Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 దినవృత్తాంతములు 35

యోషీయా పస్కా పండుగ జరుపుట

35 యెరూషలేములో యెహోవాకు యోషీయా రాజు పస్కా పండుగ జరిపించాడు. మొదటి నెలలో పదునాల్గవ రోజున పస్కా గొఱ్ఱెపిల్ల చంపబడింది. వారి వారి విధులు నిర్వర్తించటానికి యోషీయా యాజకులను ఎన్నుకొన్నాడు. ఆలయంలో సేవ చేస్తున్నప్పుడు యాజకులను యోషీయా ఉత్సాహపర్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు బోధకులుగా వున్నవారితోను, ఆలయంలో సేవ చేయటానికి పవిత్రులైన లేవీయులతోను, యోషీయా మాట్లాడినాడు. ఆ లేవీయులతో అతడిలా అన్నాడు: “సొలొమోను నిర్మించిన ఆలయంలో పవిత్ర పెట్టెను వుంచండి. సొలొమోను దావీదు కుమారుడు. దావీదు ఇశ్రాయేలు రాజు. పవిత్ర పెట్టెను ఇక మీరు మీ భుజాల మీద ఒకచోటు నుండి మరియొక చోటికి మోయవద్దు. మీ దేవుడైన యెహోవాకు ఇప్పుడు మీరు సేవ చేయండి. దేవుని ప్రజలగు ఇశ్రాయేలీయులకు సేవ చేయండి. మీమీ వంశాల ప్రకారం ఆలయంలో సేవచేయటానికి సిద్ధమవ్వండి. రాజైన దావీదు, అతని కుమారుడు రాజైన సొలొమోను మీరు చేయాలని చెప్పిన పనులను మీరు చేయండి. కొంత మంది లేవీయులు పవిత్రస్థలంలో నిలబడాలి. ప్రజలలో ప్రతి వంశంవారికి సహాయపడే నిమిత్తం, మీరలా నిలబడండి. పస్కా గొఱ్ఱెపిల్లను వధించి యెహోవా సేవకు మిమ్మల్ని మీరు పవిత్రులుగా చేసికొనండి. మీ సోదరులైన ఇశ్రాయేలీయుల కొరకు గొఱ్ఱెపిల్లలను సిద్ధం చేయండి. యెహోవా మనకు ఆజ్ఞాపించిన విధంగా మీరు మీ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించండి. యెహోవా తన ధర్మాన్ని మోషేద్వారా మనకు ప్రసాదించాడు.”

పస్కా బలులుగా అర్పించేటందుకు ఇశ్రాయేలు ప్రజలకు యోషీయా ముప్పైవేల గొఱ్ఱెలను ఇచ్చాడు. ప్రజలకు అతడింకా మూడువేల పశువులను కూడా ఇచ్చాడు. ఈ జంతువులన్నీ రాజైన యోషీయా పశుసంపద నుండి ఇవ్వబడినాయి. పస్కా పండుగలో వినియోగించే నిమిత్తం ప్రజలకు, యాజకులకు, లేవీయులకు జంతువులను, ఇతర వస్తువులను కూడా యోషీయా అధికారులు ఉదారంగా ఇచ్చారు. ప్రధాన యాజకుడు హిల్కీయా, జెకర్యా, యెహీయేలు అనువారు ఆలయ నిర్వహణాధికారులు. వారు యాజకులకు పస్కాబలుల నిమిత్తం రెండువేల ఆరువందల గొఱ్ఱె పిల్లలను, మేకలను, మరియు మూడువందల గిత్తలను ఇచ్చారు. పైగా కొనన్యా, అతని సోదరులు షెమయా మరియు నెతనేలు, మరియు హషబ్యా, యెహీయేలు, యోజాబాదు లేవీయులకు పస్కా బలులకుగాను ఐదువందల గొఱ్ఱెలను, మేకలను, మరియు ఐదువందల కోడె దూడలను ఇచ్చారు. వారంతా లేవీయుల పెద్దలు.

10 పస్కా సేవ ప్రారంభానికి సమస్తము సిద్ధం చేయబడిన తరువాత యాజకులు, లేవీయులు వారి వారి నియమిత స్థానాలకు వెళ్లారు. రాజు ఆ మేరకు వారిని ఆజ్ఞాపించాడు. 11 పస్కా గొఱ్ఱెపిల్లలు చంపబడ్డాయి. తరువాత లేవీయులు ఆ జంతువుల చర్మాలను ఒలిచి, వాటి రక్తాన్ని యాజకులకు ఇచ్చారు. యాజకులు రక్తాన్ని బలిపీఠం మీద చల్లారు. 12 పిమ్మట బలియిచ్చిన ఆ జంతువులను దహనబలులకుగాను వివిధ వంశాల వారికి యిచ్చారు. మోషే ధర్మశాస్త్రం నిర్దేశించిన విధంగా దహనబలులు జరగటానికే ఇది ఈ విధంగా చేయబడింది. 13 లేవీయులు పస్కా బలుల మాంసాన్ని ధర్మశాస్త్ర ప్రకారం అగ్నిలో కాల్చారు. పవిత్ర అర్పణలను వారు కుండలలోను, పాత్రలలోను, పెనముల మీద వుడకబెట్టారు. వారు తక్షణమే ఆ మాంసాన్ని ప్రజలకు పంచిపెట్టారు. 14 ఇది జరిగిన తరువాత లేవీయులు, అహరోను సంతతి యాజకులు తమ వంతు మంసాన్ని తీసుకున్నారు. ఆ యాజకులు చీకటి పడేవరకు పనిలో నిమగ్నమయ్యారు. దహనబలి మంసాన్ని అర్పణల కొవ్వును కాల్చడంలో వారు కష్టపడి పనిచేశారు. 15 రాజైన దావీదు నిర్ణయించిన స్థలంలో ఆసాపు వంశీయులగు లేవీ గాయకులు నిలబడ్డారు. వారు ఆసాపు, హేమాను, మరియు రాజు యొక్క ప్రవక్త యెదూతూను. ప్రతిద్వారం వద్ద నున్న ద్వారపాలకులు తమ తమ స్థానాలు వదలవలసిన అవసరం లేకుండ వారి సోదరులగు లేవీయులు అన్నీ సిద్ధంచేసి వారి పస్కా అవసరాలన్నీ తీర్చారు.

16 రాజైన యోషీయా ఆజ్ఞాపించిన విధంగా ఆరోజు యెహోవా ఆరాధనకు సమస్తం ఏర్పాటు చేయబడింది. పస్కా పండుగ జరుపబడింది. యెహోవా బలిపీఠం మీద దహనబలులు అర్పించబడ్డాయి. 17 అక్కడున్న ఇశ్రాయేలీయులంతా పస్కాను, పులియని రొట్టెల పండుగను ఏడు రోజులపాటు జరుపుకున్నారు. 18 ప్రవక్తయగు సమూయేలు జీవించియున్న కాలంనుండి ఈ రకంగా పస్కా పండుగ జరుపబడలేదు! ఇశ్రాయేలు రాజులలో ఏ ఒక్కడు గతంలో ఇంత ఘనంగా పస్కాపండుగ జరుపలేదు. రాజైన యోషీయా, యాజకులు, లేవీయులు, అక్కడున్న యూదా మరియు ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేము వాసులతో కలిసి పస్కా పండుగను ఘనంగా ఒక ప్రత్యేక పద్ధతిలో జరిపారు. 19 యోషీయా రాజ్యపాలనలో పదునెనిమిదవ సంవత్సరం గడుస్తూ వున్నప్పుడు ఈ పస్కా పండుగ జరుపబడింది.

యోషీయా మరణం

20 యోషీయా ఆలయం విషయంలో ఈ మంచి పనులన్నీ చేసిన పిమ్మట రాజైన నెకో యూఫ్రటీసు నదీతీర పట్టణమైన కర్కెమీషు మీదికి దండెత్తి వచ్చాడు. నెకో ఈజిప్టు రాజు. రాజైన యోషీయా నెకోను ఎదిరించటానికి బయలుదేరి వెళ్లాడు. 21 కాని నెకో యోషీయా వద్దకు దూతలను పంపాడు.

వారు యిలా అన్నారు: “యోషీయా రాజా, ఈ యుద్ధం నీకు సంబంధించినది కాదు. నేను నీమీద యుద్ధానికి రాలేదు. నేను నా శత్రువుతో పోరాడటానికి వచ్చాను. దేవుడు నన్ను తొందరచేసి పంపినాడు. దేవుడు నా పక్షాన వున్నాడు. కావున నీవు అనవసరమైన శ్రమ తీసుకోవద్దు. నీవు గనుక నాతో యుద్ధం చేస్తే. దేవుడు నిన్ను నాశనం చేస్తాడు!”

22 కాని యోషీయా వెళ్లి పోలేదు. అతడు నెకోతో యుద్ధం చేయటానికే నిశ్చయించాడు. అందువల్ల అతడు తన వేషం మార్చుకొని యుద్ధానికి వెళ్లాడు. దేవుని ఆజ్ఞ విషయంలో నెకో చెప్పిన దానిని యోషీయా వినటానికి నిరాకరించాడు. మెగిద్దో మైదానంలో యుద్ధం చేయటానికి యోషీయా వెళ్లాడు. 23 రాజైన యోషీయా యుద్ధంలో వుండగా, అతడు బాణాలతో కొట్టబడ్డాడు. అతడు తన సేవకులతో, “నన్ను దూరంగా తీసుకొని వెళ్లండి. నేను తీవ్రంగా గాయపడ్డాను!” అని చెప్పాడు.

24 దానితో అతని సేవకులు యోషీయాను అతని రథం నుండి దించి తనతో యుద్ధరంగానికి తెచ్చిన మరియొక రథంలో అతనిని వుంచారు. వారు యోషీయాను యెరూషలేముకు తీసికొని వచ్చారు. రాజైన యోషీయా యెరూషలేములో చనిపోయాడు. తన పూర్వీకులు వుంచబడిన సమాధులలోనే యోషీయా సమాధి చేయబడినాడు. యోషీయా చనిపోయినందుకు యూదా, యెరూషలేము ప్రజలంతా చాలా దుఃఖించారు. 25 యోషీయాపై యిర్మీయా కొన్ని ప్రగాఢ విలాపగీతికలు వ్రాశాడు. ఆ విలాపగీతాలు ఆలపిస్తూ స్త్రీ పురుష గాయకులు ఈనాటికీ యోషీయాను తలచుకొని గౌరవిస్తారు. యోషీయాను తలుస్తూ ఒక విలాపగీతిక ఆలపించటం ఇశ్రాయేలీయులకు వాడుక అయ్యింది. ఆ గీతికలు విలాప వాక్యములలో పొందుపర్చబడినాయి.

26-27 తాను రాజుగా వున్న కాలంలో యోషీయా మొదటినుండి తన పాలన అంతం అయ్యే వరకు చేసిన ఇతర కార్యములన్నీ ఇశ్రాయేలు, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడినాయి. ఆ గ్రంథం యెహోవాపట్ల అతనికున్న ప్రేమ, యెహోవా ధర్మశాస్త్రాన్ని అతను అనుసరించిన తీరును తెలియజేస్తుంది.

ప్రకటన 21

క్రొత్త యెరూషలేము

21 ఆ తర్వాత నేను ఒక క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని[a] చూసాను. మొదటి ఆకాశం, మొదటి భూమి అదృశ్యమయ్యాయి. ఇప్పుడు సముద్రము లేదు. నేను పరిశుద్ధ పట్టణమైన క్రొత్త యెరూషలేము పరలోకం నుండి దిగిరావటం చూసాను. అది దేవుని నుండి, పెళ్ళి కుమారుని కోసం పెళ్ళికూతురిలా అలంకరించుకొని దిగి వచ్చింది.

సింహాసనం నుండి ఒక స్వరం బిగ్గరగా, “ఇక నుండి దేవుడు మానవులతో ఉంటాడు. వాళ్ళతో నివసిస్తాడు. వాళ్ళు ఆయన ప్రజలు; ఆయన వాళ్ళ దేవుడై వాళ్ళతో స్వయంగా ఉంటాడు. వాళ్ళ కళ్ళ నుండి కారిన ప్రతి కన్నీటి బొట్టును తుడిచివేస్తాడు. పాత సంగతులు గతించిపోయాయి. కనుక యిక మీదట చావుండదు. దుఃఖం ఉండదు. విలాపం ఉండదు, బాధ వుండదు” అని అన్నది.

సింహాసనంపై కూర్చొన్నవాడు, “నేను ప్రతి వస్తువును క్రొత్తగా చేస్తాను” అని అన్నాడు. “ఇవి విశ్వసింప దగినవి, సత్యం, కనుక యివి వ్రాయి” అని అన్నాడు.

ఆయన నాతో, “అంతా సమాప్తమైంది. అల్ఫా (ఆది), ఓమెగా (అంతం) నేనే. మొదటివాణ్ణి, చివరివాణ్ణి నేనే. దాహంతోవున్నవానికి ఊటనుండి జీవజలాన్ని ఉచితంగా ఇస్తాను. జయించినవాడు వీటన్నిటికీ వారసుడౌతాడు. నేను అతనికి దేవునిగా, అతడు నాకు కుమారునిగా ఉంటాము. కాని, పిరికివాళ్ళు, విశ్వాసం లేనివాళ్ళు, నీచులు, హంతకులు, అవినీతిపరులు, మంత్రగాళ్ళు, విగ్రహారాధకులు, అసత్యాలాడేవాళ్ళు మండే గంధకమున్న భయానకమైన గుండంలో ఉంటారు. యిది రెండవ మరణం” అని అన్నాడు.

ఏడు పాత్రలతో ఏడు చివరి తెగుళ్ళు పట్టుకొని ఉన్నవారిలో ఒక దూతవచ్చి నాతో, “పెళ్ళికూతుర్ని, అంటే గొఱ్ఱెపిల్ల భార్యను చూపిస్తాను, రా!” అని అన్నాడు. 10 అతడు నన్ను ఆత్మ ద్వారా ఎత్తుగా ఉన్న గొప్ప పర్వతం మీదికి తీసుకు వెళ్ళాడు. పరలోకంలో ఉన్న దేవుని దగ్గరనుండి దిగివస్తున్న పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమును చూపించాడు.

11 అది దేవుని మహిమతో వెలుగుతూ ఉంది. దాని మహిమ అమూల్యమైన ఆభరణంగా, అంటే సూర్య కాంతమణిలా ఉంది. అది స్ఫటికంలా స్వచ్ఛంగా ఉంది. 12 దాని చుట్టూ ఎత్తైన ఒక ప్రాకారం ఉంది. ఆ ప్రాకారానికి పన్నెండు ద్వారాలు ఉన్నాయి. పన్నెండుమంది దేవదూతలు ఆ ద్వారాల యొద్ద ఉన్నారు. ఆ ద్వారాల మీద ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాల పేర్లు వ్రాయబడ్డాయి. 13 తూర్పు వైపు మూడు ద్వారాలు, ఉత్తరం వైపు మూడు ద్వారాలు, దక్షిణం వైపు మూడు ద్వారాలు, పడమర వైపు మూడు ద్వారాలు ఉన్నాయి. 14 ఆ నగర ప్రాకారానికి పన్నెండు పునాదులున్నాయి. వాటి మీద గొఱ్ఱెపిల్ల యొక్క పన్నెండుగురు అపొస్తలుల పేర్లు ఉన్నాయి.

15 నాతో మాట్లాడిన దూత దగ్గర బంగారంతో చేసిన కొలత బద్ద ఉంది. అతడు దాని పట్టణాన్ని, దాని ప్రాకారాన్ని, ద్వారాలను కొలవటానికి తెచ్చాడు. 16 ఆ పట్టణం చతురస్రంగా కట్టబడి ఉంది. దాని వెడల్పు, పొడవు సమానంగా ఉన్నాయి. అతడు కొలతబద్దతో పట్టణాన్ని కొలిచాడు. దాని పొడవు, వెడల్పు, ఎత్తు, 1,500 మైళ్ళు[b] ఉన్నట్లు కనుగొన్నాడు. 17 ఆ పట్టణం యొక్క ప్రాకారాన్ని కొలిచి దాని ఎత్తు ఆ నాటి కొలత పద్ధతి ప్రకారం 144 మూరలు[c] ఉన్నట్లు కనుగొన్నాడు. 18 ఆ ప్రాకారం సూర్యకాంతములతో కట్టబడి ఉంది. ఆ పట్టణం బంగారంతో కట్టబడి ఉంది. అది గాజువలె స్వచ్ఛంగా ఉంది.

19 ఆ ప్రాకారాల పునాదులు రకరకాల రత్నాలతో అలంకరింపబడి ఉన్నాయి. మొదటి పునాదిరాయి సూర్యకాంతం, రెండవది నీలం, మూడవది యమున, నాలుగవది పచ్చ, 20 ఐదవది వైఢూర్యం, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదవది సువర్ణ సునీయము, పదకొండవది పద్మరాగము, పన్నెండవది సుగంధము. 21 ఆ పన్నెండు ద్వారాలు పన్నెండు ముత్యాలతో చేయబడి ఉన్నాయి. ఒక్కొక్క ద్వారం ఒక్కొక్క ముత్యంతో చేయబడి ఉంది. ఆ పట్టణపు వీధులు మేలిమి బంగారంతో చేయబడి ఉన్నాయి. అవి గాజువలె స్వచ్ఛంగా ఉన్నాయి.

22 ఆ పట్టణంలో నాకు మందిరం కనిపించలేదు. సర్వశక్తి సంపన్నుడు, ప్రభువు అయినటువంటి దేవుడు మరియు గొఱ్ఱెపిల్ల ఆ పట్టణానికి మందిరమై ఉన్నారు. 23 దేవుని తేజస్సు ఆ పట్టణానికి వెలుగునిస్తుంది. గొఱ్ఱెపిల్ల ఆ పట్టణానికి జ్యోతి కాబట్టి ఆ పట్టణానికి వెలుగునివ్వటానికి సూర్యచంద్రులు అవసరం లేదు.

24 జనులు ఆ వెలుగులో నడుస్తారు. ప్రపంచంలో ఉన్న రాజులు తమ ఘనతను ఆ పట్టణానికి తీసుకు వస్తారు. 25 ఆ పట్టణంలో రాత్రి అనేది ఉండదు. కనుక ఆ పట్టణం యొక్క ద్వారాలు ఎన్నటికీ మూయబడవు. 26 జనముల గౌరవము, వారి కీర్తి ఈ పట్టణానికి తేబడతాయి. 27 అపవిత్రమైనది ఆ పట్టణంలో ప్రవేశింపదు. అదే విధంగా అవమానకరమైన పనులు చేసేవాళ్ళు, మోసగాళ్ళు ఆ పట్టణంలోకి ప్రవేశించరు. గొఱ్ఱెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లు వ్రాయబడ్డాయో వాళ్ళు మాత్రమే ప్రవేశించగలుగుతారు.

మలాకీ 3

“చూడండి, నేను నా సందేశకుని పంపిస్తున్నాను. అతడు నా కోసం మార్గం సిద్ధం చేస్తాడు. అకస్మాత్తుగా మీరు ఎదురుచూచే యజమాని తన ఆలయంలోనికి వచ్చేస్తాడు. అవును, మీరు కోరుతున్న కొత్త ఒడంబడిక దూత నిజంగా వస్తున్నాడు! సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

“ఆ సమయాన్ని ఏ వ్యక్తి ఆపలేడు. ఆయన వచ్చినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఎవ్వరూ నిల బడలేరు. ఆయన మండుతున్న అగ్నిలా ఉంటాడు. ప్రజలు వస్తువులను శుభ్రం చేయుటకు ఉపయోగించే శక్తివంతమైన సబ్బులా ఆయన ఉంటాడు. ఆయన లేవీ ప్రజలను శుభ్ర పరుస్తాడు. అగ్నిచేత వెండి శుద్ధి చేయబడినట్టు ఆయన వారిని శుద్ధి చేస్తాడు. స్వచ్ఛమైన బంగారంలా, వెండిలా ఆయన వారిని చేస్తాడు. అప్పుడు వారు యెహోవాకు కానుకలు తీసికొని వస్తారు-వాటిని సరైన పద్ధతిలో వారు చేస్తారు. అప్పడు యూదా నుండి, యెరూషలేము నుండి కానుకలను యెహోవా స్వీకరిస్తాడు. అది గతంలో ఉన్నట్టుగా ఉంటుంది. అది చాలకాలం క్రిందట ఉన్నట్టుగా ఉంటుంది. అప్పడు నేను మీ దగ్గరకు వస్తాను. మరియు సరైనది నేను చేస్తాను. ప్రజలు చేసిన చెడుకార్యాలను గూర్చి న్యాయమూర్తితో చెప్పటానికి సిద్ధంగా ఉన్న మనిషిలా నేను ఉంటాను. కొంతమంది మాయమంత్రాలు చేస్తారు. కొంతమంది వ్యభిచార పాపం చేస్తారు. కొంతమంది బూటకపు వాగ్దానాలు చేస్తారు. కొంతమంది తమ పనివారిని మోసం చేస్తారు. వారు వాగ్దానం చేసిన డబ్బును వారు చెల్లించరు. విధవలకు, అనాథ బాలబాలికలకు ప్రజలు సహాయం చేయరు. విదేశీయులకు ప్రజలు సహాయం చేయరు. ప్రజలు నన్ను గౌరవించరు!” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

దేవుని దగ్గర దొంగిలించటం

“నేను యెహోవాను, నేను మారను. మీరు యాకోబు పిల్లలు, మరియు మీరు పూర్తిగా నాశనం చేయబడలేదు. కానీ మీరు ఎన్నడూ నా ఆజ్ఞలకు విధేయులు కాలేదు. చివరికి మీ వూర్వీకులు కూడా నన్ను అనుసరించటం మానివేశారు. తిరిగి నా దగ్గరకు రండి, నేను తిరిగి మీ దగ్గరకు వస్తాను.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

“మేము ఎలా తిరిగి వెనుకకు రాగలం?” అని మీరు అంటారు.

దేవుని దగ్గర వస్తువులు దొంగిలించటం మానివేయండి! మనుష్యులు దేవుని దగ్గ ర వస్తువులు దొంగిలించకూడదు. కానీ మీరు నా దగ్గర వస్తువులు దొంగిలించారు!

“నీ దగ్గర మేము ఏమి దొంగిలించాం?” అని మీరు అంటారు.

“మీ సంపాదనలో పదోవంతు మీరు నాకు ఇచ్చి ఉండాల్సింది. మీరు నాకు ప్రత్యేక కానుకలు ఇచ్చి ఉండాల్సింది. కానీ మీరు నాకు వాటిని ఇవ్వలేదు. ఈ విధంగా మీ రాజ్యం మొత్తం, అందరూ నా దగ్గర దొంగిలించారు. కనుక మీకు చెడు విషయాలు సంభవిస్తున్నాయి.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు.

10 సర్వశక్తిమంతుడైన యెహోవా అంటున్నాడు, “ఈ పరీక్షలో ప్రయత్నించండి. మీకు ఉన్నవాటిలో పదో భాగం నా దగ్గరకు తీసికొని రండి. వాటిని ధనాగారంలో ఉంచండి. నా మందిరానికి ఆహారం తీసికొనిరండి. నన్ను పరీక్షించండి! మీరు ఆ పనులు చేస్తే, అప్పుడు నేను నిజంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఆకాశంనుండి వర్షం కురిసినట్టు, మంచి మంచి విషయాలు మీకు లభిస్తాయి. మీకు సమస్తం, కావలసిన దానికంటె ఎక్కువగా ఉంటాయి. 11 నేను చీడ పురుగులు మీ పంటలను తినివేయనియ్యను. మీ ద్రాక్షావల్లులు అన్నీ ద్రాక్షాపండ్లు ఫలిస్తాయి.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

12 “ఇతర రాజ్యాల ప్రజలు మీ యెడ దయగలిగి ఉంటారు. నిజంగా మీకు ఒక అద్భుత దేశం ఉంటుంది.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

తీర్పుకోసం ప్రత్యేక సమయం

13 “మీరు నన్నుగూర్చి నీచ విషయాలు చెప్పారు” అని యెహోవా అంటున్నాడు.

కానీ “నిన్ను గూర్చి మేము ఏమి చెప్పాం?” అని మీరు అంటారు.

14 “యెహోవాను ఆరాధించటం వ్యర్థం. యెహోవా మాకు చెప్పిన వాటిని మేము చేసాం, కాని మాకు లాభం ఏమీ కలుగలేదు. సమాధి దగ్గర మనుష్యులు ఏడ్చినట్టు, మేము మా పాపాల విషయంలో బాధపడ్డాం. కానీ దానివల్ల లాభం లేదు. 15 గర్విష్ఠులు సంతోషంగా ఉన్నారని మేము అనుకొంటున్నాం. దుర్మార్గులే అభివృద్ధి చెందుతున్నారు. వారు దేవుని సహనం పరీక్షించటానికి చెడు పనులు చేస్తారు-దేవుడు వారిని శిక్షించడు అని మీరు చెప్పారు”.

16 దేవుని అనుచరులు ఒకరితో ఒకరు మాట్లాడారు. అది యెహోవా విన్నాడు. ఆయన ఎదుట ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో దేవుని అనుచరుల పేర్లు ఉన్నాయి. వారు యెహోవా పేరును గౌరవించేవారు.

17 ఆ ప్రజలు నాకు చెందినవాళ్లు. నేను వారికి దయ చూపుతాను. ఒక మనిషి అతనికి విధేయులయ్యే పిల్లల యెడల చాలా దయగలిగి ఉంటాడు. అదే విధంగా, నేను నా అనుచరులయెడల దయగలిగి ఉంటాను. 18 ప్రజలారా, మీరు తిరిగి నా దగ్గరకు వస్తారు. మరియు మంచికి, చెడుకు గల భేదం మీరు నేర్చుకొంటారు. దేవుని అనుసరించే మనిషికి, దేవుని అనుసరించని మనిషికి వ్యత్యాసం మీరు నేర్చుకొంటారు అని యెహోవా చెప్పాడు.

యోహాను 20

యేసు బ్రతికి రావటం

(మత్తయి 28:1-10; మార్కు 16:1-8; లూకా 24:1-12)

20 ఆ రోజు ఆదివారం. “మగ్దలేనే” కు చెందిన మరియ చీకటి ఉండగా లేచి ఆ సమాధి దగ్గరకు వెళ్ళింది. దాని ద్వారానికి ఉన్న రాయి తీసి వేయబడి ఉండటం గమనించింది. అందువల్ల ఆమె సీమోను పేతురు దగ్గరకు, యేసు ప్రేమించిన యింకొక శిష్యుని దగ్గరకు పరుగెత్తుకొంటూ వెళ్ళి, వాళ్ళతో, “ఎవరో ప్రభువును సమాధి నుండి తీసుకు వెళ్ళారు. ఎక్కడ ఉంచారో తెలియదు” అని అన్నది.

పేతురు, ఆ యింకొక శిష్యుడు సమాధి చూడటానికి బయలుదేరి వెళ్ళారు. వాళ్ళు కలిసి పరుగెత్తుకుంటూ వెళ్లారు కాని, ఆ యింకొక శిష్యుడు పేతురు కన్నా ముందు పరుగెత్తి సమాధిని మొదట చేరుకున్నాడు. అతడు తొంగి లోపల చూసాడు. అక్కడ పడివున్న నారబట్టలు అతనికి కనిపించాయి. కాని అతడు లోపలికి వెళ్ళలేదు.

అతని వెనుక వస్తున్న పేతురు వచ్చి సమాధిలోకి వెళ్ళాడు. అక్కడ పడి ఉన్న బట్టల్ని చూసాడు. వాటినే కాక యేసు తల చుట్టూ చుట్టబడిన వస్త్రాన్ని కూడా చూసాడు. మడత పెట్టబడిన తల వస్త్రం నారబట్టలతో కాక వేరుగా ఉంచబడి ఉంది. సమాధి దగ్గరకు ముందు వెళ్ళిన శిష్యుడు కూడా తర్వాత లోపలికి వెళ్ళాడు. ఆ దృశ్యం చూసి విశ్వసించాడు. (యేసు బ్రతికి వస్తాడని లేఖనాల్లో వ్రాయబడిన విషయం వాళ్ళకు యింకా అర్థంకాలేదు.)

మగ్దలేనే మరియకు యేసు కనిపించటం

(మార్కు 16:9-11)

10 ఆ తర్వాత శిష్యులు తమ తమ యిండ్లకు వెళ్ళిపొయ్యారు. 11 కాని, మరియ సమాధి బయట దుఃఖిస్తూ నిలుచొని ఉంది. ఆమె దుఃఖం ఆగలేదు. సమాధిలోకి తొంగి చూసింది. 12 తెల్లటి దుస్తుల్లో ఉన్న యిద్దరు దేవదూతలు అక్కడ కూర్చొని ఉండటం ఆమె గమనించింది. యేసు దేహాన్ని ఉంచిన చోట ఒక దేవదూత తల వైపు, మరొక దేవదూత కాళ్ళ వైపు కూర్చొని ఉన్నారు.

13 వాళ్ళామెను, “ఎందుకు దఃఖిస్తున్నావమ్మా?” అని అడిగారు.

ఆమె, “వాళ్ళు నా ప్రభువును తీసుకు వెళ్ళారు. ఆయన్ని ఎక్కడ ఉంచారో నాకు తెలియదు” అని అన్నది. 14 అలా అన్నాక వెనక్కు తిరిగింది. అక్కడ యేసు నిలుచొని ఉండటం చూసింది. కాని ఆయనే “యేసు” అని ఆమె గుర్తించలేదు.

15 ఆయన, “ఎందుకు విలపిస్తున్నావమ్మా! ఎవరి కోసం చూస్తున్నావు?” అని అడిగాడు.

అతడొక తోటమాలి అనుకొని, “అయ్యా మీరాయన్ని ఎత్తుకుపోయి ఉంటే ఎక్కడ ఉంచారో చెప్పండి. నేను వెళ్ళి తెచ్చుకుంటాను” అని అన్నది.

16 యేసు ఆమెను “మరియా” అని పిలిచాడు.

ఆమె ఆయన వైపు చూసి హీబ్రూ భాషలో “రబ్బూనీ!” అని అన్నది. రబ్బూనీ అంటే బోధకుడు అని అర్థం.

17 యేసు, “నేనింకా తండ్రి దగ్గరకు వెళ్ళలేదు కనుక నన్ను తాకవద్దు. నా సోదరుల దగ్గరకు వెళ్ళి నాకు, మీకు తండ్రి, దేవుడు అయినటువంటివాని దగ్గరకు వెళ్తున్నానని చెప్పు” అని అన్నాడు.

18 మగ్దలేనే మరియ శిష్యుల దగ్గరకు వెళ్ళింది. తాను ప్రభువును చూసిన వార్త, ప్రభువు తనకు చెప్పిన సందేశము, వాళ్ళతో చెప్పింది.

యేసు తన శిష్యులకు కనిపించటం

(మత్తయి 28:16-20; మార్కు 16:14-18; లూకా 24:36-49)

19 ఆ ఆదివారం సాయంకాలం శిష్యులందరు ఒకే చోట సమావేశమయి ఉన్నారు. యేసు వచ్చి వాళ్ళ మధ్య నిలుచొని, “మీకు శాంతి కలుగుగాక!” అని అన్నాడు. 20 ఇలా అన్నాక ఆయన తన చేతుల్ని, ప్రక్క భాగాన్ని చూపించాడు. ప్రభువును చూసాక శిష్యులకు చాలా ఆనందం కలిగింది.

21 యేసు మళ్ళీ, “మీకు శాంతి కులుగు గాక! తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను” అని అన్నాడు. 22 ఇలా అన్నాక, “పవిత్రాత్మను పొందండి!” అని వాళ్ళపై ఊదాడు. 23 ఆ తర్వాత, “మీరు ఎవరి పాపాలు క్షమిస్తే వారి పాపాలు క్షమింపబడతాయి. మీరు ఎవరి పాపాలు క్షమించకపోతే వారి పాపాలు క్షమించబడవు” అని వాళ్ళతో అన్నాడు.

తోమా యేసును చూడటం

24 యేసు వచ్చినప్పుడు పండ్రెండుగురిలో ఒకడైన తోమా శిష్యుల్తోలేడు. ఇతణ్ణి “దిదుమ” అని పిలిచే వాళ్ళు. 25 మిగత శిష్యులు తోమాతో, “మేము ప్రభువును చుసాము” అని అన్నారు. కాని తోమా, “నేను స్వయంగా ఆయన చేతులకున్న మేకుల గాయాల్ని చూసి, వాటిని చేతుల్తో తాకి, ఆయన ప్రక్క డొక్కపై నా చేతుల్ని ఉంచాక ఆయన్ని నమ్ముతాను” అని అన్నాడు.

26 ఒక వారం రోజుల తర్వాత యేసు శిష్యులు ఒక యింట్లో ఉన్నారు. తోమా కూడా వాళ్ళతో ఉన్నాడు. తలుపులు మూసి వేసి ఉన్నా యేసు లోపలికి వచ్చి వాళ్ళ మధ్య నిలుచొని, “మీకు శాంతి కలుగుగాక!” అని అన్నాడు. 27 యేసు తోమాతో, “నా చేతులు చూడు. నీ వేళ్ళతో వాటిని తాకు. నా ప్రక్క భాగంపై నీ చేతుల్ని ఉంచు! ఇక అనుమానించకు” అని అన్నాడు.

28 తోమా ఆయనతో, “దేవా! నా ప్రభూ!” అని అన్నాడు.

29 అప్పుడు యేసు అతనితో, “నన్ను చూసావు కనుక నమ్మావు. నన్ను చూడకున్నా విశ్వసించే వాళ్ళు ధన్యులు” అని అన్నాడు.

ఈ గ్రంథం వ్రాయటంలో ఉద్దేశ్యం

30 నేను ఈ గ్రంథంలో వ్రాసినవే కాక, యేసు ఇంకా అనేకమైన మహాత్కార్యాలు చేసాడు. వాటన్నిటినీ శిష్యులు చూసారు. 31 యేసు “క్రీస్తు” అని, “దేవుని కుమారుడు” అని, ఆయన్ని విశ్వసించిన వాళ్ళకు ఆయన పేరిట అనంత జీవితం లభిస్తుందని మీరు నమ్మాలనే ఉద్దేశ్యంతో యివి వ్రాయబడ్డాయి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International