M’Cheyne Bible Reading Plan
స్వేచ్ఛాబలులు, అర్పణలు
1 యెహోవా దేవుడు మోషేను పిలిచి, సన్నిధి గుడారంలో నుండి అతనితో మాట్లాడాడు. యెహోవా అన్నాడు: 2 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు, మీలో ఎవరైనా యెహోవాకు అర్పణ తెచ్చినప్పుడు, ఆవుల మందలోనుండి గాని, గొర్రెల మందలోనుండి గాని దానిని తీసుకొని రావాలి.
3 “ఒక వ్యక్తి తన ఆవుల మందలో ఒక దానిని దహనబలిగా అర్పిస్తుంటే, అది నిర్దోషమైన గిత్తయి[a] వుండాలి. ఆ వ్యక్తి ఆ గిత్తను సన్నిధి గుడారపు ద్వారం దగ్గరకు తీసుకొని వెళ్లాలి. అప్పుడు యెహోవా ఆ అర్పణను అంగీకరిస్తాడు. 4 ఈ వ్యక్తి ఆ గిత్త తలమీద తన చేయి పెట్టాలి. ఆ వ్యక్తి పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆ దహనబలి అర్పణను యెహోవా అంగీకరిస్తాడు.
5 “ఆ వ్యక్తి యొక్క గిత్తను యెహోవా ఎదుట వధించాలి. అప్పుడు అహరోను కుమారులైన యాజకులు ఆ గిత్త రక్తాన్ని తీసుకొని రావాలి. సన్నిధి గుడారపు ద్వారం దగ్గర బలిపీఠం చుట్టూ ఆ రక్తాన్ని వారు చిలకరించాలి. 6 అతడు ఆ పశువు చర్మాన్ని ఒలిచి, ఆ పశువును ముక్కలుగా నరకాలి. 7 యాజకులైన అహరోను కుమారులు బలిపీఠం మీద కట్టెలు, నిప్పు ఉంచాలి. 8 యాజకులైన అహరోను కుమారులు ఆ ముక్కలను (తల, కొవ్వు) కట్టెలు మీద పెట్టాలి. ఆ కట్టెలు బలిపీఠం మీద నిప్పుల్లో ఉంటాయి. 9 ఆ పశువు లోపలి భాగాలను, కాళ్లను నీళ్లతో యాజకుడు కడగాలి. తర్వాత ఆ పశువు అవయవాలు అన్నింటినీ బలిపీఠం మీద యాజకుడు దహించాలి. అది అగ్నిపై అర్పించబడే దహనబలి, ఇది యెహోవాకు ఇష్టమైన సువాసన.
10 “ఒక వ్యక్తి గొర్రెనుగాని మేకనుగాని దహన బలిగా అర్పిస్తుంటే, ఏ దోషం లేని మగదానిని మాత్రమే అతడు అర్పించాలి. 11 ఆ వ్యక్తి బలిపీఠానికి ఉత్తరాన, యెహోవా ఎదుట ఆ జంతువును వధించాలి. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు, ఆ జంతువు రక్తాన్ని బలిపీఠం చుట్టూ చిలకరించాలి. 12 అప్పుడు యాజకుడు ఆ జంతువును ముక్కలుగా నరకాలి. ఆ జంతువు తల, కొవ్వులను యాజకుడు ఉంచుకుంటాడు. ఆ ముక్కలను యాజకుడు కట్టెల మీద చక్కగా పేర్చాలి. బలిపీఠం మీద నిప్పుల్లో ఆ కట్టెలు ఉంటాయి. 13 లోపలి భాగాలను, కాళ్లను నీళ్లతో యాజకుడు కడగాలి. అప్పుడు యాజకుడు ఆ జంతువు అవయవాలన్నింటినీ అర్పించి, బలిపీఠం మీద దహించాలి. అది అగ్నిపై అర్పించబడే దహనబలి, ఇది యెహోవాకు ఇష్టమైన సువాసన.
14 “ఒక వ్యక్తి ఒక పక్షిని యెహోవాకు దహన బలిగా అర్పించాలను కొంటే, తెల్ల గువ్వ, లేక పావురం పిల్ల మాత్రమే యివ్వాలి. 15 అర్పణను యాజకుడు ఆ బలిపీఠం దగ్గరకు తీసుకొని రావాలి. యాజకుడు ఆ పక్షి తలను తుంచివేయాలి. అప్పుడు ఆ పక్షిని బలిపీఠం మీద యాజకుడు దహించాలి. ఆ పక్షి రక్తాన్ని బలిపీఠం పక్కగా కార్చివెయ్యాలి. 16 యాజకుడు ఆ పక్షి మేత పొట్టను, దాని ఈకలను తీసివేసి, బలిపీఠానికి తూర్పుగా పారవేయాలి. ఇది వారు బలిపీఠపు బూడిదను పారవేసేచోటు. 17 అప్పుడు యాజకుడు ఆ పక్షి రెక్కలను పట్టి చీల్చాలి గాని దానిని రెండు భాగాలుగా విడదీయకూడదు. బలిపీఠం మీద అగ్నిలో ఉన్న కట్టెలపైన ఆ పక్షిని యాజకుడు దహించాలి. అది అగ్నిపైన అర్పించబడే దహనబలి, ఇది యెహోవాకు ఇష్టమైన సువాసన.
యేసు బ్రతికి రావటం
(మత్తయి 28:1-10; మార్కు 16:1-8; లూకా 24:1-12)
20 ఆ రోజు ఆదివారం. “మగ్దలేనే” కు చెందిన మరియ చీకటి ఉండగా లేచి ఆ సమాధి దగ్గరకు వెళ్ళింది. దాని ద్వారానికి ఉన్న రాయి తీసి వేయబడి ఉండటం గమనించింది. 2 అందువల్ల ఆమె సీమోను పేతురు దగ్గరకు, యేసు ప్రేమించిన యింకొక శిష్యుని దగ్గరకు పరుగెత్తుకొంటూ వెళ్ళి, వాళ్ళతో, “ఎవరో ప్రభువును సమాధి నుండి తీసుకు వెళ్ళారు. ఎక్కడ ఉంచారో తెలియదు” అని అన్నది.
3 పేతురు, ఆ యింకొక శిష్యుడు సమాధి చూడటానికి బయలుదేరి వెళ్ళారు. 4 వాళ్ళు కలిసి పరుగెత్తుకుంటూ వెళ్లారు కాని, ఆ యింకొక శిష్యుడు పేతురు కన్నా ముందు పరుగెత్తి సమాధిని మొదట చేరుకున్నాడు. 5 అతడు తొంగి లోపల చూసాడు. అక్కడ పడివున్న నారబట్టలు అతనికి కనిపించాయి. కాని అతడు లోపలికి వెళ్ళలేదు.
6 అతని వెనుక వస్తున్న పేతురు వచ్చి సమాధిలోకి వెళ్ళాడు. అక్కడ పడి ఉన్న బట్టల్ని చూసాడు. 7 వాటినే కాక యేసు తల చుట్టూ చుట్టబడిన వస్త్రాన్ని కూడా చూసాడు. మడత పెట్టబడిన తల వస్త్రం నారబట్టలతో కాక వేరుగా ఉంచబడి ఉంది. 8 సమాధి దగ్గరకు ముందు వెళ్ళిన శిష్యుడు కూడా తర్వాత లోపలికి వెళ్ళాడు. ఆ దృశ్యం చూసి విశ్వసించాడు. 9 (యేసు బ్రతికి వస్తాడని లేఖనాల్లో వ్రాయబడిన విషయం వాళ్ళకు యింకా అర్థంకాలేదు.)
మగ్దలేనే మరియకు యేసు కనిపించటం
(మార్కు 16:9-11)
10 ఆ తర్వాత శిష్యులు తమ తమ యిండ్లకు వెళ్ళిపొయ్యారు. 11 కాని, మరియ సమాధి బయట దుఃఖిస్తూ నిలుచొని ఉంది. ఆమె దుఃఖం ఆగలేదు. సమాధిలోకి తొంగి చూసింది. 12 తెల్లటి దుస్తుల్లో ఉన్న యిద్దరు దేవదూతలు అక్కడ కూర్చొని ఉండటం ఆమె గమనించింది. యేసు దేహాన్ని ఉంచిన చోట ఒక దేవదూత తల వైపు, మరొక దేవదూత కాళ్ళ వైపు కూర్చొని ఉన్నారు.
13 వాళ్ళామెను, “ఎందుకు దఃఖిస్తున్నావమ్మా?” అని అడిగారు.
ఆమె, “వాళ్ళు నా ప్రభువును తీసుకు వెళ్ళారు. ఆయన్ని ఎక్కడ ఉంచారో నాకు తెలియదు” అని అన్నది. 14 అలా అన్నాక వెనక్కు తిరిగింది. అక్కడ యేసు నిలుచొని ఉండటం చూసింది. కాని ఆయనే “యేసు” అని ఆమె గుర్తించలేదు.
15 ఆయన, “ఎందుకు విలపిస్తున్నావమ్మా! ఎవరి కోసం చూస్తున్నావు?” అని అడిగాడు.
అతడొక తోటమాలి అనుకొని, “అయ్యా మీరాయన్ని ఎత్తుకుపోయి ఉంటే ఎక్కడ ఉంచారో చెప్పండి. నేను వెళ్ళి తెచ్చుకుంటాను” అని అన్నది.
16 యేసు ఆమెను “మరియా” అని పిలిచాడు.
ఆమె ఆయన వైపు చూసి హీబ్రూ భాషలో “రబ్బూనీ!” అని అన్నది. రబ్బూనీ అంటే బోధకుడు అని అర్థం.
17 యేసు, “నేనింకా తండ్రి దగ్గరకు వెళ్ళలేదు కనుక నన్ను తాకవద్దు. నా సోదరుల దగ్గరకు వెళ్ళి నాకు, మీకు తండ్రి, దేవుడు అయినటువంటివాని దగ్గరకు వెళ్తున్నానని చెప్పు” అని అన్నాడు.
18 మగ్దలేనే మరియ శిష్యుల దగ్గరకు వెళ్ళింది. తాను ప్రభువును చూసిన వార్త, ప్రభువు తనకు చెప్పిన సందేశము, వాళ్ళతో చెప్పింది.
యేసు తన శిష్యులకు కనిపించటం
(మత్తయి 28:16-20; మార్కు 16:14-18; లూకా 24:36-49)
19 ఆ ఆదివారం సాయంకాలం శిష్యులందరు ఒకే చోట సమావేశమయి ఉన్నారు. యేసు వచ్చి వాళ్ళ మధ్య నిలుచొని, “మీకు శాంతి కలుగుగాక!” అని అన్నాడు. 20 ఇలా అన్నాక ఆయన తన చేతుల్ని, ప్రక్క భాగాన్ని చూపించాడు. ప్రభువును చూసాక శిష్యులకు చాలా ఆనందం కలిగింది.
21 యేసు మళ్ళీ, “మీకు శాంతి కులుగు గాక! తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను” అని అన్నాడు. 22 ఇలా అన్నాక, “పవిత్రాత్మను పొందండి!” అని వాళ్ళపై ఊదాడు. 23 ఆ తర్వాత, “మీరు ఎవరి పాపాలు క్షమిస్తే వారి పాపాలు క్షమింపబడతాయి. మీరు ఎవరి పాపాలు క్షమించకపోతే వారి పాపాలు క్షమించబడవు” అని వాళ్ళతో అన్నాడు.
తోమా యేసును చూడటం
24 యేసు వచ్చినప్పుడు పండ్రెండుగురిలో ఒకడైన తోమా శిష్యుల్తోలేడు. ఇతణ్ణి “దిదుమ” అని పిలిచే వాళ్ళు. 25 మిగత శిష్యులు తోమాతో, “మేము ప్రభువును చుసాము” అని అన్నారు. కాని తోమా, “నేను స్వయంగా ఆయన చేతులకున్న మేకుల గాయాల్ని చూసి, వాటిని చేతుల్తో తాకి, ఆయన ప్రక్క డొక్కపై నా చేతుల్ని ఉంచాక ఆయన్ని నమ్ముతాను” అని అన్నాడు.
26 ఒక వారం రోజుల తర్వాత యేసు శిష్యులు ఒక యింట్లో ఉన్నారు. తోమా కూడా వాళ్ళతో ఉన్నాడు. తలుపులు మూసి వేసి ఉన్నా యేసు లోపలికి వచ్చి వాళ్ళ మధ్య నిలుచొని, “మీకు శాంతి కలుగుగాక!” అని అన్నాడు. 27 యేసు తోమాతో, “నా చేతులు చూడు. నీ వేళ్ళతో వాటిని తాకు. నా ప్రక్క భాగంపై నీ చేతుల్ని ఉంచు! ఇక అనుమానించకు” అని అన్నాడు.
28 తోమా ఆయనతో, “దేవా! నా ప్రభూ!” అని అన్నాడు.
29 అప్పుడు యేసు అతనితో, “నన్ను చూసావు కనుక నమ్మావు. నన్ను చూడకున్నా విశ్వసించే వాళ్ళు ధన్యులు” అని అన్నాడు.
ఈ గ్రంథం వ్రాయటంలో ఉద్దేశ్యం
30 నేను ఈ గ్రంథంలో వ్రాసినవే కాక, యేసు ఇంకా అనేకమైన మహాత్కార్యాలు చేసాడు. వాటన్నిటినీ శిష్యులు చూసారు. 31 యేసు “క్రీస్తు” అని, “దేవుని కుమారుడు” అని, ఆయన్ని విశ్వసించిన వాళ్ళకు ఆయన పేరిట అనంత జీవితం లభిస్తుందని మీరు నమ్మాలనే ఉద్దేశ్యంతో యివి వ్రాయబడ్డాయి.
17 ఇంట్లో ప్రతి ఒక్కరూ వాదులాడుతూ ఆ ఇంటినిండా భోజనం ఉండటంకంటె, శాంతి కలిగి భోజనం చేయటానికి ఒక ఎండిపోయిన రొట్టెముక్క ఉంటే చాలు.
2 యజమాని యొక్క సోమరిపోతు కుమారుని మీద తెలివిగల సేవకుడు ఆధిపత్యం సంపాదిస్తాడు. తెలివిగల ఆ సేవకుడు అన్నదమ్ములతో పాటు పిత్రార్జితము పంచుకొంటాడు.
3 బంగారం, వెండి శుద్ధి చేయబడేందుకు అగ్నిలో వేయబడతాయి. అయితే మనుష్యుల హృదయాలను పవిత్రం చేసేవాడు యెహోవా.
4 దుర్మార్గులు ఇతరులు చెప్పే దుర్మార్గపు సంగతులు వింటారు. అబద్ధాలు చెప్పేవారు కూడా అబద్ధాలు వింటారు.
5 కొంతమంది పేదవాళ్లను హేళన చేస్తారు. సమస్యలు ఉన్నవాళ్లను చూచి వారు ఎగతాళి చేస్తారు. వారిని సృష్టించిన దేవుణ్ణి వారు గౌరవించరు అని ఇది సూచిస్తుంది. ఈ దుర్మార్గులు శిక్షించబడుతారు.
6 మనుమలు మనుమరాళ్లు ముసలివాళ్లను సంతోషపెడ్తారు. మరియు పిల్లలు వారి తల్లిదండ్రులను గూర్చి అతిశయిస్తారు.
7 ఒక బుద్ధిహీనుడు అధికంగా మాట్లాడటం జ్ఞానముగల పనికాదు. అదే విధంగా ఒక అధికారి అబద్ధాలు చెప్పటం జ్ఞానముగల పనికాదు.
8 లంచం కళ్లను మెరిపించే ఒక ప్రకాశవంతమైన వెలగల రాయిలాంటిది, అది ఇచ్చేవారి మనస్సును మారుస్తుంది. ఎక్కడికి వెళ్లినా అదిపని చేస్తుంది అనుకొంటారు.
9 నీ విషయంలో తప్పు చేసినవాణ్ణి నీవు క్షమిస్తే, మీరు స్నేహితులుగా ఉంటారు. కాని అతడు చేసిన తప్పును నీవు ఇంకా జ్ఞాపకం చేసికొంటూనే ఉంటే, అది మీ స్నేహానికి హాని చేస్తుంది.
10 తెలివిగలవాడు తాను చేసే తప్పుల మూలంగా నేర్చుకొంటాడు. కాని బుద్ధిహీనుడు నూరు పాఠాల తర్వాత కూడా ఏమీ నేర్చుకోడు.
11 దుర్మార్గుడు తప్పు మాత్రమే చేయాలని కోరుతాడు. అంతంలో అతణ్ణి శిక్షించేందుకు దేవుడు ఒక దూతను పంపిస్తాడు.
12 ఒక తల్లి ఎలుగుబంటి, దాని పిల్లలు ఎత్తుకొనిపోబడి, కోపంగా ఉన్నప్పుడు దాన్ని కలుసుకోవటం చాలా ప్రమాదకరం. కాని తెలివి తక్కువ పనులు చేయటంలో నిమగ్నం అయిపోయి ఉన్న బుద్ధిహీనుణ్ణి కలుసుకోవటంకంటే అది మేలు.
13 నీకు మంచి పనులు చేసేవారికి నీవు చెడు పనులు చేయకు. నీవు గనుక చేస్తే, మిగిలిన నీ జీవితం అంతా నీకు కష్టాలే ఉంటాయి.
14 నీవు వాదం మొదలుపెడ్తే అది ఆనకట్టకు గండి కొట్టినట్టే ఉంటుంది. అందుచేత వాదం అలా అలా పెద్దది కాక ముందే దాన్ని నిలిపివేయి.
15 ఏ తప్పూ చేయని వాణ్ణి శిక్షించటం, దోషిని క్షమించటం ఇవి రెండూ యెహోవాకు అసహ్యం.
16 బుద్ధిహీనునికి డబ్బు ఉంటే అది వ్యర్థం అవుతుంది. ఎందుకంటే జ్ఞాని అయ్యేందుకు ఆ డబ్బును బుద్ధిహీనుడు ఉపయోగించడు.
17 స్నేహితుడు అన్ని వేళలా ప్రేమిస్తాడు. నిజమైన సోదరుడు ఎల్లప్పుడూ కష్ట సమయాల్లో కూడా నిన్ను బలపరుస్తాడు.
18 మరొకని అప్పులకు బాధ్యత వహిస్తానని బుద్ధిహీనుడు మాత్రమే వాగ్దానం చేస్తాడు.
19 జగడాల్లో ఆనందించేవాడు పాపంలోనూ ఆనందిస్తాడు. నిన్ను గూర్చి నీవు అతిశయిస్తే, నీవు కష్టాన్ని ఆహ్వానించినట్టే అవుతుంది.
20 దుర్మార్గునికి లాభం ఉండదు. అబద్ధాలు చెప్పే వాడికి కష్టాలు ఉంటాయి.
21 తెలివితక్కువ కుమారుడున్న తండ్రికి విచారం. బుద్ధిహీనుని తండ్రికి సంతోషం ఉండదు.
22 సంతోషం ఒక మంచి మందులాంటిది. కాని దు: ఖం ఒక రోగంలాంటిది.
23 దుర్మార్గుడు మోసం చేయటానికి రహస్యంగా డబ్బు తీసికొంటాడు.
24 జ్ఞానముగలవాడు ఎల్లప్పుడూ శ్రేష్ఠమైన దాన్ని చేసేందుకే తలుస్తూ ఉంటాడు. కాని బుద్ధిహీనుడు ఎంతసేపూ అందనివాటి కోసం కలగంటూ ఉంటాడు.
25 తెలివి తక్కువ కుమారుడు తన తండ్రికి దు: ఖం కలిగిస్తాడు. మరియు తెలివి తక్కువ కుమారుడు తనకు జన్మ నిచ్చిన తల్లికి విచారం కలిగిస్తాడు.
26 ఏ తప్పు చేయని వానిని శిక్షించటం తప్పు. నాయకులు నిజాయితీగా ఉన్నప్పుడు వారిని శిక్షించటం తప్పు.
27 జ్ఞానముగలవాడు మాటల్ని జాగ్రత్తగా ప్రయోగిస్తాడు. జ్ఞానముగలవాడు త్వరగా కోపగించుకోడు.
28 బుద్ధిహీనుడు కూడా నెమ్మదిగా ఉన్నప్పుడు జ్ఞానిలా కనిపిస్తాడు. అతడు ఏమీ చెప్పకపోతే జ్ఞానము గలవాడు అని ప్రజలు అనుకొంటారు.
చివరి సలహా
4 నా ప్రియమైన సోదరులారా! మిమ్మల్ని చూడాలని నాకు ఎంతో ఆత్రుతగా ఉంది. మీరు నాకు చాలా ఆనందం కలిగించారు. మీ విషయంలో నేను చాలా గర్విస్తుంటాను. ప్రియ మిత్రులారా! ప్రభువును అనుసరించటం మానుకోకండి.
2 యువొదియ, సుంటుకే అనేవాళ్ళు ప్రభువు విశ్వాసులు కనుక వాళ్ళు పరస్పరం ఒక అంగీకారానికి రావాలని అర్థిస్తున్నాను. 3 నిజమైన జత పనివాడా! నీవు నాతో కలిసి పని చేసావు. నీవు నమ్మకంగా పని చేసేవాడవని నాకు తెలుసు. ఈ స్త్రీలకు సహాయం చేయి. దైవసందేశాన్ని ప్రకటించటంలో వీళ్ళు క్లెమెంతుతోను, మరియు మిగతావాళ్ళతోను కలిసి నా పక్షాన నిలిచారు. ఈ మిగతావాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి.
4 అన్ని వేళలందును మీరు ప్రభువునందు ఆనందించండి, మళ్ళీ చెపుతున్నాను. ప్రభువునందు ఆనందించండి.
5 మీరు దయగలవాళ్ళనే పేరు పొందాలి. ప్రభువు త్వరలో రానున్నాడు. 6 ఏ విషయంలో చింతలు పెట్టుకోకండి. ప్రతిసారి ప్రార్థించి మీ కోరికల్ని దేవునికి తెలుపుకోండి. కృతజ్ఞతా హృదయంతో అడగండి. 7 దేవుడు యిచ్చే శాంతిని ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. అది మీ హృదయాలను, మీ బుద్ధిని, యేసు క్రీస్తులో ఉంచి కాపలాకాస్తుంది.
8 కనుక సోదరులారా! నేను చివరకు చెప్పేదేమిటంటే, సత్యమైనవాటిని, మంచివాటిని, ధర్మమైనవాటిని, పవిత్రమైనవాటిని, ఆనందమైనవాటిని, మెచ్చుకోతగ్గవాటిని, అంటే ఉత్తమంగా ఉన్నవాటిని గురించి, ప్రశాంతమైనవాటిని గురించి మీ మనస్సులో ఆలోచించండి. 9 మీరు నా ద్వారా నేర్చుకొన్నవాటిని, నా నుండి పొందినవాటిని, నా నుండి విన్నవాటిని, నాలో చూసినవాటిని ఆచరణలో పెట్టండి. అప్పుడు శాంతిని కలిగించే దేవుడు మీతో ఉంటాడు.
కానుకలకు కృతజ్ఞత
10 మీకు నా పట్ల ఉన్న అభిమానం మళ్ళీ మొలకెత్తినందుకు నేను ప్రభువు పేరిట చాలా ఆనందిస్తున్నాను. ఔను, మీకు నా పట్ల అభిమానం ఉంది కాని, దాన్ని చూపించుకొనే అవకాశం మీకు చిక్కలేదు. 11 నాకు మీ అవసరముందని ఈ విధంగా మాట్లాడటం లేదు. ఏ పరిస్థితుల్లోనైనా తృప్తిగా ఉండేందుకు నేను నేర్చుకొన్నాను. 12 అవసరంలో ఉండటం అంటే ఏమిటో, అధికంగా కలిగి ఉండటం అంటే ఏమిటో నాకు తెలుసు. అన్ని పరిస్థితుల్లో, అంటే కడుపు నిండి ఉన్నప్పుడును ఆకలితో ఉన్నప్పుడును, అవసరాలలో ఉన్నప్పుడును అధికంగా కలిగి ఉన్నప్పుడును సంతృప్తికరంగా ఎలా ఉండాలో, దాని రహస్యమేమిటో నేను తెలుసుకున్నాను. 13 నాకు శక్తినిచ్చే క్రీస్తు ద్వారా నేను ఏ పనినైనా చేయగలను.
14 అయినా మీరు నా కష్టాలు పంచుకొని మంచి పని చేసారు. 15 పైగా దైవసందేశాన్ని గురించి మీరు క్రొత్తగా విన్నప్పుడు, ఫిలిప్పీలో ఉన్న మీరు తప్ప ఎవ్వరూ నాకు సహాయం చెయ్యలేదు. నేను మాసిదోనియ నుండి ప్రయాణం సాగించినప్పుడు ఒక్క సంఘం కూడా నాకు సహాయం చెయ్యలేదు. నాకు వాళ్ళు ఏమీ యివ్వలేదు. నానుండి ఏమీ పుచ్చుకోలేదు. 16 నేను థెస్సలొనీకలో ఉన్నప్పుడు కూడా నా అవసరాన్ని బట్టి మీరు నాకు ఎన్నోసార్లు సహాయం చేసారు. 17 నేను మీ నుండి విరాళాలు పొందాలని యిలా మాట్లాడటం లేదు. మీ జీవితం యొక్క లెక్కలకు కొంత లాభం చేకూర్చాలని నా అభిప్రాయం. 18 నాకు కావలసినదానికన్నా ఎక్కవే చెల్లించారు. మీరు ఎపఫ్రొదితు ద్వారా నాకు పంపిన విరాళాలు నాకు ముట్టాయి. దానితో నా అవసరాలు పూర్తిగా తీరిపోయాయి. సుగంధ పరిమళాల వలే ఉన్న మీ విరాళాలను దేవుడు ఆనందంగా అంగీకరిస్తాడు. 19 నా దేవుడు యేసు క్రీస్తులో ఉన్న గొప్ప ఐశ్వర్యంతో మీ అవసరాలన్నీ తీరుస్తాడు. 20 మన తండ్రియైన దేవునికి చిరకాలపు కీర్తి కలుగుగాక! ఆమేన్.
21 యేసు క్రీస్తులో ఐక్యత పొందిన ప్రతి పవిత్రునికి నా వందనాలు తెలుపండి. నాతోవున్న సోదరులందరూ మీకు వందనాలు తెలుపుతున్నారు. 22 పవిత్రులందరు, ముఖ్యంగా చక్రవర్తి భవనంలో నివసించేవాళ్ళు, మీకు వందనాలు తెలుపుతున్నారు.
23 యేసు క్రీస్తు ప్రభువుయొక్క అనుగ్రహము మీ ఆత్మకు తోడుగా ఉండుగాక!
© 1997 Bible League International