Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
నిర్గమకాండము 40

పవిత్ర గుడారాన్ని మోషే నిలబెట్టాడు

40 అప్పుడు మోషేతో యెహోవా యిలా చెప్పాడు: “మొదటి నెల మొదటి రోజున పవిత్ర గుడారాన్ని నిలబెట్టు. ఒడంబడిక పెట్టెను సమావేశ పవిత్ర గుడారంలో పెట్టు. తెరతో ఆ పెట్టెను కప్పివేయి. తర్వాత బల్లను లోపలికి తీసుకురా. బల్లమీద ఉండాల్సిన వస్తువులను దాని మీద ఉంచు. తర్వాత దీపస్తంభాన్ని గుడారంలో ఉంచు. ధూపార్పణ కోసం బంగారపు వేదికను గుడారంలో పెట్టు, ఒడంబడిక పెట్టెకు ముందర ఈ వేదికను పెట్టు. తర్వాత పవిత్ర గుడారపు ప్రవేశానికి తెరవేయి.

“పవిత్ర గుడారపు (సన్నిధి గుడారం) ప్రవేశానికి ముందర దహనబలి అర్పణల పీఠాన్ని ఉంచు. ఈ బలిపీఠానికి, సన్నిధి గుడారానికి మధ్య గంగాళం ఉంచు. గంగాళంలో నీళ్లు పోయాలి. ఆవరణ చుట్టూ తెరలు తగిలించాలి. తర్వాత ఆవరణ ప్రవేశం దగ్గర తెరవేయాలి.

“అభిషేకతైలం ఉపయోగించి పవిత్ర గుడారాన్ని, అందులో ఉండే సమస్తాన్ని అభిషేకించు. ఈ వస్తువుల మీద నీవు తైలం పోసినప్పుడు వాటిని నీవు పవిత్రం చేస్తావు. 10 దహన బలులను దహించే బలిపీఠాన్ని, అభిషేకించు, బలిపీఠం మీద ఉండే సమస్తాన్నీ అభిషేకించు. ఆ బలిపీఠాన్ని నీవు పవిత్రం చేస్తావు. అది అతి పరిశుద్ధంగా ఉంటుంది. 11 తర్వాత గంగాళాన్ని, దాని కింద దిమ్మను అభిషేకించు. ఆ వస్తువులను పవిత్రం చేసేందుకు ఇలా చేయి.

12 “అహరోనును, అతని కుమారులను సన్నిధి గుడారం ప్రవేశం దగ్గరకు తీసుకురా. నీళ్లతో వాళ్లకు స్నానం చేయించాలి. 13 తర్వాత అహరోనుకు ప్రత్యేక వస్త్రాలను తొడిగించాలి. తైలంతో అతన్ని అభిషేకించి అతన్ని పవిత్రం చెయ్యి. అప్పుడే అతడు యాజకుడుగా సేవచేయగలడు. 14 తర్వాత అతని కుమారులకు వస్త్రాలు తొడిగించాలి. 15 వాళ్ల తండ్రిని నీవు అభిషేకించినట్టే కుమారులను కూడా అభిషేకించు. అప్పుడు వాళ్లు కూడా యాజకులుగా నా సేవ చేయగలరు. వాళ్లను నీవు అభిషేకించినప్పుడు వాళ్లు యాజకులవుతారు. రాబోయే కాలమంతా ఆ కుటుంబము యాజకులుగా కొనసాగుతారు.” 16 మోషే యెహోవాకు విధేయుడయ్యాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించిన దానంతటి ప్రకారం అతడు చేసాడు.

17 కనుక సరైన సమయంలో పవిత్రగుడారం నిలబెట్టబడింది. వారు ఈజిప్టు విడిచిన తర్వాత అది రెండవ సంవత్సరం మొదటి నెల మొదటి రోజు. 18 యెహోవా చెప్పినట్టే పవిత్ర గుడారాన్ని మోషే నిలబెట్టాడు. అతడు దిమ్మలను ముందుగా కింద పెట్టాడు. తర్వాత ఆ దిమ్మల మీద చట్రాలను పెట్టాడు. తర్వాత అతడు కమ్ములను అమర్చి, స్తంభాలను నిలబెట్టాడు. 19 ఆ తర్వాత పవిత్ర గుడారం కప్పును మోషే నిలబెట్టాడు. తర్వాత గుడారపు కప్పు మీద మరో కప్పును అతడు వేసాడు. యెహోవా ఆజ్ఞాపించినట్టే అతడు వీటన్నింటిని చేసాడు.

20 దేవుని ఆజ్ఞలు రాయబడ్డ రాతి పలకలను ఒడంబడిక పెట్టెలో మోషే పెట్టాడు. ఆ పెట్టెకు కర్రలను మోషే పెట్టాడు. తర్వాత అతడు ఆ పెట్టెకు మూత పెట్టాడు. 21 తర్వాత ఆ పవిత్ర పెట్టెను గుడారంలోకి మోషే తీసుకు వచ్చాడు. సరైన చోట అతడు తెర వేసాడు. ఇది సన్నిధి గుడారంలో పవిత్ర పెట్టెను మరుగు చేస్తుంది. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం మోషే వీటన్నింటినీ చేసాడు. 22 తర్వాత సన్నిధి గుడారపు బల్లను మోషే పెట్టాడు. గుడారం ఉత్తరాన అతడు దీన్ని పెట్టాడు. (పవిత్ర స్థలంలో) తెరముందర అతడు దీన్ని పెట్టాడు. 23 తర్వాత యెహోవా సన్నిధిలో బల్ల మీద రొట్టెను అతడు పెట్టాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టు అతడు దీన్ని చేసాడు. 24 తర్వాత మోషే దీపస్తంభాన్ని సన్నిధి గుడారంలో పెట్టాడు. గుడారం దక్షిణాన, బల్లకు ఎదుట అతడు దీపస్తంభం పెట్టాడు. 25 తర్వాత యెహోవా సన్నిధిలో దీపస్తంభం మీద దీపాలను అతడు పెట్టాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే అతడు దీన్ని చేసాడు.

26 తర్వాత బంగారపు ధూపవేదికను సన్నిధి గుడారంలో మోషే పెట్టాడు. ఆ వేదికను తెరముందర అతడు పెట్టాడు. 27 తర్వాత ఆ బంగారు బలిపీఠం మీద సువాసనగల పరిమళ ధూపం అతడు వేసాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే అతడు దీన్ని చేసాడు. 28 తర్వాత పవిత్ర గుడారం ప్రవేశానికి మోషే తెర వేసాడు.

29 పవిత్ర గుడారం, సన్నిధి గుడారం ప్రవేశం దగ్గర దహన బలులను దహించే బలిపీఠాన్ని మోషే పెట్టాడు. అప్పుడు ఒక దహన బలి అర్పణను ఆ బలిపీఠం మీద మోషే అర్పించాడు. యెహోవాకు ధాన్యార్పణ కూడ అతడు అర్పించాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టే అతడు వీటన్నింటినీ చేసాడు.

30 తర్వాత మోషే సన్నిధి గుడారానికి, బలిపీఠానికి మధ్య గంగాళం ఉంచాడు, కడుక్కొనేందుకు గంగాళంలో నీళ్లు పోసాడు. 31 మోషే, అహరోను, అహరోను కుమారులు వారి కాళ్లు చేతులు కడుక్కొనేందుకు ఈ గంగాళాన్ని ఉపయోగించారు. 32 వారు సన్నిధి గుడారంలో ప్రవేశించినప్పుడల్లా కాళ్లు కడుక్కొనేవారు. వాళ్లు బలిపీఠాన్ని సమీపించిన ప్రతీసారీ వాళ్లను వాళ్లు కడుక్కొనేవారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారం వాళ్లు ఇలా చేసారు.

33 తర్వాత గుడారపు ఆవరణలో తెరలను మోషే తగిలించాడు. మోషే గుడారపు ఆవరణలో బలిపీఠాన్ని పెట్టాడు. తర్వాత అతడు ఆవరణ ప్రవేశం దగ్గర తెరను వేసాడు. కనుక అతడు చేయాలని చెప్పి యెహోవా తనకు అప్పగించిన పని అంతా మోషే ముగించాడు.

యెహోవా మహిమ

34 అంతా ముగించిన తర్వాత సన్నిధి గుడారాన్ని ఒక మేఘం ఆవరించింది. యెహోవా మహిమ ఆ పవిత్ర గుడారాన్ని నింపివేసింది. 35 ఆ మేఘం పవిత్ర గుడారం మీద నిలిచిపోగా యెహోవా మహిమ దాన్ని నింపేసింది. కనుక మోషే ఆ సన్నిధి గుడారంలో ప్రవేశించలేక పోయాడు.

36 (ప్రజలు ఎప్పుడు సాగిపోవాల్సిందీ చూపెట్టిన మేఘం) పవిత్ర గుడారంనుండి మేఘం పైకి లేచినప్పుడు, ప్రజలు ప్రయాణం మొదలు పెట్టేవారు. 37 అయితే ఆ మేఘం పవిత్ర గుడారం మీద నిలిచి ఉన్నప్పుడు ప్రజలు సాగిపోయే ప్రయత్నం చేయలేదు. మేఘం లేచేంతవరకు వాళ్లు ఆ స్థలంలోనే ఉండిపోయారు. 38 కనుక యెహోవా మేఘం పగటివేళ పవిత్ర గుడారం మీద నిలిచి ఉండేది. మరియు రాత్రివేళ ఆ మేఘంలో అగ్ని ఉండేది. కనుక ఇశ్రాయేలు ప్రజలంతా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ మేఘాన్ని చూడగలిగారు.

యోహాను 19

19 ఆ తర్వాత పిలాతు యేసును తీసుకు వెళ్ళి కొరడాలతో కొట్టించాడు. భటులు ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి యేసు తలపై పెట్టారు. ఆయనకు ఊదారంగు వస్త్రాన్ని తొడిగించారు. ఆయన దగ్గరకు మాటి మాటికి వెళ్ళి, “యూదుల రాజా! జయము!” అని అంటూ ఆయన ముఖం మీద కొట్టారు.

పిలాతు మరొకసారి వెలుపలికి వచ్చి యూదులతో, “యిదిగో చూడండి! అతణ్ణి మీ ముందుకు తెస్తున్నాను. అతణ్ణి శిక్షించటానికి నాకే కారణం కనిపించటంలేదు. ఇది మీరు గ్రహించాలి” అని అన్నాడు. యేసుకు ముళ్ళ కిరీటాన్ని, ఊదారంగు దుస్తుల్ని ధరింపజేసి వెలుపలికి తీసుకొచ్చారు. పిలాతు వాళ్ళతో, “ఆ మనిషిని చూడండి!” అని అన్నాడు.

ప్రధానయాజకులు, అధికారులు యేసును చూడగానే, “సిలువకు వెయ్యండి! సిలువకు వెయ్యండి!” అని కేకలు వేసారు.

కాని పిలాతు, “మీరే తీసుకు వెళ్ళి సిలువకు వెయ్యండి. అతణ్ణి శిక్షించటానికి నాకే కారణం కనిపించటం లేదు” అని అన్నాడు.

కాని యూదులు, “మాకో న్యాయశాస్త్రం ఉంది. తాను, ‘దేవుని కుమారుడను’ అని అన్నాడు కనుక, మా న్యాయశాస్త్రం ప్రకారం అతడు మరణ దండన పొందాలి!” అని అన్నారు.

పిలాతు ఇది విని యింకా భయపడి పొయ్యాడు. అతడు తిరిగి భవనంలోకి వెళ్ళి యేసుతో, “నీ స్వగ్రామం ఏది?” అని అడిగాడు. కాని యేసు దానికి సమాధానం చెప్పలేదు. 10 పిలాతు, “నాతో మాట్లాడటానికి నిరాకరిస్తున్నావా? నిన్ను విడుదల చేయటానికి, సిలువకు వేయటానికి నాకు అధికారం ఉందని నీకు తెలియదా?” అని అన్నాడు.

11 యేసు సమాధానంగా, “పైన ఉన్నవాడు యిస్తే తప్ప నీకు నాపై ఏ అధికారం లేదు. కనుక నన్ను నీకు అప్పగించిన వాడు ఎక్కువ పాపం చేసాడు” అని అన్నాడు.

12 ఆ క్షణం నుండి, పిలాతు యేసును విడుదల చెయ్యాలని ప్రయత్నించాడు. కాని యూదులు, “ఇతణ్ణి విడుదల చేస్తే నీవు చక్రవర్తికి మిత్రుడవు కాదు. తాను రాజునన్న ప్రతి ఒక్కడూ చక్రవర్తిని వ్యతిరేకించిన వాడౌతాడు!” అని కేకలు వేసారు.

13 ఇది విని పిలాతు యేసును వెలుపలికి పిలుచుకొని వచ్చాడు. “రాళ్ళు పరచిన స్థలంలో” ఉన్న న్యాయపీఠంపై కూర్చున్నాడు. దీన్ని హీబ్రూ భాషలో “గబ్బతా” అని అంటారు. 14 అది పస్కా పండుగకు సిద్ధపడబొయ్యేరోజు. అప్పుడు ఉదయం సుమారు ఆరు గంటల సమయం. పిలాతు యూదులతో, “ఇదిగో మీ రాజు” అని అన్నాడు.

15 కాని వాళ్ళు, “తీసుకు వెళ్ళండి, తీసుకు వెళ్ళండి. సిలువకు వేయండి!” అని కేకలు వేసారు.

పిలాతు, “మీ రాజును సిలువకు వేయ మంటారా?” అని అన్నాడు.

ప్రధానయాజకులు, “చక్రవర్తి తప్ప మాకు వేరే రాజు లేడు” అని సమాధానం చెప్పారు.

16 తదుపరి, పిలాతు ఆయన్ని సిలువకు వెయ్యమని భటులకు అప్పగించాడు.

యేసుని సిలువకు వేయటం

(మత్తయి 27:32-44; మార్కు 15:21-32; లూకా 23:26-39)

17 భటులు యేసును తీసుకు వెళ్ళారు. తన సిలువను మోసుకొని యేసు “పుర్రె స్థలాన్ని” చేరుకున్నాడు. హీబ్రూ భాషలో దీన్ని “గొల్గొతా” అంటారు. 18 ఇక్కడ ఆయన్ని సిలువకు వేసారు. ఆయనకు ఇరువైపు మరొక యిద్దర్ని సిలువకు వేసారు.

19 పిలాతు, ఒక ప్రకటన వ్రాయించి ఆయన సిలువకు తగిలించాడు. ఆ ప్రకటనలో, “నజరేతు నివాసి యేసు యూదుల రాజు” అని వ్రాయబడి ఉంది. 20 యేసును సిలువకు వేసిన స్థలము పట్టణానికి దగ్గరగా ఉంది. ఆ ప్రకటన హీబ్రూ, రోమా, గ్రీకు భాషల్లో వ్రాయబడి ఉంది. కనుక చాలా మంది యూదులు ఈ ప్రకటన చదివారు.

21 యూదుల ప్రధాన యాజకులు దీన్ని గురించి పిలాతు ముందు ఫిర్యాదు చేస్తూ, “‘యూదుల రాజు’ అని వ్రాసారెందుకు? ‘ఇతడు, తాను యూదుల రాజని అన్నాడు’ అని వ్రాయండి” అని అన్నారు.

22 పిలాతు, “వ్రాసిందేదో వ్రాసాను” అని సమాధానం చెప్పాడు.

23 భటులు యేసును సిలువకు వేసాక ఆయన దుస్తుల్ని నాలుగు భాగాలుగా చేసి తలొకటి పంచుకున్నారు. వాళ్ళు ఆయన పొడుగాటి అంగీని కూడా లాక్కున్నారు. అది పైనుండి క్రింది దాకా కుట్టు లేకుండా నేయబడి ఉంది. 24 ఆ భటులు, “దీన్ని చింపకుండా చీట్లు వేసి ఎవరికి దొరుకుతుందో చూద్దాం!” అని మాట్లాడుకున్నారు. ఈ విధంగా అనుకున్నట్లు చేసారు:

“వాళ్ళు నా దుస్తుల్ని పంచుకొన్నారు!
    నా దుస్తుల కోసం చీట్లు వేసారు!”(A)

లేఖనాల్లో వ్రాయబడిన విషయం నిజం కావటానికి యిలా జరిగింది.

25 యేసు సిలువదగ్గర ఆయన తల్లి, తల్లి యెక్క సోదరి, క్లోపా భార్య మరియ, మగ్దలేనే మరియ, నిలుచొని ఉన్నారు. 26 యేసు తన తల్లి, తన ప్రియ శిష్యుడు అక్కడ నిలుచొని ఉండటం చూసాడు. తన తల్లితో, “అమ్మా! ఇదిగో నీ కుమారుడు” అని అన్నాడు. 27 ఆ శిష్యునితో, “ఇదిగో నీ తల్లి!” అని అన్నాడు. ఆనాటి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడు.

యేసు మరణం

(మత్తయి 27:45-56; మార్కు 15:33-41; లూకా 23:44-49)

28 ఆ తర్వాత యేసు అంతా ముగిసిందని గ్రహించాడు. ఆయన, “నాకు దాహం వేస్తోంది” అని అన్నాడు. లేఖనాల్లో వ్రాసింది నిజంకావటానికి ఇలా జరిగింది. 29 పులిసిన ద్రాక్షారసం ఉన్న ఒక కుండ అక్కడ ఉంది. వాళ్ళు ఒక స్పాంజి ఆ కడవలో ముంచి, హిస్సోపు చెట్టుకొమ్మపై ఆ స్పాంజి పెట్టి, దాన్ని యేసు పెదాలకు అందించారు. 30 ఆయన దాన్ని రుచిచూచి, “అంతా ముగిసింది” అని అన్నాడు. ఆ మాట అన్నాక, తలవాల్చి ఆత్మను అప్పగించాడు.

31 అది పండుగకు సిద్దమయ్యే రోజు. మరుసటి రోజు విశేషమైన విశ్రాంతి రోజు[a] కనుక ఆ రోజు వాళ్ళను సిలువపై వదిలి వేయటం యూదులకు యిష్టం లేదు. అందువల్ల వాళ్ళు వారి కాళ్ళు విరగ్గొట్టి వారిని క్రిందికి దింపి వెయించుమని పిలాతును అడిగారు. 32 భటులు వచ్చి యేసుతో సిలువకు వేయబడిన మొదటి వాని కాళ్ళు, రెండవ వాని కాళ్ళు విరగ్గొట్టారు. 33 వాళ్ళు యేసు దగ్గరకు వచ్చి ఆయన అప్పటికే చనిపోయినట్లు గమనించారు. అందువల్ల వాళ్ళు ఆయన కాళ్ళు విరగ్గొట్టలేదు.

34 దానికి మారుగా భటుల్లో ఒకడు యేసు డొక్కను బల్లెంతో పొడిచాడు. వెంటనే రక్తం, నీళ్ళు కారాయి. 35 మీరు కూడా విశ్వసించాలని ఈ సంఘటన చూసిన వాడు దీన్ని గురించి చెప్పాడు. అతడు చెప్పింది నిజం. తాను సత్యం పలుకుతున్నట్లు అతనికి తెలుసు. 36-37 లేఖనాల్లో వ్రాయబడిన విషయాలు నిజం కావటానికి యిలా జరిగింది. ఒకచోట ఇలా వ్రాయబడి ఉంది: “ఆయనలో ఒక్క ఎముక కూడ విరువబడదు.”(B) మరొక చోట, ఇలా వ్రాయబడివుంది: “తాము పొడిచిన వాని వైపు వాళ్ళు చూస్తారు.”(C)

యేసును సమాధి చేయటం

(మత్తయి 27:57-61; మార్కు 15:42-47; లూకా 23:50-56)

38 ఆ తర్వాత “అరిమతయియ” గ్రామానికి చెందిన యోసేపు, యేసు దేహాన్నివ్వమని పిలాతును అడిగాడు. యోసేపు యూదులంటే భయపడేవాడు. కనుక రహస్యంగా యేసు శిష్యుడైనాడు. పిలాతు అంగీకారం పొంది అతడు యేసు దేహాన్ని తీసుకు వెళ్ళాడు.

39 అతని వెంట “నీకొదేము” కూడా ఉన్నాడు. క్రితంలో ఒక నాటి రాత్రి యేసును కులుసుకున్న వాడు యితడే. ఇతడు ముప్పై అయిదు కిలోలబోళం, అగరుల మిశ్రమాన్ని తన వెంట తీసుకు వచ్చాడు. 40 వాళ్ళిద్దరూ కలిసి యేసు దేహాన్ని సుగంధ ద్రవ్యాల్లో ఉంచి, దాన్ని నారగుడ్డలో చుట్టారు. ఇలా చెయ్యటం యూదుల సాంప్రదాయం. 41 యేసును సిలువకు వేసిన చోట ఒక తోట ఉంది. ఆ తోటలో ఒక కొత్త సమాధిఉంది. ఆ సమాధిలో అంతవరకు ఎవర్నీ ఉంచలేదు. 42 అది యూదులు పండుగకు సిద్ధం అవ్వ బోయే రోజు. పైగా ఆ సమాధి సిలువకు సమీపంలో ఉంది. కనుక వాళ్ళు ఆయన దేహాన్ని ఆ సమాధిలో ఉంచారు.

సామెతలు 16

16 మనుష్యులు తమ ఆలోచనలు చేస్తారు. అయితే ఆ విషయాలు జరిగేటట్టుగా చేసేవాడు యెహోవాయే.

ఒకడు తాను చేసేది అంతా సరిగ్గా ఉంది అనుకొంటాడు. అయితే మనుష్యులు చేసే వాటికిగల అసలైన కారణాలు ఏమిటో యెహోవా తీర్పు చెబుతాడు.

నీవు చేసే ప్రతిదానిలో సహాయం కోసం ఎల్లప్పుడూ యెహోవా వైపు తిరుగు, నీవు జయం పొందుతావు.

ప్రతిదానికి యెహోవా ఏర్పాటు ఒకటి ఉంది. యెహోవా ఏర్పాటులో దుర్మార్గులు నాశనం చేయబడతారు.

ఇతరులకంటే తానే మంచివాడిని అనుకొనే ప్రతి మనిషి యెహోవాకు అసహ్యుడు. ఆ గర్విష్ఠుల నందరినీ యెహోవా తప్పక నాశనం చేస్తాడు.

నిజమైన ప్రేమ, నమ్మకం నిన్ను పవిత్రం చేస్తాయి. యెహోవాను గౌరవించు, నీవు దుర్మార్గానికి దూరంగా ఉంటావు.

ఒక వ్యక్తి యెహోవాను సంతోషపెట్టే విధంగా మంచి జీవితం జీవిస్తూంటే అప్పుడు అతని శత్రువులు కూడా అతనితో సమాధానంగా ఉంటారు.

మోసం చేసి విస్తారంగా సంపాదించుటకంటే, సరైన విధంగా కొంచెం మాత్రమే సంపాదించుట మేలు.

ఒక మనిషి తాను చేయాలనుకొనే వాటి విషయంలో పథకాలు వేయవచ్చు. అయితే ఏమి జరుగు తుంది అనేది నిర్ణయించే వాడు యెహోవా.

10 ఒక రాజు మాట్లాడితే, అతని మాటలు చట్టం అవుతాయి. అతని నిర్ణయాలు ఎల్లప్పుడూ న్యాయంగా ఉండాలి.

11 త్రాసులు, తూనిక రాళ్లు అన్నీ నిజాయితీగా ఉండాలని యెహోవా కోరుతాడు, వ్యాపార ఒప్పందాలన్నీ న్యాయంగా ఉండాలని ఆయన కోరుతాడు.

12 కీడు చేసే మనుష్యులను రాజులు అసహ్యించుకొంటారు. మంచితనం అతని రాజ్యాన్ని మరింత బలమైనదిగా చేస్తుంది.

13 రాజులు సత్యం వినాలని కోరుతారు. అబద్ధాలు చేప్పని ప్రజలు రాజులకు ఇష్టం.

14 రాజుకు కోపం వస్తే, అతడు ఎవరినైనా చంపవచ్చును. జ్ఞానముగలవాడు రాజును సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తాడు.

15 రాజు సంతోషంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికీ జీవితం సంతోషంగా ఉంటుంది. నీ విషయమై రాజు సంతోషిస్తే, అది మేఘం నుండి కురిసిన వర్షపు ఊటలా ఉంటుంది.

16 జ్ఞానము బంగారంకంటె చాలా ఎక్కువ విలువగలది. అవగాహన వెండికంటె చాలా ఎక్కువ విలువగలది.

17 మంచి మనుష్యులు దుర్మార్గానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ తమ జీవితాలు జీవిస్తారు. తన జీవితం కాపాడుకొనేవాడు తన ఆత్మను భద్రము చేసుకొంటున్నాడు.

18 ఒక వ్యక్తి గనుక గర్వంగా ఉంటే, అప్పుడు అతడు నాశనకరమైన అపాయంలో ఉన్నాడు. ఒక మనిషి ఇతరులకంటె తానే మంచివాడినని అనుకొంటే అతడు ఓడిపోయే ప్రమాదంలో ఉన్నాడు.

19 ఇతరులకంటె గొప్పవాళ్లం అనుకొనే వాళ్లతో ఐశ్వర్యాలు పంచుకోవటంకంటె, దీనులైన, పేదవాళ్లతో కలిసి జీవించటం మేలు.

20 మనుష్యులు తనకు నేర్పించుటకు ప్రయత్నించినప్పుడు, వినే వ్యక్తి లాభం పొందుతాడు. యెహోవాను నమ్ముకొనేవాడు ఆశీర్వదించబడుతాడు.

21 ఒకవేళ ఒక మనిషి జ్ఞానముగల వాడైతే అది ప్రజలు తెలుసుకొంటారు. జాగ్రత్తగా ఎంచుకొని మాటలు మాట్లాడే మనిషి, చాలా ఒప్పించదగినవాడుగా ఉంటాడు.

22 జ్ఞానముగల వారికి అది నిజమైన జీవాన్ని తెచ్చిపెడుతుంది. కాని బుద్ధిహీనులు మరింత బుద్ధిహీనంగా ఉండటమే నేర్చుకొంటారు.

23 జ్ఞానముగల మనిషి మాట్లాడక ముందు ఎల్లప్పుడూ ఆలోచిస్తాడు. అతడు చెప్పే మాటలు మంచివి, వినదగినవి.

24 దయగల మాటలు తేనెలా ఉంటాయి. వాటిని అంగీకరించటం సులభం, అవి నీ ఆరోగ్యానికి మంచివి.

25 మనుష్యుల దృష్టికి సరైనదిగా కనుపించే మార్గం ఒకటి ఉంది. కాని ఆ మార్గం మరణానికి మాత్రమే నడిపిస్తుంది.

26 పనివాని ఆకలి అతణ్ణి పని చేయిస్తూనే ఉంటుంది. అతడు భోజనం చేయగలిగేటట్టు, అతని ఆకలి అతణ్ణి పని చేయిస్తుంది.

27 పనికిమాలిన మనిషి చెడు పనులు చేయాలని పథకం వేస్తాడు. అతని సలహా నిప్పులా నాశనం చేస్తుంది.

28 చిక్కులు పేట్టేవారు ఎల్లప్పుడూ సమస్యలు పుట్టిస్తూంటారు. చెప్పుడు మాటలు వ్యాపింపజేసేవాడు సన్నిహితులైన మిత్రుల మధ్య చిక్కు కలిగిస్తాడు.

29 త్వరగా కోపం వచ్చే మనిషి తన స్నేహితులకు చిక్కు తెచ్చిపెడ్తాడు. మంచిది కాని మార్గంలో అతడు వారిని నడిపిస్తాడు. 30 కన్నుగీటి, చిరునవ్వునవ్వేవాడు ఏదో అక్రమం, కీడు తలపెడ్తున్నాడు.

31 నెరసిన తల వెంట్రుకలు, మంచి జీవితాలు జీవించిన వారికి మహిమ కిరీటం.

32 బలమైన ఒక సైనికునిగా ఉండటంకంటే సహనం గలిగి ఉండటం మంచిది, ఒక పట్టణం అంతటిని స్వాధీనం చేసికోవటంకంటే, నీ కోపాన్ని స్వాధీనం చేసికోవటం మేలు.

33 నిర్ణయాలు చేయటానికి మనుష్యులు చీట్లు వేస్తారు. కాని నిర్ణయాలు ఎల్లప్పుడూ దేవుని దగ్గర్నుండి వస్తాయి.

ఫిలిప్పీయులకు 3

నిజమైన ధర్మము

సోదరులారా! చివరి మాట, ప్రభువు మీకు కావలసినంత ఆనందం ప్రసాదించుగాక! వ్రాసిన విషయాలే మళ్ళీ వ్రాయటానికి నేను వెనుకాడను. దాని వల్ల మీకు యింకా ఎక్కువ లాభం కలుగుతుంది.

దుర్మార్గులైన ఆ కుక్కల విషయంలో శరీరాన్ని ముక్కలు చేసే వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మనం దేవుణ్ణి ఆయన ఆత్మ ద్వారా ఆరాధిస్తున్నాము.[a] ఇది నిజమైన సున్నతి. వాళ్ళు పొందిన సున్నతిలాంటిది కాదు. మనము యేసు క్రీస్తులో ఉన్నందుకు గర్విస్తున్నాము. కనుక బాహ్యంగా కనిపించే ఈ ఆచారాలను మనము విశ్వసించము. కాని అలాంటి ఆచారాలను విశ్వసించటానికి నాకు కారణాలు ఉన్నాయి. బాహ్యమైన ఈ ఆచారాలను నమ్మటం ముఖ్యమని యితరులు అనుకొంటున్నట్లయితే వాటిని నమ్మటానికి వాళ్ళకన్నా నాకు ఎక్కువ కారణాలు ఉన్నాయి. నేను పుట్టిన ఎనిమిదవ రోజు నాకు సున్నతి చేసారు. నేను బెన్యామీను తెగకు చెందిన వాణ్ణి. పుట్టుకతో ఇశ్రాయేలు దేశస్థుణ్ణి. హెబ్రీయులకు జన్మించిన హెబ్రీయుణ్ణి. ధర్మశాస్త్రాన్ని అనుసరించే పరిసయ్యుణ్ణి. ఉత్సాహంతో సంఘాన్ని హింసించిన వాణ్ణి. ధర్మశాస్త్రాల్లోని నియమాలను పాటించటంలో నేను ఒక్క తప్పు కూడా చేయలేదు.

నేను క్రీస్తు విశ్వాసిని అయినందుకు, ఇదివరలో లాభంగా పరిగణించిన వాటిని నేను ప్రస్తుతం నష్టంగా పరిగణిస్తున్నాను. అంతేకాక, నా ప్రభువైన యేసు క్రీస్తును తెలుసుకోవటం చాలా గొప్ప విషయం. ఆయనతో పోల్చి చూస్తే అన్నీ వృథా అనిపిస్తుంది. ఆయన కొరకు నేను అన్నీ వదిలి వచ్చాను. క్రీస్తును పొందాలని వాటిని చెత్తగా పరిగణిస్తున్నాను. ఆయనలో ఐక్యత పొంది ఉండటమే నా ఉద్దేశ్యము. ధర్మశాస్త్రాన్ని అనుసరించి పొందే నీతి నాకు అనవసరం. క్రీస్తులో విశ్వాసం ఉండటంవల్ల లభించే నీతి నాకు కావాలి. 10 నాకు క్రీస్తును తెలుసుకోవాలని ఉంది. చావునుండి బ్రతికి రాగల శక్తిని గురించి తెలుసుకోవాలని ఉంది. ఆయన పొందిన కష్టాల్లో పాలుపంచుకొని ఆయనతో స్నేహం పొందాలని ఉంది. ఆయనతో మరణించి ఆయనలా అయిపోవాలని ఉంది. 11 ఇవన్నీ చేసి తిరిగి బ్రతికి రావాలని ఉంది. దీన్ని ఏదో ఒక విధంగా సాధించాలని ఉంది.

గమ్యం వైపు పరుగెత్తటం

12 వీటన్నిటిని నేను యింకా సాధించలేదు. నాలో పరిపూర్ణత యింకా కలుగలేదు. కాని క్రీస్తు దేనికోసం నన్ను ఎన్నుకొన్నాడో దాన్ని నేను చేజిక్కించుకోవాలని పట్టుదలతో సాగిపోతున్నాను. 13 సోదరులారా! అది నాకు చిక్కిందని నేను అనుకోవటం లేదు. కాని ఒకటి మాత్రం నేను చేస్తున్నాను. గతాన్ని మరచిపోయి భవిష్యత్తులో ఉన్న దానికోసం కష్టపడుతున్నాను. 14 గమ్యాన్ని చేరుకొని బహుమతి పొందాలని ముందుకు పరుగెత్తుతున్నాను. దేవుడు నేను ఈ గమ్యాన్ని చేరుకోవాలని యేసు క్రీస్తు ద్వారా నన్ను పరలోకం కొరకు పిలిచాడు.

15 ఆత్మీయంగా పరిపూర్ణత పొందిన మనమంతా అన్ని విషయాల్లో యిలాంటి దృక్పథం ఉంచుకోవాలి. ఒకవేళ మీలో ఎవరికైనా దేని మీదనన్నా వేరు అభిప్రాయం ఉంటే దేవుడు దాన్ని కూడా మీకు స్పష్టం చేస్తాడు. 16 మనం మాత్రం, మనమిదివరలో సాధించిన వాటికి అనుగుణంగా నడుచుకొందాము.

17 సోదరులారా! నావలె జీవించండి. మేము బోధించిన విధానాన్ని అనుసరిస్తున్నవాళ్ళను గమనించండి. 18 నేనిదివరకే ఎన్నో సార్లు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ కన్నీళ్ళతో చెబుతున్నాను. క్రీస్తు సిలువ పట్ల శత్రుత్వంతో జీవిస్తున్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. 19 వినాశనమే వాళ్ళ గమ్యం. వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు. అవమానమే వాళ్ళ కీర్తి. వాళ్ళ మనస్సులు ఐహికమైన వాటిపై ఉంటాయి. 20 కాని మన నివాసం పరలోకంలో ఉంది. మనల్ని రక్షించటానికి పరలోకము నుండి రానున్న క్రీస్తు ప్రభువు కోసం మనం ఆశతో ఎదురు చూస్తున్నాము. 21 అన్నిటినీ తన ఆధీనంలో ఉంచుకోగల శక్తి ఆయనలో ఉంది. ఆ శక్తితో ఆయన మన నీచమైన శరీరాలను తన తేజోవంతమైన శరీరంలా ఉండేటట్లు చేస్తాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International