New Testament in a Year
మనుష్యకుమారుడు అందరికి తీర్పు తీర్చటం
31 “తేజోవంతుడైన మనుష్యకుమారుడు తన దేవదూతలతో కలసి వస్తాడు. వచ్చి తేజోవంతమైన తన సింహాసనంపై కూర్చుంటాడు. 32 ప్రజలందర్ని సమావేశ పరచి గొఱ్ఱెల కాపరి మేకల్లో నుండి గొఱ్ఱెల్ని వేరు చేసినట్లు వాళ్ళను వేరుచేస్తాడు. 33 తదుపరి కొందరిని తన కుడి వైపున, కొందరిని తన ఎడమ వైపున ఉంచుతాడు.
34 “అప్పుడా రాజు తన కుడి వైపునున్న వాళ్ళతో, ‘రండి! నా తండ్రి ఆశీర్వాదాలను మీరు పొందారు. మీ రాజ్యాన్ని తీసుకొండి. ప్రపంచం సృష్టింపబడినప్పుడే ఈ రాజ్యాన్ని దేవుడు మీకోసం ఉంచాడు. 35 ఎందుకంటే, నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు. దాహం వేసినప్పుడు మీరు నాకు నీళ్ళిచ్చారు. పరదేశీయునిగా మీ దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఆతిథ్యమిచ్చారు. 36 దుస్తులు కావలసి వచ్చినప్పుడు మీరు నాకు దుస్తులిచ్చారు. జబ్బుతో ఉన్నప్పుడు మీరు నాకు సేవ చేసారు. నేను కారాగారంలో ఉన్నప్పుడు వచ్చి పలకరించారు’ అని అంటాడు.
37 “అప్పుడు నీతిమంతులు, ‘ప్రభూ! మీరు ఆకలితో ఉండగా మేము ఎప్పుడు మీకు భోజనం పెట్టాము? మీరు దాహంతో ఉండగా మీకు నీళ్ళెప్పుడిచ్చాము? 38 మీరు పరదేశీయునిగా ఎప్పుడు వచ్చారు? మిమ్మల్ని ఎప్పుడు ఆహ్వానించాము? మీకు దుస్తులు ఎప్పుడు కావలసివచ్చింది? దుస్తులు మీకు ఎప్పుడిచ్చాము? 39 మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు మేము ఎప్పుడు చూసాము? మీరు కారాగారంలో ఎప్పుడువున్నారు? మిమ్మల్ని చూడటానికి ఎప్పుడు వచ్చాము?’ అని అడుగుతారు.
40 “ఆ రాజు, ‘ఇది సత్యం. హీన స్థితిలో ఉన్న నా సోదరులకు మీరు చేసిన ప్రతి సహాయాన్ని నాకు చేసినట్టుగా పరిగణిస్తాను’ అని సమాధానం చెబుతాడు.
41 “ఆ తర్వాత ఆ రాజు తన ఎడమ వైపునున్న వాళ్ళతో, ‘శాపగ్రస్తులారా! వెళ్ళి పొండి! సైతాను కొరకు, వాని దూతలకొరకు సిద్ధం చేయబడిన శాశ్వతమైన మంటల్లో పడండి. 42 ఎందుకంటే, నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు. దాహం వేసినప్పుడు మీరు నాకు నీళ్ళివ్వలేదు. 43 నేను పరదేశీయునిగా వచ్చినప్పుడు మీరు నన్ను ఆహ్వానించలేదు. నాకు దుస్తులు కావలసి వచ్చినప్పుడు మీరు దుస్తుల్ని యివ్వలేదు. నేను జబ్బుతో కారాగారంలో ఉన్నప్పుడు మీరు నాకు సేవ చేయలేదు’ అని అంటాడు.
44 “అప్పుడు వాళ్ళు కూడా, ‘ప్రభూ! మీరు ఆకలిగావున్నప్పుడు గాని, లేక దాహంతో ఉన్నప్పుడు కాని, లేక పరదేశీయునిగా కాని, లేక జబ్బుతో ఉన్న వానిగా కాని లేక చెరసాలలో ఉన్నట్టుకాని ఎప్పుడు చూసాము? అలా చూసి కూడా మీకు ఎప్పుడు సహాయం చెయ్యలేదు?’ అని అంటారు.
45 “ఆయన, ‘ఇది సత్యం. హీనస్థితిలో ఉన్నవానికి మీరు సహాయం చెయ్యలేదు. కనుక నాకు సహాయం చెయ్యనట్లే’ అని చెబుతాడు.
46 “వాళ్ళు వెళ్ళి శాశ్వతంగా శిక్షను అనుభవిస్తారు. కాని నీతిమంతులు అనంత జీవితం పొందుతారు.”
© 1997 Bible League International