M’Cheyne Bible Reading Plan
మీకా విగ్రహాలు
17 పర్వత దేశమైన ఎఫ్రాయిములో మీకా అనే ఒక వ్యక్తి వుండేవాడు. 2 మీకా తన తల్లితో, “నీ వద్దనున్న ఇరవై ఎనిమిది పౌండ్ల వెండి దొంగిలించిన వ్యక్తి ఎవరో నీకు తెలియునా! ఆ విషయమై ఒక శాపం ఉన్నట్లు నీవు చెప్పగా విన్నాను. సరే, వెండి నా వద్ద ఉన్నది. అది నేను తీసుకున్నాను” అన్నాడు.
“కుమారుడా, నిన్ను యెహోవా ఆశీర్వదించు గాక” అన్నది.
3 మీకా తన తల్లికి ఇరవై ఎనిమిది పౌండ్ల వెండిని తిరిగి ఇచ్చివేశాడు. అప్పుడామె అంది, “నేనీ వెండిని యెహోవాకు విశేష కానుకగా సమర్పిస్తాను. నేను దీనిని నా కుమారునికి ఇస్తాను. అతను ఒక విగ్రహం తయారు చేసి దానిని వెండితో కప్పాలి. అందువల్ల, నా కుమారుడా, ఈ వెండిని తిరిగి నీకే ఇస్తాను.”
4 కాని మీకా ఆ వెండిని తిరిగి తల్లికే ఇచ్చివేశాడు. ఆమె దాదాపు అయిదు పౌండ్ల వెండిని మాత్రమే తీసుకుని, ఆ వెండిని కంసాలి వానికి ఇచ్చింది. వెండి పనిముట్లు తయారు చేసే వ్యక్తి ఒక విగ్రహం తయారు చేసి దానిని వెండితో కప్పాడు. ఆ విగ్రహం మీకా ఇంట్లో ఉంచబడింది. 5 మీకాకు విగ్రహాలు ఆరాధించే ఒక ఆలయం వుండేది. అతను ఒక ఏఫోదు, కొన్ని విగ్రహాలు తయారు చేశాడు. తర్వాత తన కుమారులలో ఒకనిని యాజకునిగా ఎంపిక చేశాడు. 6 (ఆ రోజులలో ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. అందువల్ల ప్రతి వ్యక్తీ తనకేది సరి అని అనిపిస్తే, దానినే చేస్తుండేవాడు).
7 లేవీ వంశానికి చెందిన ఒక యువకుడు ఉన్నాడు. అతను యూదాలోని బేత్లేహేముకు చెందిన వాడు. యూదా వంశస్తులతో అతను నివసిస్తూండేవాడు. 8 మరొక నివాసం కోసం అతను అన్వేషిస్తూ, ప్రయాణం చేస్తూవుండగా, అతను మీకా ఇంటికి వచ్చాడు. ఎఫ్రాయిము పర్వత దేశంలో మీకా ఇల్లు ఉంది. 9 “నీవు ఎక్కడినుంచి వచ్చావు?” అని మీకా అతనిని అడిగాడు.
ఆ యువకుడు ఇలా సమాధానం ఇచ్చాడు: “నేను లేవీ వంశానికి చెందినవాణ్ణి. యూదాలోని బేత్లెహేమునుంచి వస్తున్నాను. నివసించేందుకు గాను నేనొక చోటు చూస్తున్నాను.”
10 అప్పుడు మీకా అతనితో అన్నాడు: “నీవు నాతో పాటు వుండు. నీవు నాకు తండ్రిగా, నా యాజకునిగా ఉండు. ప్రతి సంవత్సరం నీకు 4 ఔన్సుల వెండి ఇస్తాను. నీకు అన్నవస్త్రాలు కూడా ఇస్తాను.”
మీకా చెప్పినట్లుగా లేవీ వంశపు వాడు చేసాడు. 11 మీకాతో పాటు ఉండేందుకు యువకుడైన లేవీ వంశపువాడు సమ్మతించాడు. ఆ యువకుడు మీకా యొక్క సొంత కొడుకులలో ఒకనిలాగ అయ్యాడు. 12 మీకా అతనిని తన యాజకునిగా ఎంపికచేశాడు. అందువల్ల ఆ యువకుడు యాజకుడయ్యాడు. మీకా ఇంట్లో నివసించ సాగాడు. 13 మీకా ఇలా అన్నాడు, “లేవీ వంశపువాడొకడు నా యాజకునిగా వున్నాడు కనుక యెహోవా ఇప్పుడు నాకు ఆశీర్వాదంగా ఉండునని నేను భావిస్తున్నాను.”
యెరూషలేముకు ప్రయాణం
21 మేము సెలవు పుచ్చుకొని నేరుగా “కోసు” కు ఓడలో ప్రయాణం చేసాము. మరుసటి రోజు “రొదు” చేరుకున్నాము. అక్కడినుండి బయలుదేరి “పతర” చేరుకున్నాము. 2 ఒక ఓడ ఫొనీషియ వెళ్ళటం గమనించి అందులో ప్రయాణం చేసాము.
3 సైప్రసు ద్వీపం కనపడ్డాక ఆ ద్వీపానికి దక్షిణంగా వెళ్ళి సిరియ దేశం చేరుకున్నాం. మా ఓడ సరుకు దింపవలసి ఉంది కనుక తూరు ద్వీపంలో ఆగాము. 4 అక్కడ భక్తులుండటం గమనించి వాళ్ళతో ఏడు రోజులున్నాము. వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యెరూషలేము వెళ్ళవద్దని పౌలుతో చెప్పారు. కాని వెళ్ళవలసిన సమయం రాగానే ప్రయాణమై మా దారిన మేము వెళ్ళాము. 5 విశ్వాసులు, తమ భార్యాబిడ్డలతో కలిసి మా వెంట ఊరి అవతలి వరకు వచ్చారు. సముద్ర తీరం చేరుకున్నాక, అందరమూ మోకరిల్లి ప్రార్థించాము. 6 పరస్పరం వీడ్కోలు చెప్పుకున్నాక మేము ఓడనెక్కాము. వాళ్ళు తమ తమ యిండ్లకు తిరిగి వెళ్ళిపోయారు.
7 మేము తూరునుండి మా ప్రయాణం సాగించి తొలేమాయి తీరం చేరుకున్నాము. అక్కడున్న సోదరుల్ని కలుసుకొని వాళ్ళతో ఒక రోజు గడిపాము. 8 మరుసటి రోజు ప్రయాణమై కైసరియ చేరుకున్నాము. అక్కడ సువార్త ప్రచారం చేస్తున్న ఫిలిప్పు అనే వ్యక్తి యింట్లో బసచేసాము. అతడు యెరూషలేములో ఎన్నుకోబడ్డ ఏడుగురిలో ఒకడు. 9 అతనికి నలుగురు పెళ్ళికాని కూతుర్లు ఉన్నారు. వాళ్ళు దైవేచ్ఛను చెప్పటంలో ప్రతిభావంతులు.
10 అక్కడ మేము చాలా రోజులున్నాక, అగబు అనే ప్రవక్త యూదయనుండి వచ్చాడు. 11 అతడు మా దగ్గరకు వచ్చి, పౌలు నడికట్టు తీసుకొని దాంతో తన కాళ్ళు చేతులు కట్టివేసుకొని ఈ విధంగా అన్నాడు: “‘ఈ నడికట్టు ఎవరిదో, అతణ్ణి యెరూషలేములో యూదులు ఈ విధంగా కట్టేసి యూదులు కానివాళ్ళకు అప్పగిస్తారు’ అని పరిశుద్ధాత్మ చెపుతున్నాడు.”
12 ఇది విని అక్కడి ప్రజలు, మేము కలిసి పౌలును యెరూషలేము వెళ్ళవద్దని బ్రతిమలాడాము. 13 పౌలు, “మీరు దుఃఖించి నా గుండెలెందుకు పగులగొడ్తున్నారు? యేసు ప్రభువు పేరిట బంధింపబడటానికే కాదు, మరణించటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను!” అని సమాధానం చెప్పాడు.
14 మేము అతని మనస్సు మార్చలేమని తెలుసుకొన్నాక, “ప్రభువు ఇచ్ఛ ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరుగుతుంది,” అనుకొని మేమేమీ మాట్లాడలేదు.
15 ఆ తర్వాత అంతా సిద్ధమై యెరూషలేము వెళ్ళాము. 16 కైసరియనుండి కొందరు శిష్యులు మా వెంట వచ్చి మమ్మల్ని “మ్నాసోను” అనే అతని యింటికి పిలుచుకు వెళ్ళారు. అక్కడ మా బస. మ్నాసోను సైప్రసు ద్వీపానికి చెందినవాడు. మొదట్లో విశ్వాసులైన వాళ్ళలో ఇతడు ఒకడు.
పెద్దల్ని కలుసుకోవటం
17 మేము యెరూషలేముకు వచ్చాము. అక్కడి సోదరులు మాకు మనసారా స్వాగతమిచ్చారు. 18 మరుసటి రోజు మేము పౌలుతో కలిసి యాకోబును చూడాలని వెళ్ళాము. అక్కడ సంఘ పెద్దలందరూ ఉన్నారు. 19 పౌలు వాళ్ళను కుశల ప్రశ్నలు అడిగి తాను చేసిన కార్యాల వల్ల దేవుడు యూదులు కానివాళ్ళతో చేసిన వాటినన్నిటిని ఒక్కొక్కటి విడమరిచి చెప్పాడు.
20 వాళ్ళా మాటలు విని దేవుణ్ణి స్తుతించారు. ఆ తర్వాత పౌలుతో, “సోదరుడా! వేలకొలది యూదులు విశ్వాసులవటం నీవు చూస్తున్నావు. మోషే ధర్మశాస్త్రాన్ని పాటించటం ముఖ్యమని వాళ్ళ అభిప్రాయం. 21 కాని నీవు మోషే ధర్మశాస్త్రాన్ని వదలమని, కుమారులకు సున్నతి చేయించటం తప్పని, యూదుల ఆచారాలను పాటించవద్దని యూదులు కానివాళ్ళ మధ్య నివసిస్తున్న యూదులకు బోధించినట్లు వీళ్ళకు ఎవరో చెప్పారు.
22 “ఏం చెయ్యాలి? నీవు వచ్చిన విషయం వాళ్ళకు తప్పక తెలుస్తుంది. 23 అందువల్ల మేము చెప్పినట్లు చెయ్యి. మా దగ్గర మ్రొక్కుబడి ఉన్నవాళ్ళు నలుగురున్నారు. 24 వీళ్ళను నీ వెంట పిలుచుకెళ్ళు. వాళ్ళతో కలిసి శుద్ధీకరణ చేయి. వాళ్ళు తల వెంట్రుకలు తీయించుకోవటానికి అయ్యే డబ్బు చెల్లించు. అలా చేస్తే నీ గురించి విన్నవి నిజం కాదని అందరికీ రుజువౌతుంది. మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ జీవిస్తున్నావని వాళ్ళకు తెలుస్తుంది.
25 “ఇక యూదులుకాని భక్తుల విషయంలో మేమిదివరకే మా అభిప్రాయం తెలియచేసాము. వాళ్ళు ఈ నియమాన్ని మాత్రం పాటిస్తే చాలని ఇదివరకే వాళ్ళకు వ్రాసి పంపాము:
‘విగ్రహాలకు పెట్టిన నైవేద్యం ముట్టరాదు.
రక్తాన్ని, గొంతు నులిపి చంపిన జంతువుల మాంసాన్ని తినరాదు.
లైంగిక పాపము చేయరాదు’” అని అన్నారు.
పౌలు బంధింపబడటం
26 మరుసటి రోజు పౌలు వాళ్ళను పిలుచుకెళ్ళి వాళ్ళతో సహా శుద్ధి చేసుకొన్నాడు. ఆ తదుపరి యెరూషలేము మందిరానికి వెళ్ళి పూర్తిగా శుద్ధి కావటానికి ఎన్ని రోజులు వేచివుండాలో ప్రకటించాడు. చివరి రోజున తనతో వచ్చిన ప్రతి ఒక్కరి పక్షాన బలి ఇవ్వవచ్చని చెప్పాడు.
27-28 ఏడు రోజులు పూర్తిగా గడవక ముందే ఆసియ ప్రాంతంనుండి వచ్చిన కొందరు యూదులు పౌలును మందిరంలో చూసారు. వాళ్ళు ప్రజల్ని పురికొలిపి పౌలును బంధించారు. ప్రజలతో, “ఇశ్రాయేలు ప్రజలారా! మాతో సహకరించండి. ఇతడు అన్ని ప్రాంతాలు తిరిగి ఇశ్రాయేలు ప్రజల్ని గురించి, మోషే ధర్మశాస్త్రాన్ని గురించి యెరూషలేములోని మందిరాన్ని గురించి విరుద్ధంగా అందరికీ బోధించాడు. ఇప్పుడు గ్రీకుల్ని కొందర్ని మందిరంలోకి పిలుచుకొని వెళ్ళి, ఈ పవిత్ర స్థానాన్ని అపవిత్రం చేసాడు” అని బిగ్గరగా అన్నారు. 29 ప్రజలు ఎఫెసుకు చెందిన త్రోఫిమును పౌలుతో కలిసి పట్టణంలో తిరగటం చూసారు. కనుక పౌలు అతణ్ణి మందిరంలోకి పిలుచుకెళ్ళాడనుకున్నారు.
30 పట్టణమంతా అల్లర్లు వ్యాపించాయి. ప్రజలు అన్ని వైపులనుండి పరుగెత్తికొంటూ వచ్చారు. పౌలును పట్టుకొని మందిరం అవతలికి లాగి వెంటనే మందిరం యొక్క తలుపులు మూసి వేసారు. 31 వాళ్ళు, అతణ్ణి చంపే ప్రయత్నంలో ఉన్నారు. యెరూషలేమంతా అల్లర్లతో నిండిపోయిందనే వార్త సైన్యాధిపతికి పంపబడింది. 32 ఆ సైన్యాధిపతి వెంటనే కొందరు సైనికుల్ని, సైన్యాధిపతుల్ని తన వెంట బెట్టుకొని ప్రజలు గుమి కూడిన చోటికి వెళ్ళాడు. వాళ్ళు సైన్యాధిపతిని, సైనికుల్ని చూసి, పౌలును కొట్టడం మానివేసారు.
33 సైన్యాధిపతి అతని దగ్గరకు వెళ్ళి, అతణ్ణి పట్టుకొని యినుప గొలుసులతో కట్టి వేయమని ఆజ్ఞాపిస్తూ సైనికులకు అప్పగించాడు. “అతడెవరు? ఏం చేసాడు?” అని తదుపరి ప్రజల్ని విచారించాడు. 34 ప్రజలు బిగ్గరగా కేకలు వేస్తూ, ఒకరొకటి, మరొకరు మరొకటి చెప్పారు. అల్లరిగా ఉండటం వల్ల సైన్యాధిపతికి జరిగిందేమిటో తెలియలేదు. పౌలును కోటలోకి తీసుకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. 35 పౌలు మెట్లు ఎక్కుతుండగా ప్రజలు అల్లరి చేసారు. అందువల్ల సైనికులు పౌలును మోసికొని కోటలోకి తీసుకు వెళ్ళారు. 36 ప్రజలు అతణ్ణి వెంటాడుతూ, “అతణ్ణి చంపాలి!” అని బిగ్గరగా నినాదం చేసారు.
37 సైనికులు పౌలును కోటలోకి తీసుకు వెళ్ళే ముందు, అతడు సైన్యాధిపతితో, “నేను మీతో కొద్దిగా మాట్లాడవచ్చా?” అని అడిగాడు.
సైన్యాధిపతి, “నీవు గ్రీకు భాష మాట్లాడుతున్నావే! 38 క్రితంలో ప్రభుత్వాన్ని ధిక్కరించి నాలుగు వేల మంది హంతకుల్ని ఎడారుల్లోకి పిలుచుకు వెళ్ళిన ఈజిప్టు దేశపువాడవు నీవే కదూ?” అని అడిగాడు.
39 పౌలు, “నేను యూదుణ్ణి, కిలికియ దేశంలోని తార్సు అనే ముఖ్య పట్టణానికి చెందిన పౌరుణ్ణి. నన్ను ప్రజలతో మాట్లాడనివ్వండి!” అని అడిగాడు.
40 సైన్యాధిపతి సరేనన్నాడు. పౌలు మెట్ల మీద నిలబడి చేతులెత్తి శాంతించమని ప్రజల్ని కోరాడు. అందరూ శాంతించాక “హెబ్రీ” భాషలో ఈ విధంగా మాట్లాడాడు:
ఆశాజనకమైన వాగ్ధానాలు
30 ఈ వర్తమానం యిర్మీయాకు యెహోవా నుండి వచ్చింది. 2 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇలా చెప్పాడు: “యిర్మీయా, నేను నీతో మాట్లాడిన విషయాలన్నీ ఒక పుస్తక రూపంలో వ్రాయుము. నీవే ఈ పుస్తకాన్ని (పత్రము) వ్రాయాలి. 3 ఎందువల్లనంటే, బందీలుగావున్న ఇశ్రాయేలు, యూదా ప్రజలను నేను తిరిగి తీసుకొనివచ్చే రోజులు వస్తాయి.” ఇది యెహోవా సందేశం: “వారి పూర్వీకులకు నేనిచ్చిన దేశంలో వారిని నేను మరల స్థిరపడేలా చేస్తాను. మళ్లీ నా ప్రజలు ఆ రాజ్యన్ని స్వంతం చేసుకుంటారు!” ఇదే యెహోవా వాక్కు.
4 యెహోవా సందేశాన్ని ఇశ్రాయేలు, యూదా ప్రజలను గూర్చి చెప్పాడు. 5 యెహోవా చెప్పినది ఇలా ఉంది:
“భయంతో ప్రజలు చేసే ఆక్రందన మనం వింటున్నాం!
ప్రజలు భీతావహులయ్యారు! వారికి శాంతి లేదు!
6 “ఈ ప్రశ్న అడిగి, దాన్ని గురించి ఆలోచించుము:
ఎవడైనా ఒక పురుషుడు బిడ్డను కనగలడా? అసంభవం!
అయితే ప్రతి బలవంతుడు పురిటి నొప్పులతో బాధపడే స్త్రీ వలే
తన కడుపు పట్టుకొనటం నేనెందుకు చూస్తున్నాను?
ఎందువల్ల ప్రతివాని ముఖం శవంలా తెల్లనై వెలవెలబోతుంది?
ఎందుకంటే పురుషులు మిక్కిలి భయపడి ఉన్నారు!
7 “యూకోబుకు ఇది గొప్ప సంకట సమయం.
ఇది బహు కష్ట కాలం.
ఇటువంటి కాలం మరి ఉండబోదు.
అయినా యాకోబు సంరక్షింపబడతాడు.
8 “అప్పుడు నేను ఇశ్రాయేలు, యూదా ప్రజల మెడపై కాడిని విరిచి వేస్తాను.” ఇది సర్వశక్తిమంతుడైన యెహోవా నుండి వచ్చిన వర్తమానం: మిమ్మల్ని బంధించిన తాళ్లను తెంచివేస్తాను. విదేశీయులెవ్వరూ మరెన్నడు నా ప్రజలను బానిసలుగా చేసుకోవాలని బలవంతం చేయరు. 9 ఇశ్రాయేలు, యూదా ప్రజలు విదేశాలలో దాస్యం చేయరు. ఎన్నడూ చేయరు! వారి దేవుడైన యెహోవానే వారు సేవిస్తారు. వారి రాజైన దావీదుకు[a] వారు సేవచేస్తారు. ఆ రాజును నేను వారివద్దకు పంపుతాను.
10 “కావున నా సేవకుడవైన యాకోబూ, నీవు భయపడవద్దు!”
ఇదే యెహోవా వాక్కు:
“ఇశ్రాయేలూ, భయపడవద్దు!
ఆ సుదూర దేశంనుండి నిన్ను నేను రక్షిస్తాను.
ఆ దూర దేశంలో మీరు బందీలైవున్నారు.
మీ సంతతివారిని ఆ దేశంనుండి తిరిగి తీసుకొస్తాను.
యాకోబుకు తిరిగి శాంతి సమకూరుతుంది.
ప్రజలు యాకోబును బాధ పెట్టరు.
నా ప్రజలను భయపెట్టుటకు ఇక శత్రువులుండరు.
11 ఇశ్రాయేలు, యూదా ప్రజలారా, నేను మీతో వున్నాను.!”
ఇదే యెహోవా వాక్కు.
“నేను మిమ్మల్ని రక్షిస్తాను.
నేనే మిమ్మల్ని ఆయా దేశాలకు చెదరగొట్టాను.
కాని ఆ రాజ్యాలను నేను పూర్తిగా నాశనం చేస్తాను.
ఇది నిజం. నేనా దేశాలను నాశనం చేస్తాను.
కాని నేను మిమ్మల్ని మాత్రం నాశనం చేయను.
అయితే మీరు చేసిన దుష్కార్యాలకు మీరు తప్పక శిక్షింపబడాలి.
నేను మిమ్మల్ని బాగా క్రమశిక్షణలోకి తెస్తాను.”
12 యెహోవా ఇలా అంటున్నాడు:
“ఓ ఇశ్రాయేలు, యూదా ప్రజలారా, మీకు బాగుకాని గాయం ఉంది.
మీకు తగిలిన దెబ్బ నయం కానిది.
13 మీ పుండ్లను గురించి శ్రద్ధ తీసికొనే వ్యక్తి లేడు.
అందుచేత మీరు స్వస్థపర్చబడరు.
14 మీరనేక దేశాలతో స్నేహం కుదుర్చుకున్నారు.
అయినా ఆ రాజ్యాలు మిమ్మల్ని గురించి పట్టించుకోవు.
మీ స్నేహితులనబడేవారు మిమ్మల్ని మర్చిపోయారు.
ఒక శత్రువువలె మిమ్మల్ని గాయపర్చాను!
మిమ్మల్ని చాలా కఠినంగా శిక్షించాను!
మీరు చేసిన ఘోరమైన నేరం కారణంగా నేనలా చేశాను.
మీరు చేసిన అనేక పాపాల కారణంగా నేనలాచేశాను.
15 ఇశ్రాయేలూ, యూదా! మీ గాయం గురించి ఎందుకు రోదిస్తున్నారు.
మీ గాయం బాధకరమైనది.
పైగా దానికి చికిత్స లేదు.
ఘోరమైన మీ అపరాధం కారణంగా, యెహోవానైన నేను మీకవన్నీ కలుగజేశాను.
మీరు చేసిన అనేక పాపాల కారణంగా నేను మీకు ఈ కష్టాలు కలుగజేశాను.
16 ఆ రాజ్యాలవారు మిమ్మల్ని నాశనం చేశారు.
కాని ఇప్పుడా రాజ్యాలే నాశనం చేయబడతాయి.
ఇశ్రాయేలూ, యూదా! మీ శత్రువులే బందీలవుతారు!
ఆ ప్రజలు మీ ఆస్తిపాస్తులు పొందియున్నారు.
కాని ఇతర ప్రజలు వారి ఆస్తిపాస్తులు దోచుకుంటారు.
ఆ ప్రజలు యుద్ధంలో మీ వస్తువులను తీసుకున్నారు.
అలాగే యితరులు యుద్ధంలో వారి వస్తువులు తీసుకుంటారు.
17 అయినా నేను మీకు మరల ఆరోగ్యం చేకూర్చుతాను.
మీ గాయాలన్నీ మాన్పుతాను.” ఇదే యెహోవా వాక్కు,
“ఎందువల్లననగా అన్యులు మిమ్మల్ని వెలివేసి భ్రష్టులన్నారు.
‘సీయోనును ఎవ్వరూ లెక్కచేయరు’ అని వారన్నారు!”
18 యెహోవా ఇలా చెప్పుచున్నాడు:
“యూకోబు సంతానం ఇప్పుడు బందీలైయున్నారు.
కాని వారు తిరిగివస్తారు.
యాకోబు నివాసులపై నేను కనికరం కలిగివుంటాను.
నగరమంతా[b] కూలిపోయిన భవనాలతో
కప్పబడిన కొండలా ఉంది.
కాని నగరం మళ్లీ నిర్మింపబడుతుంది.
రాజభవనం కూడా దాని యథాస్థానంలో తిరిగి నిర్మింపబడుతుంది.
19 ఆ ప్రదేశాలలో ప్రజలు స్తుతిగీతాలు ఆలపిస్తారు.
ఉల్లాసమైన నవ్వుల కిలకిలలు వినిపిస్తాయి.
వారి సంతానం అభివృద్ధి అయ్యేలా చేస్తాను.
ఇశ్రాయేలు, యూదా అల్ప రాజ్యాలుగా ఉండవు.
వాటికి కీర్తి ప్రతిష్ఠలు కలుగజేస్తాను.
ఎవ్వరూ వారిని చిన్నచూపు చూడరు.
20 యాకోబు వంశం తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది.
ఇశ్రాయేలు. యూదా ప్రజలను నేను శక్తివంతులుగా చేస్తాను.
అంతేగాదు; వారిని హింసించేవారిని నేను శిక్షిస్తాను.
21 వారి స్వజనులలో ఒకడు వారికి నాయకత్వం వహిస్తాడు.
ఆ పాలకుడు నా ప్రజలలోనుండే వస్తాడు.
నేను పిలిస్తేనే ప్రజలు నావద్దకు రాగలరు.
అందుచేత ఆ నాయకుని వావద్దకు పిలుస్తాను.
అతడు నాకు సన్నిహితుడవుతాడు.
22 మీరు నా ప్రజలై ఉంటారు.
నేను మీ దేవుడనై ఉంటాను.”
23 యెహోవా మిక్కిలి కోపంగా ఉన్నాడు!
ఆయన ప్రజలను శిక్షించినాడు.
ఆ శిక్ష తుఫానులా వచ్చిపడింది.
ఆ శిక్ష దుష్టులపైకి పెనుతుఫానులా వచ్చి పడింది.
24 తన పథకం ప్రకారం అన్నీ జరిగేవరకు
యెహోవా కోపోద్రిక్తుడై ఉంటాడు.
ఆ రోజు సంభవించినప్పుడు (అంత్య దినాల్లో)
మీరు అర్థం చేసుకుంటారు.
క్రొత్త ఇశ్రాయేలు
31 “ఆ సమయంలో ఇశ్రాయేలు వంశస్థులందరికి నేను దేవుడనై యుందును. వారు నా ప్రజలైయుందురు” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
2 యెహోవా ఇలా చెపుతున్నాడు:
“శత్రువు యొక్క కత్తికి గురికాకుండా కొంతమంది మిగిలిపోతారు. వారికి ఎడారిలో ఆదరణ లభిస్తుంది.
ఇశ్రాయేలు విశ్రాంతికొరకు అన్వేషిస్తూ అక్కడికి వెళ్తుంది.”
3 యెహోవా తన ప్రజలకు
దూరము నుండి దర్శనమిస్తాడు.
ఆయన ఇలా అన్నాడు: “ప్రజలారా మిమ్మల్ని నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను.
అందుకే నా కృప శాశ్వతంగా మీ పట్ల చూపిస్తూవచ్చాను.
నేను మీ పట్ల సదా సత్యంగా ఉంటాను.
4 ఓ నా ఇశ్రాయేలు కన్యకా, నిన్ను నేను పునర్నిర్మిస్తాను.
నీవు మరల ఒక దేశంలా అవుతావు.
నీవు మరలా తంబుర మీటుతావు.
వేడుక చేసికొనే ప్రజలందరితో కలిసి నీవు నాట్యం చేస్తావు.
5 ఇశ్రాయేలు రైతులారా, మీరు మళ్లీ పంటలు పండిస్తూ, ద్రాక్షాతోటలు పెంచుతారు.
సమరయనగర పరిసరాల్లో వున్న కొండలనిండా
మీరు ద్రాక్ష తోటలు పెంచుతారు.
ఆ ద్రాక్షా తోటల ఫల సాయాన్ని
రైతులంతా అనుభవిస్తారు.
6 కావలి వారు ఈ వర్తమానాన్ని
చాటే సమయం వస్తుంది:
‘రండి మనమంతా సీయోనుకు వెళ్లి
మన దేవుడైన యెహోవాను ఆరాధించుదాము!’
కొండల ప్రాంతమైన ఎఫ్రాయిములో కూడ కావలివారు ఆ వర్తమానాన్ని చాటి చెప్పుతారు!”
7 యెహోవా ఇలా చెప్పుచున్నాడు:
“సంతోషంగా ఉండండి. యాకోబు కొరకు పాటలు పాడండి!
రాజ్యాలలో కెల్ల మేటియైన ఇశ్రాయేలు విషయంలో ఎలుగెత్తి చాటండి.
మీ స్తుతి గీతాలు పాడండి! ఇలా చాటి చెప్పండి:
‘యెహోవా తన ప్రజలను కాపాడినాడు![c]
ఇశ్రాయేలు దేశంలో జీవంతో మిగిలిన వారిని యెహోవా రక్షించినాడు!’
8 ఉత్తరాన గల దేశం నుండి
ఇశ్రాయేలీయులను తీసికొని వస్తానని తెలిసికొనండి.
భూమి మీద వివిధ దూర దేశాలలో చెదరియున్న
ఇశ్రాయేలును నేను తిరిగి కూడదీస్తాను.
వారిలో చాలా మంది గుడ్డి వారు, కుంటివారు అయ్యారు.
కొందరు స్త్రీలు నిండు గర్భిణీలై కనటానికి సిద్ధంగా ఉన్నారు.
ఎంతో మంది ప్రజలు తిరిగి వస్తారు.
9 వారు తిరిగి వచ్చే సమయంలో ఎంతగానో దుఃఖిస్తారు.
కాని నేను వారికి మార్గదర్శినై, వారిని ఓదార్చుతాను.
నేను వారిని ప్రవహించే సెలయేళ్ల ప్రక్కగా నడిపించుతాను.
వారు తూలిపోకుండా
తిన్ననైన బాటపై వారిని నడిపిస్తాను.
నేనా విధంగా వారికి దారి చుపుతాను.
కారణమేమంటే నేను ఇశ్రాయేలుకు తండ్రిని
మరియు ఎఫ్రాయిము నా ప్రథమ పుత్రుడు.
10 “ఓ రాజ్యములారా (ప్రజలారా), యెహోవా యొక్క ఈ వర్తమానం వినండి!
ఈ సందేశాన్ని దూరసముద్రతీర వాసులందరికి తెలియజెప్పండి.
‘ఇశ్రాయేలు ప్రజలను చెల్లాచెదురు చేసిన ఆ సర్వోన్నతుడే
తిరిగి వారందరినీ ఒక్క చోటికి కూడదీస్తాడు.
గొర్రెల కాపరిలా తన మందను (ప్రజలను) కాచి రక్షిస్తాడు.’
11 యెహోవా యాకోబును తిరిగి తీసికొని వస్తాడు.
యెహోవా తన ప్రజలను వారి కంటె బలవంతుల బారి నుండి రక్షిస్తాడు.
12 ఇశ్రాయేలు ప్రజలు సీయోను కొండ పైకి వస్తారు.
వారు ఆనందంతో కేకలు వేస్తారు.
యెహోవా వారికి చేసిన అనేక సదుపాయాల కారణంగా
వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోతాయి.
యెహోవా వారికి ఆహార ధాన్యాలను, క్రొత్త ద్రాక్షారసాన్ని,
నూనెను, గొర్రె పిల్లలను, ఆవులను ఇస్తాడు.
నీరు పుష్కలంగా లభించే
ఒక తోటలా వారు విలసిల్లుతారు.
ఇశ్రాయేలు ప్రజలు ఇక మీదట
ఎంత మాత్రము ఇబ్బంది పెట్టబడరు.
13 ఇశ్రాయేలు యువతులంతా
సంతోషంతో నాట్యం చేస్తారు.
యువకులు, వృద్ధులు నాట్యంలో పాల్గొంటారు.
వారి విచారాన్ని సంతోషంగా మార్చుతాను.
ఇశ్రాయేలు ప్రజలను ఓదార్చుతాను! వారి దుఃఖాన్ని ఆనందంగా మార్చుతాను!
14 యాజకులకు సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది.
నేనిచ్చే పారితోషికాలతో నా ప్రజలు నిండిపోయి తృప్తి చెందుతారు!”
ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది!
15 యెహోవా ఇలా సెలవిస్తున్నాడు:
“రామాలో రోదన వినవచ్చింది.
అది ఒక తీవ్రమైన రోదన; గొప్ప విషాదం.
రాహేలు[d] తన పిల్లలు హతులైన కారణంగా
ఆమె ఓదార్పు పొందుటకు నిరాకరిస్తుంది.”
16 కాని యెహోవా ఇలా అంటున్నాడు: “విలపించుట ఆపి వేయుము.
నీవు కంట తడి పెట్టవద్దు!
నీ పనికి తగిన ప్రతిఫలం నీకు దక్కుతుంది!”
ఇది యెహోవా సందేశం.
“ఇశ్రాయేలు ప్రజలు తమ శత్రు రాజ్యం నుండి తిరిగి వస్తారు.
17 కావున, ఇశ్రాయేలూ, మంచి భవిష్యత్తుకు నీవు ఆశతో ఎదురు చూడుము.”
ఇది యెహోవా వాక్కు.
“నీ పిల్లలు వారి రాజ్యానికి తిరిగి వస్తారు.
18 ఎఫ్రాయిము విలపిస్తున్నట్లు నేను విన్నాను.
ఎఫ్రాయిము ఇలా అంటూవుండగా నేను విన్నాను:
‘యెహోవా, నీవు నిజంగా నన్ను శిక్షించావు! నేను మంచి గుణపాఠం నేర్చుకున్నాను.
నేనిక ఎన్నడూ తర్భీతు పొందని కోడెదూడలా ఉన్నాను.
దయచేసి నన్ను శిక్షించటం మానివేయుము.
నేను తిరిగి నీ యొద్దకు వస్తాను.
నీవే నిజమైన నా యెహోవా దేవుడవు.
19 యెహోవా, నేను నీకు దూరమయ్యాను.
కాని నేను చేసిన దుష్కార్యాలను నేను గుర్తించాను.
కావున నేను నా జీవన విధానాన్ని మార్చుకొని, హృదయ పరివర్తన కలిగియున్నాను.
నా చిన్న తనంలో నేను చేసిన మూర్ఖపు పనులకు సిగ్గుపడి కలవరపడియున్నాను.’”
20 దేవుడు ఇలా చెప్పుచున్నాడు:
“ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అని మీకు తెలుసు.
ఆ బిడ్డను నేను ప్రేమిస్తున్నాను.
అవును, నేను ఎఫ్రాయిముకు వ్యతిరేకంగా తరచు మాట్లాడియున్నాను.
అయినా నేను అతనిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను.
నేనతన్ని గాఢంగా ప్రేమిస్తున్నాను.
నేను నిజంగా అతన్ని ఓదార్చ గోరుతున్నాను.”
ఇది యెహోవా సందేశం.
21 “ఇశ్రాయేలు ప్రజలారా, రహదారి గుర్తులను నెలకొల్పండి.
ఇంటి మార్గాన్ని సూచించే గుర్తులను నిలబెట్టండి.
మార్గాన్ని కనిపెట్టుకొని ఉండండి.
మీరు పయనించే దారిని శ్రద్ధగా పరిశీలిస్తూ ఉండండి.
ఇశ్రాయేలూ, నా కన్యకా, ఇంటికి రమ్ము!
నీ నగరాలకు తిరిగిరా.
22 నీవు విశ్వాసం లేని కుమార్తెవై ఉన్నావు.
కాని ఇంకెంత కాలం అక్కడిక్కడ తిరుగుతావు. ఎప్పుడు ఇంటికి వస్తావు?
“నీ దేశంలో ఒక నూతనమైన దానిని యెహోవా సృష్టించినప్పుడు
ఒక స్త్రీ తన పురుషుని ఆవరిస్తుంది.”[e]
23 ఇశ్రాయేలు దేవుడు సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా అంటున్నాడు: “యూదా ప్రజలకు నేను మళ్లీ మంచి పనులు చేస్తాను. వారిని తిరిగి నేను నిర్బందము నుండి తీసికొస్తాను. ఆ సమయంలో యూదా రాజ్యంలో దాని నగరాల్లోని ప్రజలు మళ్లీ ఇలా అంటారు: ‘ఓ నీతిగల నివాసమా, ఓ పవిత్ర పర్వతమా, యెహోవా నిన్ను దీవించు గాక!’[f]
24 “యూదా పట్టణాలలోని ప్రజలంతా శాంతి యుత సహాజీవనం చేస్తారు. రైతులు, స్థిరంగా లేకుండా తిరిగే పశువుల కాపరులు, అంతా యూదాలో ప్రశాంతంగా కలిసి జీవిస్తారు. 25 బలహీనులకు, అలసిపోయిన ప్రజలకు నేను విశ్రాంతిని, బలాన్ని ఇస్తాను. దుఃఖిస్తున్న వారి కోరికను తీరుస్తాను.”
26 అది విన్న తరువాత నేను (యిర్మీయా) మేల్కొని చుట్టూ చూశాను. అదెంతో హాయిని గూర్చిన నిద్ర.
27 “ఇశ్రాయేలు వంశీయులు, యూదా వంశీయులు అభివృద్ధి చెందేలా నేను సహాయపడే రోజులు వస్తున్నాయి.” ఇది యెహోవా వాక్కు. “వారి సంతానం, వారి పశుసంపద వర్థిల్లేలా కూడా నేను సహాయపడతాను. నేను చేసే ఆ పని ఒక మొక్కను నాటి దానిని పెంచినట్లుగా ఉంటుంది. 28 గతంలో ఇశ్రాయేలు, యూదావారు చేసే కార్యకలాపాలపై నేను నిఘా వేసి ఉన్నాను. వారిని మందలించే సమయం కోసం నేను వేచి ఉన్నాను. సమయం వచ్చింది; వారిని చీల్చి చెండాడాను. వారికి అనేక కష్ట నష్టాలు కలుగ జేశాను. కాని ఇప్పుడు వారిని పైకి తీసికొని రావటానికి, వారిని బలపర్చటానికి నేను వారిని గమనిస్తూ ఉన్నాను.” ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం.
29 “ఆ సమయంలో ప్రజలు ఈ సామెత చెప్పరు:
‘తండ్రులు పుల్లని ద్రాక్ష తిన్నారు,
కాని పిల్లల పళ్లు పులిశాయి.’[g]
30 కాని ప్రతివాడు తన పాపాల కారణంగా చనిపోతాడు. పుల్లని ద్రాక్షా తిన్న వాని పండ్లే పులుస్తాయి.”
క్రొత్త ఒడంబడిక
31 “ఇశ్రాయేలు వంశంతోను, యూదా వంశంతోను నేనొక క్రొత్త ఒడంబడికను కుదుర్చుకునే సమయం ఆసన్న మవుతూ ఉంది. 32 ఇది నేను వారి పూర్వీకులతో చేసికొన్న ఒడంబడిక వంటిది గాదు. వారిని నా చేతితో ఈజిప్టు నుండి నడిపించి తీసికొని వచ్చి నప్పుడు మేమా ఒడంబడిక చేసికొన్నాము. నేను వారి యెహోవాను, కాని వారే ఆ ఒడంబడికను ఉల్లంఘించారు.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
33 “భవిష్యత్తులో నేను ఇశ్రాయేలుతో ఈ రకమైన ఒడంబడిక చేసుకుంటాను.” ఇదే యెహోవా వాక్కు. “నా బోధనలన్నీ వారి మనస్సులో నాటింప చేస్తాను. పైగా వాటిని వారి హృదయాల మీద వ్రాస్తాను. నేను వారి దేవుణ్ణి. వారు నా ప్రజలై ఉందురు. 34 యెహోవాను గురించి తెలిసికొనేందుకు ప్రజలు వారి పొరుగువారికి, బంధువులకు బోధించనక్కరలేదు. ఎందువల్లనంటే అన్ని తరగతుల ప్రజలు తమతమ భేదం లేకుండా నన్ను తెలిసికుంటారు.” ఇదే యెహోవా వాక్కు. “వారు చేసిన చెడ్డ పనులన్నిటినీ నేను క్షమిస్తాను. వారి పాపాలను నేను గుర్తు పెట్టుకొనను.”
యెహోవా ఇశ్రాయేలును ఎన్నడు విడువడు
35 యెహోవా ఇలా చెప్పుచున్నాడు: “సూర్యుడు పగలు ప్రకాశించేలా యెహోవా చేశాడు.
చంద్రుడు, నక్షత్రాలు రాత్రి పూట కాంతిని వెద జల్లేలా యెహోవా చేశాడు.
సముద్రాలను ఘోషింపజేసి అలలు తీరాన్ని ముంచెత్తేలా చేసిందీ యెహోవాయే.
ఆయన పేరే సర్వశక్తిమంతుడగు యెహోవా.”
36 యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు:
“ఇశ్రాయేలు సంతతి ఒక రాజ్యంగా జాతిగా ఉండుట ఎప్పుడూ మానరు.
సూర్య చంద్ర నక్షత్ర సముద్రాలపై నా అదుపు తప్పిన నాడు మాత్రమే వారు రాజ్యంగా జాతిగా ఉండలేరు.”
37 యెహోవా ఇలా చెప్పుతున్నాడు: “ఇశ్రాయేలు సంతతిని నేనెన్నడు తిరస్కరించను.
ప్రజలు ఆకాశాన్ని కొలవగలిగిననాడు, వారు భూమి యొక్క సర్వ రహస్యాలను తెలిసికోగలిగిననాడు!
నేను ఇశ్రాయేలీయుల సంతతి వారిని తిరస్కరిస్తాను.
అప్పుడు మాత్రం వారు చేసిన అకృత్యాల కారణంగా నేను వారిని తిరస్కరిస్తాను”
ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం.
క్రొత్త యెరూషలేము
38 “యెహోవా నిమిత్తం యెరూషలేము నగరం తిరిగి నిర్మింపబడే రోజులు వస్తున్నాయి. ఇదే యెహోవా వాక్కు. హనన్యేలు బురుజు నుండి మూల ద్వారం వరకు మొత్తం నగరమంతా తిరిగి కట్టబడుతుంది. 39 భూమి కొలత గీత గొలుసు మూల ద్వారం నుండి గారెబు కొండ వరకును, అక్కడ నుండి గోయా అను ప్రదేశం వరకు పరచబడుతుంది. 40 శవాలను, బూడిదను పడవేసిన లోయ అంతా యెహోవాకు పవిత్రమైనదిగా ఉంటుంది. తూర్పున వున్న కిద్రోను లోయకు ఎగువనున్న భూములన్ని గుర్రాల ద్వారం వరకు అన్నీ కలపబడుతాయి. యెరూషలేము నగరం మరెన్నడు విచ్ఛిన్నం చేయబడదు. నాశనం చేయబడదు.”
యేసు బ్రతికి రావటం
(మత్తయి 28:1-8; లూకా 24:1-12; యోహాను 20:1-10)
16 విశ్రాంతి రోజు[a] ముగియగానే, మగ్దలేనే మరియ, యాకోబు తల్లి మరియ మరియు సలోమే యేసు దేహానికి పూయటానికి సుగంధ ద్రవ్యాలు కొన్నారు. 2 ఆదివారం ఉదయం సూర్యోదయం అవుతుండగా వాళ్ళు సమాధి దగ్గరకు వెళ్ళాలని బయలుదేరారు. 3 “ఇంతకూ సమాధికి అడ్డంగా ఉన్న రాయిని ఎవరు తీస్తారు?” అని పరస్పరం దారిలో మాట్లాడుకొన్నారు.
4 వాళ్ళు కళ్ళెత్తి సమాధి వైపు చూసారు. ఆ పెద్దరాయి దొర్లిపోయి ఉంది. 5 వాళ్ళు సమాధిలోకి ప్రవేశించారు. అక్కడ దానికి కుడి వైపు ఒక యువకుడు తెల్లటి దుస్తులు ధరించి ఉండటం చూసారు. వాళ్ళకు భయం వేసింది.
6 ఆ యువకుడు, “భయపడకండి, సిలువకు వేయబడిన నజరేతు యేసు కోసం చూస్తున్నారా? ఆయన యిక్కడ లేడు. ఆయన బ్రతికి వచ్చి వెళ్ళిపొయ్యాడు. ఆయన్ని పడుకోబెట్టిన స్థలం చూడండి. 7 కాని మీరు వెళ్ళి శిష్యులతో, ముఖ్యంగా పేతురుతో ఈ విధంగా చెప్పండి: ‘యేసు మీకు ముందే గలిలయకు వెళ్తున్నాడు. ఆయన ముందే చెప్పినట్లు, మీరు ఆయన్ని అక్కడ చూస్తారు.’”
8 ఆ స్త్రీలు దిగ్భ్రాంతి చెంది వణుకుతూ ఆ సమాధినుండి పరుగెత్తి పోయారు. భయంవల్ల వాళ్ళు ఎవరికీ ఏమీ చెప్పలేదు.[b]
యేసు కనిపించటం
(మత్తయి 28:9-10; యోహాను 20:11-18; లూకా 24:13-35)
9 యేసు ఆదివారం తెల్లవారుఝామున బ్రతికి వచ్చి మొదట మగ్దలేనే మరియకు కనిపించాడు. గతంలో యేసు ఈమె నుండి ఏడు దయ్యాలను వదిలించి ఉన్నాడు. 10 ఆమె ఇదివరలో యేసుతో ఉన్నవాళ్ళ దగ్గరకు వెళ్ళింది. వాళ్ళు దుఃఖంతో విలపిస్తూ ఉన్నారు. ఆమె వాళ్లకు జరిగిన సంగతి చెప్పింది. 11 యేసు బ్రతికి ఉన్నాడని, తాను ఆయన్ని చూసానని చెప్పింది. ఇది వాళ్ళు విన్నారు. కాని వాళ్ళు ఆమె మాటలు నమ్మలేదు.
12 ఆ తర్వాత యేసు తన యిద్దరు శిష్యులు వారి గ్రామానికి నడుస్తుండగా మరో రూపంలో కనిపించాడు. 13 వీళ్ళు తిరిగి వచ్చి జరిగిన విషయం మిగిలిన శిష్యులకు చెప్పారు. కాని వాళ్ళు వీళ్ళను కూడా నమ్మలేదు.
యేసు తన శిష్యులతో మాట్లాడటం
(మత్తయి 28:16-20; లూకా 24:36-49; యోహాను 20:19-23; అపొ. కా. 1:6-8)
14 ఆ తర్వాత పదకొండుగురు భోజనం చేస్తుండగా యేసు వాళ్ళకు కనిపించాడు. తాను బ్రతికి వచ్చిన విషయం కొందరు చెప్పినా శిష్యులు నమ్మలేదు. కనుక యేసు వాళ్ళు తనను నమ్మనందుకు వాళ్ళను గద్దించాడు.
15 యేసు వాళ్ళతో, “ప్రపంచమంతా పర్యటన చేసి ప్రజలందరికి సువార్త ప్రకటించండి. 16 విశ్వసించి బాప్తిస్మము పొందిన వాళ్ళను దేవుడు రక్షిస్తాడు. కాని, విశ్వసించని వాళ్ళను దేవుడు శిక్షిస్తాడు. 17 విశ్వసించిన వాళ్లకు ఈ ఋజువులు కనిపిస్తాయి. నాపేరిట వాళ్ళు దయ్యాలను వెళ్ళగొట్టకలుగుతారు. తమకు రాని భాషల్లో మాట్లాడకలుగుతారు. 18 తమ చేతుల్తో పాముల్ని పట్టుకోగలుగుతారు. విషం త్రాగినా వాళ్ళకే హానీ కలుగదు. వాళ్ళు తమ చేతుల్ని రోగులపై ఉంచితే వాళ్ళకు నయమైపోతుంది” అని అన్నాడు.
యేసు పరలోకానికి వెళ్ళటం
(లూకా 24:50-53; అపొ. కా. 1:9-11)
19 యేసు ప్రభువు వాళ్ళతో మాట్లాడిన తరువాత దేవుడాయన్ని పరలోకానికి పిలుచుకొన్నాడు. ఆయన అక్కడ దేవుని కుడిచేతి వైపున కూర్చున్నాడు.
20 ఆ తర్వాత వాళ్ళు అన్ని ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించారు. ప్రభువు వాళ్ళతో సహా పని చేసి వాళ్ళు ప్రకటించిన సందేశం నిజమని నిరూపించటానికి ఎన్నో అద్భుతాలు చేసి చూపాడు. ఆమేన్.
© 1997 Bible League International