M’Cheyne Bible Reading Plan
యూదా రాజుగా యోతాము
27 యోతాము రాజయ్యేనాటికి ఇరువదియైదు సంవత్సరాలవాడు. యెరూషలేములో అతడు పదహారు సంవత్సరాలు పాలించాడు. అతని తల్లి పేరు యెరూషా. యెరూషా సాదోకు కుమార్తె. 2 యెహోవా కోరిన విధంగా యోతాము కార్యకలాపాలు నిర్వర్తించాడు. తన తండ్రి ఉజ్జియా మాదిరిగానే అతడు దేవునికి విధేయుడై వున్నాడు. కాని తన తండ్రి చేసిన విధంగా ధూపం వేయటానికి యోతాము ఆలయం ప్రవేశించలేదు. అయినా ప్రజలు మాత్రం తమ దుష్ట నడతను మానలేదు. 3 ఆలయపు పైద్వారాన్ని యోతాము తిరిగి నిర్మించాడు. ఓపెలు అనే స్థలంలో గోడమీద ఎక్కువ నిర్మాణాన్ని చేపట్టాడు. 4 యూదాలో కొండల ప్రాంతంలో యోతాము పట్టణాలను నిర్మించాడు. యోతాము అరణ్యాలలో కోటలను, బురుజులను కట్టించాడు. 5 యోతాము అమ్మోనీయుల రాజుతోను, అతని సైన్యంతోను పోరాడి వారిని ఓడించాడు. కావున మూడేళ్లపాటు ప్రతి సంవత్సరం అమ్మోనీయులు రెండు వందల మణుగుల[a] వెండి, పదివేల ఏదుముల[b] గోధుమలు, పదివేల ఏదుముల యవలు కప్పంగా చెల్లించారు.
6 తన దేవుడైన యెహోవా పట్ల సత్యవర్తనుడై విధేయుడైనందున యోతాము చాలా శక్తివంతమైన రాజు అయ్యాడు. 7 యోతాము చేసిన ఇతర కార్యాలు, అతడు నిర్వహించిన యుద్ధాలగురించి ఇశ్రాయేలు, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి. 8 యోతాము రాజయ్యేనాటికి ఇరువదియైదు సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో పదహారు సంవత్సరాలు పరిపాలించాడు. 9 తరువాత యోతాము చనిపోగా, అతనిని తన పూర్వీకులతో సమాధి చేశారు. ప్రజలతనిని దావీదు నగరంలో[c] సమాధి చేశారు. యోతాము స్థానంలో ఆహాజు రాజయ్యాడు. యోతాము కుమారుడే ఆహాజు.
యూదా రాజుగా ఆహాజు
28 ఆహాజు రాజయ్యేనాటికి ఇరవై యేండ్లవాడు. అతడు యెరూషలేములో పదహారు సంవత్సరాలు పాలించాడు. తన పూర్వీకుడైన దావీదువలె ఆహాజు మంచి మార్గంలో నడవలేదు. యెహోవా ఆశించిన విధంగా సత్కార్యాలు చేయలేదు. 2 ఇశ్రాయేలు రాజులు అనుసరించిన చెడుమార్గాన్నే ఆహాజు కూడ అనుసరించాడు. బయలు దేవతలను ఆరాధించటానికి అతడు విగ్రహాలను పోతపోయించాడు. 3 బెన్‌హీన్నోము లోయలో[d] ఆహాజు ధూపం వేశాడు. అతడు తన స్వంత కుమారులనే అగ్నిలో కాల్చి దేవతలకు బలియిచ్చాడు. ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు ఒడిగట్టే భయంకర పాపాలకే అతడు కూడా పాల్పడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ రాజ్యంలో ప్రవేశించినప్పుడు యెహోవా బయటకు తరిమివేసిన నీచవ్యక్తులే ఈ ప్రజలు. 4 గుట్టలమీద, కొండలమీద, ప్రతి పచ్చని చెట్టు కిందా ఆహాజు బలులు అర్పించి, ధూపం వేశాడు.
5-6 ఆహాజు పాపం చేయటంతో అతని దేవుడైన యెహోవా అతనిని అరాము (సిరియా) రాజు చేతిలో ఓడిపోయేలా చేశాడు. అరాము రాజు, అతని సైన్యం ఆహాజును ఓడించి, అనేకమంది యూదా వారిని బందీలుగా పట్టుకున్నారు. అరాము రాజు ఆ బందీలను దమస్కు (డెమాస్కస్) నగరానికి పట్టుకుపోయాడు. ఇశ్రాయేలు రాజైన పెకహు కూడా ఆహాజును ఓడించేలా యెహోవా చేశాడు. పెకహు తండ్రి పేరు రెమల్యా. పెకహు అతని సైన్యం కలిసి ఒక్కరోజులో యూదాకు చెందిన ఒక లక్షా ఇరవై వేలమంది ధైర్యంగల సైనికులను చంపివేశారు. వారి పూర్వీకులు విధేయులైవున్న వారి దేవుడైన యెహోవాకు వారు అవిధేయులైనందువల్ల పెకహు యూదా ప్రజలను ఓడించ గలిగాడు. 7 ఎఫ్రాయిముకు చెందిన జిఖ్రి ధైర్యంగల సైనికుడు. రాజైన ఆహాజు కుమారుడు మయశేయాను, రాజగృహ నిర్వహణాధికారి అజ్రీకామును, మరియు ఎల్కానాను జిఖ్రి చంపివేశాడు. రాజు తరపున అధికారం చెలాయించే వారిలో రాజు తరువాతివాడు ఎల్కానా.
8 ఇశ్రాయేలు సైన్యం యూదాలో నివసిస్తున్న తమ బంధువులైన రెండు లక్షల మందిని బందీచేశారు. వారు యూదా నుంచి స్త్రీలను, పిల్లలను, అనేక విలువైన వస్తువులను పట్టుకుపోయారు. ఇశ్రాయేలీయులు ఆ బందీలను, వస్తువులను సమరయకు (షోమ్రోను) తీసుకొనిపోయారు. 9 కాని యెహోవా ప్రవక్తలలో ఒకడు అక్కడ వున్నాడు. ఈ ప్రవక్త పేరు ఓదేదు. సమరయకు తిరిగి వచ్చిన ఇశ్రాయేలు సైన్యాన్ని ఓదేదు కలిశాడు. ఇశ్రాయేలు సైన్యంతో ఓదేదు యిలా అన్నాడు: “మీ పూర్వీకులు ఆరాధించిన దేవుడైన యెహోవా యూదా ప్రజలపట్ల కోపంగా వున్న కారణంగా వారిని మీరు ఓడించగలిగేలా చేశాడు. మీరు యూదా ప్రజలను నీచమైన విధంగా చంపి, శిక్షించారు. ఇప్పుడు యెహోవా మీపట్ల కోపంగా వున్నాడు. 10 మీరు యూదా, యెరూషలేము ప్రజలను బానిసలుగా చేయాలని తలస్తున్నారు. మీరు మీ దేవుడైన యెహోవాపట్ల కూడా పాపం చేశారు. 11 ఇప్పుడు నేను చెప్పేది వినండి. మీరు చెరపట్టిన మీ సోదరులను వెనుకకు పంపివేయండి. యెహోవా యొక్క భయంకరమైన కోపం మీమీది వుంది గనుక మీరీపని చేయండి.”
12 ఎఫ్రాయిములో కొంతమంది పెద్దలు ఇశ్రాయేలు సైనికులు యుద్ధం నుండి తిరిగి రావటం చూశారు. ఆ పెద్దలు ఇశ్రాయేలు సైనికులను కలిసి వారిని హెచ్చరించారు. ఆ పెద్దలు యెహానాను కుమారుడు అజర్యా, మెషిల్లేమోతు కుమారుడు బెరెక్యా, షల్లూము కుమారుడు యెహిజ్కియా, మరియు హద్లాయి కుమారుడు అమాశా. 13 వారు ఇశ్రాయేలు సైనికులతో యిలా చెప్పారు: “యూదా నుండి బందీలను ఇక్కడికి తీసుకొని రావద్దు. మీరాపని చేస్తే అది యెహోవా పట్ల మన పాపాన్ని, దోషాన్ని మరింత ఎక్కువ చేస్తుంది. దానితో ఇశ్రాయేలుపట్ల యెహోవా కోపం పట్టరానిదవుతుంది.”
14 అందువల్ల బందీలను, విలువైన వస్తులను సైనికులు ఆ పెద్దలకు, ఇశ్రాయేలు ప్రజలకు అప్పజెప్పారు. 15 ఇంతకుముందు పేర్కొన్న పెద్దలు (అజర్యా, బెరెక్యా, యెహిజ్కియా, మరియు అమాశా) నిలబడి బందీలకు సహాయపడ్డారు. ఇశ్రాయేలు సైనికులు తీసుకొన్న వారి దుస్తులను పెద్దలు తిరిగి తీసుకొని, దిగంబరంగా ఉన్న బందీలకు యిచ్చారు. పెద్దలు వారికి పాదరక్షలు కూడా యిచ్చారు. యూదా నుండి వచ్చిన బందీలకు అన్నపానాదులు కూడా పెద్దలు యిచ్చారు. సేద తీరటానికి వారికి నూనెతో కూడ వారు మర్దనా చేశారు. పిమ్మట ఆ ఎఫ్రాయిము పెద్దలు నీరసంగా వున్న బందీలను గాడిదలపై ఎక్కించి యెరికో పట్టణంలో తమ ఇండ్లకు తీసుకొని వెళ్లారు. యెరికోకు ఖర్జూర చెట్ల పట్టణమని పేరు. పిమ్మట ఆ నలుగురు పెద్దలు సమరయకు తిరిగి వెళ్లారు.
16-17 అదే సమయంలో ఎదోమీయులు మళ్లీ వచ్చి యూదా ప్రజలను ఓడించారు. ఎదోమీయులు ప్రజలను బందీలుగా పట్టుకుపోయారు. అందువల్ల రాజైన ఆహాజు అష్షూరు రాజు సహాయాన్ని అర్థించాడు. 18 కొండప్రాంతంలోను, దక్షిణ యూదా ప్రాంతంలోనుగల పట్టణాలపై ఫిలిష్తీయులు దాడులు జరిపారు. బేత్షెమెషు, అయ్యాలోను, గెదెరోతు, శోకో, తిమ్నా మరియు గిమ్జో పట్టణాలను ఫిలిష్తీయులు పట్టుకున్నారు. వారా పట్టణాలకు సమీపంలో వున్న గ్రామాలను కూడా ఆక్రమించుకున్నారు. పిమ్మట ఫిలిష్తీయులు వాటిలో నివసించసాగారు. 19 యూదా రాజైన ఆహాజు యూదా ప్రజలను పాపకార్యాలకు ప్రోత్సహించిన కారణంగా యెహోవా వారికి కష్టాలు కల్పించాడు. యెహోవా పట్ల అతడు అసలు విశ్వాసం లేకుండా ప్రవర్తించాడు. 20 అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు వచ్చి ఆహాజుకు సహాయం చేయటానికి బదులు అతనికి కష్టనష్టాలు కల్గించాడు. 21 ఆహాజు ఆలయం నుండి, రాజగృహం నుండి, యువరాజు ఆలయం నుండి విలువైన వస్తువులు కొన్ని తీశాడు. ఆహాజు వాటిని అష్షూరు రాజుకు యిచ్చాడు. అయినా ఆ పని అతనికి సహాయపడలేదు.
22 ఆహాజు తన కష్టాలతో సతమతమవుతూ మరిన్ని పాపాలు చేసి యెహోవా పట్ల మరీ విశ్వాసంలేని వాడయ్యాడు. 23 దమస్కు ప్రజలు ఆరాధించే దేవతలకు అతడు బలులు అర్పించాడు. దమస్కు ప్రజలు ఆహాజును ఓడించారు. అందువల్ల అతడిలా అనుకున్నాడు: “అరాము (సిరియా) ప్రజలు పూజించే దేవుళ్లు వారికి సహాయపడి వుండవచ్చు. కావున నేను కూడా ఆ దేవుళ్లకు బలులు అర్పిస్తే బహుశః వారు నాకు కూడా సహాయం చేయవచ్చు.” అందువల్ల ఆహాజు ఆ దేవుళ్లను ఆరాధించాడు. ఈ రకంగా అతడు పాపం చేసి, ఇశ్రాయేలు ప్రజలు కూడా పాపం చేయటానికి కారకుడయ్యాడు.
24 ఆహాజు ఆలయంలో వున్న వస్తువులను సేకరించి వాటిని ముక్కలు ముక్కలు చేశాడు. పిమ్మట అతడు ఆలయాన్ని మూసేశాడు. అతడు బలిపీఠాలు తయారు చేయించి, వాటిని యెరూషలేములో ప్రతివీధి చివర నెలకొల్పాడు. 25 యూదాలో ప్రతి పట్టణంలోనూ ఆహాజు ధూపాలు వేసి అన్యదేవతలను ఆరాధించటానికి ఉన్నత స్థలాలను ఏర్పాటు చేశాడు. ఇవన్నీ చేసి ఆహాజు తన పూర్వీకులు ఆరాధించిన ప్రభువైన యెహోవాకు ఎక్కడలేని కోపాన్నీ కల్గించాడు.
26 మొదటి నుండి చివరి వరకు ఆహాజు చేసిన పనులన్నీ యూదా, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో వ్రాయబడ్డాయి. 27 ఆహాజు చనిపోగా, అతడు అతని పూర్వీకులతోపాటు సమాధి చేయబడ్డాడు. ప్రజలు ఆహాజును యెరూషలేము నగరంలో సమాధి చేశారు. కాని ఆహాజును ఇశ్రాయేలు రాజులను సమాధిచేసే చోట మాత్రం వారు సమాధి చేయలేదు. ఆహాజు స్థానంలో అతని కుమారుడు హిజ్కియా కొత్త రాజయ్యాడు.
గొఱ్ఱెపిల్ల మరియు లక్షా నలుబది నాలుగు వేల మంది
14 అప్పుడు నేను చూశాను. నా ముందు ఆ గొఱ్ఱెపిల్ల కనబడినాడు. ఆయన సీయోను పర్వతంపై నిలబడి ఉన్నాడు. ఆయనతో ఒక లక్షా నలుబది నాలుగు వేల మంది ఉన్నారు. వాళ్ళ నొసళ్ళపై ఆయన పేరు, ఆయన తండ్రి పేరు వ్రాయబడి ఉంది.
2 పరలోకం నుండి నాకొక శబ్దం వినిపించింది. ఆ ధ్వని జలపాతపు ధ్వనిలా, పెద్ద ఉరుము ధ్వనిలా ఉంది. నేను విన్న ఆ ధ్వని వీణను మీటినప్పుడు కలిగే ధ్వనిలా ఉంది. 3 వాళ్ళు సింహాసనం ముందు, ఆ నాలుగు ప్రాణుల ముందు, పెద్దల ముందు నిలబడి ఒక క్రొత్త పాట పాడారు. భూలోకం నుండి విమోచించబడ్డ ఒక లక్షా నలుబది నాలుగు వేల మంది తప్ప యితరులు ఆ పాట నేర్చుకోరు.
4 వీళ్ళు స్త్రీ సంపర్కంతో మలినం కాకుండా పవిత్రంగా ఉన్నవాళ్ళు. వీళ్ళు గొఱ్ఱెపిల్ల ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని అనుసరించేవాళ్ళు. వీళ్ళు మానవులనుండి కొనుక్కోబడి ప్రథమ ఫలంగా దేవునికి, గొఱ్ఱెపిల్లకు ప్రత్యేకింపబడినవాళ్ళు. 5 వీళ్ళ మాటల్లో అసత్యం లేదు. వీళ్ళు నిర్దోషులు.
ముగ్గురు దూతలు
6 ఆ తర్వాత మరొక దూత మధ్యాకాశంలో ఎగరటం చూసాను. ప్రపంచంలో నివసించే ప్రజలందరికీ, అంటే ప్రతి దేశానికి, ప్రతి జాతికి, ప్రతి భాషకు, ప్రతి గుంపుకు చెందిన ప్రజలకు ప్రకటించటానికి అతని దగ్గర “అనంత జీవితాన్ని” గురించిన సువార్త ఉంది. 7 అతడు బిగ్గరగా, “దేవునికి భయపడండి. ఆయన మహిమను స్తుతించండి. ఆయన తీర్పు చెప్పే గడియ దగ్గరకు వచ్చింది. ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, నీటి ఊటలను సృష్టించిన వాణ్ణి పూజించండి” అని అన్నాడు.
8 రెండవ దూత మొదటి దూతను అనుసరిస్తూ, “బాబిలోను పతనమైపోయింది. బాబిలోను మహానగరం పతనమైపోయింది. ‘వ్యభిచారం’ అనబడే మద్యాన్ని దేశాలకు త్రాగించింది ఇదే” అని అన్నాడు.
9 మూడవ దూత మొదటి యిద్దరిని అనుసరిస్తూ బిగ్గరగా, “మృగాన్ని గాని, దాని విగ్రహాన్ని గాని పూజించి, దాని ముద్రను నుదుటి మీద గాని, చేతిమీద గాని వేయించుకొన్నవాడు దేవుని కోపమనే మద్యాన్ని త్రాగక తప్పదు. 10 ఈ మద్యం దేవుని ఆగ్రహం అనబడే గిన్నెలో పూర్తి ఘాటుతో చేయబడింది. అంతేకాక పరిశుద్ధమైన దూతల ముందు, గొఱ్ఱెపిల్ల ముందు మండుతున్న గంధకంతో వానిని హింసిస్తారు. 11 వాళ్ళు కాలటంవల్ల రగులుతున్న పొగ చిరకాలం లేస్తూనే ఉంటుంది. మృగాన్ని గాని, దాని విగ్రహాన్ని గాని పూజించే వాళ్ళకు, లేక దాని పేరును ముద్రగా పొందిన వాళ్ళకు పగలు, రాత్రి విరామం ఉండదు” అని అన్నాడు. 12 అంటే దేవుని ఆజ్ఞలను పాటించే పవిత్రులు యేసుపట్ల విశ్వాసం ఉన్నవాళ్ళు సహనంగా ఉండాలి.
13 ఆ తదుపరి పరలోకం నుండి ఒక స్వరం, “ఇది వ్రాయి. ఇప్పటి నుండి ప్రభువులో చనిపోయినవాళ్ళు ధన్యులు” అని అన్నది.
“అది నిజం. వాళ్ళకిక విశ్రాంతి ఉంటుంది. ఇది వరకు వాళ్ళు చేసిన మంచిపనులు వాళ్ళ వెంట ఉంటాయి” అని పరిశుద్ధాత్మ అన్నాడు.
భూమ్మీద పంట కోత
14 ఒక తెల్లటి మేఘం నా ముందు కనిపించింది. దానిమీద “మనుష్యకుమారుని”[a] లాంటివాడు కూర్చొనివుండటం చూశాను. ఆయన తలపై బంగారు కిరీటం ఉంది. ఆయన చేతిలో పదునైన కొడవలి ఉంది. 15 ఆ తర్వాత మందిరం నుండి మరొక దూత వచ్చాడు. అతడు బిగ్గరగా మేఘం మీద కూర్చొన్నవాణ్ణి పిలిచి, “భూమ్మీద పంట పండింది. పంటను కోసే సమయం వచ్చింది. నీ కొడవలి తీసుకొని పంటను కోయి!” అని అన్నాడు. 16 మేఘంమీద కూర్చొన్నవాడు తన కొడవలిని భూమ్మీదికి విసిరాడు. వెంటనే ఆ కొడవలి పంటను కోసింది.
17 పరలోకంలో ఉన్న మందిరం నుండి యింకొక దూత వచ్చాడు. అతని దగ్గర కూడా ఒక పదునైన కొడవలి ఉంది. 18 మరొక దూత బలిపీఠం నుండి వచ్చాడు. అగ్నికి అధికారియైన యితడు బిగ్గరగా పదునైన కొడవలి ఉన్నవాణ్ణి పిలుస్తూ, “ద్రాక్ష పండింది. నీ పదునైన కొడవలి తీసుకెళ్ళి భూమ్మీద వున్న ద్రాక్షా తోటనుండి ద్రాక్షాగుత్తుల్ని కోయి” అని అన్నాడు. 19 ఆ దూత కొడవలిని భూమ్మీదికి విసిరి ద్రాక్షా పండ్లు కోసి వాటిని దేవుని కోపం అనబడే పెద్ద తొట్టిలో వేసాడు. 20 ఊరికి అవతలవున్న ద్రాక్షా తొట్టిలో ద్రాక్షా పళ్ళను వేసి వాటిని త్రొక్కారు. దాన్నుండి రక్తం ప్రవహించింది. ఆ రక్తం గుఱ్ఱం నోటి కళ్ళెం అంత ఎత్తు లేచి, సుమారు రెండు వందల మైళ్ళ దూరందాకా ప్రవహించింది.
యెహోవా వాగ్దానాలు
10 వసంత ఋతువులో వర్షం కొరకు యెహోవాను ప్రార్థించండి. యెహోవా మెరుపులను కలుగజేస్తాడు. వర్షం కురుస్తుంది. ప్రతివాని పొలంలోనూ దేవుడు పైరులు పెరిగేలా చేస్తాడు.
2 భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలుసుకోవటానికి ప్రజలు తమ చిన్న విగ్రహాలను, మంత్రతంత్రాలను ఉపయోగిస్తారు. కాని అది నిరుపయోగం. ఆ జనులు దర్శనాలు చూసి, తమ కలలను వివరిస్తారు. కాని అవన్నీ పనికిరాని అబద్ధాలు. అందువల్ల ప్రజలు సహాయంకొరకు గొర్రెల్లా అరుస్తూ ఇక్కడా, అక్కడా తిరుగుతారు. కాని వారిని నడిపించటానికి కాపరిలేడు.
3 యెహోవా చెపుతున్నాడు: “కాపరుల (నాయకుల) పట్ల నేను చాలా కోపంగా వున్నాను. నా గొర్రెలకు (ప్రజలకు) జరిగిన దానికి నేను ఆ నాయకులను బాధ్యులనుగా చేశాను.” (యూదా ప్రజలు దేవుని యొక్క గొర్రెల మంద. సర్వశక్తిమంతుడైన యెహోవా తన మంద విషయంలో జాగ్రత్త తీసుకుంటాడు. ఒక సైనికుడు తన అందమైన యుద్ధగుర్రం విషయంలో శ్రద్ధ చూపినట్టు, ఆయన వారి పట్ల జాగ్రత్త తీసుకుంటాడు.)
4 “పునాదిరాయి, గుడారపు గుంజ, యుద్ధ విల్లు, ముందుకు చొచ్చుకువచ్చే సైన్యం అన్నీ యూదానుండి కలిసి వస్తాయి. 5 వారు తమ శత్రువును ఓడిస్తారు. అది సైనికులు బురద వీధులగుండా నడిచినట్లు ఉంటుంది. వారు పోరాడతారు. యెహోవా వారితోవున్న కారణంగా వారు శత్రువుకు చెందిన గుర్రపు దళాలను కూడ ఓడిస్తారు. 6 యూదా వంశాన్ని నేను బలపర్చుతాను. యోసేపు వంశాన్ని యుద్ధంలో గెలిచేలా చేస్తాను. వారిని సురక్షితంగా, ఆరోగ్యంగా తిరిగి తీసుకు వస్తాను. వారిని ఓదార్చుతాను. అది నేను వారిని ఎప్పుడూ విడిచి పెట్టనట్లుగా ఉంటుంది. నేను వారి దేవుడనైన యెహోవాను. నేను వారికి సహాయం చేస్తాను. 7 ఎఫ్రాయిము ప్రజలు తాగటానికి పుష్కలంగా దొరికిన సైనికులవలె సంతోషంగా ఉంటారు. వారి పిల్లలు ఉల్లాసంగా ఉంటారు. వారు కూడ హాయిగా ఉంటారు. వారంతా యెహోవాతో కలిసి ఉండే ఆనందమయ సమయాన్ని కలిగి ఉంటారు.
8 “నేను వారికొరకు ఈల వేసి, వారందరినీ ఒక్కచోటికి పిలుస్తాను. నేను వారిని నిజంగా రక్షిస్తాను. వారి సంఖ్య విస్తారంగా ఉంటుంది. 9 అవును, నా ప్రజలను అనేక దేశాలకు చెదరగొడుతూ వచ్చాను. కాని ఆ దూర దేశాలలో వారు నన్ను జ్ఞాపకం చేసుకుంటారు. వారు, వారి పిల్లలు బతుకుతారు. పైగా వారు తిరిగి వస్తారు. 10 నేను వారిని ఈజిప్టు (ఐగుప్తు) నుంచి, అష్షూరు నుంచి వెనుకకు తీసుకు వస్తాను. వారిని గిలాదు ప్రాంతానికి తిరిగి తీసుకువస్తాను. అక్కడ వారికి సరిపోయే స్థలం వుండదు గనుక, వారిని దగ్గరలోనేవున్న లెబానోనులో నివసించనిస్తాను.” 11 దేవుడు వారిని ఈజిప్టు (ఐగుప్తు) నుండి బయటకు తీసికొని వచ్చినప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు పరిస్థితి ఉంటుంది. ఆయన సముద్రపు అలలను కొట్టగా, సముద్రం రెండు పాయలు అయ్యింది. ప్రజలు ఆ కష్టాల సముద్రం మధ్యనుండి నడిచి వచ్చారు. యెహోవా నదీ ప్రవాహాలను ఇంకిపోయేలా చేస్తాడు. అష్షూరు గర్వాన్ని, ఈజిప్టు (ఐగుప్తు) అధికారాన్ని ఆయన నాశనం చేస్తాడు. 12 యెహోవా తన ప్రజలు బలపడేలా చేస్తాడు. వారు ఆయన ధ్యానంలో, ఆయన నామస్మరణ చేస్తూ జీవిస్తారు. యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
యేసు తన శిష్యుల పాదాలు కడగటం
13 పస్కా పండుగ దగ్గరకు వచ్చింది. ఈ ప్రపంచాన్ని వదిలి తన తండ్రి దగ్గరకు వెళ్ళే సమయం వచ్చిందని యేసుకు తెలుసు. ఆయన ఈ ప్రపంచంలో ఉన్న తన వాళ్ళను ప్రేమించాడు. తాను వాళ్ళనెంత సంపూర్ణంగా ప్రేమించాడంటే ఆ ప్రేమను వాళ్ళకు చూపించాడు.
2 యేసు, ఆయన శిష్యులు రాత్రి భోజనం చేయుటకు కూర్చొని ఉన్నారు. సైతాను అప్పటికే సీమోను కుమారుడైన యూదా ఇస్యరియోతులో ప్రవేశించి యేసుకు ద్రోహం చెయ్యమని ప్రేరేపించాడు. 3 తండ్రి తనకు సంపూర్ణమైన అధికారమిచ్చినట్లు యేసుకు తెలుసు. తాను దేవుని నుండి వచ్చిన విషయము, తిరిగి ఆయన దగ్గరకు వెళ్ళ బోతున్న విషయము ఆయనకు తెలుసు. 4 అందువల్ల ఆయన భోజన పంక్తి నుండి లేచాడు. తన పైవస్త్రాన్ని తీసివేసి, ఒక కండువాను నడుముకు చుట్టుకున్నాడు. 5 ఆ తర్వాత ఒక వెడల్పయిన పళ్ళెంలో నీళ్ళు పోసి తన శిష్యుల పాదాలు కడగటం మొదలుపెట్టాడు. నడుముకు చుట్టుకున్న కండువాతో వాళ్ళ పాదాలు తుడిచాడు.
6 యేసు సీమోను పేతురు దగ్గరకు రాగానే, పేతురు ఆయనతో, “ప్రభూ! మీరు నా పాదాలు కడుగుతారా?” అని అన్నాడు.
7 యేసు, “నేను చేస్తున్నది నీకు యిప్పుడు అర్థం కాదు. తదుపరి అర్థమౌతుంది” అని సమాధానం చెప్పాడు.
8 పేతురు, “మీరు నా పాదాలు ఎన్నటికీ కడుగకూడదు. నేను ఒప్పుకోను” అని అన్నాడు.
యేసు, “నీ పాదాలు కడిగితే తప్ప నీకు, నాకు సంబంధం ఉండదు!” అని సమాధానం చెప్పాడు.
9 సీమోను పేతురు, “ప్రభూ! అలాగైతే నా పాదాలేకాదు. నా చేతుల్ని, నా తలను కూడా కడగండి!” అని అన్నాడు.
10 యేసు సమాధానం చెబుతూ, “స్నానం చేసినవాని శరీరమంతా శుభ్రంగా ఉంటుంది. కనుక అతడు పాదాలు మాత్రం కడుక్కుంటే చాలు ఒక్కడు తప్ప మీరందరూ పవిత్రులై ఉన్నారు” అని అన్నాడు. 11 తనకు ద్రోహం చేయనున్న వాడెవడో యేసుకు తెలుసు. కనుకనే ఒక్కడు తప్ప అందరూ పవిత్రంగా ఉన్నారని ఆయనన్నాడు.
12 ఆయన వాళ్ళ పాదాలు కడగటం ముగించి, పై వస్త్రాన్ని వేసుకొని తాను యింతకు ముందు కూర్చున్న స్థలానికి వెళ్ళాడు. యేసు, “నేను చేసింది మీకు అర్థమైందా? 13 మీరు నన్ను ‘బోధకుడా!’ అని ‘ప్రభూ!’ అని పిలుస్తారు. నేను బోధకుడను కనుక మీరు నన్ను ఆ విధంగా పిలవటం సమంజసమే! 14 మీ బోధకుడను, ప్రభువును అయిన నేను మీ పాదాలు కడిగాను. కనుక మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగాలి. 15 నేను చేసిన దాన్ని ఆదర్శంగా తీసుకొని నేను చేసినట్లు మీరు కూడా చేయాలని నా ఉద్దేశ్యం. 16 ఇది నిజం. యజమాని కంటే సేవకుడు గొప్ప కాదు. అలాగే వార్త తెచ్చేవాడు వార్త పంపినవాని కన్నా గొప్ప కాదు. 17 ఇవన్నీ మీరు తెలుసుకున్నారు. వీటిని ఆచరిస్తే ధన్యులౌతారు.
18 “నేనిది మీ అందర్ని గురించి చెప్పటం లేదు. నేను ఎన్నుకొన్న వాళ్ళు నాకు తెలుసు. కాని ఈ విషయం జరిగి తీరాలి: ‘నాతో రొట్టె పంచుకొన్న వాడు నాకు ద్రోహం చేస్తాడు.’ ఇవి జరుగక ముందే మీకు అన్నీ చెబుతున్నాను. 19 అవి జరిగినప్పుడు నేనే ఆయన్ని అని మీరు విశ్వసించాలని నా ఉద్దేశ్యం. 20 ఇది నిజం. నేను పంపిన వాణ్ణి అంగీకరించిన వాడు నన్ను అంగీకరించిన వానిగా పరిగణింపబడతాడు. నన్ను అంగీకరించిన వాడు నన్ను పంపిన వాణ్ణి అంగీకరించినట్లు పరిగణింపబడతాడు” అని అన్నాడు.
యేసు వంచకుని గురించి మాట్లాడటం
(మత్తయి 26:20-25; మార్కు 14:17-21; లూకా 22:21-23)
21 యేసు మాట్లాడటం ముగించాడు. ఆయన మనస్సుకు చాలా వేదన కలిగింది. ఆయన, “ఇది నిజం. మీలో ఒకడు నాకు ద్రోహం చేస్తాడు” అని అన్నాడు.
22 ఆయన శిష్యులు, ఆయన ఎవర్ని గురించి అంటున్నాడో తెలుసుకోలేక ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. 23 యేసు ప్రేమించిన శిష్యుల్లో ఒకడు యేసు ప్రక్కనే కూర్చొని ఉన్నాడు. 24 సీమోను పేతురు ఆ శిష్యునితో, “ఎవర్ని గురించి అంటున్నాడో అడుగు” అని సంజ్ఞ చేసాడు.
25 అతడు యేసుకు దగ్గరగా ఒరిగి, “ప్రభూ! ఎవరు!” అని అడిగాడు.
26 యేసు, “నేనీ రొట్టె ముక్కను పాత్రలో ముంచి ఎవరికిస్తానో వాడే!” అని సమాధానం చెప్పాడు. తదుపరి రొట్టెముక్కను పాత్రలో ముంచి సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదాకు యిచ్చాడు. 27 రొట్టె తీసుకొన్న వెంటనే సైతాను వానిలోకి ప్రవేశించాడు. యేసు వానితో, “నీవు చేయబోయేదేదో త్వరగా చెయ్యి” అని అన్నాడు. 28 కాని, భోజనానికి కూర్చున్న వాళ్ళకెవ్వరికీ యేసు ఆ విధంగా ఎందు కంటున్నాడో అర్థం కాలేదు. 29 డబ్బు యూదా ఆధీనంలో ఉండేది. కాబట్టి పండుగకు కావలసినవి కొని తెమ్మంటున్నాడని కొందరనుకున్నారు. పేదలకు కొంత పంచి పెట్టమంటున్నాడని మరికొందరనుకున్నారు.
30 యూదా రొట్టె తీసుకొని వెంటనే బయటకు వెళ్ళిపోయాడు. అది రాత్రి సమయం.
యేసు తన మరణాన్ని గురించి మాట్లాడటం
31 యూదా వెళ్ళిపోయాక యేసు, “ఇప్పుడు మనుష్యకుమారుని మహిమ వ్యక్తమయింది. అలాగే ఆయనలో దేవుని మహిమ వ్యక్తమయింది. 32 దేవుడు అయన ద్వారా మహిమ పొందాక తన కుమారుణ్ణి తనలో ఐక్యం చేసికొని మహిమపరుస్తాడు. ఆలస్యం చేయడు” అని అన్నాడు.
33 యేసు, “బిడ్డలారా! నేను మీతో మరి కొంత కాలం మాత్రమే ఉంటాను. మీరు నా కోసం చూస్తారు. యూదులకు చెప్పిన విషయాన్నే మీకూ చెబుతున్నాను. నేను వెళ్ళే చోటికి మీరు యిప్పుడురారు.
34 “నేను మీకొక క్రొత్త ఆజ్ఞనిస్తున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి. నేను మిమ్మల్ని ప్రేమించిన విధంగా మీరు కూడా ఒకరిపట్ల ఒకరు ప్రేమ కలిగి వుండండి 35 మీరు ఒకరినొకరు ప్రేమతో చూసుకున్నప్పుడే మీరు నాకు శిష్యులని లోకమంతా తెలుసుకుంటారు” అని అన్నాడు.
యేసు పేతురుతో మాట్లాడటం
(మత్తయి 26:31-35; మార్కు 14:27-31; లూకా 22:31-34)
36 సీమోను పేతురు, “ప్రభూ! మీరెక్కడికి వెళ్తున్నారు?” అని అడిగాడు.
యేసు, “నేను ఎక్కడికి వెళ్తున్నానో అక్కడికి నీవు యిప్పుడు నా వెంట రాలేవు. కాని తర్వాత నన్ను అలుసరించగలుగుతావు” అని అన్నాడు.
37 పేతురు, “ప్రభూ! యిప్పుడే ఎందుకు నేను నీ వెంట రాలేను? నేను మీకోసం నా ప్రాణాల్ని అర్పించటానికి సిద్ధంగా ఉన్నాను” అని అన్నాడు.
38 యేసు, “నీవు నిజంగా నా కోసం నీ ప్రాణంయిస్తావా? ఇది నిజం. కోడి కూసేలోగా నేనెవరినో తెలియదని మూడుసార్లు అంటావు!” అని సమాధనం చెప్పాడు.
© 1997 Bible League International