Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 దినవృత్తాంతములు 34

యూదా రాజుగా యోషీయా

34 యోషీయా రాజయ్యేనాటికి ఎనిమిది సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో ముప్పై యొక్క సంవత్సరాలు రాజుగా వున్నాడు. ఏది న్యాయమైనదో అది యోషీయా చేశాడు. యెహోవా చేయుమని చెప్పినవన్నీ అతడు చేశాడు. తన పూర్వీకుడైన దావీదువలె అతడు మంచి కార్యాలు చేశాడు. యోషీయా మంచిపనులు చేయటానికి ఎన్నడూ వెనుకాడలేదు. యోషీయా రాజైన పిమ్మట ఎనిమిదవ సంవత్సరం నుండి తన పూర్వీకుడైన దావీదు కొలిచిన దేవుడినే ఆరాధించాడు. దేవుని అనుసరించే నాటికి యోషీయా ఇంకా చిన్నవాడే. రాజుగా యోషీయా పన్నెండవ సంవత్సరంలో వుండగా యూదా, యెరూషలేములలో వున్న ఉన్నత స్థలాలను, అషేరా దేవతా స్తంభాలను, చెక్కిన, పోతపోసిన విగ్రహాలను నాశనం చేయటం మొదలు పెట్టాడు. బయలు దేవతలకు నిర్మించిన బలిపీఠాలన్నిటినీ ప్రజలు పగులగొట్టారు. వారీపని యోషీయా ఎదుటనే చేశారు. ప్రజలకు అందనంత ఎత్తుగా వున్న ధూప పీఠాలను పిమ్మట యోషీయా పడగొట్టాడు. చెక్కిన విగ్రహాలను, పోత విగ్రహాలను అతడు పగులగొట్టాడు. అతడా విగ్రహాలన్నిటినీ చూర్ణం చేశాడు. తరువాత యోషీయా ఆ చూర్ణాన్ని బయలుదేవతలను ఆరాధించి, బలులు అర్పించిన వారి సమాధులపై చల్లాడు. బయలు దేవతలకు సేవ చేసిన యాజకుల ఎముకలను ఆ బలిపీఠాలపైనే యోషీయా కాల్చినాడు. ఈ రకంగా యోషీయా యూదాలోను, యెరూషలేములోను విగ్రహాలను, విగ్రహారాధనను తుడిచివేశాడు. మనష్షే, ఎఫ్రాయిము, షిమ్యోను దేశాలలో వున్న పట్టణాలలోను, నఫ్తాలి వరకుగల పట్టణాలలో కూడ యోషీయా ఇదేరకంగా చేశాడు. ఆ పట్టణాల పరిసరాలలో వున్న పాడుబడ్డ ప్రదేశాలలో కూడ అతడీ పని చేశాడు. యోషీయా పీఠాలన్నీ పగులగొట్టి, అషేరా దేవతా స్తంభాలను పడగొట్టినాడు. విగ్రహాలన్నిటినీ పిండిగా పగుల గొట్టాడు. ఇశ్రాయేలులో బయలు దేవతలకు నిర్మించిన ధూప పీఠాలన్నిటినీ అతడు పిండిగా పగులగొట్టాడు. పిమ్మట యోషీయా యెరూషలేముకు తిరిగి వెళ్లాడు.

యోషీయా తన యూదా రాజ్యపాలనలో పదునెనిమిదవయేట షాఫాను, మయశేయా, మరియు యోవాహును పాడవుతున్న యెహోవా ఆలయాన్ని పునరుద్ధరించటానికి పంపాడు. షాఫాను తండ్రిపేరు అజల్యా. మయశేయా నగర పాలకుడు. యోవాహు తండ్రిపేరు యోహాహాజు. యోవాహు లేఖికుడు. జరిగిన వృత్తాంతములన్నిటినీ సేకరించి పుస్తకములో ఎక్కించువాడు.

యోషీయా ఆలయాన్ని పునరుద్ధరించి యూదాను, యెరూషలేమును మళ్లీ పవిత్ర పర్చటానికి పూనుకొన్నాడు. ఆ మేరకు ఆజ్ఞలు ఇచ్చాడు. ప్రధాన యాజకుడు హిల్కీయా వద్దకు వారు వచ్చారు. ప్రజలు ఆలయానికి ఇచ్చిన కానుకల ధనాన్ని వారు హిల్కీయాకు ఇచ్చారు. ద్వారపాలకులుగా ఉన్న లేవీయులు ఈ ధనాన్ని మనష్షే ఎఫ్రాయిము ప్రజల నుండి మరియు దేశంలో ఇంకను మిగిలియున్న ఇశ్రాయేలీయుల వద్దనుండి సేకరించారు. ఈ ధనాన్ని వారు యూదా, బెన్యామీను ప్రజల నుండి యెరూషలేము ప్రజల నుండి కూడ సేకరించారు. 10 ఆలయపు పనిని పర్యవేక్షించే ఉద్యోగులకు వారు ఈ ధనాన్ని ఇచ్చారు. ఈ అధికారులు ధనాన్ని తిరిగి ఆలయాన్ని తిరిగి కడుతున్న పనివారికి చెల్లించారు.

11 ఆ ధనాన్ని వారు వడ్రంగులకు, శిల్పులకు, చెక్కిన రాళ్లను, కలపను కొనటానికి ఇచ్చారు. భవనాలను తిరిగి నిర్మించటానికి, భవనాలకు కావలసిన దూలాలు తయారు చేయటానికి, ఈ కలపను వినియోగించారు. ఆలయ భవనాల విషయంలో యూదా రాజులు గతంలో తగిన శ్రద్ధ వహించలేదు. ఆ భవనాలన్నీ పాతవై శిధిలాలవస్థలో వున్నాయి. 12-13 పనివారంతా విశ్వాసంగా పనిచేశారు. వారిపై తనిఖీ అధికారుల పేర్లు యహతు, ఓబద్యా. యహతు, ఓబద్యా లిరువురూ లేవీయులు. వారు మెరారీ వంశీయులు. మిగతా పర్యవేక్షకులు జెకర్యా మరియు మెషుల్లాము. వారు కహాతీయులు. సంగీత వాద్య విశేషములను వాయించుటలో నేర్పురులైన లేవీయులు కూడా బరువులు మోసే కూలీల మీద, ఇతర పనివారిమీద తనిఖీ దారులుగా పనిచేశారు. మరికొందరు లేవీయులు కార్యదర్శులుగాను, అధికారులుగాను, ద్వారపాలకులుగాను పనిచేశారు.

ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొనుట

14 ఆలయంలో వున్న ధనాన్ని లేవీయులు బయటకు తెచ్చారు. ఆ సమయంలో యాజకుడగు హిల్కీయా ప్రభువైన యెహోవా మోషేద్వారా అందజేసిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొన్నాడు. 15 హిల్కీయా కార్యదర్శియగు షాఫానుతో, “ఆలయంలో నేను ధర్మశాస్త్ర గ్రంథాన్ని కనుగొన్నా” నని చెప్పాడు. హిల్కీయా గ్రంథాన్ని షాఫానుకు ఇచ్చాడు. 16 షాఫాను ఆ గ్రంథాన్ని రాజైన యోషీయా వద్దకు తెచ్చాడు. షాఫాను రాజు వద్దకు వచ్చి ఆలయ పనిపై తన నివేదిక ఈ విధంగా సమర్పించాడు: “మీ సేవకులు మీరు చెప్పిన విధంగా పని కొనసాగిస్తున్నారు. 17 వారు ఆలయంలోవున్న ధనాన్ని తీసి పనిమీద తనిఖీదారులకు, పనివారికి చెల్లిస్తున్నారు.” 18 తరువాత షాఫాను రాజైన యోషీయాతో, “యాజకుడగు హిల్కీయా నాకొక గ్రంథమిచ్చాడు” అని చెప్పాడు. పిమ్మట షాఫాను ఆ గ్రంథం నుండి రాజుముందు చదవటం మొదలుపెట్టాడు. 19 రాజైన యోషీయా ధర్మశాస్త్ర విషయాలు విన్నప్పుడు తన బట్టలు చింపుకున్నాడు.[a] 20 తరువాత రాజు హిల్కీయాకు, షాఫాను కుమారుడు అహీకాముకు, మీకా కుమారుడు అబ్దోనుకు, కార్యదర్శి షాఫాను మరియు సేవకుడైన ఆశాయాకును ఒక ఆజ్ఞ యిచ్చాడు. 21 రాజు యిలా చెప్పాడు: “మీరు వెళ్లి నా తరుపున ఇశ్రాయేలులోను, యూదాలోను మిగిలివున్న ప్రజల తరపున యెహోవాను మనకు దొరికిన ధర్మశాస్త్రంలో వ్రాయబడిన విషయాలను గురించి అడగండి. మన పూర్వీకులు యెహోవా ఆజ్ఞలను పాటించని కారణంగా ఆయన మనపట్ల ఎక్కువ కోపంగా వున్నాడు. ఈ గ్రంథం బోధించిన విషయాలను వారు పాటించలేదు!”

22 హిల్కీయా, రాజసేవకులు[b] కలిసి ప్రవాదిని హుల్దా వద్దకు వెళ్లారు. హుల్దా, షల్లూము భార్య. షల్లూము తాఖతు (తిక్వా) కుమారుడు. తాఖతు హస్రహూ (హస్రా) యొక్క కుమారుడు. హర్హహు (హస్రా) రాజవస్త్రాల విషయంలో శ్రద్ధ తీసికొనే అధికారి. హుల్దా క్రొత్త యెరూషలేములో నివసిస్తూ వుండేది. హిల్కీయా, రాజ సేవకులు జరిగిన సంగతంతా హుల్దాకు తెలిపారు. 23 హుల్దా వారితో యిలా చెప్పింది: “ఇశ్రాయేలు దేవుడగు యెహోవా యిలా తెలియజేస్తున్నాడు రాజైన యోషీయాకు తెలియజేయుము. 24 యెహోవా యిలా చెప్పుచున్నాడు: ‘ఈ ప్రదేశానికి, ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు నేను కష్టాలు తెచ్చి పెడతాను. యూదా రాజు ముందర చదివిన పుస్తకంలో వ్రాసిన విధంగా భయంకర పరిస్థితులు తీసికొని వస్తాను. 25 ఇలా ఎందుకు చేస్తాననగా ప్రజలు నన్ను వదిలి అన్య దేవతలకు ధూపం వేయసాగారు. వారు చేసిన నీచ కార్యాలన్నిటితో వారు నాకు కోపం కలుగజేశారు. అందువల్ల ఈ ప్రదేశం మీద నా కోపాన్ని కుమ్మరిస్తాను. బడబాగ్నిలా[c] నా కోపం చల్లారదు!’

26 “కాని ఈ విషయం యూదా రాజైన యోషీయాకు చెప్పండి. దేవుని అడుగమని అతడు మిమ్మల్ని పంపాడు. ఇంతకు ముందు మీరు విన్న విషయాలపై ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యిలా చెప్పుచున్నాడు: 27 ‘యోషీయా, నీవు పశ్చాత్తాప పడినావు. నిన్ను నీవు తగ్గించుకొని, నీ దుస్తులు చింపుకున్నావు. నాముందు నీవు విలపించావు. నీ హృదయం మారినది గనుక, 28 నేను నిన్ను నీ పూర్వీకుల వద్దకు[d] తీసుకొని వెళతాను. నీవు నీ సమాధికి ప్రశాంతంగా వెళతావు. ఈ ప్రాంతం మీదికి, ఇక్కడ నివసించే ప్రజల మీదికి నేను రప్పించే గొప్ప నాశనం నీవు చూడవు.’” హిల్కీయా మరియు రాజు సేవకులు ఈ సందేశాన్ని రాజైన యోషీయాకు. అందజేశారు.

29 రాజైన యోషీయా యూదా, యెరూషలేము పెద్దలందరినీ తనను వచ్చి కలవమని పిలిచాడు. 30 రాజు యోహోవా ఆలయానికి వెళ్ళాడు. యూదా ప్రజలందరు, యెరూషలేము వాసులు, యాజకులు, లేవీయులు, ప్రముఖులు, సామాన్య ప్రజానీకం అంతా యోషీయావద్దకు వచ్చారు. ఒడంబడిక గ్రంథంలో వున్న విషయాలన్నీ యోషీయా ప్రజలకు చదివి వినిపించాడు. ఆ గ్రంథం ఆలయంలో దొరికింది. 31 తరువాత రాజు తన స్థానంలో లేచి నిలబడినాడు. అతడు యెహోవాతో ఒక ఒడంబడిక చేసికొన్నాడు. యెహోవాను అనుసరించటానికి, ఆయన ఆజ్ఞలు, ధర్మాశాస్త్రాన్ని నియమాలను పాటించటానికి అతడు అంగీకరించాడు. హృదయపూర్వకంగా, ఆత్మ పూర్వకంగా అనుసరించటానికి యోషీయా అంగీకరించాడు. ఈ గ్రంథంలో వ్రాసిన ఒడంబడికలోని అంశాలను పాటించటానికి యోషీయో అంగీకరించాడు. 32 పిమ్మట యెరూషలేము, బెన్యామీను ప్రజలందరూ ఈ ఒడంబడికను అంగీకరించేలా వారిచే యోషియా ప్రమాణం చేయించాడు. తమ పూర్వీకులు విధేయులైవున్న దేవుని ఒడంబడికకు యెరూషలేము ప్రజలు బద్ధులయ్యారు. 33 పైగా ఇశ్రాయేలీయులకు సంబంధించిన స్థలాలలో వున్న విగ్రహాలన్నిటినీ యోషీయా తీసిపారవేశాడు. దేవుడు ఆ విగ్రహాలను అసహ్యించు కున్నాడు. యోషీయా రాజు ఇశ్రాయేలులో ప్రతి ఒక్కడిని వారి దేవుడగు యెహోవాను ఆరాధించునట్లు చేసెను. యోషీయా జీవించినంతకాలం ప్రజలు తమ పూర్వీకుల దేవుడగు యెహోవాను ఆరాధించటం మానలేదు.

ప్రకటన 20

వెయ్యి సంవత్సరాలు

20 పరలోకంలో నుండి ఒక దూత దిగి రావటం చూసాను. అతని దగ్గర పాతాళలోకపు తాళం చెవి ఉంది. అతని చేతిలో ఒక పెద్ద గొలుసు ఉంది. అతడు ఘటసర్పాన్ని పట్టుకొని వెయ్యి ఏండ్లదాకా బంధించి వేసాడు. దీన్ని ఆది సర్పమని, దయ్యమని, సాతానని అంటారు. అతడు దాన్ని పాతాళలోకంలో పడవేసి, తాళం వేసి, దాని మీద ముద్ర వేసాడు. వెయ్యి ఏండ్లు ముగిసేదాకా, అది దేశాలను మళ్ళీ మోసం చెయ్యకుండా ఉండాలని ఈ విధంగా చేసాడు. ఆ తర్వాత కొద్ది సమయం దానికి విడుదల ఇవ్వబడుతుంది.

నేను సింహాసనాలు చూసాను. తీర్పు చెప్పటానికి అధికారం పొందినవారు ఆ సింహాసనాలపై కూర్చొని ఉన్నారు. యేసు చెప్పిన సందేశాన్ని నమ్మకంగా బోధించినందుకు దేవుని సందేశాన్ని ప్రకటించినందుకు తలలు కొట్టివేయబడినవాళ్ళ ఆత్మల్ని చూసాను. వీళ్ళు మృగాన్నిగాని, దాని విగ్రహాన్ని గాని ఆరాధించ లేదు. వాళ్ళు దాని ముద్రను వాళ్ళ నొసళ్ళ మీదగాని, చేతుల మీదగాని వేయించుకోలేదు. వాళ్ళు మళ్ళీ బ్రతికి క్రీస్తుతో పాటు వెయ్యి ఏండ్లు పాలించారు. మిగతా చనిపోయినవాళ్ళు వెయ్యి ఏండ్లు పూర్తి అయ్యేదాకా బ్రతికి రాలేదు.

ఈ విధంగా చనిపోయి బ్రతికి రావటం యిది మొదటిసారి. మొదటిసారి బ్రతికి వచ్చినవాళ్ళ గుంపుకు చెందినవాళ్ళు ధన్యులు, పరిశుద్ధమైనవాళ్ళు. ఇక రెండవ మరణానికి[a] వాళ్ళపై అధికారము ఉండదు. వాళ్ళు దేవునికి, క్రీస్తుకు యాజకులుగా ఉండి క్రీస్తుతో సహా వెయ్యి ఏండ్లు రాజ్యం చేస్తారు.

సాతాను అపజయం పొందటం

వెయ్యి ఏండ్లు గడిచాక సాతాను కారాగారం నుండి విడుదల చేయబడతాడు. వాడు బయటకు వచ్చి దేశాలను మోసం చేస్తాడు. వాడు ప్రపంచం నలుమూలలకు, అంటే గోగు, మాగోగులకు వెళ్ళి యుద్ధం చేయటానికి ప్రజల్ని సమకూరుస్తాడు. సముద్ర తీరాన ఉన్న ఇసుక రేణువుల సంఖ్యతో సమానంగా వాళ్ళ సంఖ్య ఉంటుంది.

వాళ్ళు భూమి నలుమూలలకు వెళ్ళి భక్తుల శిబిరాలను ఆక్రమించారు. దేవుడు ప్రేమించే పట్టణాన్ని చుట్టుముట్టారు. కాని పరలోకంలో నుండి అగ్ని కురిసి వాళ్ళను నాశనం చేసింది. 10 ఇక వాళ్ళను మోసం చేసిన సాతాను మండుతున్న గంధకపు గుండంలో పారవేయబడ్డాడు. దానిలో క్రూర మృగం, దొంగ ప్రవక్త యింతకు ముందే పడవేయబడ్డారు. గుండంలోనే వాళ్ళు రాత్రింబగళ్ళు నిరంతరం హింసింపబడతారు.

చనిపోయినవాళ్ళపై తీర్పు

11 తర్వాత నాకు ఒక పెద్ద సింహాసనము కనిపించింది. అది తెల్లగా ఉంది. దానిపై కూర్చొన్నవాణ్ణి చూసాను. భూమి, ఆకాశం ఆయన నుండి పారిపొయ్యాయి. వాటికి స్థలం దొరకలేదు. అవి అదృశ్యమయ్యాయి. 12 నేను చనిపోయినవాళ్ళను చూసాను. అందులో గొప్పవాళ్ళు, కొద్దివాళ్ళు ఉన్నారు. వాళ్ళు సింహాసనం ముందు నిలబడి ఉన్నారు. అప్పుడు గ్రంథాలు తెరువబడ్డాయి. మరొక గ్రంథంకూడా తెరువబడింది. అది జీవగ్రంథం. చనిపోయినవాళ్ళపై తీర్పు చెప్పబడింది. వాళ్ళు చేసినవి ఆ గ్రంథాల్లో వ్రాయబడి ఉన్నాయి. వాటి ప్రకారం వాళ్ళ మీద తీర్పు చెప్పబడింది.

13 సముద్రం తనలో చనిపోయినవాళ్ళను విడుదల చేసింది. మృత్యువు తన మృత్యులోకంలో ఉన్నవాళ్ళను విడుదల చేసింది. వాళ్ళు చేసిన వాటిని బట్టి తీర్పు చెప్పబడింది. 14 ఆ తర్వాత మృత్యువు, మృత్యులోకము మంటలు ఉన్న గుండంలో పారవేయబడ్డాయి. మంటల గుండం రెండవ మరణం. 15 జీవగ్రంథంలో పేరులేనివాడు మంటల గుండంలో పారవేయబడ్డాడు.

మలాకీ 2

యాజకులకు నియమాలు

“యాజకులారా, ఈ నియమం మీ కోసమే! నా మాట వినండి! నేను చెప్పే మాటలు గమనించండి! నా పేరును మీరు గౌరవించాలి. మీరు నా పేరును గౌరవించకపోతే, అప్పుడు మీకు చెడు విషయాలు సంభవిస్తాయి. మీరు ఆశీర్వాదాలు చెప్పగా అవి శాపనార్థాలు అవుతాయి. మీరు నా పేరు అంటే గౌరవం చూపడం లేదు గనుక కీడులు సంభవించేటట్టు నేను చేస్తాను.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

“చూడండి, మీ సంతతివారిని నేను శిక్షిస్తాను. పవిత్ర దినాల్లో, యాజకులారా, మీరు నాకు బలులు అర్పిస్తారు. చచ్చిన జంతువుల్లోనుండి పేడ, పేగులు మీరు తీసి, వాటిని పారవేస్తారు. కానీ నేను ఆ పేడను మీ ముఖాలకు పులిమివేస్తాను, మరియు దానితోపాటు మీరు విసరివేయబడతారు! అప్పుడు ఈ ఆజ్ఞను నేను ఎందుకోసం మీకు ఇచ్చానో అది మీరు నేర్చుకొంటారు. లేవీతో నా ఒడంబడిక కొనసాగాలని నేను ఈ విషయాలు మీతో చెపుతున్నాను.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

(యెహోవా చెప్పాడు,) “లేవీతో ఆ ఒడంబడిక నేను చేశాను. అతనికి జీవం, శాంతి ఇస్తానని నేను వాగ్దానం చేశాను. మరియు నేను వాటిని అతనికి ఇచ్చాను! లేవీ నేనంటే భయభక్తులు చూపాడు! అతడు నా పేరుకు గౌరవం చూపించాడు! లేవీ సత్య ప్రబోధాలు నేర్పించాడు. లేవీ అబద్ధాలు నేర్పించలేదు. లేవీ నిజాయితీపరుడు, అతడు శాంతిని ప్రేమించాడు. లేవీ నన్ను అనుసరించి, అనేకమంది తాము చేసిన చెడ్డ పనులనుబట్టి శిక్షింపబడకుండా వారిని అతడు రక్షించాడు. ప్రతి యాజకుడూ దేవుని ప్రబోధాలు ఎరిగి ఉండాలి. ప్రజలు ఒక యాజకుని దగ్గరకు వెళ్లి, దేవుని ప్రబోధాలను అతని వద్ద నేర్చుకోగలిగి ఉండాలి. యాజకుడు ప్రజలకు దేవుని సందేశకునిగా ఉండాలి.”

(యెహోవా చెప్పాడు,) “యాజకులారా, మీరు నన్ను అనుసరించటం మానివేశారు! మనుష్యులచేత చెడు చేయించటానికి ఆ ప్రబోధాలు మీరు వినియోగించుకొన్నారు. లేవీతోటి ఒడంబడికను మీరు భగ్నం చేశారు!” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. “నేను మీతో చెప్పిన విధంగా మీరు జీవించరు! మీరు నా ప్రబోధాలు అంగీకరించలేదు! కనుక నేను మిమ్మల్ని ప్రాముఖ్యం లేనివారినిగా చేస్తాను. ప్రజలు మిమ్మల్ని బహిష్కరిస్తారు!”

యూదా దేవునికి నమ్మకంగా లేదు

10 మన అందరికీ ఒకే తండ్రి ఉన్నాడు (దేవుడు). ఆ దేవుడే మనలో ప్రతి ఒక్కరినీ చేశాడు! కాని, ప్రజలు ఎందుకు వారి సోదరులను మోసం చేస్తున్నారు? ఆ ప్రజలు ఒడంబడికను సన్మానించటం లేదని వ్యక్తం చేస్తున్నారు. మన పూర్వీకులు దేవునితో చేసుకున్న ఒడంబడికను వారు గౌరవించరు. 11 యూదా మనుష్యులు ఇతరులను మోసం చేశారు. యెరూషలేములో, ఇశ్రాయేలులో ప్రజలు భయంకర విషయాలు జరిపించారు. యూదాలో ప్రజలు యెహోవా పవిత్ర ఆలయాన్ని గౌరవించలేదు. ఆ స్థలం దేవునికి ఇష్టమైనది! యూదా ప్రజలు ఆ విదేశీ దేవతను పూజించటం మొదలు పెట్టారు. 12 యెహోవా ఆ మనుష్యులను యూదా వంశంలోనుండి తొలగించివేస్తాడు. ఆ ప్రజలు యెహోవాకు కానుకలు తీసికొని రావచ్చుగాక, కానీ అది సహాయ పడదు. 13 నీవు ఏడ్చి, యెహోవా బలిపీఠాన్ని కన్నీళ్ళతో నింపవచ్చు, కానీ యెహోవా నీ కానుకలు అంగీకరించడు. నీవు ఆయనకోసం తెచ్చే వస్తువులతో యెహోవా సంతోషించడు.

14 “మా కానుకలను యెహోవా ఎందుచేత అంగీకరించలేదు?” అని మీరు అడుగుతారు. ఎందుకంటే మీరు చేసిన చెడుకార్యాలు యెహోవా చూశాడు, మీకు విరుద్ధంగా ఆయనే సాక్షి. నీవు నీ భార్యను మోసం చేయటం ఆయన చూశాడు. నీవు యువకునిగా ఉన్నప్పుడే నీవు ఆ స్త్రీకి వివాహం చేయబడ్డావు. ఆమె నీ స్నేహితురాలు. తర్వాత మీరు ఇద్దరూ ఒకరికి ఒకరు ప్రమాణాలు చేసికొన్నారు. ఆమె నీకు భార్య అయింది. కానీ నీవు ఆమెను మోసం చేసావు. 15 భర్తలు, భార్యలు ఒకే శరీరం, ఒకే ఆత్మ కావాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే, వారికి పవిత్రమైన పిల్లలు ఉండాలని. అందుచేత ఆత్మపరమైన ఆ ఐక్యతను కాపాడుకోండి. నీ భార్యను మోసం చేయవద్దు. నీవు యువకునిగా ఉన్నప్పటినుండి ఆమె నీకు భార్యగా ఉంది.

16 “విడాకులు అంటే నాకు అసహ్యం. మరియు పురుషులు తమ భార్యలయెడల చేసే క్రూరమైన పనులు నాకు అసహ్యం. అందుచేత మీ ఆత్మపరమైన ఐక్యాన్ని కాపాడుకోండి. నీ భార్యను మోసం చేయవద్దు” అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెపుతున్నాడు.

తీర్పు కోసం ప్రత్యేక సమయం

17 మీరు తప్పుడు విషయాలు నేర్పించారు. ఆ తప్పుడు ప్రబోధాలు యెహోవాకు చాలా విచారం కలిగించాయి. చెడుకార్యాలు చేసేవారంటే దేవునికి ఇష్టం అని మీరు ప్రబోధించారు. అలాంటివారే మంచివాళ్లని దేవుడు తలుస్తాడు అని మీరు ప్రబోధించారు. చెడుకార్యాలు చేసినందుకు దేవుడు శిక్షించడు అని మీరు ప్రబోధం చేశారు.

యోహాను 19

19 ఆ తర్వాత పిలాతు యేసును తీసుకు వెళ్ళి కొరడాలతో కొట్టించాడు. భటులు ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి యేసు తలపై పెట్టారు. ఆయనకు ఊదారంగు వస్త్రాన్ని తొడిగించారు. ఆయన దగ్గరకు మాటి మాటికి వెళ్ళి, “యూదుల రాజా! జయము!” అని అంటూ ఆయన ముఖం మీద కొట్టారు.

పిలాతు మరొకసారి వెలుపలికి వచ్చి యూదులతో, “యిదిగో చూడండి! అతణ్ణి మీ ముందుకు తెస్తున్నాను. అతణ్ణి శిక్షించటానికి నాకే కారణం కనిపించటంలేదు. ఇది మీరు గ్రహించాలి” అని అన్నాడు. యేసుకు ముళ్ళ కిరీటాన్ని, ఊదారంగు దుస్తుల్ని ధరింపజేసి వెలుపలికి తీసుకొచ్చారు. పిలాతు వాళ్ళతో, “ఆ మనిషిని చూడండి!” అని అన్నాడు.

ప్రధానయాజకులు, అధికారులు యేసును చూడగానే, “సిలువకు వెయ్యండి! సిలువకు వెయ్యండి!” అని కేకలు వేసారు.

కాని పిలాతు, “మీరే తీసుకు వెళ్ళి సిలువకు వెయ్యండి. అతణ్ణి శిక్షించటానికి నాకే కారణం కనిపించటం లేదు” అని అన్నాడు.

కాని యూదులు, “మాకో న్యాయశాస్త్రం ఉంది. తాను, ‘దేవుని కుమారుడను’ అని అన్నాడు కనుక, మా న్యాయశాస్త్రం ప్రకారం అతడు మరణ దండన పొందాలి!” అని అన్నారు.

పిలాతు ఇది విని యింకా భయపడి పొయ్యాడు. అతడు తిరిగి భవనంలోకి వెళ్ళి యేసుతో, “నీ స్వగ్రామం ఏది?” అని అడిగాడు. కాని యేసు దానికి సమాధానం చెప్పలేదు. 10 పిలాతు, “నాతో మాట్లాడటానికి నిరాకరిస్తున్నావా? నిన్ను విడుదల చేయటానికి, సిలువకు వేయటానికి నాకు అధికారం ఉందని నీకు తెలియదా?” అని అన్నాడు.

11 యేసు సమాధానంగా, “పైన ఉన్నవాడు యిస్తే తప్ప నీకు నాపై ఏ అధికారం లేదు. కనుక నన్ను నీకు అప్పగించిన వాడు ఎక్కువ పాపం చేసాడు” అని అన్నాడు.

12 ఆ క్షణం నుండి, పిలాతు యేసును విడుదల చెయ్యాలని ప్రయత్నించాడు. కాని యూదులు, “ఇతణ్ణి విడుదల చేస్తే నీవు చక్రవర్తికి మిత్రుడవు కాదు. తాను రాజునన్న ప్రతి ఒక్కడూ చక్రవర్తిని వ్యతిరేకించిన వాడౌతాడు!” అని కేకలు వేసారు.

13 ఇది విని పిలాతు యేసును వెలుపలికి పిలుచుకొని వచ్చాడు. “రాళ్ళు పరచిన స్థలంలో” ఉన్న న్యాయపీఠంపై కూర్చున్నాడు. దీన్ని హీబ్రూ భాషలో “గబ్బతా” అని అంటారు. 14 అది పస్కా పండుగకు సిద్ధపడబొయ్యేరోజు. అప్పుడు ఉదయం సుమారు ఆరు గంటల సమయం. పిలాతు యూదులతో, “ఇదిగో మీ రాజు” అని అన్నాడు.

15 కాని వాళ్ళు, “తీసుకు వెళ్ళండి, తీసుకు వెళ్ళండి. సిలువకు వేయండి!” అని కేకలు వేసారు.

పిలాతు, “మీ రాజును సిలువకు వేయ మంటారా?” అని అన్నాడు.

ప్రధానయాజకులు, “చక్రవర్తి తప్ప మాకు వేరే రాజు లేడు” అని సమాధానం చెప్పారు.

16 తదుపరి, పిలాతు ఆయన్ని సిలువకు వెయ్యమని భటులకు అప్పగించాడు.

యేసుని సిలువకు వేయటం

(మత్తయి 27:32-44; మార్కు 15:21-32; లూకా 23:26-39)

17 భటులు యేసును తీసుకు వెళ్ళారు. తన సిలువను మోసుకొని యేసు “పుర్రె స్థలాన్ని” చేరుకున్నాడు. హీబ్రూ భాషలో దీన్ని “గొల్గొతా” అంటారు. 18 ఇక్కడ ఆయన్ని సిలువకు వేసారు. ఆయనకు ఇరువైపు మరొక యిద్దర్ని సిలువకు వేసారు.

19 పిలాతు, ఒక ప్రకటన వ్రాయించి ఆయన సిలువకు తగిలించాడు. ఆ ప్రకటనలో, “నజరేతు నివాసి యేసు యూదుల రాజు” అని వ్రాయబడి ఉంది. 20 యేసును సిలువకు వేసిన స్థలము పట్టణానికి దగ్గరగా ఉంది. ఆ ప్రకటన హీబ్రూ, రోమా, గ్రీకు భాషల్లో వ్రాయబడి ఉంది. కనుక చాలా మంది యూదులు ఈ ప్రకటన చదివారు.

21 యూదుల ప్రధాన యాజకులు దీన్ని గురించి పిలాతు ముందు ఫిర్యాదు చేస్తూ, “‘యూదుల రాజు’ అని వ్రాసారెందుకు? ‘ఇతడు, తాను యూదుల రాజని అన్నాడు’ అని వ్రాయండి” అని అన్నారు.

22 పిలాతు, “వ్రాసిందేదో వ్రాసాను” అని సమాధానం చెప్పాడు.

23 భటులు యేసును సిలువకు వేసాక ఆయన దుస్తుల్ని నాలుగు భాగాలుగా చేసి తలొకటి పంచుకున్నారు. వాళ్ళు ఆయన పొడుగాటి అంగీని కూడా లాక్కున్నారు. అది పైనుండి క్రింది దాకా కుట్టు లేకుండా నేయబడి ఉంది. 24 ఆ భటులు, “దీన్ని చింపకుండా చీట్లు వేసి ఎవరికి దొరుకుతుందో చూద్దాం!” అని మాట్లాడుకున్నారు. ఈ విధంగా అనుకున్నట్లు చేసారు:

“వాళ్ళు నా దుస్తుల్ని పంచుకొన్నారు!
    నా దుస్తుల కోసం చీట్లు వేసారు!”(A)

లేఖనాల్లో వ్రాయబడిన విషయం నిజం కావటానికి యిలా జరిగింది.

25 యేసు సిలువదగ్గర ఆయన తల్లి, తల్లి యెక్క సోదరి, క్లోపా భార్య మరియ, మగ్దలేనే మరియ, నిలుచొని ఉన్నారు. 26 యేసు తన తల్లి, తన ప్రియ శిష్యుడు అక్కడ నిలుచొని ఉండటం చూసాడు. తన తల్లితో, “అమ్మా! ఇదిగో నీ కుమారుడు” అని అన్నాడు. 27 ఆ శిష్యునితో, “ఇదిగో నీ తల్లి!” అని అన్నాడు. ఆనాటి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడు.

యేసు మరణం

(మత్తయి 27:45-56; మార్కు 15:33-41; లూకా 23:44-49)

28 ఆ తర్వాత యేసు అంతా ముగిసిందని గ్రహించాడు. ఆయన, “నాకు దాహం వేస్తోంది” అని అన్నాడు. లేఖనాల్లో వ్రాసింది నిజంకావటానికి ఇలా జరిగింది. 29 పులిసిన ద్రాక్షారసం ఉన్న ఒక కుండ అక్కడ ఉంది. వాళ్ళు ఒక స్పాంజి ఆ కడవలో ముంచి, హిస్సోపు చెట్టుకొమ్మపై ఆ స్పాంజి పెట్టి, దాన్ని యేసు పెదాలకు అందించారు. 30 ఆయన దాన్ని రుచిచూచి, “అంతా ముగిసింది” అని అన్నాడు. ఆ మాట అన్నాక, తలవాల్చి ఆత్మను అప్పగించాడు.

31 అది పండుగకు సిద్దమయ్యే రోజు. మరుసటి రోజు విశేషమైన విశ్రాంతి రోజు[a] కనుక ఆ రోజు వాళ్ళను సిలువపై వదిలి వేయటం యూదులకు యిష్టం లేదు. అందువల్ల వాళ్ళు వారి కాళ్ళు విరగ్గొట్టి వారిని క్రిందికి దింపి వెయించుమని పిలాతును అడిగారు. 32 భటులు వచ్చి యేసుతో సిలువకు వేయబడిన మొదటి వాని కాళ్ళు, రెండవ వాని కాళ్ళు విరగ్గొట్టారు. 33 వాళ్ళు యేసు దగ్గరకు వచ్చి ఆయన అప్పటికే చనిపోయినట్లు గమనించారు. అందువల్ల వాళ్ళు ఆయన కాళ్ళు విరగ్గొట్టలేదు.

34 దానికి మారుగా భటుల్లో ఒకడు యేసు డొక్కను బల్లెంతో పొడిచాడు. వెంటనే రక్తం, నీళ్ళు కారాయి. 35 మీరు కూడా విశ్వసించాలని ఈ సంఘటన చూసిన వాడు దీన్ని గురించి చెప్పాడు. అతడు చెప్పింది నిజం. తాను సత్యం పలుకుతున్నట్లు అతనికి తెలుసు. 36-37 లేఖనాల్లో వ్రాయబడిన విషయాలు నిజం కావటానికి యిలా జరిగింది. ఒకచోట ఇలా వ్రాయబడి ఉంది: “ఆయనలో ఒక్క ఎముక కూడ విరువబడదు.”(B) మరొక చోట, ఇలా వ్రాయబడివుంది: “తాము పొడిచిన వాని వైపు వాళ్ళు చూస్తారు.”(C)

యేసును సమాధి చేయటం

(మత్తయి 27:57-61; మార్కు 15:42-47; లూకా 23:50-56)

38 ఆ తర్వాత “అరిమతయియ” గ్రామానికి చెందిన యోసేపు, యేసు దేహాన్నివ్వమని పిలాతును అడిగాడు. యోసేపు యూదులంటే భయపడేవాడు. కనుక రహస్యంగా యేసు శిష్యుడైనాడు. పిలాతు అంగీకారం పొంది అతడు యేసు దేహాన్ని తీసుకు వెళ్ళాడు.

39 అతని వెంట “నీకొదేము” కూడా ఉన్నాడు. క్రితంలో ఒక నాటి రాత్రి యేసును కులుసుకున్న వాడు యితడే. ఇతడు ముప్పై అయిదు కిలోలబోళం, అగరుల మిశ్రమాన్ని తన వెంట తీసుకు వచ్చాడు. 40 వాళ్ళిద్దరూ కలిసి యేసు దేహాన్ని సుగంధ ద్రవ్యాల్లో ఉంచి, దాన్ని నారగుడ్డలో చుట్టారు. ఇలా చెయ్యటం యూదుల సాంప్రదాయం. 41 యేసును సిలువకు వేసిన చోట ఒక తోట ఉంది. ఆ తోటలో ఒక కొత్త సమాధిఉంది. ఆ సమాధిలో అంతవరకు ఎవర్నీ ఉంచలేదు. 42 అది యూదులు పండుగకు సిద్ధం అవ్వ బోయే రోజు. పైగా ఆ సమాధి సిలువకు సమీపంలో ఉంది. కనుక వాళ్ళు ఆయన దేహాన్ని ఆ సమాధిలో ఉంచారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International