M’Cheyne Bible Reading Plan
అబీమెలెకుతో ఇస్సాకు అబద్ధం చెప్పుట
26 ఒకసారి కరువుకాలం వచ్చింది. అబ్రాహాము జీవిత కాలంలో వచ్చిన కరువులాంటిదే ఇది. కనుక గెరారు పట్టణంలో ఉన్న ఫిలిష్తీ ప్రజల రాజు అబీమెలెకు దగ్గరకు ఇస్సాకు వెళ్లాడు. 2 ఇస్సాకుతో యెహోవా మాట్లాడాడు. యెహోవా చెప్పాడు: “ఈజిప్టు వెళ్లవద్దు. నీవు ఉండాలని నేను నీకు ఆజ్ఞాపించిన దేశంలోనే నీవు నివసించాలి. 3 ఆ దేశంలోనే నీవు నివాసం ఉండు, నేను నీతో ఉంటాను. నిన్ను నేను ఆశీర్వదిస్తాను. నీకు నీ వంశానికి ఈ భూభాగాలన్నీ ఇస్తాను. నీ తండ్రి అబ్రాహాముకు నేను వాగ్దానం చేసినదంతా నీకు నేను ఇస్తాను. 4 ఆకాశ నక్షత్రాలు ఎన్నో, నీ సంతానం అంతటిదిగా నేను చేస్తాను. ఈ దేశాలన్నీ నీ కుటుంబానికి నేను ఇస్తాను. నీ సంతానం మూలంగా భూమిమీద జనాంగాలన్నీ ఆశీర్వదించబడతాయి. 5 నీ తండ్రియైన అబ్రాహాము నా మాటలకు లోబడి, నేను చెప్పిన వాటిని చేశాడు గనుక నేను ఇది చేస్తాను. అబ్రాహాము నా ఆజ్ఞలకు, చట్టాలకు, నియమాలకు విధేయుడయ్యాడు.”
6 కనుక ఇస్సాకు గెరారులో ఉండిపోయి అక్కడ నివసించాడు. 7 ఇస్సాకు భార్య రిబ్కా చాలా అందగత్తె. రిబ్కాను గూర్చి అక్కడి మనుష్యులు ఇస్సాకును అడిగారు. “ఆమె నా సోదరి” అని చెప్పాడు ఇస్సాకు. రిబ్కా తన భార్య అని వారితో చెప్పడానికి ఇస్సాకు భయపడ్డాడు. ఆమెను పొందటం కోసం ఆ మనుష్యులు తనను చంపివేస్తారని ఇస్సాకు భయపడ్డాడు.
8 ఇస్సాకు అక్కడ చాలా కాలం ఉన్న తర్వాత, ఇస్సాకు అతని భార్యతో సరసాలు ఆడుకోవటం అబీమెలెకు తన కిటికీ గుండా చూశాడు. 9 అబీమెలెకు ఇస్సాకును పిలిచి “ఈ స్త్రీ నీ భార్య. ఈమె నీ సోదరి అని మాతో ఎందుకు చెప్పావు?” అని అడిగాడు.
“నీవు ఈమెను పొందటం కోసం నన్ను చంపేస్తావని నేను భయపడ్డాను” అని ఇస్సాకు అతనితో చెప్పాడు.
10 “నీవు మాకు కీడు చేశావు. మా మనుష్యుల్లో ఎవడైనా ఒకడు నీ భార్యతో శయనించి ఉండేవాడు. అప్పుడు అతడు మహా పాపము చేసిన నేరస్థుడయ్యేవాడు” అన్నాడు అబీమెలెకు.
11 అందుచేత అబీమెలెకు ప్రజలందరికి హెచ్చరిక ఇచ్చాడు. “ఈ పురుషునిగాని, ఇతని భార్యనుగాని ఎవరూ బాధించగూడదు. వారిని బాధించినవాడు ఎవరైనా సరే చంపివేయబడతాడు” అని అతడు చెప్పాడు.
ఇస్సాకు ధనికుడగుట
12 ఆ దేశంలో ఇస్సాకు పొలాల్లో విత్తనాలు విత్తాడు. ఆ సంవత్సరం అతడు విస్తారంగా పంట కూర్చుకున్నాడు. యెహోవా అతన్ని ఎంతో అశీర్వదించాడు. 13 ఇస్సాకు ధనికుడయ్యాడు. అతడు మహా ఐశ్వర్యవంతుడు అయ్యేవరకు మరింత విస్తారంగా ఐశ్వర్యం కూర్చుకొన్నాడు. 14 గొర్రెల మందలు, పశువుల మందలు అతనికి విస్తారంగా ఉన్నాయి. అతనికి చాలా మంది సేవకులు కూడా ఉన్నారు. ఫిలిష్తీ ప్రజలంతా అతని మీద అసూయ పడ్డారు. 15 కనుక ఇస్సాకు తండ్రియైన అబ్రాహాము, అతని సేవకులు తవ్విన చాలా బావుల్ని ఫిలిష్తీ ప్రజలు పాడుచేశారు. ఆ బావుల్ని ఫిలిష్తీ ప్రజలు మట్టితో నింపారు. 16 అబీమెలెకు ఇస్సాకుతో, “మా దేశం వదలి పెట్టు. నీవు మాకంటే చాలా అత్యధికంగా శక్తిమంతుడవయ్యావు” అన్నాడు.
17 కనుక ఇస్సాకు ఆ స్థలం విడిచిపెట్టి, గెరారులోని చిన్న నదికి సమీపంలో మజిలీ చేశాడు. ఇస్సాకు అక్కడ నివాసమున్నాడు. 18 దీనికి ఎంతో ముందు అబ్రాహాము చాలా బావులు తవ్వాడు. అబ్రాహాము చనిపోయిన తర్వాత ఫిలిష్తీ ప్రజలు ఆ బావులను చెత్తతో నింపేసారు. కనుక ఇస్సాకు తిరిగి వెళ్లి, ఆ బావులను మళ్లీ తవ్వాడు. వాటికి తన తండ్రి పెట్టిన పేర్లే ఇస్సాకు పెట్టాడు. 19 చిన్న నది దగ్గర ఇస్సాకు సేవకులు ఒక బావి తవ్వారు. ఆ బావిలో నీటి ఊట ఒకటి ఉబికింది. 20 అయితే గెరారు లోయలో గొర్రెల మందలను కాసేవాళ్లు ఇస్సాకు పనివాళ్లతో జగడమాడారు. “ఈ నీళ్లు మావి అన్నారు వాళ్లు.” కనుక ఆ బావికి “ఏశెకు”[a] అని ఇస్సాకు పేరు పెట్టాడు. అక్కడ ఆ మనుష్యులు అతనితో జగడమాడారు గనుక దానికి ఆ పేరు పెట్టాడు.
21 అప్పుడు ఇస్సాకు సేవకులు మరో బావి తవ్వారు. ఆ బావి మూలంగా అక్కడి ప్రజలు కూడా జగడమాడారు. కనుక ఆ బావికి “శిత్నా”[b] అని ఇస్సాకు పేరు పెట్టాడు. 22 ఇస్సాకు అక్కడనుండి వెళ్లిపోయి మరో బావి తవ్వాడు. ఆ బావి విషయం వాదించటానికి ఎవరూ రాలేదు. కనుక ఆ బావికి “రహెబోతు”[c] అని ఇస్సాకు పేరు పెట్టాడు. “ఇప్పుడు మనకోసం యెహోవా ఒక స్థలం ఇచ్చాడు. ఈ దేశంలో మనం అభివృద్ధిపొంది సఫలము కావాలి.” అన్నాడు ఇస్సాకు.
23 ఆ చోటు నుండి ఇస్సాకు బెయేర్షెబాకు వెళ్లాడు. 24 ఆ రాత్రి ఇస్సాకుతో యెహోవా మాట్లాడాడు. “నీ తండ్రి అబ్రాహాము దేవుణ్ణి నేను. భయపడకు. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ వంశస్థులను అభివృద్ధి చేస్తాను. నా సేవకుడు అబ్రాహాము కారణంగా నేను ఇది చేస్తాను” అని యెహోవా చెప్పాడు. 25 కనుక ఆ స్థలంలో దేవుణ్ణి ఆరాధించేందుకు ఒక బలిపీఠాన్ని ఇస్సాకు కట్టించాడు. ఇస్సాకు అక్కడ నివాసం చేయగా, అతని సేవకులు ఒక బావి తవ్వారు.
26 ఇస్సాకును చూసేందుకు గెరారు నుండి అబీమెలెకు వచ్చాడు. అతడు సలహాదారుడు అహుజతును, సైన్యాధిపతియైన ఫీకోలును వెంటబెట్టుకొని వచ్చాడు.
27 ఇస్సాకు వారితో, “ఇంతకుముందు నీవు నాతో స్నేహంగా లేవు గదా. నీ దేశం వదిలిపెట్టేట్లు నీవు నన్ను బలవంతం గూడా చేశావు గదా. ఇప్పుడు నన్ను చూడటానికి ఎందుకు వచ్చావు?” అన్నాడు.
28 వారు ఇలా జవాబు చెప్పారు: “యెహోవా నీకు తోడుగా ఉన్నాడని ఇప్పుడు మాకు తెలిసింది. మనం ఒక ఒడంబడిక చేసుకోవాలని మా అభిప్రాయం. మాకు నీవు ఒక ప్రమాణం చేయాలి. 29 మేము నిన్ను బాధించలేదు. ఇప్పుడు నీవు కూడా మమ్మల్ని బాధించనని ప్రమాణం చేయాలి. నిన్ను మేము పంపించివేసినా, సమాధానంగా పంపించాం. యెహోవా నిన్ను ఆశీర్వదించాడని యిప్పుడు తేటగా తెలుస్తుంది.”
30 ఇస్సాకు వారికి విందు చేశాడు. వారు తిని త్రాగారు. 31 మర్నాడు ఉదయం ఒక్కొక్కరు ఒక్కో ప్రమాణం చేశారు. తర్వాత ఆ మనుష్యులు సమాధానంగా వెళ్లిపోయారు.
32 ఆ రోజున ఇస్సాకు సేవకులు వచ్చి, వారు తవ్విన బావిని గూర్చి చెప్పారు. “ఆ బావిలో నీళ్లు చూశాం” అని సేవకులు చెప్పారు. 33 కనుక ఆ బావికి “షేబ”[d] అని పేరు పెట్టాడు ఇస్సాకు. ఆ పట్టణం ఇప్పటికీ బెయేర్షెబా అని పిలువబడుతుంది.
ఏశావు భార్యలు
34 ఏశావు 40 సంవత్సరాల వయస్సులో హిత్తీ స్త్రీలను ఇద్దరిని వివాహం చేసుకొన్నాడు. ఒక స్త్రీ బేయేరి కుమార్తె యహూదీతు. ఇంకొక ఆమె ఏలోను కుమార్తె బాశెమతు. 35 ఈ వివాహాలు ఇస్సాకు, రిబ్కాలను చాలా బాధపెట్టాయి.
పది మంది కన్యకల ఉపమానం
25 “దేవుని రాజ్యం ఇలా ఉంటుంది: పది మంది కన్యకలు తమ తమ దీపాలు తీసుకొని పెళ్ళి కుమారుణ్ణి కలవటానికి వెళ్ళారు. 2 వాళ్ళలో ఐదుగురు తెలివిలేని వాళ్ళు; ఐదుగురు తెలివిగల వాళ్ళు. 3 తెలివి లేని కన్యలు దీపాలు తీసుకెళ్ళారు కాని తమ వెంట నూనె తీసుకు వెళ్ళలేదు. 4 తెలివిగల కన్యలు తమ దీపాలతో పాటు పాత్రలో నూనె కూడా తీసుకు వెళ్ళారు. 5 పెళ్ళి కుమారుడు రావటం ఆలస్యం అయింది. అందరికి కునుకు వచ్చి నిద్దుర పొయ్యారు.
6 “అర్థరాత్రి వేళ, ‘అదిగో పెళ్ళి కుమారుడు! వచ్చి చూడండీ!’ అని ఎవరో బిగ్గరగా కేక వేసారు.
7 “వెంటనే ఆ కన్యకలందరూ లేచి తమ దీపాల్ని సరి చేసుకొన్నారు. 8 తెలివి లేని కన్యలు ‘మీ నూనె కొద్దిగా మాకివ్వండి; మా దీపాలలో నూనంతా అయిపోయింది!’ అని తెలివిగల కన్యల్ని అడిగారు.
9 “తెలివి గల కన్యలు, ‘ఈ నూనె మనకందరికి సరిపోదేమో! దుకాణానికి వెళ్ళి మీకోసం కొద్ది నూనె కొనుక్కురండి’ అని సమాధానం చెప్పారు.
10 “కాని వాళ్ళు నూనె కొనుక్కురావటానికి వెళ్ళినప్పుడు పెళ్ళి కుమారుడు వచ్చాడు. సిద్ధంగా ఉన్న కన్యలు పెళ్ళి విందుకు అతనితో కలసి లోపలికి వెళ్ళారు. ఆ తదుపరి తలుపు వేయబడింది.
11 “మిగతా కన్యలు వచ్చి, ‘అయ్యా! అయ్యా! తలుపు తెరవండి’ అని అడిగారు.
12 “కాని అతడు, ‘నేను నిజం చెబుతున్నాను; మీరెవరో నాకు తెలియదు’ అని సమాధానం చెప్పాడు.
13 “మీకు ఆ రోజు, ఆ ఘడియ ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక మెలకువతో ఉండండి.
ముగ్గురు సేవకుల ఉపమానం
(లూకా 19:11-27)
14 “దేవుని రాజ్యం ఇలా ఉంటుంది: ఒక వ్యక్తి ప్రయాణమై వెళ్తూ తన సేవకుల్ని పిలిచి తన ఆస్తిని వాళ్ళకు అప్పగించాడు. 15 ఒకనికి ఐదు తలాంతుల[a] ధనం ఇచ్చాడు. రెండవ వానికి రెండు తలాంతులు, మూడవ వానికి ఒక తలాంతు వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి ఇచ్చాడు. ఆ తర్వాత ప్రయాణమై వెళ్ళాడు. 16 ఐదు తలాంతులు పొందిన వాడు వెంటనే వెళ్ళి ఆ ధనాన్ని ఉపయోగించి మరో ఐదు తలాంతులు సంపాదించాడు. 17 అదేవిధంగా రెండు తలాంతులు పొందినవాడు వెళ్ళి మరో రెండు తలాంతులు సంపాదించాడు. 18 కాని ఒక తలాంతు పొందిన వాడు వెళ్ళి ఒక గొయ్యి త్రవ్వి యజమాని యిచ్చిన ధనాన్ని అందులో దాచాడు.
19 “చాలాకాలం తర్వాత ఆ యజమాని తిరిగి వచ్చి లెక్కలు చూసాడు. 20 ఐదు తలాంతులు పొందినవాడు మరో ఐదు తలాంతులు తెచ్చి, ‘అయ్యా! మీరు నాకు ఐదు తలాంతులు ఇచ్చారు. నేను మరో ఐదు సంపాదించాను చూడండి!’ అని అన్నాడు.
21 “ఆ యజమాని ‘మంచి పని చేసావు! నీలో మంచితనం, విశ్వాసం ఉన్నాయి. నీవు కొంచెములో నమ్మకంగా పని చేసావు! కనుక నిన్ను ఇంకా చాలా వాటిపై అధికారిగా నియమిస్తాను. నీ యజమానితో కలసి ఆనందించు!’ అని సమాధానం చెప్పాడు.
22 “రెండు తలాంతులు పొందిన వాడు కూడా వచ్చి, ‘అయ్యా! నాకు రెండు తలాంతులు యిచ్చారు. నేను మరో రెండు సంపాదించాను చూడండి!’ అని అన్నాడు.
23 “ఆ యజమాని, ‘మంచి పని చేసావు! నీలో మంచితనము, విశ్వాసము ఉన్నాయి. నీవు కొంచెములో నమ్మకంగా పని చేసావు కనుక నిన్ను యింకా చాలా వాటిపై అధికారిగా నియమిస్తాను, నీ యజమానితో కలసి ఆనందించు!’ అని అన్నాడు.
24 “తదుపరి ఒక తలాంతు పొందినవాడు వచ్చి ‘అయ్యా! మీరు కృరమైన వారని నాకు తెలుసు. విత్తనం నాటని చోట మీరు పంటను కోస్తారు. విత్తనం వేయని పొలాలనుండి ధాన్యం ప్రోగు చేస్తారు. 25 అందువల్ల నేను భయపడి మీ తలాంతు తీసుకు వెళ్ళి భూమిలో దాచి ఉంచాను. ఇదిగో! మీది మీరు తీసుకోండి!’ అని అన్నాడు.
26 “ఆ యజమాని ఈ విధంగా సమాధానం ఇచ్చాడు: ‘నీవు దుర్మార్గుడివి! సోమరివి! నేను విత్తనం నాటని పొలం నుండి పంటను కోస్తానని, విత్తనం వెయ్యని చోట ధాన్యం ప్రోగు చేస్తానని నీకు తెలుసునన్న మాట. అలా అనుకొన్నవాడివి నా డబ్బు వడ్డీ వ్యాపారుల దగ్గర దాచి ఉంచ వలసింది. 27 అలా చేసుంటే నా డబ్బు వడ్డీతో సహా నాకు లభించేది.’
28 “అతని దగ్గరున్న తలాంతు తీసుకొని పది తలాంతులున్న వానికివ్వండి. 29 ఎందుకంటే ఉన్న వాళ్ళకు దేవుడు యింకా ఎక్కువ యిస్తాడు. అప్పుడు వాళ్ళ దగ్గర సమృద్ధిగా ఉంటుంది. లేని వాళ్ళనుండి వాళ్ళ దగ్గరున్నది కూడా తీసి వేయబడుతుంది. 30 ఆ పనికిరాని వాణ్ణి బయట చీకట్లో పడవేయండి. అక్కడతడు ఏడుస్తూ బాధననుభవిస్తాడు.
మనుష్యకుమారుడు అందరికి తీర్పు తీర్చటం
31 “తేజోవంతుడైన మనుష్యకుమారుడు తన దేవదూతలతో కలసి వస్తాడు. వచ్చి తేజోవంతమైన తన సింహాసనంపై కూర్చుంటాడు. 32 ప్రజలందర్ని సమావేశ పరచి గొఱ్ఱెల కాపరి మేకల్లో నుండి గొఱ్ఱెల్ని వేరు చేసినట్లు వాళ్ళను వేరుచేస్తాడు. 33 తదుపరి కొందరిని తన కుడి వైపున, కొందరిని తన ఎడమ వైపున ఉంచుతాడు.
34 “అప్పుడా రాజు తన కుడి వైపునున్న వాళ్ళతో, ‘రండి! నా తండ్రి ఆశీర్వాదాలను మీరు పొందారు. మీ రాజ్యాన్ని తీసుకొండి. ప్రపంచం సృష్టింపబడినప్పుడే ఈ రాజ్యాన్ని దేవుడు మీకోసం ఉంచాడు. 35 ఎందుకంటే, నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు. దాహం వేసినప్పుడు మీరు నాకు నీళ్ళిచ్చారు. పరదేశీయునిగా మీ దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఆతిథ్యమిచ్చారు. 36 దుస్తులు కావలసి వచ్చినప్పుడు మీరు నాకు దుస్తులిచ్చారు. జబ్బుతో ఉన్నప్పుడు మీరు నాకు సేవ చేసారు. నేను కారాగారంలో ఉన్నప్పుడు వచ్చి పలకరించారు’ అని అంటాడు.
37 “అప్పుడు నీతిమంతులు, ‘ప్రభూ! మీరు ఆకలితో ఉండగా మేము ఎప్పుడు మీకు భోజనం పెట్టాము? మీరు దాహంతో ఉండగా మీకు నీళ్ళెప్పుడిచ్చాము? 38 మీరు పరదేశీయునిగా ఎప్పుడు వచ్చారు? మిమ్మల్ని ఎప్పుడు ఆహ్వానించాము? మీకు దుస్తులు ఎప్పుడు కావలసివచ్చింది? దుస్తులు మీకు ఎప్పుడిచ్చాము? 39 మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు మేము ఎప్పుడు చూసాము? మీరు కారాగారంలో ఎప్పుడువున్నారు? మిమ్మల్ని చూడటానికి ఎప్పుడు వచ్చాము?’ అని అడుగుతారు.
40 “ఆ రాజు, ‘ఇది సత్యం. హీన స్థితిలో ఉన్న నా సోదరులకు మీరు చేసిన ప్రతి సహాయాన్ని నాకు చేసినట్టుగా పరిగణిస్తాను’ అని సమాధానం చెబుతాడు.
41 “ఆ తర్వాత ఆ రాజు తన ఎడమ వైపునున్న వాళ్ళతో, ‘శాపగ్రస్తులారా! వెళ్ళి పొండి! సైతాను కొరకు, వాని దూతలకొరకు సిద్ధం చేయబడిన శాశ్వతమైన మంటల్లో పడండి. 42 ఎందుకంటే, నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టలేదు. దాహం వేసినప్పుడు మీరు నాకు నీళ్ళివ్వలేదు. 43 నేను పరదేశీయునిగా వచ్చినప్పుడు మీరు నన్ను ఆహ్వానించలేదు. నాకు దుస్తులు కావలసి వచ్చినప్పుడు మీరు దుస్తుల్ని యివ్వలేదు. నేను జబ్బుతో కారాగారంలో ఉన్నప్పుడు మీరు నాకు సేవ చేయలేదు’ అని అంటాడు.
44 “అప్పుడు వాళ్ళు కూడా, ‘ప్రభూ! మీరు ఆకలిగావున్నప్పుడు గాని, లేక దాహంతో ఉన్నప్పుడు కాని, లేక పరదేశీయునిగా కాని, లేక జబ్బుతో ఉన్న వానిగా కాని లేక చెరసాలలో ఉన్నట్టుకాని ఎప్పుడు చూసాము? అలా చూసి కూడా మీకు ఎప్పుడు సహాయం చెయ్యలేదు?’ అని అంటారు.
45 “ఆయన, ‘ఇది సత్యం. హీనస్థితిలో ఉన్నవానికి మీరు సహాయం చెయ్యలేదు. కనుక నాకు సహాయం చెయ్యనట్లే’ అని చెబుతాడు.
46 “వాళ్ళు వెళ్ళి శాశ్వతంగా శిక్షను అనుభవిస్తారు. కాని నీతిమంతులు అనంత జీవితం పొందుతారు.”
ఎస్తేరు రాణి అయింది
2 దరిమిలా కొంత కాలానికి, అహష్వేరోషు మహారాజు కోపం చల్లారింది. అప్పుడాయనకి వష్తీ, ఆమె చేసిన పని, తను జారీచేసిన ఆజ్ఞలు జ్ఞాప్తికి వచ్చాయి. 2 అప్పుడు మహారాజు ఆంతరంగిక సేవకులు ఒక సూచన చేశారు, “మహారాజుగారి కోసం అందమైన కన్యల అన్వేషణ జరపాలి. 3 మహారాజు తన సామ్రాజ్యం లోని ప్రతి సామంత రాజ్యంలోనూ ఒక్కొక్క నాయకుణ్ణి ఎంపిక చేసుకోవాలి. ఆ నాయకులు అందమైన ప్రతి ఒక్క కన్యనూ రాజధాని నగరమైన షూషనుకి తీసుకురావాలి. ఆ కన్యలను మహారాజుగారి అంతఃపుర స్త్రీల బృందంలో వుంచాలి. ఆ కన్యలు అంతఃపుర స్త్రీలను అదుపాజ్ఞల్లో వుంచే హేగే నపుంసకుని అధీనంలోవుంటారు. వాళ్లందరికీ సౌందర్య పోషక క్రియలు జరపాలి. 4 అటు తర్వాత వీళ్లలో మహారాజుకి నచ్చిన కన్యను వష్తి స్థానంలో కొత్త మహారాణిని చేయాలి.” ఈ సలహా మహారాజుకి నచ్చింది. ఆయన దాన్ని ఆమోదించాడు.
5 రాజధాని నగరం షూషనులో బెన్యామీను గోత్రానికి చెందిన మొర్దెకై అనే ఒక యూదుడు వున్నాడు. మొర్దెకై తండ్రి యాయీరు. యాయీరు తండ్రి కీషు. 6 బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకోన్యాను బందీగా పట్టుకొన్నాడు యెరూషలేము నుంచి చెరపట్టబడినవారిలో మొర్దెకై కూడా ఒకడు. 7 హదస్సా అనే ఒక అమ్మాయి వుంది. ఆమె మొర్దెకైకి పినతండ్రి కూతురు. ఆమె తల్లితండ్రులు మరణించినప్పుడు, మొర్దకై ఆమెని చేరదీసి, తన స్వంత కూతురులా పెంచి పోషించాడు. హదస్సాకి ఎస్తేరు అనే పేరుకూడా వుంది. ఎస్తేరు అందమైన రూపమును సుందర ముఖమును గలదై యుండెను.
8 మహారాజుయొక్క ఆజ్ఞ ప్రకటింపబడిన మీదట చాలామంది కన్యలు రాజధాని అయిన షూషను నగరానికి తరలింపబడ్డారు. వాళ్లందరూ హేగే నపుంసకుని అధీనంలో ఉంచబడ్డారు. ఆ యువతుల్లో ఎస్తేరు ఒకతె. ఎస్తేరును రాజభవనానికి తీసుకుపోయి, మిగిలిన అంతఃపుర స్త్రీలతో బాటు హేగే అధీనంలో ఉంచారు. 9 ఎస్తేరు హేగేకి నచ్చింది. ఆమె అతనికి అభిమాన ప్రాత్రురాలైంది. దానితో హేగే ఆమెకి సౌందర్యవర్థక పక్రియను త్వరలో పూర్తిచేసి, ఆమెకి ప్రత్యేకమైన భోజన పదార్థాలను సమకూర్చాడు. అప్పుడిక హేగే ఎస్తేరుకీ, ఆమె ఏడుగురు పరిచారికలకీ అంతఃపుర స్త్రీలు నివసించే అతి శ్రేష్ఠమైన స్థలంలో నివాసం ఏర్పాటు చేశాడు. 10 తను యూదురాలనన్న విషయాన్ని ఎస్తేరు ఎవ్వరికీ చెప్పలేదు. మొర్దెకై వద్దన్నందున ఆమె తన కుటుంబ వివరాలేవీ ఎవ్వరికి తెలియ జెప్పలేదు. 11 ఎస్తేరు ఎలాగుందో, ఆమె విషయంలో ఏమి జరుగుతుందో తెలుసుకొనేందుకోసం మొర్దెకై ప్రతి రోజూ అంతఃపుర ఆవరణ ముందు అటు ఇటు తిరుగులాడు తుండేవాడు.
12 ఎవరైనా ఒక యువతి అహష్వేరోషు మహారాజు సన్నిధానానికి తీసుకుపోబడేందుకు ముందు ఆమె చేయవలసిన పనులు యివి: ఆమె తన పన్నెండు మాసాల సౌందర్యవర్ధక పక్రియను వూర్తి చేయాలి. అంటే, ఆమె ఆరునెలలు పాటు గోపరస తైలాన్ని వాడి, తదుపరి ఆరునెలలు పరిమళ ద్రవ్యాలను, భిన్న భిన్న మైన అలంకరణ సామగ్రులను వాడాలి. 13 మహారాజు సముఖానికి తీసుకుపోబడేందుకు ఇదీ పద్దతి. ఆ అమ్మాయికి ఏది కావాలన్నా అంతఃపురం నుంచి ఇవ్వబడుతుంది. 14 ఆ యువతి రాజ భవనానికి సాయంత్రమందు చేరుకుంటుంది. ఆ మరుసటి ఉదయం ఆమె అంతఃవుర స్త్రీలు నివసించే మరో చోటికి తిరిగి వెళ్తుంది. అప్పుడామె అక్కడ షయష్గజు అనే నపుంసకుని అజమాయిషీలో ఉంచబడుతుంది. షయష్గజు నపుంసకుడు మహారాజు ఉంపుడుగత్తెల పర్యవేక్షకుడు. మహారాజుకు ఆమెపట్ల ప్రేమ కలిగినప్పుడేగాని ఆ యువతి ఆయన దగ్గరకు వెళ్లరాదు. అప్పుడాయన ఆమెను పేరుపెట్టి తిరిగి తనవద్దకు రమ్మని పిలుస్తాడు.
15 ఎస్తేరుకి మహారాజు వద్దకు వెళ్లే వంతు వచ్చి నప్పుడు, ఆమె ఏమీ కావాలని కోరలేదు. అంతఃపుర పర్యవేక్షకుడైన హేగే తనకేమి సూచించాడో అవే తీసుకుంది. (ఎస్తేరు మొర్దెకై పెంపుడు కూతురు, అతని పినతండ్రి అబీహాయిలు కూతురు). ఎస్తేరును చూసిన ప్రతి ఒక్కరికీ ఆమె నచ్చింది. 16 చివరికి ఎస్తేరు రాజ భవనంలో మహారాజు సముఖానికి తీసుకెళ్లబడింది. అది సరిగ్గా టెబేతు అనబడే పదోనెల, అహష్వేరోషు పాలనలో ఏడవ సంవత్సరం.
17 మహారాజు యువతులందరిలోకీ ఎస్తేరును బాగా ప్రేమించాడు. మిగిలిన కన్యలందరి కంటె ఆమె, ఆయన దయ, అభిమానాలను పొందింది. అందుకని మహారాజు స్వయంగా ఆమె శిరస్సుపై కిరీటం వుంచి, వష్తి స్థానంలో ఆమెను మహారాణిని చేశాడు. 18 మహారాజు ఎస్తేరు గౌరవార్థం తన సామంతులకూ, అధికారులకూ పెద్ద విందు చేశాడు. అన్ని సామంత రాజ్యాల్యోనూ ఆ రోజును ఆయన సెలవు దినంగా ప్రకటించాడు. ఉదారవంతుడైన ఆ మహారాజు జనానికి బహుమతులు పంపాడు.
మొర్దెకై ఒక కుట్రను కనిపెట్టుట
19 రెండవసారి యువతులందరూ ఒకచోట చేర్చబడినప్పుడు మొర్దెకై మహారాజు భవన ద్వారంవద్దనే కూర్చుని వున్నాడు. 20 తను యూదురాలనన్న విషయాన్ని ఎస్తేరు యింకా గుప్తంగానే వుంచింది. తన కుటుంబ గోత్రాలను గురించి ఆమె ఎవ్వరికీ చెప్పలేదు. అది ఆమెకు మొర్దెకై ఇచ్చిన ఆజ్ఞ. తను మొర్దెకై పెంపకంలో ఉన్నప్పటి మాదిరిగానే, యింకా ఆమె అతని ఆజ్ఞలను పాటిస్తోంది.
21 మొర్దెకై మహారాజు భవన ద్వారం దగ్గర కూర్చున్న సమయంలో జరిగిన విషయం ఇది: బిగ్తాను, తెరెషు అనే యిద్దరు రాజభవన ద్వార పాలకులు మహారాజువట్ల కుపితులై అహష్వేరోషు మహారాజును హతమార్చాలని కుట్ర పన్నుతున్నారు. 22 అయితే, మొర్దెకై ఈ కుట్ర పథకాలను కనిపెట్టి ఎస్తేరు మహారాణికి ఈ విషయం చెప్పాడు. అప్పుడీ విషయాన్ని ఆమె మహారాజుకి చెప్పింది. ఈ కుట్రను గురించి తెలుసుకున్నది మొర్దెకై అని కూడా ఆమె మహారాజుకు చెప్పింది. 23 తర్వాత ఆ విషయమై విచారణ చేయబడింది. విచారణలో మొర్దెకై చెప్పిన సమాచారం సరైనదేనని తేలింది. మహారాజును హత్యచేయాలని దుష్ట వథకం వేసిన ద్వారపాలకులిద్దరూ ఉరితీయబడ్డారు. మహారాజు సమక్షంలోనే యీ విషయాలన్నీ మహారాజుల చరిత్ర విశేషాల గ్రంథంలో నమోదు చేయబడ్డాయి.
ఫేస్తు సమక్షంలో విచారణ
25 ఫేస్తు ఆ ప్రాంతానికి వచ్చిన మూడు రోజుల తర్వాత కైసరియనుండి యెరూషలేమునకు వెళ్ళాడు. 2 అక్కడ ప్రధాన యాజకులు, యూదుల పెద్దలు అతణ్ణి కలుసుకొని, పౌలును గురించి చెప్పారు. 3 పౌలును వెంటనే యెరూషలేముకు పంపి తమకు ఉపకారం చెయ్యమని వేడుకున్నారు. ఎవ్వరికీ తెలియకుండా పౌలును దారిలో చంపేయాలని వాళ్ళ కుట్ర. 4 ఫేస్తు, “పౌలు కైసరియలో బందీగా ఉన్నాడు. నేను కూడా అక్కడికి త్వరలోనే వెళ్తున్నాను. 5 మీలో ముఖ్యమైనవాళ్ళు నావెంట వస్తే, అతడు ఒకవేళ ఏదైనా నేరం చేసి ఉంటే అతనిపై మీ నేరారోపణలు అక్కడే చేయవచ్చు” అని అన్నాడు.
6 అక్కడ వాళ్ళతో ఎనిమిది, పది రోజులు గడిపాక కైసరియకు వెళ్ళాడు. వెళ్ళిన మరుసటి రోజు న్యాయసభను ఏర్పాటు చేసి పౌలును తన ముందుకు పిలుచుకు రమ్మని ఆజ్ఞాపించాడు. 7 పౌలు కనపడగానే యెరూషలేమునుండి వచ్చిన యూదులు అతని చుట్టూ చేరి అతనిపై తీవ్రమైన నేరాలు ఆరోపించారు. ఎన్ని నేరాల్ని ఆరోపించినా, ఒక్క నేరాన్ని కూడా నిరూపించలేక పోయారు. 8 తదుపరి పౌలు, తాను నేరస్థుడు కాదని నిరూపించుకోవటానికి ఈ విధంగా వాదించాడు, “నేను యూదుల ధర్మశాస్త్రాన్ని కాని, మందిర నియమాల్ని కాని అతిక్రమించ లేదు. చక్రవర్తికి ఎదురు తిరిగి ప్రవర్తించనూ లేదు.”
9 ఫేస్తు, యూదులకు ఉపకారం చేయాలని, పౌలుతో, “నీవు యెరూషలేము వచ్చి అక్కడ నా ఎదుట న్యాయస్థానంలో నిలుచోగలవా?” అని అడిగాడు.
10 పౌలు ఈ విధంగా సమాధానం చెప్పాడు. “నేను ప్రస్తుతం చక్రవర్తి యొక్క న్యాయస్థానంలో నిలుచున్నాను. ఇక్కడే తీర్పు జరగాలి. నేను యూదులకు ఏ అన్యాయం చెయ్యలేదు. ఇది మీకు బాగా తెలుసు. 11 మరణదండన పొందవలసిన నేరం నేను ఒక వేళ ఏదైనా చేసివుంటే, మరణించటానికి నేను వెనుకంజ వేయను. కాని వీళ్ళు ఆరోపించిన నేరాలు అసత్యమైతే నన్ను వీళ్ళకప్పగించే అధికారం ఎవ్వరికీ లేదు. చక్రవర్తినే ఈ విషయంపై తీర్పు చెప్పమని నేను విన్నవించుకొంటాను.”
12 ఫేస్తు తన సలహాదార్లతో సంప్రదించి యిలా ప్రకటించాడు: “నీవు చక్రవర్తి సమక్షంలో విన్నవించుకోవాలని కోరావు. కనుక నిన్ను చక్రవర్తి దగ్గరకు పంపుతాను.”
ఫేస్తు అగ్రిప్పను సంప్రదించటం
13 కొద్ది రోజుల తర్వాత అగ్రిప్పరాజు, బెర్నీకే ఫేస్తును కలుసుకొందామని కైసరియకు వచ్చారు. 14 వాళ్ళక్కడ చాలా రోజులున్నారు. ఫేస్తు పౌలు విషయాన్ని రాజుగారితో చర్చిస్తూ, “ఇక్కడ, ఫేలిక్సు కారాగారంలో ఉంచిన వాడొకడున్నాడు. 15 నేను యెరూషలేముకు వెళ్ళినప్పుడు ప్రధానయాజకులు, యూదుల పెద్దలు అతనిపై నేరారోపణ చేసి అతనికి మరణదండన విధించమని నన్ను కోరారు. 16 నేను, ‘నేరమారోపింపబడినవానికి తనపై నేరారోపణ చేసినవాళ్ళను ప్రత్యక్షంగా కలుసుకొని, వాళ్ళారోపించిన నేరాలకు ప్రతిగా తన రక్షణార్థం మాట్లాడే అవకాశం కలగాలి, దానికి ముందు అతణ్ణి అప్పగించటం రోమీయుల పద్ధతి కాదు’ అని జవాబు చెప్పాను.
17 “నాతో కలిసి వాళ్ళిక్కడికి వచ్చారు. నేను ఆలస్యం చెయ్యకుండా మరుసటి రోజే సభనేర్పాటు చేసి పౌలును సభలోకి పిలుచుకురమ్మని ఆజ్ఞాపించాను. 18 అతనిపై నేరారోపణ చేసినవాళ్ళు లేచి మాట్లాడారు. కాని నేననుకున్న ఏ నేరాన్నీ అతనిపై ఆరోపించలేదు. 19 దానికి మారుగా తామనుసరించే మతాన్ని గురించి అతనితో వాదించారు. చనిపోయిన యేసును గురించి తర్కించారు. కాని పౌలు యేసు బ్రతికే ఉన్నాడని వాదించాడు. 20 అలాంటి విషయాలు ఏ విధంగా విచారణ చెయ్యాలో నాకు తెలియదు. అందువల్ల నేను అతణ్ణి, ‘విచారణ కోసం నీవు యెరూషలేము వెళ్తావా?’ అని అడిగాను. 21 చక్రవర్తే తీర్పు చెప్పాలని, అంతదాకా తనను కారాగారంలో ఉంచమని పౌలు కోరాడు. ఆ కారణంగా అతణ్ణి కైసరు దగ్గరకు పంపేదాకా కారాగారంలో ఉంచమని ఆజ్ఞాపించాను” అని చెప్పాడు.
22 అగ్రిప్ప ఫేస్తుతో, “అతడు మాట్లాడే విషయాలు వినాలని నాక్కూడా ఉంది” అని అన్నాడు.
“రేపు మీరతని మాటలు వింటారు” అని ఫేస్తు జవాబు చెప్పాడు.
23 మరుసటి రోజు అగ్రిప్ప, బెర్నీకే మిక్కిలి ఆడంబరంగా సభలోకి వచ్చి సహస్రాధిపతులతో, పట్టణ ప్రముఖులతో కలిసి కూర్చున్నారు. ఫేస్తు ఆజ్ఞాపించగానే పౌలు సభలోకి తేబడ్డాడు.
24 ఫేస్తు యిలా అన్నాడు: “అగ్రిప్ప రాజా! సభికులారా! మీరు చూస్తున్న ఈ వ్యక్తిని గురించి యూదులు యెరూషలేములో, ఇక్కడ, ‘ఇతడిక ఎక్కువ రోజులు బ్రతకటానికి వీల్లేదు’ అని బిగ్గరగా కేకలు వేసి నాకు ఫిర్యాదు చేసారు. 25 మరణదండన విధించవలసిన నేరమేదీ అతడు చేయలేదని నాకర్థమైనది. కాని అతడు చక్రవర్తికి విన్నవించుకొంటానని అన్నాడు. కనుక అతణ్ణి చక్రవర్తి దగ్గరకు పంపాలని నిశ్చయించుకున్నాను. 26 ఇతణ్ణి గురించి చక్రవర్తికి వ్రాయటానికి నాకేదీ కనిపించలేదు. అందువల్ల యితణ్ణి మీ ముందుకు పిలుచుకు వచ్చాను. అగ్రిప్ప రాజా! ముఖ్యంగా మీకోసం యితణ్ణి పిలిపించాను. మీ విచారణ వల్ల వ్రాయటానికి నాకేదైనా కనిపించవచ్చు. 27 ఒక బంధీని, అతడు చేసిన నేరం స్పష్టంగా చూపకుండా పంపటం న్యాయం కాదని నా అభిప్రాయం.”
© 1997 Bible League International