Print Page Options
Previous Prev Day Next DayNext

New Testament in a Year

Read the New Testament from start to finish, from Matthew to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
మత్తయి 26:51-75

51 యేసుతో ఉన్న వాళ్ళలో ఒకడు వెంటనే తన కత్తిని వరనుండి తీసి, ప్రధాన యాజకుని సేవకుని యొక్క చెవిని నరికి వేసాడు.

52 యేసు, “కత్తిని వరలో పెట్టెయి! కత్తినెత్తిన వాడు ఆ కత్తితోనే మరణిస్తాడు. 53 నేను నా తండ్రిని సహాయం కావాలని అడగలేననుకొన్నావా? నేను అడిగిన వెంటనే పన్నెండు దళాలకంటే[a] ఎక్కువ మంది దేవదూతల్ని పంపుతాడు. 54 నేను అలాచేస్తే ఈ విధంగా జరగాలని లేఖనాల్లో వ్రాసినవి ఎట్లా నెరవేరుతాయి?” అని అన్నాడు.

55 ఆ తదుపరి యేసు వచ్చిన ప్రజలతో, “దోపిడి దొంగను పట్టుకోవటానికి వచ్చినట్లు కత్తులతో, కర్రలతో వచ్చారేం? మందిరావరణంలో కూర్చొని ప్రతిరోజు బోధించాను. కాని అప్పుడు మీరు నన్ను బంధించలేదు. 56 కాని, ప్రవక్తలు వ్రాసినవి నెరవేరాలని యివన్నీ జరిగాయి” అని అన్నాడు. వెంటనే ఆయన శిష్యులందరూ ఆయన్ని వదిలి వెళ్ళి పొయ్యారు.

మహాసభ సమక్షంలో యేసు

(మార్కు 14:53-65; లూకా 22:54-55, 63-71; యోహాను 18:13-14, 19-24)

57 వాళ్ళు యేసును బంధించి ప్రధాన యాజకుడైన కయప దగ్గరకు తీసుకు వెళ్ళారు. అక్కడ శాస్త్రులు, పెద్దలు ఇదివరకే సమావేశమై వున్నారు. 58 కాని పేతురు కొంత దూరంలోవుండి యేసును ప్రధానయాజకుని యింటి దాకా అనుసరించాడు. ఇంట్లో ఏం జరుగుతుందో చూడాలని భటుల్తో కలసి యింటి ముగింట్లో కూర్చున్నాడు.

59 మరణ శిక్ష విధించాలనే ఉద్దేశ్యంతో ప్రధాన యాజకులు, మహాసభ సభ్యులు యేసుకు ప్రతికూలంగా, దొంగ సాక్ష్యం కొరకు చూసారు. 60 చాలా మంది దొంగ సాక్ష్యం చెప్పటానికి ముందుకు వచ్చారు. కాని చంపడానికి సరైన కారణం లభించలేదు. చివరకు యిద్దరు వ్యక్తులు ముందుకు వచ్చి 61 ఈ విధంగా చెప్పారు, “ఈ వ్యక్తి ‘నేను దేవాలయాన్ని నాశనం చేసి మూడు రోజుల్లో మళ్ళీ నిర్మించగలను’ అని అన్నాడు.”

62 అప్పుడు ప్రధాన యాజకుడు లేచి నిలబడి యేసుతో, “నీవు సమాధానం చెప్పవా? వీళ్ళు చేస్తున్న నేరారోపణలేమిటి?” అని అడిగాడు. 63 కాని యేసు సమాధానం చెప్పలేదు.

ప్రధాన యాజకుడు, “సజీవుడైన దేవునిపై ప్రమాణం చేసి చెప్పు, నీవు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తువా?” అని అడిగాడు. 64 యేసు సమాధానం చెబుతూ, “ఔను! మీరన్నది నిజం. అంతే. నేను మీతో చెప్పేదేమిటంటే యిక మీదటి నుండి మనుష్యకుమారుడు సర్వశక్తిసంపన్నుని కుడివైపు కూర్చొని ఉండటం మీరు చూస్తారు. ఆయన మేఘాలపై రావటం మీరు చూస్తారు” అని అన్నాడు.

65 ఇది విని ప్రధానయాజకుడు తన దుస్తుల్ని చింపుకొని కోపాన్ని వ్యక్తపరుస్తూ, “ఇతను దైవదూషణ చేస్తున్నాడు. మనకింక ఇతర సాక్ష్యాలు ఎందుకు? చూడండి అతడు చేసిన దైవదూషణ విన్నారు కదా! 66 మరి మీరేమంటారు?” అని అడిగాడు. “అతనికి మరణదండన విధించవలసిందే” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

67 వాళ్ళలో కొందరు ఆయన ముఖంమ్మీద ఉమ్మేసి కొట్టారు. మరి కొందరు ఆయన చెంప మీద కొట్టి 68 “ఓ క్రీస్తూ! నిన్నెవరు కొట్టారో చెప్పుకో!” అని అన్నారు.

పేతురు యేసును ఎరుగుననుటకు భయపడటం

(మార్కు 14:66-72; లూకా 22:56-62; యోహాను 18:15-18, 25-27)

69 ఇక్కడ పేతురు బయట ముంగిట్లో కూర్చొని ఉండగా ఒక దాసీ పిల్ల అతని దగ్గరకు వచ్చి, “నీవు కూడా గలిలయ వాడైన యేసుతో ఉన్న వాడవే కదూ!” అని అడిగింది.

70 కాని అతడు వాళ్ళందరి ముందు, “నీవేం మాట్లాడుతున్నావో నాకు తెలియదు!” అని అంటూ ఆమె మాటను కాదన్నాడు.

71 ఆ తదుపరి, అతడు అక్కడి నుండి ద్వారం దగ్గరకు వెళ్ళాడు. అక్కడతణ్ణి మరోదాసీ పిల్ల చూసి, అక్కడున్న ప్రజలతో, “ఈ వ్యక్తి, నజరేతు యేసుతో ఉన్నవాడే!” అని అన్నది.

72 పేతురు ఒట్టు పెట్టుకొని మళ్ళీ ఆమె మాటల్ని కాదంటూ, “నాకు ఆ మనిషి ఎవరో తెలియదు!” అని అన్నాడు.

73 కొద్ది సేపయ్యాక అక్కడ నిలుచున్న వాళ్ళు పేతురు దగ్గరకు వచ్చి, “నీవు తప్పకుండా వాళ్ళలో ఒకడివి. నీ మాట తీరు చూస్తేనే తెలిసిపోతుంది!” అని అన్నారు.

74 అప్పుడు పేతురు శపించుకోవటం మొదలు పెట్టాడు. అతడు ప్రమాణం చేస్తూ, “ఆ మనిషి ఎవరో నాకు తెలియదు!” అని అన్నాడు. వెంటనే కోడి కూసింది. 75 అప్పుడు యేసు చెప్పిన ఈ మాటలు పేతురుకు జ్ఞాపకం వచ్చాయి: “కోడి కూయక ముందే నేనెవరో తెలియదని మూడు సార్లంటావు” పేతురు బయటకు వెళ్ళి భోరున ఏడ్చాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International