M’Cheyne Bible Reading Plan
యాకోబు రాహేలును కలసికొనుట
29 ఇంకా యాకోబు తన ప్రయాణం కొనసాగించాడు. తూర్పు దేశానికి అతడు వెళ్లాడు. 2 యాకోబు అలా చూడగానే, పొలాల్లో ఒక బావి కనబడింది. గొర్రెల మందలు మూడు ఆ బావి దగ్గర పండుకొని ఉన్నాయి. ఆ గొర్రెలు నీళ్లు త్రాగే స్థలం ఆ బావి. ఆ బావిమీద ఒక పెద్ద బండ పెట్టి ఉంది. 3 గొర్రెలన్నీ అక్కడికి రాగానే, ఆ గొర్రెల కాపరులు ఆ బావిమీద బండను దొర్లిస్తారు. అప్పుడు గొర్రెలన్నీ ఆ నీళ్లు త్రాగుతాయి. ఆ గొర్రెలు పూర్తిగా త్రాగిన తర్వాత గొర్రెల కాపరులు ఆ బండను మళ్లీ దాని స్థానంలో పెట్టేస్తారు.
4 “సోదరులారా, ఎక్కడి వాళ్లు మీరు?” అని ఆ గొర్రెల కాపరులను యాకోబు అడిగాడు.
“మేము హారాను వాళ్లం” అని వారు జవాబిచ్చారు.
5 అందుకు యాకోబు, “నాహోరు కుమారుడు లాబాను మీకు తెలుసా?” అని అడిగాడు.
“మాకు తెలుసు” అని గొర్రెల కాపరులు జవాబు ఇచ్చారు.
6 అప్పుడు యాకోబు “అతను ఎలా ఉన్నాడు?” అని అడిగాడు.
“అతను బాగానే ఉన్నాడు, అంతా క్షేమమే. అదిగో చూడు, ఆ వస్తున్నది అతని కుమార్తె. ఆమె పేరు రాహేలు, అతని గొర్రెల్ని తోలుకొస్తున్నది” అన్నారు వాళ్లు.
7 “చూడండి, ఇప్పుడు ఇంకా పగలు ఉంది. సూర్యాస్తమయానికి చాలా సమయం ఉంది. రాత్రి కోసం గొర్రెల్ని మందగా చేర్చటానికి ఇంకా వేళ కాలేదు. కనుక వాటికి నీళ్లు పెట్టి, మళ్లీ పొలాల్లోనికి వెళ్లనియ్యండి” అన్నాడు యాకోబు.
8 కానీ గొర్రెల కాపరులు, “మందలన్నీ ఇక్కడ గుమిగూడేవరకు మేము అలా చేయటానికి వీల్లేదు. అప్పుడు మేము బావిమీద బండ దొర్లిస్తాము, గొర్రెలు నీళ్లు త్రాగుతాయి” అన్నారు.
9 కాపరులతో యాకోబు మాట్లాడుతుండగానే, రాహేలు తన తండ్రి గొర్రెలతో అక్కడికి వచ్చింది. (ఆ గొర్రెల బాధ్యత రాహేలుది.) 10 రాహేలు లాబాను కుమార్తె. యాకోబు తల్లియైన రిబ్కాకు లాబాను సోదరుడు. రాహేలును చూడగానే యాకోబు వెళ్లి, బండను దొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టాడు. 11 అప్పుడు యాకోబు రాహేలును ముద్దుపెట్టుకొని ఏడ్చాడు. 12 తను ఆమె తండ్రి బంధువును అనీ, రిబ్కా కుమారుడననీ యాకోబు రాహేలుతో చెప్పాడు. కనుక రాహేలు యింటికి పరుగెత్తి, తన తండ్రితో ఆ విషయాలు చెప్పింది.
13 తన సోదరి కుమారుడు యాకోబును గూర్చిన వార్త లాబాను విన్నాడు. అందుచేత అతణ్ణి కలుసుకొనేందుకు లాబాను పరుగెత్తాడు. లాబాను అతడ్ని కౌగిలించుకొని, ముద్దు పెట్టుకొని, తన యింటికి తీసుకొని వచ్చాడు. జరిగినదంతా యాకోబు లాబానుతో చెప్పాడు.
14 అప్పుడు లాబాను, “ఇదంతా భలే బాగుందే, అయితే నీవు నా స్వంత కుటుంబపు వాడివే సుమా” అన్నాడు. అందువల్ల యాకోబు లాబానుతో ఒక నెల అక్కడే నివసించాడు.
లాబాను యాకోబును మోసగించుట
15 ఒకనాడు లాబాను, “జీతం లేకుండా నా దగ్గర నీవు ఇలా పనిచేస్తూ ఉండటం సరిగా లేదు. నీవు బంధువుడివి. అంతేగాని బానిసవు కావు. నేను నీకు ఏమి చెల్లించాలి?” అని యాకోబును అడిగాడు.
16 లాబానుకు యిద్దరు కుమార్తెలుండిరి. పెద్దామె లేయా, చిన్నామె రాహేలు.
17 రాహేలు అందగత్తె. లేయా కళ్ల సమస్యగలది.[a] 18 యాకోబు రాహేలును ప్రేమించాడు. యాకోబు “నన్ను నీ చిన్న కుమార్తె రాహేలును పెళ్లాడనిస్తే, నేను నీకు ఏడు సంవత్సరాల పాటు పనిచేస్తాను” అని లాబానుతో చెప్పాడు.
19 “మరొకర్ని చేసుకోవడం కంటే ఆమె నిన్ను పెళ్లి చేసుకోవడం మంచిది. కనుక నా దగ్గరే ఉండు” అన్నాడు లాబాను.
20 కనుక యాకోబు అక్కడే ఉండి, రాహేలు కోసం ఏడు సంవత్సరాలు పని చేశాడు. అయితే అతడు రాహేలును అధికంగా ప్రేమించాడు గనుక అది అతనికి చాలా కొద్ది కాలంలాగే కనబడింది.
21 ఏడు సంవత్సరాలు అయ్యాక, “రాహేలును నాకు యివ్వండి, పెళ్లి చేసుకొంటాను. నీ దగ్గర నేను పని చేయాల్సిన కాలం తీరిపోయింది” అని యాకోబు లాబానుతో చెప్పాడు.
22 కనుక ఆ ప్రదేశంలోని ప్రజలందరికి లాబాను విందు ఇచ్చాడు. 23 ఆ రాత్రి లాబాను తన కుమార్తె అయిన లేయాను యాకోబు దగ్గరకు తీసుకు వచ్చాడు. యాకోబు లేయాలు లైంగికంగా కలుసుకొన్నారు. 24 తన దాసి జిల్ఫాను తన కుమార్తెకు దాసీగా లాబాను ఇచ్చాడు. 25 తాను సంభోగించినది లేయా అని తెల్లవారినప్పుడు యాకోబు తెలుసుకొన్నాడు. లాబానుతో యాకోబు, “నీవు నన్ను మోసం చేశావు. నేను రాహేలును పెళ్లి చేసుకోవాలని నీ దగ్గర కష్టపడి పని చేశాను. ఎందుకు నన్ను నీవు మోసం చేశావు?” అన్నాడు.
26 లాబాను చెప్పాడు: “పెద్ద కూతురికి పెళ్లికాక ముందు చిన్న కూతురికి పెళ్లి చేయటానికి మా దేశంలో ఒప్పుకోరు. 27 అయితే పెళ్లి ఆచారంగా వారం రోజులు ముగించు, రాహేలునుకూడ పెళ్లి చేసుకొనేందుకు ఇస్తాను. కానీ నీవు మాత్రం మరో ఏడు సంవత్సరాలు నా దగ్గర పని చేయాలి.”
28 కనుక యాకోబు అలాగే వారం ముగించాడు. అప్పుడు లాబాను తన కుమార్తె రాహేలును అతనికి భార్యగా ఇచ్చాడు. 29 తన దాసీ బిల్హాను తన కుమార్తె రాహేలుకు దాసీగా ఇచ్చాడు. 30 కనుక యాకోబు రాహేలుతో కూడా సంభోగించాడు. లేయాకంటే రాహేలును యాకోబు ఎక్కువగా ప్రేమించాడు. లాబాను దగ్గర మరో ఏడు సంవత్సరాలు యాకోబు పని చేశాడు.
యాకోబు కుటుంబం పెరుగుట
31 లేయాకంటె రాహేలును యాకోబు ఎక్కువగా ప్రేమించడం యెహోవా చూశాడు. అందుచేత యెహోవా లేయాకు పిల్లలు పుట్టేలాగు చేశాడు. రాహేలుకు పిల్లలు లేరు.
32 లేయాకు ఒక కొడుకు పుట్టాడు. ఆమె అతనికి రూబేను[b] అని పేరు పెట్టింది. “నా కష్టాలను యెహోవా చూశాడు. నా భర్త నన్ను ప్రేమించటం లేదు. ఒకవేళ నా భర్త ఇప్పుడైనా నన్ను ప్రేమిస్తాడేమో” అని లేయా అతనికి ఈ పేరు పెట్టింది.
33 లేయా మళ్లీ గర్భవతి అయింది, మరో కొడుకు పుట్టాడు. ఈ కుమారునికి షిమ్యోను[c] అని ఆమె పేరు పెట్టింది. “నేను ప్రేమించబడటం లేదని తెలిసి యెహోవా విని, నాకు ఈ కుమారుణ్ణి ఇచ్చాడు” అని లేయా చెప్పింది.
34 లేయా మళ్లీ గర్భవతి అయింది, మరో కొడుకు పుట్టాడు. ఆ కుమారునికి ఆమె లేవి[d] అని పేరు పెట్టింది. “ఇప్పుడు నా భర్త నన్ను తప్పకుండా ప్రేమిస్తాడు. అతనికి ముగ్గురు కుమారుల్ని నేను ఇచ్చాను” అనుకొంది లేయా.
35 అప్పుడు లేయాకు మరో కొడుకు పుట్టాడు. ఈ కుమారునికి యూదా[e] అని ఆమె పేరు పెట్టింది. “నేను ఇప్పుడు యెహోవాను స్తుతిస్తాను” అని అతనికి ఆ పేరు పెట్టింది లేయా. అంతటితో ఆమెకు సంతాన ప్రాప్తి ఆగిపోయింది.
యేసు బ్రతికి రావటం
(మార్కు 16:1-8; లూకా 24:1-12; యోహాను 20:1-10)
28 విశ్రాంతి రోజు గడిచింది. ఆదివారం సూర్యోదయమవుతుండగా మగ్దలేనే మరియ, యింకొక మరియ సమాధిని చూడటానికి వెళ్ళారు.
2 అప్పుడు ఒక భూకంపం వచ్చింది. పరలోకం నుండి ప్రభువు దూత వచ్చి ఆ సమాధి దగ్గరకు వెళ్ళాడు. ఆ రాతిని దొర్లించి దాని మీద కూర్చొన్నాడు. 3 ఆ రూపం మెరుపులా ఉంది. అతని దుస్తులు మంచువలె తెల్లగా ఉన్నాయి. 4 సమాధిని కాపలా కాస్తున్న భటులు అతన్ని చూసి భయపడి వణికిపోయి, చనిపోయిన వాళ్ళలా అయ్యారు.
5 ఆ దేవదూత, స్త్రీలతో ఈ విధంగా అన్నాడు: “భయపడకండి, సిలువకు వేయబడిన యేసు కోసం మీరు చూస్తున్నారని నాకు తెలుసు. 6 ఆయనిక్కడ లేడు. ఆయన తాను చెప్పినట్లు బ్రతికి వచ్చాడు. ఆయన్ని పడుకోబెట్టిన స్థలాన్ని చూడండి. 7 ఆ తదుపరి వెంటేనే వెళ్ళి ఆయన శిష్యులతో, ‘ఆయన బ్రతికి వచ్చాడు. మీకన్నా ముందే గలిలయకు వెళ్ళబోతున్నాడు. మీరు ఆయన్ని అక్కడ కలుసుకొంటారు’ అని చెప్పండి. నేను చెప్పవలసింది చెప్పాను.”
8 ఆ స్త్రీలు ఆయన శిష్యులకు చెప్పాలని సమాధి దగ్గరనుండి భయంతో, ఆనందంతో పరుగెత్తికొంటూ వెళ్ళారు. 9 యేసు వాళ్ళను కలుసుకొని, “శుభం!” అని అన్నాడు. వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళపైబడి ఆయనకు మ్రొక్కారు. 10 అప్పుడు యేసు వాళ్ళతో, “భయపడకండి. వెళ్ళి నా సోదరులతో గలిలయకు వెళ్ళమని చెప్పండి. వాళ్ళు అక్కడ నన్ను కలుసుకొంటారు” అని అన్నాడు.
ప్రధాన యాజకులు భటుల్నిఅబద్దమాడమని కోరటం
11 ఆ స్త్రీలు వెళ్ళిపొయ్యారు. అదే సమయంలో కొంతమంది భటులు పట్టణంలోకి వెళ్ళి జరిగినదంతా ప్రధాన యాజకులతో చెప్పారు. 12 ప్రధాన యాజకులు పెద్దల్ని కలుసుకొని ఒక కుట్ర పన్నారు. వాళ్ళు భటులకు పెద్ద మొత్తాలిస్తూ వాళ్ళతో, 13 “అతని శిష్యులు, ‘మేము రాత్రి వేళ నిద్రిస్తుండగా వచ్చి అతని దేహాన్ని దొంగిలించుకు పొయ్యారు’ అని చెప్పండి. 14 ఈ వార్త రాష్ట్రపాలుకునిదాకా వెళ్తే అతణ్ణి శాంత పరచి మీకు కష్టం కలుగకుండా మేము చూస్తాము” అని అన్నారు. 15 భటులు డబ్బు తీసుకొని వాళ్ళు చెప్పినట్లు చేసారు. ఈ కథ బాగా వ్యాపించి ఈ నాటికి వాడుకలో ఉంది.
యేసు తన శిష్యులతో మాట్లాడటం
(మార్కు 16:14-18; లూకా 24:36-49; యోహాను 20:19-23; అపొ. కా. 1:6-8)
16 ఆ తర్వాత ఆ పదకొండుగురు శిష్యులు గలిలయకు వెళ్ళి, యేసు చెప్పిన కొండ మీదికి వెళ్ళారు. 17 అక్కడ యేసును చూసి ఆయన ముందు సాష్టాంగ పడ్డారు. కాని వాళ్ళలో కొందరు సందేహించారు 18 అప్పుడు యేసు వాళ్ళ దగ్గరకు వచ్చి, “పరలోకంలో, భూమ్మీదా ఉన్న అధికారమంతా దేవుడు నాకిచ్చాడు. 19 అందువల్ల అన్ని దేశాలకు వెళ్ళి, వాళ్ళను శిష్యులుగా చెయ్యండి. తండ్రి పేరిట, కుమారుని పేరిట, పవిత్రాత్మ పేరిట వాళ్ళకు బాప్తిస్మము యివ్వండి. 20 నేను మీకాజ్ఞాపించిన వన్నీ వాళ్ళను ఆచరించమని బోధించండి. నేను అన్ని వేళలా ఈ యుగాంతం దాకా మీ వెంట ఉంటాను” అని అన్నాడు.
మహారాజుతో ఎస్తేరు మాటలాడుట
5 మూడవ రోజున ఎస్తేరు ప్రత్యేకమైన దుస్తులు ధరించి, రాజ నగరులోని, రాజభవనమెదుటవున్న లోపలి భవనములో నిలిచింది. మహారాజు అక్కడ సింహాసనం మీద కూర్చుని వున్నాడు. అతను న్యాయస్థానంలోకి జనం ప్రవేశించే దిశగా చూపు తిప్పి కూర్చున్నాడు. 2 అప్పుడు అతని దృష్టి లోపలి ఆవరణలో నిలిచివున్న ఎస్తేరుపై పడింది. ఆమెను అక్కడ చూచినంతనే మహారాజు మనస్సు సంతోష భరితమైంది. ఆయన తన చేతిలోని బంగారు దండాన్ని ఆమె వైపు చాపాడు. ఎస్తేరు రాజు దర్బారు మందిరంలోకి పోయి బంగారు దండపు కొనని తాకింది.
3 అప్పుడు మహారాజు ఎస్తేరుతో ఇలా అన్నాడు: “మహారాణి, ఏమిటి నీ దిగులు? నువ్వు నన్ను కోరాలనుకున్నదేమిటో కోరుకో, నువ్వేమి కోరుకున్నా, అర్ధ రాజ్యమైనా ఇచ్చేస్తాను.”
4 ఎస్తేరు, “నేను తమకీ, హామానుకీ ఒక విందు ఏర్పాటు చేశాను. దయచేసి మీరూ, హామానూ యీ రోజు నా విందుకి రావాలని నా కోరిక” అని అడిగింది.
5 అప్పుడు మహారాజు సేవకులకు, “మహారాణి ఎస్తేరు కోర్కెను మేము తీర్చాలి. వెంటనే పోయి, హామానును తొందరగా తీసుకురండి” అని ఆజ్ఞాపించాడు.
ఎస్తేరు ఏర్పాటు చేసిన విందుకి మహారాజూ, హామానూ వెళ్లారు. 6 వాళ్లు ద్రాక్షారసం సేవిస్తూండగా, మహారాజు ఎస్తేరును మళ్లీ ఇలా అడిగాడు: “ఎస్తేరూ, నువ్వేదైనా కోరుకో. అర్ధ రాజ్యమైనా సరే కోరుకో, నేను నీకిస్తాను.”
7 అందుకు ఎస్తేరిలా సమాధానమిచ్చింది, “నేను మిమ్మల్ని కోరదలుచుకున్నది యిదీ మహారాజా! 8 తమరికి నా మనవి అంగీకారమై, నేను కోరినది ఇవ్వాల నుకుంటే, రేపు నేనివ్వబోయే మరో విందుకి మీరూ, హామానూ తప్పక వేంచేయాలి. నా అసలు మనవి ఏమిటో నేను అప్పుడు విన్నవించుకుంటాను.”
మొర్దెకై పట్ల హామాను కోపం
9 హామాను ఆ రోజున రాజభవనం నుంచి ఇంటికి మంచి హుషారుగా, మహానందంగా వెళ్లాడు. కాని, రాజ భవన ద్వారం దగ్గర మరల కనబడిన మొర్దెకై తనని చూసి కూడా లేచి, భయభక్తులతో తనకి నమస్కరించక పోయేసరికి హామానుకు తల కొట్టేసినట్లయింది. అతని కోపం మిన్నుముట్టింది. 10 అయినా, హామాను తన కోపాన్ని అదుపు చేసుకొని, ఇంటికి వెళ్లిపోయాడు. అక్కడ తన మిత్రులనూ, తన భార్య జెరెషునూ పిలిచి కూర్చోబెట్టి, 11 తన ఐశ్వర్యం గురించి గొప్పలు చెప్పడం మొదలెట్టాడు. తనకి చాలా మంది కొడుకులున్నారనీ, మహారాజు తనని ఎన్నో విధాల గౌరవించాడనీ, మిగిలిన నాయకులందరికంటె మహారాజు తనకి ఉన్నత స్థానమిచ్చాడనీ, చెప్పుకున్నాడు. 12 హామాను యింకా ఇలా అన్నాడు, “అంతే ననుకున్నారేమో, కాదు.” “ఎస్తేరు మహారాణి తను యిచ్చిన విందుకి మహారాజుతోబాటు నన్నొక్కడినే ఆహ్వానించింది. రేపు తను యివ్వబోయే మరో విందుకి కూడా మహారాజుతోబాటు నన్ను కూడా మహారాణి ఆహ్వానించింది. 13 అయినా నాకివన్నీ ఏమంత పెద్దగా ఆనందం కలిగించే విషయాలు కావు. ఆ యూదుడైన మొర్దెకై రాజభవన ద్వారం దగ్గర కూర్చొని ఉండటం ఎప్పటి వరకు నేను చూస్తూ ఉంటానో, అప్పటివరకు నేను నిజంగా సంతోషించలేను.”
14 అప్పుడు హామాను భార్య జెరెషూ, అతని మిత్రులందరూ ఇలా సలహా యిచ్చారు: “మొర్దెకైని ఉరితీసేందుకుగాను ఒక స్తంభం పాతమని ఎవరినైనా పురమాయించు! ఆ ఉరికొయ్య 75 అడుగుల పొడుగు వుండాలి! ఇంకేముంది, రేపు ఉదయం మహారాజుతో ఆ ఉరికొయ్య మీద ఆ యూదుని ఉరితీయించమని చెప్పు. మహారాజుతో కలిసి విందుకి వెళ్లు. అప్పుడిక చూసుకో, నీ ఆనందానికి మేరవుండదు.”
హామానుకి ఆ సలహా నచ్చింది. వెంటనే అతను ఉరి కంబం సిద్ధం చేయమని ఒకణ్ణి ఆజ్ఞాపించాడు.
మెలితే ద్వీపం
28 తీరం చేరుకున్నాక ఆ ద్వీపాన్ని “మెలితే” అంటారని తెలుసుకున్నాము. 2 ఆ ద్వీపంలో నివసించేవాళ్ళు మాపై చాలా దయచూపారు. అప్పుడు వర్షం కురుస్తూవుంది. చలి తీవ్రంగా ఉంది. వాళ్ళు చలిమంటలు వేసి మమ్మల్ని కూడా రమ్మన్నారు. 3 పౌలు కట్టెలు ప్రోగుచేసి ఆ మోపును మంటపై వేసాడు. ఆ కట్టెల మోపునుండి ఒక పాము ఆ వేడికి తట్టుకోలేక వెలుపలికి వచ్చి, పౌలు చేతిని కరిచి దాని పళ్ళతో పట్టుకుంది. 4 ఆ ద్వీపవాసులు పౌలు చేతికి పాము వ్రేలాడి ఉండటం చూసి తమలో తాము, “ఇతడు తప్పక ఒక హంతకుడై ఉండాలి! సముద్రంనుండి తప్పించుకున్నాడు కాని, దేవుడతన్ని బ్రతుకనివ్వలేదు” అని అనుకున్నారు.
5 కాని పౌలు, ఆ పామును మంటలోకి దులిపి వేసాడు. అతనికి ఏ హాని కలుగలేదు. 6 వాళ్ళు అతని శరీరం వాచి పోతుందనో, లేక అతడు అకస్మాత్తుగా చనిపోతాడనో అనుకొని చాలా సేపు కాచుకున్నారు. అతనికి ఏ హాని కలగక పోవటం గమనించి, వాళ్ళు తమ మనస్సును మార్చుకొని, “అతడు ఒక దేవత” అని అన్నారు.
7 ఆ ప్రక్కనున్న పొలాలు “పొప్లి” అనే అతనికి చెందినవి. పొప్లి ఆ ద్వీపానికి అధికారి. అతడు మమ్మల్ని తన యింటికి ఆహ్వానించి మూడు రోజుల దాకా అతిథిసత్కారాలు చేసాడు. 8 పొప్లి తండ్రి జ్వరంతో, చీమునెత్తురు విరేచనాలతో మంచం పట్టి ఉన్నాడు. పౌలు అతణ్ణి చూడటానికి వెళ్ళాడు. దేవుణ్ణి ప్రార్థించి పౌలు తన చేతుల్ని అతని తలపై ఉంచాడు. వెంటనే అతనికి నయమైపోయింది. 9 ఈ విధంగా జరిగిన తర్వాత ఆ ద్వీపంలో ఉన్న మిగతా రోగులు కూడా వచ్చారు. వాళ్ళక్కూడా నయమైపోయింది.
10 ఆ ద్వీప వాసులు మమ్మల్ని ఎన్నో విధాలుగా గౌరవించి మేము ప్రయాణమయ్యేముందు మాకు కావలసిన సామగ్రి నిచ్చారు.
రోమాకు రావటం
11 చలికాలమంతా ఆ ద్వీపంలో ఉండిపోయిన ఒక ఓడలో మూడు నెలల తర్వాత ప్రయాణం చేసాము. అది అలెక్సంద్రియ నగరానికి చెందిన ఓడ. దాని పేరు “కవల దేవతలు.” 12 మేము “సురకూసై” అనే పట్టణానికి చేరుకున్నాము. సురకూసైలో మేము మూడు రోజులుండి, మరల బయలు దేరాము. 13 మేము రేగియ నగరానికి వచ్చాము. మరుసటి రోజు నైరుతి గాలి వీచటంతో మేము బయలుదేర గలిగాము. ఒక రోజు తరువాత మేము పొతియొలీ నగరం చేరాము. 14 అక్కడున్న సోదరుల్లో కొందర్ని కలుసుకున్నాము. వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించి తమతో ఒక వారం ఉండమన్నారు. ఈ విధంగా రోమా చేరుకున్నాము. 15 రోమాలో ఉన్న సోదరులు మేము వస్తున్నామని విన్నారు. మమ్మల్ని కలుసుకోవటానికి వాళ్ళు అప్పీయా ఫోరన్,[a] ట్రెయిన్ టాబెర్న్ అనే గ్రామాల వరకు వచ్చారు. వీళ్ళను చూడగానే పౌలు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అతనిలో ధైర్యం కలిగింది.
రోమా నగరంలో బోధించటం
16 మేము రోమా పట్టణం చేరుకున్నాక పౌలును ఏకాంతంగా ఉండనిచ్చారు. కాని ఒక సైనికుణ్ణి అతనికి కాపలాగా ఉంచారు.
17 మూడు రోజుల తర్వాత పౌలు యాదుల నాయకుల్ని పిలిపించాడు. అంతా సమావేశమయ్యాక పౌలు వాళ్ళతో, “సోదరులారా! మన ప్రజలకు విరుద్ధంగా లేక మన పూర్వికుల ఆచారాలకు విరుద్ధంగా నేను ఏది చెయ్యలేదు. అయినా నన్ను యెరూషలేములో బంధించి రోమా అధికారులకు అప్పగించారు. 18 వాళ్ళు విచారణ చేసారు. కాని యూదులు ఆరోపించినట్లు మరణదండన పొందవలసిన అపరాధమేదీ నేను చెయ్యలేదు. కనుక నన్ను విడుదల చెయ్యాలనుకున్నారు. 19 కాని, దానికి యూదులు ఒప్పుకోలేదు. నేను చక్రవర్తికి విజ్ఞాపన చెయ్యటం అవసరమైంది. యూదులపై నేరారోపణ చెయ్యటానికి నేనిక్కడికి రాలేదు. 20 ఈ కారణంగానే నేను మిమ్మల్ని చూసి మాట్లాడాలని పిలువనంపాను. ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న ఆశ కోసం నేనీ సంకెళ్ళలో ఉన్నాను” అని అన్నాడు.
21 వాళ్ళు ఈ విధంగా సమాధానం చెప్పారు: “యూదయనుండి మిమ్మల్ని గురించి మాకెలాంటి ఉత్తరంరాలేదు. అక్కడినుండి వచ్చిన సోదరులు కూడా మిమ్మల్ని గురించి ఏ సమాచారం చెప్పలేదు. చెడుగా మాట్లాడలేదు. 22 కాని అన్ని ప్రాంతలవాళ్ళు ఈ మతాన్ని గురించి విరుద్ధంగా మాట్లాడుతున్నారని మాకు తెలుసు. అందువలన దీన్ని గురించి మీ అభిప్రాయం వినాలని ఉంది.”
23 పౌలును కలుసుకోవటానికి వాళ్ళు ఒక దినాన్ని నిర్ణయించారు. ఆ రోజు మొదటి రోజుకన్నా ఎక్కువ మంది పౌలు నివసిస్తున్న స్థలానికి వచ్చారు. పౌలు ఉదయంనుండి సాయంకాలం దాకా వాళ్ళతో మాట్లాడి, దేవుని రాజ్యాన్ని గురించి విడమరచి చెప్పాడు. మోషే ధర్మశాస్త్రంనుండి, ప్రవక్తల వ్రాతలనుండి ఉదాహరణలు తీసుకొని, యేసును గురించి చెప్పి వాళ్ళను ఒప్పించటానికి ప్రయత్నించాడు. 24 అతడు చెప్పింది కొందరు నమ్మారు. కొందరు నమ్మలేదు. 25 వాళ్ళలో వాళ్ళకు భేదాభిప్రాయం రావటం వలన వాళ్ళు వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. పౌలు ఈ చివరి మాట చెప్పటం మొదలు పెట్టాడు: “పరిశుద్ధాత్మ మీ పూర్వికులతో యెషయా ప్రవక్త ద్వారా ఈ విధంగా చెప్పి నిజం పలికాడు:
26 ‘ప్రజలతో ఈ విధంగా చెప్పు:
మీరెప్పుడూ వింటుంటారు.
కాని ఎన్నటికి అర్థం చేసుకోరు!
మీరు అన్ని వేళలా చూస్తుంటారు.
కాని ఎన్నటికి గ్రహించరు.
27 వాళ్ళు కళ్ళతో చూసి,
చెవుల్తో విని హృదయాలతో అర్థం చేసుకొని
నా వైపు మళ్ళితే నేను వాళ్ళకు నయం చేస్తాను.
కాని అలా జరుగకూడదని ఈ ప్రజల
హృదయాలు ముందే మొద్దు బారాయి.
వాళ్ళకు బాగా వినిపించదు.
వాళ్ళు తమ కళ్ళు మూసుకున్నారు.’(A)
28 “అందువల్ల మీరీ విషయాన్ని గ్రహించాలి. రక్షణను గురించి ఈ సందేశం యూదులు కానివాళ్ళ వద్దకు పంపబడింది. వాళ్ళు వింటారు!” 29 [b]
30 పౌలు రెండు సంవత్సరాలు తాను అద్దెకు తీసుకున్న ఇంట్లో నివసించాడు. తనను చూడాలని వచ్చినవాళ్ళందరికీ స్వాగతం చెప్పాడు. 31 ధైర్యంగా, స్వేచ్ఛతో దేవుని రాజ్యాన్ని గురించి చెప్పి, యేసు క్రీస్తు ప్రభువును గురించి బోధించాడు.
© 1997 Bible League International