New Testament in a Year
24 యేసు అతడు దుఃఖపడటం చూసి, “ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించటం చాలా కష్టం. 25 ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటంకన్నా ఒంటె సూది రంధ్రం ద్వారా వెళ్ళటం సులభం” అని అన్నాడు.
ఎవరు రక్షింపబడగలరు
26 ఇది విని వాళ్ళు, “మరి ఎవరు రక్షింపబడుతారు?” అని అడిగారు.
27 “మానవునికి సాధ్యంకానిది దేవునికి సాధ్యమౌతుంది” అని యేసు అన్నాడు.
28 పేతురు, “మిమ్మల్ని అనుసరించటానికి మాకున్నవన్నీ వదిలివేసాము” అని అన్నాడు.
29 యేసు, “ఇది నిజం. దేవుని రాజ్యం కొరకు తన యింటిని, భార్యను, సోదరుల్ని, తల్లితండ్రుల్ని, సంతానాన్ని వదిలినవాడు ఏ మాత్రం నష్టపోడు. 30 ఇప్పుడు ఎన్నోరెట్లు ఫలం పొందటమే కాకుండా మున్ముందు అనంత జీవితం పొందుతాడు.” అని అన్నాడు.
యేసు తన మరణాన్ని గురించి మళ్ళీ మాట్లాడటం
(మత్తయి 20:17-19; మార్కు 10:32-34)
31 యేసు పన్నెండుమందిని ప్రక్కకు పిలుచుకు వెళ్ళి, “మనం యెరూషలేము వెళ్ళాలి. మనుష్యకుమారుణ్ణి గురించి ప్రవక్తలు వ్రాసినవన్నీ నిజం కాబోతున్నాయి. 32 ఆయన యూదులుకాని వాళ్ళకు అప్పగింపబడతాడు. వాళ్ళాయన్ని హేళన చేస్తారు. అవమానిస్తారు, ఆయనపై ఉమ్మి వేస్తారు, 33 కొరడా దెబ్బలు కొడతారు. చివరకు చంపివేస్తారు. మూడవ రోజు ఆయన బ్రతికి వస్తాడు” అని అన్నాడు. 34 శిష్యులకు ఆయన చెప్పింది ఏ మాత్రం అర్థం కాలేదు. ఆయన చెప్పిన దానిలో గూఢార్థం ఉంది. కాని వాళ్ళకది బోధపడలేదు.
గ్రుడ్డివానికి దృష్టి కలిగించటం
(మత్తయి 20:29-34; మార్కు 10:46-52)
35 యేసు యెరికో పట్టణాన్ని సమీపిస్తున్నాడు. అదే సమయానికి ఒక గ్రుడ్డివాడు దారిప్రక్కన భిక్షమెత్తుకుంటూ కూర్చొని ఉన్నాడు. 36 అతడు ప్రజల గుంపు వెళ్తుండటం గమనించి ఏమి జరుగుతోందని అడిగాడు.
37 వాళ్ళు, “నజరేతు నివాసి యేసు ఈ దారిలో వెళ్తున్నాడు” అని చెప్పారు.
38 ఆ గ్రుడ్డివాడు బిగ్గరగా, “యేసూ! దావీదు కుమారుడా! నామీద దయ చూపు!” అని అన్నాడు.
39 ముందున్న వాళ్ళు అతణ్ణి గద్దిస్తూ నోరు మూసుకోమని చెప్పారు. కాని, అతడు యింకా బిగ్గరగా, “దావీదు కుమారుడా! నా మీద దయ చూపు” అని అన్నాడు.
40 యేసు ఆగి ఆ గ్రుడ్డివాణ్ణి తన దగ్గరకు పిలుచుకురమ్మని ఆజ్ఞాపించాడు. అతడు దగ్గరకు రాగానే యేసు అతణ్ణి 41 “ఏమి కావాలి?” అని అడిగాడు.
“ప్రభూ! నాకు దృష్టి కావాలి!” అని గ్రుడ్డివాడు సమాధానం చెప్పాడు.
42 యేసు, “నీకు దృష్టి కలగాలి! నీవు విశ్వసించావు కనుక నీకు దృష్టి కలిగింది” అని అన్నాడు.
43 వెంటనే అతడు చూడగలిగాడు. ఆ గ్రుడ్డివాడు దేవుణ్ణి స్తుతిస్తూ యేసును అనుసరించాడు. ప్రజలందరూ యిది చూసి వారుకూడా దేవుణ్ణి స్తుతించారు.
© 1997 Bible League International