లు నా గురించి అలా చెప్పారా?” అని అడిగాడు.
35 పిలాతు, “నేను యూదుణ్ణి అని అనుకుంటున్నావా? నీ వాళ్ళు, మీ ప్రధాన యాజకుడు నిన్ను నాకు అప్పగించారు. నీవు ఏం చేసావు?” అని అడిగాడు.
36 యేసు, “నా రాజ్యం ఈ ప్రపంచానికి సంబంధించింది కాదు. అలాగైనట్లైతే నా అనుచరులు యూదుల చేత నేను బంధింపకుండా ఉండాలని వాళ్ళతో యుద్ధం చేసేవాళ్ళు. కాని నా రాజ్యం పరలోక సంబంధమైంది” అని అన్నాడు.
37 “అలాగైతే నీవు రాజువన్నమాట!” అని పిలాతు అన్నాడు.
యేసు జవాబు చెబుతూ, “నన్ను రాజని నీవనటం నిజమే. నేను సత్యాన్ని గురించి చెప్పటానికి జన్మించాను. ఆ కారణంగానే ఈ ప్రపంచంలోకి వచ్చాను. సత్యాన్ని ప్రేమించే వాళ్ళు నా మాట వింటారు.”
38 “సత్యం అంటే ఏమిటి?” అని పిలాతు అడిగాడు. ఇలా అన్నాక అతడు మళ్ళీ యూదుల దగ్గరకు వెళ్ళి, “అతణ్ణి శిక్షించటానికి నాకు ఏ కారణం కనిపించటం లేదు! 39 కాని మీ ఆచారం ప్రకారం ప్రతి పస్కాపండుగకు ఒక ఖైదీని విడుదల చెయ్యటం నా ధర్మం, ‘యూదుల రాజును’ విడుదల చేయమంటారా?” అని అడిగాడు.
40 వాళ్ళు బిగ్గరగా కేకలు వేస్తూ, “వద్దు, అతణ్ణి కాదు. బరబ్బను విడుదల చెయ్యండి!” అని అన్నారు. ఈ బరబ్బ ఒక బందిపోటు దొంగ.[a]
© 1997 Bible League International