M’Cheyne Bible Reading Plan
ఎల్లప్పుడూ దేవున్ని ప్రేమించి, లోబడండి.
6 “నేను మీకు ప్రబోధించాలని మీ యెహోవా దేవుడు నాకు చెప్పిన ఆజ్ఞలు, నియమాలు, ఇవి: మీరు నివసించేందుకు ప్రవేశిస్తున్న దేశంలో ఈ ఆజ్ఞలకు లోబడండి. 2 మీరూ, మీ సంతతివారు బ్రతికినంత కాలం మీ దేవుడైన యెహోవాను గౌరవించాలి. నేను మీకు యిచ్చే ఆయన నియమాలు, ఆజ్ఞలు అన్నింటికీ మీరు విధేయులు కావాలి. మీరు ఇలా చేస్తే, ఆ కొత్త దేశంలో మీరు దీర్ఘకాలం బ్రతుకుతారు. 3 ఇశ్రాయేలు ప్రజలారా, జాగ్రత్తగా వినండి. ఈ ఆజ్ఞలకు విధేయులుగా ఉండండి. అప్పుడు మీకు అంతా శుభం అవుతుంది. మరియు మీరు ఒక గొప్ప రాజ్యం అవుతారు. ఐశ్వర్యవంతమైన ఆ మంచి దేశంలో[a] వీటన్నింటినీ మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసాడు.
4 “ఇశ్రాయేలు ప్రజలారా వినండి: యెహోవా ఒక్కడు మాత్రమే మన దేవుడు. 5 మరియు మీరు మీ నిండు హృదయంతోను, మీ నిండు ఆత్మతోను, మీ నిండు బలంతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. 6 ఈవేళ నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోండి. 7 వాటిని మీ పిల్లలకు నేర్పించేందుకు జాగ్రత్త వహించండి. మీరు మీ యింట్లో కూర్చున్నప్పుడు, మార్గంలో నడుస్తున్నప్పుడు ఈ ఆజ్ఞలను గూర్చి మాట్లాడుతూ ఉండండి. మీరు పడుకొనేప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుతూ ఉండండి. 8 నా ప్రబోధాలను జ్ఞాపకం ఉంచుకొనేందుకు సహాయకరంగా ఈ ఆజ్ఞలను మీ చేతులకు కట్టుకోండి, మీ నొసట బాసికంలా ధరించండి. 9 మీ ఇండ్ల ద్వార బంధాలమీద, గవునుల మీద వాటిని వ్రాయండి.”
10 “మీకు యిస్తానని చెప్పి మీ పూర్వీకులైన అబ్రాహాము ఇస్సాకు, యాకోబులకు ఆయన వాగ్దానం చేసిన ఆ దేశంలోనికి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని తీసుకొనివస్తాడు. అప్పుడు మీరు నిర్మించని గొప్ప, ధనిక పట్టణాలను ఆయన మీకు ఇస్తాడు. 11 మీరు సమకూర్చని మంచి వస్తువులతో నిండిపోయిన గృహాలను ఆయన మీకు ఇస్తాడు. మీరు త్రవ్వని బావులను యెహోవా మీకు ఇస్తాడు. మీరు నాటని ద్రాక్షాతోటలను, ఒలీవ చెట్లను యెహోవా మీకు ఇస్తాడు. భోజనానికి మీకు సమృద్ధిగా ఉంటుంది.
12 “కానీ జాగ్రత్తగా ఉండండి. మీరు బానిసలుగా జీవించిన ఈజిప్టు దేశంనుండి మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చిన యెహోవాను మరచిపోకండి. 13 మీ దేవుడైన యెహోవాను గౌరవించి ఆయనను మాత్రమే సేవించండి. ఆయన పేరు మీద మాత్రమే ప్రమాణాలు చేయాలి. (బూటకపు దేవుళ్ల పేర్లు ఉపయోగించవద్దు). 14 మీరు యితర దేవుళ్లను అనుసరించకూడదు. మీ చుట్టూ నివసించే ప్రజల దేవుళ్లను మీరు అనుసరించకూడదు. 15 మీ దేవుడైన యెహోవా ఎల్లప్పుడూ మీతో ఉన్నాడు. మరియు మీరు ఆ ఇతర దేవుళ్లను వెంబడిస్తే, యెహోవాకు మీ మీద చాలా కొపం వస్తుంది. మిమ్మల్ని ఈ భూమి మీద ఉండకుండా ఆయన నాశనం చేస్తాడు. ఆయన ప్రజలు ఇతర దేవుళ్లను పూజించటం యెహోవా ద్వేషిస్తాడు.
16 “మస్సాలో మీరు ఆయనను పరీక్షించినట్టుగా మీ దేవుడైన యెహోవాను మీరు పరీక్షించకూడదు. 17 మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలకు మీరు తప్పనిసరిగా విధేయులు కావాలి. ఆయన మీకు ఇచ్చిన ప్రబోధాలు, ఆజ్ఞలు అన్నింటినీ మీరు పాటించాలి. 18 సరైనవి, మంచివి, యెహోవాను సంతోషపెట్టేవి మాత్రమే మీరు చేయాలి. అప్పుడు మీకు అంతా మేలు జరిగి, యెహోవా మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో మీరు ప్రవేశించి, ఆ మంచి దేశాన్ని స్వాధీనం చేసుకోగలుగుతారు. 19 మరియు యెహోవా చెప్పినట్టు మీరు మీ శత్రువులందరినీ బలవంతంగా బయటకు వెళ్లగొడ్తారు.
దేవుడు చేసిన వాటిని పిల్లలకు నేర్పించాలి
20 “భవిష్యత్తులో ‘మన దేవుడైన యెహోవా మనకు ప్రబోధాలు, ఆజ్ఞలు, నియమాలు యిచ్చాడు గదా వాటి అర్థం ఏమిటి?’ అని నీ కుమారుడు నిన్ను అడగవచ్చును. 21 అప్పుడు నీవు నీ కుమారునితో ఇలా చెప్పాలి, ‘మనం ఈజిప్టులో ఫరోకు బానిసలం, అయితే యెహోవా మహా బలంతో ఈజిప్టునుండి మనలను బయటకు తీసుకొని వచ్చాడు. 22 మహాగొప్ప, ఆశ్చర్యకరమైన నిదర్శనాలు, అద్భుతాలు యెహోవా మనకు చూపించాడు. ఈజిప్టు ప్రజలకు, ఫరోకు, ఫరో ఇంటివాళ్లకు ఆయన ఈ సంగతులు జరిగించటం మనం చూశాము. 23 మరియు యెహోవా మన పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశాన్ని మనకు ఇచ్చేందుకు ఆయన మనలను ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చాడు. 24 ఈ ప్రబోధాలన్నీ పాటించాలని యెహోవా మనకు ఆజ్ఞాపించాడు. అప్పుడు, మనం ఇప్పుడు ఉన్నట్టుగా ఎల్లప్పుడూ క్షేమంగా సజీవులంగా ఉండేటట్లు మన దేవుడైన యెహోవా మనలను కాపాడతాడు. 25 మనం పాటించాలని ఆయన మనకు ఆజ్ఞాపించిన ప్రకారం మనం ఆజ్ఞలన్నింటికీ విధేయులం అవటం మనకు మంచిదిగా దేవుడైన యెహోవా చూస్తాడు.’
ఎజ్రాహివాడైన ఏతాను ధ్యానగీతం.
89 యెహోవా ప్రేమను గూర్చి నేను ఎల్లప్పుడూ పాడుతాను.
ఆయన నమ్మకత్వం గూర్చి శాశ్వతంగా, ఎప్పటికీ నేను పాడుతాను!
2 యెహోవా, నీ ప్రేమ శాశ్వతంగా నిలుస్తుందని నేను నిజంగా నమ్ముతాను.
నీ నమ్మకత్వం ఆకాశాలవలె కొనసాగుతుంది!
3 దేవుడు చెప్పాడు, “నేను ఏర్పరచుకొన్న రాజుతో నేను ఒడంబడిక చేసుకొన్నాను.
నా సేవకుడైన దావీదుకు నేను ఒక వాగ్దానం చేసాను.
4 ‘దావీదూ, నీ వంశం శాశ్వతంగా కొనసాగేట్టు నేను చేస్తాను.
నీ రాజ్యాన్ని శాశ్వతంగా ఎప్పటికీ నేను కొనసాగింపజేస్తాను.’”
5 యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి ఆకాశాలు స్తుతిస్తున్నాయి.
పరిశుద్ధుల సమాజం నీ నమ్మకత్వం గూర్చి పాడుతుంది.
6 పరలోకంలో ఎవ్వరూ యెహోవాకు సమానులు కారు.
“దేవుళ్లు” ఎవ్వరూ యెహోవాకు సాటికారు.
7 యెహోవా పరిశుద్ధ దూతలను కలిసినప్పుడు
ఆ దేవ దూతలు భయపడి యెహోవాను గౌరవిస్తారు.
వారు ఆయన పట్ల భయముతో నిలబడుతారు.
8 సర్వశక్తిమంతుడైన యెహోవా, దేవా, నీ అంతటి శక్తిగలవారు ఒక్కరూ లేరు.
మేము నిన్ను పూర్తిగా నమ్మగలము.
9 ఉప్పొంగే మహా సముద్రపు అలలపై నీవు అధికారం చేస్తావు.
దాని కోపపు అలలను నీవు నిమ్మళింప జేయగలవు.
10 దేవా, నీవు రహబును[a] ఓడించావు.
నీ మహా శక్తితో, నీవు నీ శత్రువును ఓడించావు.
11 దేవా, ఆకాశంలోనూ, భూమి మీదనూ ఉన్న సర్వం నీదే.
ప్రపంచాన్నీ, అందులో ఉన్న సర్వాన్నీ నీవు చేశావు.
12 ఉత్తర దక్షిణాలను నీవే సృష్టించావు.
తాబోరు పర్వతం, హెర్మోను పర్వతం నీ నామాన్ని కీర్తిస్తాయి. స్తుతి పాడుతాయి.
13 దేవా, నీకు శక్తి ఉంది!
నీ శక్తి గొప్పది!
విజయం నీదే!
14 సత్యం, న్యాయం మీద నీ రాజ్యం కట్టబడింది.
ప్రేమ, నమ్మకత్వం నీ సింహాసనం ఎదుట సేవకులు.
15 దేవా, నమ్మకమైన నీ అనుచరులు నిజంగా సంతోషంగా ఉన్నారు.
వారు నీ దయ వెలుగులో జీవిస్తారు.
16 నీ నామం వారిని ఎల్లప్పుడూ సంతోష పరుస్తుంది.
వారు నీ మంచితనాన్ని స్తుతిస్తారు.
17 నీవే వారి అద్భుత శక్తివి,
వారి శక్తి నీ నుండే లభిస్తుంది.
18 యెహోవా, నీవే మమ్మల్ని కాపాడేవాడవు.
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు మా రాజు.
19 కనుక నిజమైన నీ అనుచరులతో దర్శనంలో నీవు మాట్లాడావు.
నీవు చెప్పావు: “ప్రజల్లోనుండి నేను ఒక యువకుని ఏర్పాటు చేసికొన్నాను.
ఆ యువకుని నేను ప్రముఖుణ్ణి చేసాను. నేను యుద్ధ వీరునికి శక్తిని అనుగ్రహించాను.
20 నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను.
నా ప్రత్యేక తైలంతో నేను అతన్ని అభిషేకించాను.
21 నా కుడిచేతితో నేను దావీదును బలపరచాను.
మరి నా శక్తితో నేను అతన్ని బలముగల వానిగా చేశాను.
22 ఏర్పాటు చేసికోబడిన రాజును శత్రువు ఓడించలేకపోయాడు.
దుర్మార్గులు అతన్ని ఓడించలేక పోయారు.
23 అతని శత్రువులను నేను అంతం చేసాను.
ఏర్పరచబడిన రాజును ద్వేషించిన వారిని నేను ఓడించాను.
24 ఏర్పరచబడిన రాజును నేను ఎల్లప్పుడూ ప్రేమిస్తాను. బలపరుస్తాను.
నేను ఎల్లప్పుడూ అతన్ని బలవంతునిగా చేస్తాను.
25 ఏర్పరచబడిన నా రాజును సముద్రం మీద నాయకునిగా ఉంచుతాను.
నదులను అతడు అదుపులో ఉంచుతాడు.
26 ‘నీవు నా తండ్రివి నీవు నా దేవుడవు, నా బండవు, నా రక్షకుడవు’
అని అతడు నాతో చెబుతాడు.
27 మరి నేను అతనిని నా ప్రథమ సంతానంగా చేసుకొంటాను.
భూరాజులకంటె అతడు ఉన్నతంగా చేయబడుతాడు.
28 ఏర్పరచబడిన రాజును నా ప్రేమ శాశ్వతంగా కాపాడుతుంది.
అతనితో నా ఒడంబడిక ఎప్పటికీ అంతంకాదు.
29 అతని వంశం శాశ్వతంగా కొనసాగుతుంది.
ఆకాశాలు ఉన్నంతవరకు అతని రాజ్యం కొనసాగుతుంది.
30 అతని సంతతివారు నా ధర్మశాస్త్రాన్ని పాటించటం మానివేస్తే,
నా ఆదేశాలను పాటించటం వారు మానివేస్తే అప్పుడు నేను వారిని శిక్షిస్తాను.
31 ఏర్పరచబడిన రాజు సంతతివారు నా ఆజ్ఞలను ఉల్లంఘించి,
నా ఆదేశాలను పాటించకపోతే
32 అప్పుడు నేను వారిని కఠినంగా శిక్షిస్తాను.
33 కాని వారిపట్ల నా ప్రేమను మాత్రం నేను ఎన్నటికీ తీసివేయలేను.
నేను ఎల్లప్పుడూ వారికి నమ్మకంగా ఉంటాను.
34 దావీదుతో నా ఒడంబడికను నేను ఉల్లంఘించను.
మా ఒడంబడికను నేను మార్చను.
35 నా పరిశుద్ధత మూలంగా, దావీదుకు నేను ఓ ప్రత్యేక వాగ్దానం చేసాను.
మరి నేను దావీదుకు అబద్ధం చెప్పను.
36 దావీదు వంశం శాశ్వతంగా కొనసాగుతుంది.
సూర్యుడు ఉన్నంతవరకు అతని రాజ్యం కొనసాగుతుంది.
37 చంద్రునిలా అది శాశ్వతంగా కొనసాగుతుంది.
ఒడంబడిక సత్యమనేందుకు ఆకాశాలు సాక్ష్యం. ఆ సాక్ష్యం నమ్మదగినది.”
38 కాని దేవా, ఏర్పరచబడిన నీ రాజు[b] మీద నీకు కోపం వచ్చింది.
నీవు అతన్ని ఒంటరివానిగా విడిచి పెట్టావు.
39 నీ ఒడంబడికను నీవు తిరస్కరించావు.
రాజు కిరీటాన్ని నీవు దుమ్ములో పారవేసావు.
40 రాజు పట్టణపు గోడలను నీవు కూలగొట్టావు.
అతని కోటలన్నింటినీ నీవు నాశనం చేశావు.
41 రాజు పొరుగువారు అతన్ని చూచి నవ్వుతారు.
దారినపోయే మనుష్యులు అతని నుండి వస్తువులు దొంగిలిస్తారు.
42 రాజు శత్రువులందరికీ నీవు సంతోషం కలిగించావు.
అతని శత్రువులను యుద్ధంలో నీవు గెలువనిచ్చావు.
43 దేవా, వారిని వారు కాపాడుకొనేందుకు నీవు వారికి సహాయం చేశావు.
నీ రాజు యుద్ధంలో గెలిచేందుకు నీవు అతనికి సహాయం చేయలేదు.
44 అతని సింహాసనాన్ని నీవు నేలకు విసరివేశావు.
45 అతని ఆయుష్షు నీవు తగ్గించి వేశావు.
నీవు అతన్ని అవమానించావు.
46 యెహోవా, నీవు శాశ్వతంగా మా నుండి మరుగైయుంటావా?
నీ కోపం అగ్నిలా ఎప్పటికీ మండుతూ ఉంటుందా?
ఎంత కాలం యిలా సాగుతుంది?
47 నా ఆయుష్షు ఎంత తక్కువో జ్ఞాపకం చేసికొనుము.
అల్పకాలం జీవించి, తర్వాత మరణించేందుకు నీవు మమ్మల్ని సృష్టించావు.
48 ఏ మనిషీ జీవించి, ఎన్నటికీ చావకుండా ఉండలేడు.
ఏ మనిషీ సమాధిని తప్పించుకోలేడు.
49 దేవా, గతంలో నీవు చూపించిన ప్రేమ ఎక్కడ?
దావీదు కుటుంబానికి నీవు నమ్మకంగా ఉంటావని అతనికి నీవు వాగ్దానం చేశావు.
50-51 ప్రభూ, ప్రజలు నీ సేవకులను ఎలా అవమానించారో దయచేసి జ్ఞాపకం చేసుకొనుము.
యెహోవా, నీ శత్రువులనుండి ఆ అవమానాలన్నింటినీ నేను వినాల్సి వచ్చింది.
ఏర్పరచబడిన నీ రాజును ఆ మనుష్యులు అవమానించారు.
52 యెహోవాను శాశ్వతంగా స్తుతించండి.
ఆమేన్, ఆమేన్![c]
దేవుడు తన శత్రువులను శిక్షిస్తాడు
34 సకల రాజ్యములారా, దగ్గరగా వచ్చి, వినండి. ప్రజలారా, మీరంతా దగ్గరగా ఉండి వినండి. భూమి, భూమిమీద ఉన్న ప్రజలు అందరూ ఈ సంగతులు వినాలి. 2 సకల రాజ్యాల మీదా, వాటి సైన్యాల మీదా యెహోవా కోపంగా ఉన్నాడు. యెహోవా వాళ్లందర్ని నాశనం చేస్తాడు వాళ్లందరు చంపబడేట్టు యెహోవా చేస్తాడు. 3 వారి శరీరాలు బయట పారవేయబడతాయి. ఆ శవాలనుండి కంపువస్తుంది. వారి రక్తం కొండల నుండి ప్రవహిస్తుంది. 4 ఆకాశాలు కాగితం చుట్టలా చుట్టబడతాయి. నక్షత్రాలు చచ్చి, ద్రాక్ష లేక అంజూర చెట్ల ఆకులు రాలినట్లు రాలిపోతాయి. ఆకాశంలోని నక్షత్రాలన్నీ కరిగి పోతాయి. 5 “ఆకాశంలో నా ఖడ్గం రక్తసిక్తమైనప్పుడు ఇది జరుగుతుంది” అని యెహోవా చెబుతున్నాడు.
చూడండి! యెహోవా ఖడ్గం ఎదోముగుండా దూసుకొనిపోతుంది. ఆ ప్రజలు దోషులని యెహోవా తీర్పు చెప్పాడు, గనుక వారు చావాల్సిందే. 6 ఎందుకంటే, బొస్రాలో, ఎదోములో చంపబడే సమయం ఒకటి ఉండాలని యెహోవా నిర్ణయించాడు. 7 కనుక పొట్టేళ్లు, పశువులు, బలమైన కోడెదూడలు చంపబడతాయి. దేశం వాటి రక్తంతో నిండిపోతుంది. దుమ్ము వాటి కొవ్వుతో నిండిపోతుంది.
8 శిక్షా సమయం ఒకటి యెహోవా ఏర్పాటు చేశాడు గనుక ఆ సంగతులు జరుగుతాయి. ప్రజలు సీయోనుకు చేసిన కీడులకు వారు బదులు చెల్లించటానికి యెహోవా ఒక సంవత్సరాన్ని ఎంచుకొన్నాడు. 9 ఎదోము నదులు వేడి తారులా ఉంటాయి. ఎదోము నేల మండుతున్న గంధకంలా ఉంటుంది. 10 అగ్ని రాత్రింబవళ్లు మండుతూ ఉంటుంది. అగ్నిని ఎవ్వరూ ఆర్పివేయలేరు. ఎదోమునుండి పొగ శాశ్వతంగా లేస్తుంది. ఆ దేశం శాశ్వతంగా ఎప్పటికీ నాశనం చేయబడుతుంది. ఆ దేశంగుండా మళ్లీ ఎవ్వరూ ఎన్నడూ ప్రయాణం చేయరు. 11 పక్షులు, చిన్న జంతువులు ఆ దేశాన్ని స్వంతంగా వాడుకొంటాయి. గుడ్లగూబలు, కాకులు అక్కడ నివసిస్తాయి. ఆ దేశం “శూన్య ఎడారి” అని పిలువబడుతుంది. 12 స్వతంత్రులు, నాయకులు అంతా పోతారు. వారు పాలించేందుకు అక్కడ ఏమీ మిగిలి ఉండదు.
13 అక్కడి అందమైన గృహాలన్నింటిలో ముళ్ల కంపలు, పిచ్చిపొదలు పెరుగుతాయి. అడవి కుక్కలు, గుడ్లగూబలు ఆ ఇండ్లలో నివసిస్తాయి. అడవి జంతువులు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొంటాయి. అక్కడ పెరిగే గడ్డి దుబ్బుల్లో పెద్ద పక్షులు నివసిస్తాయి. 14 అడవి పిల్లులు నక్కలతో కలిసి అక్కడ నివసిస్తాయి. అడవి మేకలు వాటి స్నేహితులను పిలుచుకొంటాయి. రాత్రులు తిరిగే జంతువులు అక్కడ విశ్రాంతి స్థలం చూచుకొంటాయి. 15 పాములు అక్కడ పుట్టలు పెడ్తాయి. పాములు అక్కడ గుడ్లు పెడ్తాయి. గుడ్లు పగులుతాయి పాము పిల్లలు ఆ చీకటి స్థలాల్లో పాకుతాయి. చచ్చిన శవాలను తినే పక్షులు, ఆడవాళ్లు వారి స్నేహితురాళ్లను కలుసుకొన్నట్టుగా అక్కడ కలుసుకొంటాయి.
16 యెహోవా గ్రంథాన్ని చూడండి. అక్కడ ఏమి వ్రాసి ఉందో చదవండి. ఏమీ తప్పిపోలేదు. ఆ జంతువులు కలిసి ఉంటాయని ఆ గ్రంథములో వ్రాయబడిఉంది. వాటిని ఒక్క చోట చేరుస్తానని దేవుడు చెప్పాడు. కనుక దేవుని ఆత్మ వాటిని ఒక్క చోట చేర్చటం జరుగుతుంది. 17 వాటి విషయంలో చేయాల్సిన దాన్ని దేవుడు నిర్ణయం చేశాడు. అప్పుడు దేవుడు వాటికి ఒక చోటు నిర్ణయించాడు. దేవుడు ఒక గితగీసి, వాటి స్థలం వాటికి చూపించాడు. అందుచేత ఆ దేశం ఆ జంతువులకు శాశ్వతంగా స్వంతం. సంవత్సరం వెంబడి సంవత్సరం అవి అక్కడే నివసిస్తాయి.
యోహాను పరలోకాన్ని చూడటం
4 ఇది జరిగిన తర్వాత నేను కళ్ళెత్తి చూశాను. పరలోకంలో ఒక ద్వారం కనిపించింది. ఆ ద్వారము తెరుచుకొని ఉంది. బూర ఊదినట్లు యింతకు ముందు మాట్లాడిన స్వరం నాకు మళ్ళీ వినిపించింది. అది నాతో, “ఇలా మీదికి రా; దీని తర్వాత ఏమి జరుగుతుందో నీకు చూపిస్తాను” అని అంది. 2 నేను వెంటనే పరిశుద్ధాత్మ ఆధీనమయ్యాను. పరలోకంలో ఉన్న సింహాసనం నాముందు కనిపించింది. దాని మీద ఎవరో కూర్చొని ఉన్నారు. 3 దాని మీద కూర్చున్నవాడు సూర్యకాంతమణివలె, పద్మరాగమువలె వున్నాడు. ఆ సింహాసనం చుట్టూ మరకతమును పోలిన ఆకాశ ధనుస్సు ప్రకాశిస్తూ ఉంది.
4 దాని చుట్టూ యిరవై నాలుగు యితర సింహాసనాలు ఉన్నాయి. వాటి మీద యిరవై నాలుగు మంది పెద్దలు కూర్చొని ఉన్నారు. వాళ్ళు తెల్లని దుస్తులు ధరించి ఉన్నారు. వాళ్ళ తలలపై బంగారు కిరీటాలు ఉన్నాయి. 5 సింహాసనం నుండి మెరుపులువచ్చాయి. పెద్ద గర్జనలు ఉరుములు దాన్నుండి వినిపించాయి. ఆ సింహాసనం ముందు ఏడు దీపాలు దివ్యంగా వెలుగుతూ ఉన్నాయి. ఇవి దేవుని ఏడు ఆత్మలు. 6 గాజుతో కప్పిన సముద్రంలా కనిపించే ఒక గాజు సముద్రం ఆ సింహాసనం ముందు కనిపించింది. అది స్ఫటికంలా నిర్మలంగా ఉంది.
సింహాసనం మధ్య, చుట్టూ, అంటే ముందు, వెనుక నాలుగు ప్రాణులు ఉన్నాయి. వాటి దేహాలు ముందు, వెనుక కళ్ళతో కప్పబడి ఉన్నాయి. 7 మొదటి ప్రాణి ఒక సింహంలా, రెండవది ఒక ఎద్దులా, మూడవది ఒక మనిషి ముఖంలా, నాలుగవది ఎగిరే పెద్ద పక్షిలా ఉన్నాయి.[a] 8 ప్రతి ప్రాణికి ఆరు రెక్కలు ఉన్నాయి. వాటి శరీరాలపైన, క్రింద కళ్ళతో పూర్తిగా కప్పబడి ఉన్నాయి. రెక్కల క్రింద కళ్ళతో కప్పబడి ఉన్నాయి. రాత్రింబవళ్ళు అవి విడువక:
“భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నవాడు, సర్వశక్తి సంపన్నుడును
ప్రభువునైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు”
అని పాడుతూ ఉన్నాయి.
9 సింహాసనంపై కూర్చొన్నవానికి, చిరకాలం జీవించేవానికి, మహిమ, గౌరవము కలగాలని అంటూ ఈ ప్రాణులు తమ కృతజ్ఞతలు తెలుపుతూ పాడాయి. 10 అవి ఆ విధంగా పాడినప్పుడు ఆ యిరవై నాలుగు మంది పెద్దలు ఆ సింహాసనంపై కూర్చొన్నవానిముందు సాష్టాంగపడి చిరకాలం జీవించే ఆయన్ని స్తుతించారు. తమ కిరీటాల్ని సింహాసనం ముందువేసి,
11 “మా ప్రభూ! దైవమా!
నీవు తేజమును, గౌరవమును, శక్తిని పొందతగిన యోగ్యుడవు,
నీవు అన్నిటినీ సృష్టించావు.
అవి నీ యిష్టానుసారం సృష్టింపబడి జీవాన్ని పొందాయి”
అని అన్నారు.
© 1997 Bible League International