M’Cheyne Bible Reading Plan
చివరికి శారాకు ఒక శిశువు పుట్టుట
21 యెహోవా శారాకు కుమారున్ని అనుగ్రహిస్తానని ఆమెకు వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేసినట్లే ఆమెపై అనుగ్రహాన్ని చూపాడు. 2 అబ్రాహాము వృద్ధాప్యంలో శారా గర్భవతి అయ్యింది, అతనికి ఒక కుమారుని కన్నది. ఈ సంగతులన్నీ సరిగ్గా దేవుడు వాగ్దానం చేసినట్టే జరిగాయి. 3 శారా కుమారుని కన్నది, అబ్రాహాము వానికి ఇస్సాకు అని పేరు పెట్టాడు. 4 దేవుడు ఆజ్ఞాపించినట్లు, ఇస్సాకుకు ఎనిమిది రోజులు నిండగానే అబ్రాహాము అతనికి సున్నతి చేశాడు.
5 తన కుమారుడు ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రాహాము వయస్సు 100 సంవత్సరాలు. 6 “దేవుడు నన్ను సంతోషపెట్టాడు. ఇది విన్న ప్రతి ఒక్కరూ నాతో సంతోషిస్తారు. 7 నేను శారాను. అబ్రాహాము కుమారుణ్ణి పొందుతాడని ఏ ఒక్కరూ తలంచలేదు. కానీ ఆయన వృద్ధుడుగా ఉన్నప్పుడు అబ్రాహాముకు నేను ఒక కుమారుని కన్నాను” అంది శారా.
ఇంట్లో సమస్య
8 ఇస్సాకు ఎదుగుతున్నాడు. త్వరలోనే గట్టి పదార్థాలు భోజనం చేసేటంతటి పెద్దవాడయ్యాడు. అప్పట్లో అబ్రాహాము ఒక మహా గొప్ప విందు చేశాడు. 9 గతంలో ఈజిప్టు బానిస స్త్రీయైన హాగరు ఒక కుమారుని కన్నది. ఆ కుమారునికి కూడా అబ్రాహామే తండ్రి. అయితే ఆ కుమారుడు ఇప్పుడు ఇస్సాకును వేధించడం శారా చూసింది. 10 కనుక “ఆ బానిస స్త్రీని, ఆమె కుమారుణ్ణి బలవంతంగా వెళ్లగొట్టు. మన మరణం తరువాత మన కుమారుడు ఇస్సాకు మన ఆస్తి అంతటికి వారసుడవుతాడు. దానిలో దాసీ కుమారుడు ఇస్సాకుతో భాగం పంచుకోవటం నాకు ఇష్టం లేదు” అంటూ శారా అబ్రాహాముతో చెప్పింది.
11 ఇదంతా అబ్రాహాముకు బాధ కలిగించింది. తన కుమారుడైన ఇష్మాయేలును గూర్చి అతడు చింతించాడు. 12 కానీ అబ్రాహాముతో దేవుడన్నాడు: “ఆ పిల్లవాణ్ణి గూర్చి నీవు చింతించకు. ఆ బానిస స్త్రీని గూర్చి నీవు చింతపడకు. శారా కోరినట్టే చేయి. ఇస్సాకు మాత్రమే నీకు వారసుడయిన కుమారుడు. 13 అయితే నీ బానిస స్త్రీ కుమారుణ్ణి కూడా నేను ఆశీర్వదిస్తాను. అతడూ నీ కుమారుడే, కనుక అతని వంశం నుండి గూడ నేను ఒక గొప్ప జనాన్ని చేస్తాను.”
14 మర్నాడు వేకువనే అబ్రాహాము కొంత భోజనాన్ని, తిత్తిలో నీళ్లను తెచ్చాడు. అబ్రాహాము వాటిని హాగరుకు ఇచ్చాడు. హాగరు వాటిని తీసుకొని, తన కుమారునితో కలసి వెళ్లిపోయింది. హాగరు ఆ చోటు విడిచి బెయేర్షెబా అరణ్యంలో సంచరించింది.
15 కొన్నాళ్లకు తిత్తిలోని నీళ్లన్నీ అయిపోయాయి. త్రాగటానికి ఏమీ మిగలలేదు. కనుక హాగరు తన కుమారుణ్ణి ఒక పొద పక్కన పెట్టింది. 16 హాగరు కొంచెం దూరం నడచి వెళ్లింది. అక్కడ ఆగిపోయి కూర్చుంది. నీళ్లు లేవు గనుక తన కుమారుడు చనిపోతాడనుకొంది హాగరు. వాడు చస్తుంటే చూడటం ఆమెకు ఇష్టం లేదు. ఆమె అక్కడ కూర్చొని ఏడ్వటం మొదలు పెట్టింది.
17 ఆ పిల్లవాడు ఏడ్వడం దేవుడు విన్నాడు. పరలోకంనుండి దేవుని దూత హాగరును పిలిచాడు. అతడన్నాడు, “హాగరూ, ఏం జరిగింది? భయపడకు. అక్కడ పిల్లవాడు ఏడ్వడం యెహోవా విన్నాడు. 18 వెళ్లి, పిల్లవాడికి సహాయం చేయి. వాడి చేయి పట్టి నడిపించు. ఒక గొప్ప జనాంగానికి నేను అతణ్ణి తండ్రిగా చేస్తాను.”
19 అంతలో హాగరుకు ఒక బావి కనబడేటట్లు చేశాడు దేవుడు. కనుక హాగరు ఆ బావి దగ్గరకు వెళ్లి, తన తిత్తిని నీళ్లతో నింపుకొన్నది. తర్వాత పిల్లవాడు త్రాగటానికి ఆమె నీళ్లు ఇచ్చింది.
20 ఆ పిల్లవాడు ఎదుగుతూ ఉండగా దేవుడు వానికి తోడుగానే ఉన్నాడు. ఇష్మాయేలు అరణ్యంలో జీవిస్తూ, వేటగాడయ్యాడు. బాణం కొట్టడంలో నిపుణత నేర్చుకొన్నాడు. 21 అతని తల్లి అతని కోసం ఈజిప్టులో భార్యను కనుగొన్నది. వారు పారాను అరణ్యంలోనే జీవిస్తూ ఉన్నారు.
అబీమెలెకుతో అబ్రాహాము బేరం
22 అంతట అబీమెలెకు, ఫీకోలు అబ్రాహాముతో మాట్లాడారు. అబీమెలెకు, అతని సైన్యాధిపతి ఫీకోలు అబ్రాహాముతో ఇలా చెప్పారు: “నీవు చేసే ప్రతి దానిలోను దేవుడు నీతో ఉన్నాడు. 23 కనుక ఇక్కడ దేవుని యెదుట నాకు ఒక వాగ్దానం చేయాలి. నాతో, నా పిల్లలతో నీవు న్యాయంగా వ్యవహరిస్తానని వాగ్దానం చేయాలి. నీవు నివసించిన ఈ దేశం మీద, నా మీద నీవు దయగలిగి ఉంటానని వాగ్దానం చేయాలి. నీపైన నేను ఎంత దయ చూపెట్టానో, నాపైన నీవు కూడా అంత దయ చూపెడ్తానని వాగ్దానం చేయాలి.”
24 “నన్ను నీవు ఎలా పరామర్శించావో నేను కూడా నిన్ను అలాగే పరామర్శిస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను” అన్నాడు అబ్రాహాము. 25 అప్పుడు అబ్రాహాము అబీమెలెకుతో ఒక ఫిర్యాదు చేశాడు. అబీమెలెకు సేవకులు ఒక మంచినీటి బావిని స్వాధీనం చేసుకొన్నందుచేత అబ్రాహాము అబీమెలెకుతో ఫిర్యాదు చేశాడు.
26 కానీ అబీమెలెకు, “ఇది ఎవరు చేశారో నాకు తెలియదు. ఇంతకు ముందు ఈ విషయం నీవు నాతో చెప్పలేదు” అన్నాడు.
27 కనుక అబ్రాహాము, అబీమెలెకు ఒక ఒడంబడిక చేసుకొన్నారు. ఆ ఒడంబడికకు సూచనగా కొన్ని గొర్రెలను, పశువులను అబ్రాహాము అబీమెలెకుకు ఇచ్చాడు. 28 ఏడు[a] ఆడ గొర్రె పిల్లల్ని కూడా అబ్రాహాము అబీమెలెకు ఎదుట ఉంచాడు. 29 “ఈ ఏడు ఆడ గొర్రెపిల్లల్ని ఇలా ప్రత్యేకంగా ఎందుకు పెట్టావు?” అని అబీమెలెకు అబ్రాహామును అడిగాడు.
30 “ఈ గొర్రెపిల్లల్ని నా దగ్గర నుండి నీవు స్వీకరించినప్పుడు, ఈ బావిని నేను తవ్వించినట్లు రుజువు అవుతుంది” అని అబ్రాహాము జవాబిచ్చాడు.
31 కనుక ఆ తర్వాత ఆ బావి బెయేర్షెబా[b] అని పిలువబడింది. వారిద్దరు ఒకరికి ఒకరు ఆ స్థలంలో వాగ్దానం చేసుకొన్న చోటు గనుక దానికి వారు ఆ పేరు పెట్టారు. 32 కనుక అబ్రాహాము, అబీమెలెకు బెయేర్షెబా దగ్గర ఒక ఒడంబడిక చేసుకొన్నారు. అప్పుడు అబీమెలెకు, అతని సైన్యాధిపతి తిరిగి ఫిలిష్తీ ప్రజల దేశం వెళ్లిపోయారు.
33 బెయేర్షెబాలో అబ్రాహాము ఒక అలంకారపు చెట్టు[c] నాటాడు. అప్పుడు అబ్రాహాము, ప్రభువును, ఎల్లప్పుడు జీవిస్తున్న దేవుడునైన యెహోవాకు అక్కడ ప్రార్థన చేశాడు. 34 ఫిలిష్తీయుల దేశంలో అబ్రాహాము చాలాకాలం నివసించాడు.
ద్రాక్షతోటలోని పనివాళ్ళు
20 యేసు, “దేవుని రాజ్యాన్ని ద్రాక్షతోట యజమానితో పోల్చవచ్చు. అతడు తన తోటలో పని చెయ్యటానికి పనివాళ్ళను నియమించాలని ఉదయమే లేచి వెళ్ళాడు. 2 ఆ రోజు పనివాళ్ళకు ఒక దెనారా యివ్వటానికి అంగీకరించి వాళ్ళను తన ద్రాక్షతోటకు పంపాడు.
3 “అతడు ఉదయం తొమ్మిదిగంటలకు మళ్ళీ సంతకు వెళ్ళాడు. అక్కడ మరికొంత మంది ఏ పనీ చేయకుండా వూరికే నిల్చొని ఉండటం చూసాడు. 4 అతడు వాళ్ళతో ‘మీరు కూడా వెళ్ళి నా ద్రాక్షతోటలో పని చెయ్యండి. మీక్కూడా సమంజసమైన కూలి యిస్తాను’ అని అన్నాడు. 5 వాళ్ళు దానికి అంగీకరించి వెళ్ళారు.
“అతడు పన్నెండు గంటలప్పుడు, మూడు గంటలప్పుడు కూడా వెళ్ళి మళ్ళీ అలాగే చేసాడు. 6 అతడు అయిదు గంటలప్పుడు మళ్ళీ వెళ్ళి మరి కొంతమంది అక్కడ నిలుచొని ఉండటం గమనించాడు. అతడు వాళ్ళతో ‘మీరు ఏమీ చెయ్యకుండా దినమంతా యిక్కడ ఎందుకు నిలుచున్నారు?’ అని అడిగాడు.
7 “‘మాకెవ్వరూ పనివ్వలేదు’ అని వాళ్ళు సమాధానం చెప్పారు.
“అతడు వాళ్ళతో ‘మీరు కూడా నా ద్రాక్షతోటలో పని చెయ్యండి!’ అని అన్నాడు.
8 “సాయంత్రం కాగానే ఆ ద్రాక్షతోట యజమాని పెద్ద దాసునితో ‘పనివాళ్ళందరిని పిలిచి చివరకు వచ్చిన వాళ్ళతో మొదలుపెట్టి కూలి యిచ్చేయి!’ అని అన్నాడు.
9 “అయిదు గంటలప్పుడు పని మొదలు పెట్టిన కూలీలు వచ్చారు. వాళ్ళకు ఒక దెనారా లభించింది. 10 మొదట పని మొదలుపెట్టిన వాళ్ళువచ్చి తమకు ఎక్కువ కూలి లభిస్తుందని ఆశించారు. కాని వాళ్ళకు కూడా ఒక దెనారా లభించింది. 11-12 వాళ్ళు కూలి తీసికొని యజమానునితో ‘చివరకు వచ్చిన వాళ్ళు ఒకే గంట పని చేసారు. ఎండను సహించి దినమంతా పనిచేసిన మమ్మల్ని, వాళ్ళనూ మీరు సమానంగా చూస్తున్నారు’ అని సణగటం మొదలు పెట్టారు.
13 “కాని అతడు ఒక కూలి వానితో, ‘మిత్రమా నేను నీకు అన్యాయం చేయటం లేదు. ఒక దెనారాకు పని చేస్తానని నీవు ఒప్పుకోలేదా? 14 నీ కూలి తీసికొని వెళ్ళిపో! నీకిచ్చిన కూలినే చివరను వచ్చిన వానికి కూడా యివ్వాలనుకొన్నాను. 15 నా డబ్బుతో నా యిష్టంవచ్చినట్లు చేసుకొనే అధికారం నాకులేదా? నేను ఔదార్యం చూపుతున్నందుకు నీవు ఓర్వలేకుండా ఉన్నావా?’ అని అన్నాడు.
16 “ఈ విధంగా చివరనున్న వాళ్ళు ముందుకు వస్తారు; ముందున్న వారు చివరకు వెళ్తారు” అని అన్నాడు.
యేసు తన మరణాన్ని గురించి మళ్ళీ మాట్లాడటం
(మార్కు 10:32-34; లూకా 18:31-34)
17 యేసు యెరూషలేముకు వెళ్తూ పండ్రెండు మంది శిష్యులను ప్రక్కకు పిలిచి ఈ విధంగా అన్నాడు: 18 “మనమంతా యెరూషలేమునకు వెళ్తున్నాము. అక్కడ మనుష్యకుమారుడు ప్రధాన యాజకులకు, శాస్త్రులకు అప్పగింప బడతాడు. వాళ్ళు ఆయనకు మరణ దండన విధించి, 19 యూదులుకాని వాళ్ళకప్పగిస్తారు. ఆ యూదులుకాని వాళ్ళు ఆయన్ని హేళన చేసి కొరడా దెబ్బలు కొట్టి సిలువకు వేస్తారు. మూడవ రోజు ఆయన బ్రతికి వస్తాడు.”
ఒక తల్లి కోరిన కోరిక
(మార్కు 10:35-45)
20 ఆ తర్వాత జెబెదయి భార్య తన కుమారులతో కలిసి యేసు దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరిల్లి ఒక ఉపకారం చెయ్యమని కోరింది.
21 యేసు, “నీకేం కావాలి?” అని అడిగాడు.
ఆమె, “మీ రాజ్యంలో, నా ఇరువురు కుమారుల్లో ఒకడు మీ కుడిచేతివైపున, మరొకడు మీ ఎడమచేతి వైపున కూర్చునేటట్లు అనుగ్రహించండి” అని అడిగింది.
22 యేసు, “మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు. నా పాత్రలో దేవుడు కష్టాల్ని నింపాడు. నేను త్రాగటానికి సిద్ధంగా ఉన్నాను. మీరు త్రాగగలరా?” అని అడిగాడు.
“త్రాగగలము” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
23 యేసు వాళ్ళతో, “మీరు నిజంగానే త్రాగవలసి వస్తుంది. కాని నా కుడిచేతివైపున కూర్చోవటానికి, లేక ఎడమచేతివైపు కూర్చోవటానికి అనుమతి యిచ్చే అధికారం నాకు లేదు. ఈ స్థానాల్ని నా తండ్రి ఎవరికోసం నియమించాడో వాళ్ళకే అవి దక్కుతాయి” అని అన్నాడు.
24 మిగతా పదిమంది ఇది విని ఆ ఇరువురు సోదరుల పట్ల కోపగించుకొన్నారు. 25 యేసు వాళ్ళను పిలిచి, “యూదులుకాని రాజులు తమ ప్రజలపై అధికారం చూపుతూ ఉంటారు. వాళ్ళ పెద్దలు వాళ్ళను అణచిపెడ్తూ ఉంటారు. ఈ విషయం మీకు తెలుసు. 26 మీరు అలాకాదు. మీలో గొప్పవాడు కాదలచినవాడు మీ సేవకునిగా ఉండాలి. 27 మీలో ముఖ్యుడుగా ఉండ దలచిన వాడు బానిసగా ఉండాలి. 28 మనుష్యకుమారుడు సేవ చేయించుకోవడానికి రాలేదు. సేవచెయ్యటానికివచ్చాడు. అనేకుల విమోచన కోసం తన ప్రాణాన్ని ఒక వెలగా చెల్లించడానికి వచ్చాడు” అని అన్నాడు.
ఇద్దరు గ్రుడ్డి వాళ్ళకు చూపురావటం
(మార్కు 10:46-52; లూకా 18:35-43)
29 యేసు, ఆయన శిష్యులు యెరికో పట్టణం నుండి బయలు దేరి వెళ్తూండగా చాలా మంది ప్రజలు ఆయన్ని అనుసరించారు. 30 దారి ప్రక్కన కూర్చొన్న ఇద్దరు గ్రుడ్డివాళ్ళు యేసు ఆ దారిన వస్తున్నాడని విని, “మమ్మల్ని కరుణించు దావీదు కుమారుడా!” అని బిగ్గరగా అన్నారు.
31 ప్రజలు వాళ్ళను నిశ్శబ్దంగా వుండమని గద్దించారు. కాని ఆ గ్రుడ్డివాళ్ళు యింకా బిగ్గరగా, “ప్రభూ! దావీదు కుమారుడా! మాపై దయ చూపు!” అని అన్నారు.
32 యేసు ఆగి ఆ గ్రుడ్డివాళ్ళను పిలిచి, “ఏం చెయ్యమంటారు?” అని అడిగాడు.
33 “ప్రభూ! మాకు చూపుకావాలి!” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
34 యేసుకు వాళ్ళపై దయ కలిగి వాళ్ళ కళ్ళను తాకాడు. వెంటనే వాళ్ళకు చూపు వచ్చింది. వాళ్ళు ఆయన్ని అనుసరించారు.
10 అలా ముద్ర వేయబడిన ఒడంబడిక మీద ఉన్న పేర్లు ఇవి:
పాలనాధికారి నెహెమ్యా, నెహెమ్యా హకల్యా కుమారుడు. సిద్కీయా, 2 శెరాయా, అజర్యా, యిర్మీయా, 3 పషూరు, అమర్యా, మల్కీయా, 4 హట్టూషు, షెబన్యా, మల్లూకు, 5 హరిము, మెరేమోతు, ఓబద్యా, 6 దానియేలు, గిన్నెతోను, బారూకు, 7 మెషుల్లాము, అబీయా, మీయామిను, 8 మయజ్యా, బిల్గయి, షెమయా. ఇవన్నీ ఒడంబడిక మీద సంతకాలు పెట్టిన యాజకుల పేర్లు.
9 ముద్రవేయబడిన ఒడంబడిక మీద సంతకాలు పెట్టిన లేవీయుల పేర్లు ఇవి:
అజన్యా కుమారుడు యేషువా, హేనాదాదు వంశానికి చెందిన బిన్నూయి, కద్మీయేలు, 10 వాళ్ల సోదరులు: షెబన్యా, హోదీయా, కెలీటా, పెలాయా, హానాను, 11 మీకా, రెహోబు, హషబ్యా, 12 జక్కూరు, షేరేబ్యా, షెబన్యా, 13 హోదీయా, బానీ, బెనీను.
14 ముద్రవేయబడిన ఒడంబడిక మీద సంతకాలు చేసిన నాయకుల పేర్లు:
పరోషు, పహత్నోయాబు, ఏలాము, జత్తూ, బానీ, 15 బున్నీ, అజ్గాదు, బేబై, 16 అదోనీయా, బిగ్వయి, అదీను, 17 అటేరు, హిజ్కియా, అజ్జూరు, 18 హోదీయా, హాషుము, బేజయి, 19 హారీఫు, అనాతోతు, నేబై, 20 మగ్పీయాషు, మెషుల్లాము, హెజీరు, 21 మెషేయేలు, సాదోకు, యద్దూవ, 22 పెలట్యా, హానాను, అనాయా, 23 హోషేయ, హనన్యా, హష్షూబు, 24 హల్లోహెషు, పిల్హా, షోబేకు, 25 రెహూము, హషబ్నా, మయశేయా, 26 అహీయా, ఆనాను, అనాను, 27 మల్లూకు, హరీము, బయనా.
28-29 ఈ విధంగా, ఇప్పుడు వీళ్లందరూ దేవునికి ఈ ప్రత్యేక ప్రమాణం చేస్తున్నారు. తమ ఈ ప్రమాణాన్ని నిలుపుకోకపోతే, తామందరికీ చెడు, కీడు జరపమని వీళ్లంతా అర్థించారు. వీళ్లందరూ దేవుని ధర్మశాస్త్ర నియమాలను అనుసరిస్తామని ప్రమాణం చేస్తున్నారు ధర్మశాస్త్రం దేవుని సేవకుడైన మోషే ద్వారా మాకు ప్రసాదించబడింది. మన దేవుడైన యెహోవా ఆదేశాలను, నియమ నిబంధనలను, ఉపదేశాలను అన్నింటినీ విధేయతతో పాటిస్తామని వీళ్లందరూ ప్రమాణం చేస్తారు. ఈ ప్రమాణం చేస్తున్నది ఈ మనుష్యులే: మిగిలిన వాళ్లు యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, ఆలయ సేవకులు, తమచుట్టూ నివసిస్తున్నవారినుంచి తమని తాము వేరు చేసుకున్న ఇశ్రాయేలీయులందరూ తాము దేవుని ధర్మశాస్త్రాన్ని విదేయతతో పాటించేందుకుగాను వాళ్లు తమని తాము వేరు చేసుకున్నారు. అంతేకాదు, వాళ్లందరి భార్యలు, విని అర్థం చేసుకోగల వాళ్లందరి కొడకులు, కూతుళ్లు కూడా తమని తాము వేరు చేసుకున్నారు. వీళ్లందరూ దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తామని ప్రమాణం చేసేందుకుగాను తమ సోదరులతోనూ, పెద్దలతోనూ జతకూడారు. తాము దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే, తమకి కీడు కలిగించే శాపాన్ని తలదాల్చేందుకు కూడా సిద్ధపడ్డారు.
30 “మా చుట్టు ప్రక్కల వున్న ఇతర ప్రజలను మా కూతుళ్లు పెళ్లి చేసుకోకుండా, అలాగే మా కొడుకులు ఇతర ప్రజల కూతుళ్లను పెళ్లి చేసుకోకుండానూ చూస్తామని మేము ప్రమాణం చేస్తున్నాము.
31 “మేము సబ్బాతు (విశ్రాంతి) రోజున పని చేయమని ప్రమాణం చేస్తున్నాము. మా చుట్టూ ఉన్న ఇతర ప్రజలు సబ్బాతు రోజున తిండి గింజలో, ఇతర వస్తువులో అమ్మకానికి తెస్తే ఆ ప్రత్యేక దినానగాని, మరే ఇతర పండగ దినాల్లోగాని మేము వాటిని కొనము. ప్రతి ఏడేళ్లకీ ఒకసారి ఇతరులు మాకియ్యవలసిన బాకీ మొత్తాలను రద్దు చేస్తాము.
32 “దేవుని ఆలయం విషయంలో శ్రద్ధ తీసుకోవాలన్న ఆదేశాల మేరకు మేమా బాధ్యతను స్వీకరిస్తాము. దేవునికి నిత్యం ధూప దీప నైవేద్యాలు సక్రమంగా జరిగేందుకోసం మేము ప్రతియేటా తులము వెండిలో[a] మూడోవంతు ఇస్తాము. 33 ఆలయంలో వారు బల్లమీద పెట్టే ప్రత్యేక రొట్టెలకోసం, ప్రతి రోజూ అర్పించే ధాన్యార్పణలు దహనబలుల కోసం ఈ సొమ్ము యాజకులచేత వినియోగించబడుతుంది. అలాగే, ఈ సొమ్ము ధాన్యాలు కొనేందుకు, ధూప దీపాలు పెట్టేందుకు ఉపయోగింపబడుతుంది. సబ్బాతు రోజుల్లో, అమావాస్య[b] దినాల్లో నైవేద్యం నిమిత్తం ఈ సొమ్ము వినియుక్తమవుతుంది. అది పవిత్ర బలులకోసం, ఇశ్రాయేలీయులను పరిశుద్ధులను చేసే పాపపరిహారార్థ బలులకోసం వినియోగింపబడుతుంది.
34 “యాజకులము, లేవీయులము, సామాన్య జనమైన మనము చీట్లు[c] వేసుకున్నాము. తద్వారా, మా కుటుంబాల్లో ఏటా మన ఆలయానికి ఏయే నిర్ణీతదినాల్లో కట్టెల మోపులు (సమిధలు) తేవాలో తెల్సుకున్నాము. ఆ కట్టెలు మన దేవుడైన యెహోవా గట్టు మీద హోమం కోసం తెచ్చేవి. అదంతా మేము సరిగ్గా ధర్మశాస్త్రంలో వ్రాసిన నిబంధనల ప్రకారం చెయ్యాలి.
35 “మా పంట చేలనుంచీ, ప్రతి ఒక్క ఫల వృక్షం నుంచీ తోలి ఫలాలను ఏటా యెహోవా ఆరాధనాలయానికి తెచ్చి ఇచ్చే బాధ్యతను మేము స్వీకరిస్తున్నాము.
36 “ధర్మశాస్త్రంలో సరిగ్గా లిఖించబడినట్లే, మేమిలా చేస్తాము: మా తొలిచూలు కొడుకుల్నీ, అలాగే, మొదటి ఈత ఆవుల దూడల్నీ, గొర్రెల, మేకల పిల్లల్నీ మన దేవుని ఆలయానికి, మన యాజకుల దగ్గరికి తెస్తాము.
37 “యెహోవా ఆలయపు సరుకుల కొట్ల దగ్గరికి తెచ్చి, ఈ క్రింది వస్తువులు యాజకులకి సమర్పిస్తాము: మొదటివిడత ఆడిన పిండి, ధాన్యార్పణలో మొదటి భాగం, మా ఫల వృక్షాలన్నింటి మొదటి పండ్లు మా కొత్త ద్రాక్షారసం నుంచీ, నూనె నుంచీ మొదటి భాగం, మా పంటల్లొ పదోవంతును లేవీయులకి సమర్పిస్తాము. మేము పనిచేసే ఆయా ప్రాంతాల్లో లేవీయులు వీటిని వసూలు చేస్తారు. అందుకే మేము వారికి ఇస్తాము. 38 ఆ పంట భాగాలు లేవీయులు వసూలు చేసేటప్పుడు, వాళ్లతో అహరోను వంశానికి చెందిన యాజకుడొకడు ఉండాలి. తర్వాత ఆ లేవీయులు ఆ పంటల్ని విధిగా ఆలయానికి తీసుకురావాలి. అప్పుడు వాటిని వాళ్లు ఆలయపు ఖజానాలోని సరుకుల కొట్లలో ఉంచుతారు. 39 ఇశ్రాయేలీయులు, లేవీయులు తమ ఆహార ధాన్యాలు, కొత్త ద్రాక్షారసం, నూనె కానుకలను సరుకుల గదుల వద్దకు తెస్తారు. ఆలయానికి తెచ్చే వస్తువులన్నీ అక్కడ ఉంచబడతాయి. సేవలో వున్న యాజకులు అక్కడే ఉంటారు. గాయకులు, ద్వారపాలకులు కూడా అక్కడేవుంటారు.
“మా దేవుని ఆలయాన్ని భద్రంగా చూసుకుంటామని మేమంతా ప్రమాణం చేశాము!”
పౌలు మాసిదోనియా మరియు గ్రీసుకు వెళ్ళటం
20 అల్లర్లు తగ్గిపొయ్యాక, పౌలు యేసు శిష్యుల్ని పిలిచాడు. వాళ్ళను ఆత్మీయంగా ప్రోత్సాహపరిచి, వాళ్ళనుండి సెలవు తీసుకొన్నాడు. ఆ తర్వాత మాసిదోనియకు వెళ్ళాడు. 2 ఆ ప్రాంతాన పర్యటన చేసి ఆత్మీయంగా ఉత్సాహపరిచే ఎన్నో విషయాలు ప్రజలకు చెప్పి చివరకు గ్రీసు దేశం చేరుకున్నాడు. 3 అక్కడ మూడు నెలలున్నాడు. అక్కడినుండి సిరియ దేశానికి ఓడలో ప్రయాణం చెయ్యాలనుకొని సిద్ధమయ్యాడు.
ఇంతలో యూదులు తనను చంపాలని అనుకొంటున్నారని అతనికి తెలిసింది. అందువలన అతడు తిరిగి మాసిదోనియకు వెళ్ళి అక్కడినుండి ప్రయాణం చేసాడు. 4 అతని వెంట ఉన్నవాళ్ళు ఎవరనగా: బెరయ పట్టణంనుండి పుర్రు కుమారుడైన సోపత్రు, థెస్సలొనీక పట్టణంనుండి అరిస్తర్కు, సెకుందు, దెర్బే పట్టణంనుండి గాయి, తిమోతి, ఆసియనుండి తుకికు, త్రోఫిము. 5 వీళ్ళు ముందే వెళ్ళి మా కోసం త్రోయలో కాచుకొని ఉన్నారు. 6 కాని మేము ఫిలిప్పీనుండి ప్రత్యేకమైన పులియని రొట్టెల పండుగ తర్వాత ఓడలో ప్రయాణమయ్యాము. అయిదు రోజులు ప్రయాణం చేసాక త్రోయలో వాళ్ళను కలుసుకున్నాము. అక్కడ ఏడు రోజులు ఉన్నాము.
పౌలు చివరిసారి త్రోయకు వెళ్ళటం
7 ఆదివారం రోజున అంతా కలిసి రొట్టె విరుచుటకు సమావేశమయ్యాము. పౌలు మరుసటి రోజు ప్రయాణం చేయాలని అనుకోవటం వలన అర్థరాత్రి దాకా ప్రజలతో మాట్లాడాడు. 8 మేము మేడపైనున్న గదిలో సమావేశమయ్యాము. మా గదిలో చాలా దీపాలు వెలుగుతూ ఉన్నాయి. 9 ఆ గది కిటికీలో ఐతుకు అనే యువకుడు కూర్చొని ఉన్నాడు. పౌలు ఏకధాటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలో ఐతుకుకు నిద్ర వచ్చి గాఢంగా నిద్రపొయ్యాడు. ఆ నిద్రలో మూడవ అంతస్తునుండి క్రింద పడ్డాడు. కొంత మంది వచ్చి చనిపోయిన అతణ్ణి చూసారు.
10 పౌలు క్రిందికి వెళ్ళి ఆ యువకుని ప్రక్కన ఒరిగి అతణ్ణి తన చేతుల్తో ఎత్తి, “దిగులు పడకండి, ప్రాణం ఉంది” అని అన్నాడు. 11 అతడు మళ్ళీ మేడ మీదికి వెళ్ళి రొట్టె విరిచి సోదరులకు పంచి తాను తిన్నాడు. తెల్లవారే దాకా వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపొయ్యాడు. 12 ప్రజలు బ్రతికింపబడిన ఆ యువకుణ్ణి అతని యింటికి పిలుచుకు వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళ మనస్సులు ఎంతో నెమ్మది పడ్డాయి.
త్రోయనుండి మిలేతుకు ప్రయాణం
13 మేము పౌలును వదిలి ఓడనెక్కి “అస్సు” కు వెళ్ళాము. తాను కాలి నడకన అస్సుకు చేరుకొని మమ్మల్ని అక్కడ కలుసుకొంటానని చెప్పాడు. అక్కడినుండి మాతో కలిసి ఓడలో ప్రయాణం చెయ్యాలని అతని ఉద్దేశ్యం. 14 మేము అతణ్ణి అస్సులో కలుసుకొన్నాక అతడు మా ఓడనెక్కాడు. అంతా కలిసి “మితులేనే” వెళ్ళాము. 15 మితులేనేనుండి మరుసటి రోజు ఓడలో మళ్ళీ ప్రయాణం సాగించి, “కీయొసు” ద్వీపం కొంత దూరం ఉందనగానే లంగరు వేసాము. ఆ మరుసటి రోజు ప్రయాణం చేసి “సమొసు” ద్వీపానికి దగ్గరగా వచ్చాము. మరొక రోజు ప్రయాణం చేసాక “మిలేతు” చేరుకున్నాము. 16 పౌలు యెరూషలేముకు త్వరగా వెళ్ళాలని అనుకొన్నాడు. ఆసియ ప్రాంతంలో కాలాన్ని వ్యర్థం చెయ్యటం యిష్టం లేక ఎఫెసులో ఆగకుండా వెళ్ళాడు. వీలైతే పెంతెకొస్తు పండుగనాటికి యెరూషలేంలో ఉండాలని అనుకొన్నాడు.
పౌలు ఎఫెసు పెద్దలతో మాట్లాడటం
17 పౌలు కొందర్ని మిలేతునుండి ఎఫెసుకు పంపి అక్కడున్న సంఘ పెద్దల్ని పిలిపించాడు.
18 వాళ్ళు వచ్చాక వాళ్ళతో యిలా చెప్పాడు: “నేను ఆసియలో అడుగు పెట్టిన నాటినుండి మీతో ఉన్నన్ని రోజులు ఏ విధంగా జీవించానో మీకు తెలుసు. 19 యూదుల పన్నాగాలవల్ల నాకు ఎన్నో కష్టాలు, దుఃఖాలు సంభవించాయి. అయినా ప్రభువు సేవ సంపూర్ణమైన విశ్వాసంతో చేసాను. 20 ఆత్మీయ విషయాల్లో మీకు ఉపయోగమయ్యే ప్రతీ విషయాన్ని దాచకుండా, బహిరంగంగా ప్రకటించటమే కాకుండా యింటింటికీ వెళ్ళి బోధించానని మీకు తెలుసు. 21 మారుమనస్సు పొంది, దేవుని కోసం జీవించమని, మన యేసు ప్రభువును నమ్మమని యూదులకు, గ్రీకులకు చెప్పాను.
22 “పరిశుద్ధాత్మ చెప్పినట్లు చెయ్యాలనే ఉద్దేశ్యంతో నేను యెరూషలేము వెళ్తున్నాను. అక్కడేం జరుగుతుందో నాకు తెలియదు. 23 నేను కష్టాలు, కారాగారాలు ఎదుర్కొంటానని పరిశుద్ధాత్మ నన్ను ప్రతి పట్టణంలో ముందే వారించాడు. ఇది మాత్రం నాకు తెలుసు. 24 నా జీవితాన్ని నేను లెక్కచెయ్యను. కాని ఈ పరుగు పందెం ముగించి యేసు ప్రభువు చెప్పిన ఈ కార్యాన్ని పూర్తి చేస్తే చాలు. దేవుని అనుగ్రహాన్ని గురించి చెప్పే సువార్తను ప్రకటించటమే నా కర్తవ్యం.
25 “మళ్ళీ మిమ్మల్ని చూడటం వీలు పడదని నాకు తెలుసు. నేను మీతో ఉండి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాను. 26 అందువల్ల ఈ రోజు నేనిది ఖచ్చితంగా చెప్పగలను. మీలో ఎవరైనా ఆత్మీయంగా మరణిస్తే దానికి నేను బాధ్యుణ్ణి కాను. 27 ఎందుకంటే, నేను దేవుడు చెయ్యదలచినదాన్ని సంపూర్ణంగా కొంచెం కూడా సంకోచించకుండా ప్రకటించాను. 28 పరిశుద్ధాత్మ మిమ్మల్ని సంఘానికి కాపరులుగా నియమించాడు. ఆ దేవుని సంఘానికి మీరు కాపరుల్లా ఉండాలి. ఆయన తన సంఘమును తన స్వంత రక్తంతో సంపాదించాడు. మీ విషయంలో, ఈ సంఘం విషయంలో జాగ్రత్తగా ఉండండి. 29 నేను వెళ్ళిపొయ్యాక భయంకరమైన తోడేళ్ళు మీ మందలోకి వచ్చి హాని కలిగిస్తాయని నాకు తెలుసు. 30 మీలోనుండి కూడా కొందరు ముందుకు వచ్చి మీతో ఉన్న అనుచరుల్ని దొంగిలించాలని అబద్ధాలాడుతారు. 31 అందుకే జాగ్రత్తగా ఉండండి. నేను మూడు సంవత్సరాలు మీతో ఉన్నాను. కంటతడి పెట్టుకొని రాత్రింబగళ్ళు మీలో ఉన్న ప్రతి ఒక్కర్నీ వారించాను. ఈ విషయం మరిచిపోకండి.
32 “ఇప్పుడు మిమ్మల్ని దేవునికి, ఆయన అనుగ్రహాన్ని గురించి బోధించే సందేశానికి అప్పగిస్తున్నాను. ఆ సందేశంలో మిమ్మల్ని ఆత్మీయంగా అభివృద్ధి పరచగల శక్తి ఉంది. అంతే కాక అది పరిశుద్ధమైన దేవుని విశ్వాసులకు లభించిన వారసత్వం మీక్కూడా లభించేటట్లు చేస్తుంది. 33 మీనుండి నేను వెండి బంగారాలు కాని, మంచి దుస్తులు కాని ఆశించలేదు. 34 నేను నా చేతుల్తో పని చేసి, నా అవసరాలు, నాతో ఉన్న వాళ్ళ అవసరాలు తీర్చుకొన్నానని మీకు తెలుసు. 35 కష్టించి పని చేసి దిక్కులేని వాళ్ళకు సహాయం చెయ్యటం ఉత్తమమని మీకు అన్ని విధాలా తెలియ చేసాను. యేసు ప్రభువు, ‘తీసుకోవటంలో కన్నా యివ్వటంలో చాలా దీవెన ఉంది!’ అని అన్నాడు. ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోవటం అవసరమని మీకు రుజువు చేసాను.”
36 ఈ విధంగా చెప్పి, అతడు మోకాళ్ళూని అందరితో కలిసి ప్రార్థించాడు. 37 ఆ తర్వాత అందరూ కంటతడి పెట్టుకొని అతనికి ప్రేమతో వీడ్కోలు యిచ్చారు. 38 “మిమ్మల్ని మళ్ళీ చూడటం వీలుపడదు” అని అతడన్న మాటలు వాళ్ళకు చాలా దుఃఖం కలిగించాయి. ఆ తదుపరి వాళ్ళతనితో ఓడవరకు వెళ్ళారు.
© 1997 Bible League International