New Testament in a Year
దేవుని రాజ్యం రావటం
(మత్తయి 24:23-28, 37-41)
20 కొందరు పరిసయ్యులు, “దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది” అని అడిగారు.
యేసు, “దేవుని రాజ్యం అందరికి కనిపించేలా రాదు. 21 ‘ఇదిగో, దేవుని రాజ్యం ఇక్కడ ఉంది; అదిగో అక్కడ ఉంది’ అని ఎవరూ అనరు. ఎందుకంటే దేవుని రాజ్యం మీలో ఉంది!” అని సమాధానం చెప్పాడు.
22 ఆ తర్వాత, తన శిష్యులతో, “మనుష్యకుమారుడు మీతో ఒక్క రోజన్నా ఉండాలని మీరు తహతహలాడే సమయం వస్తుంది. కాని అలా జరగదు. 23 ప్రజలు, ‘అదిగో అక్కడ ఉన్నాడని’ కాని, లేక ‘ఇదిగో ఇక్కడున్నాడని’ కాని అంటే వాళ్ళ వెంట పరుగెత్తి వెళ్ళకండి.
24 “ఎందుకంటే మనుష్యకుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆకాశంలో ఈ చివరినుండి ఆ చివరి దాకా మెరిసే మెరుపులా ఉంటాడు. 25 కాని దానికి ముందు ఆయన ఎన్నో కష్టాలు అనుభవించాలి. ఈ తరం వాళ్ళతో తృణీకరింపబడాలి.
26 “నోవహు కాలంలో జరిగిన విధంగా మనుష్యకుమారుని కాలంలో కూడా జరుగుతుంది. 27 నోవహు నావలో ప్రవేశించేదాకా ప్రజలు తింటూ, త్రాగుతూ, వివాహాలు చేస్తూ, వివాహాలు చేసుకొంటూ గడిపారు. అతడు నావలో ప్రవేశించాక వరదలు రాగా మిగిలిన వాళ్ళందరూ నాశనమయ్యారు.
28 “లోతు కాలంలో కూడా అదేవిధంగా జరిగింది. ప్రజలు తింటూ, త్రాగుతూ, అమ్ముతూ, కొంటూ, పొలాలు సాగుచేస్తూ, ఇళ్ళు కడుతూ జీవించారు. 29 కాని లోతు సొదొమ పట్టణం వదిలి వెళ్ళిన వెంటనే ఆకాశం నుండి మంటలు, గంధకము వర్షంలా కురిసి అందర్ని నాశనం చేసింది. 30 మనుష్యకుమారుణ్ణి దేవుడు వ్యక్తం చేసిన రోజు కూడా ఇదే విధంగా జరుగుతుంది.
31 “ఆ రోజు ఇంటి కప్పు మీదనున్న వాళ్ళు తమ వస్తువులు తెచ్చుకోవటానికి ఇళ్ళలోకి వెళ్ళరాదు. అదే విధంగా పొలాల్లో ఉన్నవాళ్ళు ఏ వస్తువు కోసం ఇంటికి తిరిగి వెళ్ళరాదు. 32 లోతు భార్యను జ్ఞాపకం తెచ్చుకొండి.
33 “తన ప్రాణాన్ని కాపాడు కోవాలనుకొన్నవాడు పోగొట్టుకొంటాడు. ప్రాణం పోగొట్టుకోవటానికి సిద్దంగా ఉన్నవాడు తన ప్రాణం కాపాడుకొంటాడు. 34 ఆ రాత్రి ఒక పడక మీద ఇద్దరు నిద్రిస్తూ ఉంటే ఒకడు వదిలి వేయబడి మరొకడు తీసుకొని వెళ్ళబడతాడు. 35 ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతూ ఉంటే ఒకామె తీసుకు వెళ్ళబడుతుంది, మరొకామె వదిలి వేయబడుతుంది” అని అన్నాడు. 36 [a]
37 “ఇవి ఎక్కడ సంభవిస్తాయి ప్రభూ!” అని వాళ్ళు అడిగారు.
ఆయన, “ఎక్కడ శవముంటే అక్కడ రాబందులుంటాయి” అని సమాధానం చెప్పాడు.
© 1997 Bible League International