Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
నిర్గమకాండము 39

యాజకుల ప్రత్యేక వస్త్రాలు

39 పవిత్ర స్థలంలో యాజకులు పరిచర్య చేసేటప్పుడు ధరించే ప్రత్యేక వస్త్రాలు తయారు చేసేందుకు నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణంగల బట్టను పనివారు ఉపయోగించారు. మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం వారు అహరోనుకు గూడ ప్రత్యేక వస్త్రాలు తయారు చేసారు.

ఏఫోదు

బంగారు తీగ, శ్రేష్ఠమైన బట్ట, నీలం, ఎరుపు, ధూమ్రవర్ణం గల బట్టతో అతడు ఏఫోదును చేసాడు. బంగారాన్ని సన్నని రేకులుగా వారు కొట్టారు. తర్వాత బంగారాన్ని పొడవైన తీగలుగా కోసారు. నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణంగల బట్ట, నాణ్యమైన బట్టతో బంగారాన్ని కలిపి కొట్టారు. ఇది చాల నైపుణ్యంగల వాని పని. ఏఫోదుకు భుజభాగాలను వారు చేసారు. ఈ భాగాలు బట్ట అంచులకు బిగించబడ్డాయి. అప్పుడు అన్ని భాగాలు కలిసి కట్టబడ్డాయి. దట్టి కూడ ఆలాగే చేయబడింది అది ఏఫోదులో ఒక భాగంగా ఉండేటట్టు కలుపబడింది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే బంగారు తీగ, నాణ్యమైన బట్ట, నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణం బట్టలతో అది చేయబడింది.

రత్నాలను బంగారపు జవలలో పనివాళ్లు పొదిగించారు. ఇశ్రాయేలు కుమారుల పేర్లను వారు రత్నాలపై చెక్కారు. తర్వాత ఏఫోదు భుజ భాగాల మీద రత్నాలను వారు అమర్చారు. ఇశ్రాయేలు కుమారులలో ఒక్కొక్కరికి ఒక్కో రత్నం సూచనగా ఉంది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారమే ఇది చేయబడింది.

న్యాయతీర్పు పథకం

తర్వాత న్యాయతీర్పు పైవస్త్రం బెసలేలు చేసాడు. నిపుణుని పనిగా అది చేయబడింది. బంగారు దారాలు, నీలం, ఎరుపు, ధూమ్రవర్ణం బట్టలతో అది చేయబడింది. న్యాయతీర్పు పైవస్త్రం చతురస్రంగా ఉంది, రెండుగా మడత చేయబడింది. దాని పొడవు 9 అంగుళాలు, వెడల్పు 9 అంగుళాలు. 10 తర్వాత పనివాళ్లు అందమైన రత్నాలను నాలుగు వరుసలుగా దాని మీద పెట్టారు. మొదటి వరుసలో మాణిక్యం, గోమేధికం, మరకతం ఉన్నాయి. 11 రెండవ వరుసలో పద్మరాగం, నీలం, సూర్యకాంతమణి వున్నాయి. 12 మూడవ వరుసలో గారుత్మతకం, యష్మురాయి. ఇంద్రనీలం వున్నాయి. 13 నాలుగవ వరుసలో రక్తవర్ణపు రాయి, సులిమానిరాయి, సూర్యకాంతం ఉన్నాయి. ఈ రత్నాలన్నీ బంగారంలో పొదిగించబడ్డాయి. 14 ఒక పనివాడు ఒక ముద్రను చేసినట్టు, ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఈ పన్నెండు రాళ్లమీద చెక్కబడ్డాయి. ఇశ్రాయేలు కుమారులు ఒక్కొక్కరి పేరు ఒక్కో రాయి మీద ఉంది.

15 న్యాయతీర్పు పైవస్త్రం కోసం స్వచ్ఛమైన బంగారంతో ఒక గొలుసు చేయబడింది. అది తాడుతో అల్లిక చేయబడింది. 16 పనివాళ్లు రెండు బంగారు దిమ్మలు, రెండు బంగారు ఉంగరాలు చేసారు. న్యాయ తీర్పు వస్త్రం పైభాగంలోని రెండు మూలల్లో బంగారు ఉంగరాలు రెండు పెట్టారు. 17 తర్వాత బంగారు గొలుసులు రెంటిని న్యాయతీర్పు వస్త్రానికి మూలల్లో రెండు ఉంగరాలకు కట్టారు. 18 బంగారు తాళ్ల అవతలి కొనలను రెండు జవలకు కట్టారు. తర్వాత ఏఫోదు ఎదుట భాగంలోని రెండు భుజాలకు వారు వాటిని బిగించారు. 19 తర్వాత వారు మరి రెండు బంగారు ఉంగరాలు చేసి, ఏఫోదు అడుగు భాగపు రెండు మూలల్లో పెట్టారు. ఏఫోదు దగ్గర లోపలి భాగంలో వారు ఆ ఉంగరాలను పెట్టారు. 20 భుజభాగాల ముందర అడుగు భాగంలో కూడా రెండు బంగారు ఉంగరాలను వారు పెట్టారు. ఏఫోదు దట్టీకి పైగా బిగింపు కూర్పునకు దగ్గరగా ఈ ఉంగరాలు ఉన్నాయి. 21 తర్వాత నీలి (దారంతో అల్లిన బట్ట) దట్టీతో తీర్పు పతకపు ఉంగరాలను ఏఫోదు ఉంగరాలకు కట్టారు. ఈ విధంగా తీర్పు పతకం నడికట్టును హత్తుకొని ఉంది. అది పడిపోదు. యెహోవా ఆజ్ఞాపించినట్లే వాళ్లు ఇవన్నీ చేసారు.

యాజకులకు ఇతర వస్త్రాలు

22 తర్వాత ఏఫోదు అంగీని వారు తయారు చేసారు. నీలం గుడ్డతో దాన్ని తయారు చేసారు. అది ఒక నిపుణుని పనితనం. 23 అంగీ మధ్యలో ఒక రంధ్రం ఉంది, ఆ రంధ్రం చుట్టూ ఒక గుడ్డ ముక్క కట్టబడింది. ఆ గుడ్డ ముక్క గోటు. ఆ రంధ్రం చినిగి పోకుండా ఉంచుతుంది.

24 తర్వాత నాణ్యమైన బట్ట నీలం, ఎరుపు ధూమ్ర వర్ణపు నారబట్ట ఉపయోగించారు. అంగీ అడుగు భాగానికి చుట్టూరా దానిమ్మలను కట్టారు. 25 తర్వాత స్వచ్ఛమైన బంగారంతో గంటలను వారు చేసారు. అంగీ అడుగు భాగాన దానిమ్మలకు మధ్య ఈ గంటలను వారు కట్టారు. 26 అంగీ అడుగు భాగం చుట్టూరా గంటలు, దానిమ్మలు ఉన్నాయి. ప్రతి దానిమ్మకూ మధ్య ఒక గంట వుంది సరిగా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే యాజకుడు యెహోవాకు సేవ చేసేటప్పుడు ఈ అంగీని ధరించేవాడు.

27 అహరోనుకు, అతని కుమారులకు చొక్కాలను పనివారు తయారు చేసారు. నాణ్యమైన బట్టతో ఈ చొక్కాలు చేయబడ్డాయి. 28 ఇంకా పనివాళ్లు నాణ్యమైన బట్టతో తలపాగాలను చేసారు. తలకు లోపలను, ఏఫోదు తీర్పు పతకాల కింద ధరించే బట్టలను వాళ్లు తయారు చేసారు. నాణ్యమైన బట్టతో వాళ్లు వీటిని తయారు చేసారు. 29 నాణ్యమైన బట్ట నీలం, ఎరుపు, ధూమ్ర వర్ణంగల బట్టతో నడికట్టును వారు తయారు చేసారు. బట్టతో చిత్రపటాలు కుట్టబడ్డాయి. యెహోవా ఆజ్ఞాపించినట్టే ఇవన్నీ చేయబడ్డాయి.

30 తర్వాత పవిత్ర కిరీటం కోసం ఒక బంగారు బద్ద తయారు చేసారు. దాన్ని స్వచ్ఛమైన బంగారంతో వాళ్లు చేసారు. బంగారం మీద వాళ్లు “యెహోవాకు పవిత్రం.” అనే మాటలు వ్రాసారు. 31 తర్వాత వాళ్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే ఆ బంగారు బద్దకు ఒక నీలసూత్రం కట్టి, దానిని తలపాగాకు కట్టారు.

పవిత్ర గుడారాన్ని మోషే తనిఖీ చేయటం

32 కనుక సన్నిధి గుడారపు పని అంతా అయిపోయింది. సరిగ్గా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే ఇశ్రాయేలు ప్రజలు సమస్తం చేసారు. 33 తర్వాత పవిత్ర సమావేశ గుడారాన్ని వారు మోషేకు చూపించారు. గుడారాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని వాళ్లు అతనికి చూపించారు. ఉంగరాలు, చట్రాలు, కమ్ములు, స్తంభాలు, దిమ్మలు, అన్నీ వాళ్లు అతనికి చూపించారు. 34 ఎరుపు రంగు వేయబడ్డ గొర్రె చర్మాలతో తయారు చేయబడిన గుడారపు పైకప్పును వారు అతనికి చూపించారు. పొట్టేళ్ల తోలుతో చేయబడ్డ పైకప్పును వారు అతనికి చూపించారు. మరియు శ్రేష్ఠమైన తోలుతో చేయబడ్డ పవిత్ర స్థల ప్రవేశానికి వేసే తెరను కూడా అతనికి చూపించారు.

35 ఒడంబడిక పెట్టెను వారు మోషేకు చూపించారు. ఆ పెట్టెను మోసేందుకు ఉపయోగించే కర్రలను, పెట్టెను మూసివుంచే మూతను వారు అతనికి చూపించారు. 36 బల్లను, గోనెమీద ఉంచే వాటన్నింటిని, దేవుని ప్రత్యేక రొట్టెను వారు మోషేకు చూపెట్టారు. 37 స్వచ్ఛమైన బంగారంతో చేయబడ్డ దీపస్తంభాన్ని, దాని మీద దీపాలను వారు మోషేకు చూపించారు. దీపాలకు ఉపయోగించే నూనె, ఇతర వస్తువులన్నింటిని వారు మోషేకు చూపించారు. 38 బంగారు బలిపీఠం, అభిషేక తైలం, పరిమళ వాసనగల ధూపం, గుడారపు ప్రవేశాన్ని మూసి వుంచే తెరను వారు అతనికి చూపించారు. 39 ఇత్తడి బలిపీఠమును, ఇత్తడి తెరను వారు అతనికి చూపించారు. బలిపీఠాన్ని మోసేందుకు ఉపయోగించే కర్రలను వారు మోషేకు చూపించారు. బలిపీఠం మీద ఉపయోగించే వస్తువులన్నింటినీ వారు మోషేకు చూపించారు. గంగాళాన్ని గంగాళం కింద ఉండే దిమ్మను వారు అతనికి చూపించారు. 40 ఆవరణలో స్తంభాలు, దిమ్మలతో ఉన్న తెరల గోడను మోషేకు వారు చూపించారు. ఆవరణ ద్వారాన్ని కప్పి ఉంచే తెరను వారు అతనికి చూపించారు. తాళ్లను, పవిత్ర గుడారపు మేకులను వారు అతనికి చూపించారు. పవిత్ర గుడారంలో, సన్నిధి గుడారంలో ఉన్నవాటన్నింటినీ వారు అతనికి చూపించారు.

41 తర్వాత పవిత్ర గుడారంలో సేవలు చేసే యాజకుల కోసం తయారు చేయబడ్డ వస్త్రాలను వారు మోషేకు చూపించారు. యాజకుడైన అహరోను, అతని కుమారుల కోసం తయారు చేయబడ్డ ప్రత్యేక వస్త్రాలను వారు అతనికి చూపించారు. వారు యాజకులుగా సేవ చేసినప్పుడు ఆ వస్త్రాలు ధరించారు.

42 సరిగ్గా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే ఇశ్రాయేలు ప్రజలు ఈ పని అంతా చేసారు. 43 పని అంతటినీ మోషే చాలా సునిశితంగా పరిశీలించాడు. సరిగ్గా యెహోవా ఆజ్ఞాపించినట్టే పని జరిగినట్టు మోషే చూసాడు. కనుక వాళ్లను మోషే ఆశీర్వదించాడు.

యోహాను 18

యేసును బంధించటం

(మత్తయి 26:47-56; మార్కు 14:43-50; లూకా 22:47-53)

18 యేసు ప్రార్థించటం ముగించాక తన శిష్యులతో కలిసి ప్రయాణమయ్యాడు. అంతా కలిసి కెద్రోను లోయ దాటి వెళ్ళారు. అక్కడ ఒక ఒలీవల తోట ఉంది. వాళ్ళు ఆ తోటలోకి వెళ్ళారు.

యేసు తన శిష్యులతో తరుచు యిక్కడ కలుసుకొంటూ ఉండేవాడు కనుక ఆయనకు ద్రోహం చేసిన యూదాకు ఈ స్థలం తెలుసు. అందువల్ల యూదా ఒక సైనిక దళాన్ని, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన కొంతమంది రక్షక భటుల్ని వెంట బెట్టుకొని వచ్చాడు. వాని వెంట ఉన్న వాళ్ళు ఆయుధాలను, దివిటీలను, దీపాలను, పట్టుకొని వాణ్ణి అనుసరించారు.

యేసుకు జరుగనున్నదంతా తెలుసు. ఆయన ముందుకు వచ్చి, “వాళ్ళతో మీకెవరు కావాలి?” అని అడిగాడు.

“నజరేతుకు చెందిన యేసు!” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

“ఆయన్ని నేనే!” అని యేసు అన్నాడు. ద్రోహం చేసిన యూదా వాళ్ళతో నిలుచుని ఉన్నాడు. యేసు, “నేనే ఆయన్ని” అని అనటం విని వాళ్ళు ఒక అడుగు వెనక్కు వేసి క్రింద పడిపోయారు.

యేసు, “మీకెవరు కావాలి?” అని మళ్ళీ అడిగాడు.

వాళ్ళు, “నజరేతుకు చెందిన యేసు” అని సమాధానం చెప్పారు.

యేసు, “ఆయన్ని నేనే అని చెప్పానుగా? మీరు నా కోసం చూస్తుంటే వీళ్ళను మాత్రం వెళ్ళ నివ్వండి” అని అన్నాడు. “నీవు నాకప్పగించిన వాళ్ళలో ఒక్కణ్ణి కూడా నేను పోగొట్టుకోలేదు” అని ఆయన అన్న మాటలు నిజం కావటానికి యిలా జరిగింది.

10 సీమోను పేతురు దగ్గర ఒక కత్తి ఉండింది. అతడు ఆ కత్తి దూసి ప్రధాన యాజకుని సేవకుణ్ణి నరకటానికి పోయి, అతని కుడి చెవి నరికి వేసాడు. ఆ సేవకుని పేరు “మల్కు.” 11 యేసు పేతురుతో, “నీ కత్తి ఒరలో పెట్టు! నా తండ్రి యిచ్చిన పాత్ర నేను త్రాగకుండా ఉంటానా?” అని అన్నాడు.

యేసును అన్న దగ్గరకు పిలుచుకు వెళ్ళటం

(మత్తయి 26:57-58; మార్కు 14:53-54; లూకా 22:54)

12 ఆ తర్వాత సైనిక దళము, దళాధిపతి, రక్షక భటులు యేసును బంధించి, మొదట అన్న దగ్గరకు తీసుకు వెళ్ళారు. “అన్న” “కయపకు” కూమార్తె నిచ్చిన మామ. 13 “కయప” ఆ సంవత్సరానికి ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. 14 ప్రజల కొరకు ఒకే ఒక వ్యక్తి చనిపోవటం మంచిదని యూదులకు సలహా ఇచ్చిన వాడు ఇతడే!

పేతురు తెలియదనటం

(మత్తయి 26:69-70; మార్కు 14:66-68; లూకా 22:55-57)

15 సీమోను పేతురు, అతనితో పాటు యింకొక శిష్యుడు యేసు వెంట వెళ్ళారు. ఈ యింకొక శిష్యుడు ప్రధాన యాజకునికి తెలిసినవాడు. అందువల్ల అతడు యేసు వెంట ప్రధాన యాజకుని యింటి ఆవరణంలోకి వెళ్ళాడు. 16 కాని పేతురు బయట ద్వారం దగ్గర ఉండవలసి వచ్చింది. ప్రధాన యాజకునికి పరిచయమున్న ఆ యింకొక శిష్యుడు, బయటికి వచ్చి అక్కడవున్న కాపలా ఆమెతో మాట్లాడి పేతుర్ని లోపలికి పిలుచుకు వెళ్ళాడు. 17 “నీవు అతని శిష్యుల గుంపుకు చెందిన వాడవు కావా?” అని ద్వారం దగ్గరున్న కాపలాది పేతుర్ని అడిగింది.

“లేదు!” అని అతడు జవాబు చెప్పాడు.

18 చలిగా ఉంది కనుక రక్షక భటులు, సేవకులు, చలిమంట వేసి దాని చుట్టూ నిల్చున్నారు. పేతురు వెళ్ళి వారితో సహా చలికాచుకొనుచున్నాడు.

ప్రధానయాజకుడు యేసుని ప్రశ్నించటం

(మత్తయి 26:59-66; మార్కు 14:55-64; లూకా 22:66-71)

19 ప్రధానయాజకుడు యేసును ఆయన శిష్యుల్ని గురించి, ఆయన బోధిస్తున్న విషయాల్ని గురించి ప్రశ్నించాడు. 20 యేసు, “నేను సమాజమందిరాలలోను, యూదులు సమావేశమయ్యే దేవాలయంలోను బహిరంగంగా ఈ ప్రపంచానికి బోధించేవాణ్ణి. నేను రహస్యంగా ఏదీ బోధించలేదు. 21 అలాంటప్పుడు నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు. నేను చెప్పిన వాటిని గురించి, నా బోధనలను విన్న వాళ్ళను అడగండి. నేను చెప్పినవి వాళ్ళకు తెలుసు” అని అన్నాడు.

22 యేసు ఈ విధంగా మాట్లాడటం వలన ఆయన ప్రక్కన నిలుచున్న ఒక రక్షక భటుడు ఆయన చెంప మీద కొడుతూ, “ప్రధానయాజకునితో అలాగేనా మాట్లాడటం?” అని అన్నాడు.

23 యేసు, “నేను ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే చెప్పు. కాని నేను నిజం మాట్లాడాను. మరినన్నెందుకు కొట్టావు?” అని అడిగాడు.

24 ఆ తర్వాత అన్న ఆయనకు కట్టిన త్రాళ్ళు విప్పకుండా ప్రధాన యాజకుడు కయప దగ్గరకు పంపాడు.

పేతురు రెండవసారి, మూడవసారి తెలియదని అనటం

(మత్తయి 26:71-75; మార్కు 14:69-72; లూకా 22:58-62)

25 సీమోను పేతురు నిలుచొని యింకా చలికాగుతూ ఉన్నాడు. వాళ్ళు “నీవు అతని శిష్యుల్లో ఒకడివి కాదా?” అని అడిగారు.

“కాదు” అని పేతురు అన్నాడు.

26 ప్రధాన యాజకుని దగ్గర ఒకడు పని చేస్తూ ఉండేవాడు. వీని బంధువు చెవును పేతురు నరికివేసాడు. వాడు పేతురుతో, “నీవు అతనితో కలిసి తోటలో ఉండగా చూడలేదని అనుకొంటున్నావా?” అని అన్నాడు.

27 పేతురు మళ్ళీ, “లేదు” అన్నాడు. వెంటనే కోడి కూసింది.

పిలాతు సమక్షంలో యేసు

(మత్తయి 27:1-2, 11-31; మార్కు 15:1-20; లూకా 23:1-25)

28 ఆ తర్వాత యూదులు యేసును కయప నుండి రోము రాజ్యాధికారి భవానానికి తీసుకు వెళ్ళారు. తెల్లవారింది. పస్కా పండుగ భోజనం చెయ్యటానికి ముందు మైలపడ కూడదని వాళ్ళు రాజభవనంలోకి వెళ్ళలేదు. 29 పిలాతు వాళ్ళను కలవటానికి వెలుపలికి వచ్చి, “ఇతడేమి తప్పు చేసాడు?” అని అడిగాడు.

30 “అతడు నేరస్థుడు కానట్లైతే మీకు అప్పగించే వాళ్ళంకాదు!” అని అన్నారు.

31 పిలాతు, “అతణ్ణి మీరే తీసుకు వెళ్ళి మీ ధర్మ శాస్త్రాన్ననుసరించి విచారణ చేసుకోండి” అని అన్నాడు.

32 యూదులు, “మాకు మరణశిక్ష విధించే అధికారం లేదే!” అని సమాధానం చెప్పారు. యేసు, తాను ఎలాంటి మరణం పొందనున్నాడో యిది వరకే చెప్పాడు. అది నిజం కావాలని యిలా జరిగింది.

33 పిలాతు భవనంలోకి వెళ్ళి యేసును పిలిపించాడు. ఆయనతో, “నీవు యూదుల రాజువా?” అని అడిగాడు.

34 యేసు, “అది నీవు స్వయంగా వేసిన ప్రశ్నాలేక యితర్లు నా గురించి అలా చెప్పారా?” అని అడిగాడు.

35 పిలాతు, “నేను యూదుణ్ణి అని అనుకుంటున్నావా? నీ వాళ్ళు, మీ ప్రధాన యాజకుడు నిన్ను నాకు అప్పగించారు. నీవు ఏం చేసావు?” అని అడిగాడు.

36 యేసు, “నా రాజ్యం ఈ ప్రపంచానికి సంబంధించింది కాదు. అలాగైనట్లైతే నా అనుచరులు యూదుల చేత నేను బంధింపకుండా ఉండాలని వాళ్ళతో యుద్ధం చేసేవాళ్ళు. కాని నా రాజ్యం పరలోక సంబంధమైంది” అని అన్నాడు.

37 “అలాగైతే నీవు రాజువన్నమాట!” అని పిలాతు అన్నాడు.

యేసు జవాబు చెబుతూ, “నన్ను రాజని నీవనటం నిజమే. నేను సత్యాన్ని గురించి చెప్పటానికి జన్మించాను. ఆ కారణంగానే ఈ ప్రపంచంలోకి వచ్చాను. సత్యాన్ని ప్రేమించే వాళ్ళు నా మాట వింటారు.”

38 “సత్యం అంటే ఏమిటి?” అని పిలాతు అడిగాడు. ఇలా అన్నాక అతడు మళ్ళీ యూదుల దగ్గరకు వెళ్ళి, “అతణ్ణి శిక్షించటానికి నాకు ఏ కారణం కనిపించటం లేదు! 39 కాని మీ ఆచారం ప్రకారం ప్రతి పస్కాపండుగకు ఒక ఖైదీని విడుదల చెయ్యటం నా ధర్మం, ‘యూదుల రాజును’ విడుదల చేయమంటారా?” అని అడిగాడు.

40 వాళ్ళు బిగ్గరగా కేకలు వేస్తూ, “వద్దు, అతణ్ణి కాదు. బరబ్బను విడుదల చెయ్యండి!” అని అన్నారు. ఈ బరబ్బ ఒక బందిపోటు దొంగ.[a]

సామెతలు 15

15 శాంతియుతమైన జవాబు కోపాన్ని పోగొడ్తుంది. కాని దురుసు జవాబు కోపాన్ని పెంచుతుంది.

జ్ఞానముగల మనిషి మాట్లాడినప్పుడు ఇతరులు వినాలని ఆశిస్తారు. కాని బుద్ధిహీనుడు మాట్లాడేది తెలివితక్కువ తనమే అవుతుంది.

అన్నిచోట్లా జరిగేవాటన్నింటినీ యెహోవా చూస్తాడు. దుర్మార్గులను, మంచి వాళ్లను యెహోవా గమనిస్తాడు.

దయగల మాటలు జీవవృక్షంలా ఉంటాయి. కాని అబద్ధాల మాటలు ఒక మనిషి ఆత్మను అణచివేస్తాయి.

తెలివితక్కువ వాడు తన తండ్రి సలహా వినేందుకు నిరాకరిస్తాడు. కాని జ్ఞానముగలవాడు మనుష్యులు అతనికి నేర్పించటానికి ప్రయత్నించినప్పుడు జాగ్రత్తగా వింటాడు.

మంచి మనుష్యులు అనేక విషయాలలో ఐశ్వర్యవంతులుగా ఉంటారు. కాని ఒక దుర్మార్గునికి ఉన్నవి అతనికి కష్టం మాత్రమే కలిగిస్తాయి.

జ్ఞానము గలవాడు మాట్లాడినప్పుడు అతడు జ్ఞానముతో మాట్లాడుతాడు. కాని బుద్ధిహీనులు వినదగినది ఏమీ చెప్పరు.

దుర్మార్గులు అర్పించే అర్పణలు యెహోవాకు అసహ్యం. అయితే మంచి మనిషి చేసే ప్రార్థనలు వినటం యెహోవాకు సంతోషం.

దుర్మార్గులు జీవించే విధానం యెహోవాకు అసహ్యం. మంచి పనులను చేయాలని ప్రయత్నించే మనుష్యులను యెహోవా ప్రేమిస్తాడు.

10 ఒక వ్యక్తి అక్రమంగా జీవించటం మొదలు పెడితే అతడు శిక్షించబడుతాడు. సరిదిద్దబడటానికి ఇష్టపడని మనిషి నాశనం చేయబడతాడు.

11 మరణస్థానంలో జరిగేదానితో సహా, సమస్తం యెహోవాకు తెలుసు. కనుక మనుష్యుల హృదయాల్లో, మనస్సుల్లో ఏమి జరుగుతుందో యెహోవాకు నిశ్చయంగా తెలుసు.

12 బుద్ధిహీనుడు తప్పు చేసినప్పుడు అది అతనికి చెబితే ఇష్టం ఉండదు. అతడు జ్ఞానముగల వారిని సలహా అడగటానికి నిరాకరిస్తాడు.

13 ఒక వ్వక్తి సంతోషంగా ఉంటే అతని ముఖం ఆనందంగా ఉంటుంది. అయితే ఒక మనిషి హృదయంలో విచారం ఉంటే, అప్పుడు అతని స్వభావంలో ఆ దు: ఖం వ్యక్తం అవుతుంది.

14 జ్ఞానముగలవాడు ఇంకా ఎక్కువ తెలివి సంపాదించాలని ప్రయత్నం చేస్తాడు. కాని బుద్ధిహీనునికి ఇంకా ఎక్కువ బుద్ధిహీనత కావాలి.

15 కొంతమంది పేదవాళ్లు ఎంతసేపూ విచారంగానే ఉంటారు. అయితే హృదయాల్లో సంతోషంగల పేదవాళ్లకు జీవితం ఒక పెద్ద విందులా ఉంటుంది.

16 ధనికునిగా అనేక కష్టాలు కలిగి ఉండటంకంటె, దరిద్రునిగా ఉండి యెహోవాను గౌరవించటం మేలు.

17 ద్వేషం ఉన్నచోట విస్తారంగా భోజనం చేయటంకంటే, ప్రేమగల చోట కొద్దిగా భోజనం చేయటం మేలు.

18 త్వరగా కోపపడేవారు కష్టాన్ని కలిగిస్తారు. కాని సహనంగల మనిషి శాంతిని కలిగిస్తాడు.

19 బద్ధకస్తునికి అంతటా కష్టమే ఉంటుంది. కాని నిజాయితీగల మనుష్యులకు జీవితం తేలిగ్గా ఉంటుంది.

20 జ్ఞానముగల కుమారుడు తన తండ్రికి సంతోషం కలిగిస్తాడు. అయితే బుద్ధిహీనుడు తన తల్లికి అవమానం తెస్తాడు.

21 తెలివితక్కువ వానికి తెలివితక్కువ తనమే ఆనందం. కాని జ్ఞానముగలవాడు సరైన వాటినే చేయటానికి జాగ్రత్తపడతాడు.

22 ఒక వ్యక్తి సరిపడినంత సలహా తీసుకొనకపోతే, అతని తలంపులు విఫలమవుతాయి. అయితే ఒక వ్యక్తి జ్ఞానముగలవారు తనకు చెప్పే విషయాలు వింటే విజయం పొందగలడు.

23 ఒక మనిషి మంచి జవాబు ఇచ్చినప్పుడు సంతోషిస్తాడు. మరియు సరైన సమయంలో సరైన మాట చెప్పటం చాలా మంచిది.

24 జ్ఞానముగల మనిషి చేసే పనులు విజయానికి నడిపిస్తాయి. అతడు మరణ స్థానానికి దిగజారిపోకుండా ఆ విషయాలు అతనిని వారిస్తాయి.

25 గర్విష్ఠికి ఉన్న గృహమును యెహోవా నాశనం చేస్తాడు. అయితే విధవరాలి వస్తువులను యెహోవా కాపాడుతాడు.

26 చెడు ఆలోచనలు యెహోవాకు అసహ్యం. కాని దయగల మాటల విషయంలో యెహోవా సంతోషిస్తాడు.

27 ఒక వ్యక్తి వస్తువులు సంపాదించటం కోసం దురాశపడితే అతడు తన కుటుంబానికి కష్టం తెచ్చి పెడ్తాడు. కాని లంచగొండితనాన్ని ద్వేషించే నిజాయితీపరుడు బతుకుతాడు.

28 మంచి మనుష్యులు జవాబు చెప్పక ముందు ఆలోచిస్తారు. అయితే దుర్మార్గులు ఆలోచించక ముందే మాట్లాడేస్తారు. అది వారికి కష్ఠం కలిగిస్తుంది.

29 యెహోవా దుర్మార్గులకు చాలా దూరంగా ఉంటాడు. కాని మంచివాళ్ల ప్రార్థనలు ఆయన ఎల్లప్పుడూ వింటాడు.

30 నవ్వుతూ ఉండే మనిషి ఇతరులను సంతోషపెడ్తాడు. శుభవార్త మనుష్యులకు మంచి సంతోషాన్ని కలిగిస్తుంది.

31 ఒక మనిషి తాను తప్పు చేసినప్పుడు, దానిని సరిదిద్దుటకు చెప్పినప్పుడు జాగ్రత్తగా వినేవాడు చాలా జ్ఞానముగలవాడు.

32 ఒకడు నేర్చుకొనేందుకు నిరాకరిస్తే అతడు తనకు తానే హాని చేసుకుంటున్నాడు. అయితే ఒక మనిషి తాను చేసింది తప్పు అని చెప్పినప్పుడు వినే మనిషి మరీ ఎక్కువగా గ్రహిస్తాడు.

33 యెహోవాను గౌరవించువాడు జ్ఞానము గలిగి ఉండటానికి నేర్చుకొంటున్నాడు. ఒక వ్యక్తి నిజంగా యెహోవాను గౌరవించేముందు, వినమ్రుడవ్వాలి.

ఫిలిప్పీయులకు 2

క్రీస్తు వినయంను అనుకరించుట

క్రీస్తులో ఐక్యత పొందటం వలన మీకు శక్తి కలిగింది కదా! ఆయన ప్రేమ మీకు ఆనందం యిస్తుంది కదా! ఆయన ఆత్మతో మీకు స్నేహం కలిగింది గదా! మీలో దయాదాక్షిణ్యాలు అభివృద్ధి చెందుతున్నాయి కదా! అలాగైతే ఒకే మనస్సుతో, ఒకే ప్రేమలో పాలుపంచుకొంటూ, ఒకే ఆత్మతో, ఒకే ఉద్దేశంతో ఉండి నన్ను పూర్తిగా ఆనందపరచండి. స్వలాభం కోసంగాని, స్వాభిమానం కోసంగాని ఏదీ చేయకండి. వినయంగా ఉండండి. మీరు యితరులకన్నా గొప్ప అని భావించకండి. మీ స్వార్థం కోసం మాత్రమే చూసుకోకుండా యితరుల అవసరాలను కూడా గమనించండి.

నిస్వార్థంగా నుండుటకు క్రీస్తునుండి నేర్చుకొనండి

యేసు క్రీస్తులో ఉన్న మనస్సును పెంచుకోండి.

ఆయన దేవునితో సమానము.
    అయినా ఆయన ఆ స్థానాన్ని పట్టుకొని కూర్చోవాలనుకోలేదు.
ఆయన అంతా వదులుకొన్నాడు.
    మానవ రూపం దాల్చి సేవకునివలే ఉండటానికి వచ్చాడు.
    మానవుని వలే కనిపిస్తూ, వినయంగా వుంటూ,
    మరణాన్ని కూడా విధేయతగా అంగీకరించి, సిలువపై మరణించాడు.
అందువల్ల దేవుడాయనకు ఉన్నత స్థానం ఇచ్చి
    అన్ని పేర్లకన్నా ఉత్తమమైన పేరు యిచ్చాడు.
10 యేసు పేరు విన్నప్పుడు పరలోకంలో, భూలోకంలో, పాతాళలోకంలో
    ఉన్నవాళ్ళంతా ఆయన ముందు మోకరిల్లాలని ఈ విధంగా చేసాడు.
11 ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభువని అంగీకరించాలని ఈ విధంగా చేసాడు.
    తండ్రియైన దేవునికి మహిమ కలుగుగాక!

నక్షత్రాలవలె ప్రకాశించటం

12 నా ప్రియ మిత్రులారా! నేను మీతో ఉన్నప్పుడు మీరు దేవుని ఆజ్ఞల్ని అతిక్రమించలేదు. ప్రస్తుతం నేను మీతో లేను కనుక యిప్పుడు మీరు దేవుని ఆజ్ఞల్ని పాటించుచూ మీ స్వంత రక్షణను భయముతోను, వణకుతోనూ, కార్యసాధకము చేయండి. 13 దేవుడు మీలో ఉండి తన ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకోవటానికి కావలసిన ఉత్సాహము, శక్తి మీకు యిస్తాడు.

14 మీరు చేస్తున్న పని గొణగకుండా, వాదించకుండా చెయ్యండి. 15 అప్పుడు మీరు నిష్కళంకులై మంచి వాళ్ళుగా ఉంటారు. దుర్మార్గులై, నీతి లేకుండా జీవిస్తున్న వీళ్ళ మధ్య ఏ అపరాధమూ చెయ్యని దేవుని బిడ్డల్లా ఉంటారు. మీరు వాళ్ళ మధ్య ఆకాశంలోని నక్షత్రాల్లా ప్రకాశిస్తారు. 16 మీరు జీవంగల దైవసందేశాన్ని ప్రకటిస్తున్నారు. కనుక క్రీస్తు వచ్చిన రోజున మీ విషయంలో గర్వించటానికి నాకు ఆస్కారం ఉంటుంది. నా కృషి, సాధన వ్యర్థం కాలేదని రుజువౌతుంది.

17 మీ విశ్వాసం వల్ల అర్పిస్తున్న బలికి తోడుగా నా రక్తాన్ని బలిగా ధార పోయవలసివస్తే నేను వెనుకాడను. చాలా ఆనందిస్తాను. నా ఆనందాన్ని మీతో పంచుకోవాలని నా కోరిక. 18 అందువల్ల మీరు కూడా ఆనందించి, మీ ఆనందాన్ని నాతో పంచుకొండి.

తిమోతిని పంపటం

19 మిమ్మల్ని గురించి తెలిస్తే నాకు కూడా ఆనందం కలుగుతుంది. కనుక తిమోతిని మీ దగ్గరకు పంపే అవకాశం యేసు ప్రభువు త్వరలో కలిగిస్తాడని నిరీక్షిస్తాను. 20 మీ క్షేమం విషయంలో నిజంగా శ్రద్ధ వహించే వ్యక్తి అతను తప్ప నా దగ్గర మరొకడు లేడు. 21 ప్రతి ఒక్కడూ తన స్వార్థం కోసం ఆలోచిస్తాడే కాని యేసు క్రీస్తును గురించి ఆలోచించడు. 22 సువార్త ప్రచారం చెయ్యటానికి అతడు నా కుమారునిలా పని చేసాడు. అలా చేసి తన యోగ్యతను రుజువు చేసుకొన్నాడని మీకు తెలుసు. 23 నా పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియగానే అతణ్ణి మీ దగ్గరకు పంపటానికి ఎదురు చూస్తున్నాను. 24 నన్ను కూడా త్వరలో మీ దగ్గరకు పంపుతాడనే నమ్మకం నాకు ప్రభువుపట్ల ఉంది.

25 నాకు సహాయం చెయ్యటానికి మీరు ఎపఫ్రొదితును పంపారు. అతడు మీరు పంపిన దూత. అతణ్ణి తిరిగి మీ దగ్గరకు పంపటం అవసరమని భావిస్తున్నాను. ఎపఫ్రొదితు నాతో కలిసి నా సోదరునివలే పోరాడి, పని చేసాడు. 26 మిమ్మల్ని చూడాలని, మీ దగ్గరకు రావాలని అతడు ఎదురు చూస్తున్నాడు. అతడు జబ్బుతో ఉన్నాడన్న విషయం మీరు విన్నట్లు అతనికి తెలిసి అతడు చాలా చింతిస్తున్నాడు. 27 అతనికి నిజంగా చనిపోయేటంత జబ్బు చేసింది. కాని దేవుని దయ అతనిపై ఉంది. కనుక అతను బ్రతికాడు. దేవుడు అతనికే కాకుండా, నాకు మరొకసారి దుఃఖం కలుగరాదని నాపై కూడా దయచూపాడు. 28 అందువల్ల అతణ్ణి మీ దగ్గరకు పంపాలని ఎదురు చూస్తున్నాను. అతణ్ణి చూసి మీరు ఆనందించాలని నా ఉద్దేశ్యం. అప్పుడు నాకు నిశ్చింతగా ఉంటుంది. 29 కనుక ప్రభువు పేరిట ఆనందంతో అతనికి స్వాగతం చెప్పండి. అలాంటి వాళ్ళను మీరు గౌరవించాలి. 30 మీరు చేయలేని సహాయం తాను చేయాలని అతడు తన ప్రాణానికి తెగించాడు. క్రీస్తు అప్పగించిన పని పూర్తిచేయటం కొరకు మరణించటానికి కూడా అతడు సిద్ధమయ్యాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International