New Testament in a Year
యూదా నాయకులు యేసును చంపుటకు కుట్ర పన్నటం
(మత్తయి 26:1-5, 14-16; మార్కు 14:1-2, 10-11; యోహాను 11:45-53)
22 పులవకుండా రొట్టెలు చేసే పండుగ దగ్గరకు వచ్చింది. దాన్ని “పస్కా” అనే వాళ్ళు. 2 ప్రజల్లో ఉన్న విశ్వాసం చూసి ప్రధాన యాజకులు, శాస్త్రులు భయపడి పోయారు. వాళ్ళు ఏదో ఒక విధంగా యేసును చంపాలని ప్రయత్నం చేయసాగారు.
యేసుకు ద్రోహం చెయ్యటానికి యూదా అంగీకరించటం
(మత్తయి 26:14-16; మార్కు 14:10-11)
3 పన్నెండు మందిలో ఒకడైన ఇస్కరియోతు అనబడే యూదాలో సాతాను ప్రవేశించాడు. 4 యూదా ప్రధాన యాజకులను, ముఖ్య ద్వార పాలకుల్ని కలుసుకొని తాను ఏవిధంగా యేసును వాళ్ళకప్పగించగలడో చర్చించాడు. 5 యూదా చెప్పింది విని ప్రధాన యాజకులు ఆనందించారు. యేసును అప్పగిస్తే అతనికి కొంత డబ్బు యిస్తామని వాళ్ళు చెప్పారు. 6 అతడు దానికి అంగీకరించి ప్రజలు లేనప్పుడు యేసును వాళ్ళకప్పగించాలనుకొని మంచి సమయం కోసం ఎదురు చూడసాగాడు.
పస్కా భోజనం
(మత్తయి 26:17-25; మార్కు 14:12-21; యోహాను 13:21-30)
7 పులవకుండా రొట్టెలు చేసే పండుగ వచ్చింది. ఆ రోజు పస్కా గొఱ్ఱె పిల్లను బలి ఇచ్చేవాళ్ళు. 8 యేసు పేతురు, యోహానులతో, “వెళ్ళి పస్కా పండుగ భోజనం సిద్ధం చెయ్యండి” అని చెప్పాడు.
9 వాళ్ళు, “ఎక్కడ సిద్ధం చెయ్యమంటారు?” అని అడిగారు.
10 ఆయన, “మీరు పట్టణంలోకి ప్రవేశిస్తుంటే నీళ్ళ కడవ ఎత్తుకొని వెళ్తున్న వాడొకడు కనిపిస్తాడు. అతణ్ణి అనుసరించి అతడు ఏ యింట్లోకి వెళ్తాడో ఆ యింట్లోకి వెళ్ళండి. 11 ఆ యింటి యజమానితో, ‘మా బోధకుడు తన శిష్యులతో కలిసి పస్కా భోజనం చెయ్యాలి. కనుక అతిథులుండే గది ఎక్కడుందో మాకు చూపండి’ అని అతనితో అనండి. 12 అతడు మీకు మేడ మీద ఉన్న ఒక విశాలమైన గది చూపిస్తాడు. ఆ గదిలో అన్ని సౌకర్యాలు ఉంటాయి. పస్కా భోజనం అక్కడ తయారు చెయ్యండి” అని అన్నాడు.
13 వాళ్ళు వెళ్ళి, అన్నీ యేసు చెప్పిన విధంగా ఉండటం గమనించారు. అక్కడ వాళ్ళు పస్కా పండుగ భోజనం తయారు చేసారు.
ప్రభు రాత్రి భోజనము
(మత్తయి 26:26-30; మార్కు 14:22-26; 1 కొరింథీ. 11:23-25)
14 భోజనం చేసే సమయం దగ్గరకు వచ్చింది. యేసు, ఆయన అపొస్తలులు భోజనానికి కూర్చున్నారు. 15 ఆయన వాళ్ళతో, “నేను చనిపోకముందే మీతో కలిసి ఈ పస్కా భోజనము చెయ్యాలని ఎంతో ఆశ పడ్డాను. 16 ఎందుకంటే దేవుని రాజ్యంలో ఈ పస్కా భోజనమునకు ఉన్న నిజమైన అర్థం నెరవేరుతుంది. అంతవరకు ఈ భోజనం మళ్ళీ చెయ్యను” అని అన్నాడు.
17 ఆయన గిన్నె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి, “ఇది తీసుకొని మీ మధ్య పంచుకొండి. 18 ఎందుకంటే దేవుని రాజ్యం వచ్చేవరకు నేను ద్రాక్షతో చేసిన ఈ పానీయం మళ్ళీ త్రాగనని మీతో చెబుతున్నాను” అని అన్నాడు.
19 ఆ తర్వాత ఒక రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి దాన్ని త్రుంచి వాళ్ళకిస్తూ, “ఇది నా శరీరం. మీకోసం యివ్వబడింది. నా జ్ఞాపకార్థం యిది చెయ్యండి” అని అన్నాడు. 20 అదే విధంగా భోజనం అయ్యాక ఆయన పాత్రను తీసుకొని, “ఇది నా రక్తంతో చేసిన క్రొత్త నిబంధన. నేను ఈ రక్తాన్ని మీకోసం చిందిస్తున్నాను.
యేసుకు ఎవరు విరోధికాగలరు?
21 “నాకు ద్రోహం చేయబోతున్నవాడు నాతో యిక్కడ భోజనానికి కూర్చొని ఉన్నాడు. 22 దేవుడు నిర్ణయించినట్లు మనుష్యకుమారుడు మరణించబోతున్నాడు. ఆయనకు ద్రోహం చేసిన వానికి శిక్ష తప్పదు” అని అన్నాడు.
23 వాళ్ళు తమలో, “ఎవరీపని చేస్తారా?” అని పరస్పరం ప్రశ్నించుకొన్నారు.
ఎవరు గొప్ప
24 ఆ తర్వాత వాళ్ళలో, “ఎవరు గొప్ప” అన్న విషయంపై వాదన మొదలైంది. 25 యేసు వాళ్ళతో, “యూదులుకాని వాళ్ళను, వాళ్ళ రాజులు క్రూరంగా పాలిస్తారు. అధికారంలో ఉన్నవాళ్ళు తమను పొగడమని ప్రజల్ని ఒత్తిడి చేస్తారు. 26 కాని మీరు అలా ఉండకూడదు. మీలో అందరికన్నా గొప్పవాడు అందరికన్నా చిన్నవానిలా మెలగాలి. నాయకుడు సేవకునిలా ఉండాలి. 27 ఎవరు గొప్ప? భోజనానికి కూర్చొన్నవాడా లేక భోజనం వడ్డించేవాడా? భోజనానికి కూర్చొన్న వాడేకదా! కాని నేను మీ సేవకునిలా ఉంటున్నాను.
28 “మీరు నా కష్టసమయాల్లో నా వెంట ఉన్నవాళ్ళు. 29 కనుక నా తండ్రి నాకు రాజ్యాన్ని అప్పగించి నట్లు నేను మీకు రాజ్యాన్ని అప్పగిస్తాను. 30 అప్పుడు మీరు నా రాజ్యంలో నాతో కలిసి కూర్చొని తింటారు. సింహాసనాలపై కూర్చుని పండ్రెండు వంశాల వారిపై తీర్పు చేస్తారు.
© 1997 Bible League International