M’Cheyne Bible Reading Plan
అమ్మోను రాజు వద్దకు యెఫ్తా సందేశకులను పంపుట
12 అమ్మోను ప్రజల రాజు దగ్గరకు యెఫ్తా సందేశకులను పంపించాడు. ఆ సందేశకులు రాజుకు ఈ సందేశం అందించారు: “అమ్మోను ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు మధ్యగల సమస్య ఏమిటి? మాపై యుద్ధానికి నీవెందుకు వచ్చావు?”
13 అమ్మోను ప్రజల రాజు, “ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు నుండి వచ్చినప్పుడు, వారు మా భూమిని ఆక్రమించుకున్నారు గనుక ఇశ్రాయేలీయులతో మేము యుద్ధం చేస్తున్నాము. అమ్మోను నది నుండి యబ్బోకు నది వరకు, యోర్దాను నది వరకు వారు మా భూమిని ఆక్రమించారు. ఇప్పుడు మా భూమిని శాంతియుతంగా తిరిగి మాకు ఇచ్చివేయమని ఇశ్రాయేలీయులతో చెప్పండి” అని యెఫ్తా సందేశకులతో చెప్పాడు.
14 యెఫ్తా సందేశకులు ఈ సందేశాన్ని తిరిగి యెఫ్తాకు అందించారు. అప్పుడు యెఫ్తా ఆ సందేశకులను తిరిగి అమ్మోనీయుల రాజు దగ్గరకు పంపించాడు. 15 వారు తిరిగి తీసుకుని వెళ్లిన సందేశం ఇది:
“యెఫ్తా చెప్పేది ఇది: మోయాబు ప్రజల భూమిగాని, అమ్మోను ప్రజల భూమిగాని ఇశ్రాయేలీయులు తీసుకోలేదు. 16 ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలోనికి వెళ్లారు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రానికి వెళ్లారు. తర్వాత వారు కాదేషు వెళ్లారు. 17 ఇశ్రాయేలీయులు ఎదోము రాజు దగ్గరకు సందేశకులను పంపించారు. ఒక సహాయం కోసం ఆ సందేశకులు అడిగారు. ‘ఇశ్రాయేలు ప్రజలను నీ దేశంలో నుండి పోనియ్యి’ అని వారు అడిగారు. కానీ ఎదోము రాజు మమ్మల్ని వారి దేశంలో నుండి వెళ్లనివ్వ లేదు. అదే సందేశాన్ని మేము మోయాబు రాజుకు కూడ పంపించాము. కానీ మోయాబు రాజుగూడ మమ్మల్ని తన దేశంలోనుండి వెళ్లనివ్వలేదు. కనుక ఇశ్రాయేలు ప్రజలు కాదేషులో నిలిచిపోయారు.
18 “తర్వాత ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నుండి, ఎదోము, మోయాబు దేశాల సరిహద్దుల నుండి తిరిగి వెళ్లారు. ఇశ్రాయేలు ప్రజలు మోయాబు దేశానికి తూర్పు దిశగా ప్రయాణం చేశారు. అర్నోను నదికి అవతలవైపు వారు విడిది చేసారు. మోయాబు దేశ సరిహద్దును వారు దాటలేదు. (అర్నోను నది మోయాబు దేశానికి సరిహద్దు.)
19 “తర్వాత ఇశ్రాయేలీయులు అమ్మోరీయుల రాజు సీహోను దగ్గరకు సందేశకులను పంపించారు. సీహోను హెష్బోను పట్టణపు రాజు, ‘ఇశ్రాయేలు ప్రజలను నీ దేశంలో నుండి వెళ్లనియ్యి. మేము మా దేశానికి వెళ్లగోరుతున్నాము.’ అని ఆ సందేశకులు సీహోనుతో చెప్పారు. 20 కానీ అమ్మోరీయుల రాజు సీహోను ఇశ్రాయేలు ప్రజలను తన సరిహద్దులు దాటనివ్వలేదు. సీహోను తన ప్రజలందరినీ సమావేశపరచి, యాహసు దగ్గర విడిది చేసాడు. అప్పుడు అమ్మోరీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసారు. 21 అయితే సీహోనును, అతని సైన్యాన్ని ఓడించేందుకు ఇశ్రాయేలు దేవుడు యెహోవా, ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేసాడు. కనుక అమ్మోరీయుల దేశం ఇశ్రాయేలీయుల ఆస్తి అయింది. 22 కనుక అమ్మోరీయుల దేశం అంతా ఇశ్రాయేలీయుల వంశం అయింది. ఆ దేశం అర్నోను నదినుండి యబ్బోకు నదివరకు ఉంది. ఆ దేశం అరణ్యంనుండి యోర్దాను నదివరకు ఉంది.
23 “అమ్మోరీ ప్రజలను వారి దేశంనుండి వెళ్లగొట్టినవాడు యెహోవా, ఇశ్రాయేలు దేవుడు. మరియు ఆ దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు ఈ దేశాన్ని విడిచి వెళ్లిపోయేట్టు నీవు చేయగలవని అనుకొంటున్నావా? 24 నీ కెమోషు దేవత నీకు ఇచ్చిన దేశంలో నిశ్చయంగా నీవు ఉండవచ్చును. కనుక మా యెహోవా దేవుడు మాకు ఇచ్చిన దేశంలో మేము ఉంటాము. 25 సిప్పోరు కుమారుడు బాలాకు[a] కంటె నీవు మంచివాడవా? అతను మోయాబు దేశానికి రాజు. అతడు ఇశ్రాయేలు ప్రజలతో ఏమైనా వాదించాడా? అతడు ఇశ్రాయేలు ప్రజలతో నిజంగా యుద్ధం చేశాడా? 26 హెష్బోను పట్టణంలో, దాని చుట్టూరా ఉన్న ఊళ్లలోను మూడువందల సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు నివసించారు. ఇశ్రాయేలు ప్రజలు అరోయేరు పట్టణంలోను, దాని చుట్టూరా ఉన్న ఊళ్ళలోను మూడువందల సంవత్సరాలు నివసించారు. అర్నోను నది పొడవునా ఉన్న పట్టణాలు అన్నింటిలోనూ ఇశ్రాయేలు ప్రజలు మూడువందల సంవత్సరాలు నివసించారు. ఆ కాలమంతటిలోనూ ఈ పట్టణాలను తీసుకునేందుకు నీవు ఎందుకు ప్రయత్నం చేయలేదు? 27 ఇశ్రాయేలు ప్రజలు నీకు విరోధంగా పాపం చేయలేదు. కానీ నీవు ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా చాలా చెడ్డ పని చేస్తున్నావు. ఇశ్రాయేలు ప్రజలు సరియైనది చేస్తున్నారో, అమ్మోనీయులు సరియైనది చేస్తున్నారో అనేది నిజమైన న్యాయమూర్తి యెహోవా నిర్ణయించునుగాక!”
28 యెఫ్తా దగ్గర్నుండి వచ్చిన ఈ సందేశాన్ని అమ్మోనీయుల రాజు నిరాకరించాడు.
యెఫ్తా వాగ్దానం
29 అప్పుడు యెహోవా అత్మ యెఫ్తా మీదికి వచ్చింది. గిలాదు, మనష్షే ప్రాంతాలలో యెఫ్తా సంచారం చేశాడు. అతడు గిలాదులోని మిస్పా పట్టణానికి వెళ్లాడు. గిలాదులోని మిస్పా పట్టణంనుండి యెఫ్తా అమ్మోనీయుల దేశంలోనికి వెళ్లాడు.
30 యెహోవాకు యెఫ్తా ఒక ప్రమాణం చేసాడు, “అమ్మోనీయులను నేను ఓడించేటట్టుగా నీవు చేస్తే, 31 ఆ విజయంతో నేను తిరిగి వచ్చేటప్పుడు నా ఇంటిలోనుండి మొట్టమొదట బయటకు వచ్చేదానిని నేను నీకు అర్పిస్తాను. దానిని నేను దహన బలిగా యెహోవాకు అర్పిస్తాను” అని అతడు చెప్పాడు.
32 అప్పుడు యెఫ్తా అమ్మోనీ ప్రజల దేశం వెళ్ళాడు. అమ్మోనీయులతో యెఫ్తా యుద్ధం చేశాడు. వారిని ఓడించటానికి యెహోవా అతనికి సహాయం చేశాడు. 33 అరోయేరు పట్టణంనుండి మిన్నీతు పట్టణం వరకు అతడు వారిని ఓడించాడు. యెఫ్తా ఇరవై పట్టణాలను పట్టుకొన్నాడు. ఆబేల్కెరామీము పట్టణంవరకు అమ్మోనీయులతో అతడు పోరాడాడు. ఇశ్రాయేలీయులు అమ్మోనీ ప్రజలను ఓడించారు. అది అమ్మోనీ ప్రజలకు ఒక గొప్ప పరాజయం.
34 యెఫ్తా తిరిగి మిస్పా వెళ్లాడు. యెఫ్తా తన ఇంటికి వెళ్లగా, అతని కుమార్తె అతన్ని ఎదుర్కొనేందుకు ఇంటిలో నుండి బయటకు వచ్చింది. ఆమె తంబుర వాయిస్తూ, నాట్యం చేస్తూ వచ్చెను. ఆమె అతనికి ఒక్కతే కుమార్తె. యెఫ్తా ఆమెను ఎంతో ప్రేమించాడు. యెఫ్తాకు ఇంకా కుమారులు, కుమార్తెలు ఎవరూ లేరు. 35 యెఫ్తా ఇంటి నుండి మొట్టమొదట బయటకు వచ్చింది తన కుమార్తె అని అతడు చూడగానే, అతడు తన దుఃఖాన్ని వ్యక్తం చేయటానికి తన బట్టలు చింపివేసికున్నాడు. అప్పుడు అతడు, “అయ్యో, నా కుమారీ, నీవు నన్ను దుఃఖంతో నింపివేశావు. నీవు నన్ను ఎంతో ఎంతో భాధపెట్టేశావు. యెహోవాకు నేను వాగ్దానం చేశాను, దానిని నేను మార్చలేను” అని చెప్పాడు.
36 అప్పుడు అతని కుమార్తె, “నా తండ్రీ, నీవు యెహోవాకు ఒక వాగ్దానం చేశావు. కనుక నీ వాగ్దానం నిలబెట్టుకో. నీవు చెప్పినట్టే చేయి. నీ శత్రువులైన అమ్మోనీయులను ఓడించటానికి యెహోవాయేగదా నీకు సహాయం చేసాడు” అని యెఫ్తాతో చెప్పింది.
37 అప్పుడు యెఫ్తా కుమార్తె, “అయితే నా కోసం ముందుగా ఈ ఒక్కటి చేయి. రెండు నెలలు నన్ను ఏకాంతంగా ఉండనివ్వు. నన్ను కొండలకు వెళ్లనివ్వు. నేను పెళ్లి చేసుకోను, పిల్లలు ఉండరు, కనుక నన్ను నా స్నేహితురాండ్రను కలిసి ఏడ్వనివ్వు” అని తన తండ్రితో చెప్పింది.
38 “వెళ్లి అలాగే చేయి” అని చెప్పాడు యెఫ్తా. రెండు నెలల కోసం యెఫ్తా ఆమెను పంపించివేశాడు. యెఫ్తా కుమార్తె, ఆమె స్నేహితురాండ్రు కొండలలో నివసించారు. ఆమెకు పెళ్లి, పిల్లలు ఉండరు కనుక వారు ఆమె కోసం ఏడ్చారు.
39 రెండు నెలల అనంతరం, యెఫ్తా కుమార్తె తన తండ్రి దగ్గరకు తిరిగి వచ్చింది. యెఫ్తా యెహోవాకు వాగ్దానం చేసిన ప్రకారమే జరిగించాడు. యెఫ్తా కుమార్తెకు ఎవరితోనూ ఎన్నడూ లైంగిక సంబంధాలు లేవు. కనుక ఇశ్రాయేలులో ఇది ఒక ఆచారం అయ్యింది. 40 గిలాదు వాడైన యెఫ్తా కుమార్తెను ఇశ్రాయేలు స్త్రీలు ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటారు. యెఫ్తా కుమార్తె కోసం ఇశ్రాయేలు స్త్రీలు ప్రతి సంవత్సరం నాలుగు రోజుల పాటు ఏడుస్తారు.
యెరూషలేములో సమావేశం
15 కొందరు యూదయనుండి అంతియొకయకు వచ్చి అక్కడున్న సోదరులకు, “సున్నతి అనే మోషే ఆచారాన్ని పాటిస్తే తప్ప మీకు రక్షణ లభించదు” అని బోధించారు. 2 ఈ కారణంగా పౌలు, బర్నబా వాళ్ళతో తీవ్రమైన వాదనలు, చర్చలు చేసారు. అపొస్తలుల్ని ఈ విషయాన్ని గురించి సంప్రదించాలనే ఉద్దేశ్యంతో పౌలును, బర్నబాను, మరి కొంతమందిని యెరూషలేమునకు పంపాలనే నిర్ణయం జరిగింది.
3 అక్కడున్న సంఘం వీళ్ళకు వీడ్కోలు యిచ్చింది. వీళ్ళు ఫోనీషియ, సమరయ పట్టణాల ద్వారా ప్రయాణం చేస్తూ యూదులు కానివాళ్లలో వచ్చిన మార్పును గురించి అక్కడి వాళ్ళకు చెప్పారు. ఇది సోదరులందరికీ చాలా ఆనందం కలిగించింది. 4 వీళ్ళు యెరూషలేము చేరగానే సంఘము, అపొస్తలులు, పెద్దలు అంతా కలిసి వీళ్ళకు స్వాగతం యిచ్చారు. పౌలు, బర్నబా దేవుడు తమ ద్వారా చేసిన వాటిని వాళ్ళకు చెప్పారు. 5 పరిసయ్యుల తెగకు చెందిన కొందరు భక్తులు లేచి, “యూదులు కానివాళ్ళు తప్పక సున్నతి చేసుకోవాలి. మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలి” అని అన్నారు.
6 అపొస్తలులు, పెద్దలు కలిసి ఈ విషయాన్ని పరిశీలించారు. 7 ఎన్నో చర్చలు జరిగాక పేతురు లేచి యిలా అన్నాడు: “సోదరులారా! యూదులు కానివాళ్ళు నా నోటినుండి సువార్త విని విశ్వాసులు కావాలని చాలా కాలం క్రిందటే దేవుడు మనందరినుండి నన్నెన్నుకొన్నట్లు మీకు తెలుసు. 8 మానవుల మనస్సు తెలిసిన దేవుడు, మనకిచ్చినట్లే పవిత్రాత్మను వాళ్ళకు కూడా యిచ్చి వాళ్ళను అంగీకరించినట్లు మనకు తెలియ చేసాడు. 9 మనకు, వాళ్ళకూ వ్యత్యాసం చూపలేదు. వాళ్ళు విశ్వసించారు. కనుక వాళ్ళ హృదయాలను పవిత్రం చేసాడు. 10 మరి అలాంటప్పుడు బరువైన ఈ కాడిని శిష్యుల మెడపై ఎందుకు పెడ్తున్నారు? ఈ బరువును మనము, మన పెద్దలు కూడా మోయలేక పోయాము కదా! దేవుడు కోప్పడుతాడో లేదో చూడాలని ఉందా? 11 యేసు ప్రభువు దయతో మనము, వీళ్ళు కూడా రక్షింపబడుతామని నమ్ముతున్నాము.”
12 సభలో ఉన్నవాళ్ళందరూ నిశ్శబ్దం వహించారు. బర్నబా, పౌలు యూదులు కానివాళ్ళలో దేవుడు తమ ద్వారా చేసిన మహిమల్ని గురించి, అద్భుతాల్ని గురించి చెప్పగా వాళ్ళు విన్నారు. 13 పౌలు, బర్నబా మాట్లాడటం ముగించాక యాకోబు ఈ విధంగా అన్నాడు: “సోదరులారా! నా మాటలు వినండి! 14 దేవుడు మొదట్లో యూదులు కానివాళ్ళ పట్ల తన అభిమానాన్ని చూపి వాళ్ళనుండి కొందర్ని ఎన్నుకొని తన ప్రజలుగా ఎలా చేసుకొన్నాడో సీమోను మనకు వివరించి చెప్పాడు. 15 ఈ సంఘటనను ప్రవక్తలు ఈ వాక్యాల్లో సరిగ్గా వర్ణించారు:
16 ‘కూలిపోయిన దావీదు యింటిని పునర్నిర్మిస్తాను!
ఆ శిథిలాలతో క్రొత్త యింటిని నిర్మిస్తాను!
17 మిగతా వాళ్ళంతా ప్రభువును వెతుకుతారు!
నేనెన్నుకొన్న యూదులుకాని ప్రజలు కూడా వెతుకుతారు.’(A)
18 ‘అని ప్రభువు చాలా కాలం క్రిందటే తెలియచేసాడు.’
19 “దేవుడు యూదులు కానివాళ్ళను కూడా అంగీకరించాడు కాబట్టి, దేవుని వైపు మళ్ళుతున్న వాళ్ళ మనస్సుకు కష్టం కలిగించ కూడదని నా అభిప్రాయం. 20-21 కాని తరతరాలనుండి మోషే ధర్మశాస్త్రాన్ని ప్రతి పట్టణంలో ప్రకటిస్తూ, వాటిని ప్రతి విశ్రాంతి రోజు సమాజ మందిరాల్లో చదివారు కాబట్టి,
విగ్రహాలకు నైవేద్యం పెట్టిన ఆహారం ముట్టరాదని,
లైంగిక పాపము చేయరాదని,
గొంతు నులిమి చంపిన జంతువుల మాంసం ముట్టరాదని, జంతువుల రక్తాన్ని తినరాదని వాళ్ళకు మనం వ్రాయాలి.”
యూదులుకాని భక్తులకు లేఖ
22 అపొస్తలులు, పెద్దలు, సంఘసభ్యులు, అంతా కలిసి సంఘంనుండి కొందర్ని ఎన్నుకొని పౌలు, బర్నబాతో సహా వాళ్ళను అంతియొకయకు పంపారు. సోదరుల్లో ముఖ్యులైన బర్సబ్బా అని పిలువబడే యూదాను, సీలను ఎన్నుకొని 23 వాళ్ళ వెంట ఈ లేఖను పంపారు:
మీ సోదరులైన అపొస్తలులనుండి, పెద్దలనుండి,
అంతియొకయ, సిరియ, కిలికియ పట్టణాల్లోని యూదులుకాని సోదరులకు, శుభం!
ప్రియ సహోదరులారా!
24 మా అనుమతి లేకుండా మాలో కొందరు అక్కడికి వచ్చి తమ మాటల్తో మీలో అశాంతి కలిగించి మీ మనస్సుల్ని పాడుచేసారని విన్నాము. 25 మా ప్రియమిత్రులైన బర్నబాతో, పౌలుతో కొందర్ని మీ వద్దకు పంపాలని మేమంతా కలిసి నిర్ణయించాము. 26 వీళ్ళు మన యేసు క్రీస్తు ప్రభువు కోసం తమ ప్రాణాల్ని తెగించినవాళ్ళు. 27 అందువల్ల, మేము వ్రాస్తున్నవి తమ నోటి ద్వారా మీకు తెలపాలని యూదాను, సీలను పంపుతున్నాము. 28 ఈ నియమాల్ని తప్ప మిగతా నియమాల్ని మీపై మోపటం భావ్యంకాదని పవిత్రాత్మకు, మాకు అనిపించింది:
29 విగ్రహాలకు నైవేద్యం పెట్టిన ఆహారాన్ని,
గొంతు నులిమి చంపిన జంతువుల మాంసాన్ని, జంతువుల రక్తాన్ని ముట్టకండి.
లైంగిక పాపము చేయకండి.
ఇలా వీటికి దూరంగా ఉండటంవల్ల మీలో సత్ప్రవర్తన కలుగుతుంది.
వీడ్కోలు.
30 వాళ్ళు సెలవు తీసుకొని అంతియొకయకు వెళ్ళారు. యేసు భక్తులందర్ని పిలిచి వాళ్ళకీ లేఖనిచ్చారు. 31 ప్రోత్సాహపరిచే ఈ లేఖను చదివి ప్రజలు చాలా ఆనందించారు. 32 యూదా, సీల కూడా ప్రవక్తలు కాబట్టి ఆ ఊరి సోదరులతో చాలా సేపు మాట్లాడి వాళ్ళను ప్రోత్సాహపరిచి ఆధ్యాత్మికంగా బలపరిచారు. 33 వాళ్ళక్కడ కొద్ది రోజులు గడిపారు. ఆ తదుపరి అక్కడి సోదరులు, “శాంతి కలుగుగాక” అని కోరుతూ వాళ్ళకు వీడ్కోలు చెప్పారు. వీళ్ళు తమను పంపిన వాళ్ళ దగ్గరకు తిరిగి వెళ్ళిపోయారు. 34 “కాని సీల అక్కడే ఉండిపోవాలనుకొన్నాడు.”[a]
35 పౌలు, బర్నబా అంతియొకయలో కొద్ది రోజులు గడిపారు. వీళ్ళు, యింకా అనేకులు కలిసి ప్రభువు సందేశాన్ని ఉపదేశించి బోధించారు.
పౌలు, బర్నబా విడిపోవటం
36 కొంతకాలం తర్వాత పౌలు బర్నబాతో, “ప్రభువు సందేశాన్ని ఉపదేశించిన ప్రతి పట్టణానికి, మనం మళ్ళీ వెళ్దాం. అక్కడి సోదరుల్ని కలుసుకొని వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారో చూసి వద్దాం” అని అన్నాడు.
37 బర్నబా, మార్కు అని పిలివబడే యోహానును కూడా తమ వెంట పిలుచుకు వెళ్దామనుకొన్నాడు. 38 కాని తమతో పని చెయ్యకుండా తమను పంఫూలియలో వదిలి వేసాడు కాబట్టి పౌలు అతణ్ణి పిలుచుకు వెళ్ళటం మంచిది కాదనుకొన్నాడు. 39 బర్నబా, పౌలు మధ్య తీవ్రమైన వివాదము కలగటం వల్ల వాళ్ళు విడిపోయారు. బర్నబా మార్కును తన వెంట పిలుచుకొని ఓడలో సైప్రసుకు వెళ్ళాడు.
40 పౌలు, సీలను తన వెంట పిలుచుకొని వెళ్ళాడు. అక్కడున్న సోదరులు అతనికి ప్రభువు అనుగ్రహం కలగాలని దీవించి ప్రభువుకు అప్పగించారు. 41 అతడు సిరియ, కిలికియ పట్టణాల ద్వారా ప్రయాణం చేసి అక్కడి సంఘాలను ఆధ్యాత్మికంగా బలపరిచాడు.
మంచి మరియు చెడ్డ అంజూరపు పండ్లు
24 యెహోవా నాకు ఈ వస్తువులను చూపించాడు: యెహోవా మందిరం ముందు ఉంచబడిన రెండు బుట్టల అంజూరపు పండ్లను చూశాను. (నాకు ఈ దర్శనం బబులోను రాజైన నెబుకద్నెజరు యెకోన్యాను[a] బందీగా తీసుకొని పోయిన తరువాత కలిగింది. యెకోన్యా రాజైన యెహోయాకీము కుమారుడు. యెకోన్యా, అతని ముఖ్యమైన అధికారులు యెరూషలేము నుండి తీసుకొనిపోబడినారు. వారు బబులోనుకు బందీలుగా కొనిపోబడినారు. నెబుకద్నెజరు యూదా రాజ్యంలోని చాలా మంది వడ్రంగులను, లోహపు పనివారలను కూడ తీసుకొనిపోయాడు.) 2 ఒక బుట్ట నిండా మంచి అంజూరపు పండ్లున్నాయి. అవి వాటి కాలం కంటే ముందు పండిన పండ్లవలె ఉన్నాయి. కాని రెండవ బుట్టలో కుళ్లిపోయిన అంజూరపు పండ్లున్నాయి. అవి తినటానికి పనికి రాకుండా కుళ్లి పోయాయి.
3 “యిర్మీయా, నీవు ఏమి చూస్తున్నావు? అని యెహోవా నన్ను అడిగాడు.
“నేను అంజూరపు పండ్లను చూస్తున్నాను. అవి చాలా మంచి పండ్లు. చెడి పోయిన పండ్లు కుళ్లి పోయాయి. అవి తినటానికి పనికి రాకుండా కుళ్లిపోయాయి,” అని నేను సమాధానమిచ్చాను.
4 పిమ్మట యెహోవా వర్తమానం నాకు చేరింది. 5 ఇశ్రాయేలు దేవుడైవ యెహోవా ఇలా చెప్పాడు: “యూదా ప్రజలు తమ దేశాన్నుండి బయటకు కొనిపోబడ్డారు. వారి శత్రువు వారిని బబులోనుకు తీసుకొనిపోయాడు. ఆ ప్రజలు ఈ మంచి అంజూరపండ్లలా ఉన్నారు. ఆ ప్రజల పట్ల నేను కనికరం చూపుతాను. 6 నేను వారిని రక్షిస్తాను. నేను వారిని తిరిగి యూదా రాజ్యానికి తీసుకొని వస్తాను. నేను వారిని చీల్చి పారవేయను. వారిని పైకి తీసుకొని వస్తాను! వారిని పెరికి వేయను. వారు అభివృద్ది చెందటానికి వారిని స్థిరంగా నాటుతాను. 7 వారు నన్ను తెలుసుకొనగోరేలా చేస్తాను. నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు. వారు నా ప్రజలు; నేను వారి దేవుడను. బబులోనులో వున్న ఆ బందీలంతా పూర్ణహృదయ పరివర్తనతో నా వైపు తిరుగుతారు గనుక నేనిదంతా చేస్తున్నాను.
8 “కాని యూదా రాజైన సిద్కియా మాత్రం తినటానికి పనికిరాకుండా కుళ్లిపోయిన అంజూరపు పండ్లవలె అవుతాడు. సిద్కియా, అతని ఉన్నతాధికారులు, యెరూషలేములో యింకా మిగిలి వున్న ప్రజలు, మరియు ఈజిప్టులో నివసిస్తున్న యూదా ప్రజలు కుళ్లిన ఈ అంజూరపు పండ్లవలె ఉంటారు. 9 నేను వారిని శిక్షిస్తాను. ఆ శిక్ష భూమిమీద ప్రజలందరికీ భయంతో కూడిన విస్మయాన్ని కల్గిస్తుంది! యూదా వారిని చూచి తక్కిన ప్రజలు హేళన చేస్తారు. వారిని గూర్చి హాస్యోక్తులు పలుకుతారు. నేను వారిని చిందర వందర చేసి పడవేసిన అన్ని ప్రదేశాలలో ప్రజలు వారిని శపిస్తారు. 10 వారి మీదికి కత్తిని, కరువును, రోగాలను పంపుతాను. వారంతా చనిపోయే వరకు వారిని ఎదుర్కొంటూ వుంటాను. వారికి, వారి పితరులకు నేనిచ్చిన భూమిమీద వారిక ఎంత మాత్రము ఉండరు.”
విడాకులను గురించి బోధించటం
(మత్తయి 19:1-12)
10 యేసు ఆ ప్రాంతాన్ని వదిలి యూదయ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడి నుండి యొర్దాను నది అవతల వైపునున్న ప్రాంతానికి వెళ్ళాడు. మళ్ళీ ప్రజల గుంపులు ఆయన దగ్గరకు వచ్చాయి. యేసు ఎప్పటిలాగే వాళ్ళకు బోధించాడు.
2 కొందరు పరిసయ్యులు[a] ఆయన్ని పరీక్షించాలని అనుకొని వచ్చి, “ఒక మనిషి తన భార్యకు విడాకులివ్వటం న్యాయ సమ్మతమేనా?” అని అడిగారు.
3 యేసు, “మోషే మీకు ఏమని ఆజ్ఞాపించాడు?” అని అడిగాడు.
4 వాళ్ళు, “విడాకుల పత్రం వ్రాసి భార్యను పంపివేయటానికి మోషే అనుమతి ఇచ్చాడు” అని అన్నారు.
5 యేసు, “మీరు దేవునికి లోబడనివారు కనుక మోషే అలా వ్రాశాడు. 6 కాని, దేవుడు తన సృష్టి ప్రారంభించినప్పుడు ‘ఆడ మగ అనే జాతుల్ని సృష్టించాడు’(A) 7 అందువల్లే, పురుషుడు తన తల్లి తండ్రుల్ని వదిలి తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు.(B) 8 వాళ్ళిద్దరూ ఐక్యమై ఒకే దేహంగా మారిపోతారు. అందువల్ల వాళ్ళు యిద్దరివలే కాకుండా ఒకరిలా జీవిస్తారు. 9 కనుక దేవుడు ఐక్యం చేసిన వాళ్ళను ఏ మానవుడూ వేరు చేయకూడదు” అని అన్నాడు.
10 అంతా యింట్లోకి వచ్చాక శిష్యులు యేసును ఈ విషయాన్ని గురించి విశదంగా చెప్పమని కోరారు. 11 యేసు ఇలాగన్నాడు: “తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని వివాహం చేసుకొన్నవాడు తన భార్యకు వ్యతిరేకంగా వ్యభిచరించినవాడౌతాడు. 12 అదే విధంగా తన భర్తకు విడాకులిచ్చి మరొక పురుషుని వివాహం చేసుకొన్న స్త్రీ వ్యభిచారిణిగా పరిగణింపబడుతుంది.”
యేసు చిన్నపిల్లల్ని దీవించటం
(మత్తయి 19:13-15; లూకా 18:15-17)
13 యేసు తాకాలని, ప్రజలు చిన్నపిల్లల్ని పిలుచుకొని వస్తూవుంటే శిష్యులు వాళ్ళని గద్దించారు. 14 ఇది చూసి యేసుకు మనస్సులో బాధ కలిగింది. ఆయన వాళ్ళతో, “చిన్నపిల్లల్ని నా దగ్గరకు రానివ్వండి. వాళ్ళను ఆపకండి. దేవుని రాజ్యం చిన్న పిల్లల్లాంటి వారిది. 15 ఇది నిజం. చిన్న పిల్లవాని వలే దేవుని రాజ్యాన్ని స్వీకరించనివాడు ఆ రాజ్యంలోకి ప్రవేశించలేడు” అని అన్నాడు. 16 ఆయన ఆ చిన్న పిల్లల్ని దగ్గరకు పిలిచి వాళ్ళపై తన చేతులుంచి ఆశీర్వదించాడు.
ధనవంతుడు యేసును వెంబడించుటకు నిరాకరించటం
(మత్తయి 19:16-30; లూకా 18:18-30)
17 యేసు బయలుదేరుతుండగా ఒక మనిషి పరుగెత్తుకొంటూ ఆయన దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “మంచి బోధకుడా! నేను నిత్యజీవం పొందాలంటే ఏమి చెయ్యాలి?” అని అడిగాడు.
18 యేసు, “నేను మంచివాణ్ణి అని ఎందుకు అంటున్నావు. దేవుడు తప్ప ఎవరూ మంచివారు కారు. మోషే ఆజ్ఞలు నీకు తెలుసు కదా! 19 హత్య చేయరాదు, వ్యభిచారం చేయరాదు. దొంగతనము చెయ్యరాదు. దొంగ సాక్ష్యం చెప్పరాదు. మోసం చెయ్యరాదు. నీ తల్లి తండ్రుల్ని గౌరవించు” అని అన్నాడు.
20 అతడు, “అయ్యా! నా చిన్నతనంనుండి నేను వీటిని పాటిస్తున్నాను!” అని అన్నాడు.
21 యేసు అతని వైపు చూసాడు. అతనిపై యేసుకు అభిమానం కలిగింది. అతనితో, “నీవు యింకొకటి చెయ్యాలి. వెళ్ళి నీ దగ్గరున్నవన్నీ అమ్మేసి పేదవాళ్ళకివ్వు. అప్పుడు నీకు పరలోకంలో సంపద లభిస్తుంది. ఆ తదుపరి నన్ను అనుసరించు” అని అన్నాడు.
22 ఇది విన్నాక ఆ వచ్చిన వ్యక్తి ముఖం చిన్నబోయింది. అతని దగ్గర చాలా ధనముండటం వల్ల దుఃఖంతో అక్కడినుండి వెళ్ళిపొయ్యాడు.
23 యేసు చుట్టూ చూసి తన శిష్యులతో, “ధనమున్నవాడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం చాలా కష్టం” అని అన్నాడు.
24 శిష్యులు ఆయన మాటలకు ఆశ్చర్యపోయారు. యేసు మళ్ళీ, “శిష్యులారా! దేవుని రాజ్యంలో ప్రవేశించటం ఎంతో కష్టం! 25 ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం కన్నా ఒంటె సూది రంధ్రం ద్వారా వెళ్ళటం సులభం” అని అన్నాడు.
26 ఇది విని శిష్యులు యింకా ఎక్కువ ఆశ్చర్యపడ్డారు. అలాగైతే, “ఎవరికి రక్షణ లభిస్తుంది?” అంటూ పరస్పరం మాట్లాడుకున్నారు.
27 యేసు వాళ్ళవైపు చూసి, “మానవునికి ఇది అసాధ్యమైన పని కాని, దేవునికి అన్నీ సాధ్యమే!” అని అన్నాడు.
28 పేతురు ఆయనతో, “మిమ్మల్ని అనుసరించాలని మేము అన్నీ వదిలివేసాము” అని అన్నాడు.
29-30 యేసు, “ఇది నిజం. నా కోసం, సువార్తకోసం, తన యింటినికాని, సోదరులనుకాని, అక్క చెల్లెండ్లను కాని, తల్లినికాని, తండ్రినికాని, సంతానాన్ని కాని, పొలాల్ని కాని, విడిచినవాడు ఈ తరంలోనే నూరు రెట్లు యిళ్ళను, సోదరులను, అక్క చెల్లెండ్లను, తల్లుల్ని, సంతానాన్ని, పొలాల్ని పొందుతాడు. వీటితో పాటు హింసల్ని కూడా పొందుతాడు. రానున్న లోకంలో నిత్యజీవం పొందుతాడు. 31 కాని ముందున్న వాళ్ళు చివరివాళ్ళై, చివర వున్న వాళ్ళు ముందుకు వెళ్తారు” అని అన్నాడు.
యేసు తన మరణాన్ని గురించి మళ్ళీ మాట్లాడటం
(మత్తయి 20:17-19; లూకా 18:31-34)
32 యేసు, ఆయనతో ఉన్న వాళ్ళు అంతా యెరూషలేము వెళ్ళటానికి బయలుదేరారు. యేసు అందరికన్నా ముందు నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు దిగులుతో నడుస్తూ ఉన్నారు. యేసును అనుసరిస్తున్న యితరులు భయపడుతూ నడుస్తూ ఉన్నారు. యేసు మళ్ళీ తన శిష్యులను ప్రక్కకు పిలిచి తనకు జరుగనున్న వాటిని గురించి వాళ్ళకు చెప్పాడు. 33 ఆయన, “వినండి, మనం యెరూషలేము దాకా వెళ్తున్నాము. అక్కడ మనుష్యకుమారునికి ద్రోహం జరుగుతుంది. ఆయన ప్రధానయాజకులకు, శాస్త్రులకు అప్పగింపబడతాడు. వాళ్ళాయనకు మరణ శిక్ష విధించి యూదులుకాని వాళ్ళకు అప్పగిస్తారు. 34 యూదులుకాని వాళ్ళు ఆయన్ని హేళన చేసి ఆయన మీద ఉమ్మివేస్తారు. ఆయన్ని కొరడా దెబ్బలుకొడతారు. ఆ తర్వాత చంపివేస్తారు. మూడు రోజుల తర్వాత ఆయన బ్రతికి వస్తాడు” అని అన్నాడు.
యాకోబు మరియు యోహానుల నివేదన
(మత్తయి 20:20-28)
35 జెబెదయి కుమారులు యాకోబు మరియు యోహానులు ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళు, “బోధకుడా! మేము అడిగింది చెయ్యమని కోరుతున్నాము” అని అన్నారు.
36 “ఏమి చెయ్యమంటారు?” అని యేసు అడిగాడు.
37 వాళ్ళు, “మీరు మహిమను పొందినప్పుడు మాలో ఒకరిని మీ కుడిచేతి వైపు, మరొకరిని మీ ఎడమచేతివైపు కూర్చోనివ్వండి” అని అడిగారు.
38 యేసు, “మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు. నేను త్రాగినదాన్ని మీరు త్రాగగలారా? నేను పొందిన బాప్తిస్మము మీరు పొందగలరా?” అని అడిగాడు.
39 “పొందగలము” అని వాళ్ళు సమాధానం చెప్పారు. యేసు వాళ్ళతో, “నేను త్రాగిన దాన్ని మీరు త్రాగుదురు, నేను పొందిన బాప్తిస్మము మీరు పొందుదురు. 40 కాని నా కుడివైపు, లేక నా ఎడమ వైపు కూర్చోమనటానికి అనుమతి యిచ్చేది నేను కాదు. ఈ స్థానాలు ఎవరి కోసం నియమించబడ్డాయో వాళ్ళు మాత్రమే కూర్చోగలరు” అని అన్నాడు.
41 ఇది విని మిగతా పది మందికి యాకోబు మరియు యోహానులపై కోపం వచ్చింది. 42 యేసు వాళ్ళను దగ్గరకు పిలిచి, “యూదులుకాని వాళ్ళను పాలించ వలసిన ప్రభువులు, వాళ్ళపై తమ అధికారం చూపుతూ ఉంటారు. ఇతర అధికారులు కూడా వాళ్ళపై అధికారం చూపుతూ ఉంటారు. ఇది మీకు తెలుసు. 43 మీ విషయంలో అలా కాదు. మీలో అందరి కన్నా గొప్ప కావాలనుకున్నవాడు మిగతా వాళ్ళందరికి సేవ చేయాలి. 44 మీలో ప్రాముఖ్యత పొందాలనుకొన్నవాడు మీ అందరికి బానిసగా ఉండాలి. 45 ఎందుకంటే మనుష్యకుమారుడు కూడా సేవ చేయించుకోవటానికి రాలేదు. కాని సేవ చేయటానికి, అందరి పక్షాన తన ప్రాణాన్ని క్రయధనంగా ధారపోయటానికి వచ్చాడు” అని అన్నాడు.
గ్రుడ్డివానికి దృష్టి కలిగించటం
(మత్తయి 20:29-34; లూకా 18:35-43)
46 ఆ తర్వాత వాళ్ళు యెరికో చేరుకున్నారు. యేసు, ఆయన శిష్యులు, వాళ్ళతో ఉన్న ప్రజల గుంపు ఆ పట్టణాన్ని వదిలి బయలుదేరారు. తీమయి కుమారుడు బర్తిమయి అనే ఒక గ్రుడ్డివాడు దారి ప్రక్కన కూర్చుని ఉండినాడు. అతడు బిక్షగాడు. 47 ఆ గ్రుడ్డివాడు, వస్తున్నది నజరేతు నివాసి యేసు అని తెలుసుకొని, “యేసూ! దావీదు కుమారుడా! నాపై దయ చూపు!” అని బిగ్గరగా అనటం మొదలు పెట్టాడు.
48 చాలామంది అతణ్ణి తిట్టి ఊరుకోమన్నారు. కాని ఆ గ్రుడ్డివాడు. “దావీదు కుమారుడా! నా మీద దయ చూపు” అని యింకా బిగ్గరగా అరిచాడు.
49 యేసు ఆగి, “అతణ్ణి పిలవండి” అని అన్నాడు.
వాళ్ళా గ్రుడ్డివానితో, “ధైర్యంగా లేచి నిలుచో. ఆయన నిన్ను పిలుస్తున్నాడు” అని అన్నారు. 50 ఆ గ్రుడ్డివాడు కప్పుకొన్న వస్త్రాన్ని ప్రక్కకు త్రోసి, గభాలున లేచి యేసు దగ్గరకు వెళ్ళాడు.
51 యేసు, “ఏమి కావాలి?” అని అడిగాడు.
ఆ గ్రుడ్డివాడు, “రబ్బీ! నాకు చూపు కావాలి” అని అన్నాడు.
52 యేసు, “నీ విశ్వాసం నీకు నయం చేసింది. యిక వెళ్ళు” అని అన్నాడు. వెంటనే అతనికి చూపు వచ్చింది. అతడు యేసును అనుసరిస్తూ ఆయన వెంట వెళ్ళాడు.
© 1997 Bible League International