New Testament in a Year
ప్రభు రాత్రి భోజనము
(మార్కు 14:22-26; లూకా 22:15-20; 1 కొరింథీ. 11:23-25)
26 వాళ్ళు భోజనం చేస్తుండగా యేసు ఒక రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి దాన్ని విరిచి శిష్యులకిస్తూ, “ఇది తీసుకొని తినండి! ఇది నా దేహం!” అని అన్నాడు.
27 ఆ తర్వాత పాత్రను తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి వాళ్ళకిస్తూ, “అందరూ ఈ పాత్రలోవున్న దాన్ని త్రాగండి. 28 ఇది నా ఒడంబడిక[a] రక్తం. అనేకులకు పాప క్షమాపణ కలగాలని నేనీ రక్తాన్ని చిందించాను. 29 ఈ రోజు నుండి నా తండ్రి రాజ్యంలో మీతో కలసి ద్రాక్షారసాన్ని మళ్ళీ త్రాగే దాకా దీన్ని యిక మీదట త్రాగనని మీతో చెబుతున్నాను” అని అన్నాడు.
30 వాళ్ళు కీర్తనను పాడాక ఒలీవ చెట్ల కొండ మీదికి వెళ్ళారు.
యేసు తన శిష్యులు ఆయన్ను విడిచిపెడతారని చెప్పటం
(మార్కు 14:27-31; లూకా 22:31-34; యోహాను 13:36-38)
31 ఆ తదుపరి యేసు వాళ్ళతో, “ఈ రాత్రి మీరు నా కారణంగా చెదరిపోతారు. ఎందుకంటే:
‘నేను గొఱ్ఱెల కాపరిని చంపుతాను
అప్పుడా గొఱ్ఱెల మంద చెదరిపోతుంది’(A) అని వ్రాయబడివుంది.
32 కాని దేవుడు నన్ను బ్రతికించాక నేను మీకన్నా ముందే గలిలయకు వెళ్తాను” అని అన్నాడు.
33 పేతురు, “అందరూ మిమ్మల్ని వదిలి వెళ్ళినా నేను మాత్రం మిమ్మల్ని వదలి వెళ్ళను” అని సమాధానం చెప్పాడు.
34 యేసు, “ఇది సత్యం. ఈ రాత్రి కోడి కూయక ముందే నేనెవరో తెలియదని మూడు సార్లు అంటావు” అని సమాధానం చెప్పాడు.
35 కాని పేతురు, “నేను మీతో కలసి మరణిస్తాను, కాని మీరెవరో నాకు తెలియదని అనను” అని అన్నాడు. శిష్యులందరూ అదే విధంగా అన్నారు.
యేసు ఏకాంతంగా ప్రార్థించటం
(మార్కు 14:32-42; లూకా 22:39-46)
36 ఆ తర్వాత యేసు శిష్యులతో కలసి గెత్సేమనే అనే ప్రదేశానికి వెళ్ళాడు. వాళ్ళతో, “ఇక్కడే కూర్చోండి. నేను అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తాను” అని అన్నాడు. 37 యేసు పేతుర్ని, జెబెదయి యొక్క యిద్దరు కుమారుల్ని తన వెంట పిలుచుకు వెళ్ళాడు. ఆయనకు దుఃఖం వచ్చింది. మనస్సు వ్యాకులం చెందింది. 38 అప్పుడాయన వాళ్ళతో, “నా ఆత్మ మరణ వేదన పొందుతోంది. ఇక్కడే ఉండి నాతో సహా మేలుకొని ఉండండి” అని అన్నాడు.
39 యేసు యింకా కొంత దూరం వెళ్ళి సాష్టాంగపడి, “నా తండ్రి! వీలైతే దుఃఖంతో నిండిన ఈ పాత్రను నా నుండి తీసివేయి! అయినా నెరవేరవలసింది నా యిచ్ఛకాదు, నీది” అని అంటూ ప్రార్థించాడు. 40 ఆ తర్వాత తిరిగి వచ్చి శిష్యులు నిద్రిస్తూ ఉండటం గమనించాడు. ఆయన, “నాతో సహా ఒక గంట సేవు మేలుకోలేక పొయ్యారా?” అని అన్నాడు. 41 “మెలకువగా ఉండి ప్రార్థించండి! అప్పుడే మీరు దుష్ప్రేరేపణకు లోనైపోకుండా ఉంటారు. ఆత్మ సిద్ధంగా ఉంది కాని శరీరం బలహీనంగా ఉంది!” అని పేతురుతో అన్నాడు.
42 ఆయన రెండవసారి వెళ్ళి, “నా తండ్రీ! ఈ పాత్రలోవున్నది త్రాగితేగాని వీల్లేదంటే నేను దాన్ని త్రాగుతాను. నీ యిష్టమే నెరవేరు గాక!” అని ప్రార్ధించాడు.
43 ఆయన తిరిగి వచ్చి తన శిష్యులు మళ్ళీ నిద్రిస్తుండటం గమనించాడు. కళ్ళు బరువెక్కటంవల్ల వాళ్ళు నిద్రనాపుకోలేక పోయారు. 44 ఆయన మూడవ సారి వాళ్ళను వదిలి వెళ్ళి ముందు ప్రార్థించినట్లే మళ్ళీ ప్రార్ధించాడు.
45 ఆ తదుపరి తన శిష్యుల దగ్గరకు వచ్చి, “మీరింకా నిద్రిస్తూ, విశ్రాంతి తీసుకొంటున్నారా. చూడండి! మనుష్యకుమారుడు పాపాత్ములకు అప్పగింపబడే ఘడియ దగ్గరకు వచ్చింది. 46 వెళ్దాం, లేవండి. అదిగో! నాకు ద్రోహం చేయనున్నవాడు వస్తున్నాడు!” అని అన్నాడు.
యేసు బంధించటం
(మార్కు 14:43-50; లూకా 22:47-53; యోహాను 18:3-12)
47 ఆయనింకా మాట్లాడుతూ ఉండగానే పన్నెండుగురిలో ఒకడైన యూదా వచ్చాడు. ప్రధాన యాజకులు, ప్రజాప్రముఖులు పంపించిన పెద్ద ప్రజల గుంపు ఒకటి వాని వెంట ఉంది. వాళ్ళ చేతుల్లో కత్తులు, కర్రలు ఉన్నాయి. 48 ఆ ద్రోహి, “నేను వెళ్ళి ఎవర్ని ముద్దు పెట్టుకుంటానో, ఆయన్ని బంధించండి!” అని ముందే ఒక ఏర్పాటు చేసుకొన్నాడు. 49 యూదా వెంటనే యేసు దగ్గరకు వెళ్ళి, “వందనాలు రబ్బీ!” అని ఆయన్ని ముద్దుపెట్టుకున్నాడు.
50 యేసు, “మిత్రమా! నీవు చేయవచ్చిన పని చెయ్యి” అని అన్నాడు.
వెంటనే కొందరు వ్యక్తులు ముందుకు వచ్చి ఆయన్ని బంధించారు.
© 1997 Bible League International