Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
న్యాయాధిపతులు 1

కనానీయులతో యూదా యుద్ధం చేయటం

యెహోషువ చనిపోయాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు ప్రార్థన చేసారు: యెహోవాతో, “మా వంశాలలో ఏది ముందుగా వెళ్లి, మా పక్షంగా కనానీయులకు విరోధంగా యుద్ధం చేయాలి?” అని వారు అడిగారు.

యెహోవా, “యూదా వంశస్థులు వెళతారు. నేను వారిని ఈ దేశం తీసుకోనిస్తాను” అని ఇశ్రాయేలీయులతో చెప్పాడు.

యూదా పురుషులు, వారి సోదరులైన షిమ్యోను వంశంవారిని సహాయం అడిగారు. “సోదరులారా, మనలో ప్రతి ఒక్కరికి కొంత భూమి ఇస్తానని యెహోవా వాగ్దానం చేశాడు. మీరు వచ్చి, మా భూమి కోసం పోరాడటంలో సహాయం చేస్తే, అప్పుడు మేము మీ భూమి కోసం పోరాడేందుకు మీకు సహాయం చేస్తాం” అన్నారు యూదా మనుష్యులు. యూదా సోదరులతో కలిసి పోరాడేందుకు షిమ్యోను మనుష్యులు అంగీకరించారు.

కనానీయులను, పెరిజ్జీయులను ఓడించుటకు యూదా మనుష్యులకు యెహోవా సహాయం చేశాడు. బెజెకు పట్టణం దగ్గర యూదావారు 10,000 మందిని చంపేసారు. బెజెకు పట్టణంలో బెజెకు పాలకుని యూదా మనుష్యులు చూసి అతనితో పోరాడారు. యూదా వారు కనానీయులను, పెరిజ్జీయులను ఓడించారు.

బెజెకు పాలకుడు[a] పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ యూదా వారు అతనిని తరిమి పట్టుకొన్నారు. వారు అతనిని పట్టుకున్నప్పుడు అతని కాళ్లు చేతుల బొటన వేళ్లను వారు కోసివేసారు. అప్పుడు బెజెకు పాలకుడు, “డెబ్బై మంది రాజుల కాళ్లు, చేతుల బొటన వేళ్లను నేను కోసివేసాను. ఆ రాజులు నా బల్ల మీదనుండి క్రింద రాలిన ఆహారం ముక్కలు తినవలసి వచ్చేది. ఆ రాజులకు నేను చేసిన దానిని దేవుడు ఇప్పుడు తిరిగి నాకు చెల్లించాడు” అని చెప్పాడు. బెజెకు పరిపాలకుని యూదా మనుష్యులు యెరూషలేముకు తీసుకొని వెళ్లారు. అతడు అక్కడ మరణించాడు.

యూదావారు యెరూషలేము మీద యుద్ధం చేసి దానిని పట్టుకొన్నారు. యెరూషలేము ప్రజలను చంపేందుకు యూదావారు వారి ఖడ్గాలు ఉపయోగించారు. తర్వాత వారు పట్టణాన్ని కల్చేశారు. ఆ తర్వాత యూదావారు మరికొంత మంది కనానీయులతో యుద్ధం చేయటానికి వెళ్లారు. నెగెవులోని కొండ దేశంలోను, పశ్చిమ కొండ చరియల్లోను ఆ కనానీయులు నివసించారు.

10 తర్వాత హెబ్రోను పట్టణంలో నివసించిన కనానీయులతో యుద్ధం చేసేందుకు యూదావారు వెళ్లారు. (హెబ్రోను కిర్యతర్బా అని పిలువబడేది.) షేషయి, అహీమాను, తల్మయి[b] అనే వారిని యూదావారు ఓడించారు.

కాలేబు, అతని కుమార్తె

11 యూదా వారు ఆ చోటు విడిచిపెట్టేశారు. దెబీరులో ఉన్న ప్రజలతో యుద్ధం చేయటానికి వారు దెబీరు పట్టణం వెళ్లారు. (గతంలో దెబీరు కిర్యత్సేఫెరు అని పిలువబడింది). 12 యూదావారు యుద్ధం ప్రారంభించక ముందు, ఆ మనుష్యులకు కాలేబు ఒక వాగ్దానం చేసాడు, “కిర్యత్సేఫెరు మీద దాడిచేయాలని నేను కోరుతున్నాను. ఆ పట్టణాన్ని ముట్టడించి, దానిని పట్టుకొనేవాడికి నేను నా కుమార్తె అక్సాను ఇస్తాను. అతనిని నా కుమార్తెను వివాహం చేసుకోనిస్తాను” అని చెప్పాడు కాలేబు.

13 కాలేబుకు కనజు అనే పేరుగల చిన్న తమ్ముడు ఉన్నాడు. కనజుకు ఒత్నీయేలు అను పేరుగల ఒక కుమారుడు ఉన్నాడు. కిర్యత్సేఫెరు పట్టణాన్ని ఒత్నీయేలు పట్టుకున్నాడు. అందుచేత ఒత్నీయేలుకు భార్యగా ఉండేందుకు కాలేబు తన కుమార్తె అక్సాను అతనికి ఇచ్చాడు.

14 అక్సా ఒత్నీయేలుతో కాపురానికి వెళ్లింది. తన తండ్రిని కొంత భూమి అడగమని అక్సాతో చెప్పాడు ఒత్నీయేలు. అక్సా తన తండ్రి దగ్గరకు వెళ్లింది. ఆమె తన గాడిద మీదనుండి దిగగానే, “నీకేం కావాలి?” అని కాలేబు ఆమెను అడిగాడు.

15 అక్సా జవాబిచ్చింది: “నాకు ఒక ఆశీర్వాదం ఇవ్వుము. నీవు నాకు నెగెవులో ఎండిపోయిన ఎడారి భూమి ఇచ్చావు. దయచేసి నీళ్లుగల భూమి నాకు కొంత ఇవ్వుము.” కనుక ఆమె కోరినట్టు కాలేబు ఆమెకు ఇచ్చాడు. అప్పుడు ఎగువ, దిగువ నీటి మడుగులను కాలేబు ఆమెకు ఇచ్చాడు.

16 కెనెతీ ప్రజలు అంజూరపు చెట్ల పట్టణం (యెరికో) విడిచి, యూదా ప్రజలతో వెళ్ళారు. వారు యూదా అరణ్యంలోని ప్రజలతో కలిసి జీవించటానికి అక్కడికే వెళ్లారు. అది అరాదు పట్టణానికి సమీపంగానే నెగెవులో ఉంది. (కెనెతీ ప్రజలు మోషే మామగారి కుటుంబానికి చెందినవారు).

17 కనానీ ప్రజలు కొందరు జెఫతు పట్టణంలో నివసించారు. కనుక యూదావారు, షిమ్యోను వంశం వారు ఆ కనానీయుల మీద దాడిచేశారు. ఆ పట్టణాన్ని వారు పూర్తిగా ధ్వంసం చేశారు. అందుచేత వారు ఆ పట్టణానికి హోర్మా[c] అని పేరు పెట్టారు.

18 యూదావారు గాజా పట్టణాన్ని, దాని చుట్టూరా ఉన్న చిన్న పట్టణాలను పట్టుకొన్నారు. అష్కెలోను, ఎక్రోను పట్టణాలను, వాటి చుట్టూరా ఉన్న చిన్న పట్టణాలను కూడా యూదావారు పట్టుకొన్నారు.

19 యూదావారు యుద్ధం చేసినప్పుడు యెహోవా వారి పక్షంగా ఉన్నాడు. కొండ దేశంలోని భూమిని వారు స్వాధీనం చేసుకున్నారు. కానీ లోయల్లో ఉన్న ప్రజల వద్ద ఇనుప రథాలు ఉండటం చేత ఆ భూమిని యూదావారు తీసుకోలేక పోయారు.

20 హెబ్రోను దగ్గర ఉన్న భూమిని కాలేబుకు ఇస్తానని మోషే వాగ్దానం చేసాడు. కనుక ఆ భూమి కాలేబు కుటుంబానికి ఇవ్వబడినది. కాలేబు మనుష్యులు అనాకు యొక్క ముగ్గురు కుమారులను ఆ చోటు నుండి బలవంతంగా వెళ్లగొట్టారు.

21 బెన్యామీను వంశపు వారు యెరూషలేము నుండి యెబూసీ ప్రజలను వెళ్లగొట్టలేకపోయారు. కనుక నేటికీ బెన్యామీను ప్రజలతో బాటు యెబూసీ ప్రజలు కూడా యెరూషలేములో నివసిస్తున్నారు.

యోసేపు మనుష్యులు బేతేలును పట్టుకోవటం

22-23 యోసేపు వంశం వారు బేతేలు పట్టణం మీద యుద్ధానికి వెళ్లారు. (పూర్వం బేతేలు లూజు అని పిలువబడింది.) యోసేపు వంశం వారి పక్షంగా యెహోవా ఉన్నాడు. యోసేపు వంశం వారు బేతేలు పట్టణానికి కొందరు గూఢాచారులను పంపించారు. (వీళ్లు బేతేలు పట్టణాన్ని ఓడించే మార్గాల కోసం వెదికారు). 24 గూఢచారులు బేతేలు పట్టణాన్ని గమనించి చూస్తూండగా ఆ పట్టణంలో నుండి ఒక మనిషి బయటకు రావటం వారు చూశారు. ఆ గూఢచారులు, “పట్టణంలోనికి ఒక రహస్య మార్గం మాకు చూపించు. మేము పట్టణం మీద దాడి చేస్తాము. కానీ నీవు మాకు సహాయం చేస్తే, మేము నీకు హాని చేయము” అని అతనితో చెప్పారు.

25 ఆ మనిషి పట్టణంలోనికిగల రహస్య మార్గాన్ని గూఢాచారులకు చూపించాడు. యోసేపు వంశస్థులు బేతేలు ప్రజలను చంపటానికి వారి ఖడ్గాలు ప్రయోగించారు. కానీ వారికి సహాయం చేసిన మనిషికి వారు హాని చేయలేదు. అతని కుటుంబం వారికి కూడ వారు హాని చేయలేదు. అతడు, అతని కుటుంబం స్వేచ్ఛగా వెళ్లనివ్వబడ్డారు. 26 అతడు హిత్తీ ప్రజలు నివసించే దేశానికి వెళ్లి, ఒక పట్టణం నిర్మించాడు. ఆ పట్టణానికి లూజు అని అతడు పేరు పెట్టాడు. ఆ పట్టణం నేటికీ లూజు అని పిలువ బడుతూవుంది.

మిగిలిన వంశాలు కనానీయులతో పోరాడటం

27 బేత్షెయానును, తయినాకు, దోరు, ఇబ్లెయామును, మెగిద్దో పట్టణాల్లో, ఆ పట్టణాల చుట్టుపక్కల ఉన్న చిన్న పట్టణాల్లో కనానీ ప్రజలు నివసిస్తున్నారు. మనష్షే వంశం వారు ఆ ప్రజలను ఆ పట్టణాల నుండి వెళ్లగొట్టలేకపోయారు. అందుచేత కనానీయులు ఉండిపోయారు. వారు తమ గృహాలు విడిచిపెట్టేందుకు నిరాకరించారు. 28 తర్వాత ఇశ్రాయేలు ప్రజలు బలవంతులై కనానీ ప్రజలను తమకు బానిసలుగా చేసుకున్నారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు కనాను ప్రజలందరినీ వారి దేశంనుండి వెళ్లగొట్టలేకపోయారు.

29 (ఎఫ్రాయిము వంశం వారి విషయం కూడ అలాగే జరిగింది.) గెజెరులో కనానీ ప్రజలు నివసిస్తున్నారు. ఎఫ్రాయిము వంశస్తులు ఆ కనాను ప్రజలందరినీ వారి దేశం నుండి వెళ్లగొట్టలేదు. కనుక ఎఫ్రాయిము ప్రజలతోబాటు కనాను ప్రజలు కూడ గెజెరులో నివసించటం కొనసాగించారు.

30 జెబూలూను వంశం వారి విషయంలో కూడ అలాగే జరిగింది. కిత్రోను, నహలోలు పట్టణాల్లో కొందరు కనానీయులు నివసించారు. జెబూలూను ప్రజలు ఆ మనుష్యులను వారి దేశం నుండి వెళ్లగొట్టలేదు. ఆ కనానీయులు ఉండిపోయి, జెబూలూను వారితో నివసించారు. కానీ జెబూలూను వారు ఆ ప్రజలను తమకు బానిసలుగా పని చేయించుకొన్నారు.

31 (ఆషేరు వంశం వారి విషయంలో కూడా అలాగే జరిగింది.) అక్కో, సీదోను, అహ్లాబు, అక్జీబు, హెల్బా, అఫెకు, రెహోబు పట్టణాలనుండి ఇతర మనుష్యులను ఆషేరువారు వెళ్లగొట్టలేదు 32 ఆషేరువారు కనాను ప్రజలను వారి దేశం నుండి వెళ్లగొట్టలేదు. కనుక ఆ కనానీయులు ఆషేరు ప్రజలతో కలిసి జీవించటం కొనసాగించారు.

33 (నఫ్తాలి వంశం వారి విషయంలో కూడా ఇలాగే జరిగింది). బేత్షెమెషు, బేతనాతు పట్టణాలలోని ప్రజలను నఫ్తాలీ ప్రజలు వెళ్లగొట్టలేదు. కనుక నఫ్తాలి ప్రజలు ఇతరులతో కలసి ఆ పట్టణాలలోనే నివసించటం కొనసాగించారు. ఆ కనానీ ప్రజలు నఫ్తాలీ వారికి బానిసలుగా పని చేసారు.

34 అమోరీయులు, దాను వంశం వారిని కొండ దేశంలో నివసించేట్టుగా బలవంతం చేసారు. దాను ప్రజలు లోయలలో నివసించేందుకు అమోరీ ప్రజలు రానివ్వ లేదు. కనుక దాను వారు కొండలలోనే ఉండిపోవాల్సి వచ్చింది. 35 అమోరీయులు అయ్యాలోను, హెరెసు కొండలోను, షయల్బీములోను నివసించేందుకు తీర్మానించుకున్నారు. తరువాత యోసేపువంశం బలమైనదిగా పెరిగింది. అప్పుడు వారు అమోరీయులను తమకు బానిసలుగా పని చేయించుకున్నారు. 36 అమోరీయుల దేశం తేలు కనుమనుండి హస్సెలా వరకు, ఆ పైన హస్సెలాకు అవతల కొండ దేశంలోనికీ విస్తరించింది.

అపొస్తలుల కార్యములు 5

అననీయ మరియు సప్పీరా

“అననీయ” అనబడే ఒక వ్యక్తి, అతని భార్య “సప్పీరా” కలిసి తమ భూమి అమ్మేసారు. “అననీయ” తన కొరకు కొంత డబ్బు దాచుకొన్నాడు. ఈ విషయం అతని భార్యకు తెలుసు. “అననీయ” మిగతా డబ్బు తెచ్చి అపొస్తలుల కాళ్ళ ముందుంచాడు.

అప్పుడు పేతురు ఈ విధంగా అన్నాడు: “అననీయా, నీ మనస్సులో సాతాను ఎందుకు చేరాడు? భూమి అమ్మగా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని దాచి పవిత్రాత్మను ఎందుకు మోసం చేసావు? అది అమ్మక ముందు కూడా నీదే కదా! అమ్మిన తర్వాత కూడా ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! ఇలా చెయ్యటానికి నీకెట్లా బుద్ధి పుట్టింది? నీవు మనుష్యులతో కాదు అబద్ధం ఆడింది, దేవునితో.”

ఈ మాటలు విని అననీయ క్రింద పడి ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటనని విన్నవాళ్ళందరికీ ఒక పెద్ద భయం పట్టుకుంది. కొందరు యువకులు ముందుకొచ్చి అననీయ దేహాన్ని ఒక వస్త్రంలో చుట్టి మోసుకెళ్ళి సమాధి చేసారు.

మూడు గంటల తర్వాత అననీయ భార్య అక్కడికి వచ్చింది. అక్కడ జరిగిందేదీ ఆమెకు తెలియదు. పేతురు, “మీరు భూమి అమ్మగా లభించిన డబ్బు యింతేనా? చెప్పు!” అని ఆమెను అడిగాడు.

“ఔను! అంతే డబ్బు లభించింది” అని ఆమె సమాధానం చెప్పింది.

పేతురు ఆమెతో, “నీవు, నీ భర్త కలిసి ప్రభువు ఆత్మను పరీక్షించాలని ఎందుకు నిశ్చయించుకున్నారు? ఆ తలుపు దగ్గరనుండి వస్తున్న అడుగుల చప్పుడు విను! అవి నీ భర్తను సమాధి చేసినవాళ్ళవి. వాళ్ళు నిన్ను కూడా మోసుకు వెళ్తారు” అని అన్నాడు. 10 తక్షణమే ఆమె అతని పాదాలముందు పడి ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత యువకులు లోపలికి వచ్చి ఆమె చనిపోయి ఉండటం చూసి ఆమెను కూడా మోసుకు వెళ్ళి ఆమె భర్త ప్రక్కన సమాధి చేసారు. 11 సంఘానికి, ఈ సంఘటనలు విన్నవాళ్ళకు పెద్ద భయం పట్టుకుంది.

అనేకులను నయం చేయటం

12 అపొస్తలులు, విశ్వాసులు ఉమ్మడిగా సొలొమోను మండపంలో సమావేశమౌతూ ఉండేవాళ్ళు. వీళ్ళు ప్రజల్లో ఎన్నో అద్భుతాలు, మహత్యాలు చేసారు. 13 ప్రజలు అపొస్తలుల్ని పొగుడుతూ ఉన్నప్పటికీ మిగతావాళ్ళు వాళ్ళతో చేరడానికి తెగించలేదు. 14 చాలా మంది స్త్రీలు, పురుషులు ప్రభువును విశ్వసించారు. ప్రభువు వాళ్ళను సంఘంలో చేర్చాడు. 15 ఇవి చూసిన ప్రజలు జబ్బుతో ఉన్నవాళ్ళను దారి మీదికి తెచ్చి పరుపుల మీద చాపల మీద పడుకోబెట్టారు. పేతురు ఆ దారి మీదుగా నడిచినప్పుడు అతని నీడ కొందరి మీదనన్నా పడుతుందని వాళ్ళ ఉద్దేశ్యం. 16 ప్రజలు యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాంతాలనుండి గుంపులు గుంపులుగా వచ్చారు. తమలో జబ్బుతో ఉన్నవాళ్ళను, దయ్యాలు పట్టి బాధపడ్తున్నవాళ్ళను తీసుకు వచ్చారు. వాళ్ళందరికీ నయమైపోయింది.

అపొస్తలులు హింసించబడటం

17 సద్దూకయ్యుల తెగకు చెందిన ప్రధాన యాజకుడు, అతనితో ఉన్నవాళ్ళు అసూయతో నిండిపోయారు. 18 వాళ్ళు అపొస్తలులను బంధించి కారాగారంలో వేసారు. 19 కాని రాత్రివేళ దేవదూత కారాగారపు తలుపులు తీసి వాళ్ళను బయటికి పిలుచుకు వచ్చాడు. 20 వాళ్ళతో, “వెళ్ళి మందిర ఆవరణంలో నిలుచొని ఈ క్రొత్త జీవితాన్ని గురించి విశదంగా ప్రజలకు చెప్పండి” అని చెప్పాడు. 21 దేవదూత చెప్పినట్లు విని వాళ్ళు తెల్లవారుతుండగా మందిరం యొక్క ఆవరణంలో ప్రవేశించి ప్రజలకు బోధించటం మొదలు పెట్టారు.

ప్రధాన యాజకుడు, అతనితో ఉన్నవాళ్ళు ఇశ్రాయేలు ప్రజల పెద్దలందర్ని సమావేశపరిచి మహాసభను ఏర్పాటు చేసారు. ఆ తర్వాత అపొస్తలులను పిలుచుకు రమ్మని కొందర్ని కారాగారానికి పంపారు. 22-23 భటులు కారాగారానికి వచ్చారు. కాని వాళ్ళకు అపొస్తలులు కనపడలేదు. వాళ్ళు తిరిగి వెళ్ళి, “మేము కారాగారపు ద్వారాలు భద్రంగా తాళం వేయబడి ఉండటం చూసాము. ద్వారపాలకులు ద్వారాల దగ్గర ఉండటం చూసాము. కాని ద్వారాలు తెరిచి చూస్తే అపొస్తలులు లేరు” అని చెప్పారు. 24 ఈ సంగతి విని మందిరం యొక్క ద్వారపాలకుల అధిపతి, ప్రధాన యాజకులు వాళ్ళు ఏమై ఉంటారా? అని ఆశ్చర్యపడ్డారు.

25 ఇంతలో ఒకడు వచ్చి, “మీరు కారాగారంలో ఉంచినవాళ్ళు మందిరం యొక్క ఆవరణంలో నిలబడి ప్రజలకు బోధిస్తున్నారు” అని చెప్పాడు. 26 ఇది విని ద్వారపాలకుల అధిపతి భటులను వెంట తీసుకొని వాళ్ళను పట్టుకు రావటానికి వెళ్ళాడు. ప్రజలు తమను రాళ్ళతో కొడతారనే భయం వాళ్ళలో ఉంది. కనుక అపొస్తలులపై వాళ్ళు ఏ దౌర్జన్యం చేయలేదు.

27 అపొస్తలుల్ని పిలుచుకు వచ్చి మహాసభ ముందు నిలుచోబెట్టారు. ప్రధాన యాజకుడు విచారణ చేస్తూ, 28 “మీ యేసు పేరిట బోధించవద్దని మేము యిది వరకే ఖచ్చితంగా ఆజ్ఞాపించాము. అయినా యెరూషలేమంతా మీ బోధలతో నింపివేసారు. అంతేకాక అతని మరణాన్ని మాపై మోపాలని చూస్తున్నారు” అని అన్నాడు.

29 పేతురు, మిగతా అపొస్తలులు యిలా అన్నారు: “మేము దేవుని ఆజ్ఞల్ని పాటిస్తున్నాము, మానవుల ఆజ్ఞల్ని కాదు. 30 మీరు సిలువకు వ్రేలాడదీసి చంపిన యేసును మా పూర్వికుల దేవుడు బ్రతికించాడు. 31 దేవుడు ఆయనకు తన కుడి వైపుననున్న స్థానాన్నిచ్చాడు. ఆయన్ని ఒక అధిపతిగా, రక్షకుడిగా నియమించాడు. తద్వారా ఇశ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపం పొందే అవకాశము, తమ పాపాలకు క్షమాపణ పొందే అవకాశము కలగాలని ఆయన ఉద్దేశ్యం. 32 వీటికి మేము సాక్షులము. దేవుడు తన ఆజ్ఞల్ని పాటించిన వాళ్ళకిచ్చిన పవిత్రాత్మ కూడా దీనికి సాక్షి.”

33 ఇది విని వాళ్ళకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు అపొస్తలులను చంపాలనుకున్నారు. 34 కాని “గమలీయేలు” అనే పరిసయ్యుడు ఆ మహాసభలో లేచి నిలుచొని అపొస్తలుల్ని కొంతసేపు అవతలకు తీసుకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. గమలీయేలు ధర్మశాస్త్ర పండితుడు. ప్రజల గౌరవం పొందినవాడు. 35 అతడు వాళ్ళని సంబోధిస్తూ, “ఇశ్రాయేలు ప్రజలారా! వీళ్ళను ఏమి చెయ్యాలో జాగ్రత్తగా ఆలోచించండి! 36 ఇదివరలో థూదా కనిపించి తానొక గొప్పవాణ్ణని చెప్పుకున్నాడు. సుమారు నాలుగువందలమంది అతణ్ణి అనుసరించారు. అతడు చంపబడ్డాడు. ఆ తర్వాత అతని అనుచరులు చెదిరిపోయారు. చివరకు ఏమీ మిగల్లేదు. 37 అతని తర్వాత జనాభా లెక్కల కాలంలో యూదా అనే వాడు వచ్చి ప్రజల్ని చేరదీసి తిరుగుబాటు చేసాడు. ఇతడు గలిలయవాడు. ఇతడు కూడా చంపబడ్డాడు. అతని అనుచరులందరూ చెదిరిపోయారు. 38 అందువల్ల వాళ్ళ విషయంలో నా సలహా ఇది: వాళ్ళ విషయం పట్టించుకోకండి! వాళ్ళను వదిలివేయండి! వాళ్ళ కార్యము, వాళ్ళ ఉద్దేశ్యము మానవుడు సృష్టించినదైతే అది నశిస్తుంది. 39 అలా కాకుండా అది దైవేచ్ఛ వలన అయితే మీరు వాళ్ళను ఆపలేరు. అలా చేస్తే మీరు దేవునికి ఎదురు తిరిగిన వాళ్ళౌతారు” అని అన్నాడు.

40 సభ్యులు అతడు చెప్పినట్లు విన్నారు. అపొస్తలుల్ని పిలిపించి కొరడా దెబ్బలు కొట్టించారు. ఆ తర్వాత, యేసు పేరిట మాట్లాడవద్దని వారించి వదిలి వేసారు. 41 అపొస్తలులు యేసు కోసం అవమానింపబడటానికి తాము అర్హులైనందుకు సంతోషిస్తూ మహాసభనుండి వెళ్ళిపోయారు. 42 ప్రతి రోజూ మందిరంలో, ఇంటింటా “యేసే క్రీస్తు” అని ప్రకటించారు. ఈ సువార్త ప్రకటించటం మానుకోలేదు.

యిర్మీయా 14

అనావృష్టి కపట ప్రవక్తలు

14 అనావృష్టి విషయమై ఇది యిర్మీయాకు యెహోవా పంపిన వర్తమానం:

“యూదా రాజ్యం చనిపోయిన వారికొరకు రోధిస్తుంది.
    యూదా నగరాల ప్రజలు నానాటికీ బలహీనమౌతారు.
    వారు నేలమీద పడతారు.
యెరూషలేము నుండి ఒక రోదన దేవుని వద్దకు వెళుతుంది.
ప్రజా నాయకులు వారి సేవకులను నీటికొరకు పంపుతారు.
సేవకులు జలాశయాల వద్దకు వెళతారు.
    కాని వారికి నీరు దొరకదు.
సేవకులు ఖాళీ కూజాలతో తిరిగి వస్తారు.
    దానితో వారు సిగ్గుపడి, కలత చెందుతారు.
    అవమానంతో వారి తలలు బట్టతో కప్పుకుంటారు.
ఒక్కడు కూడా భూమిని దున్ని సాగుచేయడు
    రాజ్యంలో వర్షం కురియదు.
రైతులు నిరాశతో క్రుంగి పోతారు.
    వారు సిగ్గుతో తమ ముఖాలు కప్పుకుంటారు.
పొలంలో ఈనిన దుప్పి సహితం తన పిల్లను వదిలిపోతుంది.
    పచ్చిక దొరకని కారణంగా అది అలా చేస్తుంది.
అడవి గాడిదలు వట్టి కొండలపైన నిలబడతాయి.
    గుంటనక్కల్లా అవి గాలిని వాసన చూస్తాయి.
వాటి కంటికి ఆహారమే కన్పించదు.
    ఎందువల్లనంటే వాటికి తినటానికి ఎక్కడా మొక్కలు లేవు.

“నా ప్రజలిలా నాకు మొరపెట్టుకుంటారు: జరిగిన విషయాలన్నిటికీ మా తప్పులే కారణమని మాకు తెలుసు.
    మా పాపాల ఫలంగా మేమిప్పుడు కష్టాలనుభవిస్తున్నాము.
    యెహోవా, నీ నామ ఘనత కొరకు ఏదో ఒకటి చేసి మాకు సహాయపడుము.
నిన్ను అనేక సార్లు మేము వదిలిపెట్టినట్లు మేము ఒప్పుకుంటున్నాము.
    నీ పట్ల మేము పాపం చేశాము.
ఓ దేవా! ఇశ్రాయేలుకు నీవు ఆశాజ్యోతివి!
    కష్ట కాలంలో ఇశ్రాయేలును ఆదుకొనేవాడవు నీవే.
అయినా ఇప్పుడి దేశంలో పరాయి వానిలా ప్రవర్తిస్తున్నావు.
    ఒక్కరాత్రి ఉండిపోయే బాటసారిలా ఉన్నావు.
ఆకస్మికంగా దాడి చేయబడిన వ్యక్తిలా ఉన్నావు.
    ఎవ్వరినీ రక్షించలేని అశక్తుడైన సైనికునిలా ఉన్నావు.
అయినా నీవు మాతో ఉన్నావు.
    యెహోవా, నీ పేరుతో మేము పిలువబడుతూ ఉన్నాము. మమ్మల్ని నిస్సహాయులుగా వదిలి పెట్టవద్దు!”

10 యూదా ప్రజల విషయంలో యెహోవా ఇలా చెపుతున్నాడు: “యూదా ప్రజలు నన్ను వదిలి పెట్టటానికి ఇష్టపడ్తారు. వారు నన్ను వదిలి వెళ్లటంలో ఏమాత్రం వెనుకాడరు. కనుక ఇప్పుడు నేను వారిని అంగీకరించను. వారు చెసిన దుష్టకార్యాలను నేను గుర్తు పెట్టుకుంటాను. వారి పాపాలకు నేను వారిని శిక్షిస్తాను.”

11 పిమ్మట యెహోవా నాతో ఇలా అన్నాడు: “యిర్మీయా, యూదా ప్రజలకు శుభం కలగాలని ప్రార్థన చేయవద్దు. 12 యూదా ప్రజలు ఉపవాసాలు మొదలుపెట్టి నన్ను ప్రార్థించవచ్చు. కాని నేను వారి ప్రార్థనలు వినను. వారు నాకు దహనబలులు అర్పించినా, ధాన్యార్పణలు సమర్పించినా ఆ ప్రజలను నేను అంగీకరించను. యుద్ధం ద్వారా యూదా వారిని నేను నాశనం చేస్తాను. వారి ఆహార ధాన్యాలను తీసుకుంటాను. వారు ఆకలితో అలమటిస్తారు. పైగా వారిని భయంకర వ్యాధులకు గురి చేసి నాశనం చేస్తాను.”

13 కాని నేను యెహోవాతో ఇలా అన్నాను: “నా ప్రభువా, ప్రజలకు ప్రవక్తలు వేరొక రకంగా చెపు తున్నారు. ప్రజలు శత్రువు కత్తికి గురికావలసిన గతి పట్టదనీ, వారికి కరువు రాదనీ, యెహోవా ఈ రాజ్యంలోనే వారికి సుఖశాంతులు కలుగజేస్తాడనీ ప్రవక్తలు చెపుతున్నారు.”

14 అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు: “యిర్మీయా, ఆ ప్రవక్తలు నా పేరుతో అబద్దాలు బోధిస్తున్నారు. ఆ ప్రవక్తలను నేను పంపలేదు. నేను వారికి ఆజ్ఞ ఇవ్వలేదు. వారితో నేను మాట్లాడలేదు. ఆ ప్రవక్తలు బోధించేదంతా అబద్ధపు దర్శనాలు. వట్టి కనికట్టు. అది వారి స్వంత కల్పన. 15 అందువలన నా పేరుతో భవిష్యత్తును చెప్పే ప్రవక్తల విషయంలో నేను చెప్పేదేమంటే వారిని నేను పంపలేదు. ఆ ప్రవక్తలు ‘కత్తిపట్టిన శత్రువెవ్వడూ ఈ రాజ్యంమీదికి రాడు. ఈ రాజ్యంలో కరువనేది ఉండదు,’ అని కదా చెప్పారు. చూడుము; ఆ ప్రవక్తలే ఆకలితో మాడి చస్తారు. శత్రువు కత్తికి బలియైపోతారు. 16 ఆ ప్రవక్తలు ఏ ప్రజలతో మాట్లాడినారో, వారు వీధిలోనికి లాగబడతారు. ఆ ప్రజలు ఆకలితో చనిపోతారు. శత్రువుల కత్తి వారిని నరికివేస్తుంది. వారిని గాని, వారి భార్యలను గాని, వారి కుమారులను లేక కుమార్తెలను గాని పాతి పెట్టటానికి ఒక్కడుకూడా మిగలడు! నేను వారిని శిక్షిస్తాను.

17 “యిర్మీయా, యూదా ప్రజలకు
    ఈ వర్తమానం అందజేయి.
‘నా కండ్లు కన్నీళ్ళతో నిండాయి. రాత్రింబవళ్లు నేను ఎల్లప్పుడూ విలపిస్తాను.
కన్యయగు నా కుమార్తె[a] కొరకు విలపిస్తాను. నా ప్రజలకొరకు నేను దుఃఖిస్తాను.
    ఎందువల్లనంటే అన్యుడొకడు వారిని గాయపర్చినాడు; వారిని అణగద్రొక్కినాడు.
    వారు తీవ్రంగా గాయపర్చబడినారు.
18 నేను పల్లెపట్టులకు వెళితే,
    కత్తులతో సంహరింపబడినవారిని చూస్తాను.
నేను నగరానికి వెళితే
    అక్కడ నేను తిండి లేక రోగగ్రస్థులైన వారిని చూస్తాను.
యాజకులు, ప్రవక్తలు వారెరుగని అన్యదేశానికి కొనిపోబడ్డారు.’”

19 యోహోవా, యూదా రాజ్యాన్ని నీవు పూర్తిగా విడనాడావా?
    యెహోవా, సీయోనును నీవు ప్రేమించడం లేదా?
నీవు మమ్ములను గాయపర్చిన రీతి చూస్తే, మేము తిరిగి కోలుకొనలేమనిపిస్తున్నది.
    నీవు ఆ పని ఎందుకు చేశావు?
మేము శాంతిని కోరుకుంటున్నాము.
    కాని దాని వల్ల ఏమీ మంచి జరుగలేదు.
మేము స్వస్థపడే సమయం కొరకు ఎదురుచూశాము;
    కాని భయము పుట్టుచున్నది.
20 యెహోవా, మేము చాలా దుర్మార్గులమని మాకు తెలుసు.
    మా పూర్వీకులు చెడుపనులు చేసినట్లు మాకు తెలుసు.
    అవును. మేము నీ పట్ల పాపం చేశాము.
21 యెహోవా, ఉన్నతమైన నీ నామము కొరకైనా మమ్మల్ని త్రోసివేయవద్దు!
    దివ్యమైన నీ సింహాసనపు గౌరవాన్ని తగ్గించవద్దు.
మాతో నీవు చేసిన ఒడంబడికను గుర్తుంచుకోవాలి.
    ఆ నిబంధనను మరువవద్దు.
22 అన్య దేవతల విగ్రహాలకు వర్షం కురిపించే శక్తిలేదు.
    ఆకాశానికి వర్షాలను పంపే ప్రభావము లేదు.
నీవే మాకు దిక్కు
    నీవే ఈ కార్యములన్నీ జరిపించేది.

మత్తయి 28

యేసు బ్రతికి రావటం

(మార్కు 16:1-8; లూకా 24:1-12; యోహాను 20:1-10)

28 విశ్రాంతి రోజు గడిచింది. ఆదివారం సూర్యోదయమవుతుండగా మగ్దలేనే మరియ, యింకొక మరియ సమాధిని చూడటానికి వెళ్ళారు.

అప్పుడు ఒక భూకంపం వచ్చింది. పరలోకం నుండి ప్రభువు దూత వచ్చి ఆ సమాధి దగ్గరకు వెళ్ళాడు. ఆ రాతిని దొర్లించి దాని మీద కూర్చొన్నాడు. ఆ రూపం మెరుపులా ఉంది. అతని దుస్తులు మంచువలె తెల్లగా ఉన్నాయి. సమాధిని కాపలా కాస్తున్న భటులు అతన్ని చూసి భయపడి వణికిపోయి, చనిపోయిన వాళ్ళలా అయ్యారు.

ఆ దేవదూత, స్త్రీలతో ఈ విధంగా అన్నాడు: “భయపడకండి, సిలువకు వేయబడిన యేసు కోసం మీరు చూస్తున్నారని నాకు తెలుసు. ఆయనిక్కడ లేడు. ఆయన తాను చెప్పినట్లు బ్రతికి వచ్చాడు. ఆయన్ని పడుకోబెట్టిన స్థలాన్ని చూడండి. ఆ తదుపరి వెంటేనే వెళ్ళి ఆయన శిష్యులతో, ‘ఆయన బ్రతికి వచ్చాడు. మీకన్నా ముందే గలిలయకు వెళ్ళబోతున్నాడు. మీరు ఆయన్ని అక్కడ కలుసుకొంటారు’ అని చెప్పండి. నేను చెప్పవలసింది చెప్పాను.”

ఆ స్త్రీలు ఆయన శిష్యులకు చెప్పాలని సమాధి దగ్గరనుండి భయంతో, ఆనందంతో పరుగెత్తికొంటూ వెళ్ళారు. యేసు వాళ్ళను కలుసుకొని, “శుభం!” అని అన్నాడు. వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళపైబడి ఆయనకు మ్రొక్కారు. 10 అప్పుడు యేసు వాళ్ళతో, “భయపడకండి. వెళ్ళి నా సోదరులతో గలిలయకు వెళ్ళమని చెప్పండి. వాళ్ళు అక్కడ నన్ను కలుసుకొంటారు” అని అన్నాడు.

ప్రధాన యాజకులు భటుల్నిఅబద్దమాడమని కోరటం

11 ఆ స్త్రీలు వెళ్ళిపొయ్యారు. అదే సమయంలో కొంతమంది భటులు పట్టణంలోకి వెళ్ళి జరిగినదంతా ప్రధాన యాజకులతో చెప్పారు. 12 ప్రధాన యాజకులు పెద్దల్ని కలుసుకొని ఒక కుట్ర పన్నారు. వాళ్ళు భటులకు పెద్ద మొత్తాలిస్తూ వాళ్ళతో, 13 “అతని శిష్యులు, ‘మేము రాత్రి వేళ నిద్రిస్తుండగా వచ్చి అతని దేహాన్ని దొంగిలించుకు పొయ్యారు’ అని చెప్పండి. 14 ఈ వార్త రాష్ట్రపాలుకునిదాకా వెళ్తే అతణ్ణి శాంత పరచి మీకు కష్టం కలుగకుండా మేము చూస్తాము” అని అన్నారు. 15 భటులు డబ్బు తీసుకొని వాళ్ళు చెప్పినట్లు చేసారు. ఈ కథ బాగా వ్యాపించి ఈ నాటికి వాడుకలో ఉంది.

యేసు తన శిష్యులతో మాట్లాడటం

(మార్కు 16:14-18; లూకా 24:36-49; యోహాను 20:19-23; అపొ. కా. 1:6-8)

16 ఆ తర్వాత ఆ పదకొండుగురు శిష్యులు గలిలయకు వెళ్ళి, యేసు చెప్పిన కొండ మీదికి వెళ్ళారు. 17 అక్కడ యేసును చూసి ఆయన ముందు సాష్టాంగ పడ్డారు. కాని వాళ్ళలో కొందరు సందేహించారు 18 అప్పుడు యేసు వాళ్ళ దగ్గరకు వచ్చి, “పరలోకంలో, భూమ్మీదా ఉన్న అధికారమంతా దేవుడు నాకిచ్చాడు. 19 అందువల్ల అన్ని దేశాలకు వెళ్ళి, వాళ్ళను శిష్యులుగా చెయ్యండి. తండ్రి పేరిట, కుమారుని పేరిట, పవిత్రాత్మ పేరిట వాళ్ళకు బాప్తిస్మము యివ్వండి. 20 నేను మీకాజ్ఞాపించిన వన్నీ వాళ్ళను ఆచరించమని బోధించండి. నేను అన్ని వేళలా ఈ యుగాంతం దాకా మీ వెంట ఉంటాను” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International