మత్తయి 19:1-12
Telugu Holy Bible: Easy-to-Read Version
విడాకులను గురించి బోధించటం
(మార్కు 10:1-12)
19 యేసు మాట్లాడటం ముగించాక గలిలయ వదలి యొర్దాను నది అవతలి వైపున ఉన్న యూదయ ప్రాంతానికి వెళ్ళాడు. 2 ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు. ఆయన వాళ్ళకు నయం చేసాడు.
3 కొందరు పరిసయ్యులు ఆయన్ని పరీక్షించాలని వచ్చి, “పురుషుడు తన భార్యకు ఏదో ఒక కారణం చూపి విడాకులివ్వవచ్చా?” అని అడిగారు.
4-5 యేసు, “మొదట్లో సృష్టికర్త పురుషుణ్ణి, స్త్రీని సృష్టించి ఇలా అన్నాడు: ‘పురుషుడు తన తల్లి తండ్రులను వదలి తన భార్యతో ఏకమౌతాడు. వాళ్ళిద్దరూ కలసి ఒకే శరీరంగా జీవిస్తారు!’(A) ఇది మీరు చదువలేదా? 6 ఆ కారణంగా వాళ్ళనికమీదట యిరువురిగా కాకుండా ఒకరిగా పరిగణించాలి! దేవుడు ఏకం చేసిన వాళ్ళను మానవుడు వేరు చేయరాదు!” అని సమాధానం చెప్పాడు.
7 “మరి పురుషుడు విడాకుల పత్రం తన భార్యకిచ్చి ఆమెను పంపివేయవచ్చని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు?” అని వాళ్ళు అడిగారు.
8 యేసు, “మీరు దేవుని ఆజ్ఞలను అనుసరించే వాళ్ళు కాదు కాబట్టి మీ భార్యలకు విడాకులివ్వటానికి మోషే మీకు అనుమతి యిచ్చాడు. అంతేకాని మొదటి నుండి ఈ విధంగా లేదు. 9 కాని నేను చెప్పేదేమిటంటే అవినీతిపరురాలు కాని తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని వివాహమాడిన వాడు వ్యభిచారిగా పరిగణింపబడతాడు. విడువబడ్డ దానిని పెండ్లి చేసికొంటే వాడును వ్యభిచారిగా అవుతాడు” అని అన్నాడు.
10 శిష్యులు ఆయనతో, “విడాకులివ్వటానికి ఇలాంటి కారణం కావలసి వస్తే వివాహం చేసుకోకుండా ఉండటమే ఉత్తమం” అని అన్నారు.
11-12 యేసు, “మీరన్నట్లు చెయ్యటం అందరికి సాధ్యంకాదు. కొందరు నపుంసకులుగా పుడ్తారు. కనుక వివాహం చేసుకోరు. మరి కొందర్ని యితర్లు నపుంసకులుగా చేస్తారు. కనుక వివాహం చేసుకోరు. కాని కొందరు దేవుని రాజ్యం కొరకు వివాహం చేసుకోరు. ఈ బోధను అనుసరించ గలవాడే అనుసరించనీ” అని సమాధానం చెప్పాడు.
Read full chapter© 1997 Bible League International