M’Cheyne Bible Reading Plan
కొత్త రాతి పలకలు
34 అప్పుడు మోషేతో యెహోవా ఇలాగు చెప్పాడు: “ముందు పగులగొట్టబడ్డ రెండు రాతి పలకల్లాంటివే మరో రెండు రాతి పలకలు తయారు చేయి. మొదటి రెండు రాళ్లమీద వ్రాయబడ్డ మాటలే ఈ రాళ్ల మీద నేను రాస్తాను. 2 రేపు ఉదయం సిద్ధంగా ఉండు. సీనాయి కొండమీదికి రమ్ము. అక్కడ కొండ శిఖరం మీద నా ఎదుట నిలబడు. 3 నీతో ఇంక ఏ వ్యక్తీ రావడానికి వీలులేదు. కొండమీద ఎక్కడా ఏ వ్యక్తి కనబడకూడదు. కనీసం ఆ కొండ కిందకూడ నీ పశువుల మందలు కాని, గొర్రెల మందలు గాని మేత కూడ మేయకూడదు.”
4 కనుక మొదటి వాటిలాగే మరో రెండు రాతి పలకలను మోషే చేసాడు. ఆ మర్నాడు ఉదయాన్నే సీనాయి కొండ మీదికి అతడు వెళ్లాడు. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన ప్రకారమే అంతా చేసాడు. ఆ రెండు రాతి పలకలను మోషే తీసుకొని వెళ్లాడు. 5 మోషే కొండ మీద ఉన్నప్పుడు, ఒక మేఘం మీద యెహోవా దిగి వచ్చాడు. అక్కడ మోషే దగ్గర యెహోవా నిలబడ్డాడు. అతడు యెహోవాను పేరుపెట్టి పిలిచాడు. 6 మోషే ఎదుట యెహోవా దాటి వెళ్తూ ఇలా అన్నాడు: “యెహోవా దయ, జాలిగల దేవుడు. యెహోవా త్వరగా కోపపడడు. యెహోవా మహా ప్రేమపూర్ణుడు. యెహోవా నమ్ముకోదగినవాడు. 7 వేలాది తరాలకు దయచూపించే వాడు యెహోవా. ప్రజలు చేసే తప్పులను యెహోవా క్షమిస్తాడు. అయితే నేరస్తులను శిక్షించడం యెహోవా మరచిపోడు. నేరస్తులను యెహోవా శిక్షించడమే కాదు, వారు చేసే తప్పులవల్ల వారి పిల్లలు, మనుమళ్లు, మూడు నాలుగు తరాల వరకు శ్రమ అనుభవిస్తారు.”
8 వెంటనే మోషే సాష్టాంగపడి యెహోవాను ఆరాధించాడు. మోషే ఇలా అన్నాడు: 9 “ప్రభూ, నా విషయం నీకు ఇష్టమైతే దయచేసి మాతోకూడా రమ్ము. వీళ్లు మొండి ప్రజలని నాకు తెలుసు. అయితే మేము చేసిన తప్పుల విషయంలో మమ్మల్ని క్షమించు. మమ్మల్ని నీ ప్రజలుగా స్వీకరించు.”
10 అప్పుడు యెహోవా చెప్పాడు: “నీ ప్రజలందరితో నేను ఈ ఒడంబడికను చేస్తున్నాను. భూమి మీద ఈ జనం కోసం ఇదివరకు ఎన్నడూ చేయని అద్భుతకార్యాలు నేను చేస్తాను. యెహోవానైన నేను మహాఘనుడనని నీతో ఉన్న ప్రజలు చూస్తారు. నేను నీ కోసం చేసే అద్భుత కార్యాలను వారు చూస్తారు. 11 ఈ వేళ నీకు నేను ఆజ్ఞాపిస్తున్న విషయాలకు లోబడు, నీ శత్రువులు నీ దేశము వదలివెళ్లి పోయేటట్టు నేను వారిని బలవంతం చేస్తాను. అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను నేను బయటకు వెళ్ళగొడతాను. 12 జాగ్రత్తగా ఉండు! నీవు వెళ్తోన్న దేశంలో నివసించే ప్రజలతో ఎలాంటి ఒడంబడిక చేయకు. ఆ ప్రజలతో నీవు ఏదైనా ఒడంబడిక చేస్తే, అది నీకు చిక్కు తెచ్చిపెడుతుంది. 13 అయితే వారి బలిపీఠాలు నాశనం చేయి. వారు పూజించే రాళ్లను విరుగగొట్టు. వారి విగ్రహాలను నరికి వెయ్యి. 14 మరో దేవుడ్ని ఎవర్నీ ఆరాధించవద్దు. నేను రోషముగల యెహోవాను. అది నా పేరు. నేను రోషముగల దేవుడ్ని.
15 “ఆ దేశములో నివసించే ప్రజలతో ఎలాంటి ఒడంబడిక చేయకుండా జాగ్రత్తగా ఉండు. నీవు గనుక అలా చేస్తే, వారు వారి వారి దేవతలను ఆరాధించేటప్పుడు వాళ్లతో కలవమని ఆ ప్రజలు నిన్ను పిలుస్తారు. వాళ్ల బలుల మాంసం నీవు తినకుండ జాగ్రత్త పడుము. 16 వారి కూతుళ్లు కొందరిని మీ కుమారులకు భార్యలుగా మీరు చేసుకుంటారేమో. ఆ కూతుళ్లు తప్పుడు దేవతలను సేవిస్తారు. మీ కుమారులు కూడా అలాగే చేసేటట్టు వారు నడిపించవచ్చు.
17 “విగ్రహాలు చేసుకోవద్దు.
18 “పులియని రొట్టెల పండుగ ఆచరించు. నేను ఇదివరకు మీతో చెప్పిన ప్రకారము పులియచేసే పదార్థం లేకుండా తయారు చేయబడిన రొట్టెలను ఏడు రోజులపాటు తినాలి. నేను ఏర్పరచుకున్న అబీబు నెలలో దీన్ని చేయాలి. ఎందుకంటే మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన నెల అది.
19 “ఒక స్త్రీకి పుట్టిన ప్రథమ శిశువు ఎల్లప్పుడూ నాకే చెందుతుంది. మీ పశువులకు, గొర్రెలకు మొదటిదిగా పుట్టే పిల్లలు కూడా నాకే చెందుతాయి. 20 మొదటిదిగ పుట్టిన ఒక గాడిదను నీవు ఉంచుకోవాలంటే ఒక గొర్రె పిల్లను యిచ్చి నీవు దాన్ని కొనుక్కోవచ్చు. అయితే నీవు ఒక గొర్రె పిల్లను యిచ్చి ఆ గాడిదను కొనకపోతే, ఆ గాడిద మెడ నీవు విరుగగొట్టాలి. ప్రథమ సంతానమైన నీ కుమారులందరినీ నా దగ్గర్నుంచి నీవు కొనాలి. కానుక లేకుండా ఏ మనిషీ నా దగ్గరకు రాకూడదు.
21 “ఆరు రోజులు నీవు పనిచేస్తావు. అయితే ఏడో రోజున నీవు విశ్రాంతి తీసుకోవాలి. నాట్లు వేసేటప్పుడు, కోత కోసేటప్పుడు గూడ నీవు విశ్రాంతి తీసుకోవాలి.
22 “నీవు వారాల పండుగ ఆచరించాలి. గోధుమ కోతలో నుండి మొదటి పనను ఈ పండుగకు వినియోగించాలి. సంవత్సరాంతములో కోతకాలపు పండుగ ఆచరించాలి.
23 “ప్రతి సంవత్సరమూ మూడుసార్లు మీ పురుషులంతా మీ యజమానీ, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కనబడాలి.
24 “మీరు మీ దేశంలోకి వెళ్లినప్పుడు, ఆ దేశంలో నుండి మీ శత్రువులను నేను వెళ్లగొట్టి వేస్తాను. మీ సరిహద్దులను నేను విశాలం చేస్తాను. మీకు ఇంకా భూమి లభిస్తుంది. ప్రతి సంవత్సరం మూడు సార్లు మీరు యెహోవా దేవుని ఎదుటకి వెళ్లాలి. ఆ సమయంలో ఎవ్వరూ మీ భూమిని మీ దగ్గర నుండి తీసుకునేందుకు ప్రయత్నించరు.
25 “బలి రక్తం నీవు నాకు అర్పిస్తే పులిసిన పదార్థము ఏదీ దానితోపాటు అర్పించవద్దు.
“పస్కా భోజనంలోని మాంసం ఏ మాత్రము మరునాటి ఉదయానికి మిగులకూడదు.
26 “మీ కోతలో నుండి మొట్టమొదటి పంట యెహోవాకు ఇవ్వాలి. మీ యెహోవా దేవుని ఆలయములోనికి వాటిని తీసుకొని రావాలి.
“మేక పిల్లను దాని తల్లి పాలతో ఎన్నడూ వండకూడదు.”
27 అప్పుడు మోషేతో యెహోవా, “నేను నీకు చెప్పిన విషయాలన్నీ వ్రాయి. నీతోను, ఇశ్రాయేలు ప్రజలతోను నేను చేసిన ఒడంబడిక విషయాలు అవి” అన్నాడు.
28 నలభై పగళ్లు నలభై రాత్రుళ్లు మోషే అక్కడే యెహోవాతో ఉన్నాడు. ఆ సమయంలో అతను భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. ఒడంబడిక మాటలు అంటే పది ఆజ్ఞలు రెండు రాతి పలకల మీద మోషే వ్రాసాడు.
ప్రకాశిస్తున్న మోషే ముఖం
29 అప్పుడు మోషే సీనాయి పర్వతం కిందికి వచ్చాడు. దేవుని ఆజ్ఞలు వ్రాయబడ్డ ఆ రెండు రాతి పలకలనూ, అతను పట్టుకొచ్చాడు. మోషే యెహోవాతో మాట్లాడాడు. కనుక అతని ముఖం ప్రకాశిస్తూ ఉండినది. అయితే అది మోషేకు తెలియదు. 30 మోషే ముఖం మెరిసిపోతూ ప్రకాశిస్తూ ఉండటం అహరోను, ఇశ్రాయేలు ప్రజలందరూ చూశారు. అందుచేత అతని దగ్గరకు వెళ్లడానికి భయపడ్డారు. 31 అయితే మోషే వాళ్లను పిలిచాడు. కనుక అహరోను, ప్రజానాయకులు అందరూ మోషే దగ్గరకు వెళ్లారు. మోషే వాళ్లతో మాట్లాడాడు. 32 ఆ తర్వాత, ఇశ్రాయేలు ప్రజలంతా మోషే దగ్గరకు వచ్చారు. సీనాయి కొండ మీద యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞలను మోషే వారికీ ఇచ్చాడు.
33 మోషే ప్రజలతో మాట్లాడ్డం ముగించగానే తన ముఖం మీద ముసుగు కప్పుకున్నాడు. 34 యెహోవాతో మాట్లాడేందుకు ఆయన ఎదుటికి వెళ్లినప్పుడల్లా మోషే తన ముఖం మీద ముసుగు తీసివేసాడు. తరువాత మోషే బయటకు వచ్చి – యెహోవా ఆజ్ఞాపించిన విషయాలను ఇశ్రాయేలు ప్రజలకు చెప్పేవాడు. 35 మోషే ముఖం ప్రకాశంగా మెరిసిపోతున్నట్టు ప్రజలు చూసేవాళ్లు కనుక మోషే మరల తన ముఖం కప్పుకొనేవాడు. మరల యెహోవాతో మాట్లాడేందుకు వెళ్లేంతవరకు మోషే తన ముఖం పైనుండి ముసుగును తీసే వాడుకాదు.
యేసు తన శిష్యుల పాదాలు కడగటం
13 పస్కా పండుగ దగ్గరకు వచ్చింది. ఈ ప్రపంచాన్ని వదిలి తన తండ్రి దగ్గరకు వెళ్ళే సమయం వచ్చిందని యేసుకు తెలుసు. ఆయన ఈ ప్రపంచంలో ఉన్న తన వాళ్ళను ప్రేమించాడు. తాను వాళ్ళనెంత సంపూర్ణంగా ప్రేమించాడంటే ఆ ప్రేమను వాళ్ళకు చూపించాడు.
2 యేసు, ఆయన శిష్యులు రాత్రి భోజనం చేయుటకు కూర్చొని ఉన్నారు. సైతాను అప్పటికే సీమోను కుమారుడైన యూదా ఇస్యరియోతులో ప్రవేశించి యేసుకు ద్రోహం చెయ్యమని ప్రేరేపించాడు. 3 తండ్రి తనకు సంపూర్ణమైన అధికారమిచ్చినట్లు యేసుకు తెలుసు. తాను దేవుని నుండి వచ్చిన విషయము, తిరిగి ఆయన దగ్గరకు వెళ్ళ బోతున్న విషయము ఆయనకు తెలుసు. 4 అందువల్ల ఆయన భోజన పంక్తి నుండి లేచాడు. తన పైవస్త్రాన్ని తీసివేసి, ఒక కండువాను నడుముకు చుట్టుకున్నాడు. 5 ఆ తర్వాత ఒక వెడల్పయిన పళ్ళెంలో నీళ్ళు పోసి తన శిష్యుల పాదాలు కడగటం మొదలుపెట్టాడు. నడుముకు చుట్టుకున్న కండువాతో వాళ్ళ పాదాలు తుడిచాడు.
6 యేసు సీమోను పేతురు దగ్గరకు రాగానే, పేతురు ఆయనతో, “ప్రభూ! మీరు నా పాదాలు కడుగుతారా?” అని అన్నాడు.
7 యేసు, “నేను చేస్తున్నది నీకు యిప్పుడు అర్థం కాదు. తదుపరి అర్థమౌతుంది” అని సమాధానం చెప్పాడు.
8 పేతురు, “మీరు నా పాదాలు ఎన్నటికీ కడుగకూడదు. నేను ఒప్పుకోను” అని అన్నాడు.
యేసు, “నీ పాదాలు కడిగితే తప్ప నీకు, నాకు సంబంధం ఉండదు!” అని సమాధానం చెప్పాడు.
9 సీమోను పేతురు, “ప్రభూ! అలాగైతే నా పాదాలేకాదు. నా చేతుల్ని, నా తలను కూడా కడగండి!” అని అన్నాడు.
10 యేసు సమాధానం చెబుతూ, “స్నానం చేసినవాని శరీరమంతా శుభ్రంగా ఉంటుంది. కనుక అతడు పాదాలు మాత్రం కడుక్కుంటే చాలు ఒక్కడు తప్ప మీరందరూ పవిత్రులై ఉన్నారు” అని అన్నాడు. 11 తనకు ద్రోహం చేయనున్న వాడెవడో యేసుకు తెలుసు. కనుకనే ఒక్కడు తప్ప అందరూ పవిత్రంగా ఉన్నారని ఆయనన్నాడు.
12 ఆయన వాళ్ళ పాదాలు కడగటం ముగించి, పై వస్త్రాన్ని వేసుకొని తాను యింతకు ముందు కూర్చున్న స్థలానికి వెళ్ళాడు. యేసు, “నేను చేసింది మీకు అర్థమైందా? 13 మీరు నన్ను ‘బోధకుడా!’ అని ‘ప్రభూ!’ అని పిలుస్తారు. నేను బోధకుడను కనుక మీరు నన్ను ఆ విధంగా పిలవటం సమంజసమే! 14 మీ బోధకుడను, ప్రభువును అయిన నేను మీ పాదాలు కడిగాను. కనుక మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగాలి. 15 నేను చేసిన దాన్ని ఆదర్శంగా తీసుకొని నేను చేసినట్లు మీరు కూడా చేయాలని నా ఉద్దేశ్యం. 16 ఇది నిజం. యజమాని కంటే సేవకుడు గొప్ప కాదు. అలాగే వార్త తెచ్చేవాడు వార్త పంపినవాని కన్నా గొప్ప కాదు. 17 ఇవన్నీ మీరు తెలుసుకున్నారు. వీటిని ఆచరిస్తే ధన్యులౌతారు.
18 “నేనిది మీ అందర్ని గురించి చెప్పటం లేదు. నేను ఎన్నుకొన్న వాళ్ళు నాకు తెలుసు. కాని ఈ విషయం జరిగి తీరాలి: ‘నాతో రొట్టె పంచుకొన్న వాడు నాకు ద్రోహం చేస్తాడు.’ ఇవి జరుగక ముందే మీకు అన్నీ చెబుతున్నాను. 19 అవి జరిగినప్పుడు నేనే ఆయన్ని అని మీరు విశ్వసించాలని నా ఉద్దేశ్యం. 20 ఇది నిజం. నేను పంపిన వాణ్ణి అంగీకరించిన వాడు నన్ను అంగీకరించిన వానిగా పరిగణింపబడతాడు. నన్ను అంగీకరించిన వాడు నన్ను పంపిన వాణ్ణి అంగీకరించినట్లు పరిగణింపబడతాడు” అని అన్నాడు.
యేసు వంచకుని గురించి మాట్లాడటం
(మత్తయి 26:20-25; మార్కు 14:17-21; లూకా 22:21-23)
21 యేసు మాట్లాడటం ముగించాడు. ఆయన మనస్సుకు చాలా వేదన కలిగింది. ఆయన, “ఇది నిజం. మీలో ఒకడు నాకు ద్రోహం చేస్తాడు” అని అన్నాడు.
22 ఆయన శిష్యులు, ఆయన ఎవర్ని గురించి అంటున్నాడో తెలుసుకోలేక ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. 23 యేసు ప్రేమించిన శిష్యుల్లో ఒకడు యేసు ప్రక్కనే కూర్చొని ఉన్నాడు. 24 సీమోను పేతురు ఆ శిష్యునితో, “ఎవర్ని గురించి అంటున్నాడో అడుగు” అని సంజ్ఞ చేసాడు.
25 అతడు యేసుకు దగ్గరగా ఒరిగి, “ప్రభూ! ఎవరు!” అని అడిగాడు.
26 యేసు, “నేనీ రొట్టె ముక్కను పాత్రలో ముంచి ఎవరికిస్తానో వాడే!” అని సమాధానం చెప్పాడు. తదుపరి రొట్టెముక్కను పాత్రలో ముంచి సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదాకు యిచ్చాడు. 27 రొట్టె తీసుకొన్న వెంటనే సైతాను వానిలోకి ప్రవేశించాడు. యేసు వానితో, “నీవు చేయబోయేదేదో త్వరగా చెయ్యి” అని అన్నాడు. 28 కాని, భోజనానికి కూర్చున్న వాళ్ళకెవ్వరికీ యేసు ఆ విధంగా ఎందు కంటున్నాడో అర్థం కాలేదు. 29 డబ్బు యూదా ఆధీనంలో ఉండేది. కాబట్టి పండుగకు కావలసినవి కొని తెమ్మంటున్నాడని కొందరనుకున్నారు. పేదలకు కొంత పంచి పెట్టమంటున్నాడని మరికొందరనుకున్నారు.
30 యూదా రొట్టె తీసుకొని వెంటనే బయటకు వెళ్ళిపోయాడు. అది రాత్రి సమయం.
యేసు తన మరణాన్ని గురించి మాట్లాడటం
31 యూదా వెళ్ళిపోయాక యేసు, “ఇప్పుడు మనుష్యకుమారుని మహిమ వ్యక్తమయింది. అలాగే ఆయనలో దేవుని మహిమ వ్యక్తమయింది. 32 దేవుడు అయన ద్వారా మహిమ పొందాక తన కుమారుణ్ణి తనలో ఐక్యం చేసికొని మహిమపరుస్తాడు. ఆలస్యం చేయడు” అని అన్నాడు.
33 యేసు, “బిడ్డలారా! నేను మీతో మరి కొంత కాలం మాత్రమే ఉంటాను. మీరు నా కోసం చూస్తారు. యూదులకు చెప్పిన విషయాన్నే మీకూ చెబుతున్నాను. నేను వెళ్ళే చోటికి మీరు యిప్పుడురారు.
34 “నేను మీకొక క్రొత్త ఆజ్ఞనిస్తున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి. నేను మిమ్మల్ని ప్రేమించిన విధంగా మీరు కూడా ఒకరిపట్ల ఒకరు ప్రేమ కలిగి వుండండి 35 మీరు ఒకరినొకరు ప్రేమతో చూసుకున్నప్పుడే మీరు నాకు శిష్యులని లోకమంతా తెలుసుకుంటారు” అని అన్నాడు.
యేసు పేతురుతో మాట్లాడటం
(మత్తయి 26:31-35; మార్కు 14:27-31; లూకా 22:31-34)
36 సీమోను పేతురు, “ప్రభూ! మీరెక్కడికి వెళ్తున్నారు?” అని అడిగాడు.
యేసు, “నేను ఎక్కడికి వెళ్తున్నానో అక్కడికి నీవు యిప్పుడు నా వెంట రాలేవు. కాని తర్వాత నన్ను అలుసరించగలుగుతావు” అని అన్నాడు.
37 పేతురు, “ప్రభూ! యిప్పుడే ఎందుకు నేను నీ వెంట రాలేను? నేను మీకోసం నా ప్రాణాల్ని అర్పించటానికి సిద్ధంగా ఉన్నాను” అని అన్నాడు.
38 యేసు, “నీవు నిజంగా నా కోసం నీ ప్రాణంయిస్తావా? ఇది నిజం. కోడి కూసేలోగా నేనెవరినో తెలియదని మూడుసార్లు అంటావు!” అని సమాధనం చెప్పాడు.
సొలొమోను జ్ఞానోక్తులు
10 ఇవి సొలొమోను సామెతలు (జ్ఞానముగల మాటలు):
జ్ఞానముగల కుమారుడు తన తండ్రిని సంతోషపెడతాడు. కాని బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దు: ఖం కలిగిస్తాడు.
2 ఒకడు చెడు కార్యములు చేయుట వలన అతనికి డబ్బు వస్తే అది పనికిమాలిన డబ్బు అవుతుంది. కాని మంచిని జరిగించిన ఎడల అది మరణం నుండి నిన్ను రక్షించగలుగుతుంది.
3 యెహోవా మంచి మనుష్యుల విషయమై శ్రద్ధ పుచ్చుకొంటాడు. వారికి అవసరమైన భోజనాన్ని ఆయన వారికి ఇస్తాడు. కాని దుర్మార్గులకు అవసరమైన వాటిని యెహోవా తొలగించి వేస్తాడు.
4 బద్ధకస్తుడు పేదవాడుగా ఉంటాడు. కాని కష్టపడి పనిచేసేవాడు ధనికుడు అవుతాడు.
5 తెలివిగల వాడు సకాలంలో పంట కూర్చుకొంటాడు. కాని కోత కాలంలో నిద్రపోయేవాడు అవమానము కలిగించే కుమారుడు.
6 మంచి మనిషిని ఆశీర్వదించమని మనుష్యులు దేవుణ్ణి అడుగుతారు. ఆ మంచి విషయాలను చెడ్డవారు చెప్పవచ్చు కాని వారు తల పెడుతున్న చెడు విషయాలను వారి మాటలే కప్పిపుచ్చుతాయి.
7 మంచి మనుష్యుల కార్యములను జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరము. కాని చెడ్డవారి పేరు మరువబడును.
8 జ్ఞానముగల మనిషితో ఎవరైనా ఏదైనా చేయమని చెబితే అతడు విధేయుడవుతాడు. కాని బుద్ధిహీనుడు వాదించి తనకు తానే కష్టం తెచ్చుకుంటాడు.
9 నిజాయితీగల ఒక మంచి మనిషి క్షేమంగా ఉంటాడు. కాని మోసం చేసే కపటియైన వ్యక్తి పట్టు బడతాడు.
10 సత్యమును దాచిపెట్టే మనిషి కష్టాలు కలిగిస్తాడు. బాహాటంగా మాట్లాడేవాడు శాంతి కలిగిస్తాడు.
11 ఒక మంచి మనిషి మాటలు జీవితాన్ని మెరుగు పరుస్తాయి. కాని ఒక దుర్మార్గుని మాటలు అతని అంతరంగంలో ఉన్న చెడును చూపిస్తాయి.
12 ద్వేషం వాదాలు పుట్టిస్తుంది. కాని మనుష్యులు చేసే ప్రతి తప్పునూ ప్రేమ క్షమిస్తుంది.
13 జ్ఞానముగల వారు వినదగిన మాటలు చెబుతారు. కాని బుద్ధిహీనులు వారి పాఠం వారు నేర్చుకొనక ముందే శిక్షించబడాలి.
14 జ్ఞానముగల వారు నెమ్మదిగా ఉంటారు, కొత్త విషయాలు నేర్చుకొంటారు. కాని బుద్ధిహీనులు మాట్లాడి వారికి వారే కష్టాలు తెచ్చుకొంటారు.
15 ధనికుడ్ని ఐశ్వర్యం కాపాడుతుంది. మరియు పేదవాడ్ని పేదరికం పాడు చేస్తుంది.
16 ఒక మనిషి మంచి చేస్తే, అతనికి బహుమానం ఇవ్వబడుతుంది. అతనికి జీవం యివ్వబడుతుంది. దుర్మార్గత శిక్షను మాత్రమే తెచ్చి పెడుతుంది.
17 తన శిక్ష మూలంగా నేర్చుకొన్నవాడు ఇతరులు జీవించటానికి సహాయం చేయగలుగుతాడు. అయితే నేర్చుకొనేందుకు అంగీకరించని వాడు మనుష్యులను తప్పు త్రోవలో మాత్రమే నడిపించగలడు.
18 తన ద్వేషాన్ని దాచిపెట్టేవాడు అబద్ధం చెబుతూ ఉండవచ్చు. కాని బుద్ధిహీనుడు తాను మాత్రమే ప్రచారం చేసేందుకు చెప్పేటటువంటి మాటల కోసం ప్రయత్నిస్తాడు.
19 అధికంగా మాట్లాడేవాడు తనకు తానే కష్టం తెచ్చుకొంటాడు. జ్ఞానముగలవాడు ఊరక ఉండుటకు నేర్చుకొంటాడు.
20 మంచి మనిషి మాటలు స్వచ్ఛమైన వెండిలా ఉంటాయి. కాని దుర్మార్గుని తలంపులు పనికిమాలినవిగా ఉంటాయి.
21 ఒక మంచి మనిషి మాటలు అనేకులకు సహాయం చేస్తాయి. కాని బుద్ధిహీనుని మూర్ఖత్వం అతన్నే పాడు చేస్తుంది.
22 యెహోవా దీవెన నీకు ఐశ్వర్యం ఇస్తుంది. మరియు ఆ ఐశ్వర్యం దానితో బాటు కష్టాలు తీసుకొని రాదు.
23 బుద్ధిహీనుడు తప్పు చేయుటలో ఆనందిస్తాడు. కాని జ్ఞానముగలవాడు జ్ఞానములో ఆనందిస్తాడు.
24 దుర్మార్గుడు తాను భయపడే విషయాల మూలంగా ఓడించబడుతాడు. కాని మంచివాడు తాను కోరుకొనే వాటిని పొందుతాడు.
25 సుడిగాలి వీచినప్పుడు దుర్మార్గులు నాశనమవుతారు. కాని మంచివాళ్లకు శాశ్వతమైన పునాది వుంటుంది. వాళ్లు శాశ్వతంగా ఉంటారు.
26 బద్ధకస్తుణ్ణి ఎన్నడూ నీ కోసం ఏదీ చేయనీయకు. నీ నోట చిరకలా, లేక నీ కళ్లలో పొగలా అతడు నిన్ను చికాకు పెడతాడు.
27 నీవు యెహోవాను గౌరవిస్తే, నీవు చాలా కాలం బ్రతుకుతావు. కాని దుర్మార్గులు వారి జీవితంలోనుండి కొన్ని సంవత్సరాలు పోగొట్టుకొంటారు.
28 మంచి మనుష్యులు నిరీక్షించే విషయాలు సంతోషం కలిగిస్తాయి. దుర్మార్గులు నిరీక్షించే విషయాలు నాశనం తెచ్చి పెడతాయి.
29 మంచి మనుష్యులను యెహోవా కాపాడుతాడు. కాని తప్పుచేసే వారిని యెహోవా నాశనం చేస్తాడు.
30 మంచి మనుష్యులు ఎల్లప్పుడూ క్షేమంగా ఉంటారు. కాని దుర్మార్గులు బలవంతంగా దేశం నుండి వెళ్లగొట్టబడతారు.
31 మంచి మనుష్యులు జ్ఞానముగల మాటలు చెబుతారు. కాని కష్టం తెచ్చి పెట్టే వాని మాటలు వినటం మనుష్యులు మానివేస్తారు.
32 మంచి మనుష్యులకు సరైన సంగతులు చెప్పటం తెలుసు. కాని దుర్మార్గులు కష్టం తెచ్చిపెట్టే మాటలు చెబుతారు.
పౌలు యూదులు కానివాళ్ళకు బోధించుట
3 అందువల్ల యూదులుకాని మీ కోసం పౌలు అను నేను, యేసు క్రీస్తు ఖైదీని అయ్యాను. 2 దేవుడు నన్ను అనుగ్రహించి మీకోసం ఈ పని నాకు అప్పగించినట్లు మీరు తప్పకుండా వినే వుంటారు. 3 ఈ రహస్యం నాకు తెలుపబడినట్లు నేను యిదివరకే క్లుప్తంగా మీకు వ్రాసాను. 4 క్రీస్తును గురించి రహస్య జ్ఞానం నాకు అర్థమైనట్లు నేను వ్రాసింది చదివితే మీకు తెలుస్తుంది. 5 ఈ రహస్య జ్ఞానాన్ని దేవుడు మన పూర్వికులకు ఇవ్వలేదు. ఇప్పుడా రహస్య జ్ఞానాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా పవిత్రులైన అపొస్తలులకు, ప్రవక్తలకు తెలియచేసాడు. 6 ఆ రహస్యం ఏమిటంటే, సువార్తవల్ల యూదులు కానివాళ్ళు ఇశ్రాయేలువాళ్ళతో సహా వారసులౌతారు. వాళ్ళు ఒకే శరీరానికి సంబంధించిన అవయవాలు. అంతేకాక దేవుడు యేసు క్రీస్తు ద్వారా చేసిన వాగ్దానానికి వాళ్ళు భాగస్తులు. ఇది సువార్త వల్ల సంభవిస్తోంది.
7 దేవుడు తన శక్తిని నాపై ఉపయోగించి తన అనుగ్రహాన్ని నాకు వరంగా ప్రసాదించటం వల్ల నేను ఈ సువార్తకు దాసుణ్ణయ్యాను. 8 దేవుని ప్రజలందరిలో నేను అధముణ్ణి. అయినా దేవుడు నాకీవరం ప్రసాదించాడు. క్రీస్తులో ఉన్న అనంతమైన ఐశ్వర్యాన్ని గురించి యూదులు కానివాళ్ళకు బోధించే అవకాశం నాకిచ్చి నన్ను అనుగ్రహించాడు. 9 అన్నిటినీ సృష్టించిన దేవుడు తరతరాల నుండి తనలో దాచుకొన్న ఈ రహస్య ప్రణాళికను ప్రతి ఒక్కరికీ స్పష్టం చేయమని నాకు అప్పగించాడు. 10 భూమండలంలో ఉన్న పాలకులకు, అధికారులకు సంఘం ద్వారా అన్నిటిలో అతీతుడైన దేవుని జ్ఞానాన్ని తెలియచేయాలని ఆయన ఉద్దేశ్యం. 11 దేవుడు యిలా చెయ్యాలని కాలానికి ముందే అనుకున్నాడు. ఆ అనుకొన్న దాన్ని ఇప్పుడు మన యేసు క్రీస్తు ద్వారా సాధించాడు. 12 క్రీస్తుతో మనకు కలిగిన ఐక్యతవల్ల మరియు ఆయనలో మనకున్న విశ్వాసం వల్ల మనము దేవుని సమక్షంలో ధైర్యంగా సంపూర్ణమైన స్వేచ్ఛతో నిలబడగలుగుతున్నాము. 13 మీ కోసం నేను కష్టాలు అనుభవిస్తున్నందుకు అధైర్యపడకండి. ఇది నా విజ్ఞప్తి. నా కష్టాలవల్ల మీకు గౌరవం లభిస్తుంది.
ఎఫెసీయుల కోసం ప్రార్థన
14 ఈ కారణాన నేను తండ్రి ముందు మోకరిల్లుచున్నాను. 15 కనుక భూలోకంలో, పరలోకంలో ఉన్న విశ్వాసులందరు ఆయన పేరులో ఒకే కుటుంబముగా జీవిస్తున్నారు. 16 ఆయన తన అనంతమైన మహిమతో పరిశుద్ధాత్మ ద్వారా శక్తినిచ్చి ఆత్మీయంగా బలపరచాలని వేడుకొంటున్నాను. 17 అప్పుడు క్రీస్తు మీలో విశ్వాసం ఉండటం వల్ల మీ హృదయాల్లో నివసిస్తాడు. మీ వేర్లు ప్రేమలో నాటుక పోయేటట్లు చేయమనీ, మీ పునాదులు ప్రేమలో ఉండేటట్లు చేయమనీ ప్రార్థిస్తున్నాను. 18 అప్పుడు మీరు పవిత్రులతో సహా క్రీస్తు ప్రేమ ఎంత అనంతమైనదో, ఎంత లోతైనదో అర్థం చేసుకోకలుగుతారు. 19 జ్ఞానాన్ని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాలని దేవునిలో ఉన్న పరిపూర్ణత మీలో కలగాలని నా ప్రార్థన.
20 దేవుడు మనమడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా ఎక్కువే యివ్వగలడు. ఇది మనలో పని చేస్తున్న ఆయన శక్తి ద్వారా సంభవిస్తోంది. 21 సంఘంలో యేసు క్రీస్తు ద్వారా దేవునికి చిరకాలం శాశ్వతమైన మహిమ కలుగుగాక! ఆమేన్.
© 1997 Bible League International