M’Cheyne Bible Reading Plan
పాపం ప్రారంభం
3 ఆ సమయంలో ఆ స్త్రీతో సర్పం మాట్లాడింది. యెహోవా దేవుడు సృష్టించిన అడవి జంతువులన్నిటిలో సర్పం చాలా తెలివైనది, కపటమైనది. ఆ సర్పం స్త్రీని మోసగించాలనుకొని, “ఏమమ్మా! ఈ తోటలోని ఏ చెట్టు ఫలమైనా తినవద్దని దేవుడు నిజంగా నీతో చెప్పాడా?” అంది.
2 సర్పానికి ఆమె ఇలా జవాబిచ్చింది: “లేదు! దేవుడు అలాగు చెప్పలేదు. తోటలోని చెట్ల ఫలాలు మేము తినవచ్చు. 3 అయితే ఒక చెట్టుంది, దాని ఫలము మేము తినకూడదు. ‘తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలం మీరు తినకూడదు. అసలు ఆ చెట్టును మీరు ముట్టుకోకూడదు. అలాచేస్తే మీరు చస్తారు’ అని దేవుడు మాతో చెప్పాడు.”
4 అయితే సర్పం ఆ స్త్రీతో ఇలా అంది: “మీరు చావరు. 5 ఆ చెట్టు ఫలం మీరు తింటే, మంచి చెడ్డలను గూర్చి మీరు తెలుసుకొంటారని దేవునికి తెలుసు. అప్పుడు మీరు దేవునివలె ఉంటారు!”
6 ఆ చెట్టు చాలా అందంగా ఉన్నట్లు ఆ స్త్రీ చూసింది; ఆ ఫలం తినటానికి మంచిదిగా ఉన్నట్లు, ఆ చెట్టు తెలివినిస్తుందని ఆమె తెలుసుకొంది. కనుక ఆ స్త్రీ ఆ చెట్టు ఫలం తీసుకొని దానిని తిన్నది. ఆ పండులో కొంత ఆమె భర్తకు ఇచ్చింది, అతడు కూడా దాన్ని తిన్నాడు.
7 అప్పుడు ఆ పురుషుడు, స్త్రీ ఇద్దరూ మారిపోయారు. వారి కళ్లు తెరవబడ్డట్లు వారికి అన్నీ వేరుగా కనబడ్డాయి. వారికి బట్టలు లేనట్లు, నగ్నంగా ఉన్నట్లు వాళ్లు చూశారు. కనుక వారు అంజూరపు ఆకులను కుట్టి వాటినే బట్టలుగా ధరించారు.
8 సాయంకాలపు చల్లని వేళలో యెహోవా దేవుడు ఆ తోటలో నడుస్తుండగా ఆ పురుషుడు, స్త్రీ ఆ చప్పుడు విని, తోటలోని చెట్లమధ్య దాగుకొన్నారు. యెహోవా దేవుని నుండి దాగుకొనేందుకు వారు ప్రయత్నించారు. 9 అయితే యెహోవా దేవుడు ఆ పురుషుని పిలిచాడు. “నీవు ఎక్కడున్నావు?” అన్నాడు యెహోవా.
10 “నీవు తోటలో నడుస్తున్న చప్పుడు విన్నాను, నాకు భయం వేసింది. నేను నగ్నంగా ఉన్నాను, అందుకే దాగుకొన్నాను” అన్నాడు ఆ పురుషుడు.
11 దేవుడు ఆ పురుషునితో ఇలా అన్నాడు. “నీవు నగ్నంగా ఉన్నావని నీతో ఎవరు చెప్పారు? నిన్ను సిగ్గుపడేటట్లు చేసింది ఏమిటి? నేను తినవద్దని చెప్పిన పండు నీవు తిన్నావా ఏమిటి? ఆ చెట్టు ఫలం తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించానుగదా!”
12 అందుకు ఆ పురుషుడు, “నా కోసం నీవు చేసిన ఈమె ఆ చెట్టు ఫలాన్ని నాకిచ్చింది, అందుచేత నేను తిన్నాను” అన్నాడు.
13 అప్పుడు యెహోవా దేవుడు, “ఏమిటి నీవు చేసింది?” అన్నాడు ఆ స్త్రీతో.
ఆ స్త్రీ, “సర్పం నన్ను మోసం చేసింది. నన్ను వెర్రిదాన్ని చేస్తే నేను ఆ పండు తినేశాను” అని చెప్పింది.
14 అందుచేత యెహోవా దేవుడు సర్పంతో ఇలా అన్నాడు:
“ఈ మహా చెడ్డ పని నీవే చేశావు
కనుక నీవు శపించబడ్డావు.
జంతువులన్నిటి కంటే
నీ పరిస్థితి హీనంగా ఉంటుంది.
నీవు నీ పొట్టతో పాకడం తప్పనిసరౌతుంది.
నీవు జీవిత కాలమంతా మట్టి తింటావు.
15 ఈ స్త్రీని, నిన్ను ఒకరికొకర్ని
విరోధుల్నిగా నేను చేస్తాను.
నీ సంతానము, ఆమె సంతానము
ఒకరికొకరు విరోధులవుతారు.
నీవు ఆమె శిశువు పాదం మీద కాటేస్తావు
ఈ శిశువు నీ తలను చితుక కొడతాడు.”
16 అప్పుడు స్త్రీతో యెహోవా దేవుడు ఇలా అన్నాడు:
“నీవు గర్భవతిగా ఉన్నప్పుడు నేను
నీకు బహు ప్రయాస కలుగజేస్తాను.
నీవు పిల్లల్ని కనేటప్పుడు మహా
గొప్ప బాధ నీకు కలుగుతుంది.
నీవు నీ భర్తను వాంఛిస్తావు
కాని అతడే నిన్ను ఏలుతాడు.”
17 అప్పుడు పురుషునితో దేవుడు ఈలాగు అన్నాడు:
“ప్రత్యేకమైన చెట్టుఫలాన్ని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించాను.
అయితే నీవు నీ భార్య చెప్పిన మాటలు విన్నావు. ఆ చెట్టు ఫలాన్ని తిన్నావు. కనుక
నీ మూలంగా భూమిని నేను శపిస్తాను.
భూమి ఇచ్చే ఆహారం కోసం నీవు నీ జీవితాంతం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.
18 పొలంలో పండే మొక్కల్ని నీవు తినాలని అనుకొంటావు
కాని ముళ్లను, పొదలను నేల నీకోసం పండిస్తుంది.
19 నీ భోజనం కోసం నీవు చాలా కష్టపడి పని చేస్తావు.
నీ ముఖం అంతా చెమటతో నిండి పోయేంతగా నీవు పని చేస్తావు.
నీవు చనిపోయే రోజు వరకు కష్టపడి పని చేస్తావు
మరణించాక నీవు మరలా మట్టి అయిపోతావు.
నేను నిన్ను చేసినప్పుడు మట్టిలో నుంచే నీవు తీయబడ్డావు
మళ్లీ నీవు చనిపోయినప్పుడు తిరిగి మట్టిలోనే కలిసిపోతావు.”
20 ఆదాము[a] తన భార్యకు హవ్వ[b] అని పేరు పెట్టాడు. ఎన్నడైనా సరే, బ్రతికిన ప్రతి మనిషికి ఈమె తల్లి కనుక ఆయన ఆమెకు ఆ పేరు పెట్టాడు.
21 యెహోవా దేవుడు జంతు చర్మాలతో ఆ పురుషునికి, అతని భార్యకు చొక్కాలు చేశాడు. ఆ తరువాత ఆ చొక్కాలను వారికి తొడిగించాడు.
22 అప్పుడు యెహోవా దేవుడు అన్నాడు: “చూడండి, మనిషి మనలా తయారయ్యాడు. మంచి, చెడ్డలు మనిషికి తెలుసు. ఇప్పుడు ఆ మనిషి జీవ వృక్షంనుండి ఫలములు తీసుకొని తింటే అతడు శాశ్వతంగా జీవిస్తాడు.”
23 కనుక ఏదెను తోటనుండి ఆ మనిషిని యెహోవా దేవుడు వెళ్లగొట్టాడు. ఆదాము బలవంతంగా వెళ్లగొట్టబడి ఏ నేల నుండి అతడు తీయబడ్డాడో ఆ నేలను సేద్యం చేయటం మొదలు పెట్టాడు. 24 తరువాత ఆ తోటకు కాపలాగా దాని ద్వారం దగ్గర కెరూబులను[c] దేవుడు ఉంచాడు. ఒక అగ్ని ఖడ్గాన్ని కూడా అక్కడ ఉంచాడు. జీవ వృక్షమునకు పోయే మార్గాన్ని కాపలా కాస్తూ ఆ ఖడ్గం చుట్టూరా తిరుగుతూవుంది.
యోహాను బోధించటం
(మార్కు 1:1-8; లూకా 3:1-9, 15-17; యోహాను 1:19-28)
3 బాప్తిస్మము[a] యిచ్చే యోహాను, ఆ కాలంలో యూదయ దేశంలోని ఎడారిలో ఉపదేశిస్తూ ఉండేవాడు. 2 అతడు, “దేవుని రాజ్యం సమీపంలోనే ఉంది కనుక మారుమనస్సు పొందండి!” అని ఉపదేశించాడు. 3 ఇతణ్ణి గురించి దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఈ విధంగా చెప్పాడు:
“‘ప్రభువు మార్గాన్ని సిద్ధం చెయ్యమని,
తిన్నని మార్గాన్ని వెయ్యమని’
ఎడారిలో ఒక గొంతు ఎలుగెత్తి పలికింది.”(A)
4 యోహాను ఒంటె వెంట్రుకలతో చెయ్యబడిన వస్త్రాల్ని ధరించి, నడుముకు తోలు దట్టి కట్టుకొని, మిడుతల్ని, అడవి తేనెను తింటూ జీవించేవాడు. 5 యెరూషలేము నుండి, యూదయ దేశము నుండి యోర్దాను నదీ ప్రాంతాలన్నిటి నుండి ప్రజలు అతని దగ్గరకు వెళ్ళి, 6 తాము చేసిన పాపాల్ని ఒప్పుకొనే వాళ్ళు. అతడు వాళ్ళకు యొర్దాను నదిలో బాప్తిస్మమునిచ్చేవాడు.
7 పరిసయ్యులు[b] సద్దూకయ్యులు[c] యోహాను బాప్తిస్మమునిస్తున్న ప్రాంతానికి వచ్చారు. అతడు వాళ్ళను చూసి, “మీరు సర్పసంతానం. దేవుని కోపం నుండి తప్పించుకొనుటకు మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు? 8 మీరు మారుమనస్సు పొందినట్లుగా మీ ప్రవర్తన మార్చుకోండి. 9 ‘అబ్రాహాము మా తండ్రి’ అని మీలో మీరు గర్వించకండి. ఈ రాళ్ళ నుండి దేవుడు అబ్రాహాముకు సంతానాన్ని సృష్టించ గలడని నేను చెబుతున్నాను. 10 చెట్ల వేర్ల మీద గొడ్డలి సిద్ధంగా ఉంది. దేవుడు మంచి ఫలమివ్వని చెట్లను నరికి మంటల్లోకి వేస్తాడు.
11 “మీరు మారుమనస్సు పొందారు కనుక నేను మీకు బాప్తిస్మము నిస్తున్నాను. కాని నా తర్వాత రానున్నవాడు నా కన్నా శక్తి కలవాడు! ఆయన చెప్పుల్ని మోయటానికి కూడా నేను తగను. ఆయన మీకు పవిత్రాత్మతో, అగ్నితో, బాప్తిస్మము నిస్తాడు. 12 తూర్పార బట్టే చేట ఆయన చేతిలో ఉంది. ఆయన కళ్ళమును శుభ్రం చేసి తన గోధుమల్ని ధాన్యపు కొట్టులో వేసుకొంటాడు. పొట్టును ఆరని మంటల్లో వేసి కాలుస్తాడు” అని అన్నాడు.
యోహాను చేత యేసు బాప్తిస్మం పొందటం
(మార్కు 1:9-11; లూకా 3:21-22)
13 గలిలయ నుండి యేసు యోహాను ద్వారా బాప్తిస్మము పొందటానికి యొర్దాను నదీ ప్రాంతానికి వచ్చాడు. 14 కాని యోహాను ఆయనతో, “నీ ద్వారా నేను బాప్తిస్మము పొందాలి కాని, నీవు నా ద్వారా బాప్తిస్మము పొందటానికి రావటమా?” అని అంటూ యేసును ఆపటానికి ప్రయత్నించాడు.
15 యేసు సమాధానంగా, “ప్రస్తుతానికి ఇది జరుగనివ్వుము. నీతిని నిలబెట్టటానికి మనమిలా చెయ్యటం సమంజసమే!” అని అన్నాడు. దీనికి యోహాను అంగీకరించాడు.
16 యేసు బాప్తిస్మము పొంది, నీళ్ళ నుండి వెలుపలికి రాగానే అదే క్షణంలో ఆకాశం తెరుచుకొంది. దేవుని ఆత్మ ఒక పాపురంలాగ తన మీదికి రావటం యేసు చూసాడు. 17 పరలోకంనుండి ఒక స్వరం, “ఈయన నా ప్రియ కుమారుడు. ఇతని పట్ల నాకెంతో ఆనందం” అని అన్నది.
బలిపీఠ పునర్నిర్మాణం
3 అలా ఏడవ నెల[a] నాటికి ఇశ్రాయేలీయులు తమ తమ సొంత పట్టణాలకు చేరుకున్నారు. అప్పుడు వాళ్లందరూ యెరూషలేములో గుమికూడి ఒక ప్రజగా సమైక్యమయ్యారు. 2 యెజాదా కొడుకైన యేషూవ, అతనితో వున్న యాజకులూ, షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలు, అతని సహచరులు ఇశ్రాయేలు దేవునికి బలిపీఠం నిర్మించారు. ఇశ్రాయేలీయులు తాము బలులు సమర్పించ గలిగేందుకు వీలుగా ఆ బలిపీఠాన్ని నిర్మించారు. సరిగ్గా మోషే ధర్మశాస్త్రంలో పేర్కొనబడినట్లు వాళ్లు ఆ బలిపీఠాన్ని నిర్మించారు. మోషే యెహోవాకు ప్రత్యేక సేవకుడు.
3 తమకు సమీపంలో నివసిస్తున్న ఇతర ప్రజలంటే వాళ్లు భయపడ్డారు. అయినా, వాళ్లు ఆగకుండా, పాత పునాది మీదనే బలీపీఠాన్ని నిర్మించి, ఉదయంపూట, సాయంత్రంపూటాదహనబలులు సమర్పిస్తూ వచ్చారు. 4 సరిగ్గా మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లు వాళ్లు పర్ణశాలల పండుగ చేసుకున్నారు. ఆ పండుగ రోజులు పొడుగునా ప్రతిరోజూ సరైన సంఖ్యలో దహన బలులు సమర్పించారు. 5 అటు తర్వాత, ప్రతి రోజూ నిరంతర దహనబలులు, అమావాస్య రోజున జరిగే బలులు, మరి ఇతర పండుగల రోజులకూ, శెలవు రోజులకూ, స్వేచ్ఛార్ఫణలను యెహోవా ఆజ్ఞ ప్రకారం అర్పించారు. జనం కూడా యెహోవాకు తాము ఇవ్వాలనుకున్న కానుకలు ఇవ్వనారంభించారు. 6 ఈ విధంగా, ఏడవ నెల మొదటి రోజున, ఆ ఇశ్రాయేలీయులు యెహోవాకు తిరిగి దహనబలులు ఇవ్వనారంభించారు. దేవాలయం అప్పటికి ఇంకా తిరిగి నిర్మించబడకపోయినా కూడా ఈ బలి అర్పణ సాగింది.
దేవాలయ పునర్నిర్మాణం
7 చెరనుంచి విముక్తులై తిరిగి వచ్చిన వాళ్లు రాళ్లు చెక్కేవాళ్లకు, వడ్రంగులకు డబ్బులిచ్చారు. వాళ్లు తూరు, సీదోను ప్రజలకు ఆహారాన్ని, ద్రాక్షారసాన్ని ఒలీవనూనెను, లెబానోను నుండి దేవదారు చెట్ల కలపను తెచ్చేందుకు ఇచ్చారు. సోలొమోను మొదటిగా దేవాలయం నిర్మించినప్పుడు తెప్పించి నట్లే, వాళ్లు కూడా ఈ దేవదారు చెట్ల కలపను ఓడల్లో సముద్రతీర పట్టణమైన యొప్పేకు తెప్పించాలనుకున్నారు. పారశీక రాజు కోరెషు ఇందుకు వారికి అనుమతినిచ్చాడు.
8 యెరూషలేములోని దేవాలయం దగ్గరకు వాళ్లు చేరుకున్నమీదట రెండవ ఏడాది రెండవ నెలలో[b] షయల్తీయేలు కొడుకైన జెరుబ్బాబెలూ, యెజాదా కొడుకైన యేషూవ పని ప్రారంభించారు. వాళ్ల సోదరులు, యాజకులు, లేవీయులు, నిర్బంధంనుంచి యెరూషలేముకు తిరిగి వచ్చిన వాళ్లందరూ వాళ్లతో కలిసి పనిచేయ ప్రారంభించారు. లేవీయుల్లో 20 ఏళ్లు నిండినవాళ్లనీ, అంతకు పైబడినవాళ్లనీ యెహోవా దేవాలయ నిర్మాణంలో నాయకులుగా నియమించారు. 9 దేవాలయ నిర్మాణ కార్యకలాపాలను ఈ కింది వారు అజమాయిషీ చేశారు: యేషూవ మరియు అతని కొడుకులు, మరియు అతని సహోదరులు, కద్మీయేలు మరియు అతని కొడుకులు (యూదా వంశస్థులు); హేనాదాదు, మరియు అతని కొడుకులు, లేవీయులందరు. 10 పనివాళ్లు యెహోవా దేవాలయానికి పునాది నిర్మాణాన్ని పూర్తిచేశారు. పునాది పూర్తయ్యాక, యాజకులు యాజకదుస్తులు ధరించి, బూరలు చేతబూనారు. అసాపు కొడుకులు తాళాలు పట్టుకొని నిలబడ్డారు. వాళ్లందరూ యెహోవాను స్తుతించేందుకోసం తమ తమ స్థానాల్లో నిలిచారు. ఇదంతా ఇశ్రాయేలు రాజైన దావీదు గతంలో ఆదేశించిన విధంగా జరిగింది. 11 వాళ్లు కృతజ్ఞతాస్తుతులు[c] పాడారు.
“యెహోవా మంచివాడు.
ఆయన నిజమైన ప్రేమ ఇశ్రాయేలీయుల మీద ఎల్లప్పుడూ నిలిచివుంటుంది”
అంటూ వాళ్లు స్తుతి కీర్తనలు పాడారు. చివరిగా అక్కడ ఉన్న మనుష్యులందరూ ఏకమై బిగ్గరగా గొంతెత్తి యెహోవాను కీర్తించారు. యెహోవా దేవాలయానికి పునాది వేయబడిన సందర్భంగా వాళ్లు గొప్పశబ్దంతో యెహోవాకు సోత్రాలు చెల్లించారు.
12 అయితే, చాలామంది వృద్ధ యాజకులు, లేవీయులు, వంశ పెద్దలు విలపించారు. ఎందుకంటే, వాళ్లు వెనకటి దేవాలయాన్ని చూసినవాళ్లు. వాళ్లు ఆ పూర్వవైభవాన్ని జ్ఞాపకం చేసుకొని, ఈ కొత్త దేవాలయాన్ని చూసినప్పుడు బిగ్గరగా ఏడ్చారు. జనంలో మిగిలిన చాలామంది సరదాగా సంతోషంగా కేరింతలు కొడుతూండగా వాళ్లు విలపించారు. 13 ఆ ధ్వనులు చాలాదూరం వరకూ వినబడ్డాయి. వాటిలో ఏవి సంతోషధ్వనులో, ఏవి విలాపాలో ఎవరూ చెప్పుకోలేక పోయారు.
పేతురు కుంటివానిని నయం చెయ్యటం
3 ఒక రోజు పేతురు, యోహాను పగలు మూడు గంటలప్పుడు మందిరానికి వెళ్తున్నారు. అది ప్రార్థనా సమయం. 2 కొందరు ఒక పుట్టు కుంటివాణ్ణి ప్రతిరోజూ మోసుకొని వెళ్ళి ఒక ద్వారం ముందు దించేవాళ్ళు. దీన్నే సౌందర్య ద్వారం అనేవాళ్ళు. మందిరంలోకి ప్రవేశించేవాళ్ళనుండి ఆ కుంటివాడు భిక్షమెత్తుకొంటూ ఉండేవాడు. 3 ఈ కుంటివాడు పేతురు యోహానులు ఆలయంలోకి ప్రవేశించబోతుండగా చూసి వాళ్ళను భిక్షమడిగాడు.
4 పేతురు అతనివైపు ఏక దృష్టితో చూసాడు. యోహాను కూడా అలాగే చూసాడు. పేతురు ఆ కుంటివానితో, “మా వైపు చూడు!” అని అన్నాడు. 5 ఆ కుంటివాడు వాళ్ళేదైనా యిస్తారని వాళ్ళ వైపు చూసాడు. 6 అప్పుడు పేతురు, “నా దగ్గర వెండి, బంగారాలు లేవు కాని నా దగ్గరున్నదాన్ని నీకిస్తాను. నజరేతు నివాసి యేసు క్రీస్తు పేరిట నడువు!” అని అంటూ,
7 అతని కుడి చేయి పట్టుకొని లేపాడు. వెంటనే ఆ కుంటివాని చీలమండలకు, పాదాలకు బలం వచ్చింది. 8 అతడు గంతేసి నిలబడి నడవటం మొదలు పెట్టాడు. తదుపరి అతడు నడుస్తూ గంతులేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వాళ్ళతో సహా మందిరంలోకి ప్రవేశించాడు. 9 మందిరంలో ఉన్నవాళ్ళంతా అతడు నడవటం, దేవుణ్ణి స్తుతించటం చూసారు. 10 భిక్షమెత్తుకోవటానికి మందిరంలోని సౌందర్య ద్వారం ముందు కూర్చునేవాడు అతడేనని గుర్తించారు. జరిగింది చూసి వాళ్ళు భయపడి దిగ్భ్రాంతి చెందారు.
పేతురు ఉపన్యసించటం
11 ఆ భిక్షమెత్తుకొనేవాడు పేతురు, యోహానులను అంటిపెట్టుకొని ఉన్నాడు. ప్రజల్లో కలిగిన ఆశ్చర్యం తగ్గలేదు. వాళ్ళు సొలొమోను మంటపంలో ఉన్న పేతురు, యోహానుల దగ్గరకు పరుగెత్తుకొంటూ వెళ్ళారు.
12 పేతురు వాళ్ళను చూసి ఈ విధంగా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలారా! ఇది మీకెందుకు ఆశ్చర్యం కలిగిస్తోంది? మేము మా స్వశక్తితో లేక మా మంచితనంతో యితణ్ణి నడిపించినట్లు మావైపు అంత దీక్షతో ఎందుకు చూస్తున్నారు? 13 అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మన వంశీయుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమ పర్చాడు. మీరాయన్ని అధికారులకు అప్పగించారు. పిలాతు ఆయన్ని విడుదల చెయ్యాలని నిర్ణయించినప్పుడు మీరు పిలాతు ముందు యేసును నిరాకరించారు. 14 పవిత్రుడు, నీతిమంతుడు అయిన ఆయన్ని నిరాకరించి, ఆయనకు మారుగా ఒక హంతకుణ్ణి విడుదల చెయ్యాలని మీరు కోరారు. 15 మీరు మీకు నిత్యజీవితాన్నిచ్చే దాతను చంపారు. కాని దేవుడాయన్ని చావు నుండి బ్రతికించాడు. మేము దీనికి సాక్షులం.
16 “మాకు ‘యేసు’ అనే పేరులో నమ్మకం ఉండబట్టే మీకు తెలిసిన యితనికి, మీరు చూస్తున్న యితనికి నయమైపోయింది. యేసు పేరు, ఆయన కలిగించిన విశ్వాసము యితనికి పూర్తిగా స్వస్థత కలిగించాయి. ఇది మీరు చూసారు.
17 “సోదరులారా! మీ నాయకులవలె మీరు కూడా అమాయకంగా ప్రవర్తించారని నాకు తెలుసు. 18 కాని, ‘క్రీస్తు తప్పక చనిపోవాలి’ అని ప్రవక్తలందరి ద్వారా దేవుడు ముందే పలికిన వాక్కుల్ని ఈ విధంగా నిజం చేసాడు. 19 మారుమనస్సు పొంది దేవుని వైపు మళ్ళండి. అలా చేస్తే దేవుడు మీ పాపాలు కడిగి వేస్తాడు. మీకు విమోచనం కలిగే రోజులు వస్తాయి. 20 మీ కోసం దేవుడు క్రీస్తుగా నియమించిన యేసును పంపుతాడు.
21 “చాలా కాలం క్రితమే తమను తాము దేవునికి అంకితం చేసుకొన్న ప్రవక్తల నోటి ద్వారా యిలా అభయమిచ్చాడు. సర్వం పునఃస్థాపితం చేసేకాలం వచ్చేవరకు యేసు పరలోకంలోనే ఉండాలి. 22 మోషే ఈ విధంగా అన్నాడు: ‘ప్రభువైన దేవుడు మీ కొరకు నాలాంటి ప్రవక్తను పంపుతాడు. ఆయన మీ సోదరులనుండి వస్తాడు. ఆయన చెప్పినట్లు మీరు వినాలి. 23 దేవుడు ఆయన మాటల్ని వినని ప్రతి ఒక్కణ్ణి తమ వాళ్ళనుండి దూరం చేసి నాశనం చేస్తాడు.’(A)
24 “సమూయేలు కాలంనుండి ప్రవక్తలందరూ ఈ రోజులు రానున్నాయని చెప్పారు. 25 మీ పూర్వికులతో దేవుడు చేసిన ఒప్పందానికి, మీ ప్రవక్తలకు మీరు వారసులు. దేవుడు అబ్రాహాముతో, ‘నీ వంశీయుని ద్వారా భూమ్మీద ఉన్న ప్రజలందర్ని దీవిస్తాను’(B) అని అన్నాడు. 26 దేవుడు తన సేవకుణ్ణి మొదట మీ దగ్గరకు పంపాడు. మీ అందర్ని మీ మీ దుర్మార్గాలనుండి మళ్ళించటానికి ఆయన్ని పంపాడు. అలా చేసి మిమ్మల్ని దీవించాలని అనుకొన్నాడు.”
© 1997 Bible League International