Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 దినవృత్తాంతములు 33

యూదా రాజుగా మనష్షే

33 మనష్షే యూదా రాజయ్యేనాటికి పన్నెండు సంవత్సరాలవాడు. యెరూషలేములో అతడు ఏబైయైదు సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. యెహోవా దృష్టికి చెడ్డవైన పనులన్నీ మనష్షే చేశాడు. అన్యదేశాల వారి భయంకరమైన, పాప భూయిష్టమైన ఆచారాలన్నిటినీ అతడు అనుసరించాడు. ఆ రాజ్యాల వారిని ఇశ్రాయేలీయుల ఎదుటనుండి యెహోవా బయటకు వెడల గొట్టినాడు. తన తండ్రి హిజ్కియా తొలగించిన ఉన్నత స్థలాలన్నీ మనష్షే మళ్లీ నిర్మించాడు. బయలు దేవతలకు పూజా పీఠాలను, అషేరా దేవతా స్తంభాలను మనష్షే నిర్మించాడు. నక్షత్ర మండలాలకు ప్రణమిల్లి, వాటిని అతడు ఆరాధించాడు. యెహోవా ఆలయంలో బూటకపు దేవతలకు మనష్షే బలిపీఠాలు నిర్మించాడు. కాని “నా నామము యెరూషలేములో శాశ్వతంగా వుంటుంది” అని యెహోవా తన ఆలయ విషయంలో చెప్పియున్నాడు. రెండు ఆలయ ఖాళీ స్థలాలలోను ప్రతి నక్షత్ర మండలానికి ఒక్కొక్కటి చొప్పున మనష్షే బలిపీఠాలను నిర్మించాడు. బెన్‌హిన్నోము లోయలో[a] మనష్షే తన స్వంత పిల్లలను కూడ దేవతలకు బలియిచ్చాడు. మనష్షే భవిష్యత్తును తెలిసికోవటానికి మంత్రతంత్ర విద్యలను ఆశ్రయించి, సోదె చెప్పు వారిని, చిల్లంగి వాండ్రను సంప్రదించాడు. కర్ణపిశాచి విద్యలను పాటించే వారిని సోదెచెప్పు వారిని ప్రోత్సహించి వారి సలహాలు తీసికొన్నాడు. దేవుని దృష్టిలో చాలా హేయమైన పనులు చేశాడు. మనష్షే పాపాలు యెహోవాకు కోపం వచ్చేటట్లు చేశాయి. అతడు ఒక దేవతా విగ్రహాన్ని కూడ చేయించి దానిని ఆలయంలో నెలకొల్పాడు. ఈ ఆలయాన్ని గురించి యెహోవా దావీదుకు, అతని కుమారుడు సొలొమోనుకు యిలా చెప్పినాడు: “ఈ ఆలయంలోను, యెరూషలేములోను నా నామమును స్థిరంగా ప్రతిష్టించుతాను. ఇశ్రాయేలు కుటుంబాల వారుంటున్న స్థానములన్నిటిలోను నేను యెరూషలేమును ఎంపిక చేసికొన్నాను. ఇశ్రాయేలీయుల పూర్వీకులకు యివ్వడానికి నిశ్చయించిన ఈ రాజ్యంనుండి మరెన్నడూ నేను వారిని బయటకు వెళ్ల గొట్టను. కాని వారికి నేను ఆజ్ఞాపించిన విషయాలన్నిటినీ వారు తప్పక పాటించాలి. ఇశ్రాయేలు ప్రజలకు అందజేయమని నేను మోషేకు ఇచ్చిన ధర్మాశాస్త్రాన్ని, నియమ నిబంధనలను, ఆజ్ఞలను వారు తప్పక అనుసరించాలి.”

యూదా ప్రజలను, యెరూషలేము వాసులను తప్పుడు పనులు చేయటానికి మనష్షే ప్రోత్సహించాడు. ఇశ్రాయేలీయుల ముందు నుండి యెహోవా చేత బలవంతంగా వెళ్లగొట్టబడి నాశనం గావింపబడిన వారి కంటె వారు ఎక్కువ పాపాలు చేశారు.

10 యెహోవా మనష్షేతోను, అతని ప్రజలతోను మాట్లాడినాడు గాని, వారు దేవుని మాట వినటానికి నిరాకరించారు. 11 అందువల్ల అష్షూరు రాజు సైన్యాధికారులను యూదాపై దండెత్తటానికి యెహోవా రప్పించాడు. ఆ అధికారులు మనష్షేను పట్టుకుని, అతనికి సంకెళ్లు వేశారు. మనష్షే చేతులకు వారు ఇత్తడి గొలుసులు తగిలించారు. వారతనిని బందీగా బబులోనుకు పట్టుకుపోయారు.

12 మనష్షే చాలా బాధ అనుభవించాడు. ఆ సమయంలో తన దేవుడగు యెహోవాను వేడుకున్నాడు. తన పితరుల దేవుని ముందర మనష్షే మిక్కిలి విధేయుడైనాడు 13 మనష్షే దేవునికి ప్రార్థన చేసి, తనకు సహాయపడమని వేడుకున్నాడు. యెహోవా మనష్షే మనవి ఆలకించి, అతని విషయంలో బాధపడినాడు. యెహోవా అతనిని యెరూషలేముకు తిరిగి వచ్చి తన సింహాసనాన్ని మళ్లీ అలకరించేలా చేసినాడు. యెహోవాయే నిజమైన దేవుడని మనష్షే అప్పుడు తెలిసికొన్నాడు.

14 ఇది జరిగిన పిమ్మట మనష్షే దావీదు నగరానికి బయట ఒక గోడ కట్టించాడు. (కిద్రోను) లోయలో మత్స్యద్వారం ముంగిట నున్న గిహోను నీటి బుగ్గకు పశ్చిమంగా ఈ గోడవుంది. మనష్షే ఈ గోడను ఓపెలు కొండ చుట్టూ కట్టించాడు. ఈ గోడ చాలా ఎత్తుగా కట్టించాడు. పిమ్మట యూదాలో వున్న కోటలన్నిటిలో అతడు సైనికాధికారులను నియమించాడు. 15 ఇతర దేవుళ్ల విగ్రహాలన్నిటినీ మనష్షే తీసి పారవేశాడు. ఆలయంలో వున్న విగ్రహాన్ని అతడు తీసివేశాడు. యెరూషలేములో ఆలయ ప్రాకారం మీద అతను నెలకొల్పిన బలిపీఠాలన్నీ తొలగించాడు. ఆ బలిపీఠాలన్నిటినీ యెరూషలేము నగరంనుండి తీసి బయట పారవేశాడు. 16 పిమ్మట అతడు యెహోవా బలిపీఠాన్ని ప్రతిష్ఠించి దాని మీద సమాధానబలులు, కృతజ్ఞతార్పణలు సమర్పించాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఘనంగా ఆరాధించుమని మనష్షే యూదా ప్రజలందరికి ఆజ్ఞాపించాడు. 17 ప్రజలు ఉన్నత స్థలాలలో బలులు యివ్వటం కొనసాగించారు గాని వారు అవన్నీ వారి దేవుడగు యెహోవాకే అర్పించారు.

18 మనష్షే చేసిన ఇతర విషయాలు, దేవునికి అతడు చేసిన ప్రార్థన, ఇశ్రాయేలు దేవుని తరపున దీర్ఘదర్శలు అతనిని గురించి చెప్పిన విషయాలు అన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడినాయి. 19 మనష్షే దేవునికి చేసిన ప్రార్థన, దేవుడు దానిని విన్న విధము, అది విని దేవుడు బాధపడిన విషయములు దీర్ఘదర్శులు రచించిన గ్రంథంలో వ్రాయబడినాయి. మనష్షే తనకు తాను విధేయుడు కాక పూర్వం అతడు చేసిన పాపాలు, పొరపాట్లు, అతను ఎక్కడెక్కడ ఇతర దేవుళ్లకు ఉన్నత స్థలాలు, అషేరా దేవతా స్తంభాలు నిలిపిన విషయాలు దీర్ఘదర్శుల గ్రంథంలో వ్రాయబడ్డాయి. 20 మనష్షే చనిపోయినప్పుడు అతనిని తన పూర్వీకులతోపాటు సమాధిచేశారు. ప్రజలతనిని తన స్వంత రాజ గృహంలోనే సమాధి చేశారు. మనష్షే స్థానంలో ఆమోను కొత్తగా రాజయ్యాడు. ఆమోను మనష్షే కుమారుడు.

యూదా రాజుగా ఆమోను

21 యూదాకు రాజయ్యేనాటికి ఆమోను ఇరువదిరెండేండ్లవాడు. యెరూషలేములో అతడు రెండేండ్లపాటు రాజుగా ఉన్నాడు. 22 దేవుని సన్నిధిలో ఆమోను అన్నీ నీచకార్యాలే చేశాడు. తన తండ్రి మనష్షే చేసిన విధంగా, దేవుడు అతని నుండి ఆశించిన పవిత్ర కార్యాలేవీ ఆమోను చేయలేదు. తన తండ్రి మనష్షే చేయించి వుంచిన చెక్కడపు (నగిషీ) బొమ్మల విగ్రహాలకు ఆమోను బలులు అర్పించాడు. ఆమోను ఆ విగ్రహాలను ఆరాధించాడు. 23 తన తండ్రి మనష్షే పరివర్తన చెందినట్లు, ఆమోను దేవుని ముందు వీధేయుడై మెలగలేదు. పైగా ఆమోను రోజు రోజుకు మరింత పాపం చేయసాగాడు. 24 ఆమోను సేవకులు అతనిపై కుట్రపన్నారు. వారు ఆమోనును అతని స్వంత ఇంటిలోనే హత్యచేశారు. 25 కాని యూదా ప్రజలు రాజైన ఆమోనుపై కుట్ర పన్నిన సేవకులందరీని చంపివేశారు. తరువాత ప్రజలు కొత్త రాజుగా యోషీయాను ఎంపిక చేశారు. యోషీయా ఆమోను కుమారుడు.

ప్రకటన 19

దేవుణ్ణి స్తుతించండి

19 ఇది జరిగిన తర్వాత పరలోకంలో ఒక పెద్ద ప్రజాసమూహం మాట్లాడుతున్నట్లు నాకు ఒక స్వరం వినిపించి యిలా అన్నది:

“దేవుణ్ణి స్తుతించండి!
రక్షణ, మహిమ, అధికారం మన దేవునిదే.
ఆయన నీతిమంతుడు కనుక న్యాయంగా సత్యంగా తీర్పు చెబుతాడు.
తన వ్యభిచారంతో ప్రపంచాన్ని పాడు చేసిన
    ఆ వేశ్యను ఆయన శిక్షించాడు.
తన సేవకుల రక్తానికి దానిపై కక్ష తీర్చుకొన్నాడు.”

వాళ్ళందరు మళ్ళీ, ఇలా అన్నారు:

“దేవుణ్ణి స్తుతించండి!
కాలిన ఆ మహానగరం నుండి పొగ ఆగకుండా మీదికి వెళ్తుంటుంది.”

ఆ యిరవై నాలుగు మంది పెద్దలు సాష్టాంగ పడి సింహాసనంపై కూర్చొన్న దేవుణ్ణి ఆరాధించారు. అదే విధంగా ఆ నాలుగు ప్రాణులు కూడా ఆరాధించాయి. వాళ్ళు ఇలా అన్నారు:

“ఆమేన్! దేవుణ్ణి స్తుతించండి!”

అప్పుడు సింహాసనం నుండి ఒక స్వరం యిలా అన్నది:

“ఆయన సేవకులైన మీరంతా, చిన్నా, పెద్దా అనే భేదం లేకుండా మన దేవుణ్ణి స్తుతించండి.
ఆయనకు భయపడే మీరంతా మన దేవుణ్ణి స్తుతించండి.”

ఆ తర్వాత నాకు ఒక ధ్వని వినిపించింది. ఆ ధ్వని పెద్ద ప్రజాసమూహం చేసిన ధ్వనిలా, జలపాతం చేసే ధ్వనిలా, పెద్ద ఉరుముల ధ్వనిలా ఉంది. వాళ్ళు యిలా అన్నారు:

“దేవుణ్ణి స్తుతించండి.
    సర్వశక్తిసంపన్నుడు, మన ప్రభువు అయిన
    దేవుడు మనల్ని పాలిస్తున్నాడు.
మనం ఆనందించుదాం. సంతోషంతో ఆయన్ని ఘనపర్చుదాం.
గొఱ్ఱెపిల్ల వివాహం కానున్నది.
    ఆయన పెళ్ళి కూతురు తనకు తానే సిద్ధం అయింది.
సున్నితమైన నార బట్టలు ఆమె ధరించటానికి యివ్వబడ్డాయి.
    అవి స్వచ్ఛంగా తెల్లగా ఉన్నాయి.”

(సున్నితమైన నారబట్టలు పవిత్రులు చేసిన నీతి పనులను సూచిస్తున్నాయి.)

ఆ తదుపరి దూత నాతో, “ఇది వ్రాయి. గొఱ్ఱెపిల్ల పెళ్ళి విందుకు ఆహ్వానింపబడ్డ వాళ్ళు ధన్యులు.” అతడు యింకా ఇలా అన్నాడు, “ఇవి నిజంగా దేవుని మాటలు.”

10 ఇది విన్నాక అతన్ని ఆరాధించాలని నేను అతని కాళ్ళ మీద పడ్డాను. కాని అతడు నాతో, “అలా చేయవద్దు. నేను నీ తోటి సేవకుణ్ణి. యేసు చెప్పిన దాన్ని అనుసరించే సోదరుల సహచరుణ్ణి. దేవుణ్ణి ఆరాధించు. యేసు చెప్పిన విషయాలనే ప్రవక్తలు కూడా చెప్పారు” అని అన్నాడు.

తెల్లటి గుర్రంపై రౌతు

11 నేను తెరుచుకొని ఉన్న పరలోకాన్ని చూసాను. నా ముందు ఒక తెల్లటి గుఱ్ఱం కనిపించింది. దాని రౌతు నమ్మకమైన వాడని, సత్యవంతుడని పేరున్న వాడు. అతడు నీతిగా తీర్పు చెబుతాడు. న్యాయంగా యుద్ధం చేస్తాడు. 12 ఆయన కళ్ళు నిప్పులా మండుతూ ఉన్నాయి. ఆయన తలమీద ఎన్నో కిరీటాలు ఉన్నాయి. ఆయన మీద ఒక పేరు వ్రాయబడి ఉంది. ఆయనకు తప్ప మరెవ్వరికీ ఆ పేరు తెలియదు. 13 ఆయన రక్తంలో ముంచబడిన వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. ఆయన పేరు దేవుని వాక్యం. 14 తెల్లగా పరిశుద్ధంగా ఉన్న సున్నితమైన దుస్తులు వేసుకొని పరలోకంలో ఉన్న సైనికులు తెల్లటి గుర్రాలపై స్వారీ చేస్తూ ఆయన్ని అనుసరించారు. 15 దేశాలను ఓడించటానికి ఆయన నోటినుండి పదునైన కత్తి బయటకు వచ్చింది. ఆయన దేశాలను గొప్ప అధికారంతో పాలిస్తాడు. ఆయన సర్వశక్తి సంపన్నుడైన దేవుని ఆగ్రహమనబడే ద్రాక్షా గానుగను త్రొక్కుతాడు. ఆ ఆగ్రహం తీవ్రమైనది. 16 ఆయన వస్త్రంమీద, ఆయన తొడమీద:

రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు

అని వ్రాయబడి ఉంది.

17 ఒక దూత సూర్యునిలో నిలబడి ఉండటం చూసాను. అతడు బిగ్గరగా గాలిలో ఎగురుతున్న పక్షులతో, “దేవుని గొప్ప విందుకొరకు అందరూ సమావేశం కండి. 18 మీరు వస్తే రాజుల మాంసం, సైన్యాధిపతుల మాంసం, వీరుల మాంసం, గుఱ్ఱాల మాంసం, రౌతుల మాంసం, ప్రజల మాంసం, బానిసలుకానివాళ్ళ మాంసం, బానిసల మాంసం, ముఖ్యమైనవాళ్ళ మాంసం, తినటానికి లభిస్తుంది” అని అన్నాడు.

19 ఆ తదుపరి మృగము మరియు భూపాలకులు, వాళ్ళ సైన్యాలు, అంతా కలిసి గుఱ్ఱంపై స్వారీ చేస్తున్న వానితో, ఆయన సైన్యంతో యుద్ధం చేయటానికి సిద్ధం అయ్యారు. 20 కాని ఆ మృగము బంధింపబడింది. ఆ మృగం పక్షాన మహత్వపూర్వకమైన సూచనలు చూపిన దొంగ ప్రవక్త కూడా బంధింపబడ్డాడు. వాడు ఈ సూచనలతో మృగం యొక్క ముద్రను పొందినవాళ్ళను, ఆ మృగాన్ని ఆరాధించినవాళ్ళను మోసం చేస్తూపోయాడు. వీళ్ళందరిని గంధకంతో మండుతున్న భయానకమైన గుండంలో ఆ గుఱ్ఱంపై స్వారీ చేస్తున్నవాడు సజీవంగా పడవేసాడు. 21 గుఱ్ఱపు రౌతు నోటినుండి వచ్చిన కత్తితో మిగతా వాళ్ళు చంపబడ్డారు. పక్షులు వచ్చి వీళ్ళ దేహాలను కడుపు నిండా తిన్నాయి.

మలాకీ 1

దేవుని దగ్గర్నుండి ఇది ఒక సందేశం. ఈ సందేశం యెహోవా దగ్గరనుండి వచ్చింది. ఇశ్రాయేలీయులకు ఈ సందేశాన్ని మలాకీ ఇచ్చాడు.

దేవుడు ఇశ్రాయేలును ప్రేమిస్తున్నాడు

“ప్రజలారా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను” అన్నాడు యెహోవా.

కానీ “నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావని తెలియజేసేది ఏమిటి?” అని మీరు అన్నారు.

యెహోవా చెప్పాడు: “ఏశావు యాకోబుకు సోదరుడు. కానీ నేను యాకోబును ఎన్నుకొన్నాను.[a] మరియు ఏశావును నేను అంగీకరించలేదు.[b] ఏశావుయొక్క కొండ దేశాన్ని[c] నేను నాశనం చేశాను. ఏశావు దేశం నాశనం చేయబడింది. ఇప్పుడు అక్కడ అడవి కుక్కలు[d] మాత్రమే నివసిస్తాయి.”

ఒకవేళ ఎదోము ప్రజలు, “మేము నాశనం చేయబడ్డాం. కానీ మేము తిరిగి వెళ్లి, మా పట్టణాలు మరల కట్టుకొంటాం” అని అనవచ్చు.

అయితే సర్వశక్తిమంతుడైన యెహోవా, “వారు ఆ పట్టణాలను మరల నిర్మిస్తే, నేను వాటిని మరల నాశనం చేస్తాను” అని చెపుతున్నాడు. కనుక ఎదోము దుష్ట పట్టణం అని ప్రజలు చెబుతారు. ఆ దేశాన్ని యెహోవా శాశ్వతంగా అసహ్యించుకొంటున్నాడు అని ప్రజలు చెబుతారు.

ప్రజలారా, మీరు ఈ సంగతులు చూశారు, మరియు “ఇశ్రాయేలుకు వెలుపల కూడ యెహోవా గొప్పవాడు” అని మీరు చెప్పారు.

ప్రజలు దేవుని గౌరవించరు

“పిల్లలు తమ తండ్రిని గౌరవిస్తారు. సేవకులు తమ యజమానులను గౌరవిస్తారు. నేను మీ తండ్రిని. మరి మీరెందుకు నన్ను గౌరవించరు? నేను మీ యజమానిని. అయినను నేనంటే భయభక్తులు ఎందుకు లేవు మీకు? యాజకులారా, మీరు నా పేరును అగౌరవపరుస్తున్నారు” అని సర్వశక్తిమంతుడైన యెహోవా అన్నాడు.

కాని మీరు, “మేము నీ పేరును అగౌరవపరచామని చూపించడానికి మేము ఏమి చేశాం?” అని అంటారు.

“పాడై పోయిన రొట్టెను మీరు నా బలిపీఠం దగ్గరకు తీసికొని వస్తారు” (అని యెహోవా చెప్పాడు.)

కానీ మీరు “ఆ రొట్టెను ఏది పాడు చేస్తుంది?” అని అంటారు.

(యెహోవా చెప్పాడు,) “నా బల్లను మీరు గౌరవించరు. గుడ్డి జంతువులను బలిగా మీరు తీసికొని వస్తారు. అది తప్పు! బలి అర్పణల కోసం కుంటి మరియు జబ్బు జంతువులను మీరు తీసికొని వస్తారు. మరి అదీ తప్పు. ఆ జబ్బు జంతువులను మీ దేశాధికారికి ఇచ్చి చూడండి. ఆ జబ్బు జంతువులను అతడు కానుకలుగా స్వీకరిస్తాడా? లేదు! ఆ కానుకలు అతడు అంగీకరించడు!” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

“యాజకులారా! యెహోవా మా యెడల దయగలిగి ఉండాలని మీరు ఆయనను అడగాలి. కాని ఆయన మీ మాట వినడు. ఆ తప్పు అంతా మీదే”. సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

10 “కనీసం, మీ యాజకుల్లో కొందరు దేవాలయం తలుపులు మూయవచ్చు, హోమాలు సరిగ్గా వెలిగించవచ్చు. మీ విషయం నాకు సంతోషంగా లేదు. నేను మీ కానుకలు అంగీకరించను.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ సంగతులు చెప్పాడు.

11 “ప్రపంచం అంతటా మనుష్యులు నన్ను గౌరవిస్తారు. ప్రపంచం అంతటా మనుష్యులు నాకు మంచి కానుకలు అర్పిస్తారు. నాకు కానుకగా వారు మంచి సాంబ్రాణి ధూపం వేస్తారు. ఎందుకంటే, ఆ మనుష్యులందరికీ నా పేరు ముఖ్యం గనుక.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

12 “కానీ మీరు మాత్రం నా పేరు అంటే మీకు గౌరవం లేదని చూపించారు. యెహోవా బల్ల మలినంగా ఉందని మీరు అంటారు. 13 ఆ బల్లమీది భోజనం మీకు ఇష్టంలేదు. ఆ భోజనాన్ని మీరు వాసన చూచి, తినుటకు నిరాకరిస్తారు. అది చెడిపోయిందని మీరు చెబుతారు. కానీ అది సత్యం కాదు. ఆ తర్వాత జబ్బువి, కుంటివి, గాయపర్చబడిన జంతువులను మీరు నాకోసం తెస్తారు. జబ్బు జంతువులను నాకు బలి అర్పణలుగా ఇచ్చేందుకు మీరు ప్రయత్నిస్తారు. కానీ మీ వద్దనుండి ఆ జబ్బు జంతువులను నేను అంగీకరించను. 14 కొంతమంది దగ్గర వారు బలి అర్పణలుగా ఇవ్వగలిగిన మంచి మగ జంతువులు ఉన్నాయి. కానీ ఆ మంచి జంతువులను వారు నాకు ఇవ్వరు. కొంతమంది మంచి జంతువులను నాకోసం తీసికొని వస్తారు. ఆరోగ్యంగా ఉన్న ఆ జంతువులను నాకు ఇస్తాం అని వారు వాగ్దానం చేస్తారు. కానీ వారు ఆ మంచి జంతువులను రహస్యంగా మార్చివేసి, జబ్బు జంతువులను నాకు ఇస్తారు. ఆ మనుష్యులకు చెడు సంగతులు సంభవిస్తాయి. నేను మహారాజును. మీరు నాయెడల భయభక్తులు కలిగి ఉండాలి. ప్రపంచం అంతటా ప్రజలు నాయందు భయభక్తులు కలిగి ఉంటారు!” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

యోహాను 18

యేసును బంధించటం

(మత్తయి 26:47-56; మార్కు 14:43-50; లూకా 22:47-53)

18 యేసు ప్రార్థించటం ముగించాక తన శిష్యులతో కలిసి ప్రయాణమయ్యాడు. అంతా కలిసి కెద్రోను లోయ దాటి వెళ్ళారు. అక్కడ ఒక ఒలీవల తోట ఉంది. వాళ్ళు ఆ తోటలోకి వెళ్ళారు.

యేసు తన శిష్యులతో తరుచు యిక్కడ కలుసుకొంటూ ఉండేవాడు కనుక ఆయనకు ద్రోహం చేసిన యూదాకు ఈ స్థలం తెలుసు. అందువల్ల యూదా ఒక సైనిక దళాన్ని, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన కొంతమంది రక్షక భటుల్ని వెంట బెట్టుకొని వచ్చాడు. వాని వెంట ఉన్న వాళ్ళు ఆయుధాలను, దివిటీలను, దీపాలను, పట్టుకొని వాణ్ణి అనుసరించారు.

యేసుకు జరుగనున్నదంతా తెలుసు. ఆయన ముందుకు వచ్చి, “వాళ్ళతో మీకెవరు కావాలి?” అని అడిగాడు.

“నజరేతుకు చెందిన యేసు!” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

“ఆయన్ని నేనే!” అని యేసు అన్నాడు. ద్రోహం చేసిన యూదా వాళ్ళతో నిలుచుని ఉన్నాడు. యేసు, “నేనే ఆయన్ని” అని అనటం విని వాళ్ళు ఒక అడుగు వెనక్కు వేసి క్రింద పడిపోయారు.

యేసు, “మీకెవరు కావాలి?” అని మళ్ళీ అడిగాడు.

వాళ్ళు, “నజరేతుకు చెందిన యేసు” అని సమాధానం చెప్పారు.

యేసు, “ఆయన్ని నేనే అని చెప్పానుగా? మీరు నా కోసం చూస్తుంటే వీళ్ళను మాత్రం వెళ్ళ నివ్వండి” అని అన్నాడు. “నీవు నాకప్పగించిన వాళ్ళలో ఒక్కణ్ణి కూడా నేను పోగొట్టుకోలేదు” అని ఆయన అన్న మాటలు నిజం కావటానికి యిలా జరిగింది.

10 సీమోను పేతురు దగ్గర ఒక కత్తి ఉండింది. అతడు ఆ కత్తి దూసి ప్రధాన యాజకుని సేవకుణ్ణి నరకటానికి పోయి, అతని కుడి చెవి నరికి వేసాడు. ఆ సేవకుని పేరు “మల్కు.” 11 యేసు పేతురుతో, “నీ కత్తి ఒరలో పెట్టు! నా తండ్రి యిచ్చిన పాత్ర నేను త్రాగకుండా ఉంటానా?” అని అన్నాడు.

యేసును అన్న దగ్గరకు పిలుచుకు వెళ్ళటం

(మత్తయి 26:57-58; మార్కు 14:53-54; లూకా 22:54)

12 ఆ తర్వాత సైనిక దళము, దళాధిపతి, రక్షక భటులు యేసును బంధించి, మొదట అన్న దగ్గరకు తీసుకు వెళ్ళారు. “అన్న” “కయపకు” కూమార్తె నిచ్చిన మామ. 13 “కయప” ఆ సంవత్సరానికి ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. 14 ప్రజల కొరకు ఒకే ఒక వ్యక్తి చనిపోవటం మంచిదని యూదులకు సలహా ఇచ్చిన వాడు ఇతడే!

పేతురు తెలియదనటం

(మత్తయి 26:69-70; మార్కు 14:66-68; లూకా 22:55-57)

15 సీమోను పేతురు, అతనితో పాటు యింకొక శిష్యుడు యేసు వెంట వెళ్ళారు. ఈ యింకొక శిష్యుడు ప్రధాన యాజకునికి తెలిసినవాడు. అందువల్ల అతడు యేసు వెంట ప్రధాన యాజకుని యింటి ఆవరణంలోకి వెళ్ళాడు. 16 కాని పేతురు బయట ద్వారం దగ్గర ఉండవలసి వచ్చింది. ప్రధాన యాజకునికి పరిచయమున్న ఆ యింకొక శిష్యుడు, బయటికి వచ్చి అక్కడవున్న కాపలా ఆమెతో మాట్లాడి పేతుర్ని లోపలికి పిలుచుకు వెళ్ళాడు. 17 “నీవు అతని శిష్యుల గుంపుకు చెందిన వాడవు కావా?” అని ద్వారం దగ్గరున్న కాపలాది పేతుర్ని అడిగింది.

“లేదు!” అని అతడు జవాబు చెప్పాడు.

18 చలిగా ఉంది కనుక రక్షక భటులు, సేవకులు, చలిమంట వేసి దాని చుట్టూ నిల్చున్నారు. పేతురు వెళ్ళి వారితో సహా చలికాచుకొనుచున్నాడు.

ప్రధానయాజకుడు యేసుని ప్రశ్నించటం

(మత్తయి 26:59-66; మార్కు 14:55-64; లూకా 22:66-71)

19 ప్రధానయాజకుడు యేసును ఆయన శిష్యుల్ని గురించి, ఆయన బోధిస్తున్న విషయాల్ని గురించి ప్రశ్నించాడు. 20 యేసు, “నేను సమాజమందిరాలలోను, యూదులు సమావేశమయ్యే దేవాలయంలోను బహిరంగంగా ఈ ప్రపంచానికి బోధించేవాణ్ణి. నేను రహస్యంగా ఏదీ బోధించలేదు. 21 అలాంటప్పుడు నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు. నేను చెప్పిన వాటిని గురించి, నా బోధనలను విన్న వాళ్ళను అడగండి. నేను చెప్పినవి వాళ్ళకు తెలుసు” అని అన్నాడు.

22 యేసు ఈ విధంగా మాట్లాడటం వలన ఆయన ప్రక్కన నిలుచున్న ఒక రక్షక భటుడు ఆయన చెంప మీద కొడుతూ, “ప్రధానయాజకునితో అలాగేనా మాట్లాడటం?” అని అన్నాడు.

23 యేసు, “నేను ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే చెప్పు. కాని నేను నిజం మాట్లాడాను. మరినన్నెందుకు కొట్టావు?” అని అడిగాడు.

24 ఆ తర్వాత అన్న ఆయనకు కట్టిన త్రాళ్ళు విప్పకుండా ప్రధాన యాజకుడు కయప దగ్గరకు పంపాడు.

పేతురు రెండవసారి, మూడవసారి తెలియదని అనటం

(మత్తయి 26:71-75; మార్కు 14:69-72; లూకా 22:58-62)

25 సీమోను పేతురు నిలుచొని యింకా చలికాగుతూ ఉన్నాడు. వాళ్ళు “నీవు అతని శిష్యుల్లో ఒకడివి కాదా?” అని అడిగారు.

“కాదు” అని పేతురు అన్నాడు.

26 ప్రధాన యాజకుని దగ్గర ఒకడు పని చేస్తూ ఉండేవాడు. వీని బంధువు చెవును పేతురు నరికివేసాడు. వాడు పేతురుతో, “నీవు అతనితో కలిసి తోటలో ఉండగా చూడలేదని అనుకొంటున్నావా?” అని అన్నాడు.

27 పేతురు మళ్ళీ, “లేదు” అన్నాడు. వెంటనే కోడి కూసింది.

పిలాతు సమక్షంలో యేసు

(మత్తయి 27:1-2, 11-31; మార్కు 15:1-20; లూకా 23:1-25)

28 ఆ తర్వాత యూదులు యేసును కయప నుండి రోము రాజ్యాధికారి భవానానికి తీసుకు వెళ్ళారు. తెల్లవారింది. పస్కా పండుగ భోజనం చెయ్యటానికి ముందు మైలపడ కూడదని వాళ్ళు రాజభవనంలోకి వెళ్ళలేదు. 29 పిలాతు వాళ్ళను కలవటానికి వెలుపలికి వచ్చి, “ఇతడేమి తప్పు చేసాడు?” అని అడిగాడు.

30 “అతడు నేరస్థుడు కానట్లైతే మీకు అప్పగించే వాళ్ళంకాదు!” అని అన్నారు.

31 పిలాతు, “అతణ్ణి మీరే తీసుకు వెళ్ళి మీ ధర్మ శాస్త్రాన్ననుసరించి విచారణ చేసుకోండి” అని అన్నాడు.

32 యూదులు, “మాకు మరణశిక్ష విధించే అధికారం లేదే!” అని సమాధానం చెప్పారు. యేసు, తాను ఎలాంటి మరణం పొందనున్నాడో యిది వరకే చెప్పాడు. అది నిజం కావాలని యిలా జరిగింది.

33 పిలాతు భవనంలోకి వెళ్ళి యేసును పిలిపించాడు. ఆయనతో, “నీవు యూదుల రాజువా?” అని అడిగాడు.

34 యేసు, “అది నీవు స్వయంగా వేసిన ప్రశ్నాలేక యితర్లు నా గురించి అలా చెప్పారా?” అని అడిగాడు.

35 పిలాతు, “నేను యూదుణ్ణి అని అనుకుంటున్నావా? నీ వాళ్ళు, మీ ప్రధాన యాజకుడు నిన్ను నాకు అప్పగించారు. నీవు ఏం చేసావు?” అని అడిగాడు.

36 యేసు, “నా రాజ్యం ఈ ప్రపంచానికి సంబంధించింది కాదు. అలాగైనట్లైతే నా అనుచరులు యూదుల చేత నేను బంధింపకుండా ఉండాలని వాళ్ళతో యుద్ధం చేసేవాళ్ళు. కాని నా రాజ్యం పరలోక సంబంధమైంది” అని అన్నాడు.

37 “అలాగైతే నీవు రాజువన్నమాట!” అని పిలాతు అన్నాడు.

యేసు జవాబు చెబుతూ, “నన్ను రాజని నీవనటం నిజమే. నేను సత్యాన్ని గురించి చెప్పటానికి జన్మించాను. ఆ కారణంగానే ఈ ప్రపంచంలోకి వచ్చాను. సత్యాన్ని ప్రేమించే వాళ్ళు నా మాట వింటారు.”

38 “సత్యం అంటే ఏమిటి?” అని పిలాతు అడిగాడు. ఇలా అన్నాక అతడు మళ్ళీ యూదుల దగ్గరకు వెళ్ళి, “అతణ్ణి శిక్షించటానికి నాకు ఏ కారణం కనిపించటం లేదు! 39 కాని మీ ఆచారం ప్రకారం ప్రతి పస్కాపండుగకు ఒక ఖైదీని విడుదల చెయ్యటం నా ధర్మం, ‘యూదుల రాజును’ విడుదల చేయమంటారా?” అని అడిగాడు.

40 వాళ్ళు బిగ్గరగా కేకలు వేస్తూ, “వద్దు, అతణ్ణి కాదు. బరబ్బను విడుదల చెయ్యండి!” అని అన్నారు. ఈ బరబ్బ ఒక బందిపోటు దొంగ.[a]

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International