Print Page Options
Previous Prev Day Next DayNext

New Testament in a Year

Read the New Testament from start to finish, from Matthew to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
లూకా 12:32-59

ధనమును నమ్ముకొనవద్దు

32 “మీరు అమాయకమైన చిన్న మందలాంటి వాళ్ళు. కాని భయపడకండి. మీ తండ్రి తన రాజ్యాన్ని మీకు ఆనందంగా ఇస్తాడు. 33 మీ ఆస్థి అమ్మి పేదవాళ్ళకు దానం చెయ్యండి. పాతబడని డబ్బుల సంచి సిద్దం చేసుకోండి. మీ ధనాన్ని పరలోకంలో దాచండి. అక్కడ అది తరగదు. దొంగలు దాన్ని ముట్టలేరు. ఆ సంపదకు చెదలు పట్టవు. 34 మీ ధనమున్న చోటే మీ మనస్సు కూడా ఉంటుంది.

సిద్దంగా ఉండండి

(మత్తయి 24:42-44)

35 “మీ నడికట్టుతో నడుముకు చుట్టి, దీపాలు వెలిగించి సిద్దంగా ఉండండి. 36 పెళ్ళి విందుకు వెళ్ళి యింటికి వస్తున్న యజమాని కోసం కాచుకొని ఉండే సేవకుల్లా ఉండండి. అలా చేస్తే యజమాని వచ్చి తలుపు తట్టిన వెంటనే అతనికోసం మీరు తలుపు తీయకలుగుతారు. 37 యజమాని వచ్చినప్పుడు మెలుకువతో ఉన్న సేవకులు ధన్యులు. ఇది నిజం. యజమాని వచ్చి తానే నడుము బిగించుకొని స్వయంగా సేవ చేస్తాడు. సేవకుల్ని కూర్చోబెట్టి వాళ్ళకు వడ్డించటానికి సిద్ధమౌతాడు. 38 అతడు ఏ అర్థరాత్రికో లేక తెల్లవారుఝామునో వచ్చినప్పుడు అతని కోసం సిద్దంగావున్న సేవకులు ధన్యులు. వాళ్ళకు శుభం కలుగుతుంది.

39 “కాని యిది అర్థంచేసుకోండి. దొంగ ఏ ఘడియలో వస్తాడో యింటి యజమానికి తెలిస్తే అతడు తన యింట్లోకి దొంగల్ని రానివ్వడు. 40 మీరు కూడా సిద్ధంగా వుండండి. ఎందుకంటే మనుష్య కుమారుడు మీరు అనుకోని సమయంలో వస్తాడు.”

నమ్మదగిన సేవకుడు ఎవరు

(మత్తయి 24:45-51)

41 పేతురు, “ప్రభూ! మీరీ ఉపమానం మాకోసం చెబుతున్నారా లేక అందరి కోసమా?” అని అడిగాడు.

42 ప్రభువు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “తెలివిగల ఉత్తమ సేవకుడు ఎవడు? ఆ యజమాని తిరిగి వచ్చినప్పుడు తాను విశ్వసించగల వాణ్ణి, తెలివి గలవాణ్ణి తన యితర సేవకులకు సరియైన ఆహారం ఇవ్వటానికి వాళ్ళపై అధికారిగా నియమిస్తాడు. 43 ఆ యజమాని వచ్చినప్పుడు, అతడు చెప్పిన విధంగా నడుచుకొన్న సేవకుడు ధన్యుడు. 44 ఇది నిజం. ఆ యజమాని అతణ్ణి తన ఆస్థికంతటికి అధికారిగా నియమిస్తాడు.

45 “కాని ఒకవేళ ఆ సేవకుడు తనలో తాను, ‘నా యజమాని త్వరలో రాడు’ అని అనుకొని తన క్రింద పనిచేసేవాళ్ళను ఆడా మగా అనే భేదం లేకుండా కొట్టి, తిని త్రాగటం మొదలు పెడతాడనుకోండి. 46 యజమాని ఆ సేవకుడు ఎదురుచూడని రోజున అనుకోని సమయంలో వచ్చి ఆ సేవకుణ్ణి నరికించి భక్తిహీనుల గుంపులో చేరుస్తాడు.

47 “తన యజమాని మనస్సు తెలిసి కూడా, అతని యిష్టానుసారం పని చెయ్యని సేవకుడికి ఎక్కువ దెబ్బలు తగులుతాయి. 48 కాని తెలియక శిక్షార్హమైన పనులు చేసిన వాడికి తక్కువ దెబ్బలు తగులుతాయి. దేవుడు తాను ఎక్కువగా యిచ్చిన వాళ్ళనుండి ఎక్కువ కోరుతాడు. ఎక్కువ అప్పగించినవాళ్ళ నుండి యిచ్చిన దానికన్నా ఎక్కువ ఆశిస్తాడు.

యేసును వెంబడించుటవలన కష్టములు వచ్చును

(మత్తయి 10:34-36)

49 “నేను ఈ భూమ్మీద అగ్ని వేయడానికి వచ్చాను. ఆ అగ్ని యిదివరకే రగిలి ఉండాలని ఆశించాను. 50 కాని నేను పొందవలసిన బాప్తిస్మము ఉంది. అది జరిగే వరకు నాకీ వేదన తప్పదు. 51 శాంతిని కలుగ జేయుటకు నేనీ భూమ్మీదికి వచ్చాననుకొంటున్నారా? కాదు. దీన్ని విభజించటానికి వచ్చాను. 52 ఇప్పటి నుండి ఒక కుటుంబంలో ఐదుగురు ఉంటే, వాళ్ళు విడిపోయి, ముగ్గురు ఒకవైపుంటే ఇద్దరొకవైపు: యిద్దరొక వైపుంటే ముగ్గురొక వైపు చేరి పోట్లాడుతారు.

53 తండ్రి కుమారునితో,
    కుమారుడు తండ్రితో,
తల్లి కూతురుతో,
    కూతురు తల్లితో,
అత్త కోడలితో,
    కోడలు అత్తతో పోట్లాడుతారు.”

కాలాన్ని అర్థం చేసుకోండి

(మత్తయి 16:2-3)

54 యేసు అక్కడున్న ప్రజలతో, “మీరు పడమరన మేఘాలు కమ్ముకోవటం చూసిన వెంటనే, ‘వర్షం కురుస్తుంది’ అని అంటారు. 55 దక్షిణం నుండి గాలివీయగానే, ‘వేడి ఎక్కువౌతుంది’ అని అంటారు. మీరన్నట్లే జరుగుతుంది. 56 కాని మీరు వంచకులు. భూమివైపు, ఆకాశం వైపు చూసి ఏమి జరుగబోతుందో చెప్పగలరు. కాని ప్రస్తుతం జరుగుతున్న దాన్ని చూసి ఏమి జరుగబోతుందో ఎందుకు చెప్పలేరు?

నీ సమస్యలను తీర్చుకొనుము

(మత్తయి 5:25-26)

57 “ఏది న్యాయమో స్వయంగా మీరే నిర్ణయించండి. 58 మీ ప్రతి వాదితో కలిసి న్యాయాధిపతి దగ్గరకు వెళ్ళటానికి ముందు దారి మీద ఉన్నప్పుడే అతనితో రాజీ పడటానికి గట్టిగా ప్రయత్నించండి. అలా చెయ్యకపోతే అతడు మిమ్మల్ని న్యాయధిపతి ముందుకు లాగవచ్చు. ఆ న్యాయాధిపతి మిమ్మల్ని భటులకు అప్పగించవచ్చు. ఆ భటులు మిమ్మల్ని కారాగారంలో వేయవచ్చు. 59 నేను చెప్పేది వినండి. మీ దగ్గర ఉన్న చివరి పైసా చెల్లించే దాకా మీరు బయటపడరు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International