New Testament in a Year
31 ఇంతలో ఆయన శిష్యులు, “రబ్బీ! భోజనం చెయ్యండి” అని వేడుకున్నారు.
32 కాని ఆయన వాళ్ళతో, “నా దగ్గర తినటానికి ఆహారం ఉంది. కాని ఆ ఆహారాన్ని గురించి మీకేమీ తెలియదు” అని అన్నాడు.
33 ఆయన శిష్యులు, “ఆయన కోసం ఎవరో భోజనం తెచ్చివుంటారు!” అని పరస్పరం మాట్లాడుకున్నారు.
34 యేసు, “నన్ను పంపిన వాని కోరిక తీర్చటం, ఆయన కార్యాన్ని పూర్తి చేయటమే, నా భోజనం. 35 ‘విత్తిన తర్వాత నాలుగు నెలల్లో పంట వస్తుంది!’ అని మీరంటున్నారు. కాని నేను చెప్పేదేమిటంటే కళ్ళు తెరచి పొలాల వైపు చూడండి. పంట కోయటానికి సిద్ధంగా ఉంది. 36 దాన్ని విత్తినవాడు, కోసేవాడు ఫలం పొందుతున్నారు. అనంత జీవితం కోసం, అతడు ఆ పంటను కోస్తున్నాడు. తద్వారా విత్తనం నాటినవాడు, పంట కోసే వాడు, యిద్దరూ ఆనందిస్తారు. 37 ‘విత్తనం ఒకడు నాటితె ఫలం ఇంకొకడు పొందుతాడు’ అన్న సామెత ఈ సందర్భంలో వర్తిస్తుంది. 38 మీరు కష్టపడి పని చెయ్యని పంట కోయటానికి మిమ్మల్ని పంపాను, దాని కోసం యితర్లు చాలా కష్టించి పని చేసారు. వాళ్ళ కష్టానికి మీరు ఫలం పొందుతున్నారు” అని చెప్పాడు.
39 ఆ పట్టణంలో ఉన్న సమరయ ప్రజలతో ఆ స్త్రీ, “నేను చేసినదంతా ఆయన చెప్పాడు” అని చెప్పింది. ఆ కారణంగా అనేకులు యేసును నమ్మారు. 40 అందువల్ల ఆ సమరయ ప్రజలాయన దగ్గరకు వెళ్ళి తమతో ఉండుమని వేడుకున్నారు. ఆయన వాళ్ళతో రెండు రోజులున్నాడు. 41 ఆయన చెప్పిన విషయాల వలన యింకా అనేకులు విశ్వాసులైయ్యారు.
42 ఆ సమరయ ప్రజలు ఆమెతో, “మొదట నీవు చెప్పిన విషయాలు విని ఆయన్ని విశ్వసించాము. కాని యిప్పుడు మేము ఆయన మాటలు స్వయంగా విన్నాము. కనుక ఆయన్ని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాము. ఆయన ప్రపంచాన్ని రక్షించటానికి వచ్చిన వాడని మాకు బాగ తెలిసిపోయింది” అని అన్నారు.
రాజ్యాధికారి కుమారునికి నయం చేయటం
(మత్తయి 8:5-13; లూకా 7:1-10)
43 రెండు రోజుల తర్వాత ఆయన గలిలయకు వెళ్ళాడు. 44 అక్కడ యేసు, “ప్రవక్తకు తన స్వగ్రామంలో గౌరవం లేదు” అని అన్నాడు. 45 ఆయన గలిలయ వచ్చాక అక్కడి ప్రజలు ఆయనకు స్వాగతమిచ్చారు. గలిలయ ప్రజలు కూడా పస్కా పండుగ కోసం యోరూషలేము వెళ్ళారు. కనుక, వాళ్ళు ఆయన అక్కడ పండుగ రోజుల్లో చేసిన వాటన్నిటిని చూశారు.
46 యేసు, తాను నీళ్ళను ద్రాక్షారసంగా మార్చిన గలిలయలోని “కానా” ను మళ్ళీ దర్శించాడు. కపెర్నహూము పట్టణంలో ఒక రాజ్యాధికారి ఉండేవాడు. అతని కుమారుడు జబ్బుతో ఉన్నాడు. 47 యేసు యూదయ నుండి గలిలయకు వచ్చాడని విని ఆ రాజ్యాధికారి ఆయన దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి చావుకు దగ్గరగా ఉన్న తన కుమారునికి నయం చేయుమని వేడుకున్నాడు. 48 “మహాత్కార్యాలు, అద్భుతాలు చూస్తే కాని మీరు నమ్మరు” అని యేసు అతనితో అన్నాడు.
49 ఆ రాజ్యాధికారి, “అయ్యా! నా కుమారుడు మరణించకముందే దయచేసి రండి!” అని అన్నాడు.
50 యేసు, “నీవు వెళ్ళు! నీ కుమారుడు జీవిస్తాడు” అని అన్నాడు.
అతడు యేసు మాట విశ్వసించి వెళ్ళి పోయాడు. 51 అతడు యింకా దారిలో ఉండగానే అతని సేవకులు ఎదురుగా వచ్చి బాబుకు నయమై పోయిందని చెప్పారు.
52 అతడు వాళ్ళను తన కుమారునికి ఏ సమయంలో నయమైందని అడిగాడు.
వాళ్ళు, “నిన్న ఒంటిగంటకు జ్వరం విడిచింది” అని సమాధానం చెప్పారు.
53 సరిగ్గా అదే సమయానికి యేసు తనతో, “నీ కుమారుడు జీవిస్తాడు” అని అన్న విషయం అతనికి జ్ఞాపకం వచ్చింది. అందువల్ల అతడు, అతని యింట్లోని వాళ్ళంతా ప్రభువుని నమ్మారు.
54 యూదయ దేశం నుండి గలిలయకు వచ్చాక యిది యేసు చేసిన రెండవ మహాత్కార్యము.
© 1997 Bible League International