New Testament in a Year
రాష్ట్రపాలకుడైన పిలాతుయొద్దకు యేసుని తీసికొనిపొవటం
(మార్కు 15:1; లూకా 23:1-2; యోహాను 18:28-32)
27 తెల్లవారాక ప్రధాన యాజకులు, పెద్దలు అంతా సమావేశమై యేసును చంపటానికి నిశ్చయించారు. 2 వాళ్ళాయన్ని బంధించి తీసుకెళ్ళి రాష్ట్ర పాలకుడైన పిలాతుకు అప్పగించారు.
యూదా ఆత్మహత్య
(అపొ. కా. 1:18-19)
3 యేసుకు ద్రోహం చేసిన యూదా యేసుని చంపటానికి నిశ్చయించారని విని చాలా బాధ పడ్డాడు. తాను తీసుకొన్న ముప్పై వెండి నాణాల్ని ప్రధాన యాజకులకు, పెద్దలకు తిరిగి యిచ్చేస్తూ, 4 “నేను పాపం చేసాను. ఆ అమాయకుణ్ణి చావుకు అప్పగించాను” అని అన్నాడు.
వాళ్ళు, “అది నీ గొడవ. మాకు సంబంధం లేదు” అని సమాధానం చెప్పారు.
5 యూదా ఆ డబ్బును దేవాలయంలో పారవేసి, వెళ్ళి ఉరి వేసుకున్నాడు.
6 ప్రధానయాజకులు నాణాల్ని తీసికొని, “ఇది రక్తాని కోసం చెల్లించిన డబ్బు కనుక ఈ డబ్బును ధనాగారంలో ఉంచటం మంచిది కాదు” అని అన్నారు. 7 వాళ్ళు ఆలోచించి ఆ ధనంతో విదేశీయుల్ని సమాధి చెయ్యటానికి ఉపయోగపడేటట్లు ఒక కుమ్మరి వాని పొలాన్ని కొన్నారు. 8 అందువల్లే ఈ నాటికీ ఆ పొలాన్ని “రక్తపు భూమి” అని అంటారు. 9-10 తద్వారా యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన ఈ వాక్యాలు నెరవేరాయి,
“వాళ్ళు ముప్పై వెండి నాణెములను తెచ్చారు. ఇది అతని విలువ. ఇది ఇశ్రాయేలు ప్రజలు నిర్ణయించిన విలువ. ప్రభువు ఆజ్ఞాపించినట్లు వాళ్ళు ఆ ధనంతో కుమ్మరి పొలాన్ని కొన్నారు.”[a]
పిలాతు సమక్షంలో యేసు
(మార్కు 15:2-5; లూకా 23:3-5; యోహాను 18:33-38)
11 యేసు రాష్ట్రపాలకుని ముందు నిల్చున్నాడు. ఆ రాష్ట్రపాలకుడు, “నీవు యూదులకు రాజువా?”
అని యేసును అడిగాడు. “ఔను! నీవన్నది నిజం!” అని యేసు సమాధానం చెప్పాడు.
12 ప్రధాన యాజకులు, పెద్దలు ఆయనపై నేరారోపణలు చేస్తూ పోయారు. కాని ఆయన సమాధానం చెప్పలేదు.
13 అప్పుడు పిలాతు, “వాళ్ళు నీైపె యిన్ని నేరాలు మోపుతున్నారు కదా! నీవు వినటం లేదా?” అని అడిగాడు.
14 యేసు ఒక్క నేరారోపణకు కూడా సమాధానం చెప్పలేదు. రాష్ట్రపాలకునికి చాలా ఆశ్చర్యం వేసింది.
మరణదండన విధించటం
(మార్కు 15:6-15; లూకా 23:13-25; యోహాను 18:39–19:16)
15 పండుగ రోజుల్లో ప్రజలు కోరిన ఒక నేరస్తుణ్ణి విడుదల చేసే ఆచారాన్ని ఆ రాష్ట్రపాలకుడు ఆచరిస్తూ ఉండేవాడు. 16 ఆ రోజుల్లో బరబ్బ అనే ప్రసిద్ధిగాంచిన ఒక నేరస్తుడు కారాగారంలో ఉన్నాడు.
17 అందువల్ల ప్రజలు సమావేశమయ్యాక పిలాతు, “ఎవర్ని విడుదల చెయ్యమంటారు? బరబ్బనా లేక క్రీస్తు అని పిలువబడే యేసునా?” అని వాళ్ళనడిగాడు. 18 అసూయవల్ల వాళ్ళు యేసుని తనకప్పగించారని పిలాతుకు తెలుసు.
19 పిలాతు న్యాయపీఠంపై కూర్చోబోతుండగా అతని భార్య, “ఆ నీతిమంతుని విషయంలో జోక్యం కలిగించుకోకండి. నిన్న రాత్రి ఆయన గురించి కలగన్నాను. ఆ కలలో ఎన్నో కష్టాలను అనుభవించాను” అన్న సందేశాన్ని పంపింది.
20 బరబ్బను విడుదల చేసి యేసుకు మరణ దండన విధించేటట్లు కోరుకోమని ప్రధాన యాజకులు, పెద్దలు ప్రజల్ని ప్రోద్బలం చేసారు.
21 “ఇద్దర్లో నన్ను ఎవర్ని విడుదల చెయ్యమంటారు?” అని రాష్ట్రపాలకుడు అడిగాడు.
“బరబ్బను” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
22 “మరి ‘క్రీస్తు’ అని పిలువబడే ఈ యేసును నన్నేమి చెయ్యమంటారు?” అని పిలాతు అడిగాడు.
అంతా, “సిలువకు వెయ్యండి!” అని సమాధానం చెప్పారు.
23 “ఆయనేం తప్పు చేసాడు?” అని పిలాతు అడిగాడు.
కాని వాళ్ళు, “అతన్ని సిలువకు వెయ్యండి” అని యింకా బిగ్గరగా కేకలు వేసారు.
24 లాభం కలగటానికి మారుగా అల్లర్లు మొదలవటం పిలాతు గమనించాడు. తరువాత అతడు నీళ్ళు తీసుకొని ప్రజలముందు ఆ నీళ్ళను చేతులు మీదుగా వదుల్తూ, “ఈయన రక్తానికి నేను బాధ్యుణ్ణికాను. ఇది మీ బాధ్యత!” అని అన్నాడు.
25 ప్రజలు, “అతని రక్తానికి మేము, మా సంతానము బాధ్యత వహిస్తాము!” అని సమాధానం చెప్పారు.
26 ఆ తర్వాత పిలాతు బరబ్బను విడుదల చేసాడు. కాని యేసును కొరడా దెబ్బలు కొట్టించి సిలువకు వేయటానికి అప్పగించాడు.
© 1997 Bible League International