Print Page Options
Previous Prev Day Next DayNext

New Testament in a Year

Read the New Testament from start to finish, from Matthew to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
మత్తయి 13:31-58

దేవుని రాజ్యం దేనీతో పోల్చపడింది?

(మార్కు 4:30-34; లూకా 13:18-21)

31 ఆయన వాళ్ళకింకొక ఉపమానం చెప్పాడు: “దేవుని రాజ్యాన్ని ఒక ఆవగింజతో పోల్చవచ్చు. ఒక వ్యక్తి ఒక ఆవగింజను తన తోటలో నాటాడు. 32 అది విత్తనాలన్నిటికన్నా చిన్నదైనా, పెరిగినప్పుడది మొక్కలన్నిటి కన్నా పెద్దగా పెరిగి ఒక చెట్టవుతుంది. గాలిలో ఎగిరే పక్షులు దాని కొమ్మలపై గూళ్ళు కట్టుకొంటాయి.”

33 యేసు వాళ్లకింకొక ఉపమానం చెప్పాడు: “దేవుని రాజ్యం పులుపు పిండి లాంటిది. ఒక స్త్రీ పులిసినపిండిని తీసికొని మూడు సేర్ల పిండిలో కలిపింది. అలా చెయ్యటం వల్ల ఆ పిండంతా పులుపుగా మారింది.”

34 యేసు ప్రజలకు ఇవన్నీ ఉపమానాల ద్వారా చెప్పాడు. ఉపమానం ఉపయోగించకుండా వాళ్ళకేదీ చెప్పలేదు. 35 దాంతో ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన వాక్యాలు నిజమయ్యాయి:

“నేను ఉపమానాల ద్వారా మాట్లాడి,
    ప్రపంచం సృష్టింపబడిన నాటినుండి దాచబడిన వాటిని చెబుతాను.”(A)

కలుపు ఉపమానానికి అర్థం

36 ఆ తర్వాత ఆయన ప్రజల్ని వదలి యింట్లోకి వెళ్ళాడు. ఆయన శిష్యులు వచ్చి ఆయన్ని, “పొలంలోని కలుపు మొక్కల ఉపమానాన్ని గురించి మాకు వివరంగా చెప్పండి” అని అడిగారు.

37 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మంచి విత్తనాన్ని నాటుతున్న వాడు మనుష్య కుమారుడు. 38 ఈ ప్రపంచం పొలంతో పోల్చబడింది. మంచి విత్తనాలు దేవుని రాజ్యంలోవున్న ప్రజలతో పోల్చబడ్డాయి. పొలంలోని కలుపు మొక్కలు సైతాను కుమారులతో పోల్చబడ్డాయి. 39 వాటిని నాటిన శత్రువు సైతానుతో పోల్చబడ్డాడు. కోతకాలం యుగాంతంతో పోల్చబడింది. కోతకోసేవాళ్ళు దేవదూతలతో పోల్చబడ్డారు.

40 “కలుపు మొక్కల్ని పెరికి మంటల్లో వేసి కాల్చి వేసినట్లే యుగాంతంలో కూడా మనుష్య కుమారుడు తన దూతల్ని పంపుతాడు. 41 వాళ్ళు వచ్చి ఆయన రాజ్యంలో ఉన్న పాపుల్ని, పాపాలను కలుగజేసే వాళ్ళను ప్రోగు చేస్తారు. అలా ప్రోగు చేసి వాళ్ళను అగ్ని గుండంలో పారవేస్తారు. 42 వాళ్ళు ఏడుస్తారు. బాధననుభవిస్తారు. 43 ఆ తర్వాత నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యునిలా ప్రకాశిస్తారు. విన్నవాళ్ళు అర్థం చేసుకోండి!

దాచిన నిధి

44 “దేవుని రాజ్యం పొలంలో దాచబడిన నిధి లాంటిది. ఒక వ్యక్తి ఆ నిధిని కనుగొన్నాడు. కాని వెంటనే దాన్ని దాచేసాడు. ఆ తర్వాత ఆనందంగా వెళ్ళి తన దగ్గరున్నవన్నీ అమ్మివేసి ఆ పొలాన్ని కొన్నాడు.

45 “దేవుని రాజ్యం మంచి ముత్యాల కోసం వెతికే వర్తకుని లాంటిది. 46 ఒక వర్తకుడు మంచి విలువైన ఒక ముత్యాన్ని కనుగొన్నాడు. ఆ తర్వాత వెళ్ళి తనకున్నదంతా అమ్మేసి దాన్ని కొన్నాడు.

చేపలనుపట్టు వల యొక్క ఉపమానం

47 “దేవుని రాజ్యం సరస్సులోకి వేసి అన్ని రకాల చేపల్ని పట్టుకొనే ఒక వలలాంటిది. 48 వల చేపల్తో నిండిపొయ్యాక బెస్తవాళ్ళు దాన్ని ఒడ్డుకు లాగి మంచి చేపల్ని బుట్టలో వేసికొని పనికిరాని చేపల్ని పారవేస్తారు. 49 అదేవిధంగా యుగాంతంలో కూడా దేవ దూతలు వచ్చి నీతిమంతులనుండి దుర్మార్గుల్ని వేరు చేసి, భయానకమైన మంటల్లో పారవేస్తారు. 50 వాళ్ళు దుఃఖిస్తారు, బాధననుభవిస్తారు, పళ్ళు కొరుకుతారు.”

51 “మీకివన్నీ అర్థమయ్యాయా?” అని యేసు అడిగాడు.

అవునని వాళ్ళు సమాధానం చెప్పారు.

52 యేసు వాళ్ళతో, “దేవుని రాజ్యాన్ని గురించి బోధన పొందిన శాస్త్రుల్ని తన ధనాగారం నుండి క్రొత్త నిధుల్ని, పాతనిధుల్ని తీసుకొని వచ్చే ఆసామితో పోల్చవచ్చు” అని అన్నాడు.

యేసు తన స్వగ్రామానికి వెళ్ళటం

(మార్కు 6:1-6; లూకా 4:16-30)

53 యేసు ఈ ఉపమానాలన్నిటిని చెప్పటం ముగించాక అక్కడి నుండి ప్రయాణమై తన స్వగ్రామం వెళ్ళాడు. అక్కడ సమాజ మందిరంలో ప్రజలకు బోధించటం మొదలు పెట్టాడు. 54 వాళ్ళు ఆ బోధనలు విని చాలా ఆశ్చర్యపడి, “ఈ జ్ఞానం, ఈ శక్తి ఈయనకు ఎక్కడ నుండి లభించాయి? 55 ఈయన వడ్రంగి కుమారుడే కదూ! ఈయన తల్లి పేరు మరియ కదూ! ఇతని సోదరులు యాకోబు, యోసేవు, సీమోను, యూదా కదూ! 56 ఇతని అక్క చెల్లెండ్రందరూ మన గ్రామంలోనే నివసిస్తున్నారు కదూ! మరి ఈయనకు యివన్నీ ఎక్కడనుండి లభించాయి?” అని అన్నారు. 57 ఆయనపై వాళ్ళకు కోపం వచ్చింది.

యేసు వాళ్ళతో, “స్వగ్రామం వాళ్ళు, యింటి వాళ్ళు తప్ప ప్రవక్తను అందరూ గౌరవిస్తారు” అని అన్నాడు. 58 వాళ్ళు విశ్వసించలేదు. కనుక ఆయన అక్కడ ఎక్కువ అద్భుతాలు చేయలేదు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International