M’Cheyne Bible Reading Plan
దావీదు మనుష్యులను అమ్మోనీయులు అవమాన పరచటం
19 అమ్మోనీయుల రాజు పేరు నాహాషు. నాహాషు చనిపోగా అతని కుమారుడు నూతన రాజయ్యాడు. 2 ఇది విన్న దావీదు, “నాహాషు నాపట్ల చాలా దయతో వున్నాడు. నేను కూడ నాహాషు కుమారుడు హానూను పట్ల దయగలిగి వుంటాను” అని అన్నాడు. కావున తన తండ్రి చనిపోయిన సందర్భంగా హనూనును పలకరించే నిమిత్తం దావీదు తన మనుష్యులను పంపాడు. హానూనును ఓదార్చటానికి దావీదు దూతలు మోయాబు దేశానికి వెళ్లారు.
3 అమ్మోనీయుల పెద్దలు హానూనుతో ఇలా అన్నారు: “నీవు మోసంలో పడవద్దు. దావీదు నిజంగా నిన్ను ఓదార్చటానికి గాని, చనిపోయిన నీ తండ్రి పట్ల గౌరవభావంతో గాని తన మనుష్యులను పంపలేదు! దావీదు తన మనుష్యులను కేవలం నీమీద, నీ రాజ్యం మీద నిఘావేసి రహస్యాలను సేకరించటానికే పంపాడు. నిజానికి దావీదు నీ రాజ్యాన్ని నాశనం చేయ సంకల్పించాడు.” 4 దానితో దావీదు మనుష్యులను హానూను బంధించి వారి గడ్డాలు[a] గొరిగించాడు. తొడల దగ్గర వారి బట్టలు కూడ హానూను కత్తిరించాడు. తరువాత వారిని పంపివేశాడు.
5 దావీదు మనుష్యులు ఆ పరిస్థితిలో ఇంటికి వెళ్లటానికి సిగ్గుతో చాలా బాధపడ్డారు. అది చూసిన కొంత మంది మనుష్యులు దావీదు వద్దకు వెళ్లి అతని మనుష్యులకు జరిగిన అవమానాన్ని తెలియజేశారు. అది విన్న దావీదు తన మనుష్యులకు ఇలా కబురు పంపాడు: “మీ గడ్డాలు పెరిగే వరకు మీరు యెరికో పట్టణంలో వుండండి. తరువాత మీరు ఇండ్లకు తిరిగిరండి.”
6 ఇది జరిగిన పిమ్మట అమ్మోనీయులు తాము దావీదుకు బద్ధశత్రువులైనట్లు గుర్తించారు. దానితో హానూను, అమ్మోనీయులు డెబ్బై ఐదువేల పౌనుల[b] (రెండువేల మణుగులు) వెండిని వెచ్చించి మెసపొతేమియా (అరామ్నహరయీము) నుండి రథాలను, రథసారధులను కొన్నారు. వారింకా అరాములోని మయకా, సోబా నగరాల నుండి కూడ రథాలను, వాటిని తోలే వారిని సేకరించారు. 7 అమ్మోనీయులు ముప్పది రెండువేల రథాలను కొన్నారు. వారు మయకా రాజుకు, అతని సైన్యానికి కొంత సొమ్ము చెల్లించి వారి సహాయాన్ని కూడ అర్థించారు. మయకా రాజు, అతని సైనికులు వచ్చి మెదెబా పట్టణం వద్ద గుడారాలు వేశారు. అమ్మోనీయులు తమ పట్టణాల నుండి బయటకు వచ్చి యుద్ధానికి సిద్ధమయ్యారు.
8 అమ్మోనీయులు యుద్ధానికి సిద్ధమవుతున్నారని దావీదు విన్నాడు. అతను యోవాబును, ఇశ్రాయేలు సైన్యాన్నంతటినీ అమ్మోనీయులను ఎదుర్కోటానికి పంపాడు. 9 అమ్మోనీయులంతా బహిరంగంగా వచ్చి యుద్ధానికి సిద్ధంగా వున్నారు. వారు నగర ద్వారం వద్ద వున్నారు. వారికి సహాయంగా వచ్చిన రాజులు వారి సేనలతో బయట పొలాలలో దిగియుండిరి.
10 తనపై యుద్ధం చేయటానికి రెండు సైనిక కూటాలవారు సిద్ధంగా వున్నట్లు యోవాబు చూశాడు. ఒక వర్గం తనముందు, రెండవ వర్గం తన వెనుక వున్నాయి. అప్పుడు యోవాబు ఇశ్రాయేలు సైన్యంలో కాకలు తీరిన వారిని కొంతమందిని ఎంపిక చేశాడు. వారిని అరాము సైన్యంతో పోరాడటానికి పంపాడు. 11 యోవాబు మిగిలిన ఇశ్రాయేలు సైన్యాన్ని అబీషై అధీనంలో వుంచాడు. యోవాబు సోదరుడే అబీషై. ఆ సైనికులు అమ్మోనీయుల సైన్యంతో యుద్ధం చేయటానికి వెళ్లారు. 12 అబీషైతో యోవాబు ఇలా అన్నాడు: “అరాము సైన్యం గనుక నామీద పైచేయిగా వుంటే నీవు నాకు సహాయంగా రావాలి. ఒకవేళ అమ్మోనీయుల సైనికులు గనుక నీ శక్తికి మించివుంటే నేను నీకు సహాయంగా వస్తాను. 13 మన ప్రజల కొరకు, మన దేవుని నగరాల కొరకు పోరాడే ఈ తరుణంలో మనం చాలా ధైర్యంగా వుండాలి! యెహోవా ఏది మంచిదని తలుస్తాడో దానిని ఆయన చేయుగాక!”
14 యోవాబు, అతని సైనికులు కలిసి అరాము నుండి వచ్చిన సైన్యాన్ని ఎదుర్కొన్నారు. అరాము సైన్యం యోవాబు సైనికుల ధాటికి తట్టుకోలేక పారిపోయింది. 15 అరాము సైన్యం పారిపోవటం అమ్మోను సైనికులు చూసి, వారు కూడ పారిపోయారు. వారు అబీషైకి, అతని సైన్యానికి జడిసి పారిపోయారు. అమ్మోనీయులు తమ నగరంలోకి వెళ్లిపోయారు. యోవాబు యెరూషలేముకు తిరిగి వెళ్లాడు.
16 ఇశ్రాయేలు తమను ఓడించినట్లు అరాము నాయకులు అర్థం చేసుకున్నారు. యూఫ్రటీసు నదికి తూర్పున నివసిస్తున్న అరామీయులను సహాయంగా రమ్మని వారు కబురు పంపారు. అరాముకు చెందిన హదదెజెరు సైన్యానికి షోపకు అధిపతి. అరాములో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన సైన్యాలను కూడ షోపకు నడిపించాడు.
17 అరాము ప్రజలు యుద్ధ ప్రయత్నాలు చేస్తున్నారనే వార్త దావీదు విన్నాడు. అందువల్ల దావీదు ఇశ్రాయేలు ప్రజలందరినీ సమీకరించాడు. దావీదు వారిని యోర్దాను నదిని దాటించాడు. వారు అరామీయులకు ఎదురుపడి నిలబడ్డారు. దావీదు తన సైన్యాన్ని యుద్ధానికి సమాయత్తపరచి అరామీయులతో తలపడ్డాడు. 18 ఇశ్రాయేలీయుల నుండి అరామీయులు పారిపోయారు. దావీదు, అతని సైనికులు కలిసి ఏడువేల మంది అరాము రథసారధులను, నలుబదివేల మంది అరాము సైనికులను చంపివేశారు.
19 ఇశ్రాయేలీయులు తమను ఓడించారని హదదెజెరు సైన్యాధికారులు తెలుసుకొని, దావీదుతో సంధి చేసుకొన్నారు. వారు దావీదుకు సేవకులయ్యారు. అటు తరువాత అరామీయులు ఎన్నడూ అమ్మోనీయులకు సహాయం చేయలేదు.
అమ్మోనీయులను యోవాబు నాశనం చేయటం
20 ఆ తరువాత సంవత్సరం (వసంత కాలం) లో యోవాబు ఇశ్రాయేలు సైన్యాన్ని యుద్ధానికి నడిపాడు. సంవత్సరంలో అది రాజులు దండ యాత్రలు చేయటానికి అనువైన సమయం. కాని దావీదు మాత్రం యెరూషలేములోనే వున్నాడు. ఇంతలో ఇశ్రాయేలు సైన్యం అమ్మోను రాజ్యం మీదికి దండెత్తి, దానిని నాశనం చేసింది. పిమ్మట వారు రబ్బా నగరానికి వెళ్లారు. వారు నగరాన్ని చుట్టుముట్టి, ప్రజల రాకపోకలు నిలిపివేసారు. యోవాబు, ఇశ్రాయేలు సైనికులు రబ్బా నగరం నాశనమయ్యే వరకు దానిపై దాడిచేసారు.
2 తరువాత దావీదు వచ్చి ఆ రాజు తలపై కిరీటాన్ని తీసుకున్నాడు. ఆ బంగారు కిరీటం డెబ్బై ఐదు పౌనుల (రెండు మణుగుల) బరువుంది. కిరీటంలో విలువైన రత్నాలు పొదగబడ్డాయి. ఆ కిరీటం దావీదు తలపై పెట్టబడింది. రబ్బా నగరం నుండి దావీదు అనేక విలువైన వస్తు సామగ్రిని తెప్పించాడు. 3 రబ్బా నగర వాసులను దావీదు తీసుకొనివచ్చి వారిచే రంపాలతోను, ఇనుప సమ్మెటలతోను, గొడ్డళ్లతోను బలవంతంగా పని చేయించాడు. ప్రతి అమ్మోనీయుల నగరంలోను దావీదు ఈ విధంగానే చేసాడు. తరువాత దావీదు, అతని సైన్యం యెరూషలేముకు తిరిగి వెళ్లారు.
ఫిలిష్తీ యోధుల సంహారం
4 ఇదంతా అయిన పిమ్మట ఇశ్రాయేలు ప్రజలు గెజెరు పట్టణం వద్ద ఫిలిష్తీయులతో తలపడ్డారు. ఈసారి హుషాతీయుడైన సిబ్బెకై సిప్పయి అను వానిని చంపివేసాడు. సిప్పయి ఫిలిష్తీ యోధుల సంతతివాడు. దానితో ఫిలిష్తీయులు ఇశ్రాయేలు వారికి బానిసలయ్యారు.
5 ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల పైకి మరోసారి యుద్ధానికి వెళ్లారు. యాయీరు కుమారుడైన ఎల్హానాను అనేవాడు లహ్మీని చంపాడు. లహ్మీ అనేవాడు గొల్యాతు సోదరుడు. గొల్యాతు గాతు పట్టణానికి చెందినవాడు. లహ్మీ చేతిలోని ఈటె చాలా పెద్దది. బరువైనది. అది నేతగాని మగ్గం దోనెవలె వుంటుంది.
6 గాతు పట్టణం వద్ద ఫిలిష్తీయులతో ఇశ్రాయేలు వారు మరొక యుద్ధం చేశారు. ఈ పట్టణంలో చాలా పొడుగైన మనిషి ఒకడున్నాడు. వాని కాళ్లకు, చేతులకు ఇరవై నాలుగు వేళ్లున్నాయి. వాని ప్రతి చేతికి, ప్రతి కాలికి ఆరేసి వేళ్లు చొప్పున వున్నాయి. అతడు కూడ ఫిలిష్తీయుల రెఫాయిము సంతానంలోనివాడే. 7 ఆ మనుష్యుడు ఇశ్రాయేలు వారిని చూచి ఎగతాళి చేసినప్పుడు, యోనాతాను వానిని చంపివేశాడు. యోనాతాను తండ్రి పేరు షిమ్యా. షిమ్యా దావీదుకు సోదరుడు.
8 ఆ ఫిలిష్తీయులంతా గాతు పట్టణానికి చెందిన రెఫాయిము సంతానమే. దావీదు, అతని సేవకులు కలిసి ఆ రాక్షసులనందరినీ చంపివేసారు.
1 చెదరిపోయి పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితూనియ ప్రాంతాలలో పరదేశీయులుగా నివసిస్తున్నవాళ్ళకు, యేసు క్రీస్తు అపొస్తలుడైన పేతురు వ్రాయునదేమనగా, ప్రియులారా! మీరు దేవునిచే ఎన్నుకోబడ్డవాళ్ళు. మీకు ఆయన అనుగ్రహము, శాంతి సమృద్ధిగా లభించాలని కోరుతున్నాను. 2 మీరు యేసు క్రీస్తుకు విధేయులై ఉండాలని, ఆయన రక్తం చేత ప్రోక్షింపబడాలని, తండ్రి అయినటువంటి దేవుడు మిమ్మల్ని తన దివ్యజ్ఞానంతో ఎన్నుకున్నాడు; పరిశుద్ధాత్మ మిమ్మల్మి పవిత్రం చేసాడు.
సజీవమైన ఆశాభావం
3 మన ప్రభువైన యేసు క్రీస్తుకు తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతించుదాం. ఆయనకు మనపై అనుగ్రహం ఉండటం వల్ల యేసు క్రీస్తును బ్రతికించి మనకు క్రొత్త జీవితాన్ని యిచ్చాడు. అంతేకాక మనలో సజీవమైన ఆశాభావాన్ని కలిగించాడు. 4 నాశనంకాని, మచ్చలేని, తరగని వారసత్వం పొందటానికి ఆశించండి. దేవుడు మీకోసం దాన్ని పరలోకంలో దాచి ఉంచాడు.
5 చివరి దశలో మనకు వ్యక్తం కావటానికి రక్షణ సిద్ధంగా ఉంది. మీలో విశ్వాసం ఉండటంవల్ల, అది లభించే వరకూ మీకు దైవశక్తి రక్షణ కలిగిస్తుంది. 6 కొంతకాలం సంభవించిన అనేక రకాల కష్టాల్ని అనుభవించవలసి వచ్చినప్పుడు మీరు అనుభవించారు. దానికి ఆనందించండి. 7 మీ విశ్వాసం యథార్థమైనదని రుజువగుటకు ఈ శ్రమలు మీకొచ్చాయి. బంగారం నిప్పుచేత కాల్చబడి శుద్ధి అయినా, చివరికది నాశనం కాక తప్పదు. మీ విశ్వాసం బంగారం కంటే విలువైనదిగా యుండి యేసు క్రీస్తు వచ్చినప్పుడు ప్రశంస, మహిమ, ఘనత పొంద తగినదిగా వుంటుంది.
8 మీరాయన్ని చూడలేదు. అయినా ప్రేమిస్తున్నారు. ప్రస్తుతం చూడటం లేదు. అయినా విశ్వసిస్తున్నారు. వ్యక్తం చేయలేని దివ్యమైన ఆనందం మీలో నిండిపోయింది. 9 ఎందుకంటే ఏ ఉద్దేశ్యంతో మీరు విశ్వసిస్తున్నారో ఆ ఉద్దేశ్యం నెరవేరుతోంది. మీ ఆత్మలకు రక్షణ లభిస్తోంది.
10 ఈ రక్షణ విషయంలో, ప్రవక్తలు మీకోసం రాబోవు కృపను గురించి మాట్లాడుతూ అతిజాగ్రత్తతో తీవ్రంగా పరిశోధించారు. 11 వాళ్ళలో ఉన్న క్రీస్తు ఆత్మ క్రీస్తు బాధల్ని గురించి, ఆ తర్వాత ఆయన పొందనున్న మహిమను గురించి వాళ్ళకు ముందుగానే తెలియజేసాడు. ఆ ఆత్మ సూచించిన కాలాన్ని, పరిస్థితుల్ని తెలుసుకోవటానికి వాళ్ళు ప్రయత్నం చేసారు.
12 తమ లాభం కోసం కాకుండా మీకు సేవ చేయాలని ఇలా చేసారు. ఈ విషయం దేవుడు వాళ్ళకు తెలియచేసాడు. పరలోకం నుండి దేవుడు పంపిన పరిశుద్ధాత్మ ద్వారా సువార్తను బోధించిన వాళ్ళు మీకు వాటిని గురించి తెలిపారు. వాటిని గురించి తెలుసుకోవాలని దేవదూతలు కూడా ఎదురు చూస్తున్నారు.
పవిత్రంగా జీవించండి
13 అందుచేత కార్యసిద్ధికోసం మీ మనసుల్ని సిద్ధం చేసికొంటూ మిమ్మల్ని అదుపులో పెట్టుకోండి. యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీ కందివ్వబోయే అనుగ్రహంపై సంపూర్ణమైన ఆశాభావంతో ఉండండి. 14 మీరు అజ్ఞానంతో జీవించినప్పుడు దురాశలకు లోనై జీవించారు. ఇప్పుడావిధంగా జీవించకుండా చిన్న పిల్లలవలే విధేయతతో జీవించండి. 15 మిమ్మల్ని పిలిచినవాడు ఏ విధంగా పవిత్రుడో అదేవిధంగా మీరు కూడా పవిత్రమైన కార్యాలను చేస్తూ పవిత్రంగా జీవించండి. 16 ఎందుకంటే ధర్మశాస్త్రంలో, “నేను పవిత్రుణ్ణి; కనుక మీరు కూడా పవిత్రంగా ఉండండి”(A) అని వ్రాయబడిఉంది.
17 పక్షపాతము చూపకుండా ఒక వ్యక్తి చేసిన కార్యాలను బట్టి తీర్పు చెప్పే దేవుణ్ణి మీరు “తండ్రి” అని పిలుస్తారు కనుక మీరు భయభక్తులతో పరదేశీయులుగా మీ జీవితాలను గడపండి. 18 ఎందుకంటే, మీ పూర్వికులు వంశపారంపర్యంగా మీ కందించిన వ్యర్థజీవితం నుండి మీకు విడుదల కలుగలేదు. నశించిపోయే వెండి, బంగారం వంటి వస్తువుల వల్లనూ కలుగలేదు. ఈ విషయం మీకు తెలుసు. 19 ఏ లోపమూ, మచ్చాలేని గొఱ్ఱెపిల్లయైన క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం ద్వారా మీకు విముక్తి కలిగింది. 20 ఈ ప్రపంచానికి పునాది వేయకముందే దేవుడు క్రీస్తును ఎన్నుకున్నాడు. కాని మీకోసం ఈ చివరి రోజుల్లో ఆయన్ను వ్యక్తం చేసాడు. 21 ఆయన కారణంగా మీరు దేవుణ్ణి విశ్వసిస్తున్నారు. ఆయన్ని బ్రతికించి మహిమ గలవానిగా చేసాడు. తద్వారా మీకు దేవుని పట్ల విశ్వాసము, ఆశ కలిగాయి.
22 సత్యాన్ని విధేయతతో ఆచరించటంవల్ల మీ జీవితాలు పవిత్రమయ్యాయి. తద్వారా మీ సోదరుల పట్ల మీకు నిజమైన ప్రేమ కలిగింది. పరస్పరం హృదయపూర్వకంగా[a] చిరకాలం ప్రేమించుకుంటూ ఉండండి. 23 నశించిపోయే సంతానంగా మీరు తిరిగి పుట్టలేదు, గాని నశించని సంతానంగా సజీవమైన దేవుని వాక్యం ద్వారా తిరిగి పుట్టారు. 24 ఎందుకంటే,
“మానవులు గడ్డిపోచల్లాంటి వాళ్ళు. వాళ్ళ కీర్తి
గడ్డి పువ్వులాంటిది. గడ్డి ఎండిపోతుంది, పువ్వురాలిపోతుంది,
25 కాని, ప్రభువు సందేశం చిరకాలం నిలిచిపోతుంది.”(B)
మీకు ప్రకటింపబడిన సందేశం యిదే!
దేవుని పిలుపుకు యోనా విధేయత
3 పిదప యోనాతో యెహోవా మళ్ళీ మాట్లాడాడు. యెహోవా ఇలా చెప్పాడు: 2 “నీవు ఆ నీనెవె మహానగరానికి వెళ్లు. నేను నీకు చెప్పే విషయాలు వారికి బోధించు.”
3 యెహోవా ఆజ్ఞను శిరాసావహించి యోనా నీనెవె నగరానికి వెళ్లాడు. నీనెవె ఒక మహా నగరం. ఎవరైనా నగరంగుండా వెళ్లాలంటే మూడు రోజులు నడవాలి.
4 యోనా నగరం మధ్యకు వెళ్లి, ప్రజలకు బోధించటం మొదలు పెట్టాడు. “నలభై రోజుల తరువాత నీనెవె నాశనమవుతుంది” అని యోనా ప్రకటించాడు.
5 నీనెవె నగరవాసులు దేవుని వర్తమానాన్ని విశ్వసించారు. ప్రజలు తమ పాపాలను గురించి ఆలోచించటానికి, కొంతకాలంపాటు ఉపవాసం చేయటానికి నిర్ణయించుకొన్నారు. తమ విచారాన్ని వ్యక్తం చేయటానికి ప్రజలు ప్రత్యేకమైన దుస్తులు ధరించారు. అతి ముఖ్యలు, అతి సామాన్యులతో సహా నగరవాసులంతా ఇది ఆచరించారు.
6 ఈ విషయాలను గురించి నీనెవె రాజు విన్నాడు. రాజుకూడా తాను చేసిన చెడుపనులకు విచారించాడు. అందుచే రాజు తన సింహాసనాన్ని వదిలివేశాడు. రాజు తన రాజదుస్తులు తీసివేసి, తన విచారాన్ని వ్యక్తం చేసే ప్రత్యేక దుస్తులు ధరించాడు. పిమ్మట రాజు బూడిదలో కూర్చున్నాడు. 7 రాజు ఒక ప్రత్యేక వర్తమానాన్ని వ్రాసి, నగరమంతా ప్రకటింపజేశాడు.
రాజునుండి, అతని కింది పాలకులనుండి వచ్చిన ఆజ్ఞ ఏమనగా:
కొద్దికాలంపాటు ఏ మనిషిగాని, జంతువుగాని ఏమీ తినగూడదు. పశువుల మందలనుగాని, గొర్రెల మందలనుగాని పొలాల్లోకి వదలకూడదు. నీనెవెలో ఉన్న ఏ జీవీ ఏమీ తినకూడదు. నీళ్ళు తాగకూడదు. 8 ప్రతి వ్యక్తీ, ప్రతి జంతువూ విచార సూచకంగా ఒక ప్రత్యేకమైన బట్టతో తప్పక కప్పబడాలి. ప్రజలు బిగ్గరగా తమ గోడును దేవునికి చెప్పుకోవాలి. ప్రతి వ్యక్తీ తన జీవన విధానం మార్చుకొని, చెడు పనులు చేయడం మానాలి. 9 బహుశః అప్పుడు దేవుడు తన మనస్సు మార్చుకొని, తాను చేయ సంకల్పించిన పనులు చేయక పోవచ్చు. బహుశః దేవుని మనస్సు మారవచ్చు. కోపంగా ఉండకపోవచ్చు. అప్పుడు మనం శిక్షింపబడకపోవచ్చు.
10 ప్రజలు చేసిన పనులన్నీ దేవుడు చూశాడు. ప్రజలు చెడుపనులు చేయటం మానినట్లు దేవుడు గమనించాడు. కనుక దేవుడు మనసు మార్చుకొని, తాను చేయ సంకల్పించినది విరమించుకున్నాడు. దేవుడు ప్రజలను శిక్షించలేదు.
యేసుతో ఒక గుంపు
8 ఆ తర్వాత యేసు పట్టణాలు, పల్లెలు పర్యటించి దేవుని రాజ్యం యొక్క సువార్త ప్రజలకు ప్రకటించాడు. పన్నెండుమంది అపొస్తలులు ఆయన వెంటే ఉన్నారు. 2 దయ్యాలు విడిపించబడిన కొందరు స్త్రీలు, రోగాలు నయం చేయబడిన కొందరు స్త్రీలు కూడా ఆయన వెంట ఉన్నారు. వీళ్ళలో మగ్దలేనే అని పిలవబడే మరియ ఒకతె. ఈమె నుండి ఏడు దయ్యాలు విడిపించబడ్డాయి. 3 హేరోదు రాజుకు కుడిభుజంగా ఉన్న కూజా భార్య యోహన్న, సూసన్న, మొదలగు చాలా మంది స్త్రీలు ఆయన వెంట ఉన్నారు. వీళ్ళు తమ స్వంత డబ్బుతో యేసుకు, ఆయన అపొస్తలులకు సహాయం చేస్తూ ఉండేవాళ్ళు.
రైతు విత్తనాలు చల్లుటను గురించిన ఉపమానం
(మత్తయి 13:1-17; మార్కు 4:1-12)
4 అనేక గ్రామాల నుండి ప్రజలు యేసు దగ్గరకు వచ్చారు. ఒక పెద్ద గుంపు సమావేశమైంది. యేసు వాళ్ళకీ ఉపమానం చెప్పడం మొదలు పెట్టాడు:
5 “ఒక రైతు విత్తనాలు చల్లడానికి పొలానికి వెళ్ళాడు. అతడు విత్తనాలు చల్లుతుండగా కొన్ని విత్తనాలు దారిపై పడ్డాయి. వాటిని ప్రజలు త్రొక్కి వేసారు. పక్షులు వచ్చి వాటిని తిని వేసాయి. 6 మరికొన్ని విత్తనాలు మట్టి కొద్దిగా ఉన్న రాతి నేలపై పడ్డాయి. అవి మొలకెత్తాయి, కాని వాటికి తేమ దొరకనందువలన అవి వాడిపొయ్యాయి. 7 మరికొన్ని విత్తనాలు ముళ్ళ మొక్కల స్థలంలో పడ్డాయి. ఈ విత్తనాలతో పాటు ముళ్ళ మొక్కలు కూడా పెరిగి వాటిని పెరగనివ్వలేదు. 8 మరి కొన్ని విత్తనాలు సారవంతమైన భూమ్మీద పడ్డాయి. అవి మొలకెత్తి, పెరిగి పెద్దవై నూరు రెట్లు ఫలాన్నిచ్చాయి.”
ఈ విధంగా చెప్పి, “వినే వాళ్ళు జాగ్రత్తగా వినాలి” అని బిగ్గరగా అన్నాడు.
9 శిష్యులు, “ఈ ఉపమానానికి అర్థమేమిటని” ఆయన్ని అడిగారు.
10 యేసు, “దేవుని రాజ్యం యొక్క రహస్య జ్ఞానం తెలుసుకొనే అవకాశం మీకివ్వబడింది. కాని యితర్లకు, ఆ రహస్యం ఉపమానాలు ఉపయోగించి చెబుతాను. ఎందుకంటే,
‘వాళ్ళు చూస్తున్నట్లే వుండి
చూడలేరు,
వాళ్ళు వింటున్నదానిని
అర్థం చేసుకోలేరు.’(A)
యేసు విత్తనము యొక్క ఉపమానమును వివరించటం
(మత్తయి 13:18-23; మార్కు 4:13-20)
11 “ఇందులోని అర్థం యిది: విత్తనం దైవ సందేశం. 12 దారిపై బడ్డ విత్తనాల సంఘటనకు అర్థం యిది: కొందరు ప్రజలు వింటారు. కాని సైతాను వచ్చి వాళ్ళ హృదయాల్లో ఉన్న దైవ సందేశాన్ని తీసుకువెళ్తాడు. వీళ్ళు విశ్వసించరాదని, రక్షింపబడరాదని వాని ఉద్దేశ్యం. 13 రాతి నేలపై బడ్డ విత్తనాల సంఘటనకు అర్థం యిది; కొందరు దైవ సందేశం విని దాన్ని ఆనందంగా స్వీకరిస్తారు. కాని వీళ్ళ విశ్వాసానికి వేర్లు ఉండవు. కనుక వాళ్ళు కొద్ది కాలం మాత్రమే విశ్వసిస్తారు. పరీక్షా సమయం రాగానే వెనుకంజ వేస్తారు.
14 “ముళ్ళు పెరిగే నేలపై బడ్డ విత్తనాల సంఘటనకు అర్థం యిది: కొందరు వింటారు కాని సుఖదుఃఖాలు, ధనము వాళ్ళను అణచి వేయటం వల్ల వాళ్ళు సంపూర్ణంగా ఫలించరు. 15 సారవంతమైన నేలపై బడ్డ విత్తనాల సంఘటనకు అర్థం యిది: కొందరు ఉత్తమమైన మంచి మనస్సుతో విని, విన్న వాటిని హృదయాల్లో దాచుకొని పట్టుదలతో మంచి ఫలాన్నిస్తారు.
నీకున్న గ్రహింపును ఉపయోగించుకొనుము
(మార్కు 4:21-25)
16 “దీపాన్ని వెలిగించి ఏ కుండ క్రిందో లేక మంచం క్రిందో ఎవ్వరూ దాచరు. ఇంట్లోకి వచ్చిన వాళ్ళకు వెలుగు కనిపించాలని ఆ దీపాన్ని ఎత్తైన దీప స్థంభంపై పెడ్తాము. 17 తెలియబడని, బయలు పర్చబడని రహస్య మేదియు ఉండదు.[a] అందువల్ల మీరు ఎట్లా వింటున్నారో జాగ్రత్తగా ఆలోచించండి. 18 కలిగియున్న వానికి ఇంకా ఎక్కువ యివ్వబడుతుంది. లేని వాని నుండి వాని దగ్గరున్నదని అనుకొంటున్నది కూడా తీసి వేయబడుతుంది” అని అన్నాడు.
యేసుని శిష్యులు ఆయన నిజమైన బంధువులు
(మత్తయి 12:46-50; మార్కు 3:31-35)
19 ఒకసారి యేసు తల్లి, ఆయన సోదరులు ఆయన్ని చూడాలని వచ్చారు. ప్రజల గుంపు ఆయన చుట్టూ ఉండటంవల్ల వాళ్ళు ఆయన దగ్గరకు వెళ్ళలేక పొయ్యారు. 20 ఒకడు యేసుతో, “మీ తల్లి, సోదరులు మిమ్మల్ని చూడాలని వచ్చి బయట నిలుచున్నారు” అని అన్నాడు.
21 యేసు, “దైవ సందేశం విని దాన్ని అనుసరించే వాళ్ళే నా తల్లి, నా సోదరులు” అని సమాధానం చెప్పాడు.
యేసుని శిష్యులు ఆయన శక్తిని చూడటం
(మత్తయి 8:23-27; మార్కు 4:35-41)
22 ఒక రోజు యేసు, ఆయన శిష్యులు పడవలో ఉండగా, “సముద్రం అవతలి ఒడ్డుకు వెళ్దాం” అని అన్నాడు. అందువల్ల వాళ్ళు ప్రయాణమయ్యారు. 23 ప్రయాణం సాగిస్తుండగా యేసు నిద్రపొయ్యాడు. అకస్మాత్తుగా పెనుగాలి ఆ సముద్రం మీదుగా వీచింది. నీళ్ళు పడవలోకి రావటం మొదలు పెట్టాయి. వాళ్ళందరూ పెద్ద ప్రమాదంలో చిక్కుకొని పొయ్యారు. 24 శిష్యులు యేసును నిద్ర లేపుతూ, “ప్రభూ! ప్రభూ! మనము మునిగి పోతున్నాం!” అని అన్నారు.
ఆయన లేచి గాలిని, నీళ్ళను ఆగమని గద్దించాడు. పెనుగాలి ఆగిపోయింది. 25 “యేసు, మీ విశ్వాసం ఏమైంది?” అని తన శిష్యుల్ని అడిగాడు.
వాళ్ళు భయంతో ఆశ్చర్యంగా, “ఆయన ఎంత గొప్పవాడు! నీళ్ళను, గాలిని కూడా ఆజ్ఞాపిస్తున్నాడే! అవి విధేయతతో ఆయన ఆజ్ఞను పాటిస్తున్నాయే!” అని పరస్పరం మాట్లాడుకున్నారు.
యేసు ఒక మనుష్యుని దయ్యాలనుండి విడిపించటం
(మత్తయి 8:28-34; మార్కు 5:1-20)
26 యేసు మరియు ఆయన శిష్యులు గెరాసేనులు అనే ప్రజలు నివసించే ప్రాంతాన్ని చేరుకున్నారు. ఆ ప్రాంతం గలిలయ సముద్రానికి అవతలి వైపున ఉంటుంది. 27 యేసు ఒడ్డు చేరగానే దయ్యం పట్టిన ఆ ఊరి వాడొకడు యేసు దగ్గరకు వచ్చాడు. చాలాకాలం నుండి అతడు బట్టలు వేసుకొనేవాడు కాదు. ఇంట్లో నివసించే వాడు కాదు. స్మశానాల్లో నివసించేవాడు.
28 ఆ దయ్యం పట్టినవాడు యేసును చూడగానే పెద్ద గొంతుతో, “యేసూ! దేవుని కుమారుడా! నాతో నీకేం పని? నన్ను హింసించవద్దని వేడుకొంటున్నాను” అని బిగ్గరగా అంటూ ఆయన కాళ్ళ మీద పడ్డాడు. 29 యేసు ఆ దయ్యాన్ని అతని నుండి బయటకు రమ్మని ఆజ్ఞాపించాడు. ఈ దయ్యం అతణ్ణి చాలాసార్లు ఆవరించింది. అతని కాళ్ళు చేతులు గొలుసులతో కట్టేసి కాపలాలోవుంచేవాళ్ళు. అయినా అతడు ఆ గొలసులను తెంపుకొనేవాడు. ఆ దయ్యం అతణ్ణి నిర్మానుష్య స్థలాలకు లాక్కొని వెళ్ళేది.
30 యేసు, “నీ పేరేమిటి?” అని అడిగాడు.
అతడు, “సేన” అని సమాధానం చెప్పాడు. ఎన్నో దయ్యాలు వానిలో ఉండటం వల్ల ఈ విధంగా సమాధానం చెప్పాడు. 31 ఆ దయ్యాలు తమను పాతాళం లోకి పడవేయ వద్దని ఎంతో ప్రాధేయ పడ్డాయి. 32 అక్కడ కొండ మీద ఒక పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది. ఆ దయ్యాలు, తాము ఆ పందుల్లోకి వెళ్ళేటట్లు అనుమతి యివ్వుమని యేసును వేడుకున్నాయి. ఆయన అనుమతినిచ్చాడు. 33 ఆ దయ్యాలు ఆ మనిషి నుండి బయటకు వచ్చి పందుల్లోకి జొరబడ్డాయి. ఆ తర్వాత అవి ఆ కొండనుండి క్రిందికి పరుగెత్తి సముద్రంలో పడి మునిగి పొయ్యాయి.
34 పందులు కాస్తున్న వాళ్ళు జరిగింది చూసి పరుగెత్తి వెళ్ళి గ్రామంలో ఉన్న వాళ్ళకు, పొలాల్లో ఉన్న వాళ్ళకు చెప్పారు. 35 ప్రజలు ఏమి జరిగిందో చూడాలని అక్కడికి వెళ్ళారు. అంతా యేసు దగ్గరకు వచ్చారు. అక్కడ దయ్యాలు వదిలింపబడ్డవాడు యేసు కాళ్ళ దగ్గరవుండటం వాళ్ళు చూశారు. అతని ఒంటిపై దుస్తులువున్నాయి. అతని ప్రవర్తన సహజంగా ఉంది. ఇది గమనించి వాళ్ళకు భయం వేసింది. 36 జరిగింది చూసిన వాళ్ళు ఆ దయ్యం పట్టినవానికి ఏ విధంగా నయమైపోయిందో వచ్చిన వాళ్ళకు చెప్పారు. 37 గెరాసేను ప్రజలందరికి చాలా భయం వేయటంవల్ల తమ ప్రాంతం వదిలి వెళ్ళమని వాళ్ళు యేసుతో అన్నారు.
అందువల్ల ఆయన పడవనెక్కి వెళ్ళిపోయాడు. 38 దయ్యాలు వదిలింపబడ్డ వాడు వెంటవస్తానని యేసును బ్రతిమిలాడాడు. 39 యేసు అతనితో, “నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు చేసిన మేలు అందరికి చెప్పు” అని అతణ్ణి పంపివేసాడు.
అందువల్ల అతడు వెళ్ళి యేసు తనకు చేసిన మేలు తన గ్రామంలో ఉన్న వాళ్ళందరికి చెప్పాడు.
యేసు బాలికను బ్రతికించటం, ఒక స్త్రీని నయం చేయటం
(మత్తయి 9:18-26; మార్కు 5:21-43)
40 ప్రజలందరూ యేసు కోసం వేచి ఉన్నారు. ఆయన రాగానే వాళ్ళు ఆయనకు స్వాగతమిచ్చారు. 41 అదే సమయానికి సమాజ మందిరానికి అధికారిగా ఉన్న యాయీరు అన్న వ్యక్తి ఒకడు వచ్చి యేసు కాళ్ళ మీద పడ్డాడు. 42 తన పన్నెండేండ్ల కుమార్తె కూతురు చనిపోతుందని, తనకు ఒకే కూతురని, తన యింటికి వచ్చి ఆమెకు నయం చేయమని వేడుకున్నాడు.
యేసు అతని ఇంటికి వెళ్తుండగా, ప్రజలు త్రోసుకొంటూ ఆయన చుట్టూ ఉన్నారు. 43 ఆ గుంపులో పన్నెండేండ్లనుండి రక్తస్రావంతో బాధపడ్తున్న ఒక స్త్రీ ఉంది. ఆమె తన దగ్గరున్న ధనమంతా ఖర్చు పెట్టినా ఏ వైద్యుడూ ఆమె రోగాన్ని నయం చేయలేక పోయాడు 44 ఆమె యేసు వెనుకనుండి వచ్చి ఆయన అంగీ యొక్క కొనను తాకింది. వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది. 45 ఆయన, “నన్నెవరు తాకారు?” అని అడిగాడు.
అంతా తాము కాదన్నారు. అప్పుడు పేతురు, “ప్రభూ! ప్రజలు త్రోసుకొంటూ మీ మీద పడ్తున్నారు కదా! ఎవరని చెప్పగలము?” అని అన్నాడు.
46 యేసు, “కాని ఎవరోనన్ను తాకారు. నా నుండి శక్తి వెళ్ళటం గమనించాను” అని అన్నాడు. 47 అప్పుడా స్త్రీ తనను గమనించకుండా ఉండరని గ్రహించి, వణకుతూ వచ్చి యేసు కాళ్ళపై పడింది. తాను ఆయన్ని ఎందుకు తాకిందో, తనకు ఎలా వెంటనే నయమైందో అందరి సమక్షంలో చెప్పింది. 48 అప్పుడు యేసు ఆమెతో, “అమ్మా! నీ విశ్వాసం నీకు నయం చేసింది. శాంతంగా వెళ్ళు” అని అన్నాడు.
49 యేసు యింకా మాట్లాడుతుండగా ఆ సమాజ మందిరపు అధికారి ఇంటినుండి ఒకడు వచ్చి అతనితో, “మీ కూతురు చనిపోయింది. ప్రభువును కష్టపెట్టనవసరం లేదు” అని అన్నాడు.
50 ఇది విని యేసు యాయీరుతో, “భయపడకు, విశ్వాసం ఉంచుకో, ఆమెకు నయమైపోతుంది” అని అన్నాడు.
51 యేసు యాయీరు యింటికి వచ్చాడు. పేతురు, యోహాను, యాకోబు ఆ అమ్మాయి తల్లి తండ్రుల్ని తప్ప మరెవ్వరిని తన వెంట రానివ్వలేదు. 52 వాళ్ళంతా ఆమె కోసం శోకిస్తూ ఉన్నారు. యేసు, “మీ శోకాలు ఆపండి. ఆమె చనిపోలేదు, నిద్రపోతూ ఉంది అంతే” అని అన్నాడు.
53 ఆమె చనిపోయిందని వాళ్ళకు తెలుసు కనుక వాళ్ళు ఆయన్ని హేళన చేసారు. 54 యేసు ఆమె చేతులు పట్టుకొని, “లే అమ్మాయి!” అని అన్నాడు. 55 ఆమె ఆత్మ తిరిగి ఆమెలో చేరింది. ఆమె వెంటనే లేచి కూర్చొంది. యేసు వాళ్ళతో, “ఆమెకు ఏదైనా తినటానికి యివ్వండి” అని అన్నాడు. 56 ఆమె తల్లి తండ్రులు దిగ్భ్రాంతి చెందారు. కాని యేసు జరిగిన దాన్ని గురించి ఎవ్వరికి చెప్పవద్దని ఆజ్ఞాపించాడు.
© 1997 Bible League International